Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 143

దావీదు స్తుతి కీర్తన.

143 యెహోవా, నా ప్రార్థన వినుము.
    నా ప్రార్థన ఆలకించుము. అప్పుడు నా ప్రార్థనకు జవాబు యిమ్ము.
    నిజంగా నీవు మంచివాడవని, నమ్మకమైన వాడవని నాకు చూపించుము.
నేను నీ సేవకుడను, నాకు తీర్పు తీర్చవద్దు.
    నీ ఎదుట బతికియున్న మనుష్యుడెవడూ నీతిమంతునిగా ఎంచబడడు.
కాని నా శత్రువులు నన్ను తరుముతున్నారు.
    వారు నా జీవితాన్ని మట్టిలో కుక్కివేశారు.
ఆ శాశ్వత చీకటి సమాధిలోనికి
    నన్ను తోసి వేయాలని వారు ప్రయత్నిస్తున్నారు.
నాలోవున్న నా ఆత్మ దిగజారిపోయింది.
    నేను నా ధైర్యాన్ని పోగొట్టుకొంటున్నాను.
కాని చాలకాలం క్రిందట జరిగిన విషయాలను నేను జ్ఞాపకం చేసికొంటాను.
    నీ క్రియలన్నిటినీ నేను ధ్యానిస్తున్నాను.
    యెహోవా, నీవు నీ శక్తితో చేసిన అనేక అద్భుత కార్యాలను గూర్చి నేను ధ్యానిస్తున్నాను.
యెహోవా, నేను నా చేతులు ఎత్తి నిన్ను ప్రార్థిస్తున్నాను.
    ఎండిన భూమి వర్షం కోసం ఎదురు చూచినట్టుగా నేను నీ సహాయం కోసం ఎదురు చుస్తున్నాను.

యెహోవా, త్వరపడి నాకు సమాధానం యిమ్ము!
    నేను నా ధైర్యం పోగొట్టుకొన్నాను.
నా నుండి తిరిగిపోకు, నన్ను చావనివ్వకుము.
    సమాధిలో చచ్చిపడిన శవాల్లా ఉండనీయకుము.
యెహోవా, ఈ ఉదయం నీ నిజమైన ప్రేమను నాకు చూపించుము.
    నేను నిన్ను నమ్ముకొన్నాను.
సరియైన మార్గాన్ని నాకు చూపించుము.
    నేను నా ప్రాణాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను!
యెహోవా, కాపుదల కోసం నేను నీ దగ్గరకు వస్తున్నాను.
    నా శత్రువుల నుండి నన్ను రక్షించుము.
10 నేను ఏమి చేయాలని నీవు కోరుతున్నావో అది నాకు చూపించుము.
    నీవు నా దేవుడవు.
11 యెహోవా, ప్రజలు నిన్ను స్తుతించునట్లు
    నన్ను జీవించనిమ్ము.
నీవు నిజంగా మంచివాడవని నాకు చూపించి
    నా శత్రువుల నుండి నన్ను రక్షించుము.
12 యెహోవా, నీ ప్రేమ నాకు చూపించి,
    నన్ను చంపటానికి చూస్తున్న నా శత్రువులను ఓడించుము.
ఎందుకంటే నేను నీ సేవకుడను.

