Old/New Testament
ఎదోముకు వ్యతిరేకంగా వర్తమానం
35 యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 2 “నరపుత్రుడా, శేయీరు పర్వతం వైపు చూచి నా తరపున దానికి వ్యతిరేకంగా మాట్లాడు. 3 దానితో ఈ విధంగా చెప్పు, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు,
“‘శేయీరు పర్వతమా, నేను నీకు విరోధిని!
నేను నిన్ను శిక్షిస్తాను. నిన్నొక పనికిమాలిన బీడు భూమిలా చేస్తాను.
4 నీ నగరాలను నేను నాశనం చేస్తాను.
నీవు నిర్మానుష్యమవుతావు.
అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.
5 “‘ఎందువల్లనంటే నీవు నా ప్రజలకు ఎప్పుడూ వ్యతిరేకంగా ఉన్నావు. ఇశ్రాయేలు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడూ, వారి శిక్షాకాల అంతిమదశలోనూ నీవు నీ కత్తిని వారిమీద ఉపయోగించావు.’” 6 కావున నా ప్రభువైన యెహోవా చెపుతున్నదేమంటే, “నా జీవ ప్రమాణంగా నేను నిశ్చయంగా చెప్పేదేమంటే, నిన్ను మృత్యువు కబళించివేసేలా చేస్తాను. మృత్యువు నిన్ను వెంటాడుతుంది. రక్తమును నీవు అసహ్యించుకోలేదు. కావున మృత్యువు నిన్ను తరుముకు వెళుతుంది. 7 శేయీరు పర్వతాన్ని పాడైపోయిన శూన్య ప్రదేశంగా చేస్తాను. ఆ నగరం నుండి వచ్చే ప్రతి వానినీ నేను చంపివేస్తాను. ఇంకా ఆ నగరంలోకి వెళ్ల ప్రయత్నించే ప్రతివానిని నేను చంపివేస్తాను. 8 దాని పర్వతాలన్నిటినీ శవాలతో కప్పివేస్తాను. ఆ శవాలు నీ కొండలన్నిటి మీద, నీ లోయలు, కనుమలన్నిటిలోను పడివుంటాయి. 9 నిన్ను శాశ్వతంగా ఏమీలేనివానిగా మార్చివేస్తాను. నీ నగరాలలో ఏ ఒక్కడూ నివసించడు. అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.”
10 “ఈ రెండు జనాభాలు, వారి దేశాలు (ఇశ్రాయేలు, యూదా) నావే. మేము వాటిని శాశ్వతంగా మా స్వంతం చేసుకుంటాము” అని నీవు అన్నావు.
కాని యెహోవా ఇలా అన్నాడు! 11 నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు, “నీవు నా ప్రజల పట్ల అసూయచెంది ఉన్నావు. నీవు వారిపట్ల కోపంతో ఉన్నావు. నీవు వారిని అసహ్యించుకున్నావు. నీవు వారిని బాధించిన విధంగా నేను నిన్ను శిక్షిస్తానని నామీద ప్రమాణం చేసి చెపుతున్నాను! నేను నిన్ను శిక్షించి, నేను నా ప్రజలతోనే ఉన్నానని వారు తెలుసుకొనేలా చేస్తాను. 12 నీ అవమానాలన్నిటి గురించి నేను విన్నానని నీవు కూడ తెలుసుకుంటావు. ఇశ్రాయేలు పర్వతానికి వ్యతిరేకంగా నీవు అనేక చెడ్డ విషయాలు ప్రచారం చేశావు.
“‘ఇశ్రాయేలు నాశనం చేయబడింది! వాళ్లను మేము ఆహారం నమిలినట్లు నమిలి వేస్తాము!’ అని అంటూ నీవు ప్రచారం మొదలు పెట్టావు. 13 నీవు గర్వించి, నాకు వ్యతిరేకంగా అనేక విషయాలు చెప్పావు. నీవు చాలాసార్లు అలా మాట్లాడినావు. కాని నీవు మాట్లాడిన ప్రతి మాటా నేను విన్నాను! అవును. నీవన్నది నేను విన్నాను.”
14 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “నేను నిన్ను నాశనం చేసినప్పుడు ఈ భూమి యావత్తూ సంతోషిస్తుంది. 15 ఇశ్రాయేలు దేశం నాశనమయినప్పుడు నీవు సంతోషించావు. అదే రీతిని నిన్ను నేను చూస్తాను. శేయీరు పర్వతం, ఎదోము దేశం మొత్తం నాశనం చేయబడతాయి. నేనే యెహోవానని మీరప్పుడు తెలుసుకుంటారు.”
