Revised Common Lectionary (Semicontinuous)
దావీదు యాత్ర కీర్తన.
124 గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మనకు ఏమి జరిగి ఉండేదో?
ఇశ్రాయేలూ, నాకు జవాబు చెప్పుము.
2 గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మాకు ఏమి జరిగి ఉండేదో?
ప్రజలు మనమీద దాడి చేసినప్పుడు ఏమి జరిగి ఉండేదో?
3 అప్పుడు మన శత్రువులకు మన మీద కోపం వచ్చినప్పుడల్లా
వాళ్లు మనల్ని సజీవంగా మింగేసి ఉండేవాళ్లు.
4 అప్పుడు మన శత్రుసైన్యాలు మనల్ని కొట్టుకుపోయే ప్రవాహంలా,
మనల్ని ముంచివేసే నదిలా ఉండేవి.
5 అప్పుడు ఆ గర్విష్ఠులు నోటి వరకూ పొంగుతూ
మనల్ని ముంచి వేసే నీళ్లలా పొంగుతూ ఉండేవాళ్లు.
6 యెహోవాను స్తుతించండి. మన శత్రువులు
మనల్ని పట్టి చంపకుండునట్లు యెహోవా చేశాడు.
7 మనం వలలో పట్టబడి తర్వాత తప్పించుకొన్న పక్షిలా ఉన్నాము.
వల తెగిపోయింది. మనం తప్పించుకొన్నాము.
8 మనకు సహాయం యెహోవా దగ్గర నుండే వచ్చింది.
భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.
యాకోబు తన కుమారులను ఆశీర్వదించుట
49 అప్పుడు యాకోబు తన కుమారులందరినీ తన దగ్గరకు పిలిచాడు. అతడు చెప్పాడు: “నా కుమారులందరూ ఇక్కడ నా దగ్గరకు రండి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నేను మీకు చెబుతాను.
2 “యాకోబు కుమారులారా, మీరంతా కలిసి వచ్చి వినండి.
మీ తండ్రి ఇశ్రాయేలు మాటలు వినండి.
3 “రూబేనూ, నీవు నా మొట్టమొదటి కుమారుడవు, నా బలం నీవు.
పురుషునిగా నా శక్తికి మొదటి ఋజువు నీవే.
నా కుమారులందరిలోను గౌరవించదగినవాడివి, మహా బలశాలివి నీవు.
4 కానీ నీవు ఉద్రేకంతో అదుపుదప్పిన ప్రవాహం వలే ఉన్నావు,
కాబట్టి నీవు ఎక్కువ గౌరవించదగిన నా కుమారుడవు కావు
నీ తండ్రి పడకను నీవు ఎక్కావు.
నీ తండ్రి భార్యలలో ఒకదానితో నీవు శయనించావు
నీవు నా పడకకు అవమానం తెచ్చావు,
ఆ పడకపై నీవు శయనించావు.
5 “షిమ్యోను, లేవీ సోదరులు.
తమ ఖడ్గములతో పోరాడటం అంటే వారికి ప్రీతి.
6 రహస్యమందు వారు చెడు కార్యాలను తలస్తారు.
వారి పథకాలలో నా ఆత్మ భాగాన్ని కోరటం లేదు,
వారి రహస్య సమావేశాలను నేను అంగీకరించను,
వారు వారి పగవారిని కోపంతో చంపారు. వారు కేవలం సరదాలకు పశువులకు హాని చేశారు.
7 వారి కోపం శాపం, అది చాల బలీయమయింది.
వారికి కోపం వచ్చినప్పుడు వారు చాలా క్రూరులు.
యాకోబు దేశంలో వారి వంశాలకు వారి స్వంత భూమి వారికి ఉండదు.
ఇశ్రాయేలు అంతటిలో వారు చెదరి ఉంటారు.
8 “యూదా, నీ సోదరులు నిన్ను పొగడుదురు.
నీవు నీ శత్రువులను ఓడిస్తావు.
నీ సోదరులు నీకు సాగిలపడ్తారు.
9 యూదా సింహంలాంటివాడు. కుమారుడా,
తాను చంపిన జంతువు దగ్గర నిలిచిన సింహం వంటి వాడవు నీవు.
యూదా సింహంవంటి వాడు. అతడు విశ్రాంతికోసం పండుకొంటాడు.
అతణ్ణి లేపుటకు ఎవరూ సాహసించరు.
10 యూదా వంశపు పురుషులు రాజులుగా ఉంటారు.
అతని కుటుంబం పరిపాలిస్తుంది అనే సూచన
అసలైన రాజు వచ్చేంతవరకు[a] అతని కుటుంబాన్ని విడువదు.
అప్పుడు అనేక మంది అతనికి విధేయులై అతణ్ణి సేవిస్తారు.
