Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 89

ఎజ్రాహివాడైన ఏతాను ధ్యానగీతం.

89 యెహోవా ప్రేమను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతాను.
    ఆయన నమ్మకత్వం గూర్చి శాశ్వతంగా, ఎప్పటికీ నేను పాడుతాను!
యెహోవా, నీ ప్రేమ శాశ్వతంగా నిలుస్తుందని నేను నిజంగా నమ్ముతాను.
    నీ నమ్మకత్వం ఆకాశాలవలె కొనసాగుతుంది!

దేవుడు చెప్పాడు, “నేను ఏర్పరచుకొన్న రాజుతో నేను ఒడంబడిక చేసుకొన్నాను.
    నా సేవకుడైన దావీదుకు నేను ఒక వాగ్దానం చేసాను.
‘దావీదూ, నీ వంశం శాశ్వతంగా కొనసాగేట్టు నేను చేస్తాను.
    నీ రాజ్యాన్ని శాశ్వతంగా ఎప్పటికీ నేను కొనసాగింపజేస్తాను.’”

యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి ఆకాశాలు స్తుతిస్తున్నాయి.
    పరిశుద్ధుల సమాజం నీ నమ్మకత్వం గూర్చి పాడుతుంది.
పరలోకంలో ఎవ్వరూ యెహోవాకు సమానులు కారు.
    “దేవుళ్లు” ఎవ్వరూ యెహోవాకు సాటికారు.
యెహోవా పరిశుద్ధ దూతలను కలిసినప్పుడు
    ఆ దేవ దూతలు భయపడి యెహోవాను గౌరవిస్తారు.
    వారు ఆయన పట్ల భయముతో నిలబడుతారు.
సర్వశక్తిమంతుడైన యెహోవా, దేవా, నీ అంతటి శక్తిగలవారు ఒక్కరూ లేరు.
    మేము నిన్ను పూర్తిగా నమ్మగలము.
ఉప్పొంగే మహా సముద్రపు అలలపై నీవు అధికారం చేస్తావు.
    దాని కోపపు అలలను నీవు నిమ్మళింప జేయగలవు.
10 దేవా, నీవు రహబును[a] ఓడించావు.
    నీ మహా శక్తితో, నీవు నీ శత్రువును ఓడించావు.
11 దేవా, ఆకాశంలోనూ, భూమి మీదనూ ఉన్న సర్వం నీదే.
    ప్రపంచాన్నీ, అందులో ఉన్న సర్వాన్నీ నీవు చేశావు.
12 ఉత్తర దక్షిణాలను నీవే సృష్టించావు.
    తాబోరు పర్వతం, హెర్మోను పర్వతం నీ నామాన్ని కీర్తిస్తాయి. స్తుతి పాడుతాయి.
13 దేవా, నీకు శక్తి ఉంది!
    నీ శక్తి గొప్పది!
    విజయం నీదే!
14 సత్యం, న్యాయం మీద నీ రాజ్యం కట్టబడింది.
    ప్రేమ, నమ్మకత్వం నీ సింహాసనం ఎదుట సేవకులు.
15 దేవా, నమ్మకమైన నీ అనుచరులు నిజంగా సంతోషంగా ఉన్నారు.
    వారు నీ దయ వెలుగులో జీవిస్తారు.
16 నీ నామం వారిని ఎల్లప్పుడూ సంతోష పరుస్తుంది.
    వారు నీ మంచితనాన్ని స్తుతిస్తారు.
17 నీవే వారి అద్భుత శక్తివి,
    వారి శక్తి నీ నుండే లభిస్తుంది.
18 యెహోవా, నీవే మమ్మల్ని కాపాడేవాడవు.
    ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు మా రాజు.
19 కనుక నిజమైన నీ అనుచరులతో దర్శనంలో నీవు మాట్లాడావు.
నీవు చెప్పావు: “ప్రజల్లోనుండి నేను ఒక యువకుని ఏర్పాటు చేసికొన్నాను.
    ఆ యువకుని నేను ప్రముఖుణ్ణి చేసాను. నేను యుద్ధ వీరునికి శక్తిని అనుగ్రహించాను.
20 నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను.
    నా ప్రత్యేక తైలంతో నేను అతన్ని అభిషేకించాను.
21 నా కుడిచేతితో నేను దావీదును బలపరచాను.
    మరి నా శక్తితో నేను అతన్ని బలముగల వానిగా చేశాను.
22 ఏర్పాటు చేసికోబడిన రాజును శత్రువు ఓడించలేకపోయాడు.
    దుర్మార్గులు అతన్ని ఓడించలేక పోయారు.
23 అతని శత్రువులను నేను అంతం చేసాను.
    ఏర్పరచబడిన రాజును ద్వేషించిన వారిని నేను ఓడించాను.
24 ఏర్పరచబడిన రాజును నేను ఎల్లప్పుడూ ప్రేమిస్తాను. బలపరుస్తాను.
    నేను ఎల్లప్పుడూ అతన్ని బలవంతునిగా చేస్తాను.
25 ఏర్పరచబడిన నా రాజును సముద్రం మీద నాయకునిగా ఉంచుతాను.
    నదులను అతడు అదుపులో ఉంచుతాడు.
26 ‘నీవు నా తండ్రివి నీవు నా దేవుడవు, నా బండవు, నా రక్షకుడవు’
    అని అతడు నాతో చెబుతాడు.
27 మరి నేను అతనిని నా ప్రథమ సంతానంగా చేసుకొంటాను.
    భూరాజులకంటె అతడు ఉన్నతంగా చేయబడుతాడు.
28 ఏర్పరచబడిన రాజును నా ప్రేమ శాశ్వతంగా కాపాడుతుంది.
    అతనితో నా ఒడంబడిక ఎప్పటికీ అంతంకాదు.
29 అతని వంశం శాశ్వతంగా కొనసాగుతుంది.
    ఆకాశాలు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.
30 అతని సంతతివారు నా ధర్మశాస్త్రాన్ని పాటించటం మానివేస్తే,
    నా ఆదేశాలను పాటించటం వారు మానివేస్తే అప్పుడు నేను వారిని శిక్షిస్తాను.
31 ఏర్పరచబడిన రాజు సంతతివారు నా ఆజ్ఞలను ఉల్లంఘించి,
    నా ఆదేశాలను పాటించకపోతే
32 అప్పుడు నేను వారిని కఠినంగా శిక్షిస్తాను.
33 కాని వారిపట్ల నా ప్రేమను మాత్రం నేను ఎన్నటికీ తీసివేయలేను.
    నేను ఎల్లప్పుడూ వారికి నమ్మకంగా ఉంటాను.
34 దావీదుతో నా ఒడంబడికను నేను ఉల్లంఘించను.
    మా ఒడంబడికను నేను మార్చను.
35 నా పరిశుద్ధత మూలంగా, దావీదుకు నేను ఓ ప్రత్యేక వాగ్దానం చేసాను.
    మరి నేను దావీదుకు అబద్ధం చెప్పను.
36 దావీదు వంశం శాశ్వతంగా కొనసాగుతుంది.
    సూర్యుడు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.
37     చంద్రునిలా అది శాశ్వతంగా కొనసాగుతుంది.
ఒడంబడిక సత్యమనేందుకు ఆకాశాలు సాక్ష్యం. ఆ సాక్ష్యం నమ్మదగినది.”

