Revised Common Lectionary (Semicontinuous)
యాత్ర కీర్తన.
130 యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను.
కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను.
2 నా ప్రభువా, నా మాట వినుము.
సహాయం కోసం నేను చేస్తున్న మొర వినుము.
3 యెహోవా, మనుష్యులను వారి పాపాలన్నిటిని బట్టి నీవు శిక్షిస్తే
ఒక్క మనిషి కూడా మిగలడు.
4 యెహోవా, నీ ప్రజలను క్షమించుము.
అప్పుడు నిన్ను ఆరాధించుటకు మనుష్యులు ఉంటారు.
5 యెహోవా నాకు సహాయం చేయాలని నేను కనిపెడుతున్నాను.
నా ఆత్మ ఆయన కోసం కనిపెడుతుంది.
యెహోవా చెప్పేది నేను నమ్ముతున్నాను.
6 నా ప్రభువు కోసం నేను కనిపెడుతున్నాను.
ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో కనిపెడుతున్న కావలివాండ్లలా నేను ఉన్నాను.
7 ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో.
నిజమైన ప్రేమ యెహోవా దగ్గర మాత్రమే కనబడుతుంది.
యెహోవా మనలను మరల, మరల రక్షిస్తాడు.
8 మరియు యెహోవా ఇశ్రాయేలీయుల పాపాలు అన్నింటి విషయంలో వారిని క్షమిస్తాడు.
ప్రజా నాశనం చూడటం దేవునికి ఇష్టంకాదు
10 “కావున నరపుత్రుడా, నా తరపున ఇశ్రాయేలు వంశం వారితో మాట్లాడు. అప్పుడు వారు, ‘మేము పాపం చేశాము. ధర్మాన్ని అతిక్రమించాము. మా పాపాలు భరింపరానివి. ఆ పాపాల కారణంగా మేము కుళ్లిపోతున్నాము. మేము జీవించాలంటే ఏమి చేయాలి?’ అని అడుగవచ్చు.
11 “నీవు వారితో ఇలా చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, నా జీవం తోడుగా ప్రజలు చనిపోతూ ఉంటే చూడటం నాకు ఇష్టముండదని మీకు మాట ఇస్తున్నాను. దుష్టులు చనిపోవటం కూడా నాకు ఇష్టంలేనిపని. వారు చనిపోవాలని నేను కోరను. ఆ దుష్ట జనులంతా నా వద్దకు తిరిగి రావాలనే నేను కోరుకుంటాను. వారు తమ జీవితాలను మార్చుకొని నిజంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను! అందువల్ల నా వద్దకు తిరిగి రండి! చెడు కార్యాలు చేయటం మానండి! ఓ ఇశ్రాయేలు వంశీయులారా, మీరెందుకు మరణించాలి?’
12 “నరపుత్రుడా, నీ ప్రజలకు ఇలా చెప్పు, ‘ఒక మంచి వ్యక్తి దుష్టుడై పాపం చేయటం మొదలు పెడితే, అతడు గతంలో చేసిన మంచి పనులు అతనిని రక్షించలేవు. ఆ చెడ్డ వ్యక్తి చెడునుండి పరివర్తన చెంది మంచివాడై సత్కార్యాలు చేస్తే, గతంలో అతడు చేసిన పాపపు పనులు అతనిని నాశనం చేయలేవు. కావున ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఒక మంచి వ్యక్తి దుర్మార్గుడై పాపం చేయడం మొదలుపెడితే అతడు గతంలో చేసిన మంచి పనులు అతనిని రక్షించలేవు.’