11 అతడు ద్రాక్షావల్లికి తన గాడిదను కట్టివేస్తాడు[b] శ్రేష్ఠమైన ద్రాక్షావల్లికి అతడు తన గాడిద పిల్లను కట్టివేస్తాడు.
అతడు తన బట్టలు ఉదుకుటకు శ్రేష్ఠమైన ద్రాక్షారసాన్ని ఉపయోగిస్తాడు.
12 ద్రాక్షారసం త్రాగి అతని కళ్లు ఎరుపెక్కి ఉంటాయి.
పాలు త్రాగి అతని పళ్లు తెల్లగా ఉంటాయి.
13 “జెబూలూను సముద్రానికి సమీపంగా జీవిస్తాడు.
అతని తీరం ఓడలకు క్షేమ స్థలంగా ఉంటుంది.
అతని భూమి సీదోను వరకు విస్తరిస్తుంది.
14 “ఇశ్శాఖారు చాలా ప్రయాసపడిన గాడిదల వలె ఉంటాడు.
భారమైన బరువు మోసినందుచేత అతడు పండుకొని ఉంటాడు.
15 అతడు తన విశ్రాంతి స్థలం మంచిదిగా ఉండేటట్లు చూసుకొంటాడు
తన భూమి రమ్యమైనదిగా ఉండేటట్లు అతడు చూసుకొంటాడు.
తర్వాత అతడు బరువులు మోయుటకు ఒప్పుకొంటాడు.
బానిసగా పని చేసేందుకు అతడు ఒప్పుకొంటాడు.
16 “ఇతర ఇశ్రాయేలు వంశస్థుల్లాగే దాను
తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు.
17 దారి ప్రక్కన ఉండే పామువలె దాను ఉండునుగాక.
త్రోవ దగ్గర పొంచి ఉండే కట్లపామువలె అతడు ఉండుగాక.
ఆ పాము గుర్రపు మడిమెను కాటు వేస్తుంది.
ఆ గుర్రంమీద స్వారీ చేసే మనిషి గుర్రం మీదనుండి పడిపోతాడు.
18 “యెహోవా, నీ రక్షణకోసం నేను కనిపెట్టుకొని ఉన్నాను.
19 “దొంగల గుంపు గాదు మీద పడ్తారు.
కానీ గాదు వారిని తరిమివేస్తాడు.”
20 “ఆషేరు భూమి మంచి ఆహారాన్ని సమృధ్ధిగా పండిస్తుంది
ఒక రాజుకు సరిపోయేలాంటి భోజనం అతనికి ఉంటుంది.”
21 “స్వేచ్ఛగా పరుగులెత్తే లేడివంటివాడు నఫ్తాలి.
అతని మాటలు విన సొంపుగా ఉంటాయి.”
22 “యోసేపు చాలా విజయశాలి.
నీళ్ల ఊట దగ్గర ఎదిగే ద్రాక్షావల్లిలా,
కంచెమీద అల్లుకొనే ద్రాక్షా తీగెలా అతడు ఫలిస్తాడు.
23 చాలామంది అతనిమీద ఎదురు తిరిగి అతనితో పోరాడారు.
బాణాలు పట్టుకొనేవారు అతనికి శత్రువులయ్యారు.
24 అయితే తన మహత్తర విల్లుతోను, నైపుణ్యంగల తన చేతులతోను
అతడు పోరాటం గెల్చాడు.
తన శక్తిని యాకోబు యొక్క శక్తిమంతుని నుండి
గొర్రెల కాపరినుండి, ఇశ్రాయేలు బండనుండి
25 నీకు సహాయకుడైన నీ తండ్రి దేవునినుండి అతడు పొందుతాడు.
“సర్వశక్తిమంతుడగు దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక!
పైన ఆకాశంనుండి ఆశీర్వాదములను, అగాధ స్థలములనుండి ఆశీర్వాదములను
ఆయన నీకు అనుగ్రహించునుగాక.
స్తనముల దీవెనలు, గర్భపు దీవెనలు ఆయన నీకు ఇచ్చునుగాక.
26 నా తల్లిదండ్రులకు ఎన్నెన్నో మేళ్లు జరిగాయి.
మరియు నీ తండ్రినైన నేను అంతకంటె ఎక్కువగ ఆశీర్వదించబడ్డాను.
నీ సోదరులు నీకు ఏమీ లేకుండా నిన్ను విడిచిపెట్టారు.
అయితే ఇప్పుడు నా ఆశీర్వాదములన్నీ
కొండంత ఎత్తుగా నీమీద క్రుమ్మరించబడతాయి.”
27 “బెన్యామీను ఆకలిగొన్న తోడేలు వంటివాడు.
ఉదయాన అతడు చంపుకొని తింటాడు.
మిగిలిన దానిని అతడు సాయంకాలం పంచుకొంటాడు.”
