Revised Common Lectionary (Semicontinuous)
దావీదు కీర్తన.
24 భూమి, దాని మీద ఉన్న సమస్తం యెహోవాకు చెందినవే.
ప్రపంచం, దానిలో ఉన్న మనుష్యులు అంతా ఆయనకు చెందినవారే.
2 జలాల మీద భూమిని యెహోవా స్థాపించాడు.
ఆయన దానిని పారుతున్న నీళ్ల మీద నిర్మించాడు.
3 యెహోవా పర్వతం మీదికి ఎవరు ఎక్కగలరు?
యెహోవా పవిత్ర ఆలయంలో ఎవరు నిలువగలరు?
4 అక్కడ ఎవరు ఆరాధించగలరు?
చెడుకార్యాలు చేయని వాళ్లు, పవిత్రమైన మనస్సు ఉన్న వాళ్ళునూ,
అబద్ధాలను సత్యంలా కనబడేట్టు చేయటం కోసం నా నామాన్ని ప్రయోగించని మనుష్యులు,
అబద్ధాలు చెప్పకుండా, తప్పుడు వాగ్దానాలు చేయకుండా ఉన్న మనుష్యులు.
అలాంటి మనుష్యులు మాత్రమే అక్కడ ఆరాధించగలరు.
5 మంచి మనుష్యులు, ఇతరులకు మేలు చేయుమని యెహోవాను వేడుకొంటారు.
ఆ మంచి మనుష్యులు వారి రక్షకుడైన దేవుణ్ణి మేలు చేయుమని వేడుకొంటారు.
6 దేవుని వెంబడించటానికి ప్రయత్నించేవారే ఆ మంచి మనుష్యులు.
సహాయంకోసం యాకోబు దేవుణ్ణి వారు ఆశ్రయిస్తారు.
7 గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి.
పురాతన తలుపుల్లారా తెరచుకోండి.
మహిమగల రాజు లోనికి వస్తాడు.
8 ఈ మహిమగల రాజు ఎవరు?
ఆ రాజు యెహోవా. ఆయన శక్తిగల సైన్యాధిపతి.
యెహోవాయే ఆ రాజు. ఆయన యుద్ధ వీరుడు.
9 గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి!
పురాతన తలుపుల్లారా, తెరచుకోండి.
మహిమగల రాజు లోనికి వస్తాడు.
10 ఆ మహిమగల రాజు ఎవరు?
ఆ రాజు సర్వశక్తిగల యెహోవాయే. ఆయనే ఆ మహిమగల రాజు.
ఒడంబడిక పెట్టె (మందసము)
37 తుమ్మ కర్రతో పవిత్ర పెట్టెను బెసెలేలు చేసాడు. ఆ పెట్టె పొడవు 45 అంగుళాలు, వెడల్పు 27 అంగుళాలు. ఎత్తు 27 అంగుళాలు, 2 పెట్టె లోపల, బయట స్వచ్ఛమైన బంగారంతో అతడు తాపడం చేసాడు. తర్వాత పెట్టె చుట్టూ బంగారు నగిషీబద్ద కట్టాడు. 3 బంగారు ఉంగరాలు నాలుగు చేసి నాలుగు మూలలా వాటిని అమర్చాడు. పెట్టె మోయటానికి ఈ ఉంగరాలు ఉపయోగించబడ్డాయి. ఒక్కో ప్రక్క రెండేసి ఉంగరాలు ఉన్నాయి. 4 తర్వాత పెట్టెను మోసేందుకు కర్రలను అతడు చేసాడు. తుమ్మ కర్రతో చేసి ఆ కర్రలకు స్వచ్ఛమైన బంగారం తాపడం చేసాడు. 5 పెట్టెకు ఒక్కో ప్రక్క ఉంగరాల గుండా కర్రలను దూర్చిపెట్టాడు. 6 తర్వాత స్వచ్ఛమైన బంగారంతో అతడు మూత చేసాడు. దాని పొడవు 45 అంగుళాలు, వెడల్పు 27 అంగుళాలు. 7 తర్వాత బెసలేలు కొట్టబడ్డ బంగారంతో రెండు కెరూబులను చేసాడు. ఆ కెరూబులను మూత కొనల మీద ఉంచాడు. 8 ఒక కొనమీద ఒక కెరూబును, మరో కొనమీద మరో కెరూబును ఉంచాడు. అంతా ఒకే భాగంలో ఉండేటట్టు ఆ కెరూబులు మూతతో కలిపి చేయబడ్డాయి. 9 కెరూబుల రెక్కలు ఆకాశంవైపు విప్పబడ్డాయి. ఆ కెరూబుల రెక్కలు పెట్టెను కప్పి ఉంచాయి. కెరూబులు ఎదురెదురుగా మూతను చూస్తూ ఉన్నాయి.
