Revised Common Lectionary (Semicontinuous)
20 నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను.
నా ప్రత్యేక తైలంతో నేను అతన్ని అభిషేకించాను.
21 నా కుడిచేతితో నేను దావీదును బలపరచాను.
మరి నా శక్తితో నేను అతన్ని బలముగల వానిగా చేశాను.
22 ఏర్పాటు చేసికోబడిన రాజును శత్రువు ఓడించలేకపోయాడు.
దుర్మార్గులు అతన్ని ఓడించలేక పోయారు.
23 అతని శత్రువులను నేను అంతం చేసాను.
ఏర్పరచబడిన రాజును ద్వేషించిన వారిని నేను ఓడించాను.
24 ఏర్పరచబడిన రాజును నేను ఎల్లప్పుడూ ప్రేమిస్తాను. బలపరుస్తాను.
నేను ఎల్లప్పుడూ అతన్ని బలవంతునిగా చేస్తాను.
25 ఏర్పరచబడిన నా రాజును సముద్రం మీద నాయకునిగా ఉంచుతాను.
నదులను అతడు అదుపులో ఉంచుతాడు.
26 ‘నీవు నా తండ్రివి నీవు నా దేవుడవు, నా బండవు, నా రక్షకుడవు’
అని అతడు నాతో చెబుతాడు.
27 మరి నేను అతనిని నా ప్రథమ సంతానంగా చేసుకొంటాను.
భూరాజులకంటె అతడు ఉన్నతంగా చేయబడుతాడు.
28 ఏర్పరచబడిన రాజును నా ప్రేమ శాశ్వతంగా కాపాడుతుంది.
అతనితో నా ఒడంబడిక ఎప్పటికీ అంతంకాదు.
29 అతని వంశం శాశ్వతంగా కొనసాగుతుంది.
ఆకాశాలు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.
30 అతని సంతతివారు నా ధర్మశాస్త్రాన్ని పాటించటం మానివేస్తే,
నా ఆదేశాలను పాటించటం వారు మానివేస్తే అప్పుడు నేను వారిని శిక్షిస్తాను.
31 ఏర్పరచబడిన రాజు సంతతివారు నా ఆజ్ఞలను ఉల్లంఘించి,
నా ఆదేశాలను పాటించకపోతే
32 అప్పుడు నేను వారిని కఠినంగా శిక్షిస్తాను.
33 కాని వారిపట్ల నా ప్రేమను మాత్రం నేను ఎన్నటికీ తీసివేయలేను.
నేను ఎల్లప్పుడూ వారికి నమ్మకంగా ఉంటాను.
34 దావీదుతో నా ఒడంబడికను నేను ఉల్లంఘించను.
మా ఒడంబడికను నేను మార్చను.
35 నా పరిశుద్ధత మూలంగా, దావీదుకు నేను ఓ ప్రత్యేక వాగ్దానం చేసాను.
మరి నేను దావీదుకు అబద్ధం చెప్పను.
36 దావీదు వంశం శాశ్వతంగా కొనసాగుతుంది.
సూర్యుడు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.
37 చంద్రునిలా అది శాశ్వతంగా కొనసాగుతుంది.
ఒడంబడిక సత్యమనేందుకు ఆకాశాలు సాక్ష్యం. ఆ సాక్ష్యం నమ్మదగినది.”
ఒడంబడిక పెట్టె యెరూషలేముకు తేబడుట
15 దావీదు నగరంలో తన కొరకు దావీదు ఇండ్లు కట్టుకున్నాడు. తరువాత ఒడంబడిక పెట్టెను పెట్టటానికి అతడొక ప్రదేశాన్ని సిద్ధం చేశాడు. అతడక్కడ ఒక గుడారం దాని కొరకు నిర్మించాడు. 2 “ఒడంబడిక పెట్టెను మోయటానికి కేవలం లేవీయులు మాత్రమే అనుమతించబడ్డారు. ఒడంబడిక పెట్టెను మోయటానికి, ఆయనను సేవించడానికి యెహోవా లేవీయులను శాశ్వతంగా ఎంపిక చేశాడు” అని దావీదు చెప్పాడు.