38 కాని దేవా, ఏర్పరచబడిన నీ రాజు[b] మీద నీకు కోపం వచ్చింది.
    నీవు అతన్ని ఒంటరివానిగా విడిచి పెట్టావు.
39 నీ ఒడంబడికను నీవు తిరస్కరించావు.
    రాజు కిరీటాన్ని నీవు దుమ్ములో పారవేసావు.
40 రాజు పట్టణపు గోడలను నీవు కూలగొట్టావు.
    అతని కోటలన్నింటినీ నీవు నాశనం చేశావు.
41 రాజు పొరుగువారు అతన్ని చూచి నవ్వుతారు.
    దారినపోయే మనుష్యులు అతని నుండి వస్తువులు దొంగిలిస్తారు.
42 రాజు శత్రువులందరికీ నీవు సంతోషం కలిగించావు.
    అతని శత్రువులను యుద్ధంలో నీవు గెలువనిచ్చావు.
43 దేవా, వారిని వారు కాపాడుకొనేందుకు నీవు వారికి సహాయం చేశావు.
    నీ రాజు యుద్ధంలో గెలిచేందుకు నీవు అతనికి సహాయం చేయలేదు.
44 అతని సింహాసనాన్ని నీవు నేలకు విసరివేశావు.
45 అతని ఆయుష్షు నీవు తగ్గించి వేశావు.
    నీవు అతన్ని అవమానించావు.

