Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 81

సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. ఆసాపు కీర్తన.

81 సంతోషించండి, మన బలమైన దేవునికి గానం చేయండి.
    ఇశ్రాయేలీయుల దేవునికి సంతోషంతో కేకలు వేయండి.
సంగీతం ప్రారంభించండి.
    గిలక తప్పెట వాయించండి.
    స్వరమండలం, సితారాలను శ్రావ్యంగా వాయించండి.
నెలవంకనాడు గొర్రెపోతు కొమ్ము ఊదండి.
    పౌర్ణమినాడు[a] గొర్రెపోతు కొమ్ము ఊదండి. ఆనాడే మన పండుగ ఆరంభం.
అది ఇశ్రాయేలు ప్రజలకు న్యాయచట్టం.
    ఆ ఆదేశాన్ని యాకోబుకు దేవుడు ఇచ్చాడు.
ఈజిప్టునుండి యోసేపును[b] దేవుడు తీసుకొనిపోయిన సమయంలో
    దేవుడు వారితో ఈ ఒడంబడిక చేసాడు.
ఈజిప్టులో నేను గ్రహించని భాష విన్నాను.
దేవుడు ఇలా చెబుతున్నాడు: “మీ భుజంమీద నుండి బరువు నేను దింపాను.
    నేను మీ మోతగంప పడవేయనిచ్చాను.
మీరు కష్టంలో ఉన్నప్పుడు మీరు సహాయం కోసం వేడుకొన్నారు. నేను మిమ్మల్ని స్వతంత్రుల్ని చేశాను.
    తుఫాను మేఘాలలో దాగుకొని నేను మీకు జవాబు ఇచ్చాను.
    నీళ్ల వద్ద నేను మిమ్మల్ని పరీక్షించాను.”

“నా ప్రజలారా, నా మాట వినండి. నా ఒడంబడిక[c] నేను మీకు యిస్తాను.
    ఇశ్రాయేలూ, నీవు దయచేసి నా మాట వినాలి!
విదేశీయులు పూజించే తప్పుడు దేవుళ్ళను
    ఎవరినీ ఆరాధించవద్దు.
10 నేను యెహోవాను, నేనే మీ దేవుడను.
    మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చిన దేవుడను నేనే.
ఇశ్రాయేలూ, నీ నోరు తెరువు,
    నేను దానిని నింపుతాను.

11 “కాని నా ప్రజలు నా మాట వినలేదు.
    ఇశ్రాయేలు నాకు విధేయత చూపలేదు.
12 కనుక వారు చేయగోరిన వాటిని నేను చేయనిచ్చాను.
    ఇశ్రాయేలీయులు వారి ఇష్టం వచ్చిందల్లా చేసారు.
13 ఒకవేళ నా ప్రజలు గనుక నిజంగా నా మాట వింటే ఇశ్రాయేలు జీవించాలని నేను కోరిన విధంగా గనుక వారు జీవిస్తే,
14     అప్పుడు నేను ఇశ్రాయేలీయుల శత్రువులను ఓడిస్తాను.
    ఇశ్రాయేలీయులకు కష్టాలు కలిగించే ప్రజలను నేను శిక్షిస్తాను.
15 యెహోవా శత్రువులు యెహోవాను కాదంటారు,
    అందుచేత వారు శిక్షించబడతారు.
16 దేవుడు తన ప్రజలకు శ్రేష్ఠమైన గోధుమలు ఇస్తాడు.
    తన ప్రజలకు తృప్తి కలిగేంతవరకు వారికి ఆ కొండ తేనె ఇస్తాడు.”

యిర్మీయా 2:4-13

యాకోబు వంశీయులారా! యెహోవా వార్తవినండి.
    ఇశ్రాయేలు సంతతి కుటుంబాల గుంపుల వారందరూ! ఈ వర్తమానం వినండి.

