Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 105

105 యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుము. ఆయన నామాన్ని ఆరాధించుము.
    ఆయన చేసే అద్భుత కార్యాలను గూర్చి జనాలతో చెప్పు.
యెహోవాను గూర్చి పాడుము. ఆయనకు స్తుతులు పాడుము.
    ఆయన చేసే అద్భుతకార్యాలు అన్నింటిని గూర్చి చెప్పు.
యెహోవా పవిత్ర నామాన్ని గూర్చి అతిశయించు.
    యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరంతా సంతోషించండి.
బలంకోసం యెహోవా దగ్గరకు వెళ్లండి.
    సహాయంకోసం ఎల్లప్పుడూ ఆయన దగ్గరకు వెళ్లండి.
యెహోవా చేసే ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి.
    ఆయన అద్భుతాలను, జ్ఞానంగల నిర్ణయాలను జ్ఞాపకం చేసుకోండి.
దేవుని సేవకుడైన అబ్రాహాము సంతతివారు మీరు.
    దేవుడు ఏర్పరచుకొన్న యాకోబు సంతతివారు మీరు.
యెహోవా మన దేవుడు.
    యెహోవా సర్వలోకాన్ని పాలిస్తాడు.[a]
దేవుని ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం చేసికోండి.
    వెయ్యి తరాలవరకు ఆయన ఆదేశాలను జ్ఞాపకం ఉంచుకోండి.
దేవుడు అబ్రాహాముతో ఒక ఒడంబడిక చేసాడు.
    ఇస్సాకుకు దేవుడు వాగ్దానం చేశాడు.
10 యాకోబుకు (ఇశ్రాయేలు) దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు.
    ఇశ్రాయేలుతో దేవుడు తన శాశ్వత ఒడంబడిక చేసాడు.
11 “నేను నీకు కనాను దేశాన్ని ఇస్తాను, ఆ దేశం నీకు చెందుతుంది.”
    అని దేవుడు చెప్పాడు.
12 అబ్రాహాము కుటుంబం చిన్నదిగా ఉన్నప్పుడు దేవుడు ఆ వాగ్దానం చేశాడు.
    మరియు వారు కనానులో నివసిస్తున్న యాత్రికులు మాత్రమే.
13 దేశం నుండి దేశానికి, రాజ్యం నుండి రాజ్యానికి
    వారు ప్రయాణం చేసారు.
14 కాని యితర మనుష్యులు ఆ కుటుంబాన్ని బాధించనియ్యకుండా దేవుడు చేసాడు.
    వారిని బాధించవద్దని దేవుడు రాజులను హెచ్చరించాడు.
15 “నేను ఏర్పాటు చేసుకొన్న నా ప్రజలను బాధించవద్దు.
    నా ప్రవక్తలకు ఎలాంటి కీడూ చేయవద్దు.” అని దేవుడు చెప్పాడు.
16 దేవుడు ఆ దేశంలో ఒక కరువు వచ్చేటట్టు చేశాడు.
    ప్రజలకు తినుటకు సరిపడినంత ఆహారం లేదు.
17 అయితే దేవుడు వారికి ముందుగా వెళ్లుటకు యోసేపు అనే మనిషిని పంపించాడు.
    యోసేపు ఒక బానిసవలె అమ్మబడ్డాడు.
18 యోసేపు కాళ్లను తాళ్లతో వారు కట్టివేశారు.
    అతని మెడకు వారు ఒక ఇనుప కంటె వేశారు.
19 యోసేపు చెప్పిన సంగతులు నిజంగా జరిగేంతవరకు
    అతడు (యోసేపు) బానిసగా చెప్పింది సరియైనది అని యెహోవా సందేశం రుజువు చేసింది.
20 కనుక యోసేపును విడుదల చేయమని ఈజిప్టు రాజు ఆదేశించాడు.
