Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 133

దావీదు యాత్ర కీర్తనల్లో ఒకటి.

133 సహోదరులు ఐక్యంగా శాంతి కలిగి జీవించటం
    ఎంతో మంచిది, ఎంతో ఆనందం.
అది యాజకుని తలమీద పోయబడిన కమ్మని వాసనగల తైలంలాగా ఉంటుంది. అది అహరోను గడ్డం మీదికి కారుతున్న తైలంలాగా ఉంటుంది.
    అది అహరోను ప్రత్యేక వస్త్రాల మీదికి కారుతున్న తైలంలాగ ఉంటుంది.
అది హెర్మోను పర్వతం మీద నుండి సీయోను కొండమీద పడుతున్న మంచులా ఉంటుంది.
    సీయోను వద్దనే యెహోవా తన ఆశీర్వాదం ఇచ్చాడు. శాశ్వతజీవాన్ని ఆశీర్వాదంగా యెహోవా ఇచ్చాడు.

ఆదికాండము 42:1-28

కలలు నిజం అగుట

42 ఈ సమయంలో కనాను దేశంలోను కరవు ప్రబలుతోంది. అయితే ఈజిప్టులో ధాన్యం ఉన్నట్లు యాకోబు తెలుసుకొన్నాడు. కనుక యాకోబు తన కుమారులతో ఇలా చెప్పాడు: “ఏమీ చేయకుండా ఇక్కడ ఎందుకు మనం కూర్చోవటం? ఈజిప్టులో అమ్మకానికి ధాన్యం ఉన్నట్లు నేను విన్నాను. అందుచేత మనం అక్కడికి వెళ్లి, మనం తినేందుకు ధాన్యం కొనుక్కోవాలి. అప్పుడు మనం చావకుండా బ్రతుకుతాం.”

కనుక యోసేపు సోదరులు పదిమంది ధాన్యం కొనేందుకు ఈజిప్టుకు వెళ్లారు. బెన్యామీనును యాకోబు పంపలేదు. (బెన్యామీను ఒక్కడే యోసేపుకు స్వంత తమ్ముడు). బెన్యామీనుకు ఏదైనా కీడు సంభవిస్తుందేమోనని యాకోబు భయపడ్డాడు.

కనానులో కరువు కాలం చాలా దారుణంగా ఉంది. ధాన్యం కొనుగోలు చేసేందుకు ఎంతోమంది ప్రజలు కనానునుండి ఈజిప్టు వెళ్లారు. వారిలో ఇశ్రాయేలు కుమారులు కూడ ఉన్నారు.

ఆ సమయంలో ఈజిప్టు అంతటి మీద యోసేపు పాలకుడు. ఈజిప్టుకు వచ్చిన ప్రజలకు ధాన్యం అమ్మకం చేసేందుకు గాను నియమింపబడిన అధికారి యోసేపు. అయితే యోసేపు సోదరులు అతని దగ్గరకు వచ్చి అతని ఎదుట సాష్టాంగపడ్డారు. యోసేపు తన సోదరులను చూశాడు, వారెవరయిందీ అతనికి తెలుసు, కానీ యోసేపు వారిని ఎరుగనట్టే వారితో మాట్లాడాడు. అతడు వారితో కఠినంగా మాట్లాడాడు. “ఎక్కడనుండి వచ్చారు మీరు?” అని అతడు అడిగాడు.

ఆ సోదరులు “మేము కనాను దేశంనుండి వచ్చాం. ఆహారం కొనేందుకు మేము వచ్చాం” అని జవాబిచ్చారు.

ఈ మనుష్యులు తన సోదరులని యోసేపుకు తెలుసును. కానీ అతను ఎవరయిందీ వారికి తెలియదు. అతని అన్నల విషయంలో అతనికి వచ్చిన కలలను యోసేపు జ్ఞాపకం చేసుకొన్నాడు.

