Revised Common Lectionary (Semicontinuous)
దావీదు కీర్తన.
24 భూమి, దాని మీద ఉన్న సమస్తం యెహోవాకు చెందినవే.
ప్రపంచం, దానిలో ఉన్న మనుష్యులు అంతా ఆయనకు చెందినవారే.
2 జలాల మీద భూమిని యెహోవా స్థాపించాడు.
ఆయన దానిని పారుతున్న నీళ్ల మీద నిర్మించాడు.
3 యెహోవా పర్వతం మీదికి ఎవరు ఎక్కగలరు?
యెహోవా పవిత్ర ఆలయంలో ఎవరు నిలువగలరు?
4 అక్కడ ఎవరు ఆరాధించగలరు?
చెడుకార్యాలు చేయని వాళ్లు, పవిత్రమైన మనస్సు ఉన్న వాళ్ళునూ,
అబద్ధాలను సత్యంలా కనబడేట్టు చేయటం కోసం నా నామాన్ని ప్రయోగించని మనుష్యులు,
అబద్ధాలు చెప్పకుండా, తప్పుడు వాగ్దానాలు చేయకుండా ఉన్న మనుష్యులు.
అలాంటి మనుష్యులు మాత్రమే అక్కడ ఆరాధించగలరు.
5 మంచి మనుష్యులు, ఇతరులకు మేలు చేయుమని యెహోవాను వేడుకొంటారు.
ఆ మంచి మనుష్యులు వారి రక్షకుడైన దేవుణ్ణి మేలు చేయుమని వేడుకొంటారు.
6 దేవుని వెంబడించటానికి ప్రయత్నించేవారే ఆ మంచి మనుష్యులు.
సహాయంకోసం యాకోబు దేవుణ్ణి వారు ఆశ్రయిస్తారు.
7 గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి.
పురాతన తలుపుల్లారా తెరచుకోండి.
మహిమగల రాజు లోనికి వస్తాడు.
8 ఈ మహిమగల రాజు ఎవరు?
ఆ రాజు యెహోవా. ఆయన శక్తిగల సైన్యాధిపతి.
యెహోవాయే ఆ రాజు. ఆయన యుద్ధ వీరుడు.
9 గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి!
పురాతన తలుపుల్లారా, తెరచుకోండి.
మహిమగల రాజు లోనికి వస్తాడు.
10 ఆ మహిమగల రాజు ఎవరు?
ఆ రాజు సర్వశక్తిగల యెహోవాయే. ఆయనే ఆ మహిమగల రాజు.
ఇశ్రాయేలు ప్రజల నివాసం మార్పు
11 ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు విడిచిన తర్వాత రెండో సంవత్సరం, రెండో నెలలో (20వ రోజు) సన్నిధి గుడారం మీదనుండి మేఘం పైకి లేచింది. 12 అందుచేత ఇశ్రాయేలు ప్రజలంతా సీనాయి అరణ్యంనుండి బయల్దేరి ప్రయాణం మొదలుబెట్టారు. పారాను అరణ్యంలో ఆ మేఘం నిలిచిపోయేంత వరకు, వారు ప్రయాణం చేసారు. 13 మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారంగా ఆ ప్రజలు వారి స్థలాన్ని మార్చటం ఇది మొదటి సారి.
14 యూదా గుడారంలో మూడు విభాగాలు ముందుగా వెళ్లాయి. వారు వారి ధ్వజం క్రిందనే ప్రయాణం చేసారు. మొదటి విభాగం యూదా వంశం. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ విభాగానికి సైన్యాధిపతి. 15 తర్వాత ఇశ్శాఖారు విభాగం. సూయారు కుమారుడైన నెతనేలు ఆ కుటుంబ విభాగానికి సైన్యాధిపతి. 16 ఆ తర్వాత జెబూలూను విభాగం. హెలోను కుమారుడైన ఏలీయాబు ఆ విభాగానికి సైన్యాధిపతి.
17 అప్పుడు సన్నిధి గుడారం దించబడింది. గెర్షోను, మెరారి కుటుంబ పురుషులు పవిత్ర గుడారం మోసారు. కనుక తర్వాత ఈ కుటుంబాల ప్రజలు వరుసలో ఉన్నారు.
