Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:1-24

ఆలెఫ్[a]

119 పవిత్ర జీవితాలు జీవించేవాళ్లు సంతోషంగా ఉంటారు.
    ఆ మనుష్యులు యెహోవా ఉపదేశాలను అనుసరిస్తారు.
యెహోవా ఒడంబడికకు విధేయులయ్యే ప్రజలు సంతోషిస్తారు.
    వారు వారి హృదయపూర్తిగా యెహోవాకు విధేయులవుతారు.
ఆ మనుష్యులు చెడ్డ పనులు చెయ్యరు.
    వారు యెహోవాకు విధేయులవుతారు.
యెహోవా, నీవు మాకు నీ ఆజ్ఞలిచ్చావు.
    ఆ ఆజ్ఞలకు మేము పూర్తిగా విధేయులము కావాలని నీవు మాతో చెప్పావు.
యెహోవా, నేను నీ ఆజ్ఞలకు
    ఎల్లప్పుడూ విధేయుడనౌతాను,
అప్పుడు నేను నీ ఆజ్ఞలను
    ఎప్పుడు చదివినా సిగ్గుపడను.
అప్పుడు నేను నీ న్యాయం, నీ మంచితనం గూర్చి చదివి
    నిన్ను నిజంగా ఘనపర్చగలుగుతాను.
యెహోవా, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
    కనుక దయచేసి నన్ను విడిచిపెట్టకుము!

బేత్

యువకుడు పవిత్ర జీవితం ఎలా జీవించగలడు?
    నీ ఆజ్ఞలను అనుసరించుట ద్వారానే.
10 నేను నా హృదయపూర్తిగా దేవుని సేవించుటకు ప్రయత్నిస్తాను.
    దేవా, నీ ఆజ్ఞలకు విధేయుడనవుటకు నాకు సహాయం చేయుము.
11 నీ ఉపదేశాలను నేను చాలా జాగ్రత్తగా ధ్యానం చేసి నా హృదయంలో భద్రపరచుకొంటాను.
    ఎందుకంటే, నేను నీకు విరోధంగా పాపం చేయను
12 యెహోవా, నీకే స్తుతి.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
13 జ్ఞానంగల నీ నిర్ణయాలను గూర్చి నేను మాట్లాడుతాను.
14 ఒకడు గొప్ప ఐశ్వర్యంలో ఆనందించేలా
    నేను నీ ఆజ్ఞలు అనుసరించటంలో ఆనందిస్తాను.
15 నీ నియమాలను నేను చర్చిస్తాను.
    నీ జీవిత విధానం నేను అనుసరిస్తాను.
16 నీ న్యాయ చట్టాలలో నేను ఆనందిస్తాను.
    నీ మాటలు నేను మరచిపోను.

గీమెల్

17 నీ సేవకుడనైన నాకు మేలుగా నుండుము.
    తద్వారా నేను జీవించగలను. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను అవుతాను.
18 యెహోవా, నా కళ్లు తెరువుము, అప్పుడు నేను నీ ఉపదేశములను అనుసరించి
    నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను గూర్చి చదువుతాను.
19 ఈ దేశంలో నేను పరాయివాణ్ణి.
    యెహోవా, నీ ఉపదేశాలు నాకు దాచిపెట్టకుము.
20 నేను ఎంతసేపూ నీ నిర్ణయాలను గూర్చి
    చదవాలని కోరుతున్నాను.
21 యెహోవా, గర్వించే ప్రజలను నీవు గద్దిస్తావు.
    ఆ గర్విష్ఠులకు కీడులే సంభవిస్తాయి.
    నీ అజ్ఞలకు విధేయులవుటకు వారు నిరాకరిస్తారు.
22 నన్ను సిగ్గుపడనియ్యకు, ఇబ్బంది పడనియ్యకు.
    నేను నీ ఒడంబడికకు విధేయుడనయ్యాను.
23 నాయకులు కూడ నన్ను గూర్చి చెడు విషయాలు చెప్పారు.
    అయితే యెహోవా, నేను నీ సేవకుడను; మరియు నేను నీ న్యాయ చట్టాలు చదువుతాను.
24 నీ ధర్మశాస్త్రమే నాకు శ్రేష్ఠమైన స్నేహితుడు.
    అది నాకు మంచి సలహా ఇస్తుంది.

