Revised Common Lectionary (Semicontinuous)
8 దేవుడు చేసే శక్తివంతమైన విషయాలకు భూమిమీద ప్రతి మనిషీ భయపడతాడు.
దేవా, నీవు సూర్యుని ఉదయింపజేసే, అస్తమింపజేసే ప్రతి చోటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
9 నీవు భూమిని గూర్చి శ్రద్ధ తీసుకొంటావు.
నీవు దానికి నీరు పోస్తావు, అది దాని పంటలు పండించేలా నీవు చేస్తావు.
దేవా, నీవు కాలువలను ఎల్లప్పుడూ నీళ్లతో నింపుతావు.
నీవు ఇలా చేసి పంటలు పండింపచేస్తావు.
10 దున్నబడిన భూమి మీద వర్షం కురిసేటట్టు నీవు చేస్తావు.
భూములను నీవు నీళ్లతో నానబెడతావు.
నేలను నీవు వర్షంతో మెత్తపరుస్తావు.
అప్పుడు నీవు మొలకలను ఎదిగింపచేస్తావు.
11 కొత్త సంవత్సరాన్ని మంచి పంటతో నీవు ప్రారంభింప చేస్తావు.
బండ్లను నీవు అనేక పంటలతో నింపుతావు.
12 అరణ్యము, కొండలు పచ్చగడ్డితో నిండిపోయాయి.
13 పచ్చిక బయళ్లు గొర్రెలతో నిండిపోయాయి.
లోయలు ధాన్యంతో నిండిపోయాయి.
పచ్చిక బయళ్లు, లోయలు సంతోషంతో పాడుతున్నట్లున్నాయి.
2 ఆ రాత్రి ఒక కలలో దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడాడు. “యాకోబూ, యాకోబూ” అన్నాడు దేవుడు.
“ఇదిగో ఇక్కడే ఉన్నాను” అని ఇశ్రాయేలు జవాబు ఇచ్చాడు.
3 అప్పుడు దేవుడు అన్నాడు: “నేను దేవుణ్ణి, నీ తండ్రి దేవుణ్ణి. ఈజిప్టు వెళ్లేందుకు భయపడకు. ఈజిప్టులో నిన్ను ఒక గొప్ప జనంగా నేను చేస్తాను. 4 నీతో కూడ నేను ఈజిప్టుకు వస్తాను. మళ్లీ నేనే నిన్ను ఈజిప్టునుండి బయటకు తీసుకొని వస్తాను. నీవు ఈజిప్టులో మరణిస్తావు, కాని యోసేపు నీతో ఉంటాడు. నీవు చనిపోయినప్పుడు అతని స్వంత చేతులే నీ కళ్లను మూస్తాయి.”
ఇశ్రాయేలు ఈజిప్టుకు వెళ్ళుట
5 అప్పుడు యాకోబు బెయేర్షెబా విడిచి, ఈజిప్టుకు ప్రయాణం చేశాడు. అతని కుమారులు, ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రిని, భార్యలను, తమ పిల్లలందరిని ఈజిప్టుకు తీసుకొని వచ్చారు. ఫరో పంపిన బండ్లలో వారు ప్రయాణం చేశారు. 6 తమ పశువులు, కనాను దేశంలో వారికి ఉన్నవి అన్నీ వారితోబాటు ఉన్నవి. కనుక ఇశ్రాయేలు తన పిల్లలందరితో, తన కుటుంబం అంతటితో కలిసి ఈజిప్టు వెళ్లాడు. 7 అతని కుమారులు అతని మనుమళ్లు, అతని కుమార్తెలు, అతని మనమరాళ్లు అతనితో ఉన్నారు. అతని కుటుంబం అంతా అతనితో కలిసి ఈజిప్టుకు వెళ్లారు.
యాకోబు (ఇశ్రాయేలు) కుటుంబం
8 ఇశ్రాయేలుతో కలిసి ఈజిప్టుకు వెళ్లిన అతని కుమారులు, కుటుంబము వాళ్ల పేర్లు:
రూబేను యాకోబుయొక్క మొదటి కుమారుడు. 9 రూబేను కుమారులు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.
10 షిమ్యోను కుమారులు; యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనానీ స్త్రీ కుమారుడు షావూలు.
11 లేవీ కుమారులు: గెర్షోను, కహాతు, మెరారీ.
12 యూదా కుమారులు: ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు. (ఏరు, ఓనాను కనానులో ఉన్నప్పుడే చనిపోయారు) పెరెసు కుమారులు: హెస్రోను, హామూలు,
13 ఇశ్శాఖారు కుమారులు: తోలా, పువ్యా, యోబు, షిమ్రోను.
14 జెబూలూను కుమారులు: సెరెదు, ఏలోను, యహలేలు.
15 రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను యాకోబు భార్య లేయా ద్వారా అతని కుమారులు. లేయా ఆ కుమారులను పద్దనరాములో కన్నది. ఆమె కుమార్తె దీనా కూడ ఉంది. ఈ కుటుంబంలో 33 మంది ఉన్నారు.
