Revised Common Lectionary (Semicontinuous)
దావీదు యాత్ర కీర్తనల్లో ఒకటి.
133 సహోదరులు ఐక్యంగా శాంతి కలిగి జీవించటం
ఎంతో మంచిది, ఎంతో ఆనందం.
2 అది యాజకుని తలమీద పోయబడిన కమ్మని వాసనగల తైలంలాగా ఉంటుంది. అది అహరోను గడ్డం మీదికి కారుతున్న తైలంలాగా ఉంటుంది.
అది అహరోను ప్రత్యేక వస్త్రాల మీదికి కారుతున్న తైలంలాగ ఉంటుంది.
3 అది హెర్మోను పర్వతం మీద నుండి సీయోను కొండమీద పడుతున్న మంచులా ఉంటుంది.
సీయోను వద్దనే యెహోవా తన ఆశీర్వాదం ఇచ్చాడు. శాశ్వతజీవాన్ని ఆశీర్వాదంగా యెహోవా ఇచ్చాడు.
37 ఇది చాలా చక్కని తలంపులా కనబడింది ఫరోకు. అతని సేవకులంతా ఒప్పుకొన్నారు. 38 “ఈ పని చేసేందుకు యోసేపు కంటే మంచివాడ్ని ఇంకెవరినైనా మీరు కనుగొనగలరా? దేవుని ఆత్మ మూలంగా ఇతడు నిజంగా జ్ఞాని” అని ఫరో తన సేవకులతో చెప్పాడు.
39 కనుక ఫరో, “వీటన్నింటిని దేవుడే నీకు చూపెట్టాడు కనుక నీవు అందరిలో మహా జ్ఞానివై ఉండాలి. 40 అంచేత నిన్నే ఈ దేశం మీద అధిపతిగా నేను చేస్తాను. ప్రజలు నీ ఆజ్ఞలన్నింటికి విధేయులవుతారు. ఈ దేశంలో నేను ఒక్కడ్ని మాత్రమే నీకంటె గొప్ప అధికారిగా ఉంటాను” అని యోసేపుతో చెప్పాడు.
41 (ఫరో యోసేపును రాజ్యపాలకునిగా నియమించినప్పుడు ప్రత్యేక సమావేశం మరియు ఊరేగింపు ఉండినవి.) అప్పుడు ఫరో, “ఇప్పుడు ఈజిప్టు దేశం అంతటి మీద నిన్ను నేను పాలకునిగా నియమిస్తున్నాను” అని యోసేపుతో చెప్పాడు. 42 అప్పుడు ఫరో రాజముద్రగల తన ఉంగరాన్ని యోసేపుకు ఇచ్చాడు. యోసేపు ధరించటానికి నాణ్యతగల ఒక అంగీని అతడు ఇచ్చాడు. యోసేపు మెడలో ఒక బంగారు గొలుసు ఫరో వేశాడు. 43 రెండో రాజరథం మీద తిరగమని ఫరో యోసేపుతో చెప్పాడు. ప్రత్యేక సంరక్షకులు అతని రథానికి ముందర నడిచారు. “ప్రజలారా, యోసేపుకు సాష్టాంగపడండి” అంటూ వాళ్లు ప్రజలను హెచ్చరించారు. కనుక ఈజిప్టు దేశం అంతటి మీద యోసేపు పాలకునిగా నియమించబడ్డాడు.
44 అతనితో ఫరో అన్నాడు: “నేను ఫరోను అంటే రాజును. కనుక నేను ఏమి అయినా చేయాలనుకొంటే అది చేస్తాను. కానీ, ఈజిప్టులో మరి ఏ వ్యక్తి అయినా నీవు చెప్పకుండ ఒక చేయి ఎత్తకూడదు, కాలు కదపగూడదు.”
45 ఫరో యోసేపుకు జప్నత్పనేహు అనే మరో పేరు పెట్టాడు. ఓను యాజకుడు పోతీఫెర కుమార్తె ఆసెనతును యోసేపుకు భార్యగా ఫరో ఇచ్చాడు. కనుక ఈజిప్టు దేశం అంతటిమీద యోసేపు పాలకుడయ్యాడు.
46 యోసేపు ఈజిప్టు రాజు కొలువులో పని చేయడం మొదలు బెట్టినప్పుడు అతని వయస్సు 30 సంవత్సరాలు. యోసేపు ఈజిప్టు దేశం అంతటా సంచారం చేశాడు. 47 ఏడు మంచి సంవత్సరాల కాలంలోనూ దేశంలో పంటలు బాగుగా పండాయి. 48 ఆ ఏడు సంవత్సరాల్లో యోసేపు చాలా ధాన్యం ఈజిప్టులో పొదుపు చేశాడు. ఆహారాన్ని యోసేపు పట్టణాల్లో భద్రపరచాడు. ప్రతి పట్టణం చుట్టు ప్రక్కల పండిన పంటను ఆ పట్టణంలోనే యోసేపు భద్రపరచాడు. 49 యోసేపు విస్తారంగా ధాన్యం చేర్చి పెట్టాడు. సముద్రపు ఇసుకలా ఉంది అదంతాను. కొలిచేందుకు గూడ వీలు లేనంత విస్తారంగా ఉంది అతడు చేర్చిపెట్టిన ధాన్యం.
