Revised Common Lectionary (Semicontinuous)
యాత్ర కీర్తన.
130 యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను.
కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను.
2 నా ప్రభువా, నా మాట వినుము.
సహాయం కోసం నేను చేస్తున్న మొర వినుము.
3 యెహోవా, మనుష్యులను వారి పాపాలన్నిటిని బట్టి నీవు శిక్షిస్తే
ఒక్క మనిషి కూడా మిగలడు.
4 యెహోవా, నీ ప్రజలను క్షమించుము.
అప్పుడు నిన్ను ఆరాధించుటకు మనుష్యులు ఉంటారు.
5 యెహోవా నాకు సహాయం చేయాలని నేను కనిపెడుతున్నాను.
నా ఆత్మ ఆయన కోసం కనిపెడుతుంది.
యెహోవా చెప్పేది నేను నమ్ముతున్నాను.
6 నా ప్రభువు కోసం నేను కనిపెడుతున్నాను.
ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో కనిపెడుతున్న కావలివాండ్లలా నేను ఉన్నాను.
7 ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో.
నిజమైన ప్రేమ యెహోవా దగ్గర మాత్రమే కనబడుతుంది.
యెహోవా మనలను మరల, మరల రక్షిస్తాడు.
8 మరియు యెహోవా ఇశ్రాయేలీయుల పాపాలు అన్నింటి విషయంలో వారిని క్షమిస్తాడు.
16 యోసేపు సోదరులు అతని దగ్గరకు వచ్చినట్లు ఫరోకు తెలిసింది. ఫరో ఇల్లంతా ఈ వార్త పాకిపోయింది. దీని విషయమై ఫరో, అతని సేవకులు చాలా సంతోషించారు. 17 కనుక యోసేపుతో ఫరో అన్నాడు: “నీ సోదరులకు కావలసినంత ఆహారం తీసుకొని తిరిగి కనాను దేశం వెళ్లమని చెప్పు. 18 నీ తండ్రిని, వారి కుటుంబాలను తిరిగి ఇక్కడికి నా దగ్గరకు తీసుకొని రమ్మని వారితో చెప్పు. ఈజిప్టులో శ్రేష్ఠమైన భూమిని నివాసానికి నేను నీకు ఇస్తాను. ఇక్కడ మనకు ఉన్న శ్రేష్ఠ ఆహారం నీ కుటుంబం భోంచేస్తారు.” 19 తర్వాత ఫరో అన్నాడు: “మన బండ్లలో మంచి వాటిని కొన్నింటిని మీ సోదరులకు ఇయ్యి. కనాను వెళ్లి, మీ తండ్రిని, స్త్రీలందరిని, పిల్లలను ఆ బండ్లమీద తీసుకొని రమ్మని వారితో చెప్పు. 20 వారి అన్ని సామానులు తెచ్చుకొనే విషయంలో ఏమీ చింత పడవద్దు. ఈజిప్టులో మనకు ఉన్న శ్రేష్ఠ వస్తువులు మనం వారికి ఇద్దాం.”
21 కనుక ఇశ్రాయేలు కుమారులు అలా చేశారు. ఫరో వాగ్దానం చేసినట్లే యోసేపు వారికి మంచి బండ్లు ఇచ్చాడు. వారి ప్రయాణానికి సరిపడినంత ఆహారం యోసేపు వారికి ఇచ్చాడు. 22 ఒక్కో సోదరునికి ఒక్కో జత చక్కని వస్త్రాలు యిచ్చాడు యోసేపు. అయితే బెన్యామీనుకు అయిదు జతల మంచి బట్టలు యోసేపు ఇచ్చాడు. మరియు 300 వెండి నాణాలు కూడ యోసేపు బెన్యామీనుకు ఇచ్చాడు. 23 యోసేపు తన తండ్రికి కానుకలు కూడా పంపించాడు. ఈజిప్టులోని మంచి వస్తువులు చాలా సంచులనిండా నింపి, పది గాడిదలమీద అతడు పంపించాడు. అతని తండ్రి తిరిగి వచ్చేటప్పుడు అవసరమైన ఆహారం, రొట్టె, ధాన్యం విస్తారంగా పది ఆడగాడిదల మీద అతడు పంపించాడు. 24 అప్పుడు యోసేపు అతని సోదరులను వెళ్లమన్నాడు. వారు వెళ్తూ ఉండగా యోసేపు “తిన్నగా ఇంటికి వెళ్లండి. దారిలో పోట్లాడకండి” అని వారితో చెప్పాడు.