18 తర్వాత రూబేను నివాసము నుండి మూడు భాగాలు వచ్చాయి. వారు వారి ధ్వజం క్రింద ప్రయాణం చేసారు. మొదటిది రూబేను వంశం. షెదెయూరు కుమారుడైన ఏలీసూరు ఆ విభాగానికి సైన్యాధిపతి. 19 తర్వాత షిమ్యోను వంశం. సూరిషదాయి కుమారుడైన షెలుమీయేలు ఆ విభాగానికి సైన్యాధిపతి. 20 తర్వాత గాదు వంశం. దెయువేలు కుమారుడు ఎలీయాసాపు ఆ విభాగానికి సైన్యాధిపతి. 21 తర్వాత కహాతు కుటుంబ ప్రజలు. పవిత్ర గుడారం లోపల ఉండే పవిత్ర పరికరాలను వారు మోసారు. ఈ ప్రజలంతా వచ్చేయకముందే పవిత్ర గుడారం నిలబెట్టేందుకు వీలుగా వీరు ఈ సమయంలో వచ్చారు. ప్రజలు కూడా వచ్చారు.
22 తర్వాత ఎఫ్రాయిము నివాసంనుండి మూడు విభాగాలు వచ్చాయి. వారు వారి ధ్వజం క్రిందనే ప్రయాణం చేసారు. మొట్టమొదటి విభాగాం ఎఫ్రాయిము వంశం. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఆ భాగానికి సైన్యాధిపతి. 23 తర్వాత మనష్షే వంశం. పెదాసూరు కుమారుడైన గమలీయేలు ఆ విభాగానికి సైన్యాధిపతి. 24 తర్వాత బెన్యామీను వంశం. గిద్యోనీ కుమారుడైన అబీదాను ఆ విభాగానికి సైన్యాధిపతి.
25 వరుసలో చివరి మూడు వంశాలు మిగిలిన విభాగాలన్నిటికీ వెనుక కాపుగా ఉన్నాయి. ఇవి దాను నివాసానికి చెందినవి. వారు వారి ధ్వజం క్రింద ప్రయాణం చేసారు. మొదటి విభాగం దాను వంశం. అమీషదాయి కుమారుడైన అహీయెజరు ఆ విభాగానికి సైన్యాధిపతి. 26 తర్వాత ఆషేరు వంశం. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆ విభాగానికి సైన్యాధిపతి. 27 తర్వాత నఫ్తాలి వంశం. ఏనాను కుమారుడైన అహీరా ఆ విభాగానికి సైన్యాధిపతి. 28 ఇశ్రాయేలు ప్రజలు ఒక చోటు నుండి మరో చోటకు బయల్దేరినప్పుడు, వారు వెళ్లిన విధానం అది.
29 మిద్యానీ వాడగు రెవూయేలు కుమారుడు హోబాబు. (రెవూయేలు మోషేకు మామ.) “దేవుడు మాకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి మేము ప్రయాణం చేస్తున్నాము. కనుక మాతో రమ్ము. మేము నీకు మేలు చేస్తాము. ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా మంచివాటిని వాగ్దానం చేసాడు” అని హోబాబుతో మోషే చెప్పాడు.
30 “నేను మీతో రాను, నేను నా సొంతదేశానికి, నా స్వంత ప్రజల దగ్గరకు వెళ్లిపోతాను” అని హోబాబు జవాబిచ్చాడు.
31 అప్పుడు మోషే, “దయచేసి మమ్మల్ని విడువకు. అరణ్యంగూర్చి మాకంటె నీకే ఎక్కువ తెలుసు. నీవు మాకు మార్గదర్శిగా ఉండొచ్చు. 32 నీవు మాతో వస్తే, యెహోవా మాకు ఇచ్చే మంచివాటన్నింటిలో మేము నీకు భాగం ఇస్తాము” అని చెప్పాడు.
33 కనుక హోబాబు ఒప్పుకొన్నాడు. యెహోవా పర్వతం దగ్గరనుండి వారు ప్రయాణం మొదలు బెట్టారు. పురుషులు యెహోవా ఒడంబడిక పవిత్ర పెట్టెను పట్టుకొని ప్రజల ముందు నడిచారు. వారు స్థలం కోసం వెదుకుతూ, మూడు రోజులపాటు పవిత్ర పెట్టెను మోసారు. 34 యెహోవా మేఘం ప్రతిరోజూ వారిమీద ఉంది. ప్రతి ఉదయం వారు తమ స్థలం విడిచిపెట్టినప్పుడు, వారిని నడిపించేందుకు మేఘం అక్కడ ఉండేది:
35 ప్రజలు ప్రయాణం మొదలు బెట్టి, పవిత్రపెట్టె వారితో పాటు వెడలగానే, మోషే ఎప్పుడూ ఇలా చెప్పేవాడు:
“యెహోవా, లెమ్ము
నీ శత్రువులు అన్ని దిక్కుల్లో పారిపోదురు గాక:
నీకు వ్యతిరేకంగా ఉన్న మనుష్యులు నీ ఎదుట నుండి పారిపోదురుగాక,”
36 పవిత్ర పెట్టెను, దాని స్థలంలో దాన్ని ఉంచి నప్పుడు, మోషే ఎప్పుడూ ఇలా చెప్పేవాడు,
“యెహోవా, లక్షలాదిమంది ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు తిరిగి రమ్ము.”
