Revised Common Lectionary (Semicontinuous)
దావీదు యాత్ర కీర్తనల్లో ఒకటి.
133 సహోదరులు ఐక్యంగా శాంతి కలిగి జీవించటం
ఎంతో మంచిది, ఎంతో ఆనందం.
2 అది యాజకుని తలమీద పోయబడిన కమ్మని వాసనగల తైలంలాగా ఉంటుంది. అది అహరోను గడ్డం మీదికి కారుతున్న తైలంలాగా ఉంటుంది.
అది అహరోను ప్రత్యేక వస్త్రాల మీదికి కారుతున్న తైలంలాగ ఉంటుంది.
3 అది హెర్మోను పర్వతం మీద నుండి సీయోను కొండమీద పడుతున్న మంచులా ఉంటుంది.
సీయోను వద్దనే యెహోవా తన ఆశీర్వాదం ఇచ్చాడు. శాశ్వతజీవాన్ని ఆశీర్వాదంగా యెహోవా ఇచ్చాడు.
కలల భావం చెప్పేందుకు యోసేపును పిలిపించుట
14 కనుక ఫరో చెరసాలలోనుంచి యోసేపును పిలిపించాడు. సంరక్షకులు వెంటనే యోసేపును చెరసాలలోనుంచి తీసుకొని వచ్చారు. యోసేపు క్షౌరం చేసుకొని, శుభ్రమైన బట్టలు వేసుకొన్నాడు. అప్పుడు అతడు వెళ్లి ఫరో ముందర నిలవబడ్డాడు. 15 అప్పుడు ఫరో “నాకో కల వచ్చింది, అయితే ఆ కలను నాకు వివరించగల వాళ్లు ఒక్కళ్లూ లేరు. ఎవరైనా వారి కల నీతో చెబితే నీవు వాటిని వివరించి, భావంకూడ చెప్పగలవని నేను విన్నాను” అని యోసేపుతో అన్నాడు.
16 యోసేపు, “కలలను గ్రహించటంలో నా నైపుణ్యం ఏమీ లేదు. ఆ శక్తి దేవుడికే ఉంది. కనుక దేవుడే ఫరోకు కూడ ఈ పని చేసి పెడ్తాడు” అని జవాబిచ్చాడు.
17 అప్పుడు ఫరో యోసేపుతో చెప్పాడు: “నా కలలో నేను నైలునది ప్రక్కగా నిలబడ్డాను. 18 ఆ నదిలోనుంచి ఏడు ఆవులు బయటకు వచ్చి గడ్డి మేయటం నేను చూశాను. ఈ ఆవులు బలిసి, అందంగా ఉన్నాయి. 19 అప్పుడు మరో ఏడు ఆవులు నదిలో నుంచి రావటం నేను చూశాను. ఈ ఆవులు బక్కచిక్కి రోగిష్ఠివిగా ఉన్నాయి. ఈజిప్టు దేశం మొత్తంలో నేను చూసిన ఆవుల్లో అవి పరమ అసహ్యంగా ఉన్నాయి. 20 అసహ్యమైన ఈ ఏడు ఆవులు ముందు వచ్చిన అందమైన ఏడు ఆవులను తినివేశాయి. 21 అయితే ఆ ఏడు ఆవులను తినివేసిన తర్వాత కూడ అవి ఇంకా బక్కచిక్కి ఉన్నాయి. వాటిని చూస్తే, అవి ఏడు ఆవులను తిన్న వాటిల్లాగ అగుపించవు. ముందు అవి ఎంత బక్కగా అసహ్యంగా ఉన్నాయో యిప్పుడూ అలానే కనబడ్డాయి. అప్పుడు నేను మేల్కొన్నాను.
22 “తర్వాత నాకు వచ్చిన మరో కలలో ఒకే ధాన్యపు మొక్కకు ఏడు వెన్నులు పెరగటం నేను చూశాను. ఆ వెన్నులు నిండుగా, చక్కగా, అందంగా ఉన్నాయి. 23 తర్వాత వాటికి యింకా ఏడు వెన్నులు పెరిగాయి. కానీ ఆ వెన్నులు పీలగా, అసహ్యంగా ఉండి, వేడి గాడ్పులకు పాడైపోయాయి. 24 అప్పుడు ఏడు మంచి వెన్నులను పీల వెన్నులు తినివేశాయి.
“మంత్రాలు తెలిసిన నా మనుష్యులకు, విద్వాంసులకు నేను ఈ కల చెప్పాను. కానీ ఎవ్వరూ ఆ కలను వివరించలేక పోతున్నారు. ఏమిటి దీని భావం?”