    అనేక మందికి అధికారిగా ఉన్న అతనిని కారాగారం నుండి వెళ్లనిచ్చాడు.
21 అతడు యోసేపును తన ఇంటికి యజమానిగా నియమించాడు.
    రాజ్యంలో అన్ని విషయాలను గూర్చి యోసేపు జాగ్రత్త తీసుకొన్నాడు.
22 యోసేపు యితర నాయకులకు హెచ్చరిక ఇచ్చాడు.
    పెద్ద మనుష్యులకు యోసేపు నేర్పించాడు.
23 తరువాత ఇశ్రాయేలు ఈజిప్టుకు వచ్చాడు.
    యాకోబు హాము దేశంలో[b] నివసించాడు.
24 యాకోబు కుటుంబం చాలా పెద్దది అయింది.
    వారు వారి శత్రువులకంటే శక్తిగలవారయ్యారు.
25 కనుక ఈజిప్టు ప్రజలు యాకోబు వంశాన్ని ద్వేషించటం మొదలు పెట్టారు.
    ఈజిప్టువారు బానిసలకు విరోధంగా పథకాలు వేయటం ప్రారంభించారు.
26 కనుక దేవుడు తన సేవకుడైన మోషేను,
    తాను ఏర్పాటు చేసుకొన్న యాజకుడు అహరోనును పంపించాడు.
27 హాము దేశంలో అనేక అద్భుతాలు చేయటానికి
    దేవుడు మోషే, అహరోనులను వాడుకొన్నాడు.
28 దేవుడు కటిక చీకటిని పంపించాడు.
    కాని ఈజిప్టు వాళ్లు ఆయన మాట వినలేదు.
29 కనుక దేవుడు నీళ్లను రక్తంగా మార్చాడు.
    వాళ్ల చేపలన్నీ చచ్చాయి.
30 ఆ దేశం కప్పలతో నింపివేయబడింది.
    రాజు గదులలోకి కూడ కప్పలు వచ్చాయి.
31 దేవుడు ఆజ్ఞ ఇవ్వగా జోరీగలు,
    దోమలు వచ్చాయి.
    అన్నిచోట్లా అవే ఉన్నాయి.
32 దేవుడు వర్షాన్ని వడగండ్లుగా చేశాడు.
    ఈజిప్టువారి దేశంలో అన్ని చోట్లా అగ్ని మెరుపులు కలిగాయి.
33 ఈజిప్టువారి ద్రాక్షా తోటలను, అంజూరపు చెట్లను దేవుడు నాశనం చేశాడు.
    వారి దేశంలో ప్రతి చెట్టునూ దేవుడు నాశనం చేసాడు.
34 దేవుడు ఆజ్ఞ ఇవ్వగా మిడుతలు వచ్చాయి.
    అవి లెక్కింపజాలనంత విస్తారంగా ఉన్నాయి.
35 మిడుతలు దేశంలోని మొక్కలన్నింటినీ తినివేశాయి.
    నేల మీద పంటలన్నింటినీ అవి తినివేశాయి.
36 అప్పుడు ఈజిప్టు దేశంలో ప్రతి మొదటి సంతానాన్ని దేవుడు చంపేశాడు.
    వారి జ్యేష్ఠ కుమారులను దేవుడు చంపివేశాడు.
37 అప్పుడు దేవుడు ఈజిప్టు నుండి తన ప్రజలను బయటకు తీసుకొని వచ్చాడు.
    వారు వెండి బంగారాలు వారి వెంట తెచ్చారు.
    దేవుని ప్రజలు ఎవ్వరూ తొట్రిల్లి పడిపోలేదు.
38 దేవుని ప్రజలు వెళ్లిపోవటం చూచి ఈజిప్టు సంతోషించింది.
    ఎందుకంటే దేవుని ప్రజలను గూర్చి వారు భయపడ్డారు.
39 దేవుడు తన మేఘాన్ని ఒక దుప్పటిలా పరిచాడు.
    రాత్రివేళ తన ప్రజలకు వెలుగు ఇచ్చుటకు దేవుడు తన అగ్నిస్తంభాన్ని ఉపయోగించాడు.
40 ప్రజలు మాంసం కోసం ఆడిగినప్పుడు దేవుడు వారికి పూరేళ్లను రప్పించాడు.
    దేవుడు వారికి ఆకాశం నుండి సమృద్ధిగా ఆహారాన్ని యిచ్చాడు.
41 దేవుడు బండను చీల్చగా నీళ్లు ఉబుకుతూ వచ్చాయి.
    ఎడారిలో ఒక నది ప్రవహించడం మొదలైంది.

