Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 37:12-22

12 దుర్మార్గులు మంచి వాళ్లకు విరోధంగా కీడు చేయాలని తలుస్తారు.
    ఆ దుర్మార్గులు మంచి మనుష్యుల మీద పండ్లు కొరికి, తమ కోపం వ్యక్తం చేస్తారు.
13 అయితే మన ప్రభువు ఆ దుర్మార్గులను చూచి నవ్వుతాడు,
    వారికి సంభవించే సంగతులను ఆయన చూస్తాడు.
14 దుర్మార్గులు వారి ఖడ్గాలు తీసుకొంటారు, విల్లు ఎక్కుపెడ్తారు. పేదలను, నిస్సహాయులను వాళ్లు చంపాలని చూస్తారు.
    మంచివాళ్లను, నిజాయితీపరులను వాళ్లు చంపాలని చూస్తారు.
15 కాని వారి విల్లులు విరిగిపోతాయి.
    వారి ఖడ్గాలు వారి స్వంత గుండెల్లో గుచ్చుకు పోతాయి.
16 దుష్టుల ఐశ్వర్యంకంటే
    మంచివాని అల్పభాగమే ఉత్తమమైనది.
17 ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడుతారు.
    కాని మంచివాళ్ల విషయమై యెహోవా శ్రద్ధ పుచ్చుకొంటాడు.
18 పవిత్రమైన మనుష్యుల్ని వారి జీవితాంతం వరకూ యెహోవా కాపాడుతాడు.
    వారి ప్రతిఫలం శాశ్వతంగా ఉంటుంది.
19 కష్టం వచ్చినప్పుడు మంచి మనుష్యులు నాశనం చేయబడరు.
    కరువు కాలం వచ్చినప్పుడు మంచి మనుష్యులకు భోజనం సమృద్ధిగా ఉంటుంది.
20 కాని దుర్మార్గులు యెహోవాకు శత్రువులు,
    ఆ దుర్మార్గులు నాశనం చేయబడుతారు.
వారు పొలంలోని పువ్వులవలె అదృశ్యమౌతారు.
    వారు పొగవలె కనబడకుండా పోతారు.
21 దుర్మార్గుడు త్వరగా అప్పు చేస్తాడు. అతడు దాన్ని మరల చెల్లించడు.
    కాని మంచి మనిషి సంతోషంతో ఇతరులకు ఇస్తాడు.
22 ఒకవేళ ఒక మంచి మనిషి ప్రజలను ఆశీర్వదిస్తే, అప్పుడు ఆ ప్రజలు దేవుడు వాగ్దానం చేసిన భూమిని పొందుతారు.
    కాని ప్రజలకు కీడు జరగాలని గనుక అతడు అడిగితే, అప్పుడు ఆ మనుష్యులు నాశనం చేయబడతారు.

2 సమూయేలు 11:14-21

ఊరియాను చంపించేందుకు దావీదు పథకం

14 మరునాటి ఉదయం దావీదు యోవాబుకు ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం ఊరియా ద్వారా పంపాడు. 15 ఆ ఉత్తరంలో దావీదు ఇలా రాశాడు, “యుద్ధం ఎక్కడ ముమ్మరంగా సాగుతూ వుంటుందో అక్కడ ఊరియాను ముందు వరుసలో పెట్టు. అక్కడ వానిని ఒంటరిగా వదిలి వేయి. అలా నిస్సహాయుడై చనిపోయేలా చేయి.”

16 యెవాబు నగరాన్ని పరిశీలించి ఎక్కడ అమ్మోనీయులు ధైర్యంగా ఉన్నారో చూశాడు. అతడా ప్రదేశానికి ఊరియాను పంప నిర్ణయించాడు. 17 ఆ నగర (అమ్మోనీయుల రాజధానియగు రబ్బా) ప్రజలు యోవాబును ఎదిరించటానికి బయటికి వచ్చారు. దావీదు మనుష్యులు కొందరు చంపబడ్డారు. చంపబడిన వారిలో హిత్తీయుడైన ఊరియా ఒకడు.

