Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: యెహోవా సేవకుడు దావీదు కీర్తన. సౌలు బారి నుండి, యితర శత్రువులందరినుండి యెహోవా దావీదును రక్షించినప్పుడు అతడు వ్రాసిన పాట.
18 “యెహోవా, నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను!”
అతడీలాగన్నాడు.
2 యెహోవా నా బండ, నా కోట, నా రక్షకుడు.
నా దేవుడే నా అండ. నేను ఆశ్రయంకోసం ఆయన యొద్దకు పరుగెత్తుతాను.
దేవుడు నా డాలు, ఆయనే తన శక్తితో నన్ను రక్షిస్తాడు.
ఎత్తైన కొండలలో యెహోవా నా దాగుకొను స్థలము.
3 యెహోవాకు నేను మొరపెడ్తాను.
యెహోవా స్తుతించబడుటకు అర్హుడు
మరియు నా శత్రువుల బారినుండి నేను రక్షించబడుతాను.
4-5 నా శత్రువులు నా యెదుట ఎన్నో ఉచ్చులు పెట్టారు.
మరణకరమైన ఉచ్చులు నా యెదుట ఉన్నాయి.
మరణపాశాలు నా చుట్టూరా చుట్టబడి ఉన్నాయి.
నాశనకరమైన వరదనీళ్లు నన్ను భయపెడుతున్నాయి. మరణపాశాలు అన్నీ చుట్టూరా ఉన్నాయి.
6 చిక్కులో పడి, నేను సహాయం కోసం యెహోవాకు మొరపెట్టాను.
నేను నా దేవుణ్ణి ప్రార్థించాను.
దేవుడు తన పవిత్ర స్థలం నుండి నా ప్రార్థన విన్నాడు.
సహాయంకోసం నేను చేసిన ప్రార్థనలు ఆయన విన్నాడు.
43 నాకు వ్యతిరేకంగా పోరాడే మనుష్యుల నుండి నన్ను కాపాడావు.
ఆ రాజ్యాలకు నన్ను నాయకునిగా చేయుము.
నేను ఎరుగని ప్రజలు నాకు సేవ చేస్తారు.
44 ఆ మనుష్యులు నా గురించి విన్నప్పుడు విధేయులయ్యారు.
ఇతర రాజ్యాల ప్రజలు నేనంటే భయపడ్డారు.
45 ఆ విదేశీ ప్రజలు నేనంటే భయపడ్డారు,
కనుక వారు భయంతో వణుకుతూ సాష్టాంగపడ్డారు.
వారు దాక్కొనే తమ స్థలాలనుండి బయటకు వచ్చారు.
46 యెహోవా సజీవంగా ఉన్నాడు.
నా ఆశ్రయ దుర్గమైన వానిని నేను స్తుతిస్తాను. నా దేవుడు నన్ను రక్షిస్తాడు.
అందుచేత ఆయనను స్తుతులతో పైకెత్తండి.
47 నాకోసం నా శత్రువులను శిక్షించాడు.
ఆ ప్రజలను ఓడించేందుకు యెహోవా నాకు సహాయం చేసాడు.
48 యెహోవా, నీవే నా శత్రువుల నుండి నన్ను తప్పించావు.
కృ-రులైన వారి నుండి నీవు నన్ను రక్షించావు.
నాకు విరుద్ధంగా నిలిచినవారిని ఓడించుటకు నీవు నాకు సహాయం చేశావు.
49 కనుక మనుష్యులందరి యెదుట యెహోవాను నేను స్తుతిస్తాను.
నీ నామ కీర్తన గానము చేస్తాను.
50 యెహోవా ఏర్పాటు చేసుకొన్న రాజుకు, ఆయన గొప్ప విజయాలిచ్చాడు.
ఆయన ఏర్పాటు చేసుకొన్న రాజుకు అనగా దావీదుకు,
తన సంతానానికీ నిరంతరం ఆయన ఎంతో దయ చూపాడు.
సౌలు రాజు మరణం
10 ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేశారు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల నుండి పారిపోయారు. అనేకమంది ఇశ్రాయేలు ప్రజలు గిల్బోవ పర్వతం మీద చంపబడ్డారు. 2 ఫిలిష్తీయులు సౌలును, అతని కుమారులను తరుముకుంటూ పోయి, వారిని పట్టుకుని చంపివేశారు. సౌలు కుమారులు యోనాతాను, అబీనాదాబు, మల్కీషూవలను ఫిలిష్తీయులు చంపివేశారు. 3 సౌలు చుట్టూ యుద్ధం ముమ్మరంగా సాగింది. విలుకాండ్రు సౌలుపై బాణాలు వదిలి గాయపర్చారు.