42 దేవుడు తన పవిత్ర వాగ్దానం జ్ఞాపకం చేసికొన్నాడు.
    దేవుడు తన సేవకుడు ఆబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసికొన్నాడు.
43 దేవుడు తన ప్రజలను ఈజిప్టునుండి బయటకు రప్పించాడు.
    ప్రజలు వారి సంతోష గీతాలు పాడుతూ ఆనందంగా బయటకు వచ్చారు.
44 అప్పుడు యితరులు నివసిస్తున్న దేశాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు.
    ఇతరుల కష్టార్జితాన్ని దేవుని ప్రజలు పొందారు.
45 దేవుడు తన ప్రజలు తన న్యాయ చట్టాలకు విధేయులవుతారని ఇలా చేసాడు.
    వారు ఆయన ఉపదేశములకు జాగ్రత్తగా విధేయులు కావాలని దేవుడు ఇలా చేసాడు.

యెహోవాను స్తుతించండి.

యెషయా 65:1-12

ప్రజలందరూ దేవుని గూర్చి నేర్చుకొంటారు

65 యెహోవా చెబుతున్నాడు: “సలహాకోసం నా వద్దకు రాని ప్రజలకు నేను సహాయం చేశాను. నన్ను కనుగొన్నవారు నాకోసం వెదకిన వారు కారు. నా పేరు పెట్టబడని ఒక ప్రజతో నేను మాట్లాడాను. ‘నేనిక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను’ అని నేను చెప్పాను.

“నాకు విరోధంగా తిరిగిపోయిన వారిని చేర్చుకొనేందుకు నేను సిద్ధంగా నిలబడ్డాను. ఆ ప్రజలు నా దగ్గరకు వస్తారని నేను కనిపెట్టాను. కానీ వారు చెడుమార్గంలోనే జీవించటం కొనసాగించారు. వారి హృదయాలు కోరినవన్నీ వారు చేశారు. ఆ మనుష్యులు నాకు ఎల్లప్పుడూ కోపం పుట్టిస్తూ, నా యెదుట ఉన్నారు. ఆ ప్రజలు వారి ఉద్యానవనాల్లో బలులు అర్పిస్తారు. ధూపం వేస్తారు. ఆ మనుష్యులు సమాధుల్లో కూర్చొంటారు. చనిపోయిన వారి దగ్గర్నుండి సందేశాలకోసం వారు కనిపెడ్తారు. వారు శవాలమధ్య కూడా నివసిస్తారు. వారు పంది మాంసం తింటారు. వారి కత్తులు, గరిటెలు కుళ్లిపోయిన మాంసంతో మైలపడ్డాయి. కానీ ఆ ప్రజలే, ‘దగ్గరకు రాకు, నేను నిన్ను శుద్ధి చేసేంతవరకు నన్ను ముట్టకు’ అని ఇతరులతో చెబుతారు. ఆ ప్రజలు నా కంటికి పొగలా ఉన్నారు. మరియు వారి అగ్ని ఎంతసేపూ మండుతూనే ఉంటుంది.”

ఇశ్రాయేలు శిక్షింపబడాలి

“చూడు, నీవు చెల్లించాల్సిన లెక్క చీటి ఒకటి ఇక్కడ ఉంది. నీ పాపాల మూలంగా నీవు దోషివి అని ఈ లెక్క చీటి చూపిస్తుంది. ఈ లెక్క చీటి చెల్లించే వరకు నేను ఊరుకోను, నేను మిమ్మల్ని శిక్షించటం ద్వారా లెక్క చీటి చెల్లిస్తాను. మీ పాపాలు, మీ తండ్రుల పాపాలు అన్నీ ఒకటే. యెహోవా ఇలా చెప్పాడు, ‘మీ తండ్రులు పర్వతాల్లో ధూపం వేసినప్పుడు ఈ పాపాలు చేశారు. ఆ కొండల మీద వారు నన్ను అవమానించారు. మరియు నేను మొదట వాళ్లను శిక్షించాను. వారు పొందాల్సిన శిక్ష నేను వారికి ఇచ్చాను.’”