46 యెహోవా, నీవు శాశ్వతంగా మా నుండి మరుగైయుంటావా?
    నీ కోపం అగ్నిలా ఎప్పటికీ మండుతూ ఉంటుందా?
    ఎంత కాలం యిలా సాగుతుంది?
47 నా ఆయుష్షు ఎంత తక్కువో జ్ఞాపకం చేసికొనుము.
    అల్పకాలం జీవించి, తర్వాత మరణించేందుకు నీవు మమ్మల్ని సృష్టించావు.
48 ఏ మనిషీ జీవించి, ఎన్నటికీ చావకుండా ఉండలేడు.
    ఏ మనిషీ సమాధిని తప్పించుకోలేడు.

49 దేవా, గతంలో నీవు చూపించిన ప్రేమ ఎక్కడ?
    దావీదు కుటుంబానికి నీవు నమ్మకంగా ఉంటావని అతనికి నీవు వాగ్దానం చేశావు.
50-51 ప్రభూ, ప్రజలు నీ సేవకులను ఎలా అవమానించారో దయచేసి జ్ఞాపకం చేసుకొనుము.
యెహోవా, నీ శత్రువులనుండి ఆ అవమానాలన్నింటినీ నేను వినాల్సి వచ్చింది.
    ఏర్పరచబడిన నీ రాజును ఆ మనుష్యులు అవమానించారు.

52 యెహోవాను శాశ్వతంగా స్తుతించండి.
ఆమేన్, ఆమేన్![c]

యెషయా 63:1-6

యెహోవా తన జనాంగాన్ని శిక్షిస్తాడు

63 ఎదోమునుండి వస్తున్న ఇతడు ఎవరు?
ఎర్రటి వస్త్రాలు ధరించి బొస్రానుండి అతడు వస్తున్నాడు.
    అతడు తన వస్త్రాల్లో శోభిల్లుతున్నాడు.
అతడు మహా శక్తితో అతిశయంగా నడుస్తున్నాడు.
    “మిమ్మల్ని రక్షించే శక్తి నాకు ఉంది. నేను నిజాయితీగా మాట్లాడుచున్నాను”
    అని అతడు చెబుతున్నాడు.

“నీ వస్త్రాలు ఎందుకు అంత మరీ ఎర్రగా ఉన్నాయి?
    ద్రాక్షపండ్ల నుండి ద్రాక్షరసం చేసే వానిలా ఎర్రగా ఉన్నాయెందుకు నీ వస్త్రాలు?”

అతడు జవాబిస్తున్నాడు, “నా మట్టుకు నేను ద్రాక్షగానుగలో నడిచాను.
    నాకు ఎవ్వరూ సహాయం చేయలేదు.
నాకు కోపం వచ్చింది, ద్రాక్షపండ్ల మీద నడిచాను.
    ద్రాక్ష పండ్ల రసం నా బట్టలమీద చిమ్మింది. కనుక ఇప్పుడు నా బట్టలు మైలపడ్డాయి.
ప్రజలను శిక్షించుటకు నేను ఒక సమయం ఏర్పరచుకొన్నాను.
    నా ప్రజలను నేను రక్షించి, కాపాడవలసిన సమయం ఇప్పుడు వచ్చింది.
చుట్టూ కలియజూశాను, కానీ నాకు సహాయం చేసేవాడు ఒక్కడూ నాకు కనబడలేదు.
    నన్ను ఒక్కరూ బలపర్చకపోవటం నాకు ఆశ్చర్యం కలిగించింది.
కనుక నా ప్రజలను రక్షించుటకు నా స్వంత శక్తి నేను ప్రయోగించాను.
    నా కోపమే నాకు బలం ఇచ్చింది.
నేను కోపంగా ఉన్నప్పుడు, నేను ప్రజల మీద నడిచాను.
    నాకు వెర్రికోపం వచ్చినప్పుడు నేను వారిని శిక్షించాను. నేను వారి రక్తం నేలమీద ఒలకబోశాను.”