4 అప్పుడు తన ఆయుధాలు మోసే వానితో[a] సౌలు ఇలా చెప్పాడు: “నీ కత్తి దూసి నన్ను చంపివేయి. నీవలా చేస్తే ఆ పరదేశీయులు[b] వచ్చి నన్ను హింసించి ఎగతాళి చేయరు.”
కాని ఆయుధాలు మోసే సౌలు సేవకుడు భయపడ్డాడు. సౌలును చంపటానికి నిరాకరించాడు. అప్పుడు సౌలు తన కత్తినే ఉపయోగించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కత్తి మొనపై అతను పడి తనను తాను చంపుకున్నాడు. 5 సౌలు చనిపోవటం ఆయుధాలు మోసేవాడు చూసాడు. తర్వాత అతను కూడా తన కత్తి మొనపై పడి తనను తాను చంపుకున్నాడు. 6 ఆ విధంగా సౌలు, అతని ముగ్గురు కుమారులు మరణించారు. పైగా సౌలు కుటుంబం వారంతా కలిసి చనిపోయారు.
7 లోయలో నివసిస్తున్న ఇశ్రాయేలు ప్రజలంతా తమ సైన్యం పారిపోవటం చూసారు. సౌలు, అతని కుమారులు చనిపోవటం ప్రజలు చూసారు. దానితో వారు కూడ భయపడి తమ పట్టణాలను వదలి పారిపోయారు. తరువాత ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులు వదిలిపోయిన పట్టణాలకు వచ్చి, అక్కడ నివసించసాగారు.
8 శవాలనుండి విలువైన వస్తువులను సేకరించటానికి ఫిలిష్తీయులు మరునాడు వచ్చారు. వారు గిల్బోవ పర్వతం మీద సౌలు శవాన్ని, అతని ముగ్గురు కుమారుల శవాలను చూసారు. 9 ఫిలిష్తీయులు సౌలు శరీరంమీద విలువైన వస్తువులను తీసుకొన్నారు. వారు సౌలు తలను, అతని ఆయుధాలను తీసుకొన్నారు. పిమ్మట వారు తమ దేశం నలుమూలలా ఉన్న బూటకపు దేవుళ్ల గుళ్లకు, ప్రజలకు ఈ వార్తను అందజేయటానికి దూతలను పంపారు. 10 సౌలు ఆయుధాలను ఫిలిష్తీయులు తమ బూటకపు దేవుళ్ల గుళ్లల్లో దాచారు. సౌలు తలను వారు దాగోను[c] గుడిలో వేలాడదీసారు.
11 యాబేష్గిలాదు పట్టణంలో నివసించే వారంతా ఫిలిష్తీయులు సౌలుకు చేసినదంతా విన్నారు. 12 యాబేష్గిలాదులో వున్న యోధులంతా వెళ్లి సౌలు, అతని కుమారుల శవాలను యాబేష్గిలాదుకు తిరిగి తెచ్చారు. ఆ యోధులు సౌలు, అతని కుమారుల ఎముకలను యాబేషులో ఒక పెద్ద చెట్టు క్రింద పాతిపెట్టారు. తర్వాత వారు ఏడు రోజులు ఉపవాసమున్నారు.
13 సౌలు మరణానికి ముఖ్య కారణం అతను యెహోవాపట్ల విశ్వాసంగా లేకపోవటం. సౌలు యెహోవా మాటను లెక్కపెట్టలేదు. 14 యెహోవాకు ప్రార్థన చేయకుండా తన సంశయాలను నివారించుకొనటానికి, కర్ణ పిశాచిగల స్త్రీని ఆశ్రయించాడు. అందువల్ల యెహోవా సౌలును చంపి, రాజ్యాన్ని దావీదుకు అప్పగించాడు. దావీదు తండ్రి పేరు యెష్షయి.