యెహోవా ఇలా చెప్పాడు:
“మీ పూర్వీకులపట్ల నేను ఉదారంగా ప్రవర్తించి యుండలేదా?
    అందుకేనా వారు నాపట్ల విముఖులైనారు?
మీ పూర్వీకులు పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు.
    తద్వారా వారుకూడ పనికిమాలిన వారైనారు.
‘మమ్మల్ని ఈజిప్టు నుండి విముక్తిచేసి
    తీసుకుని వచ్చిన యెహోవా ఎక్కడ ఉన్నాడు?
మాకు ఎడారులలో మార్గదర్శి అయిన
    యెహోవా ఎక్కడ ఉన్నాడు?
మమ్మల్ని నిర్జల ప్రాంతాలలోను, కొండల్లో, కోనల్లో
    సురక్షితంగా నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడు?
ఎవరూ నివసించని గాఢాంధకారములోనూ,
    ప్రమాదకరమైన భూమియందు యెహోవా మమ్మును నడిపించాడు.
    ప్రజలు ఆ ప్రదేశం గుండా ప్రయాణించరు.
కానీ యెహోవా మమ్మును దాని గుండా నడిపించాడు.’
    మీ పూర్వీకులు ఈ విషయాలు మీకు చెప్పలేదు.”

ఒక మంచి, మరియు సారవంతమైన అనేక మంచి వస్తువులతో
    నిండివున్న రాజ్యానికి మిమ్మల్ని తీసుకొనివచ్చాను.
మీరు ఆ ఫలాలను తినాలనీ, అక్కడ పండే ధాన్యాలను మీరు ఉత్పత్తి చేయాలనీ నేనలా చేశాను.
    కాని మీరు వచ్చి, నా దేశాన్ని అపవిత్ర పర్చారు.
ఆ దేశాన్ని మీకు నేనిచ్చాను.
    అయితే మీరు దానిని చెడ్డ దేశంగా మార్చివేశారు.

“యెహోవా ఎక్కడ అని
    యాజకులు అడగలేదు.
నా ఉపదేశాలను అనుసరించేవారు నన్ను తెలుసుకోవటానికి నిరాకరించారు.
    ఇశ్రాయేలు ప్రజానాయకులు నాకు వ్యతిరేకులయ్యారు.
బూటకపు దేవతైన బయలు పేరిట ప్రవక్తలు ప్రవచనాలు చేశారు.
    వారు పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు.”
కావున మిమ్మల్ని, మీ పుత్ర పౌత్రులను
    నేను నిందిస్తున్నాను.
10 సముద్రం మీదుగా కిత్తీయుల ద్వీపానికి[a] వెళ్లి చూడండి.
    ఒకనిని కేదారు[b] రాజ్యానికి పంపి, శ్రద్ధగా పరిశీలించమనండి.
అక్కడ ఎవరైనా ఈ రకంగా
    ప్రవర్తించి యున్నారేమో పరిశీలించండి.
11 ఏ దేశవాసులైనా తమ పాత దేవుళ్లను
    క్రొత్త దేవుళ్లతో మార్చుకున్నారా?
లేదు! నిజానికి వారి దేవుళ్లు వాస్తవ దేవుళ్లు కానేకారు
అయినను నా ప్రజలు తమ మహిమాన్వితుడైన దేవుని ఆరాధించటం మానుకొని
    పనికిమాలిన విగ్రహాలను పూజించటం ప్రారంభించారు అని యెహోవా అన్నాడు.

12 “ఆకాశములారా, జరిగిన విషయాలకు విస్మయము చెందండి.
    భయకంపితులుకండి!”
యెహోవా ఇలా చెప్పాడు.
13 “నా ప్రజలు రెండు చెడు కార్యాలు చేశారు:
వారు జీవజల (ఊటనైన) నన్ను విడిచేసారు
    పైగా వారు వారివారి తొట్లను తవ్వుకున్నారు.
(వారు ఇతర దేవుళ్ళవైపు మొగ్గారు.)
    కాని వారి తొట్లు పగిలి పోయాయి. అవి నీటిని పట్టజాలవు.

యోహాను 7:14-31

యేసు పండుగ సమయంలో బోధించటం

14 పండుగ సగం కాకముందే యేసు మందిరంలోకి వెళ్ళి బోధించటం మొదలుపెట్టాడు. 15 యూదులు ఆశ్చర్యపడి, “చదవకుండా యితడు యింత జ్ఞానాన్ని ఏ విధంగా సంపాదించాడు” అని అన్నారు.