యోసేపు తన అన్నలతో, “మీరు ఆహారం కొనేందుకు రాలేదు. మీరు గూఢచారులు. మా బలహీనతలు తెలుసుకొనేందుకే మీరు వచ్చారు” అన్నాడు.

10 అయితే ఆ సోదరులు, “లేదండి అయ్యా, మీ సేవకులంగా మేము వచ్చాం. ఆహారం కొనేందుకు మాత్రమే మేము వచ్చాం. 11 మేమంతా అన్నదమ్ములం. మా అందరి తండ్రి ఒక్కడే. మేము నిజాయితీగల మనుష్యులం, మేము గూఢచారలం కాము. ఆహారం కొనేందుకు మాత్రమే మేము వచ్చాం” అని అతనితో చెప్పారు.

12 అప్పుడు యోసేపు, “లేదు, లేదు, ఏ విషయంలో మేము బలహీనులమో తెలుసుకొనేందుకే మీరు వచ్చారు” అన్నాడు వారితో.

13 ఆ సోదరులు అన్నారు: “లేదు, మేమంతా అన్నదమ్ములం. మా కుటుంబంలో మొత్తం పన్నెండుమంది సోదరులం. మా అందరికీ తండ్రి ఒక్కడే. మా అందరిలో చిన్న తమ్ముడు ఇంకా ఇంటి దగ్గర మా తండ్రితోనే ఉన్నాడు. మరో తమ్ముడు చాలకాలం క్రిందటే చనిపోయాడు. మీ ముందర మేము సేవకుల్లాంటి వాళ్లం. మేము కనాను దేశం వాళ్లం.”

14 అయితే యోసేపు వారితో ఇలా అన్నాడు: “లేదు, నేను అన్నదే సరియైనట్లు నాకు తెలుస్తోంది. మీరు గూఢచారులు. 15 అయితే మీరు సత్యమే చెబుతున్నట్లు మిమ్మల్ని రుజువు చేయనిస్తాను. మీ చిన్నతమ్ముడు ఇక్కడికి వచ్చేంతవరకు మిమ్మల్ని వదలిపెట్టనని ఫరో పేరు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. 16 కనుక మీలో ఒకరు తిరిగి వెళ్లి మీ చిన్న తమ్ముడిని ఇక్కడికి తీసుకొని రావాలి. అంతవరకు మిగిలినవారు ఇక్కడే చెరసాలలో ఉండాలి. మీరు సత్యం చెబుతున్నారో లేదో మేము చూస్తాం. అయితే మీరు గూఢచారులనే నా నమ్మకం.” 17 తర్వాత యోసేపు వాళ్లందర్నీ మూడు రోజులపాటు చెరసాలలో పెట్టాడు.

షిమ్యోను బందీగా ఉంచబడుట

18 మూడు రోజుల తర్వాత వారితో యోసేపు ఇలా అన్నాడు, “నేను దేవునికి భయపడేవాణ్ణి. అందుచేత మీరు సత్యమే చెబుతున్నారని రుజువు చేసేందుకు మీకు ఒక అవకాశం ఇస్తాను. ఇలా మీరు చేస్తే నేను మిమ్మల్ని బ్రతకనిస్తాను. 19 మీరు నమ్మకమైన మనుష్యులైతే, మీ సోదరులలో ఒకరు ఇక్కడ చెరసాలలో ఉండాలి. మిగిలినవారు మీ వాళ్లకోసం ధాన్యం తీసుకొని వెళ్లవచ్చు. 20 అప్పుడు మీ చిన్న తమ్ముడిని ఇక్కడికి తీసుకొని రండి. ఈ విధంగా, మీరు సత్యం చెబుతున్నారేమో నేను తెలుసుకొంటాను.”