1 తిమోతికి 1:1-17

విశ్వాసంలో నా కుమారునితో సమానమైన తిమోతికి పౌలు వ్రాయడం ఏమనగా, నేను మన రక్షకుడైన దేవుని ఆజ్ఞానుసారమూ, మనకు రక్షణ లభిస్తున్న ఆశకు మూలకారకుడైన యేసు క్రీస్తు ఆజ్ఞానుసారమూ, యేసు క్రీస్తుకు అపొస్తలుడనయ్యాను.

తండ్రి అయినటువంటి దేవుడు, మన యేసు క్రీస్తు ప్రభువు, నీపై అనుగ్రహం చూపాలనీ, నిన్ను కరుణించాలనీ, నీకు శాంతి చేకూర్చాలనీ ఆశిస్తున్నాను.

దొంగ బోధకుల విషయంలో జాగ్రత్త

నేను మాసిదోనియకు వెళ్ళినప్పుడు నీకు చెప్పిన విధంగా నీవు ఎఫెసులో ఉండుము. అక్కడ కొందరు తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తున్నారు. వాళ్ళతో ఆ విధంగా చెయ్యవద్దని చెప్పు. అంతేకాక, వాళ్ళు కల్పితగాథలు చెప్పకూడదనీ, అంతు పొంతులేని వంశావళులతో సమయం వ్యర్థం చేయవద్దని కూడా ఆజ్ఞాపించు. ఇలాంటివి దైవకార్యానికి తోడ్పడడానికి బదులుగా చీలికలు కల్గిస్తాయి. దైవకార్యం విశ్వాసంతో కూడుకొన్నపని. ఇందులోని ఉద్దేశ్యం ఏమిటంటే, పవిత్ర హృదయం నుండీ, స్వచ్ఛమైన అంతరాత్మ నుండీ, నిజమైన విశ్వాసం నుండీ ఉద్భవించే ప్రేమను కలిగియుండటమే. కొందరు వ్యక్తులు నిజమైన ధ్యేయం మరిచిపోయి, వ్యర్థంగా తిరిగిపోయారు. తాము ధర్మశాస్త్ర పండితులు కావాలనుకొంటారు. కాని వాళ్ళకు వాళ్ళు చెప్పే మాటలే తెలియదు. నమ్మకంతో మాట్లాడుతున్న విషయాలను గురించి వాళ్ళకు తెలియదు.

ధర్మశాస్త్రాన్ని మానవుడు సక్రమంగా ఉపయోగిస్తే మంచిదని మనకు తెలుసు. మంచివాళ్ళ కోసం ధర్మశాస్త్రం వ్రాయబడలేదని మనకు తెలుసు. చట్ట విరుద్ధంగా ప్రవర్తించేవాళ్ళకోసం, తిరుగుబాటు చేసేవాళ్ళ కోసం, దేవుణ్ణి నమ్మనివాళ్ళకోసం, భక్తిహీనుల కోసం, పాపుల కోసం, అపవిత్రమైనవాళ్ళకోసం, తల్లిదండ్రులను గౌరవపరచనివాళ్ళకోసం, హంతకుల కోసం, 10 వ్యభిచారుల కోసం, కామంతో అసహజంగా ప్రవర్తించేవాళ్ళకోసం, బానిస వ్యాపారం చేసేవాళ్ళకోసం, అసత్యాలాడేవాళ్ళకోసం, దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళ కోసం, నిజమైన బోధనకు వ్యతిరేకంగా నడుచుకొనేవాళ్ళకోసం, అది వ్రాయబడింది. 11 నాకందించిన దివ్యమైన ఆ సువార్తలో ఈ ఉపదేశం ఉంది. దాన్ని తేజోవంతుడైన దేవుడు నాకందించాడు.

దేవుని దయకు నేను కృతజ్ఞుణ్ణి

12 నాకు శక్తినిచ్చి, నన్ను విశ్వాసపాత్రునిగా ఎంచి, ఈ సేవకోసం నన్ను నియమించిన మన యేసు క్రీస్తు ప్రభువుకు నా కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. 13 ఒకనాడు నేను దైవదూషణ చేసినవాణ్ణి, హింసించిన వాణ్ణి, క్రూరుణ్ణి. నేను అమాయకంగా నాలో విశ్వాసం లేకపోవడం వల్ల అలా ప్రవర్తించానని దేవుడు నన్ను కనికరించాడు. 14 మన ప్రభువు తన అనుగ్రహాన్ని నాపై ధారాళంగా కురిపించాడు. ఆ అనుగ్రహంతో పాటు యేసు క్రీస్తులో ఉన్న విశ్వాస గుణాన్ని, ప్రేమను కూడా నాకు ప్రసాదించాడు.