కీర్తనలు. 12-14

సంగీత నాయకునికి: షెమినిత్ రాగం. దావీదు కీర్తన.

12 యెహోవా, నన్ను రక్షించుము!
    మంచి మనుష్యులంతా పోయారు.
    భూమి మీద ఉన్న మనుష్యులందరిలో సత్యవంతులైన విశ్వాసులు ఎవ్వరూ మిగల్లేదు.
మనుష్యులు వారి పొరుగువారితో అబద్ధాలు చెబుతారు.
    ప్రతి ఒక్క వ్యక్తీ, తన పొరుగువారికి అబద్ధాలు చెప్పి, ఉబ్బిస్తాడు.
అబద్ధాలు చెప్పేవారి పెదవులను యెహోవా కోసివేయాలి.
    పెద్ద గొప్పలు పలికే వారి నాలుకలను యెహోవా కోసివేయాలి.
“మన అబద్ధాలే మనలను ప్రముఖులుగా అయ్యేందుకు తోడ్పడతాయి.
మన నాలుకలు ఉండగా, మన మీద ఎవ్వరూ పెద్దగా ఉండరు.”
    అని ఆ ప్రజలు చెప్పుకొంటారు.

కాని యెహోవా చెబుతున్నాడు,
    “దుర్మార్గులు పేదల దగ్గర వస్తువులు దొంగిలించారు.
ఆ నిస్సహాయ ప్రజలు వారి దుఃఖం వ్యక్తం చేయటానికి గట్టిగా నిట్టూర్చారు.
    కాని ఇప్పుడు నేను నిలిచి, దాన్ని కోరేవారికి క్షేమము నిచ్చెదను.”

యెహోవా మాటలు సత్యం, నిర్మలం.
    నిప్పుల కుంపటిలో కరగించిన స్వచ్ఛమైన వెండిలా పవిత్రంగా ఆ మాటలు ఉంటాయి.
    కరిగించబడి ఏడుసార్లు పోయబడిన వెండిలా నిర్మలముగా ఆ మాటలు ఉంటాయి.

యెహోవా, నిస్సహాయ ప్రజల విషయమై జాగ్రత్త తీసుకొంటావు.
    ఇప్పుడు, శాశ్వతంగా నీవు వారిని కాపాడుతావు.
మనుష్యుల మధ్యలో దుష్టత్వము, చెడుతనము పెరిగినప్పుడు
    ఆ దుర్మార్గులు వారేదో ప్రముఖులైనట్టు తిరుగుతుంటారు.

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

13 యెహోవా, ఎన్నాళ్లు నన్ను మరచిపోతావు?
    నీవు నన్ను శాశ్వతంగా మరచిపోతావా?
నీవు నన్ను స్వీకరించకుండా ఎన్నాళ్లు నిరాకరిస్తావు?
నీవు ఒకవేళ నన్ను మరచిపోయావేమోనని ఇంకెన్నాళ్లు నేను తలంచాలి?
    ఇంకెన్నాళ్లు నేను నా హృదయంలో దుఃఖ అనుభూతిని పొందాలి?
ఇంకెన్నాళ్లు నా శత్రువు నా మీద విజయాలు సాధిస్తాడు?

నా దేవా, యెహోవా, నన్ను చూడుము. నా ప్రశ్నలకు జవాబిమ్ము.
    నన్ను ఆ జవాబు తెలుసుకోనిమ్ము. లేదా నేను చనిపోతాను!
అప్పుడు నా శత్రువు, “నేనే వానిని ఓడించాను” అనవచ్చు.
    నేను అంతం అయ్యానని నా శత్రువు సంతోషిస్తాడు.