50 ఓను యాజకుడైన పోతీఫెర కుమార్తె అయిన ఆసెనతు యోసేపుకు భార్య. మొదటి ఆకలి సంవత్సరం రాకముందే యోసేపు ఆసెనెతులకు ఇద్దరు కుమారులు పుట్టారు. 51 మొదటి కుమారుని పేరు మనష్షే. “నా కష్టాలు అన్నింటినీ, నా ఇంటిని గూర్చిన విషయాలన్నింటినీ నేను మరచిపోయేటట్టు దేవుడు చేశాడు” అని అనుకొన్నాడు గనుక యోసేపు అతనికి ఈ పేరు పెట్టాడు. 52 యోసేపు తన రెండవ కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. “నాకు ఎన్నో గొప్ప కష్టాలు వచ్చాయి, కాని అన్ని విషయాల్లో దేవుడు నాకు సాఫల్యాన్ని కార్యసాధనను కల్గించాడు” అని యోసేపు అనుకొన్నాడు గనుక యోసేపు అతనికి ఈ పేరు పెట్టాడు.
కరువు మొదలవుట
53 ఏడు సంవత్సరాల పాటు ప్రజలు తినేందుకు అవసరమైన ఆహారం అంతా వారికి ఉండినది. కానీ ఆ సంవత్సరాలు ముగిశాయి. 54 తరువాత సరిగ్గా యోసేపు చెప్పినట్లే ఏడు సంవత్సరాల ఆకలి కాలం మొదలయింది. ఆ ప్రాంతల్లోని దేశాలలో ఎక్కడేగాని ఏ ఆహారం పండలేదు. తినుటకు ప్రజలకు ఏమీ లేదు. కానీ యోసేపు ధాన్యం భద్రపరచినందువల్ల ఈజిప్టులో ప్రజలు తినుటకు సమృద్ధిగా ఉంది. 55 కరువు కాలం ప్రారంభం కాగానే ఆహారంకోసం ప్రజలు ఫరోకు మొరపెట్టారు. ఫరో ఈజిప్టు ప్రజలతో, “యోసేపును అడగండి. అతడు ఏమి చేయమంటే అలా చేయండి” అని చెప్పాడు.
56 కనుక ఆ దేశంలో ఎక్కడ చూసినా కరవు ప్రబలుతున్నప్పుడు, ధాన్యము భద్రపరచిన గదులలో నుండి యోసేపు ప్రజలకు ధాన్యం ఇచ్చాడు. చేర్చిపెట్టిన ధాన్యం ఈజిప్టు ప్రజలకు యోసేపు విక్రయించాడు. ఈజిప్టులో కరవు చాలా భయంకరంగా ఉంది. 57 మరియు ప్రాంతాలలోను కరవు తీవ్రంగానే ఉంది. కనుక ఇతర ఈజిప్టు చుట్టుప్రక్కల దేశాల ప్రజలంతా ధాన్యం కొనేందుకు ఈజిప్టులో ఉన్న యోసేపు దగ్గరకు రావలసి వచ్చింది.
19 కాని కొందరు యూదులు అంతియొకయ, ఈకొనియ పట్టణాలనుండి వచ్చి ప్రజల్ని తమవైపు మళ్ళించుకొన్నారు. అంతా కలిసి పౌలు మీద రాళ్ళు విసిరారు. అతడు చనిపోయాడనుకొని అతణ్ణి ఊరి బయట పారవేసారు. 20 శిష్యులు అతని చుట్టూ చేరారు. ఆ తదుపరి అతడు లేచి మళ్ళీ పట్టణంలోకి వెళ్ళాడు. మరుసటి రోజు అతడు బర్నబాను కలుసుకొన్నాడు. ఇద్దరూ కలిసి దెర్బే అనే పట్టణానికి ప్రయాణమయ్యారు.
పిసిదియ ప్రాంత సేవను బలపర్చటం
21 ఆ పట్టణంలో సువార్తను ప్రకటించి చాలామందిని శిష్యులుగా చేసుకొన్నారు. లుస్త్ర, ఈకొనియ, అంతియొకయ పట్టణాలకు తిరిగి వచ్చారు. 22 శిష్యుల్ని ఆత్మీయంగా బలపరుస్తూ భక్తి వదలకుండా ఉండమని ఉత్సాహం కలిగే మాటలు చెప్పారు. “దేవుని రాజ్యంలోకి ప్రవేశించటానికి మనం ఎన్నో కష్టాలనుభవించాలి” అని వాళ్ళు అన్నారు. 23 పౌలు, బర్నబా కలిసి ప్రతి సంఘానికి కొందరు పెద్దల్ని నియమించారు. ఈ పెద్దలు ఇంతకు క్రితమే ప్రభువును విశ్వసించినవాళ్ళు కనుక పౌలు, బర్నబా ప్రార్థనలు, ఉపవాసాలు చేసి వాళ్ళను ప్రభువుకు అప్పగించారు.
24 ఆ తదుపరి పిసిదియ ప్రాంతాలకు వెళ్ళి అక్కడనుండి పంఫూలియ చేరుకొన్నారు. 25 పెర్గేలో సందేశాన్ని ప్రకటించి అక్కడినుండి అత్తాలియకు వెళ్ళారు. 26 అత్తాలియనుండి అంతియొకయకు తిరిగి ప్రయాణమయ్యారు. ప్రస్తుతం ముగించిన దైవ కార్యాన్ని చేయటానికి దైవానుగ్రహం కలగాలని దీవించి వీళ్ళను దేవునికి అప్పగించింది యిక్కడే.
సిరియా అంతియొకయకు తిరిగి రావటం
27 అంతియొకయకు వచ్చాక సంఘాన్ని పిలిచి దేవుడు తమ ద్వారా చేసినవన్నీ చెప్పారు. యూదులు కానివాళ్ళు కూడా తనను నమ్మేటట్లు దేవుడు ద్వారాలను ఏ విధంగా తెరిచాడో చెప్పారు. 28 వాళ్ళు అక్కడున్న శిష్యులతో చాలా కాలం గడిపారు.
© 1997 Bible League International