యెహోవా చెబుతున్నాడు: “ద్రాక్షపండ్లలో క్రొత్తరసం ఉన్నప్పుడు, ప్రజలు ఆ ద్రాక్షరసాన్ని పిండుతారు. కాని ద్రాక్ష పండ్లను మాత్రం వారు పూర్తిగా నాశనం చేయరు. ఆ ద్రాక్షపండ్లు ఇంకా ఉపయోగపడ్తాయి. కనుక వారు యిలా చేస్తారు. నా సేవకులకు కూడ నేను అలాగే చేస్తాను. నేను వారిని పూర్తిగా నాశనం చేయను. యాకోబు (ఇశ్రాయేలు) ప్రజలు కొందరిని నేను ఉంచుతాను. యూదా ప్రజలు కొందరికి నా పర్వతం లభిస్తుంది. నా సేవకులు అక్కడ నివసిస్తారు. అక్కడ నివసించాల్సిన మనుష్యులను నేను ఏర్పరచుకొంటాను. 10 అప్పుడు షారోను లోయ[a] గొర్రెలకు పొలం అవుతుంది. ఆకోరు లోయ[b] పశువులు విశ్రాంతి తీసుకొనే చోటు అవుతుంది. ఈ సంగతులన్నీ నా ప్రజలకోసం, నాకోసం వెదకే ప్రజలకోసమే.

11 “అయితే యెహోవాను విడిచిపెట్టిన ప్రజలారా, మీరు శిక్షించబడతారు. నా పవిత్ర పర్వతం[c] గూర్చి మరచిపోయిన ప్రజలు మీరు. మీరు అదృష్టాన్ని ఆరాధించే ప్రజలు. మీరు కర్మ అనే తప్పుడు దేవతమీద ఆధారపడే మనుష్యులు. 12 కానీ మీ భవిష్యత్తును నేను నిర్ణయిస్తాను. మరియు నా ఖడ్గం ప్రయోగించి నేను మిమ్మల్ని శిక్షిస్తాను. మిమ్మల్ని శిక్షించే ఆయన ఎదుట మీరంతా దీనులుగా ఉంటారు. నేను మిమ్మల్ని పిలిచాను, మీరు నాకు జవాబు ఇవ్వటానికి నిరాకరించారు. నేను మీతో మాట్లాడాను కానీ మీరు వినిపించుకోలేదు. కీడు అని నేను చెప్పిన వాటినే మీరు చేశారు. నాకు ఇష్టం లేని వాటినే చేయాలని మీరు తీర్మానించుకొన్నారు.”

1 తిమోతికి 4

దొంగ బోధకులు

చివరిదినాల్లో కొందరు విశ్వాసాన్ని వదిలి మోసగించే దయ్యాల బోధనల్ని అనుసరిస్తారని పరిశుద్ధాత్మ స్పష్టంగా చెపుతున్నాడు. దొంగ మాటలు చెప్పేవాళ్ళు దొంగ ఉపదేశాలు చేస్తారు. వాళ్ళ అంతరాత్మలు మొద్దుబారాయి. అలాంటివాళ్ళు వివాహం చేసుకోవటం తప్పని, కొన్ని రకాల ఆహారాలు తినకూడదని బోధిస్తారు. కాని దేవుడు ఆ ఆహారాలు తినటానికే సృష్టించాడు. విశ్వాసులు, సత్యాన్ని తెలుసుకొన్నవాళ్ళు దేవునికి కృతజ్ఞతలర్పించి ఆ ఆహారాల్ని భుజించాలి. దేవుడు తినటానికి సృష్టించినవన్నీ మంచివే కనుక మనం దేన్నీ నిరాకరించకూడదు. అన్నిటినీ దేవునికి కృతజ్ఞతలర్పించి భుజించాలి. అవి దేవుని వాక్యం వల్లను, ప్రార్థన ద్వారాను పవిత్రం చేయబడినాయి.