16 యేసు, “నేను బోధించేవి నావి కావు. అవి నన్ను పంపిన దేవునివి. 17 దైవేచ్చానుసారం జీవించ దలచిన వానికి నా బోధనలు దేవునివా లేక నేను స్వయంగా నా అధికారంతో మాట్లాడుతున్నానా అన్న విషయం తెలుస్తుంది. 18 స్వతహాగా మాట్లాడేవాడు గౌరవం సంపాదించాలని చూస్తాడు. కాని తనను పంపిన వాని గౌరవం కోసం మాట్లాడేవాడే నిజమైనవాడు. అలాంటి వాడు అసత్యమాడడు. 19 మోషే మీకు ధర్మశాస్త్రాన్ని అందించాడు కదా! అయినా మీలో ఒక్కడు కూడా దాన్ని పాటించలేదు. నన్ను చంపటానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు” అని అన్నాడు.

20 “నీకేమన్నా దయ్యం పట్టిందా? నిన్ను చంపటానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు?” అని ప్రజలు అన్నారు.

21 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నేను ఒక మహత్కార్యాన్ని చేసాను. దానికే మీరింత ఆశ్చర్యపడిపోయారు. 22 మోషే మీకు సున్నతి[a] చేయించుకోమని చెప్పాడు. నిజానికి యిది మోషే నుండి కాదు కాని పితరులనుండి ప్రారంభమైనది. 23 కనుక అవసరమైతే మీరు విశ్రాంతి రోజున సున్నతి చేస్తే తప్పుకాదు కాని, నేను ఒక మనిషి దేహాన్ని సంపూర్ణంగా నయంచేసినందుకు మీకు కోపం వస్తోంది? 24 పైన చూసి తీర్పు చెప్పటం మానుకోండి. న్యాయంగా తీర్పు చెప్పండి.”

యేసు, “క్రీస్తా”?

25 అదే క్షణాన కొందరు యెరూషలేము ప్రజలు ఈ విధంగా అనటం మొదలుపెట్టారు: “వాళ్ళు చంపాలని ప్రయత్నిస్తున్నది ఈయనే కదా! 26 ఆయనిక్కడ బహిరంగంగా మాట్లాడుతున్నా వాళ్ళు ఆయన్ని ఒక్క మాట కూడా అనటం లేదే! అధికారులు కూడా ఈయన నిజంగా క్రీస్తు అని తలంచారా ఏమి? 27 కాని క్రీస్తు వచ్చేటప్పుడు ఎక్కడనుండి వస్తాడో ఎవ్వరికీ తెలియదు. మరి ఈయనెక్కడి నుండి వచ్చాడో మనకందరికి తెలుసు!”

28 అప్పుడు యేసు మందిరంలో ఇంకను మాట్లాడుతూ ఉండినాడు. ఆయన బిగ్గరగా, “ఔను! నేనెవరినో మీకు తెలుసు. నేను స్వతహాగా యిక్కడికి రాలేదు నన్ను పంపించినవాడు సత్యవంతుడు. ఆయనెవరో మీకు తెలియదు. 29 కాని ఆయన నన్ను పంపాడు కాబట్టి ఆయన దగ్గర నుండి నేను యిక్కడికీ వచ్చాను. కాబట్టి ఆయనెవరో నాకు తెలుసు” అని అన్నాడు.

30 ఇది విని వాళ్ళు ఆయన్ని బంధించాలని ప్రయత్నించారు. కాని ఆయన సమయం యింకా రాలేదు కనుక ఆయన మీద ఎవ్వరూ చేయి వేయలేదు. 31 అక్కడున్న వాళ్ళలో చాలా మంది ఆయన్ని విశ్వసించారు. వాళ్ళు, “క్రీస్తు వచ్చినప్పుడు ఈయన కన్నా గొప్ప అద్భుతాలు చేస్తాడా?” అని అన్నారు.

యోహాను 7:37-39

యేసు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడటం

37 పండుగ చివరి రోజు చాలా ముఖ్యమైనది. ఆ రోజు యేసు నిలుచుని పెద్ద గొంతుతో, “దాహం వేసినవాడు నా దగ్గరకు రావచ్చు. వచ్చి తన దాహం తీర్చుకోవచ్చు. 38 లేఖనాలు చెప్పినట్లు, నన్ను నమ్మిన వాని లోపలి నుండి జీవపు ఊటలు ప్రవహిస్తాయి” అని అన్నాడు. 39 అంటే, తనను నమ్మిన వాళ్ళకు ముందుగా లభించబోయే ఆత్మను గురించి ఈ మాటలు చెప్పాడు. ఆయన మహిమ పర్చబడలేదు. కనుక దేవుడు యింత వరకు ఆత్మను ఎవ్వరికీ యివ్వలేదు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International