4 ఆ తరువాత దేవుని ఒడంబడిక పెట్టెకు ముందు సేవచేయటానికి కొందరు లేవీయులను దావీదు ఎంపిక చేశాడు. వారు ఇశ్రాయేలు దేవుని ఉత్సవాలు చేయటానికి, యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించేందుకు, ఆయనకు జయజయ ధ్వనులు చేసేందుకు నియమింపబడ్డారు. 5 వీరిలో మొదటి జట్టు వారికి ఆసాపు పెద్ద. ఆసాపు వర్గం వారు తాళాలు మోగించేవారు. జెకర్యా రెండవ జట్టు వారికి అధిపతి. మిగిలిన లేవీయులు ఎవరనగా ఉజ్జీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఏలీయాబు, బెనాయా, ఓబేదెదోము మరియు యెహీయేలు. వీరు తీగలు గల వీణ, సితార వాద్యాలను వాయించేవారు. 6 యాజకులైన బెనాయా, యహజీయేలు ఎల్లప్పుడూ దేవుని ఒడంబడిక పెట్టెకు ముందు బూరలు వూదే వారు. 7 అదే సమయంలో దావీదు ప్రథమంగా ఆసాపు, అతని సోదరులు యెహోవాకి ఈ స్తుతిగీతం పాడే పని అప్పజెప్పాడు.
దావీదు కృతజ్ఞతా స్తోత్ర గీతం
8 యెహోవాను స్తుతించండి ఆయన నామమును ప్రకటించండి.
యెహోవా ఘనకార్యాలను ప్రజలకు చెప్పండి.
9 యెహోవాకి భజన చేయండి! యెహోవాకు స్తుతిగీతాలు పాడండి.
యెహోవా మహిమలు ప్రజలకు తెలపండి!
10 యెహోవా పవిత్ర నామం తలంచి గర్వపడండి;
యెహోవా సహాయం కోరిన వారందరూ సుఖసంతోషాలు పొందెదరు గాక!
11 యెహోవాను శరణు కోరండి; ఆయన బలాన్ని ఆశ్రయించండి.
ఆయన సన్నిధిని నిత్యం వెదకండి.
12 యెహోవా చేసిన అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకోండి.
ఆయన నిర్ణయాలను ఆయన చేసిన ఘనకార్యాలను మననం చేసుకోండి.
13 యెహోవా సేవకులగు ఇశ్రాయేలు బిడ్డలారా,
యాకోబు సంతతి వారలారా మీరు యెహోవా ఎన్నుకున్న ప్రజలు.
గ్రుడ్డివానికి దృష్టి కలిగించటం
(మత్తయి 20:29-34; మార్కు 10:46-52)
35 యేసు యెరికో పట్టణాన్ని సమీపిస్తున్నాడు. అదే సమయానికి ఒక గ్రుడ్డివాడు దారిప్రక్కన భిక్షమెత్తుకుంటూ కూర్చొని ఉన్నాడు. 36 అతడు ప్రజల గుంపు వెళ్తుండటం గమనించి ఏమి జరుగుతోందని అడిగాడు.
37 వాళ్ళు, “నజరేతు నివాసి యేసు ఈ దారిలో వెళ్తున్నాడు” అని చెప్పారు.
38 ఆ గ్రుడ్డివాడు బిగ్గరగా, “యేసూ! దావీదు కుమారుడా! నామీద దయ చూపు!” అని అన్నాడు.
39 ముందున్న వాళ్ళు అతణ్ణి గద్దిస్తూ నోరు మూసుకోమని చెప్పారు. కాని, అతడు యింకా బిగ్గరగా, “దావీదు కుమారుడా! నా మీద దయ చూపు” అని అన్నాడు.
40 యేసు ఆగి ఆ గ్రుడ్డివాణ్ణి తన దగ్గరకు పిలుచుకురమ్మని ఆజ్ఞాపించాడు. అతడు దగ్గరకు రాగానే యేసు అతణ్ణి 41 “ఏమి కావాలి?” అని అడిగాడు.
“ప్రభూ! నాకు దృష్టి కావాలి!” అని గ్రుడ్డివాడు సమాధానం చెప్పాడు.
42 యేసు, “నీకు దృష్టి కలగాలి! నీవు విశ్వసించావు కనుక నీకు దృష్టి కలిగింది” అని అన్నాడు.
43 వెంటనే అతడు చూడగలిగాడు. ఆ గ్రుడ్డివాడు దేవుణ్ణి స్తుతిస్తూ యేసును అనుసరించాడు. ప్రజలందరూ యిది చూసి వారుకూడా దేవుణ్ణి స్తుతించారు.
© 1997 Bible League International