Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 48

కోరహు కుమారుల స్తుతి పాట.

48 యెహోవా గొప్పవాడు.
    మన దేవుని పట్టణంలో, ఆయన పరిశుద్ధ పట్టణంలో స్తుతులకు ఆయన పాత్రుడు.
దేవుని పరిశుద్ధ పర్వతం అందమైనది, ఎత్తైనది.
    అది భూమి అంతటికీ సంతోషాన్ని తెస్తుంది.
సీయోను పర్వతం దేవుని నిజమైన పర్వతం.[a]
    అది మహారాజు పట్టణం.
ఇక్కడ ఆ పట్టణంలోని
    భవనాలలో దేవుడు కోట అని పిలువబడుతున్నాడు.
ఒకప్పుడు రాజులు కొందరు సమావేశమయ్యారు.
    వారు ఈ పట్టణంపై దాడి చేయాలని పథకం వేసారు.
వారంతా కలసి ముందుకు వచ్చారు.
    ఆ రాజులు చూసారు. వారు ఆశ్చర్యపోయారు,
    వారు బెదిరిపోయారు. మరియు వారంతా పారిపోయారు!
ఆ రాజులందరికీ భయం పట్టుకొంది.
    ప్రసవ వేదన పడుతున్న స్త్రీలలా వారు వణికారు.
దేవా, బలమైన తూర్పుగాలితో
    తర్షీషు ఓడలను బ్రద్దలు చేశావు.
మేము ఏమి విన్నామో, దాన్ని మహా శక్తిగల దేవుని పట్టణంలో
    మన సర్వశక్తిమంతుడైన యెహోవా పట్టణంలో చూశాము.
దేవుడు ఆ పట్టణాన్ని శాశ్వతంగా బలపరుస్తాడు.

దేవా, నీ ప్రేమ, కనికరాలను గూర్చి మేము నీ ఆలయంలో జాగ్రత్తగా ఆలోచిస్తాము.
10 దేవా, నీవు ప్రఖ్యాతిగలవాడవు.
    భూలోకమంతటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
    నీ కుడిచేయి నీతితో నిండియున్నది.
11 సీయోను పర్వతం సంతోషిస్తుంది.
    మరియు యూదా నగరాలు ఆనందంగా ఉన్నాయి. దేవా, ఎందుకంటే నీవు మంచి తీర్పులు చేశావు.
12 సీయోను చుట్టూ తిరుగుతూ
    ఆ పట్టణాన్ని చూడండి, గోపురాలు లెక్కించండి.
13 ఎత్తైన గోడలు చూడండి.
    సీయోను రాజనగరుల ద్వారా వెళ్ళండి.
అప్పుడు తరువాత తరాలకు మీరు దాన్ని గూర్చి చెప్పగలుగుతారు.
14 ఈ విషయాలు దేవుడు ఎటువంటి వాడు అనేది మనకు తెలియజేస్తున్నాయి:
    ఆయన ఎప్పటికీ మన దేవుడు, ఆయన ఎల్లప్పుడు మనలను కాపాడుతాడు.

2 సమూయేలు 2:1-11

దావీదు తన మనుష్యులతో హెబ్రోనుకు వెళ్లటం

దావీదు యెహోవాకు ప్రార్థన చేసి, “నేను యూదా రాజ్యంలో ఏ నగరానికైనా వెళ్లనా?” అని అడిగాడు.

“వెళ్లు” అన్నాడు యెహోవా.

“ఎక్కడికి వెళ్లను?” అని దావీదు అడిగితే,

“హెబ్రోనుకు” అని యెహోవా సమాధానమిచ్చాడు.

కావున దావీదు అక్కడికి వెళ్లాడు. ఆయన భార్యలైన యెజ్రెయేలీయురాలగు అహీనోయము, కర్మెలీయుడగు నాబాలు భార్యయు విధవరాలునగు అబీగయీలు ఆయనతో వెళ్లిరి. దావీదు తన మనుష్యులందరినీ వారి వారి కుటుంబాలతో సహా తనవెంట తీసుకొనివెళ్లాడు. వారంతా హెబ్రోను నగర ప్రాంతాలలో తమ నివాసాలను ఏర్పరచుకున్నారు.