ఇశ్రాయేలు దేశం పునరుద్ధరించబడుతుంది
36 “నరపుత్రుడా, నా తరపున ఇశ్రాయేలు పర్వతాలతో మాట్లాడు. యెహోవా మాట ఆలకించమని ఇశ్రాయేలు పర్వతాలకు చెప్పు! 2 ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని వారికి తెలియజేయుము. శత్రువు నిన్ను గురించి చెడ్డ విషయాలు ప్రచారం చేశాడు. ‘ఆహా! ఆ పురాతన పర్వతాలు ఇక మనవే!’” అని వారు అనుకొన్నారు.
3 “కావున ఇశ్రాయేలు పర్వతాలతో నా తరపున మాట్లాడుము. ప్రభువైన యెహోవా ఈ విషయాలు తెలుపుతున్నాడని వాటితో చెప్పుము. శత్రువు నిన్ను నిర్మానుష్యం చేశాడు. అన్ని వైపుల నుండి వారు నిన్ను చితుకదొక్కారు. నిన్ను అన్యదేశాల పాలు చేయటం కొరకే వారా విధంగా చేశారు. పిమ్మట ప్రజలు నీగురించి గుసగుసలు మొదలు పెట్టారు.”
4 కావున ఇశ్రాయేలు పర్వతములారా, ప్రభువైన యెహోవా సందేశాన్ని వినండి! ప్రభువైన యెహోవా దీనిని పర్వతాలకు, కొండలకు, నదులకు, లోయలకు, శిథిలాలకు మరియు పాడుబడిన నగరాలకు చెపుతున్నాడు, నీ చుట్టూ ఉన్న దేశాల వారిచే నీవు దోచుకోబడి, ఎగతాళి చేయబడ్డావు. 5 “నా తీవ్రమైన భావాలను ఇప్పుడు నిజంగా వ్యక్తం చేస్తున్నాను! ఎదోము, తదితర దేశాలు నా కోపాన్ని చవి చూసేలా చేస్తాను. ఎదోమీయులు నా భూమిని తమ స్వంతం చేసుకున్నారు. వాళ్ళు బాగా సంతోషంగా అనుభవించారు. వారా విధంగా సంతోషంతో ఉన్నప్పుడు ఈ భూమిని ఎలా అసహ్యించు కొనేవారో తెలిపారు. వారు ఈ భూమిని నాశనం చేసి దాన్ని స్వాధీన పరచుకోదలిచారు.”
6 కావున నా ప్రభువైన యెహోవా ఇశ్రాయేలు దేశమును గూర్చి ఈ విషయాలు చెపుతున్నాడు: “నా తరపున ఇశ్రాయేలు దేశ భూభాగంతో మాట్లాడు. పర్వతాలతోను, కొండలతోను, నదులతోను మరియు లోయలతోను మాట్లాడు. ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని వారికి తెలియజేయుము. నా తీవ్రమైన భావాలను, కోపాన్ని వ్యక్తం చేస్తాను. నీవు ఆ ప్రజల నుండి అవమానాలను భరించావు గనుక నేను నా కోపాన్ని వ్యక్తం చేస్తాను.”
7 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “నీ చుట్టూ ఉన్న దేశాలు అవమానాలు భరించ వలసి ఉంటుందని నేను ప్రమాణం చేసి చెపుతున్నాను.
8 “ఇశ్రాయేలు పర్వతములారా, నా ఇశ్రాయేలు ప్రజల కొరకు మీరు క్రొత్త చెట్లు పెంచి, పండ్లను పండిస్తారు. నా ప్రజలు వెంటనే తిరిగివస్తారు. 9 నేను మీతో ఉన్నాను. నేను మీకు సహాయపడతాను. ప్రజలు నేలను దున్నుతారు. ప్రజలు మీలో విత్తనాలు నాటుతారు. 10 మీమీద అనేకానేక మంది ప్రజలు నివసిస్తారు. ఇశ్రాయేలు వంశమంతా అక్కడ నివసిస్తుంది. నగరాలు మళ్లీ ప్రజలతో కళకళలాడుతాయి. నాశనం చేయబడిన స్థలాలన్నీ నూతనంగా నిర్మింపబడతాయి. 11 అనేక మంది ప్రజలను, జంతువులను నేను మీకిస్తాను. వారికి చాలా మంది పిల్లలు పుడతారు. పూర్వం మాదిరి ఇతరులు మీపై ఆదారపడి నివసించేలా మీకు సదుపాయం కలుగజేస్తాను. ముందుకంటె ఇప్పుడు మీరు ఇంకా బాగుండేటట్లు చేస్తాను. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు. 12 అవును, నా ప్రజలైన, ఇశ్రాయేలీయులను ఈ భూమి వద్దకు నడిపిస్తాను. వారు మిమ్మల్ని వశపర్చుకుంటారు. మీరు వారి సొత్తు అవుతారు. మరెన్నడూ వారికి పిల్లలు లేకుండా మీరు చేయలేరు.”
