Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: యెహోవా సేవకుడు దావీదు కీర్తన. సౌలు బారి నుండి, యితర శత్రువులందరినుండి యెహోవా దావీదును రక్షించినప్పుడు అతడు వ్రాసిన పాట.
18 “యెహోవా, నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను!”
అతడీలాగన్నాడు.
2 యెహోవా నా బండ, నా కోట, నా రక్షకుడు.
నా దేవుడే నా అండ. నేను ఆశ్రయంకోసం ఆయన యొద్దకు పరుగెత్తుతాను.
దేవుడు నా డాలు, ఆయనే తన శక్తితో నన్ను రక్షిస్తాడు.
ఎత్తైన కొండలలో యెహోవా నా దాగుకొను స్థలము.
3 యెహోవాకు నేను మొరపెడ్తాను.
యెహోవా స్తుతించబడుటకు అర్హుడు
మరియు నా శత్రువుల బారినుండి నేను రక్షించబడుతాను.
4-5 నా శత్రువులు నా యెదుట ఎన్నో ఉచ్చులు పెట్టారు.
మరణకరమైన ఉచ్చులు నా యెదుట ఉన్నాయి.
మరణపాశాలు నా చుట్టూరా చుట్టబడి ఉన్నాయి.
నాశనకరమైన వరదనీళ్లు నన్ను భయపెడుతున్నాయి. మరణపాశాలు అన్నీ చుట్టూరా ఉన్నాయి.
6 చిక్కులో పడి, నేను సహాయం కోసం యెహోవాకు మొరపెట్టాను.
నేను నా దేవుణ్ణి ప్రార్థించాను.
దేవుడు తన పవిత్ర స్థలం నుండి నా ప్రార్థన విన్నాడు.
సహాయంకోసం నేను చేసిన ప్రార్థనలు ఆయన విన్నాడు.
43 నాకు వ్యతిరేకంగా పోరాడే మనుష్యుల నుండి నన్ను కాపాడావు.
ఆ రాజ్యాలకు నన్ను నాయకునిగా చేయుము.
నేను ఎరుగని ప్రజలు నాకు సేవ చేస్తారు.
44 ఆ మనుష్యులు నా గురించి విన్నప్పుడు విధేయులయ్యారు.
ఇతర రాజ్యాల ప్రజలు నేనంటే భయపడ్డారు.
45 ఆ విదేశీ ప్రజలు నేనంటే భయపడ్డారు,
కనుక వారు భయంతో వణుకుతూ సాష్టాంగపడ్డారు.
వారు దాక్కొనే తమ స్థలాలనుండి బయటకు వచ్చారు.
46 యెహోవా సజీవంగా ఉన్నాడు.
నా ఆశ్రయ దుర్గమైన వానిని నేను స్తుతిస్తాను. నా దేవుడు నన్ను రక్షిస్తాడు.
అందుచేత ఆయనను స్తుతులతో పైకెత్తండి.
47 నాకోసం నా శత్రువులను శిక్షించాడు.
ఆ ప్రజలను ఓడించేందుకు యెహోవా నాకు సహాయం చేసాడు.
48 యెహోవా, నీవే నా శత్రువుల నుండి నన్ను తప్పించావు.
కృ-రులైన వారి నుండి నీవు నన్ను రక్షించావు.
నాకు విరుద్ధంగా నిలిచినవారిని ఓడించుటకు నీవు నాకు సహాయం చేశావు.
49 కనుక మనుష్యులందరి యెదుట యెహోవాను నేను స్తుతిస్తాను.
నీ నామ కీర్తన గానము చేస్తాను.
50 యెహోవా ఏర్పాటు చేసుకొన్న రాజుకు, ఆయన గొప్ప విజయాలిచ్చాడు.
ఆయన ఏర్పాటు చేసుకొన్న రాజుకు అనగా దావీదుకు,
తన సంతానానికీ నిరంతరం ఆయన ఎంతో దయ చూపాడు.