16 గాదు కుమారులు: సిప్యోను, హగ్గీ, షూనీ, ఎస్బోను, ఏరీ, అరోదీ, అరేలీ,
17 ఆషేరు కుమారులు: ఇమ్నా, ఇష్వా, ఇష్వి, బెరీయా, వారి సోదరి శెరహు. బెరీయా కుమారులు: హెబెరు, మల్కీయేలు.
18 వారంతా యాకోబుకు అతని భార్య లేయా సేవకురాలు జిల్ఫాద్వారా పుట్టిన కుమారులు. ఈ కుటుంబంలో 16 మంది ఉన్నారు.
19 మరియు అతని భార్య రాహేలు ద్వారా పుట్టిన కుమారుడు బెన్యామీను కూడ యాకోబుతో ఉన్నాడు. (యోసేపు కూడ రాహేలుకు పుట్టినవాడే కాని అతడు అప్పటికే ఈజిప్టులో ఉన్నాడు.)
20 ఈజిప్టులో యోసేపుకు ఇద్దరు కుమారులు: మనష్షే, ఎఫ్రాయిము. (ఓను పట్టణ యాజకుడు పోతీఫెర కుమార్తె ఆసెనతు యోసేపు భార్య).
21 బెన్యామీను కుమారులు: బెల, బేకెరు, అష్బేలు, గెరా, నయమాను, ఏహి, రోషు, ముప్పీము, హుప్పీము, అర్దు.
22 వారంతా యాకోబుకు అతని భార్య రాహేలు ద్వారా కలిగిన సంతానం. ఈ కుటుంబంలో 14 మంది ఉన్నారు.
23 దాను కుమారుడు: హుషీము
24 నఫ్తాలి కుమారులు: యహసేలు, గూనీ, యోసేరు, షల్లేము.
25 వారు యాకోబు, బిల్హాలకు పుట్టిన కుమారులు (రాహేలు సేవకురాలు బిల్హా). ఈ కుటుంబంలో 7 మంది ఉన్నారు.
26 ఇలా యాకోబు సంతానం ఈజిప్టుకు వెళ్లారు. యాకోబు మూలంగా కలిగిన పిల్లలు మొత్తం 66 మంది. (యాకోబు భార్యలు ఈ లెక్కలో లేరు). 27 మరియు యోసేపు ఇద్దరు కుమారులు కూడ ఉన్నారు. వారు ఈజిప్టులో పుట్టారు. కనుక ఈజిప్టులో యాకోబు కుటుంబంలో 70 మంది ఉన్నారు.
ఇశ్రాయేలు ఈజిప్టుకు వచ్చుట
28 యాకోబు మొదట యూదాను యోసేపు దగ్గరకు పంపించాడు. గోషెను దేశంలోని యోసేపు దగ్గరకు యూదా వెళ్లాడు. ఆ తర్వాత యాకోబు, అతని వాళ్లు ఆ దేశంలో ప్రవేశించారు. 29 యోసేపు తన తండ్రి వచ్చేస్తున్నాడని విన్నాడు. గోషెనులో తన తండ్రి ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు యోసేపు తన రథం సిద్ధం చేసుకొని బయల్దేరాడు. యోసేపు తన తండ్రిని చూడగానే అతని మెడమీద పడి కౌగిలించుకొని చాలాసేపు ఏడ్చాడు.
30 అప్పుడు ఇశ్రాయేలు, “ఇప్పుడు నేను మనశ్శాంతిగా మరణించవచ్చు, నీ ముఖం నేను చూశాను, నీవు ఇంకా బ్రతికే ఉన్నావని నేను చూడగలిగాను” అని యోసేపుతో చెప్పాడు.
31 తన సోదరులతోను, తన తండ్రి కుటుంబంతోను యోసేపు ఇలా చెప్పాడు: “నేను వెళ్లి మీరు వచ్చినట్లు ఫరోతో చెబుతాను. ఫరోతో నేను ఏమని చెబుతానంటే ‘నా అన్నలు, నా తండ్రి కుటుంబం కనాను దేశం విడిచి ఇక్కడ నా దగ్గరకు వచ్చారు. 32 ఈ నా కుటుంబం గొర్రెల కాపరుల కుటుంబం. నిత్యం వాళ్లు పశువుల్ని, మందల్ని కలిగి ఉండేవాళ్లు. వారి పశువుల్ని, వారికి కలిగిన అంతటిని వాళ్లతోబాటు వారు తెచ్చుకొన్నారు.’ 33 ఫరో మిమ్మల్ని పిలిచినప్పుడు మీరేం పని చేస్తారు? అని మిమ్మును అడుగుతాడు. 34 అప్పుడు మీరు ‘మేము గొర్రెల కాపరులం, మా జీవితకాలమంతా మా పశువుల్ని మేపుకొంటూ జీవించాం. మాకు ముందు మా పూర్వీకులు ఇలాగే జీవించారు’ అని చెప్పండి. అప్పుడు ఫరో మిమ్మును గోషెను దేశంలో జీవింపనిస్తాడు. గొర్రెల కాపరులంటే ఈజిప్టు ప్రజలకు యిష్టం లేదు, కనుక మీరు గోషెను దేశంలో ఉండవచ్చు.”