మంచి సేవకునిగా ఉండుము

నీవీ బోధలు సోదరులకు చెబితే యేసు క్రీస్తు యొక్క మంచి సేవకునిగా పరిగణింపబడతావు. నీవు విశ్వసించిన సత్యాలను, సుబోధలను నీవు అనుసరిస్తున్నావు కనుక నీకు అభివృద్ధి కల్గుతుంది. ఆత్మీయత లేని కాకమ్మ కథలకు, ముసలమ్మ కథలకు దూరంగా ఉండు. భక్తితో ఉండటానికి అభ్యాసం చెయ్యి. శారీరక శిక్షణ వల్ల కొంత ఉపయోగం ఉంది. దైవభక్తివల్ల ప్రస్తుత జీవితంలోనూ, రానున్న జీవితంలోనూ మంచి కల్గుతుంది. కనుక అది అన్ని విషయాల్లో ఉపయోగపడుతుంది. ఇది నమ్మదగిన విషయం. సంపూర్ణంగా అంగీకరించదగినది. 10 మానవ జాతి రక్షకుడైన దేవుణ్ణి, ముఖ్యంగా తనను నమ్మినవాళ్ళను రక్షించే సజీవుడైన దేవుణ్ణి మనం విశ్వసించాము. కనుకనే మనము సహనంతో కష్టించి పని చేస్తున్నాము.

11 ఈ విషయాలు మిగతావాళ్ళకు బోధించి, వాటిని ఆచరించుని ఆజ్ఞాపించు. 12 నీవు వయస్సులో చిన్నవాడైనందుకు నిన్నెవ్వడూ చులకన చెయ్యకుండా జాగ్రత్త పడు. క్రీస్తును విశ్వసించేవాళ్ళకు మాటల్లో, జీవిత విధానంలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో ఆదర్శంగా ఉండు.

13 నేను వచ్చేవరకు నీ కాలాన్ని దైవవాక్యాలు బహిరంగంగా చదవటానికి, వాటిని ఉపదేశించటానికి ఉపయోగించు. ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందింప చేయి. 14 పెద్దలు తమ చేతుల్ని నీపై ఉంచినప్పుడు ప్రవక్తలు చెప్పిన భవిష్యత్తు ప్రకారం నీకు వరం లభించింది. దాన్ని నిర్లక్ష్యం చెయ్యవద్దు. 15 నేను చెప్పిన విషయాలపై నీ మనస్సు లగ్నం చేయి. అప్పుడు అందరూ నీ అభివృద్ధిని గమనిస్తారు. 16 నీ వ్యక్తిగత జీవితాన్నీ, నీవు బోధించే వాటినీ జాగ్రత్తగా గమనించు. వాటిని పట్టుదలతో సాధించు. అలా చేస్తే నిన్ను నీవు రక్షించుకొన్నవాడవౌతావు. నీ బోధన విన్నవాళ్ళను రక్షించినవాడవౌతావు.

మార్కు 12:13-27

యూదా నాయకులు యేసును మోసగించుటకు ప్రయత్నించటం

(మత్తయి 22:15-22; లూకా 20:20-26)

13 ఆ తర్వాత యేసును ఆయన మాటల్లో పట్టేయాలని కొంతమంది పరిసయ్యుల్ని[a] హేరోదు రాజు పక్షముననున్న వాళ్ళను ఆయన దగ్గరకు పంపారు. 14 వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి, “అయ్యా! మీరు సత్యవంతులని మాకు తెలుసు. మీరు మానవుల మాటలకు లొంగిపోరు. వాళ్ళెవరనే విషయం మీకు అవసరం లేదు. సత్యమార్గాన్ని మీరు ఉన్నది ఉన్నట్లు బోధిస్తారు. మరి చక్రవర్తికి పన్నులు కట్టటం న్యాయమా? కాదా? మేము పన్నులు కట్టాలా మానాలా?” అని అడిగారు.