యేసు ఒక బాలుని దయ్యంనుండి విడిపించటం
(మత్తయి 17:14-20; లూకా 9:37-43)
14 యేసు, పేతురు, యోహాను మరియు యాకోబు మిగతా శిష్యుల దగ్గరకు వచ్చారు. అక్కడ ఒక పెద్ద ప్రజల గుంపు శిష్యుల చుట్టూ ఉండటం, వాళ్ళతో ఏమో వాదిస్తూ ఉండటం చూసారు. 15 యేసును చూడగానే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపడి స్వాగతం చెప్పటానికి ఆయన దగ్గరకు పరుగెత్తారు.
16 యేసు శిష్యులను, “వాళ్ళతో మీరేమి వాదిస్తున్నారు” అని అడిగాడు.
17 ఆ గుంపులో నుండి ఒకడు, “అయ్యా! నేను నా కుమారుణ్ణి మీదగ్గరకు పిలుచుకు వచ్చాను. దయ్యం పట్టి అతనికి మాట పడిపోయింది. 18 ఆ దయ్యం అతని మీదికి వచ్చినప్పుడల్లా అది అతణ్ణి నేలపై పడవేస్తుంది. అప్పుడు నా కుమారుని నోటినుండి నురుగు వస్తుంది. పండ్లు కొరుకుతాడు. అతని శరీరం కట్టెబారిపోతుంది. ఆ దయ్యాల్ని వదిలించమని మీ శిష్యుల్ని అడిగాను. కాని వాళ్ళు ఆ పని చేయలేక పోయారు” అని అన్నాడు.
19 యేసు, “ఈనాటి వాళ్ళలో విశ్వాసం లేదు. నేనెంత కాలమని మీతో ఉండాలి? ఎంతకాలమని మిమ్మల్ని భరించాలి? ఆ బాలుణ్ణి నా దగ్గరకు పిలుచుకురండి” అని అన్నాడు.
20 వాళ్ళు ఆ బాలుణ్ణి పిలుచుకు వచ్చారు. ఆ దయ్యం యేసును చూసిన వెంటనే, ఆ బాలుణ్ణి వణికేటట్లు చేసింది. ఆ బాలుడు క్రింద పడ్డాడు. నురుగు కక్కుతూ పొర్లాడటం మొదలు పెట్టాడు.
21 యేసు ఆ బాలుని తండ్రితో, “ఎంత కాలం నుండి యితడీవిధంగా ఉన్నాడు?” అని అడిగాడు.
“చిన్ననాటి నుండి” అని అతడు సమాధానం చెప్పాడు. 22 “ఆ దయ్యం అతణ్ణి చంపాలని ఎన్నో సార్లు అతణ్ణి నిప్పుల్లో, నీళ్ళలో పడవేసింది. మీరేదైనా చేయగల్గితే మా మీద దయవుంచి మాకు సహాయం చెయ్యండి” అని ఆ బాలుని తండ్రి అన్నాడు.
23 యేసు, “నీవు విశ్వసించగలిగితే, విశ్వాసమున్న వానికి ఏదైనా సాధ్యమౌతుంది” అని అన్నాడు.
24 వెంటనే ఆ బాలుని తండ్రి, “నేను విశ్వసిస్తున్నాను. నాలో ఉన్న అపనమ్మకం తొలిగిపోవటానికి సహాయపడండి చెయ్యండి” అన్నాడు.
25 యేసు ప్రజల గుంపు తన దగ్గరకు పరుగెత్తుకుంటూ రావటం చూసి ఆ దయ్యంతో, “ఓ చెవిటి, మూగ దయ్యమా! అతని నుండి బయటకు రమ్మని, మళ్ళీ అతనిలో ప్రవేశించవద్దని నేను ఆజ్ఞాపిస్తున్నాను” అని అన్నాడు.
26 ఆ దయ్యం కేకపెట్టి అతణ్ణి తీవ్రంగా వణికించి బయటకు వచ్చింది. ఆ బాలుడు శవంలా పడివుండుట వల్ల చాలా మంది అతడు చనిపొయ్యాడనుకొన్నారు. 27 కాని, యేసు అతని చేతులు పట్టుకొని లేపి నిలుచోబెట్టాడు.
28 ఇంట్లోకి వెళ్ళాక శిష్యులు రహస్యంగా, “మేమెందుకు వెళ్ళగొట్టలేక పొయ్యాము?” అని అడిగారు.
29 యేసు, “ఈ రకమైన దయ్యాన్ని ప్రార్థనతో[a] మాత్రమే వెళ్ళగొట్టగలము” అని సమాధానం చెప్పాడు.
© 1997 Bible League International