Revised Common Lectionary (Semicontinuous)
దావీదు కీర్తన.
28 యెహోవా, నీవే నా బండవు.
సహాయం కోసం నేను నిన్ను పిలుస్తున్నాను.
నా ప్రార్థనలకు నీ చెవులు మూసుకోవద్దు.
సహాయంకోసం పిలుస్తున్న నా పిలుపుకు నీవు జవాబు ఇవ్వకపోతే
అప్పుడు నేను సమాధిలోనున్న శవాల్లాగే ఉంటాను.
2 యెహోవా, నీ అతి పవిత్ర స్థలం వైపు నేను నా చేతులు ఎత్తి, ప్రార్థిస్తున్నాను.
నేను నిన్ను వేడుకొన్నప్పుడు, నా మాట ఆలకించుము.
నా మీద దయ చూపించుము.
3 యెహోవా, నేను చెడ్డవాళ్లవలె ఉన్నానని తలంచవద్దు. చెడు కార్యాలు చేసే దుర్మార్గుల్లోకి నన్ను లాగకుము.
ఆ మనుష్యులు వారి పొరుగువారిని “షాలోం”[a] అని అభినందిస్తారు. కాని వారి హృదయాల్లో వారి పొరుగువారిని గూర్చి వారు చెడ్డ పథకాలు వేస్తున్నారు.
4 యెహోవా, ఆ మనుష్యులు ఇతరులకు కీడు చేస్తారు.
కనుక వారికి కూడ కీడు జరిగేటట్టుగా చేయుము.
ఆ చెడ్డవాళ్లు శిక్షించబడాల్సిన విధంగా వారిని శిక్షించుము.
5 యెహోవా చేసే మంచి పనులను చెడ్డవాళ్లు గ్రహించరు.
ఆయన చేసే మంచి వాటిని వారు చూడరు, అర్థం చేసుకోరు.
వారు నాశనం చేయటానికి ప్రయత్నిస్తారు.
6 యెహోవాను స్తుతించండి.
కరుణించుమని నేను చేసిన నా ప్రార్థన ఆయన విన్నాడు.
7 యెహోవా నా బలం, ఆయనే నా డాలు.
నేను ఆయనను నమ్ముకొన్నాను.
ఆయన నాకు సహాయం చేసాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను.
మరియు నేను ఆయనకు స్తుతి కీర్తనలు పాడుతాను.
8 యెహోవా తన ప్రజలకు బలమైయున్నాడు.
ఆయన ఏర్పాటు చేసుకొన్నవానికి[b] శక్తి, విజయాలను ఆయన ఇస్తాడు.
9 దేవా, నీ ప్రజలను రక్షించుము.
నీకు చెందిన ప్రజలను ఆశీర్వదించుము.
కాపరిలా వారిని నిత్యం నడిపించుము.
యోసేపును ఈజిప్టులో పోతీఫరుకు అమ్మివేయుట
39 యోసేపును కొన్న వ్యాపారవేత్తలు అతణ్ణి ఈజిప్టుకు తీసుకు వెళ్లారు. ఫరో సంరక్షకుల అధిపతి పోతీఫరుకు వారు అతన్ని అమ్మేసారు. 2 అయితే యెహోవా యోసేపుకు సహాయం చేశాడు గనుక యోసేపు విజయవంతుడు అయ్యాడు. తన యజమాని, ఈజిప్టు వాడైన పోతీఫరు ఇంటిలో యోసేపు నివాసం ఉన్నాడు.
3 యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నట్లు పోతీఫరు తెలుసుకొన్నాడు. యోసేపు చేసిన ప్రతి పనిలో యెహోవా అతనికి తోడుగా ఉన్నట్లు పోతీఫరు గ్రహించాడు. 4 అందుచేత యోసేపు విషయంలో పోతీఫరు చాల సంతోషించాడు. పోతీఫరు యోసేపును తనకు సహాయం చేయనిస్తూ, తన ఇంటి వ్యవహారాలన్నీ పర్యవేక్షింపనిచ్చాడు. పోతీఫరుకు ఉన్న సమస్తంమీద యోసేపు అధికారి. 5 ఆ ఇంటిమీద యోసేపు అధికారిగా చేయబడిన తర్వాత, యెహోవా ఆ ఇంటినీ, పోతీఫరుకు ఉన్న సమస్తాన్నీ ఆశీర్వదించాడు. ఇదంతా యోసేపునుబట్టే యెహోవా చేశాడు. పోతీఫరు పొలాల్లో పెరిగే వాటన్నిటినీ యెహోవా ఆశీర్వదించాడు. 6 కనుక పోతీఫరు తన ఇంటిలో అన్ని విషయాల బాధ్యత యోసేపునే తీసుకోనిచ్చాడు. పోతీఫరు తాను భుజించే భోజనం విషయం తప్ప మరి దేనిగూర్చీ చింతించలేదు.
