Revised Common Lectionary (Semicontinuous)
దావీదు కీర్తన.
23 యెహోవా నా కాపరి
నాకు కొరత ఉండదు
2 పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు.
ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు.
3 ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలం ప్రసాదిస్తాడు.
ఆయన నిజంగా మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను మంచితనపు మార్గాల్లో నడిపిస్తాడు.
4 చివరికి మరణాంధకారపు లోయలో నడిచినప్పుడు కూడా
నేను భయపడను. ఎందుకంటే, యెహోవా, నీవు నాతో ఉన్నావు.
నీ చేతికర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాయి కనుక.
5 యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాకు భోజనం సిద్ధం చేశావు.
నూనెతో నా తలను నీవు అభిషేకిస్తావు.
నా పాత్ర నిండి, పొర్లిపోతుంది.
6 నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో ఉంటాయి.
మరియు నేను ఎల్లకాలం యెహోవా ఆలయంలో నివసిస్తాను.
సమూయేలు సౌలుకు తన పాపం విషయం చెప్పుట
10 యెహోవా వాక్కు సమూయేలు దగ్గరకు వచ్చింది. 11 “సౌలు నన్ను అనుసరించటం మానేశాడు. కావున సౌలును రాజుగా చేసినందుకు బాధపడుతున్నాను. అతడు నా ఆజ్ఞలను శిరసావహించలేదు.” అని యెహోవా చెప్పాడు. ఇది విన్న సమూయేలు గాభరా పడిపోయాడు. రాత్రంతా దుఃఖంతో యెహోవాని ప్రార్థించాడు.
12 మరునాటి తెల్లవారుఝామున సమూయేలు లేచి సౌలును కలుసుకొనేందుకు వెళ్లాడు. కానీ అక్కడి ప్రజలు, “సౌలు కర్మెలుకు వెళ్లాడు. తన గౌరవార్థం అక్కడ ఒక జ్ఞాపక స్తంభం నిలబెట్టడానికి సౌలు వెళ్లాడు. తర్వాత సౌలు అనేక చోట్లకు ప్రయాణం చేసి, చివరికి గిల్గాలు వెళ్లాలని ఏర్పాటు చేసుకున్నాడు” అని చెప్పారు.
కనుక సౌలు ఉన్న చోటికే సమూయేలు వెళ్లాడు. సౌలు అమాలేకీయుల దగ్గర తీసుకున్నవాటిలో మొదటి భాగాన్ని అప్పుడే అర్పించాడు. సౌలు వాటిని దహనబలిగా యెహోవాకు అర్పిస్తున్నాడు. 13 సమూయేలు సౌలు దగ్గరకు వెళ్లాడు: “యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక! యెహోవా ఆజ్ఞలకు నేను విధేయుడనయ్యాను” అని సౌలు చెప్పాడు.
14 “ఆజ్ఞ నెరవేర్చితే మరి నేను వింటున్న గొర్రెల, పశువుల అరుపులు ఏమిటి” అని సమూయేలు ప్రశ్నించాడు.
15 సౌలు ఇలా జవాబు చెప్పాడు: “సైనికులు వాటిని అమాలేకీయులనుండి తీసుకున్నారు. నీ దేవుడైన యెహోవాకు దహనబలి చేయటానికి సైనికులు మంచి గొర్రెలను పశువులను కాపాడారు. కాని మిగిలిన వాటన్నిటినీ మేము చంపేశాము.”
16 సమూయేలు, “ఇంక మాట్లాడకు. రాత్రి యెహోవా నాకు ఏమి చెప్పాడో నీవు విను” అన్నాడు సౌలుతో.
సౌలు, “సరే నాకు చెప్పు” అన్నాడు.
17 సమూయేలు ఇలా చెప్పాడు: “గతంలో నీవు ప్రముఖుడవు కాదని తలచావు. కాని ఇశ్రాయేలు వంశాలన్నింటికీ నీవు నాయకుడవైనావు. ఇశ్రాయేలుకు రాజుగా యెహోవా నిన్ను ఎంపిక చేశాడు. 18 యెహోవా నిన్ను ఒక ప్రత్యేక పనిమీద పంపించాడు. ‘వెళ్లి ఆ దుర్మార్గపు అమాలేకీయులనందరినీ చంపివేయి. వాళ్లను పూర్తిగా నాశనం చేయి’ అని యెహోవా చెప్పాడు. 19 కానీ నీవు యెహోవా మాట వినలేదు. వాటిని నీకోసం అట్టే పెట్టుకోవాలను కున్నావు. కనుక ఏది చెడ్డదని యెహోవా చెప్పాడో అదే నీవు చేసావు.”
20 సౌలు, “నేనైతే యెహోవాకు విధేయుడనయ్యాను. యెహోవా పంపిన చోటికి నేను వెళ్లాను. అమాలేకీయులనందరినీ నేను నాశనం చేశాను. వారి రాజు అగగును మాత్రమే నేను తిరిగి తీసుకుని వచ్చాను. 21 సైనికులు మాత్రమే నీ దేవుడైన యెహోవాకు గిల్గాలువద్ద బలి అర్పించేందుకు శ్రేష్ఠమైన గొర్రెలను, పశువులను తీసుకుని వచ్చారు” అన్నాడు.
25 మనమంతా ఒకే శరీరానికి చెందిన వాళ్ళము కనుక అబద్ధం చెప్పటం మానుకోవాలి. సత్యమే మాట్లాడాలి. 26 మీరు మీ కోపంలో పాపం చెయ్యకండి. ఒకవేళ కోప్పడినా సూర్యాస్తమయం కాకముందే మీ కోపం తగ్గిపోవాలి. 27 సాతానుకు అవకాశమివ్వకండి. 28 దొంగలు యికమీదట దొంగతనం చెయ్యరాదు. వాళ్ళు తమ చేతుల్ని మంచి పనులు చెయ్యటానికి ఉపయోగించాలి. అప్పుడు వాళ్ళు పేదవాళ్ళకు సహాయం చెయ్యగలుగుతారు.
29 దుర్భాషలాడకండి. ఇతర్ల అభివృద్ధికి తోడ్పడే విధంగా, వాళ్ళకు అవసరమైన విధంగా మాట్లాడండి. మీ మాటలు విన్నవాళ్ళకు లాభం కలగాలి. 30 మీకు విమోచన కలిగే రోజుదాకా మీలో ముద్రింపబడిన దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. 31 మీలో ఉన్న కక్షను, కోపాన్ని, పోట్లాడే గుణాన్ని, దూషించే గుణాన్ని మీ నుండి తరిమివేయండి. మీలో ఎలాంటి చెడుగుణం ఉండకూడదు. 32 దయాదాక్షిణ్యాలు అలవరచుకోండి. దేవుడు క్రీస్తు ద్వారా మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా యితరులను క్షమించండి.
© 1997 Bible League International