13 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఇశ్రాయేలు దేశమా! ప్రజలు నీవు చెడ్డపనులు చేశావని అంటారు. నీ ప్రజలను నీవే నాశనం చేశావని వారంటారు. నీవు పిల్లలను ఎత్తుకు పోయావని వారు చెపుతారు. 14 కాని నీవు ప్రజలను ఇక ఎంతమాత్రం నాశనం చేయవు. వారి పిల్లలను ఎంతమాత్రం నీవు తీసుకొనవు.” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు. 15 “అన్యదేశాలు ఇక ఎంతమాత్రం నిన్ను అవమానపర్చనివ్వను. వారిచే ఇక నీవు బాధించబడవు. నీవు నీ పిల్లలను ఇకమీదట పోగొట్టుకోవు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
యెహోవా తన పేరును కాపాడుకోవటం
16 పిమ్మట యెహోవా వాక్కు నావద్దకు వచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 17 “నరపుత్రుడా, ఇశ్రాయేలు వంశం వారు తమ స్వంత భూమిలో నివసించారు. కాని వారు చేసిన చెడు పనులతో ఆ దేశాన్ని వారు మలినపర్చారు. వారు నా దృష్టిలో నెలసరి వచ్చే మైల రక్తంతో అపరిశుభ్రంగా ఉన్న స్త్రీలవలె ఉన్నారు. 18 ఆ రాజ్యంలో వారు ప్రజలను హత్యచేసి భూమిమీద రక్తం చిందించారు. వారి విగ్రహాలతో దేశాన్ని వారు మలినపర్చారు. అందుచే నేనెంత కోపంగా ఉన్నానో నేను వారికి చూపించాను. 19 నేను వారిని వివిధ ప్రజల మధ్యకు చెదరగొట్టి అన్ని భూభాగాలలోకి పంపిన కారణంగా వారు ఆయా దేశాలలో ఉండి పోయారు. వారి వారి చెడు కార్యాలను అనుసరించి నేను వారిని శిక్షించాను. 20 వారు అన్యదేశాలకు వెళ్లారు. ఆయా దేశాలలో కూడ వారు నా మంచి పేరును పాడుచేశారు. ఎలాగనగా, ఆ దేశస్థులు కూడ వీరిని గురించి మాట్లాడారు. ‘యెహోవా ఎటువంటి దేవుడు? వీరు యెహోవా ప్రజలు. అయినా వీరు తమ దేశాన్ని వదిలి వచ్చారు’ అని వారన్నారు.
