Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 128

యాత్ర కీర్తన.

128 యెహోవా అనుచరులందరూ సంతోషంగా ఉంటారు.
    ఆ ప్రజలు యెహోవా కోరిన విధంగా జీవిస్తారు.

నీవు వేటికోసం పని చేస్తావో వాటిలో ఆనందిస్తావు.
    ఎవ్వరూ వాటిని నీ వద్దనుండి తీసుకోలేరు. నీవు సంతోషంగా ఉంటావు. మంచి విషయాలు నీకు సంభవిస్తాయి.
ఇంట్లో నీ భార్య ఫలించే ద్రాక్షావల్లిలా ఉంటుంది.
    బల్లచుట్టూరా నీ పిల్లలు, నీవు నాటిన ఒలీవ మొక్కల్లా ఉంటారు.
యెహోవా తన అనుచరులను నిజంగా ఈ విధంగా ఆశీర్వదిస్తాడు.
యెహోవా సీయోనులోనుండి నిన్ను ఆశీర్వదిస్తాడని నేను ఆశిస్తున్నాను.
    నీవు నీ జీవిత కాలమంతా యెరూషలేములో ఆశీర్వాదాలు అనుభవిస్తావని నేను ఆశిస్తున్నాను.
నీవు నీ మనుమలను, మనుమరాండ్రను చూచేంతవరకు జీవిస్తావని నేను ఆశిస్తాను.

ఇశ్రాయేలులో శాంతి ఉండునుగాక.

యెహెజ్కేలు 36:22-32

22 కావున ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని ఇశ్రాయేలు వంశానికి చెప్పు, ‘ఇశ్రాయేలు వంశీయులారా, మీరు వెళ్లిన ప్రతిచోటా నా పవిత్ర నామాన్ని పాడుచేశారు. దీనిని ఆపటానికి నేనేదైనా చేయదలిచాను. ఇశ్రాయేలూ, అది నేను నీ కొరకు మాత్రం చేయను. నా పవిత్ర నామం కొరకు నేను ఆ పని చేస్తాను. 23 గొప్పదైన నా పేరు నిజంగా పవిత్రమైనదని నేను ఆ ప్రజలకు నిరూపిస్తాను. మీరు నా పేరును గౌరవించేటట్లు చేస్తాను. నా మంచి పేరును ఆ దేశాలలో మీరు పాడుచేశారు! కాని నేను పవిత్రుడనని మీకు నిరూపిస్తాను. అప్పుడు ఆ ప్రజలంతా నేనే యెహోవానని తెలుసుకుంటారు.’” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

24 దేవుడు ఇలా అన్నాడు, “ఆయా రాజ్యాలనుండి మిమ్మల్ని బయటకు తీసి, ఒక్క చోటికి సమీకరించి మీ స్వంత దేశానికి తీసుకొనివస్తాను. 25 పిమ్మట మీ మీద పరిశుద్ధ జలాన్ని చల్లి మిమ్మల్ని పవిత్రులనుగా చేస్తాను. మీ మురికినంతటిని కడిగివేస్తాను. ఆ విగ్రహాలనుండి వచ్చిన మురికిని నేను కడిగివేస్తాను.” 26 దేవుడు ఇలా అన్నాడు: “మీలో సరిక్రొత్త ఆత్మను పెడతాను. మీ ఆలోచనా సరళి మార్చుతాను. మీ శరీరం నుండి రాతి గుండెను తొలగించి సున్నితమైన మానవ హృదయాన్ని ఇస్తాను. 27 మీలో నా ఆత్మను ప్రవేశపెడతాను. మీరు నా కట్టడులను పాటించేలా మిమ్మల్ని నేను మార్చుతాను. మీరు నా ఆజ్ఞలను జాగ్రత్తగా పాటిస్తారు. 28 పిమ్మట మీ పూర్వీకులకు నేనిచ్చిన దేశంలో మీరు నివసిస్తారు. మీరు నా ప్రజలవుతారు. నేను మీ దేవుడనవుతాను.” 29 దేవుడు ఇలా చెప్పాడు: “నేను మిమ్మల్ని రక్షిస్తాను. మీరు మలినపడకుండా ఉంచుతాను. ధాన్యం (సమృద్ధిగా) పండేలా నేను ఆజ్ఞ ఇస్తాను. మీ మీదికి కరువును రప్పించను. 30 మీ చెట్ల నుండి ఫలసంపద పుష్కలంగా వచ్చేలా చేస్తాను. మీ పొలాలను బహుగా పండిస్తాను. అన్య దేశాలలో మరెన్నడూ మీరు ఆకలి బాధల అవమానాన్ని అనుభవించరు. 31 మీరు చేసిన చెడు కార్యాలను మీరు గుర్తుకు తెచ్చుకుంటారు. మీరు చేసినవి మంచి పనులు కావని తెలుసుకునే జ్ఞానం మీకు కలుగుతుంది. మీరు చేసిన పాపాలకు, మీరు పాల్పడిన భయంకర కృత్యాలకు మిమ్మల్ని మీరే అసహ్యించుకుంటారు.”

