Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 143

దావీదు స్తుతి కీర్తన.

143 యెహోవా, నా ప్రార్థన వినుము.
    నా ప్రార్థన ఆలకించుము. అప్పుడు నా ప్రార్థనకు జవాబు యిమ్ము.
    నిజంగా నీవు మంచివాడవని, నమ్మకమైన వాడవని నాకు చూపించుము.
నేను నీ సేవకుడను, నాకు తీర్పు తీర్చవద్దు.
    నీ ఎదుట బతికియున్న మనుష్యుడెవడూ నీతిమంతునిగా ఎంచబడడు.
కాని నా శత్రువులు నన్ను తరుముతున్నారు.
    వారు నా జీవితాన్ని మట్టిలో కుక్కివేశారు.
ఆ శాశ్వత చీకటి సమాధిలోనికి
    నన్ను తోసి వేయాలని వారు ప్రయత్నిస్తున్నారు.
నాలోవున్న నా ఆత్మ దిగజారిపోయింది.
    నేను నా ధైర్యాన్ని పోగొట్టుకొంటున్నాను.
కాని చాలకాలం క్రిందట జరిగిన విషయాలను నేను జ్ఞాపకం చేసికొంటాను.
    నీ క్రియలన్నిటినీ నేను ధ్యానిస్తున్నాను.
    యెహోవా, నీవు నీ శక్తితో చేసిన అనేక అద్భుత కార్యాలను గూర్చి నేను ధ్యానిస్తున్నాను.
యెహోవా, నేను నా చేతులు ఎత్తి నిన్ను ప్రార్థిస్తున్నాను.
    ఎండిన భూమి వర్షం కోసం ఎదురు చూచినట్టుగా నేను నీ సహాయం కోసం ఎదురు చుస్తున్నాను.

యెహోవా, త్వరపడి నాకు సమాధానం యిమ్ము!
    నేను నా ధైర్యం పోగొట్టుకొన్నాను.
నా నుండి తిరిగిపోకు, నన్ను చావనివ్వకుము.
    సమాధిలో చచ్చిపడిన శవాల్లా ఉండనీయకుము.
యెహోవా, ఈ ఉదయం నీ నిజమైన ప్రేమను నాకు చూపించుము.
    నేను నిన్ను నమ్ముకొన్నాను.
సరియైన మార్గాన్ని నాకు చూపించుము.
    నేను నా ప్రాణాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను!
యెహోవా, కాపుదల కోసం నేను నీ దగ్గరకు వస్తున్నాను.
    నా శత్రువుల నుండి నన్ను రక్షించుము.
10 నేను ఏమి చేయాలని నీవు కోరుతున్నావో అది నాకు చూపించుము.
    నీవు నా దేవుడవు.
11 యెహోవా, ప్రజలు నిన్ను స్తుతించునట్లు
    నన్ను జీవించనిమ్ము.
నీవు నిజంగా మంచివాడవని నాకు చూపించి
    నా శత్రువుల నుండి నన్ను రక్షించుము.
12 యెహోవా, నీ ప్రేమ నాకు చూపించి,
    నన్ను చంపటానికి చూస్తున్న నా శత్రువులను ఓడించుము.
ఎందుకంటే నేను నీ సేవకుడను.

2 రాజులు 4:18-37

18 ఆ పిల్లవాడు పెరిగాడు. ఒకరోజు అతను కంకుల్ని కోస్తున్న తన తండ్రిని పనివారిని చూసేందుకు పొలం లోకి వెళ్లాడు. ఆ పిల్లవాడు 19 తండ్రి చూచి, “అయ్యో, నా తల, నా తల పగిలిపోతున్నది” అన్నాడు.

“అతనిని ఆ తల్లి వద్దకు ఎత్తుకొని వెళ్లండి” అని తండ్రి తన సేవకునికి చెప్పెను.

20 సేవకుడు ఆపిల్లవానిని అతని తల్లి వద్దకు తీసుకు వెళ్లాడు. మధ్యాహ్నం దాకా పిల్లవాడు తల్లి తొడమీద కూర్చొని వున్నాడు. తర్వాత ఆపిల్లవాడు మరణించాడు.

ఎలీషాని చూడటానికి ఆ స్త్రీ వెళ్లటం

21 దైవజనుడైన (ఎలీషా) పడకమీద ఆమె తన పిల్లవానిని ఉంచి ఆమె ఆ గది తలుపు మూసివేసి వెలుపలికి వెళ్లింది. 22 ఆమె తన భర్తను పిలిచి, “ఒక సేవకుని ఒక గాడిదను పంపుము. అప్పుడు నేను దైవజనుని (ఎలీషా) కలుసుకునేందుకు తర్వగా వెళ్లెదను” అని చెప్పింది.