ఆ సోదరులు దీనికి ఒప్పుకొన్నారు. 21 “మన చిన్న తమ్ముడికి మనం చేసిన కీడు మూలంగా శిక్ష అనుభవిస్తున్నాం. అతడు కష్టంతో ఉండటం మనం కళ్లారా చూశాం. రక్షించమని అతడు మనల్ని బ్రతిమలాడాడు. కానీ వినటానికి కూడ మనం నిరాకరించాం. అందుకే ఇప్పుడు మనం కష్టపడుతున్నాం” అని వాళ్లలో వారు చెప్పుకొన్నారు.

22 అప్పుడు రూబేను, “ఆ పిల్లవానికి మీరేమి కీడు చేయకండి అని నేను మీతో చెప్పాను కాని మీరు నా మాట వినకపోయారు. కనుక అతని మరణం మూలంగానే ఇప్పుడు మనం శిక్ష పొందుతున్నాం,” అని వాళ్లతో చెప్పాడు.

23 యోసేపు తన సోదరులతో మాట్లాడేందుకు ఒక అనువాదకుడ్ని వాడుకొన్నాడు. అందుచేత వారి భాష యోసేపు గ్రహించినట్లు ఆ సోదరులకు తెలియదు. కానీ వారు చెప్పిన ప్రతి మాటా యోసేపు విని, గ్రహించాడు. 24 వారి మాటలు యోసేపుకు చాలా దుఃఖం కలిగించాయి. అందుచేత యోసేపు వాళ్లను విడిచి వెళ్లి ఏడ్చేశాడు. కొంచెం సేపయ్యాక యోసేపు మళ్లీ వాళ్ల దగ్గరకు వెళ్లాడు. అతడు ఆ సోదరులలో ఒకడైన షిమ్యోనును పట్టుకొని మిగిలిన సోదరులు చూస్తుండగానే కట్టివేశాడు. 25 వారి సంచులను ధాన్యంతో నింపమని కొందరు సేవకులతో యోసేపు చెప్పాడు. ఈ ధాన్యం కోసం ఆ సోదరులు యోసేపుకు సొమ్ము చెల్లించారు. కానీ యోసేపు ఆ డబ్బు ఉంచుకోలేదు. ఆ డబ్బును తిరిగి వారి సంచుల్లోనే పెట్టేశాడు యోసేపు. అప్పుడు వారి ప్రయాణానికి అవసరమైన వాటన్నింటిని యోసేపు వారికి ఇచ్చాడు.

26 కనుక ఆ సోదరులు ఆ ధాన్యం గాడిదలమీద వేసుకొని వెళ్లిపోయారు. 27 ఆ సోదరులు ఆ రాత్రి ఒకచోట బస చేశారు. ఆ సోదరులలో ఒకడు తన గాడిద కొరకు కొంచెం ధాన్యం తన సంచి తెరిచాడు. అతని డబ్బు అతని సంచిలోనే కనబడింది. 28 అతడు, “చూడండి, ధాన్యంకోసం నేను చెల్లించిన డబ్బు ఇదిగో. ఈ డబ్బును ఎవరో మళ్లీ నా సంచిలో పెట్టేశారు” అని మిగతా సోదరులతో చెప్పాడు. ఆ సోదరులకు చాలా భయం వేసింది, “దేవుడు మనకు ఏం చేస్తున్నాడు?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.

మత్తయి 14:34-36

యేసు రోగులనేకులను నయం చేయటం

(మార్కు 6:53-56)

34 వాళ్ళు సరస్సు దాటి గెన్నేసరెతు ఒడ్డును చేరుకున్నారు. 35 ఆ గ్రామం వాళ్ళు యేసును గుర్తించి చుట్టూ ఉన్న ప్రాంతాల వాళ్ళందరికి కబురు పెట్టారు. ప్రజలు రోగాలతో ఉన్న వాళ్ళను ఆయన దగ్గరకు పిలుచుకు వచ్చి. 36 “వాళ్ళను మీ అంగీ అంచునైనా తాకనివ్వండి” అని బ్రతిమిలాడారు. ఆయన్ని తాకిన వాళ్ళకందరికి నయమైపోయింది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International