21 “ఇశ్రాయేలు ప్రజలు నా పవిత్ర నామాన్ని పాడు చేశారు. నా పేరు విషయంలో నేను బాధపడ్డాను. 22 కావున ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని ఇశ్రాయేలు వంశానికి చెప్పు, ‘ఇశ్రాయేలు వంశీయులారా, మీరు వెళ్లిన ప్రతిచోటా నా పవిత్ర నామాన్ని పాడుచేశారు. దీనిని ఆపటానికి నేనేదైనా చేయదలిచాను. ఇశ్రాయేలూ, అది నేను నీ కొరకు మాత్రం చేయను. నా పవిత్ర నామం కొరకు నేను ఆ పని చేస్తాను. 23 గొప్పదైన నా పేరు నిజంగా పవిత్రమైనదని నేను ఆ ప్రజలకు నిరూపిస్తాను. మీరు నా పేరును గౌరవించేటట్లు చేస్తాను. నా మంచి పేరును ఆ దేశాలలో మీరు పాడుచేశారు! కాని నేను పవిత్రుడనని మీకు నిరూపిస్తాను. అప్పుడు ఆ ప్రజలంతా నేనే యెహోవానని తెలుసుకుంటారు.’” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
24 దేవుడు ఇలా అన్నాడు, “ఆయా రాజ్యాలనుండి మిమ్మల్ని బయటకు తీసి, ఒక్క చోటికి సమీకరించి మీ స్వంత దేశానికి తీసుకొనివస్తాను. 25 పిమ్మట మీ మీద పరిశుద్ధ జలాన్ని చల్లి మిమ్మల్ని పవిత్రులనుగా చేస్తాను. మీ మురికినంతటిని కడిగివేస్తాను. ఆ విగ్రహాలనుండి వచ్చిన మురికిని నేను కడిగివేస్తాను.” 26 దేవుడు ఇలా అన్నాడు: “మీలో సరిక్రొత్త ఆత్మను పెడతాను. మీ ఆలోచనా సరళి మార్చుతాను. మీ శరీరం నుండి రాతి గుండెను తొలగించి సున్నితమైన మానవ హృదయాన్ని ఇస్తాను. 27 మీలో నా ఆత్మను ప్రవేశపెడతాను. మీరు నా కట్టడులను పాటించేలా మిమ్మల్ని నేను మార్చుతాను. మీరు నా ఆజ్ఞలను జాగ్రత్తగా పాటిస్తారు. 28 పిమ్మట మీ పూర్వీకులకు నేనిచ్చిన దేశంలో మీరు నివసిస్తారు. మీరు నా ప్రజలవుతారు. నేను మీ దేవుడనవుతాను.” 29 దేవుడు ఇలా చెప్పాడు: “నేను మిమ్మల్ని రక్షిస్తాను. మీరు మలినపడకుండా ఉంచుతాను. ధాన్యం (సమృద్ధిగా) పండేలా నేను ఆజ్ఞ ఇస్తాను. మీ మీదికి కరువును రప్పించను. 30 మీ చెట్ల నుండి ఫలసంపద పుష్కలంగా వచ్చేలా చేస్తాను. మీ పొలాలను బహుగా పండిస్తాను. అన్య దేశాలలో మరెన్నడూ మీరు ఆకలి బాధల అవమానాన్ని అనుభవించరు. 31 మీరు చేసిన చెడు కార్యాలను మీరు గుర్తుకు తెచ్చుకుంటారు. మీరు చేసినవి మంచి పనులు కావని తెలుసుకునే జ్ఞానం మీకు కలుగుతుంది. మీరు చేసిన పాపాలకు, మీరు పాల్పడిన భయంకర కృత్యాలకు మిమ్మల్ని మీరే అసహ్యించుకుంటారు.”
32 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను, మీ మంచి కొరకు నేనీ పనులేవీ చేయటం లేదు! నా మంచి పేరు నిలుపుకోటానికే వాటిని నేను చేస్తున్నాను! కావున ఇశ్రాయేలు వంశమా, మీరు జీవించిన తీరుకు మీరు సిగ్గుపడి, కలత చెందాలి!”
33 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “నేను మీ పాపాలను కడిగివేసే రోజున ప్రజలను మీ నగరాలకు తీసుకొని వస్తాను. పాడుబడ్డ నగరాలు తిరిగి నిర్మించబడతాయి. 34 బీడు భూములు సాగుచేయబడతాయి. అది దారిన పోయే వారికి కేవలం శిథిలాల గుట్టలా కన్పించదు. 35 ‘గతంలో ఈ దేశం నాశనమయింది. అది ఇప్పుడు ఏదెను ఉద్యానవనంలా రూపు దిద్దుకున్నది. నగరాలు నాశనం చేయబడ్డాయి. అవి పాడుబడి నిర్మానుష్యమైనాయి. కాని ఇప్పుడవి రక్షిత నగరాలైనవి. వాటిలో ప్రజలు ఇప్పుడు నివసిస్తున్నారు అని వారు చెప్పుకుంటారు.’”
36 దేవుడు ఇలా చెప్పాడు: “నీ చుట్టూ ఉన్న దేశాలు నేను యెహోవాననీ, ఆ పాడైపోయిన ప్రాంతాలను పునరుద్ధరించాననీ తెలుసుకుంటాయి. ఖాళీగా ఉన్న ఈ నేలలో నేను మొక్కలు నాటాను. నేనే యెహోవాను. నేనే ఈ విషయాలను చెప్పాను. అవి జరిగేలా చేస్తాను.”