యెహోవా, నాకు సహాయం చేయుటకు నీ ప్రేమనే నేను నమ్ముకొన్నాను.
    నీవు నన్ను రక్షించి, నన్ను ఆనందింపజేశావు.
యెహోవా నాకు మేలైన కార్యాలు చేశాడు.
    కనుక నేను యెహోవాకు ఒక ఆనందగీతం పాడుతాను.

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

14 “దేవుడు లేడు” అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొంటారు.
    బుద్ధిహీనులు దారుణమైన, చెడు కార్యాలు చేస్తారు.
    వారిలో కనీసం ఒక్కడు కూడా మంచి పనులు చేయడు.

పరలోకం నుండి యెహోవా క్రింద మనుష్యులను చూశాడు.
    వివేకంగలవాణ్ణి కనుక్కోవాలని దేవుడు ప్రయత్నించాడు.
    (వివేకంగల వాడు సహాయం కోసం దేవుని తట్టు తిరుగుతాడు.)
కాని ప్రతి మనిషి దేవుని నుండి తిరిగిపోయాడు.
    మొత్తం మనుష్యులంతా చెడ్డవాళ్లయ్యారు.
కనీసం ఒక్క వ్యక్తి కూడా
    మంచి పనులు చేయలేదు.

దుర్మార్గులు నా ప్రజలను నాశనం చేశారు.
    ఆ దుర్మార్గులు దేవుణ్ణి అర్థం చేసుకోరు.
    దుర్మార్గులు తినుటకు ఆహారం సమృద్ధిగా ఉంది.
    ఆ మనుష్యులు యెహోవాను ఆరాధించరు.
5-6 దుష్టులైన మీరు పేదవారి ఆలోచనలను చెడగొడ్తారు.
    కాని పేదవాడు తన రక్షణకొరకు దేవుని మీద ఆధారపడ్డాడు.
కాని ఆ దుర్మార్గులు చాలా భయపడిపోయారు.
    ఎందుకంటే దేవుడు మంచి మనుష్యులతో ఉన్నాడు గనుక.

సీయోనులోని ఇశ్రాయేలీయులను ఎవరు రక్షిస్తారు?
    ఇశ్రాయేలీయులను రక్షించేవాడు యెహోవాయే. యెహోవా ప్రజలు తీసుకొనిపోబడ్డారు. బలవంతంగా బందీలుగా చేయబడ్డారు.
కాని యెహోవా తన ప్రజలను వెనుకకు తీసుకొని వస్తాడు.
    ఆ సమయంలో యాకోబు (ఇశ్రాయేలు) ఎంతో సంతోషిస్తాడు.

దానియేలు 2:17-30

17 దానియేలు తన ఇంటికి వెళ్లి మిత్రులైన హనన్యా, మిషాయేలు, అజర్యాలకు పూర్తి సంగతిని వివరించాడు. 18 తమ పాలిట దేవుడు దయకలిగి ఆ రహస్యమును తెలుపుటకు పరలోకమందున్న దేవుని ప్రార్థించుమని దానియేలు తన మిత్రుల్ని కోరాడు. ఎందుకనగా దానియేలు మరియు అతని మిత్రులు బబులోనులోని యితర వివేకవంతులతో కలిసి నాశనమవ్వకూడదు.

19 ఆ రాత్రి, దేవుడు ఆ రహస్యమును దానియేలుకి దర్శనములో వివరించాడు. అప్పుడు పరలోక మందున్న దేవున్ని దానియేలు స్తుతించాడు.