యిర్మీయా 32:1-9

యిర్మీయా భూమిని కొనుట

32 యూదా రాజైన సిద్కియా పాలనలో పదవ సంవత్సరం[a] గడుస్తు ఉండగా యెహోవా నుండి ఈ వర్తమానం యిర్మీయాకు వచ్చింది. సిద్కియా పాలన పదవ సంవత్సరం జరుగుతూ ఉండగా నెబుకద్నెజరు పాలన పదునెనిమిదవ సంవత్సరంలో ఇది జరిగింది. ఆ సమయంలో బబులోను రాజు సైన్యం యెరూషలేమును ముట్టడిస్తూ వచ్చింది. (యూదా రాజైన సిద్కియా యిర్మీయాను ఆ ప్రదేశంలో ఖైదు చేశాడు. యిర్మీయా, చెప్పిన భవిష్యవాణి సిద్కియాకు నచ్చలేదు. యిర్మీయా ఇలా చెప్పాడు: “యెహోవా ఇలా అన్నాడు, ‘యెరూషలేము నగరాన్ని నేను త్వరలో బబులోను రాజుకు ఇవ్వబోతున్నాను. నెబుకద్నెజరు ఈ నగరాన్ని స్వధీనపర్చుకుంటాడు. కల్దీయుల సైనికుల నుండి యూదా రాజైన సిద్కియా తప్పించుకోలేడు. అతడు నిశ్చయంగా బబులోను రాజుకు అప్పగించబడతాడు. సిద్కియా బబులోను రాజుతో ఎదురుపడి ముఖాముఖిగా మాట్లాడుతాడు. సిద్కియా స్వయంగా అతనిని తన కన్నులతో చూస్తాడు. బబులోను రాజు సిద్కియాను బబులోనుకు తీసికొని పోతాడు. సిద్కియాను. నేను శిక్షించేవరకు అతనక్కడ ఉంటాడు.’ ఇదే యెహోవా వాక్కు. ‘నీవు కల్దీయుల సైన్యంతో పోరాడినా నీవు గెలవలేవు.’”)

యిర్మీయా బందీగా వుండగా అతనిలా చెప్పాడు, “యెహోవా సందేశం నాకు అందినది. ఆ సందేశం ఇలా ఉంది: నీ పినతండ్రి కుమారుడైన హనమేలు త్వరలో నీ వద్దకు వస్తాడు. అతడు నీ తండ్రి సోదరుడైన షల్లూము కుమారుడు. హనమేలు నీ వద్దకు వచ్చి, ‘అనాతోతు వద్ధ నున్న తన పొలం కొనమని నిన్ను అడుగుతాడు. నీవు అతని దగ్గరి బంధువు గనుక తన పొలం కొనమని అడుగుతాడు. ఆ పొలాన్ని కొనటానికి నీకు హక్కు ఉన్నది. అది నీ బాధ్యత అయి కూడ ఉంది’ అని అంటాడు.

“తరువాత యెహోవా చెప్పినట్లే జరిగింది. నా పినతండ్రి కుమారుడైన హనమేలు రక్షక భటుని ఆవరణలోనున్న నా యొద్దకు వచ్చాడు. హనమేలు నాతో ఇలా అన్నాడు, ‘యిర్మీయా, అనాతోతు పట్టణం వద్ద నున్న నా పొలాన్ని కొను. ఆ పొలం బెన్యామీను వంశం వారి రాజ్యంలో వుంది. నీవా పొలం కొనుగోలు చేయి. ఎందుకంటే అది నీవు కొని స్వంతం చేసికొనే హక్కు నీకుంది.’”

అయితే ఇది యెహోవా నుండి వర్తమానం అని నాకు అర్థమయ్యింది. అనాతోతు వద్ద వున్న పొలాన్ని నా పినతండ్రి కుమారుడైన హనమేలు నుండి కొన్నాను. దాని వెలగా పదునేడు తులాల వెండిని తూచి ఇచ్చినాను.

యిర్మీయా 32:36-41

36 “మీ ప్రజలిలా అంటున్నారు, ‘బబులోను రాజు యెరూషలేమును పట్టుకుంటాడు. అతడు కత్తిని వినియోగిస్తాడు. కరువు, రోగాలు ఆవరిస్తాయి. ఈ నగరాన్ని ఓడించటానికి అతనికి అవి తోడ్పడుతాయి.’ కాని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: 37 ‘ఇశ్రాయేలు, యూదా ప్రజలను తమ దేశం వదిలి పోయేలా నేనే ఒత్తిడి చేశాను. నేను వారి పట్ల మిక్కిలి కోపగించియున్నాను. కాని వారందరిని నేను మరల ఈ ప్రదేశానికి తీసికొని వస్తాను! నేను బలవంతంగా పంపిన అన్ని దేశాల నుండి వారిని మరల కూడదీస్తాను. కూడదీసి ఈ దేశానికి మరల తీసికొనివస్తాను. వారు శాంతి కలిగి జీవించేలా చేస్తాను. 38 ఇశ్రాయేలు, యూదా ప్రజలు నా ప్రజలుగా వర్ధిల్లుతారు. నేను వారి దేవుడనవుతాను. 39 వాస్తవంగా వారంతా ఒకే ప్రజగా జీవించాలనే ఆకాంక్ష నేను వారికి కలిగిస్తాను. వారంతా తమ జీవితాంతం నిజంగా నన్నే ఆరాధించాలనే ధ్యేయ్యం కలిగివుంటారు. నన్ను ఆరాధించి, గౌరవించటం వారికిని, వారి పిల్లలకు మంచిని చేస్తుంది.

