Revised Common Lectionary (Semicontinuous)
దావీదు యాత్ర కీర్తన.
124 గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మనకు ఏమి జరిగి ఉండేదో?
ఇశ్రాయేలూ, నాకు జవాబు చెప్పుము.
2 గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మాకు ఏమి జరిగి ఉండేదో?
ప్రజలు మనమీద దాడి చేసినప్పుడు ఏమి జరిగి ఉండేదో?
3 అప్పుడు మన శత్రువులకు మన మీద కోపం వచ్చినప్పుడల్లా
వాళ్లు మనల్ని సజీవంగా మింగేసి ఉండేవాళ్లు.
4 అప్పుడు మన శత్రుసైన్యాలు మనల్ని కొట్టుకుపోయే ప్రవాహంలా,
మనల్ని ముంచివేసే నదిలా ఉండేవి.
5 అప్పుడు ఆ గర్విష్ఠులు నోటి వరకూ పొంగుతూ
మనల్ని ముంచి వేసే నీళ్లలా పొంగుతూ ఉండేవాళ్లు.
6 యెహోవాను స్తుతించండి. మన శత్రువులు
మనల్ని పట్టి చంపకుండునట్లు యెహోవా చేశాడు.
7 మనం వలలో పట్టబడి తర్వాత తప్పించుకొన్న పక్షిలా ఉన్నాము.
వల తెగిపోయింది. మనం తప్పించుకొన్నాము.
8 మనకు సహాయం యెహోవా దగ్గర నుండే వచ్చింది.
భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.
సోదరులు యోసేపుకు ఇంకా భయపడుట
15 యాకోబు మరణించిన తర్వాత యోసేపు సోదరులు దిగులుపడిపోయారు. చాలాకాలం క్రిందట వారు చేసినదాన్ని బట్టి యోసేపు ఇంకా వారిమీద కోపంగా ఉంటాడని వారు భయపడ్డారు. మనము చేసినదాని విషయంలో “బహుశాః యోసేపు మనల్ని ఇంకా ద్వేషించవచ్చు. మరియు మనం అతనికి చేసిన కీడంతటికి తిరిగి పగ తీర్చుకోవచ్చు” అని తమలో తాము అనుకొన్నారు. 16 కనుక ఆ సోదరులు యోసేపుకు ఈ సందేశం పంపించారు: “నీ తండ్రి చనిపోక ముందు మాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. 17 ‘యోసేపుకు వారు చేసిన కీడును దయతో క్షమించమని నేను అతణ్ణి బ్రతిమాలుతున్నానని యోసేపుతో చెప్పండి’ అని అతడు చెప్పాడు. కనుక యోసేపూ, మేము చేసిన తప్పు పనిని దయచేసి ఇప్పుడు క్షమించు. మేము నీ తండ్రి దేవుని దాసులం.”
యోసేపు సోదరులు చెప్పిన విషయాలు యోసేపుకు చాలా దుఃఖం కలిగించాయి, అతడు ఏడ్చేశాడు. 18 యోసేపు సోదరులు అతని దగ్గరకు వెళ్లి అతని ఎదుట సాగిలపడ్డారు. వారు “మేము నీకు దాసులం” అని చెప్పారు.
19 అప్పుడు యోసేపు, “భయపడకండి, నేనేం దేవుణ్ణి కాను. మిమ్మల్ని శిక్షించే హక్కు నాకు లేదు. 20 మీరు నాకు ఏదో కీడు చేయాలని తలపెట్టారు. కాని దేవుడు నిజంగా మంచి వాటిని తలపెట్టాడు. అనేకమంది ప్రజల ప్రాణాలు కాపాడుటకు నన్ను వాడుకోవటం దేవుని ఏర్పాటు. ఈ వేళ ఇంకా అదే ఆయన ఏర్పాటు. 21 కనుక భయపడవద్దు. నేను మీ కోసం, మీ పిల్లలకోసం జాగ్రత్త పుచ్చుకుంటాను” అని చెప్పాడు. యోసేపు తన సోదరులతో దయగా మాట్లాడాడు. ఆ సోదరులకు యిది నెమ్మది కలిగించింది.