20 “నిరంతరం దేవుని పేరు కీర్తించబడాలి;
    శక్తియు, వివేకమును ఆయనకే చెందాలని దానియేలు దేవున్ని స్తుతించాడు.
21 దేవుడే కాలాల్ని సమయాల్ని మార్చుతాడు.
    ఆయనే రాజుల్ని వారి అధికారాల్ని మార్చుతాడు.
    ఆయనే మనుష్యులకు వివేకమిస్తాడు.
కనుక, వారు వివేకవంతులౌతారు.
    జ్ఞానమిస్తాడు, కనుక జ్ఞానవంతులవుతారు.
22 గ్రహించటానికి కష్టమైన రహస్యాలు ఆయనకు తెలుసు.
    చీకటిలో మరుగైన సంగతులు ఆయనకు తెలుసు.
    వెలుగు ఆయనలో నివసిస్తుంది.
23 మా పూర్వీకుల దేవా! నీకు కృతజ్ఞుణ్ణి, నిన్ను కీర్తిస్తున్నాను.
    నీవు నాకు వివేకము, బలము ప్రసాదించావు.
నీవు రాజు కన్న కలను, దాని అర్థాన్ని తెలియజేశావు.
    మేమడిగిన విషయాల్ని నీవు మాకు చెప్పావు” అని దానియేలు అన్నాడు.

కలయొక్క అర్థమును దానియేలు చెప్పుట

24 తర్వాత దానియేలు అర్యోకు వద్దకు వెళ్లాడు. బబులోనులోని వివేకవంతుల్ని చంపటానికి రాజు అర్యోకును ఎంపిక చేశాడు. “బబులోనులోని వివేకవంతుల్ని చంపవద్దు. నన్ను రాజు వద్దకు తీసుకొని వెళ్లు. కలను గురించి, దాని అర్థాన్ని గురించి నేను చెప్తాను” అని దానియేలు అన్నాడు.

25 దానియేలును అర్యోకు తక్షణం రాజువద్దకు తీసుకొని వెళ్లాడు. అర్యోకు రాజుతో, “యూదానుంచి బందీలుగా వచ్చిన మనుష్యులలో నేనొక వ్యక్తిని చూశాను. కలయొక్క అర్థాన్ని రాజైన తమకు అతను వివరించగలడు” అని చెప్పాడు.

26 రాజు దానియేలుకు (బెల్తెషాజరుకు) ఒక ప్రశ్న వేశాడు. “నీవు నా కలను గూర్చి, దాని అర్థాన్ని గూర్చి చెప్పగలవా?”

27 దానియేలు, “నెబుకద్నెజరు రాజా! వివేకవంతుడుగాని, ఇంద్రజాలికుడుగాని, కల్దీయుడుగాని రాజు అడిగిన రహస్య విషయాలగురించి చెప్పలేడు. 28 కాని పరలోకమందున్న దేవుడు మరుగైన విషయాలగురించి చెప్పగలడు. భవిష్యత్తులో జరగబోయేదాన్ని చూపించడానికి దేవుడు రాజుకు ఒక కలను ఇచ్చాడు. నీవు నీ పడకమీద పడుకొని ఉండగా చూచిన విషయాలు ఇవి. 29 రాజా! నీ పడకమీద పడుకొని భవిష్యత్తులో ఏమి జరుగునో అని తలంచుచూ నీవు నిద్రించావు. గుప్త విషయాల గురించి దేవుడే చెప్పగలడు. భవిష్యత్తులో ఏమి జరుగునో దేవుడే నీకు చూపాడు. 30 దేవుడు ఈ రహస్యం నాకు కూడా తెలిపాడు. ఎందుకంటే, ఇతర వివేకవంతులకంటే నాకు ఎక్కువ వివేకం కలదనే కారణం కాదు. రాజువైన నీవు దాని అర్థమేమిటో గ్రహించాలని తలంచి దేవుడు ఈ రహస్య విషయం నాకు తెలిపాడు. ఆ విధంగా నీ మనుస్సులోని ఆలోచనల్ని నీవు గ్రహించగలవు” అని అన్నాడు.