కల భావం యోసేపు వివరించుట
25 అప్పుడు ఫరోతో యోసేపు ఇలా చెప్పాడు: “ఈ రెండు కలల భావం ఒక్కటే. ఏమి చేయనున్నాడో అది దేవుడు మీతో చెబుతున్నాడు. 26 ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరాలు. ఏడు మంచి ధాన్యపు వెన్నులు ఏడు సంవత్సరాలు. రెండు కలల్లోని సంగతి ఒక్కటే. 27 బక్కచిక్కి ఉన్న ఆవులు ఏడు, పీలగా ఉన్న ధాన్యపు వెన్నులు కూడ ఏడు. అంటే, అవి ఈ దేశంలో ఏడు ఆకలి సంవత్సరాలు. ఏడు మంచి సంవత్సరాల తర్వాత ఈ ఏడు సంవత్సరాలు వస్తాయి. 28 త్వరలో ఏమి జరుగుతుందో దాన్ని దేవుడు మీకు చూపెట్టాడు. నేను చెప్పినట్టే ఇది జరుగుతుంది. 29 ఈజిప్టు దేశమంతటా ఏడేళ్లపాటు మంచి పంటలు పండి, తినటానికి సమృద్ధిగా ఉంటుంది. 30 అయితే ఆ ఏడు సంవత్సరాల తర్వాత, దేశమంతటా కరవు సంవత్సరాలు ఏడు వస్తాయి. ఈజిప్టులో పండిన పంట ఎంత అయినా, దానిని మరచిపోతారు. ఈ ఆకలి దేశాన్ని నాశనం చేస్తుంది. 31 సమృద్ధిగా భోజనం చేయటం అంటే ఏమిటో ప్రజలు మరచిపోతారు.
32 “ఫరోగారూ, ఒకే విషయాన్ని గూర్చి మీకు రెండు కలలు ఎందుకు వచ్చాయి? దేవుడు తప్పక జరిపిస్తాడని చూపించేందుకు ఇలా జరిగింది. అదీ త్వరలోనే దేవుడు జరిగిస్తాడని సూచిస్తోంది. 33 కనుక ఓ ఫరో, చాలా తెలివి, జ్ఞానం ఉన్న ఒక మనిషిని మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఆ మనిషిని ఈజిప్టు దేశం అంతటిమీద అధికారిగా మీరు నియమించాలి. 34 ఆ తర్వాత ప్రజల దగ్గర్నుండి ధాన్యం సేకరించేందుకు మరి కొందర్ని మీరు నియమించాలి. ప్రతీ వ్యక్తి ఏడు మంచి సంవత్సరాల్లో పండించే మంచి పంటలో అయిదవ భాగం ఇవ్వాలి. 35 రాబోయే మంచి సంవత్సరాల కాలంలో ఈ ధాన్యం అంతా సేకరించమని ఈ మనుష్యులకు ఆజ్ఞాపించండి. ఈ ధాన్యం పట్టణాల్లో భద్రం చేయటానికి వాళ్లకు అధికారం ఉందని ఈ మనుష్యులకు చెప్పండి. తర్వాత ఆ ధాన్యం అవసరం వచ్చేంతవరకు వారు దాన్ని కాపాడాలి. ఫరో! ఈ విధంగా ఆ ఆహారం మీ అధీనంలో ఉంటుంది. 36 ఈజిప్టు దేశంలో వచ్చే ఏడు ఆకలి సంవత్సరాల్లో ఈ ధాన్యం సహాయపడుతుంది. అప్పుడు ఈజిప్టు ప్రజలు ఆ ఏడు సంవత్సరాల్లో కరువు కారణంగా మరణించరు.”
ఏడు తెగుళ్ళతో ఏడుగురు దూతలు
15 నేను పరలోకంలో యింకొక అద్భుతమైన దృశ్యం చూశాను. ఏడుగురు దూతలు ఏడు చివరి తెగుళ్ళు పట్టుకొని ఉండటం చూశాను. వీటితో దేవుని కోపం సమాప్తమౌతుంది. కనుక యివి చివరివి.
2 నిప్పుతో కలిసిన గాజు సముద్రం లాంటి ఒక సముద్రం నాకు కనిపించింది. మృగాన్ని, దాని విగ్రహాన్ని జయించినవాళ్ళు, దాని నామానికున్న సంఖ్యను జయించినవాళ్ళు సముద్రతీరం మీద నిలబడి ఉండటం చూసాను. వాళ్ళు తమ చేతుల్లో దేవుడుంచిన వీణల్ని పట్టుకొని ఉన్నారు. 3 దేవుని సేవకుడైన మోషే గీతాన్ని, గొఱ్ఱెపిల్ల గీతాన్ని వాళ్ళు ఈ విధంగా పాడుతూ ఉన్నారు:
“ప్రభూ! సర్వశక్తి సంపన్నుడవైన దైవమా!
నీ కార్యాలు గొప్పవి. అద్భుతమైనవి.
యుగయుగాలకు రాజువు నీవు.
నీ మార్గాలు సత్యసమ్మతమైనవి. న్యాయసమ్మతమైనవి.
4 ఓ ప్రభూ! నీకెవరు భయపడరు?
నీ నామాన్ని స్తుతించనివారెవరున్నారు?
నీ వొక్కడివే పరిశుద్ధుడవు.
నీ నీతికార్యాలు ప్రత్యక్షమైనవి.
కనుక ప్రజలందరూ వచ్చి నిన్ను ఆరాధిస్తారు.”
© 1997 Bible League International