23 ఆమె భర్త, “దైవజనుని (ఎలీషా) వద్దకు నేడెందుకు నీవు వెళ్లుచున్నావు. నేడు అమావాస్య గాని సబ్బాతు రోజుగాని కాదు” అన్నాడు.

“ఫరవాలేదు అంతా సక్రమంగానే వుంటుంది” అని ఆమె చెప్పింది.

24 తర్వాత ఆమె గాడిదకు ఒక గంత పరిచింది. ఆ సేవకునితో, మనము తర్వగా వెళదాము, వేగముగా తోలుము, నేను చెప్పేంత వరుకూ నెమ్మదిగా తోలవద్దని చెప్పింది.

25 ఆ స్త్రీ దైవజనుడను (ఎలీషా) చూసేందుకు కర్మెలు పర్వతానికి వెళ్లింది.

దైవజనుడు (ఎలీషా) షూనేము స్త్రీ చాలాదూరంనుండి వస్తుండగా చూశాడు. ఎలీషా తన సేవకుడైన గేహజీతో చెప్పాడు “చూడు ఆమె షూనేము స్త్రీ, 26 ఇప్పుడే పరుగెత్తుకుని వెళ్లు, ఆమెను కలుసుకునేందుకు, ‘ఏమి కష్టం? నీవు సరిగా వున్నావా? నీ భర్త సరిగా వున్నడా? నీ బిడ్డ సరిగావున్నాడా? అని ఆమెను కలుసుకొని అడుగుము.’” గేహజీ ఆ విధంగా ఆ షూనేము స్త్రీని అడిగాడు.

ఆమె, “అంతా క్షేమము” అని చెప్పింది.

27 కాని ఆ షూనేము స్త్రీ దైవజనుని కోసం కొండ మీదికి వెళ్లి, క్రిందికి వంగి, ఎలీషా పాదాలు తాకింది. గేహజీ ఆమెను పక్కకు తొలగించాలని ఆమె దగ్గరికి వచ్చాడు. కాని దైవజనుడు (ఎలీషా) గేహజీని చూచి, “ఆమెను ఉండనీ. ఆమె చాలాబాధగా ఉన్నది. ఆ సంగతి నాకు యెహోవా చెప్పలేదు. యెహోవా ఈ విషయం నాకు చెప్పక దాచాడు.” అని పలికాడు.

28 అప్పుడు షూనేము స్త్రీ, “అయ్యా నాకు కొడుకు కావలయునని నేను చెప్పలేదు గదా. నన్ను మోసం చెయవద్దు” అన్నాను, అని అనగా

29 వెంటనే గేహజీతో, ఎలీషా, “నీవు ఆమెతో వెళ్లడానికి సిద్ధంగా వుండుము. నా చేతికర్ర తీసుకుని వెళ్లుము. ఎవరితోను మాటలాడుటకు ఆగవద్ద. ఎవరినైనా నీవు కలుసుకుంటే, అతనితో నమస్కారము అనికూడా చెప్పకుము. ఒకవేళ ఎవరైన నీకు, ‘నమస్కారము’ అన్నట్లయితే, అతనికి బదులు చెప్పకుము. నా చేతి కర్రను బిడ్డ ముఖమున ఉంచుము” అని చెప్పాడు.

30 కాని ఆబిడ్డ తల్లి, “నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. యెహోవా జీవంతోడు, నీ జీవం తోడు నీవు రాకుండా నేను వెళ్లను” అంది.

అందువల్ల ఎలీషా లేచి, షూనేము స్త్రీని అనుసరించాడు.

31 ఎలీషా మరియు షూనేము స్త్రీ చేరుకునేందుకు ముందుగా, గేహజీ షూనేము స్త్రీ ఇల్లు చేరుకున్నాడు. ఆ బిడ్డ ముఖము మీద ఆ కర్రను ఉంచాడు. కాని బిడ్డ మాటలాడలేదు. ఏమియు వినిపించిన జాడ కూడా తెలియరాలేదు. అప్పుడు గేహజీ ఎలీషాని కలుసు కోవడానికి వెలుపలికి వచ్చాడు. “బిడ్డ లేవలేదు” అని గేహజీ ఎలీషాకి చెప్పాడు.

