Revised Common Lectionary (Semicontinuous)
యాత్ర కీర్తన.
128 యెహోవా అనుచరులందరూ సంతోషంగా ఉంటారు.
ఆ ప్రజలు యెహోవా కోరిన విధంగా జీవిస్తారు.
2 నీవు వేటికోసం పని చేస్తావో వాటిలో ఆనందిస్తావు.
ఎవ్వరూ వాటిని నీ వద్దనుండి తీసుకోలేరు. నీవు సంతోషంగా ఉంటావు. మంచి విషయాలు నీకు సంభవిస్తాయి.
3 ఇంట్లో నీ భార్య ఫలించే ద్రాక్షావల్లిలా ఉంటుంది.
బల్లచుట్టూరా నీ పిల్లలు, నీవు నాటిన ఒలీవ మొక్కల్లా ఉంటారు.
4 యెహోవా తన అనుచరులను నిజంగా ఈ విధంగా ఆశీర్వదిస్తాడు.
5 యెహోవా సీయోనులోనుండి నిన్ను ఆశీర్వదిస్తాడని నేను ఆశిస్తున్నాను.
నీవు నీ జీవిత కాలమంతా యెరూషలేములో ఆశీర్వాదాలు అనుభవిస్తావని నేను ఆశిస్తున్నాను.
6 నీవు నీ మనుమలను, మనుమరాండ్రను చూచేంతవరకు జీవిస్తావని నేను ఆశిస్తాను.
ఇశ్రాయేలులో శాంతి ఉండునుగాక.
ఇత్తడి సర్పం
4 ఇశ్రాయేలు ప్రజలు హోరు కొండ విడిచి ఎర్ర సముద్రానికి వెళ్లే మార్గంలో ప్రయాణం చేసారు. ఎదోము అనే ప్రాంతాన్ని చుట్టి వచ్చేందుకు వారు ఇలా చేసారు. కానీ ప్రజల్లో సహనం లేదు. ప్రయాణం చేస్తూ దూరాన్ని గూర్చి వారు సణిగారు. 5 దేవునికి, మోషేకు ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడారు. “మమ్మల్ని ఈజిప్టునుండి నీవెందుకు తీసుకువచ్చావు? మేము ఇక్కడ అరణ్యంలోనే చస్తాము! రొట్టెలేదు, నీళ్లు లేవు. ఈ దారుణమైన ఆహారం మాకు అసహ్యము” అన్నారు ప్రజలు.
6 కనుక విష సర్పాలను ఆ ప్రజల మధ్యకు యెహోవా పంపించాడు. ఆ పాములు ప్రజలను కరిచాయి. ఇశ్రాయేలు ప్రజలు చాల మంది చనిపోయారు. 7 ప్రజలు మోషే దగ్గరకు వచ్చి, “యెహోవాకు, నీకు వ్యతిరేకంగా మాట్లాడి మేము పాపం చేసామని మాకు తెలుసు. యెహోవాకు ప్రార్థన చేసి ఈ పాములను తీసివేయమని అడుగు” అని చెప్పారు. కనుక ఆ ప్రజల కోసం మోషే ప్రార్థించాడు.
8 “ఇత్తడి సర్పం ఒకటి చేసి దాన్ని ఒక స్తంభం మీద ఉంచు. పాము కరిచిన వ్యక్తి ఆ స్తంభం మీది ఇత్తడి సర్పాన్ని చూడాలి. అప్పుడు అతడు చావడు” అని యెహోవా మోషేతో చెప్పాడు. 9 కనుక మోషే యెహోవా చెప్పినట్టు చేసాడు. అతడు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి, ఒక స్తంభం మీద దాన్ని పెట్టాడు. అప్పుడు ఎవర్నయినా పాము కరిస్తే, ఆ మనిషి స్తంభం మీది ఇత్తడి సర్పాన్ని చూచి బ్రతికాడు.
యేసు మోషే కన్నా గొప్పవాడు
3 పరలోక దేవుని పిలుపులో పాలివారైన సోదరులారా! మీరు పవిత్రత గలవాళ్ళు. మనం బహిరంగంగా విశ్వసిస్తున్న ప్రధాన యాజకుడు, దేవుని అపొస్తలుడు అయినటువంటి యేసు పట్ల మీ మనస్సు లగ్నం చెయ్యండి. 2 మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అలాగే యేసు కూడా తనను నియమించిన దేవునియందు నమ్మకస్తుడుగా ఉండెను. 3 ఇంటికంటే, ఇల్లు కట్టిన వానికి ఎక్కువ గౌరవముంటుంది. అలాగే మోషే కన్నా యేసు ఎక్కువ గౌరవవానికి అర్హుడనిపించుకొన్నాడు. 4 ఎందుకంటే, ప్రతి ఇంటిని ఎవరో ఒకడు కడతాడు, కాని దేవుడు అన్నిటినీ నిర్మించాడు. 5 దేవుని ఇల్లంతటిలో మోషే సేవకునిగా విశ్వాసంతో పని చేసాడు. ఆ కారణంగా, చాలా కాలం తర్వాత మోషే జరుగబోవువాటికి సాక్షిగా ఉండెను. 6 కాని క్రీస్తు దేవుని ఇల్లంతటికి నమ్మకస్తుడైన కుమారుడు. మనం అతిశయించే నిరీక్షణ, ధైర్యంను గట్టిగా పట్టుకొన్నవారమైతే మనం ఆయన ఇల్లౌతాం. అందువల్ల మనం అశిస్తున్న దానికోసం, విశ్వాసంతో ధైర్యంగా ఉంటే ఆ యింటికి చెందినవాళ్ళమౌతాము.
© 1997 Bible League International