22 యోసేపు తన తండ్రి కుటుంబంతో సహా ఈజిప్టులోనే జీవించటం కొనసాగించాడు. యోసేపు 110 సంవత్సరాల వయస్సులో చనిపోయాడు. 23 యోసేపు జీవించి ఉన్నప్పుడు, ఎఫ్రాయిముకు పిల్లలు, పిల్లల పిల్లలు పుట్టారు. మరియు అతని కుమారుడు మనష్షేకు మాకీరు అనే పేరుగల ఒక కొడుకు ఉన్నాడు. మాకీరు పిల్లలను చూచేంతవరకు యోసేపు జీవించాడు.
యోసేపు మరణం
24 యోసేపు మరణం దగ్గరపడినప్పుడు, అతడు, “నేను చనిపోవాల్సిన సమయం దాదాపు వచ్చేసింది. అయితే దేవుడు మిమ్మల్ని కాపాడుతాడని నాకు తెలుసు. ఆయన మిమ్మల్ని ఈ దేశంనుండి బయటకు తీసుకొని వెళ్తాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు” అని తన సోదరులతో చెప్పాడు.
25 అప్పుడు యోసేపు తన వాళ్లందర్నీ ఒక వాగ్దానం చెయ్యమని అడిగాడు. “దేవుడు మిమ్మల్ని ఆ నూతన దేశానికి నడిపించినప్పుడు, నా యెముకలను మీతో కూడ తీసుకొని వెళ్తామని నాకు వాగ్దానం చేయండి” అన్నాడు యోసేపు.
26 యోసేపు 110 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఈజిప్టులో మరణించాడు. వైద్యులు అతని శరీరాన్ని సమాధి చేసేందుకు సిద్ధంచేసి, ఈజిప్టులో సమాధి పెట్టెలో ఆ శరీరాన్ని ఉంచారు.
శిష్యులు యేసుని అపార్థము చేసికొనటం
(మార్కు 8:14-21)
5 శిష్యులు సరస్సు దాటి వెళ్ళే ముందు, తమ వెంటరొట్టెల్ని తీసుకు వెళ్ళటం మరచిపొయ్యారు. 6 యేసు వాళ్ళతో, “జాగ్రత్త! పరిసయ్యుల కారణంగా, సద్దూకయ్యుల కారణంగా కలిగే పులిసిన పిండి విషయంలో దూరంగా ఉండండి” అని అన్నాడు.
7 ఈ విషయాన్ని గురించి వారు తమలో తాము చర్చించుకొని, “మనం రొట్టెలు తేలేదని అలా అంటున్నాడు” అని అన్నారు.
8 వాళ్ళ చర్చ యేసుకు తెలిసింది. వాళ్ళతో, “మీలో దృఢవిశ్వాసం లేదు. రొట్టెలు లేవని మీలో మీరెందుకు చర్చించుకొంటున్నారు. 9 మీకింకా అర్థం కాలేదా? అయిదు వేల మందికి అయిదు రొట్టెల్ని పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరెన్ని గంపల నిండా నింపారో మీకు జ్ఞాపకం లేదా? 10 మరి ఏడు రొట్టెల్ని నాలుగు వేల మందికి పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరెన్ని గంపల నిండా నింపారో జ్ఞాపకం లేదా? 11 నేను రొట్టెల్ని గురించి మాట్లాడలేదని మీకెందుకు అర్ధం కావటం లేదు? పరిసయ్యుల కారణంగా, సద్దూకయ్యుల కారణంగా కలిగే దుష్ప్రభావానికి దూరంగా ఉండండి” అని అన్నాడు.
12 ఆయన రొట్టెలకు ఉపయోగించే పులుపు విషయంలో జాగ్రత్త పడమనటం లేదని, పరిసయ్యుల బోధన విషయంలో, సద్దూకయ్యుల బోధన విషయంలో జాగ్రత్త పడమంటున్నాడని అప్పుడు వాళ్ళకు అర్థమయింది.
© 1997 Bible League International