షూనేము స్త్రీ కుమారుడు మరల బ్రతుకుట

32 ఎలీషా ఇంట్లోకి వెళ్లాడు. తన మంచం మీద ఆ బిడ్డ చనిపోయివున్నాడు. 33 ఎలీషా గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నాడు. ఇప్పుడు ఎలీషా మరియు ఆబిడ్డ మాత్రమే గదిలో వున్నారు. అప్పుడు ఎలీషా యెహోవాని ప్రార్థించాడు. 34 ఎలీషా పడక వద్దకు వెళ్లాడు. బిడ్డ మీద పడుకున్నాడు. ఎలీషా తన నోటిని బిడ్డ నోటిమీద వుంచాడు. ఎలీషా తన కండ్లను బిడ్డ కండ్ల మీద వుంచాడు. తరువాత బిడ్డ దేహం వేడి ఎక్కేంత వరకు బిడ్డమీద ఎలీషా పండుకొన్నాడు.

35 తర్వాత ఎలీషా లేచి ఆ గది చుట్టూ తిరిగాడు. వెనుకకు వెళ్లి, బిడ్డ ఏడు సార్లు తుమ్మేంత వరకూ కళ్లు తెరిచేంతవరకూ బిడ్డ మీద పండుకొన్నాడు.

36 ఎలీషా గేహజీని పిలిచి, “ఆ షూనేము స్త్రీని పిలువుము” అని చెప్పాడు.

గేహజీ షూనేము స్త్రీని పిలిచాడు. ఆమె ఎలీషా వద్దకు వచ్చింది. “నీ కొడుకుని ఎత్తుకో” అని ఎలీషా చెప్పాడు.

37 తర్వాత షూనేము స్త్రీ గదిలోకి వెళ్లి, ఎలీషా పాదాలకు మోకరిల్లింది. ఆ తర్వాత తన పిల్లవాడిని ఎత్తుకుని ఆమె వెలుపలికి వెళ్లింది.

ఎఫెసీయులకు 2:1-10

క్రీస్తులో పునర్జీవం

ఇక మీ విషయమా! ఇదివరలో మీరు మీ పాపాల్లో, అతిక్రమాల్లో మరణించారు. అప్పుడు మీరు ప్రపంచాన్ని అనుసరించి జీవించారు. వాయుమండలాధికారిని అనుసరించే వాళ్ళు. ఆ వాయుమండలాధికారి ఆత్మ దేవునికి అవిధేయతగా ఉన్నవాళ్ళలో ఇప్పుడూ పని చేస్తుంది. నిజానికి మనం కూడా మన మానవ స్వభావంవల్ల కలిగే వాంఛల్ని, శారీరక వాంచల్ని, మన ఆలోచనల వల్ల కలిగే వాంఛల్ని తృప్తి పరుచుకుంటున్నవాళ్ళలా జీవించాము. కాబట్టి వాళ్ళలా మనము కూడా దేవుని కోపానికి గురి అయ్యాము.

కాని దేవుడు కరుణామయుడు. ఆయనకు మనపై అపారమైన ప్రేమ ఉంది. మనము అవిధేయత వల్ల ఆత్మీయ మరణం పొందినా ఆయన మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు. ఆయన అనుగ్రహం మిమ్మల్ని రక్షించింది. మనకు యేసు క్రీస్తులో కలిగిన ఐక్యత వల్ల పరలోకంలో తనతో కలిసి రాజ్యం చెయ్యటానికి మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు. యేసు క్రీస్తు ద్వారా తన అనుగ్రహాన్ని తెలియజేసి, తన అపారమైన దయ మనపై చిరకాలం ఉంటుందని నిరూపించాడు.

మీరు ఆయన అనుగ్రహం వల్ల రక్షింపబడ్డారు. మీలో విశ్వాసం ఉండటంవల్ల మీకా అనుగ్రహం లభించింది. అది మీరు సంపాదించింది కాదు. దాన్ని దేవుడు మీకు ఉచితంగా యిచ్చాడు. అది మీ కృషివల్ల లభించింది కాదు. కనుక గొప్పలు చెప్పుకోవటానికి అవకాశం లేదు. 10 దేవుడు మన సృష్టికర్త. ఆయన యేసు క్రీస్తులో మనలను సత్కార్యాలు చేయటానికి సృష్టించాడు. ఆ సత్కార్యాలు ఏవో ముందే నిర్ణయించాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International