పోతీఫరు భార్యను యోసేపు తిరస్కరించుట
యోసేపు చాలా అందగాడు. చూడ చక్కనివాడు. 7 కొన్నాళ్ల తర్వాత యోసేపు యజమాని భార్య యోసేపు మీద మోజుపడసాగింది. ఒకనాడు ఆమె, “నాతో శయనించు” అని అతనితో అంది.
8 కానీ యోసేపు నిరాకరించాడు. అతడు చెప్పాడు: “నా యజమాని తన ఇంటిలో అన్ని విషయాల్లోనూ నన్ను నమ్మాడు. ఇక్కడ ఉన్న ప్రతిదాని గూర్చి అతడు నాకు బాధ్యత పెట్టాడు. 9 నా యజమాని తన ఇంట నన్ను దాదాపుగా అతనికి సమానంగా ఉంచాడు. నేను అతని భార్యతో శయనించకూడదు. అది తప్పు. అది దేవునికి వ్యతిరేకంగా పాపం.”
10 ఆమె ప్రతిరోజూ యోసేపుతో మాట్లాడుతున్నప్పటికీ యోసేపు ఆమెతో శయనించేందుకు నిరాకరించాడు. 11 ఒక రోజు యోసేపు తన పని చేసుకొనేందుకని ఇంటిలోనికి వెళ్లాడు. ఆ సమయంలో అతను ఒక్కడే ఇంటిలో ఉన్నాడు. 12 అతని యజమాని భార్య అతని అంగీ పట్టి లాగి, “వచ్చి నాతో శయనించు” అంది అతనితో. అయితే యోసేపు ఇంట్లోనుంచి బయటకు పారిపోయాడు. ఆ తొందరలో అతడు తన అంగీని ఆమె చేతిలోనే వదిలేశాడు.
13 యోసేపు అతని అంగీని తన చేతిలోనే విడిచి వెళ్లినట్లు ఆ స్త్రీ గమనించింది. జరిగినదాని విషయమై ఆమె అబద్ధం చెప్పాలని నిర్ణయించుకొంది. బయటకు పరుగెత్తింది. 14 ఆమె తన ఇంటిలో ఉన్న పురుషులను పిలిచింది. ఆమె అంది, “చూడండి, మనలను ఆట పట్టించటానికే ఈ హెబ్రీ బానిసను తెచ్చారు. ఇతడు లోనికి వచ్చి నన్ను బలవంతం చేయటానికి ప్రయత్నించాడు. కానీ నేను గట్టిగా కేక పెట్టేసరికి 15 అతను భయపడి పారిపోయాడు. అయితే అతని అంగీ నా దగ్గరే వదిలేసిపోయాడు.” 16 తన భర్త, అంటే యోసేపు యజమాని ఇంటికి వచ్చేంత వరకు ఆమె ఆ అంగీని ఉంచింది. 17 ఆమె తన భర్తతో అదే కథ చెప్పింది. ఆమె, “నీవు ఇక్కడికి తీసుకొని వచ్చిన ఈ హెబ్రీ బానిస నామీద పడటానికి ప్రయత్నం చేశాడు. 18 అయితే అతడు నా దగ్గరకు రాగానే నేను గట్టిగా కేక వేసాను. అతను పారిపోయాడు గాని అతడు తన అంగీని విడిచిపెట్టేశాడు” అని చెప్పింది.
19 యోసేపు యజమాని అతని భార్య చెప్పిందంతా విన్నాడు. అతనికి చాలా కోపం వచ్చింది. 20 రాజ ద్రోహులను బంధించే ఒక చెరసాల ఉంది. కనుక యోసేపును ఆ చెరసాలలో వేశాడు పోతీఫరు. యోసేపు అందులోనే ఉన్నాడు.
చెరసాలలో యోసేపు
21 అయితే యోసేపుకు యెహోవా తోడుగా ఉన్నాడు. యెహోవా యోసేపుకు తన దయను చూపెడ్తూనే ఉన్నాడు. కొన్నాళ్లయ్యేటప్పటికి చెరసాల కాపలాదారుల నాయకునికి యోసేపు అంటే ఇష్టం కలిగింది. 22 కాపలాదారుల అధిపతి ఖైదీలందరి మీద యోసేపును నాయకునిగా ఉంచాడు. యోసేపు వారికి నాయకుడు, అయినప్పటికీ వారు చేసిన పనులే అతడు కూడా చేశాడు. 23 చెరసాలలో ఉన్న ప్రతిదాని విషయంలోను ఆ కాపలాదారుల నాయకుడు యోసేపును నమ్మాడు. యెహోవా యోసేపుతో ఉన్నందుచేత ఇలా జరిగింది. యోసేపు చేసే ప్రతి పనిలో అతనికి కార్యసాధన కలిగేటట్లు యెహోవా యోసేపుకు సహాయం చేశాడు.
