Revised Common Lectionary (Semicontinuous)
యాత్ర కీర్తన.
130 యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను.
కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను.
2 నా ప్రభువా, నా మాట వినుము.
సహాయం కోసం నేను చేస్తున్న మొర వినుము.
3 యెహోవా, మనుష్యులను వారి పాపాలన్నిటిని బట్టి నీవు శిక్షిస్తే
ఒక్క మనిషి కూడా మిగలడు.
4 యెహోవా, నీ ప్రజలను క్షమించుము.
అప్పుడు నిన్ను ఆరాధించుటకు మనుష్యులు ఉంటారు.
5 యెహోవా నాకు సహాయం చేయాలని నేను కనిపెడుతున్నాను.
నా ఆత్మ ఆయన కోసం కనిపెడుతుంది.
యెహోవా చెప్పేది నేను నమ్ముతున్నాను.
6 నా ప్రభువు కోసం నేను కనిపెడుతున్నాను.
ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో కనిపెడుతున్న కావలివాండ్లలా నేను ఉన్నాను.
7 ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో.
నిజమైన ప్రేమ యెహోవా దగ్గర మాత్రమే కనబడుతుంది.
యెహోవా మనలను మరల, మరల రక్షిస్తాడు.
8 మరియు యెహోవా ఇశ్రాయేలీయుల పాపాలు అన్నింటి విషయంలో వారిని క్షమిస్తాడు.
8 “ఇశ్రాయేలు పర్వతములారా, నా ఇశ్రాయేలు ప్రజల కొరకు మీరు క్రొత్త చెట్లు పెంచి, పండ్లను పండిస్తారు. నా ప్రజలు వెంటనే తిరిగివస్తారు. 9 నేను మీతో ఉన్నాను. నేను మీకు సహాయపడతాను. ప్రజలు నేలను దున్నుతారు. ప్రజలు మీలో విత్తనాలు నాటుతారు. 10 మీమీద అనేకానేక మంది ప్రజలు నివసిస్తారు. ఇశ్రాయేలు వంశమంతా అక్కడ నివసిస్తుంది. నగరాలు మళ్లీ ప్రజలతో కళకళలాడుతాయి. నాశనం చేయబడిన స్థలాలన్నీ నూతనంగా నిర్మింపబడతాయి. 11 అనేక మంది ప్రజలను, జంతువులను నేను మీకిస్తాను. వారికి చాలా మంది పిల్లలు పుడతారు. పూర్వం మాదిరి ఇతరులు మీపై ఆదారపడి నివసించేలా మీకు సదుపాయం కలుగజేస్తాను. ముందుకంటె ఇప్పుడు మీరు ఇంకా బాగుండేటట్లు చేస్తాను. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు. 12 అవును, నా ప్రజలైన, ఇశ్రాయేలీయులను ఈ భూమి వద్దకు నడిపిస్తాను. వారు మిమ్మల్ని వశపర్చుకుంటారు. మీరు వారి సొత్తు అవుతారు. మరెన్నడూ వారికి పిల్లలు లేకుండా మీరు చేయలేరు.”
13 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఇశ్రాయేలు దేశమా! ప్రజలు నీవు చెడ్డపనులు చేశావని అంటారు. నీ ప్రజలను నీవే నాశనం చేశావని వారంటారు. నీవు పిల్లలను ఎత్తుకు పోయావని వారు చెపుతారు. 14 కాని నీవు ప్రజలను ఇక ఎంతమాత్రం నాశనం చేయవు. వారి పిల్లలను ఎంతమాత్రం నీవు తీసుకొనవు.” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు. 15 “అన్యదేశాలు ఇక ఎంతమాత్రం నిన్ను అవమానపర్చనివ్వను. వారిచే ఇక నీవు బాధించబడవు. నీవు నీ పిల్లలను ఇకమీదట పోగొట్టుకోవు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
44 ఆయన, “నేను మీతో కలిసి ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాలలో, కీర్తనలలో నన్ను గురించి వ్రాసినవన్నీ జరుగుతాయి అని చెప్పాను” అని అన్నాడు.
45 అప్పుడు వాళ్ళు లేఖనాలను అర్థం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో వాళ్ళ కండ్లు తెరిపించాడు. 46 ఆయన వాళ్ళతో, “ఈ విధంగా వ్రాయబడి ఉంది: క్రీస్తు చనిపోయి మూడవరోజున బ్రతికి వస్తాడు! 47 పశ్చాత్తాపాన్ని గురించి, పాప క్షమాపణ గురించి ఆయన పేరిట ప్రకటించటం మొదట యెరూషలేములో మొదలౌతుంది. ఆ పిదప అది అన్ని దేశాల్లో ప్రకటింపబడుతుంది. 48 మీరు వీటికి సాక్షులు. 49 నా తండ్రి వాగ్దానం చేసిన ఆయన్ని నేను పంపుతాను. కాని పరలోకం నుండి మీకు పరిశుద్ధాత్మ శక్తి లభించే దాకా ఈ పట్టణంలోనే ఉండండి” అని చెప్పాడు.
యేసు పరలోకానికి వెళ్ళటం
(మార్కు 16:19-20; అపొ. కా. 1:9-11)
50 ఆ తర్వాత వాళ్ళను అక్కడి నుండి బేతనియ దాకా తీసుకు వెళ్ళి తన చేతులెత్తి వాళ్ళను ఆశీర్వదించాడు. 51 వాళ్ళను ఆశీర్వదిస్తుండగా ఆయన వాళ్ళ నుండి దూరం చేయబడ్డాడు. ఆ తర్వాత పరలోకానికి తీసుకు వెళ్ళబడ్డాడు. 52 ఆ తర్వాత వాళ్ళాయనకు నమస్కరించి చాలా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. 53 వాళ్ళు మందిరంలో ఉండి విరామం లేకుండా దేవుని స్తుతించారు.
© 1997 Bible League International