32 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను, మీ మంచి కొరకు నేనీ పనులేవీ చేయటం లేదు! నా మంచి పేరు నిలుపుకోటానికే వాటిని నేను చేస్తున్నాను! కావున ఇశ్రాయేలు వంశమా, మీరు జీవించిన తీరుకు మీరు సిగ్గుపడి, కలత చెందాలి!”

యోహాను 7:53-8:11

వ్యభిచరించిన స్త్రీ

53 [a] ఆ తర్వాత అందరూ తమ తమ ఇళ్ళకు వెళ్ళి పొయ్యారు.

యేసు మళ్ళీ ఒలీవల చెట్ల కొండ మీదికి వెళ్ళాడు. సూర్యోదయం అవుతుండగా ఆయన మళ్ళీ మందిరంలో కనిపించాడు. అక్కడ ప్రజలు ఆయన చుట్టూ సమావేశమయ్యారు. వాళ్ళకు బోధించటానికి ఆయన కూర్చున్నాడు.

వ్యభిచారం చేస్తుండగా పట్టుబడిన స్త్రీని శాస్త్రులు, పరిసయ్యులు కలిసి అక్కడికి తీసుకొని వచ్చారు. ఆమెను అందరి ముందు నిలుచో బెట్టి యేసుతో, “బోధకుడా! ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టుబడింది. మోషే, ధర్మశాస్త్రంలో యిలాంటి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపుమని ఆజ్ఞాపించాడు. మీరేమంటారు?” అని అడిగారు.

ఆయన్ని పరీక్షించటానికి ఈ ప్రశ్న వేసారు. ఆయన్ని శిక్షించటానికి కారణం దొరుకుతుందని వాళ్ళ ఉద్దేశ్యం. కాని యేసు వంగి, నేలపై తన వ్రేలితో వ్రాయటం మొదలు పెట్టాడు. వాళ్ళు ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. యేసు తలెత్తి చూస్తూ, “మీలో పాపం చెయ్యనివాడు ఎవరైనా ఉంటే, అతడు ఆమెపై మొదటిరాయి విసర వచ్చు!” అని అన్నాడు. ఇలా అన్నాక, మళ్ళీ క్రిందికి వంగి నేలపై వ్రాస్తూ ఉన్నాడు.

ఇది విన్న వాళ్ళు ఒక్కొక్కరు అక్కడి నుండి వెళ్ళటం మొదలుపెట్టారు. మొదట వృద్ధులు వెళ్ళి పోయారు. చివరకు అక్కడ నిలుచున్న స్త్రీతో యేసు మాత్రం మిగిలిపోయ్యాడు. 10 యేసు తలెత్తి చూస్తూ, “వాళ్ళెక్కడమ్మా! నిన్నెవ్వరూ శిక్షించ లేదా?” అని అడిగాడు.

11 “లేదు ప్రభూ!” అని ఆమె అన్నది.

“నేను కూడా శిక్ష విధించను. వెళ్ళు! ఇకనుండి పాపం చెయ్యకు!” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International