40 “‘ఇశ్రాయేలు, యూదా ప్రజలతో నేనొక ఒడంబడిక కుదుర్చుకుంటాను. ఈ నిబంధన శాశ్వతంగా ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం నేనెప్పుడూ వారికి దూరం కాను. నేను వారికెప్పుడు సుముఖంగా ఉంటాను. వారు నన్ను గౌరవించాలనే కోరికతో ఉండేలా చేస్తాను. వారిక ఎన్నడూ నాకు విముఖులు కారు. 41 వారు నన్ను సంతోష పర్చుతారు. వారికి మేలు చేయటానికి నేనెంతో ఉత్సాహం చూపిస్తాను. వారిని ఖచ్చితంగా ఈ దేశంలో నాటి వారు బాగా ఎదిగేలా తోడ్పడతాను. ఇది నా పూర్ణ హృదయంతోను, ఆత్మ సాక్షిగాను చేస్తాను.’”

మత్తయి 22:23-33

కొందరు సద్దూకయ్యులు యేసును మోసగించుటకు ప్రయత్నించటం

(మార్కు 12:18-27; లూకా 20:27-40)

23 అదే రోజు పునరుత్ధానంలేదని వాదించే సద్దూకయ్యులు యేసు దగ్గరకు వచ్చి ఇలా అన్నారు: 24 “బోధకుడా! ఒక వ్యక్తి సంతానం లేకుండా మరణిస్తే, అతని సోదరుడు ఆ వితంతువును వివాహమాడి చనిపోయిన సోదరునికి సంతానం కలిగించాలని మోషే అన్నాడు. 25 మాలో ఏడుగురు సోదరులున్న ఒక కుటుంబం ఉండింది. మొదటివాడు వివాహం చేసుకొని సంతానం లేకుండా మరణించాడు. కనుక ఆ వితంతువును చనిపోయిన వాని సోదరుడు వివాహం చేసుకొన్నాడు. 26 రెండవవాడు, మూడవవాడు, ఏడవవాని దాకా అదేవిధంగా ఆమెను పెళ్ళి చేసుకొని మరణించారు. 27 చివరకు ఆ స్త్రీ కూడా మరణించింది. 28 ఆ ఏడుగురు ఆ స్త్రీని వివాహం చేసుకొన్నారు కదా, మరి పునరుత్ధానం తర్వాత ఆమె ఆ ఏడుగురిలో ఎవరి భార్యగా ఉంటుంది?”

29 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీకు లేఖనాలు తెలియవు. దేవుని శక్తి గురించి మీకు తెలియదు. అందువల్ల మీరు పొరబడుతున్నారు. 30 పునరుత్థానమందు పెళ్ళి చేసుకోవటం కాని, చెయ్యటం కాని ఉండదు. వాళ్ళు పరలోకంలోని దేవదూతల్లా ఉంటారు. 31 ఇక చనిపోయిన వారు బ్రతకడాన్ని గురించి దేవుడు మీకేం చెప్పాడో మీరు చదువలేదా? 32 ‘నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాక్కు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి’(A) అని అన్నాడు. ఆయన చనిపోయిన వాళ్ళ దేవుడు కాదు. జీవిస్తున్న వాళ్ళ దేవుడు.”

33 ప్రజలు ఈ బోధన విని ఆశ్చర్యపొయ్యారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International