28 ఇవి ఇశ్రాయేలు పండ్రెండు కుటుంబాలు. మరియు వారి తండ్రి వారితో చెప్పిన విషయాలు ఇవి. వారిలో ప్రతి కుమారునికి తగిన ఆశీర్వాదం అతడు వారికి ఇచ్చాడు. 29 తర్వాత ఇశ్రాయేలు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అతడు ఇలా చెప్పాడు, “నేను మరణించినప్పుడు నా ప్రజలతో ఉండాలని నేను కోరుచున్నాను. హిత్తీయుడగు ఎఫ్రోను పొలంలోని గుహలో నా పూర్వీకులతో బాటు పాతిపెట్టబడాలని కోరుతున్నాను. 30 ఆ గుహ మమ్రే దగ్గర మక్ఫేలా పొలంలో ఉంది. అది కనాను దేశంలో ఉంది. అబ్రాహాము తనను పాతిపెట్టేందుకు స్థలం ఉండాలని ఎఫ్రోను దగ్గర ఆ భూమిని కొన్నాడు. 31 అబ్రాహాము, అతని భార్య శారా ఆ గుహలోనే పాతిపెట్టబడ్డారు. ఇస్సాకు, అతని భార్య రిబ్కా ఆ గుహలోనే పాతిపెట్టబడ్డారు. నా భార్య లేయాను నేను ఆ గుహలోనే పాతిపెట్టాను. 32 హిత్తీ మనుష్యుల దగ్గర కొన్న పొలంలో ఉంది ఆ గుహ.” 33 యాకోబు తన కుమారులతో మాట్లాడటం ముగించిన తర్వాత అతడు పండుకొని, పడకమీద తన కాళ్లు చాపుకొని మరణించాడు.
క్రైస్తవుల మధ్య వివాదాలు
6 ఒకవేళ మీ మధ్య తగువులొస్తే, మన సంఘంలో ఉన్న పవిత్రుల దగ్గరకు వెళ్ళాలి కాని, సంఘానికి చెందనివాళ్ళ దగ్గరకు వెళ్ళేందుకు మీ కెంత ధైర్యం? 2 పవిత్రులు ప్రపంచం మీద తీర్పు చెపుతారన్న విషయం మీకు తెలియదా? మీరు ప్రపంచంమీద తీర్పు చెప్పగలిగినప్పుడు, సాధారణమైన విషయాలపై తీర్పు చెప్పే స్తోమత మీలో లేదా? 3 మనము దేవదూతల మీద కూడా తీర్పు చెపుతామన్న విషయం మీకు తెలియదా? అలాంటప్పుడు ఈ జీవితానికి సంబంధించిన విషయాలు ఏ పాటివి? 4 మీ మధ్య వివాదాలొస్తే, సంఘం లెక్కచెయ్యనివాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళను న్యాయం చెప్పమంటారా? 5 సిగ్గుచేటు! సోదరుల మధ్య కలిగే తగువులు తీర్చగలవాడు మీలో ఒక్కడు కూడా లేడా? 6 సంఘానికి చెందినవాని దగ్గరకు వెళ్ళకుండా ఒక సోదరుడు మరొక సోదరునిపై నేరారోపణ చేయటానికి న్యాయస్థానానికి వెళ్ళుతున్నాడు. అంటే సంఘానికి చెందనివాళ్ళను అడుగుతున్నాడన్న మాట.
7 మీ మధ్య వ్యాజ్యాలు ఉండటం వల్ల మీరు పూర్తిగా ఓడిపొయ్యారని చెప్పవచ్చు. వ్యాజ్యాలు పెట్టు కోవటంకన్నా అన్యాయం సహించటం, మోసపోవటం మంచిది. 8 దానికి మారుగా మీరే అన్యాయాలు, మోసాలు చేస్తున్నారు. ఇతరులను కాక, మీ సోదరులనే మోసం చేస్తున్నారు.
9 దుష్టులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోకండి. లైంగిక విషయాల్లో అవినీతిగా జీవించేవాళ్ళకు, విగ్రహారాధికులకు, వ్యభిచారులకు, మగ వేశ్యలు, మగవాళ్ళతో మగవాళ్ళు, ఆడవాళ్ళతో ఆడవాళ్ళు తమ కామాన్ని తీర్చుకొనే వాళ్ళకు, 10 దొంగలకు, దురాశాపరులకు, త్రాగుబోతులకు, అపవాదాలు లేవదీసేవాళ్ళకు, మోసగాళ్ళకు, దేవుని రాజ్యం దొరకదు. 11 మీలో కొందరు ఆ విధంగా జీవించారు. కాని దేవుడు మీ పాపాలు కడిగివేశాడు. కనుక మీరు పవిత్రంగా ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువు పేరిట మన దేవుని ఆత్మ ద్వారా మీరు నిర్దోషులుగా పరిగణింపబడ్డారు.
© 1997 Bible League International