ప్రత్యేక బల్ల
10 తర్వాత అతడు తుమ్మ కర్రతో బల్లను చేసాడు. ఆ బల్ల పొడవు 36 అంగుళాలు, వెడల్పు 18 అంగుళాలు, ఎత్తు 27 అంగుళాలు. 11 అతడు ఆ బల్లను బంగారంతో తాపడం చేసాడు. బల్ల నాలుగు ప్రక్కల బంగారు నగిషీబద్ద చేసాడు. 12 అప్పుడు అతడు ఆ బల్ల చుట్టూ మూడు అంగుళాల చట్రం చేసాడు. ఆ చట్రం మీద బంగారు నగిషీబద్దను అతడు ఉంచాడు. 13 అప్పుడు అతడు ఆ బల్లకు నాలుగు బంగారు ఉంగరాలు చేసాడు. నాలుగు మూలలా నాలుగు బంగారు ఉంగరాలు అతడు అమర్చాడు. అక్కడే నాలుగు కాళ్లు ఉన్నాయి. 14 ఉంగరాలను బల్ల పైభాగంలో చట్రానికి దగ్గరగా అతడు పెట్టాడు. బల్లను మోసేందుకు ఉపయోగించే కర్రలను ఉంగరాలు పట్టి ఉంచుతాయి. 15 తర్వాత బల్లలను మోసేందుకు కర్రలను అతడు చేసాడు. తుమ్మ కర్ర ఉపయోగించి చేసిన, ఆ కర్రలకు స్వచ్ఛమైన బంగారు పూత పూసాడు. 16 అప్పుడు బల్ల మీద ఉపయోగించే వస్తువులన్నింటినీ తయారు చేసాడు. పానార్పణము పోసేందుకు పళ్లెములు, గరిటెలు, గిన్నెలు, పాత్రలు అతడు తయారు చేసాడు. ఇవన్నీ స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడ్డాయి.
మరికొన్ని ఉపదేశములు
2 మనస్సు నిమగ్నం చేసి, భక్తితో దేవుణ్ణి ప్రార్థించండి. దేవునికి మీ కృతజ్ఞత తెలుపుకోండి. 3 మా సందేశానికి దేవుడు దారి చూపాలని, ఆయన క్రీస్తును గురించి తెలియ చేసిన రహస్య సత్యాన్ని మేము ప్రకటించగలగాలని మాకోసం కూడా ప్రార్థించండి. నేను దాని కోసమే సంకెళ్ళలో ఉన్నాను. 4 నేను ఆ సందేశాన్ని స్పష్టంగా, యితరులకు అర్థమయ్యేలా ప్రకటించగలగాలని కూడా ప్రార్థించండి. ఇది నా కర్తవ్యం.
5 అవిశ్వాసులతో తెలివిగా ప్రవర్తించండి. వచ్చిన ప్రతి అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. 6 మీరు మర్యాదగా, తెలివిగా మాట్లాడాలి. మీ మాటలు అందరి ప్రశ్నలకు సమాధానం యిచ్చేటట్లు ఉండాలి.
చివరి మాట
7 “తుకికు” నా గురించి అన్ని విషయాలు మీకు చెబుతాడు. అతడు విశ్వాసం గల పరిచారకుడు. ప్రభువు సేవ చేయటంలో నా సహచరుడు. 8 మా పరిస్థితులు మీకు తెలియాలనీ, అతడు మీ మనస్సుకు శాంతి కలిగించాలనే ముఖ్యోద్దేశంతో అతణ్ణి మీ దగ్గరకు పంపుతున్నాను. 9 మనకు ప్రియ సోదరుడు, విశ్వాసం కలవాడు అయినటువంటి ఒనేసిముతో కలిసి అతడు వస్తున్నాడు. “ఒనేసిము” మీ వద్దనుండి వచ్చినవాడే. ఇక్కడ జరుగుతున్నవన్నీ వాళ్ళు చెబుతారు.
10 నాతో కారాగారంలో ఉన్న “అరిస్తార్కు”, “మార్కు” మీకు వందనములు తెలుపుతున్నారు. మార్కు బర్నబాకు మేనల్లుడు. మార్కు కోసం మీరు చేయవలసినవాటిని గురించి యిదివరకే చెప్పాను. అతడక్కడికి వస్తే అతనికి స్వాగతం చెప్పండి. 11 “యూస్తు” అని పిలువబడే యేసు కూడా మీకు వందనములు చెప్పమన్నాడు. దేవుని రాజ్యం కొరకు నాతో కలిసి పని చేస్తున్నవాళ్ళలో ఈ ముగ్గురు మాత్రమే యూదా మతము నుండి మనలో చేరినవారు. నా ఈ కృషిలో వాళ్ళు నాకు చాలా ఆదరణగా ఉన్నారు.
12 మీలో ఒకడైన “ఎపఫ్రా” మీకు వందనములు తెలుపుతున్నాడు. ఇతడు యేసు క్రీస్తు సేవకుడు. మీకు దైవేచ్ఛపై పూర్తిగా విశ్వాసం ఉండాలనీ, మీరు ఆత్మీయంగా పరిపూర్ణత పొందాలనీ, మీ కొరకు అతడు దేవుణ్ణి పట్టుదలతో ప్రార్థిస్తూ ఉన్నాడు. 13 ఇతడు మీకోసం “లవొదికయ” “హియెరాపొలి” గ్రామాలలోనివాళ్ళ కోసం కష్టపడి పని చేస్తున్నాడని నేను గట్టిగా చెప్పగలను. 14 మన ప్రియమిత్రుడు, వైద్యుడైన “లూకా” మరియు “దేమాయు” మీకు వందనములు చెపుతున్నారు.
15 లవొదికయలోని సోదరులకు, “నుంఫా” కు, ఆమె యింట్లోని క్రీస్తు సంఘానికి నా శుభాకాంక్షలు. 16 ఈ లేఖను మీ సంఘంలో చదివాక, లవొదికయలోనున్న సంఘంలో కూడా చదివేటట్లు చూడండి. ఆ తర్వాత లవొదికయ నుండి వచ్చిన లేఖను మీ సంఘంలో చదవండి. 17 ప్రభువు అప్పగించిన కార్యాన్ని పూర్తి చెయ్యమని “అర్ఖిప్పు” తో చెప్పండి.
18 ఈ శుభాకాంక్షలు పౌలను నేను స్వయంగా నా చేతులతో వ్రాస్తున్నాను. నా “సంకెళ్ళను” జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని యొక్క అనుగ్రహం మీపై ఉండుగాక!
© 1997 Bible League International