యోహాను జన్మ వృత్తాంతం
57 ఎలీసబేతుకు నెలలు నిండి మగశిశువును ప్రసవించింది. 58 బంధువులు మరియు ఇరుగు పొరుగు వాళ్ళు ప్రభువు ఆమెను కనికరించినందుకు ఆనందించారు.
59 ఎనిమిదవ రోజు వాళ్ళు పిల్లవానికి సున్నతి చేయటానికి వచ్చి అతనికి జెకర్యా అని అతని తండ్రి పేరే పెట్టబోయారు. 60 కాని తల్లి వారిస్తూ, “ఆ పేరు వద్దు! యోహాను అని పేరు పెట్టండి” అని అన్నది.
61 వాళ్ళు, “మీ బంధువుల్లో ఆ పేరున్న వాళ్ళు ఎవ్వరూ లేరే?” అని అన్నారు. 62 ఆ పిల్లవాని తండ్రికి సంజ్ఞలు చేసి అతడే పేరు పెట్టదలచాడో అని అడిగారు.
63 అతడు వ్రాయటానికి ఒక పలక నివ్వమని అడిగి దానిపై, “అతనికి యోహాను అని పేరు పెట్టండి” అని వ్రాసాడు. ఇది చూసి అంతా ఆశ్చర్యపోయారు. 64 వెంటనే అతని నోరు, నాలుక కదిలి బాగైపోయింది. అతడు దేవుణ్ణి స్తుతిస్తూ మాట్లాడటం మొదలు పెట్టాడు. 65 ఇరుగు పొరుగు వాళ్ళలో భక్తి, భయమూ నిండుకుపొయ్యాయి. యూదయ పర్వత ప్రాంతమంతా ఈ వార్త వ్యాపించింది. 66 ఈ విషయం విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడి, “ఈ పసివాడు ఎంతగొప్పవాడౌతాడో కదా!” అని అన్నారు. ఆ బాలునికి ప్రభువు హస్తం తోడుగా ఉంది.
జెకర్యా చెప్పిన భవిష్యం
67 ఆ బాలుని తండ్రి జెకర్యా పవిత్రాత్మతో నింపబడి దేవుని సందేశాన్ని ఈ విధంగా చెప్పాడు:
68 “తన ప్రజలకు స్వేచ్ఛ కలిగించి, రక్షించ వచ్చిన ప్రభువును స్తుతించండి!
ఇశ్రాయేలు ప్రజల దేవుణ్ణి స్తుతించండి!
69 మహాశక్తిగల రక్షకుణ్ణి తన సేవకుడైన దావీదు వంశం నుండి
మనకోసం పంపాడు.
70 గతంలో మహాత్ములైన ప్రవక్తల ద్వారా
ఈ విషయం చెప్పాడు.
71 దేవుడు శత్రువుల బారినుండి,
మనలను ద్వేషించేవారినుండి మనల్ని రక్షిస్తాడు.
72 మన తండ్రులను, తాత ముత్తాతలను కరుణిస్తానన్నాడు.
పవిత్రమైన ఒడంబడిక మరిచి పోనన్నాడు!
73 శత్రువుల బారినుండి రక్షిస్తానని మన తండ్రి అబ్రాహాముతో ప్రమాణం చేశాడు.
74 మనం ఏ భయం లేకుండా తనను సేవించాలి.
75 జీవితాంతం పవిత్రంగా, ధర్మంగా, తన కోసం జీవించాలని ఆయన ఉద్దేశ్యం!
76 “ఓ శిశువా! నీవు సర్వోన్నతుని ప్రవక్తవని పిలువబడతావు!
ప్రభువు కన్నా ముందు వెళ్ళి ప్రభువు రాకకు మార్గం వేస్తావు!
77 పాపక్షమాపణ ద్వారా రక్షణ కలుగుతుందన్న జ్ఞానాన్ని ఆయన ప్రజలకు బోధిస్తావు!
78 “మన దేవుడు తన కనికరంవల్ల పరలోకం నుండి
ఒక నీతిసూర్యుణ్ణి పంపించి,
79 మరణమనే చీకటి నీడలో నివసించే మనపై ప్రకాశించునట్లు చేసి
మనల్ని శాంతి మార్గంలో నడిపిస్తాడు!”
80 ఆ బాలుడు పెరిగి పెద్దవాడై ఆత్మలో బలం పొందాడు. ఇశ్రాయేలు ప్రజలకు బోధించే సమయం వచ్చే దాకా యోహాను ఎడారుల్లో జీవించాడు.
© 1997 Bible League International