సౌలు దావీదును వెంటాడుట
14 దావీదు అరణ్యములో ఉన్న దుర్గాలలోను, జీపు అరణ్యంలోని కొండలలోను తలదాచుకున్నాడు. ప్రతి రోజూ సౌలు దావీదు కోసం వెదుకుతూ ఉండేవాడు. కానీ యెహోవా దావీదును సౌలు పట్టుకొనేలా చేయలేదు.
15 జీపు అరణ్యంలో హోరేషు వద్ద ఉన్నాడు దావీదు. సౌలు తనను చంపటానికి వస్తున్నాడని భయపడ్డాడు. 16 కానీ సౌలు కుమారుడు యోనాతాను హోరేషులో ఉన్న దావీదును చూడటానికి వెళ్లాడు. యోనాతాను దావీదుకు యెహోవా మీద దృఢవిశ్వాసం కలిగేందుకు సహాయం చేసాడు. 17 యోనాతాను, “భయపడకు, నా తండ్రి సౌలు నిన్ను తాకలేడు. నీవు ఇశ్రాయేలుకు రాజువవుతావు. నేను నీ తరువాత స్థానంలో ఉంటాను. ఇది నా తండ్రికి కూడా తెలుసు” అన్నాడు దావీదుతో.
18 యోనాతాను, దావీదు ఇద్దరూ యెహోవా ఎదుట ఒక ఒడంబడిక చేసుకున్నారు. తరువాత యోనాతాను ఇంటికి వెళ్లిపోయాడు. దావీదు హోరేషులో ఉండిపోయాడు.
తీతును కొరింథుకు పంపటం
16 మీపట్ల నాకున్న చింతనే, దేవుడు తీతు హృదయంలో కూడా పెట్టాడు. అందుకు నేను దేవునికి కృతజ్ఞుణ్ణి. 17 తీతు మా నివేదన అంగీకరించాడు. అంతేకాక, చాలా ఉత్సాహంతో స్వయంగా మీ దగ్గరకు వస్తున్నాడు. 18 అతని వెంట యింకొక సోదరుణ్ణి పంపుతున్నాము. ఈ సోదరుడు సువార్త ప్రకటించి చేసిన సేవను అన్ని సంఘాలు అభినందిస్తున్నాయి. 19 పైగా, అతడు మా వెంట ఉండి, మాతో సహా ఈ కానుకను తీసుకు వెళ్ళాలని సంఘాలు అతణ్ణి ఎన్నుకొన్నాయి. మేమీకానుక ప్రభువు మహిమ కోసం తీసుకు వెళ్తున్నాము. సహాయం చేయాలన్న మా ఉత్సాహాన్ని చూపాలని మా ఉద్దేశ్యం.
20 ఈ గొప్ప విరాళాలు విమర్శకు గురి కాకుండా జాగ్రత్తగా యిస్తాము. 21 ప్రభువు దృష్టిలోనే కాకుండా ప్రజల దృష్టిలో కూడా ఏది ధర్మమో అది చెయ్యాలని మేము శ్రద్ధతో కష్టపడుతున్నాము.
22 అందువల్ల మా సోదరుణ్ణి కూడా వాళ్ళతో పంపుతున్నాము. ఇతన్ని మేము చాలా సార్లు పరీక్షించాము. సేవ చెయ్యాలనే ఉత్సాహం అతనిలో ఉన్నట్లు గ్రహించాము. ఇక అతనికి మీ పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉండటంవల్ల అతని ఉత్సాహం ఇంకా ఎక్కువైంది.
23 ఇక తీతు విషయమా! అతడు నేను మీకోసం చేస్తున్న సేవలో భాగస్థుడు. నాతో కలిసి పని చేసేవాడు. ఇక మేము పంపిన సోదరులు, సంఘాల ప్రతినిధులు, క్రీస్తుకు గౌరవం కలిగించేవాళ్ళు. 24 అందువల్ల, మీకు ప్రేమ ఉన్నట్లు వాళ్ళకు రుజువు చెయ్యండి. మేము మీ విషయంలో ఎందుకు గర్విస్తున్నామో వాళ్ళకు చూపండి. అలా చెయ్యటం వల్ల సంఘాలన్నీ దీన్ని గమనిస్తాయి.
© 1997 Bible League International