Revised Common Lectionary (Semicontinuous)
దావీదు కీర్తన.
23 యెహోవా నా కాపరి
నాకు కొరత ఉండదు
2 పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు.
ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు.
3 ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలం ప్రసాదిస్తాడు.
ఆయన నిజంగా మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను మంచితనపు మార్గాల్లో నడిపిస్తాడు.
4 చివరికి మరణాంధకారపు లోయలో నడిచినప్పుడు కూడా
నేను భయపడను. ఎందుకంటే, యెహోవా, నీవు నాతో ఉన్నావు.
నీ చేతికర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాయి కనుక.
5 యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాకు భోజనం సిద్ధం చేశావు.
నూనెతో నా తలను నీవు అభిషేకిస్తావు.
నా పాత్ర నిండి, పొర్లిపోతుంది.
6 నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో ఉంటాయి.
మరియు నేను ఎల్లకాలం యెహోవా ఆలయంలో నివసిస్తాను.
22 కానీ సమూయేలు, “యెహోవాకు ఎక్కువ ప్రీతి పాత్రమైనది ఏమిటి? దహనబలులు, బలులా? లేక యెహోవా ఆజ్ఞాపాలనయా? దేవునికి బలులు అర్పించటంకంటే, ఆయనకు విధేయుడై ఉండటం శ్రేష్ఠము. పొట్టేళ్ల కొవ్వును అర్పించేకంటే, దేవుని వాక్కు వినటం శ్రేష్ఠము. 23 అవిధేయుడవై ఉండట మంటే మంత్రం వేసే పాపం లాంటిదే. మొండి వైఖరితో నీకు తోచినదే చేయటం విగ్రహారాధనవంటి పాపమే. నీవు యెహోవా ఆజ్ఞను ధిక్కరించావు. ఈ కారణంగా ఇప్పుడు యెహోవా నిన్ను రాజుగా తిరస్కరిస్తున్నాడు.”
24 అప్పుడు సౌలు, “నేను పాపం చేశాను. నేను యెహోవా ఆజ్ఞలకు లోబడలేదు. నీవు చెప్పినట్లుగా నేను చేయలేదు. నేను ప్రజలకు భయపడ్డాను. వారు ఎలా చెప్పితే అలా చేశాను. 25 నా పాపం క్షమించుమని ఇప్పుడు నేను నిన్ను వేడుకుంటున్నాను. నేను యెహోవాని ఆరాధిస్తాను, నాతో కూడ రా” అని సమూయేలుతో చెప్పాడు.
26 కానీ సమూయేలు, “నేను నీతో మళ్లీ వెనుకకురాను. నీవు యెహోవా ఆజ్ఞ తిరస్కరించావు. ఇప్పుడు యెహోవా నిన్ను ఇశ్రాయేలు రాజుగా తిరస్కరిస్తున్నాడు” అని చెప్పాడు.
27 సమూయేలు వెళ్లిపోవటానికి తిరగగానే, సౌలు అతని అంగీ పట్టుకున్నాడు. అంగీ చిరిగిపోయింది. 28 సమూయేలు, “నీవు నా అంగీ చింపేసావు. అదే విధంగా ఈవేళ యెహోవా ఇశ్రాయేలు రాజ్యాన్ని నీనుంచి తీసేస్తాడు. నీ స్నేహితుల్లో ఒకరికి ఈ రాజ్యాన్ని యెహోవా ఇచ్చాడు. ఇతడు నీకంటే మంచివాడు. 29 యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు. యెహోవా శాశ్వతంగా జీవిస్తాడు. యెహోవా అబద్ధం చెప్పడు. తన మనస్సు మార్చుకోడు. అనుక్షణం మనస్సుమార్చుకునే మనిషిలాంటివాడు కాదు యెహోవా” అని సౌలుతో చెప్పాడు.
30 సౌలు సమాధానమిస్తూ, “సరే నేను పాపం చేశాను. కాని దయచేసి నాతోకూడ రా. కనీసం నాయకుల ఎదుట, ఇశ్రాయేలు ప్రజల ఎదుట నాకు కొంచెం మర్యాద చూపించు. దేవుడైన యెహోవాను నేను ఆరాధించటానికి నాతోకూడ తిరిగి రా” అన్నాడు. 31 కనుక సమూయేలు సౌలుతో కలిసి వెనుకకు వెళ్లాడు. సౌలు యెహోవాను ఆరాధించాడు.
5 మీరు దేవుని సంతానం. మీరు ఆయనకు ప్రియమైన బిడ్డలు. కనుక ఆయన వలె ఉండటానికి ప్రయత్నించండి. 2 క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మనకోసం దేవునికి తనను తాను ధూపంగా, బలిగా అర్పించుకొన్నాడు. మీరు ఆయనలా మీ తోటివాళ్ళను ప్రేమిస్తూ జీవించండి.
3 కాని మీరు వ్యభిచారాన్ని గురించి గాని, అపవిత్రతను గురించి గాని, దురాశను గురించి గాని మాట కూడా ఎత్తకూడదు. ఇలాంటి దుర్గుణాలు విశ్వాసుల్లో ఉండకూడదు. 4 అంతేకాక మీరు బూతు మాటలు, అర్థంలేని మాటలు పలుకకూడదు. అసభ్యమైన పరిహాసాలు చేయకూడదు. వీటికి మారుగా అన్ని వేళలా దేవునికి కృతజ్ఞతతో ఉండండి. 5 ఒకటి మాత్రం తథ్యమని గ్రహించండి. అవినీతి పరులు, అపవిత్రులు, అత్యాశాపరులు, నిజానికి ఇలాంటి వాళ్ళు విగ్రహారాధకులతో సమానము, ఇలాంటి వాళ్ళు దేవుడు మరియు క్రీస్తు పాలిస్తున్న రాజ్యానికి వారసులు కాలేరు.
6 వట్టిమాటలతో మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్తపడండి. దేవుని పట్ల అవిధేయత ఉన్నవాళ్ళు శిక్షింపబడతారు. 7 వాళ్ళు చేస్తున్న పనుల్లో పాల్గొనకండి. 8 ఒకప్పుడు మీరు చీకట్లో జీవించారు. కాని ప్రభువులో ఐక్యత కలిగినందువల్ల ప్రస్తుతం వెలుగులో జీవిస్తున్నారు. వెలుగు సంతానంవలె జీవించండి. 9 ఎందుకంటే వెలుగునుండి మంచితనము, నీతి అనే ఫలాలు లభిస్తాయి.
© 1997 Bible League International