25 కనుక ఆ సోదరులు ఈజిప్టు దేశం విడిచి, కనాను దేశంలో ఉన్న తమ తండ్రి దగ్గరకు వెళ్లారు. 26 ఆ సోదరులు “నాయనా, యోసేపు బ్రతికే ఉన్నాడు, ఈజిప్టు దేశం అంతటికి అతడే అధికారి” అని అతనితో చెప్పారు. వారి తండ్రి ఆశ్చర్యచకితుడయ్యాడు. అతడు వాళ్లను నమ్మలేదు. 27 అయితే యోసేపు చెప్పినదంతా ఆ సోదరులు వారి తండ్రికి చెప్పారు. తర్వాత తనని ఈజిప్టు తీసుకొని రమ్మని యోసేపు పంపిన బండ్లను యాకోబు చూశాడు. అప్పుడు యాకోబు సంతోషంతో ఉప్పొంగిపొయ్యాడు. 28 “ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను. నా కుమారుడు యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు! నేను మరణించక ముందు అతణ్ణి చూస్తాను” అన్నాడు ఇశ్రాయేలు.
యేసు రోగిని నయం చేయటం
(మార్కు 1:40-45; లూకా 5:12-16)
8 యేసు కొండదిగి రాగా, ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు. 2 కుష్టురోగంతో ఉన్న వాడొకడు వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “మీరు తలచుకొంటే నన్ను బాగుచెయ్యగలరు” అని అన్నాడు.
3 యేసు తన చేయి చాపి అతణ్ణి తాకుతూ, “నీకు బాగు కావాలని కోరుతున్నాను, స్వస్థుడవుకమ్ము!” అని అన్నాడు. వెంటనే అతనికి నయమైపోయింది. 4 అప్పుడు యేసు అతనితో, “ఈ సంఘటనను గురించి ఎవ్వరికీ చెప్పకు. కాని యాజకుని దగ్గరకు వెళ్ళి నీ దేహాన్ని చూపి, మోషే ఆజ్ఞాపించిన కానుకను అర్పించు. తద్వారా నీకు నయమైనట్లు వాళ్ళకు రుజువౌతుంది” అని అన్నాడు.
యేసు శతాధిపతి సేవకుని నయం చేయటం
(లూకా 7:1-10; యోహాను 4:43-54)
5 యేసు కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాక శతాధిపతి ఒకడు ఆయన దగ్గరకు వచ్చి, ఆయన సహాయం కావాలని కోరుతూ, 6 “ప్రభూ! నా సేవకుడు పక్షవాతం వచ్చి యింట్లో పడుకొని ఉన్నాడు. వానికి చాలా బాధ కలుగుతోంది” అని అన్నాడు.
7 యేసు, “నేను వచ్చి నయం చేస్తాను” అని అన్నాడు.
8 కాని శతాధిపతి సమాధానంగా, “ప్రభూ! మీరు మా యింటి గడపలో కాలు పెట్టటానికి కూడా నేను అర్హుడను కాను. కాని మీరు మాటంటే చాలు, నా సేవకునికి నయమైపోతుంది. 9 ఎందుకంటే, నేను కూడా అధికారుల క్రింద ఉన్నవాణ్ణి. నా క్రింద కూడా సైనికులున్నారు. నేను ఈ సైనికునితో ‘వెళ్ళు’ అంటే వెళ్తాడు; ఆ సైనికునితో ‘రా’ అంటే వస్తాడు. నా సేవకునితో ‘ఇది చేయి’ అంటే చేస్తాడు” అని అన్నాడు.
10 యేసు ఇది విని ఆశ్చర్యపొయ్యాడు. ఆయన తన వెంట వస్తున్న వాళ్ళతో, “ఇది సత్యం. ఇంత గొప్ప విశ్వాసమున్న వ్యక్తి నాకు ఇశ్రాయేలీయులలో ఎవ్వరూ కనిపించలేదు. 11 నేను చెప్పెదేమిటంటే, తూర్పునుండి, పడమరనుండి, చాలామంది ప్రజలు వస్తారు. వచ్చి, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో కలిసి దేవుని రాజ్యంలో జరిగే విందులో పాల్గొంటారు. 12 కాని దేవుడు తన రాజ్యానికి తమ పుట్టుకవల్ల వారసులైన వాళ్ళను అవతల దూరంగా చీకట్లో పారవేస్తాడు. అక్కడ వాళ్ళు ఏడుస్తూ బాధననుభవిస్తారు.”
13 ఇలా అని, యేసు శతాధిపతితో, “వెళ్ళు! నీవు విశ్వసించినట్లే జరుగుతుంది” అని అన్నాడు. అదే క్షణంలో అతని సేవకునికి నయమైపోయింది.
© 1997 Bible League International