ఇశ్రాయేలు గోషెనులో స్థిరపడుట
47 యోసేపు ఫరో దగ్గరకు వెళ్లి, “నా తండ్రి, నా సోదరులు, వారి కుటుంబాలు మొత్తం ఇక్కడికి వచ్చారు. వారి పశువులు, కనాను దేశంలో వారికి కలిగినది మొత్తం వారితో తెచ్చుకొన్నారు. వారిప్పుడు గోషెనులో ఉన్నారు” అని చెప్పాడు. 2 యోసేపు తన సోదరులలో అయిదుగురిని తనతో కూడ ఫరో ఎదుటికి తీసుకొని వెళ్లాడు.
3 “మీ వృత్తి ఏమిటి?” అని ఫరో ఆ సోదరులను అడిగాడు.
ఆ సోదరులు ఫరోతో, “అయ్యా, మేము గొర్రెల కాపరులం. మాకు ముందున్న మా పూర్వీకులు కూడా గొర్రెల కాపరులే” అని చెప్పారు. 4 “కనాను దేశంలో కరవు కాలం చాలా దారుణంగా ఉంది. మా పశువులకు అవసరమైన గడ్డి ఉన్న పొలాలు ఎక్కడా లేవు. అందుచేత ఈ దేశంలో బ్రతుకుదామని మేము ఇక్కడికి వచ్చాం. మీరు దయచేసి మమ్మల్ని గోషెను దేశంలో ఉండనివ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం” అని వారు ఫరోతో చెప్పారు.
5 అప్పుడు యోసేపుతో ఫరో చెప్పాడు: “నీ తండ్రి, నీ సోదరులు నీ దగ్గరకు వచ్చారు. 6 వారు నివసించేందుకు ఈజిప్టులో ఏ స్థలమైనా సరే నీవు వారికోసం కోరుకోవచ్చు. నీ తండ్రికి, నీ సోదరులకు శ్రేష్ఠమైన భూమి ఇవ్వు. గోషెను దేశంలో వారిని ఉండనివ్వు. వారు నైపుణ్యంగల కాపరులైతే, వారు నా పశువులను కూడ చూసుకోవచ్చు.”
7 అప్పుడు యోసేపు తన తండ్రి యాకోబును ఫరో ఎదుటికి తీసుకొని వచ్చాడు. యాకోబు ఫరోను ఆశీర్వదించాడు.
8 అప్పుడు ఫరో “నీ వయస్సెంత?” అని యాకోబును అడిగాడు.
9 “నేను తక్కువ కాలం ఎక్కువ కష్టాలతో బ్రతికాను. 130 సంవత్సరాలే నేను బ్రతికాను. నా తండ్రి, ఆయన పూర్వీకులు నాకంటె చాలా ఎక్కువ కాలం బ్రతికారు” అని ఫరోతో యాకోబు చెప్పాడు.
10 యాకోబు ఫరోను ఆశీర్వదించాడు. తర్వాత యాకోబు ఫరో ఎదుటి నుండి వెళ్లిపోయాడు.
11 యోసేపు ఫరోకు విధేయుడయ్యాడు. అతడు తన తండ్రికి, తన సోదరులకు ఈజిప్టలో మంచి భూమిని సమీపంగా ఇచ్చాడు. ఈజిప్టులో రామసేసు నగరానికి దగ్గరలోవున్న ఈ భూమి అతి శ్రేష్ఠమైంది. 12 మరియు తన తండ్రికి, సోదరులకు, వారి మనుష్యులందరికీ అవసరమైన ఆహారాన్ని యోసేపు వారికి ఇచ్చాడు.
దేవుని రాజ్యం దేనీతో పోల్చపడింది?
(మత్తయి 13:31-32, 34-35; లూకా 13:18-19)
30 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “దేవుని రాజ్యం ఏ విధంగా ఉందని చెప్పాలి? ఏ ఉపమానాన్ని ఉపయోగించి దాన్ని వర్ణించాలి? 31 అది ఆవగింజలాంటిది. మనం భూమిలో నాటే విత్తనాలన్నిటి కన్నా అది చాలా చిన్నది. 32 కాని ఆ ఆవగింజను నాటాక తోటలో ఉన్న అన్ని మొక్కల కన్నా అది పెద్దగా పెరుగుతుంది. దాని కొమ్మలు పెద్దగా ఉంటాయి. గాలిలో ఎగిరే పక్షులు దాని నీడలో గూడుకట్టుకొంటాయి.”
33 యేసు ఇలాంటి ఉపమానాల్ని ఎన్నో ఉపయోగించి, దైవసందేశాన్ని వాళ్ళు అర్థం చేసుకొన్నంత బోధించాడు. 34 ఉపమానాల్ని ఉపయోగించకుండా వాళ్ళకు ఏదీ బోధించ లేదు. కాని ఆయన తన శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళకు అన్నీ వివరించి చెప్పాడు.
© 1997 Bible League International