15 పాపులను రక్షించటానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇది విశ్వసింపదగిన విషయం. దీన్ని అందరూ అంగీకరించాలి. ఆ పాపుల్లో నేను ప్రథముణ్ణి. 16 నేను ప్రథముణ్ణి కనుకనే యేసు నాపై దయ చూపాడు. ఈ విధంగా తనను విశ్వసించబోయేవాళ్ళకు, తనవల్ల విముక్తి పొందబోయేవాళ్ళకు అనంతమైన తన సహనము ఆదర్శంగా ఉండాలని అంతులేని సహనాన్ని ప్రదర్శించాడు. 17 చిరకాలం రాజుగా ఉండే దేవునికి, కంటికి కనిపించని, చిరంజీవి అయినటువంటి ఆ ఒకే ఒక దేవునికి గౌరవము, మహిమ చిరకాలం కలుగుగాక! ఆమేన్.

మార్కు 11:1-11

యేసు యెరూషలేము ప్రవేశించటం

(మత్తయి 21:1-11; లూకా 19:28-40; యోహాను 12:12-19)

11 వాళ్ళు యెరూషలేము పట్టణాన్ని సమీపించారు. ఒలీవలకొండ దగ్గరున్న బేత్పగే మరియు బేతనియ గ్రామాలకు రాగానే యేసు తన శిష్యుల్లో యిద్దరిని పంపుతూ, వాళ్ళతో, “ముందున్న గ్రామానికి వెళ్ళండి. మీరాగ్రామంలోకి వెళ్ళిన వెంటనే అక్కడ వయస్సులో ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. అది ఒక వాకిలి ముందు కట్టబడి ఉంటుంది. దాని మీద ఇది వరకెవ్వరూ స్వారి చెయ్యలేదు. దాన్ని విప్పి యిక్కడకు తీసుకొని రండి. అలా ఎందుకు చేస్తున్నారని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, ‘ప్రభువుకు కావాలి, త్వరలోనే తిరిగి పంపుతాము’[a] అని సమాధానం చెప్పండి” అని అన్నాడు.

శిష్యులు వెళ్ళి, ఇంటి ముందు వీధిలో ఒక గాడిద ఉండటం చూసారు. వాళ్ళు దాన్ని విప్పుతుండగా అక్కడ నిలుచున్న కొందరు మనుష్యులు, “గాడిదను ఎందుకు విప్పుతున్నారు?” అని అడిగారు. వాళ్ళు యేసు చెప్పమన్న సమాధానం చెప్పారు. ఆ మనుష్యులు వాళ్ళను పోనిచ్చారు.

వాళ్ళా గాడిదను యేసు దగ్గరకు తీసుకొని వచ్చి, తమ వస్త్రాల్ని దాని మీద పరిచారు. యేసు దానిపై కూర్చున్నాడు. చాలా మంది ప్రజలు తమ వస్త్రాలను దారిమీద పరిచారు. మరికొందరు తోటలనుండి తెచ్చిన చెట్ల రెమ్మల్ని దారి మీద పరిచారు. ముందు నడుస్తున్న వాళ్ళు, వెనుక నడుస్తున్న వాళ్ళు,

“‘హోసన్నా,[b]
    ప్రభువు పేరిట వచ్చుచున్న వాడు ధన్యుడు.’(A)

10 “రానున్న మన తండ్రి
    దావీదు రాజ్యం ధన్యమైనది.
మహోన్నతుడైన వానికి హోసన్నా!”

అని బిగ్గరగా కేకలు వేసారు.

11 యేసు యెరూషలేం పట్టణం ప్రవేశించి అక్కడున్న ఆలయానికి[c] వెళ్ళాడు. చుట్టూ ఉన్న వాటిని చూసాడు. అప్పటికే ప్రొద్దు పోయి ఉండటం వల్ల పన్నెండుగురితో కలిసి బేతనియకు వెళ్ళాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International