15 యేసుకు వాళ్ళ కుట్ర తెలిసి పోయింది. “నన్నెందుకు మోసం చేయాలని అనుకుంటున్నారు? ఒక దేనారా[b] యివ్వండి. నన్ను దాన్ని చూడనివ్వండి” అని అన్నాడు. 16 వాళ్ళు ఒక నాణాన్ని తీసుకు వచ్చారు. యేసు, “దీని మీద ఎవరి బొమ్మ ఉంది? ఎవరి శాసనం ఉంది?” అని అడిగాడు. “చక్రవర్తిది” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

17 అప్పుడు యేసు వారితో, “చక్రవర్తికి చెందింది చక్రవర్తికి యివ్వండి, దేవునికి చెందింది దేవునికి యివ్వండి” అని అన్నాడు. ఆయన సమాధానం విని వాళ్ళు ఆశ్చర్యపొయ్యారు.

కొందరు సద్దూకయ్యులు యేసును మోసగించుటకు ప్రయత్నించటం

(మత్తయి 22:23-33; లూకా 20:27-40)

18 చనిపోయిన వాళ్ళు మళ్ళీ బ్రతకరని వాదించే సద్దూకయ్యులు ఆయన దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న వేసారు. 19 “అయ్యా, ఒకని సోదరుడు చనిపోతే, ఆ చనిపోయిన సోదరునికి సంతానం లేకపోయినట్టయితే, ఆ చనిపోయిన సోదరుని భార్యను బ్రతికివున్న సోదరుడు వివాహమాడి, చనిపోయిన సోదరునికి సంతానం కలిగేటట్లు చెయ్యాలని మోషే మనకోసం ధర్మశాస్త్రంలో వ్రాసాడు. 20 ఒకప్పుడు ఏడుగురు సోదరులుండే వాళ్ళు. మొదటివాడు వివాహం చేసుకొని సంతానం లేకుండా చనిపొయ్యాడు. 21 రెండవ వాడు అతని వితంతువును వివాహమాడాడు. కాని అతడు కూడా సంతానం లేకుండా చనిపొయ్యాడు. మూడవ వానికి కూడా అదే సంభవించింది. 22 ఆ ఏడుగురిలో ఎవ్వరికి సంతానం కలగలేదు. చివరకు ఆ స్త్రీకూడా చనిపోయింది. 23 చనిపోయిన వాళ్ళు బ్రతికి వచ్చినప్పుడు ఆమె ఎవరి భార్యగా పరిగణింపబడుతుంది? ఆమెను ఆ ఏడగురు పెండ్లి చేసుకొన్నారు కదా?” అని అడిగారు.

24 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీకు లేఖనాలు, దేవుని శక్తి తెలియవు. కనుక పొరబడుతున్నారు. 25 చనిపోయిన వాళ్ళు బ్రతికివచ్చాక వివాహం చేసుకోరు. వాళ్ళు ఆడ, మగ అని ఉండరు. వాళ్ళు పరలోకంలో ఉన్న దేవదూతల్లా ఉంటారు. 26 ఇక చనిపోయిన వాళ్ళు బ్రతకటం విషయంలో మోషే తాను వ్రాసిన గ్రంథంలో ‘పొదను’ గురించి వ్రాసినప్పుడు, దేవుడు అతనితో ‘నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాక్కు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి’(A) అని అతనితో చెప్పాడు. 27 ‘నేను వాళ్ళ దేవుణ్ణి’ అని ఆయన అన్నప్పుడు, వాళ్ళు నిజంగా చనిపోలేదన్న మాట. అంటే ఆయన బ్రతికివున్న వాళ్ళకు మాత్రమే దేవుడు. మీరు చాలా పొరబడుతున్నారు.”[c]

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International