1 యోహాను 2:12-17

12 బిడ్డలారా! ఆయన పేరిట మీ పాపాలు క్షమించబడ్డాయి.
    అందుకే మీకు వ్రాస్తున్నాను!
13 వృద్ధులారా! మొదటినుండి ఉన్నవాడెవరో మీకు తెలుసు!
    అందుకే మీకు వ్రాస్తున్నాను!
యువకులారా! మీరు సాతాన్ను గెలిచారు.
    అందుకే మీకు వ్రాస్తున్నాను!
14 బిడ్డలారా! తండ్రిని మీరెరుగుదురు.
    అందుకే మీకు వ్రాస్తున్నాను.
వృద్ధులారా! మొదటినుండి ఉన్నవాణ్ణి మీరెరుగుదురు.
    అందుకే మీకు వ్రాస్తున్నాను!
యువకులారా! మీలో బలం ఉంది.
    దేవుని సందేశం మీలో జీవిస్తోంది.
మీరు సాతానును గెలిచారు.
    అందుకే మీకు వ్రాస్తున్నాను.

15 ప్రపంచాన్ని కాని, ప్రపంచంలో ఉన్నవాటిని కాని ప్రేమించకండి. అంటే, ప్రపంచాన్ని ప్రేమించే వ్యక్తిలో తండ్రి ప్రేమ ఉండదన్నమాట. 16 శారీరక వాంఛలు, కళ్ళలోని దురాశలు, ఒకడు చేసేదాన్ని బట్టి, కలిగియున్న దాన్ని బట్టి కలిగే గర్వం తండ్రికి సంబంధించినవి కావు. ఇవి ప్రపంచానికి సంబంధించినవి. 17 ఈ ప్రపంచము, దానిలో ఉన్న ఆశలు నశించిపోతాయి. కాని దైవేచ్ఛానుసారం జీవించే వ్యక్తి శాశ్వతంగా జీవిస్తాడు.

యోహాను 17:20-26

20 “నా ప్రార్థన వాళ్ళ కోనం మాత్రమే కాదు. వాళ్ళ సందేశం ద్వారా నన్ను విశ్యసించే వాళ్ళ కోసం కూడా నేను ప్రార్థిస్తున్నాను. 21 తండ్రీ! నేను నీలో, నీవు నాలో ఉన్నట్లే వాళ్ళందరూ ఒకటిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నీవు నన్ను పంపినట్లు ఈ ప్రపంచం నమ్మాలంటే వాళ్ళను కూడా మనలో ఐక్యం చేయుము. 22 మనము ఒకటిగా ఉన్నట్లు వాళ్ళు కూడా ఒకటిగా ఉండాలని, నీవు నాకిచ్చిన మహిమను నేను వాళ్ళకిచ్చాను. 23 నేను వాళ్ళలో ఉన్నాను. నీవు నాలో ఉన్నావు. వాళ్ళలో సంపూర్ణమైన ఐక్యత కలిగేటట్లు చేయుము. అలా చేస్తే నీవు నన్ను పంపావని, నన్ను ప్రేమించినంతగా వాళ్ళను కూడా ప్రేమించావని ప్రపంచానికి తెలుస్తుంది.

24 “తండ్రీ! నీవు నాకు అప్పగించిన వాళ్ళు నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ప్రపంచం పుట్టక ముందు నుండి నన్ను ప్రేమించావు. నాకు మహిమను ఇచ్చావు. ఆ మహిమను వాళ్ళు చూడాలని నా అభిలాష. 25 నీతి స్వరూపుడవగు తండ్రీ! ప్రపంచానికి నీవెవరవో తెలియక పోయినా నీవు నాకు తెలుసు. నీవు నన్ను పంపావని వీళ్ళకు తెలుసు. 26 నీవెవరవో వాళ్ళకు తెలియచేసాను. తెలియచేస్తూ ఉంటాను. నాయందు నీకున్న ప్రేమ వాళ్ళయందు కూడా ఉండాలని, వాళ్ళలో నేను స్వయంగా ఉండాలని నా ఉద్దేశ్యం.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International