13 “ఒక మంచి మనిషికి అతడు జీవిస్తాడని నేను చెప్పవచ్చు. తద్వారా ఆ మంచి మనిషి తను పూర్వం చేసిన సత్కార్యాలు అతనిని రక్షించగలవని అనుకోవటం మొదలు పెట్టవచ్చు. ఆ రకమైన భావనతో అతడు చెడు కార్యాలు చేయటానికి పాల్పడవచ్చు. కాని గతంలో అతడు చేసిన మంచి పనులను నేను గుర్తు పెట్టుకోను! తాను చేయ మొదలు పెట్టిన పాప కార్యాల కారణంగా అతడు చనిపోతాడు.
14 “లేదా, ఒక దుర్మార్గునితో అతడు చచ్చిపోతాడని నేను చెప్పవచ్చు. అయితే అతడు తన జీవితాన్ని మార్చుకోవచ్చు. అతడు పాపం చేయటం మాని, సన్మార్గాన్ని అవలంబించవచ్చు. అతడు మంచివాడై న్యాయశీలి కావచ్చు. 15 అతడు అప్పులిచ్చినప్పుడు తాను కుదువపెట్టుకున్న వస్తువులను తిరిగి ఇచ్చి వేయవచ్చు. అతడు దొంగిలించిన వస్తువులకు తగిన పరిహారం చెల్లించవచ్చు. జీవాన్ని ఇచ్చే కట్టడలను అతడు అనుసరించటం మొదలు పెట్టవచ్చు. అతడు చెడు పనులు చేయటం మానవచ్చు. అప్పుడా వ్యక్తి ఖచ్చితంగా జీనిస్తాడు. అతడు మరణించడు. 16 అతడు గతంలో చేసిన చెడ్డ పనులను నేను గుర్తు పెట్టుకోను. ఎందుకంటే అతడిప్పుడు న్యాయవర్తనుడై మంచి మనిషి అయ్యాడు గనుక. అందుచే అతడు జీవిస్తాడు!
ఏడవ బూర
15 ఏడవ దేవదూత తన బూర ఊదాడు. పరలోకం నుండి అనేక స్వరాలు యిలా బిగ్గరగా అనటం వినిపించింది:
“ప్రపంచం మన ప్రభువు రాజ్యంగా మారింది. ఆయన క్రీస్తు రాజ్యంగా మారింది.
ఆయన చిరకాలం రాజ్యం చేస్తాడు.”
16 దేవుని సమక్షంలో సింహాసనాలపై కూర్చొన్న యిరువది నాలుగు మంది పెద్దలు సాష్టాంగపడ్డారు. 17 వాళ్ళు దేవుణ్ణి పూజిస్తూ ఈ విధంగా అన్నారు:
“ప్రభూ! సర్వశక్తివంతుడవైన దైవమా!
నీవు ప్రస్తుతం ఉన్నావు, గతంలో ఉన్నావు.
నీ గొప్ప శక్తిని ఉపయోగించి మళ్ళీ పాలించటం మొదలుపెట్టావు.
కనుక నీకు మా కృతజ్ఞతలు!
18 దేశాలు ఆగ్రహం చెందాయి.
ఇప్పుడు నీకు ఆగ్రహం వచ్చింది.
చనిపోయినవాళ్ళపై తీర్పు చెప్పే సమయం వచ్చింది.
నీ సేవకులైన ప్రవక్తలకు ప్రతిఫలం యిచ్చే సమయం వచ్చింది.
నీ పవిత్రులకు, నీ నామాన్ని గౌరవించేవాళ్ళకు,
సామాన్యులకు, పెద్దలకు,
అందరికి ప్రతిఫలం యిచ్చే కాలం వచ్చింది.
భూమిని నాశనం చేసేవాళ్ళను నాశనం చేసే కాలం వచ్చింది.”
19 అప్పుడు పరలోకంలో ఉన్న దేవుని మందిరం తెరువబడింది. ఆ మందిరంలో ఉన్న ఆయన పరిశుద్ధమైన ఒడంబడిక మందసం కనిపించింది. అప్పుడు మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపము, పెద్ద వడగండ్ల వాన వచ్చాయి.
© 1997 Bible League International