18 యుద్ధ పరిణామాలపై యోవాబు దావీదుకు ఒక నివేదిక పంపాడు. 19 ఆ దూతతో యుద్ధంలో ఏమి జరిగిందో దావీదురాజుకు వివరంగా చెప్పమన్నాడు. 20 “బహుశః రాజు కలత చెందుతాడు. ‘యోవాబు సైన్యం నగర సమీపానికి ఎందుకు వెళ్లింది? వారు గోడల మీదుగా బాణాలు వేసేవారని తెలియదా? 21 ఎరుబ్బెషెతు కుమారుడైన అబీమెలుకును ఎవరు చంపారో మీకు గుర్తుందా? ఆ నగర గోడపై నుండి ఒక స్త్రీ తిరుగలి పై రాయిని విసరివేయగా అబీమెలెకు చనిపోయాడు. ఆ స్త్రీ అతనిని తేబేసువద్ద చంపింది. మీరు ఆ గోడ చెంతకు ఎందుకు వెళ్లారు?’ అని అనవచ్చు. దావీదు రాజు గనుక అలా అంటే, ‘నీ సేవకుడు హిత్తీయుడైన ఊరియా కూడా చనిపోయాడు’ అని నీవు తప్పకుండా లచెప్పాలి” అంటూ యోవాబు దూతను పంపాడు.

ఫిలిప్పీయులకు 4:10-20

కానుకలకు కృతజ్ఞత

10 మీకు నా పట్ల ఉన్న అభిమానం మళ్ళీ మొలకెత్తినందుకు నేను ప్రభువు పేరిట చాలా ఆనందిస్తున్నాను. ఔను, మీకు నా పట్ల అభిమానం ఉంది కాని, దాన్ని చూపించుకొనే అవకాశం మీకు చిక్కలేదు. 11 నాకు మీ అవసరముందని ఈ విధంగా మాట్లాడటం లేదు. ఏ పరిస్థితుల్లోనైనా తృప్తిగా ఉండేందుకు నేను నేర్చుకొన్నాను. 12 అవసరంలో ఉండటం అంటే ఏమిటో, అధికంగా కలిగి ఉండటం అంటే ఏమిటో నాకు తెలుసు. అన్ని పరిస్థితుల్లో, అంటే కడుపు నిండి ఉన్నప్పుడును ఆకలితో ఉన్నప్పుడును, అవసరాలలో ఉన్నప్పుడును అధికంగా కలిగి ఉన్నప్పుడును సంతృప్తికరంగా ఎలా ఉండాలో, దాని రహస్యమేమిటో నేను తెలుసుకున్నాను. 13 నాకు శక్తినిచ్చే క్రీస్తు ద్వారా నేను ఏ పనినైనా చేయగలను.

14 అయినా మీరు నా కష్టాలు పంచుకొని మంచి పని చేసారు. 15 పైగా దైవసందేశాన్ని గురించి మీరు క్రొత్తగా విన్నప్పుడు, ఫిలిప్పీలో ఉన్న మీరు తప్ప ఎవ్వరూ నాకు సహాయం చెయ్యలేదు. నేను మాసిదోనియ నుండి ప్రయాణం సాగించినప్పుడు ఒక్క సంఘం కూడా నాకు సహాయం చెయ్యలేదు. నాకు వాళ్ళు ఏమీ యివ్వలేదు. నానుండి ఏమీ పుచ్చుకోలేదు. 16 నేను థెస్సలొనీకలో ఉన్నప్పుడు కూడా నా అవసరాన్ని బట్టి మీరు నాకు ఎన్నోసార్లు సహాయం చేసారు. 17 నేను మీ నుండి విరాళాలు పొందాలని యిలా మాట్లాడటం లేదు. మీ జీవితం యొక్క లెక్కలకు కొంత లాభం చేకూర్చాలని నా అభిప్రాయం. 18 నాకు కావలసినదానికన్నా ఎక్కవే చెల్లించారు. మీరు ఎపఫ్రొదితు ద్వారా నాకు పంపిన విరాళాలు నాకు ముట్టాయి. దానితో నా అవసరాలు పూర్తిగా తీరిపోయాయి. సుగంధ పరిమళాల వలే ఉన్న మీ విరాళాలను దేవుడు ఆనందంగా అంగీకరిస్తాడు. 19 నా దేవుడు యేసు క్రీస్తులో ఉన్న గొప్ప ఐశ్వర్యంతో మీ అవసరాలన్నీ తీరుస్తాడు. 20 మన తండ్రియైన దేవునికి చిరకాలపు కీర్తి కలుగుగాక! ఆమేన్.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International