యూదా ప్రజలు వచ్చి దావీదును యూదా రాజ్యానికి రాజుగా అభిషేకం చేశారు. ఆ పని చేసి, “సౌలుకు అంత్యక్రియలు జరిపినది యాబేష్గిలాదు” వారని దావీదుకు చెప్పారు.

యాబేష్గిలాదు ప్రజల వద్దకు దావీదు దూతలను పంపాడు. దావీదు మాటగా వారు యాబేషు ప్రజలకు ఈ విధంగా చెప్పారు: “మీ రాజైన సౌలు అస్థికలను[a] మీరు దయతో పాతిపెట్టినందుకు దేవుడు మిమ్మునాశీర్వదించు గాక! దేవుడు ఇప్పుడు మీపట్ల దయగలవాడై, సత్య దృష్టితో వుంటాడు. మీరు సౌలు అస్థికలను పాతిపెట్టినందుకు నేను కూడా మీపట్ల దయగలిగి వుంటాను. మీ రాజైన సౌలు చనిపోయాడు. కనుక ఇప్పుడు యూదావారు నన్ను పట్టాభిషిక్తునిగా చేశారు. అందువల్ల మీరు బలపరాక్రమ సంపన్నులుగా మెలగండి.”

ఇష్బోషెతు రాజవటం

నేరు కుమారుడైన అబ్నేరు సౌలు యొక్క సైన్యాధిపతిగా ఉన్నాడు. అబ్నేరు సౌలు కుమారుడైన ఇష్బోషెతును మహనయీమునకు తీసుకొని వెళ్లాడు. అక్కడ అబ్నేరు అతనిని గిలాదు, ఆషేరి, యెజ్రెయేలు, ఎఫ్రాయిము, బెన్యామీను వారిమీద రాజుగా నియమించాడు. అనగా ఇష్బోషెతు ఇశ్రాయేలుకు రాజయ్యాడు.

10 ఇష్బోషెతు సౌలు కుమారుడు. అతడు ఇశ్రాయేలుకు రాజై పాలించేనాటికి నలుబది ఏండ్ల వయస్సువాడు. అతడు రెండు సంవత్సరాలు పరిపాలన చేశాడు. కాని యూదా వంశంవారు దావీదును అనుసరించారు. 11 హెబ్రోనులో యూదా వంశవారికి దావీదు ఏడు సంవత్సరాల ఆరునెలలు రాజుగా ఉన్నాడు.

1 కొరింథీయులకు 4:8-13

ఇప్పటికే మీకు కావలసినవన్నీ మీ దగ్గర ఉన్నాయి. మీరు ధనవంతులైపొయ్యారు. మేము రాజులం కాకపోయినా, మీరు రాజులైపొయ్యారు. మీరు నిజంగా రాజులు కావాలని మా అభిలాష. అప్పుడు మేము మీతో సహా రాజులమౌతాము. మరణ శిక్ష పొందిన నేరస్థుల్లాగా, దేవుడు అపొస్తులులమైన మమ్మల్ని చివరన ఉంచాడు. లోకమంతటికీ, దేవదూతలకు, మానవులకు అపొస్తులమైన మేము ప్రదర్శనా వస్తువులయ్యాము. 10 క్రీస్తు కొరకు మేము మూర్ఖులమయ్యాము. కాని మీరు క్రీస్తు విషయంలో తెలివిగా నడచుకొన్నారు. మేము బలహీనులము. మీరు బలవంతులు. మీకు గౌరవం లభిస్తోంది. మాకు అవమానం లభిస్తోంది. 11 ఇప్పటికీ మేము ఆకలిదప్పులతో బాధపడ్తున్నాము. చినిగిన దుస్తులు వేసుకొని జీవిస్తున్నాము. నిర్దాక్షిణ్యమైన హింసలు అనుభవిస్తున్నాము. మాకు ఇల్లు వాకిలి లేదు. 12 మేము మా చేతుల్తో కష్టపడి పనిచేస్తున్నాం. మమ్మల్ని దూషించిన వాళ్ళను మేము దీవిస్తున్నాం. మాకు శిక్ష విధిస్తే అనుభవిస్తాం. 13 అవమానిస్తే, మర్యాదగా సమాధానం చెపుతున్నాం. ఇంతదాకా మేము ఈ ప్రపంచానికి చెందిన చెత్తలాగా, పారవేసిన కసువులాగా చూడబడ్డాము.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International