14 మరి, మనమేమనాలి? దేవుడు అన్యాయం చేసాడా? లేదు. 15 ఎందుకంటే ఆయన మోషేతో ఈ విధంగా అన్నాడు: “నాకిష్టం వచ్చిన వాళ్ళను కరుణిస్తాను, నాకిష్టం వచ్చిన వాళ్ళపై దయ చూపిస్తాను.”(A) 16 అందువల్ల ఇది మానవుని అభీష్టంపై కాని, లేక అతని శ్రమపై కాని ఆధారపడింది కాదు. ఇది దేవుని కనికరంపై ఆధారపడింది. 17 లేఖనము ఫరోతో ఈ విధంగా అంటుంది: “నీ ద్వారా నా శక్తి వ్యక్తం చెయ్యాలనీ, ప్రపంచమంతా నా పేరు ప్రకటింపబడాలనీ, నేను నిన్ను రాజుగా చేసాను.”(B) 18 అంటే, దేవుడు తనకిష్టమున్న వాళ్ళపై కనికరం చూపిస్తాడు, తనకిష్టమున్న వాళ్ళపై కఠినత్వం చూపిస్తాడు.
19 మీరు నాతో, “మరి, దేవుడు మమ్ముల్ని ఎందుకు ఇంకా నిందిస్తున్నాడు? ఆయన ఇష్టాన్ని ఎవరు కాదనగలరు?” అని అనవచ్చు. 20 కాని, ఓ మనిషీ! దేవునితో ఎదురు తిరిగి మాట్లాడటానికి నీవెవరవు? సృష్టింపబడింది సృష్టికర్తతో, “నన్నీవిధంగా ఎందుకు సృష్టించావు?” అని అడగవచ్చా? 21 కుమ్మరి ఒకే మట్టి ముద్దతో కొన్ని కుండల్ని మంచి పనులకోసం, మరి కొన్నిటిని మామూలుగా ఉపయోగించుకోవటానికి చేస్తాడు. అలా చెయ్యటానికి అతనికి అధికారం లేదా?
22 భవిష్యత్తులో దేవుడు తన కోపాన్ని చూపాలని, తన శక్తిని తెలియచెయ్యాలని, నాశనం చెయ్యతగిన దుర్మార్గుల పట్ల సహనం వహించాడంటే మనమేమనగలము? 23 దేవుడు తన తేజస్సులోని గొప్పతనాన్ని తెలియచెయ్యాలని తన మహిమను పంచుకోవటానికి దయతో ఇతర్లను సృష్టించాడంటే మనం ఏమనగలం? 24 యూదుల నుండే కాక, యూదులు కానివాళ్ళ నుండి కూడా దేవుడు ప్రజల్ని పిలిచాడు. ఆయన పిలిచింది మనల్నే. 25 హోషేయ గ్రంథంలో దేవుడు ఈ విధంగా చెప్పాడు:
“నా ప్రజలు కాని వాళ్ళను
నా ప్రజలని పిలుస్తాను.
నా ప్రియురాలు కాని జనాన్ని
నా ప్రియురాలా అని పిలుస్తాను.”(C)
26 “మీరు నా ప్రజలు కారు అని అన్న చోటనే మీరు సజీవంగా ఉండే దేవుని పుత్రులు అని అనటం సంభవిస్తుంది.”(D)
27 యెషయా ప్రవక్త ఇశ్రాయేలు వంశాన్ని గురించి ఇలా అన్నాడు:
“ఇశ్రాయేలు పుత్రుల సంఖ్య సముద్ర తీరంపై ఉన్న ఇసుక రేణువుల్లా ఉన్నా,
కొందరు మాత్రమే రక్షింపబడతారు.
28 ఎందుకంటే, ప్రపంచానికి విధించిన శిక్షను ప్రభువు త్వరలోనే నెరవేరుస్తాడు.”(E)
29 యెషయా జరుగుతుందని చెప్పినట్లు:
“సర్వ శక్తిసంపన్నుడైన ప్రభువు కొంత మందిని
మనకు వదిలి ఉండక పోయినట్లైతే
మనం సొదొమ ప్రజలవలే,
గొమొఱ్ఱా ప్రజలవలె ఉండే వాళ్ళం.”(F)
© 1997 Bible League International