37 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “ఇశ్రాయేలు వంశం వారు ఇలా జరిగేలా చేయమని నన్ను అడిగేలా కూడ చేస్తాను. వారి సంతానాన్ని బహుగా అభివృద్ధి చేస్తాను. వారు గొర్రెల మందల్లా విస్తరిస్తారు. 38 యెరూషలేములో ప్రత్యేక పండుగల సందర్భంగా తేబడే గొర్రెల, మేకల మందల్లా ఆ ప్రజలు విస్తారంగా ఉంటారు. నగరాలు, పాడుబడిన ప్రాంతాలు తిరిగి జనసందోహాలతో కిటకిటలాడుతాయి. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.”
1 యేసు క్రీస్తు సేవకుడును, అపొస్తలుడునైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు, మన రక్షకుడైన క్రీస్తు యొక్కయు నీతినిబట్టి మాలాగే అమూల్యమైన విశ్వాసాన్ని పొందినవాళ్ళకు వ్రాస్తున్నది.
2 దేవుణ్ణి గురించి, మన ప్రభువైన యేసు క్రీస్తును గురించి మీరు జ్ఞానం సంపాదించాలి. ఆ జ్ఞానం ద్వారా మీకు అనుగ్రహం, శాంతి సమృద్ధిగా లభించాలని కోరుతున్నాను.
మనకవసరమైన ప్రతిదాన్ని దేవుడు మనకిచ్చాడు
3 మన దేవుడు తనను గురించి మనలో ఉన్న జ్ఞానం ద్వారా తన మహిమను, మంచితనాన్ని పంచుకోవటానికి మనల్ని పిలిచాడు. అంతేకాక రక్షణ, ఆత్మీయ జీవితానికి కావలసినవాటిని దేవుడు తన శక్తి ద్వారా మనకిచ్చాడు. 4 ఈ విధంగా, అమూల్యమైనటువంటి గొప్ప వాగ్దానాన్ని మనకోసం చేసాడు. ఆ వాగ్దానాల సహాయంతో దురాశ వల్ల సంభవించే ఈ ప్రపంచంలోని పాపాలనుండి తప్పించుకొని, తన స్వభావంలో మీరు భాగం పంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఇలా చేసాడు.
5 అందువల్ల మీలో ఉన్న విశ్వాసానికి తోడుగా మంచితనాన్ని కూడా అలవరుచుకోవటానికి అన్ని విధాలా ప్రయత్నం చెయ్యండి. మంచితనానికి తోడుగా జ్ఞానాన్ని, 6 జ్ఞానానికి తోడుగా ఆత్మనిగ్రహాన్ని, ఆత్మనిగ్రహానికి తోడుగా పట్టుదలను, పట్టుదలకు తోడుగా ఆత్మీయతను, 7 ఆత్మీయతకు తోడుగా సోదర ప్రేమను, సోదర ప్రేమకు తోడుగా దయతో నిండిన ప్రేమను అలవరుచుకోండి. 8 ఈ గుణాలు మీలో పెరుగుతూ ఉండాలి. మన ప్రభువైన యేసు క్రీస్తును గురించిన జ్ఞానం మీలో ఉంది. పై గుణాలు మీలో ఉంటే ఈ జ్ఞానాన్ని ఫలవంతంగాను, ఉపయోగకరంగాను చేస్తాయి. 9 ఆ గుణాలు లేనివానికి దూరదృష్టి ఉండదు. అలాంటివాడు గ్రుడ్డివానితో సమానము. అంటే ఇలాంటి వ్యక్తి, తాను యిదివరలో చేసిన పాపాల్ని దేవుడు క్షమించాడన్న విషయం మరిచిపోయాడన్నమాట.
10 సోదరులారా! దేవుని పిలుపు, మీ ఎన్నిక ఫలించేటట్లు యింకా ఎక్కువ శ్రద్ధ వహించండి. ఇవన్నీ చేస్తూవుంటే మీరేనాటికీ క్రిందపడరు. 11 తద్వారా మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క శాశ్వతమైన రాజ్యంలోకి మీకు ఘనస్వాగతం లభిస్తుంది.
12 వీటిని గురించి మీకిదివరకే తెలుసు. ప్రస్తుతం మీరంగీకరించిన సత్యంలో మీకు దృఢమైన విశ్వాసముంది. అయినా ఈ విషయాల్ని గురించి మీకు ఎప్పుడూ జ్ఞాపకం చేస్తూ ఉంటాను. 13 గుడారమనే ఈ శరీరంలో ప్రాణమున్నంతవరకు, మీకు జ్ఞాపకం చేయటం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. 14 ఎందుకంటే, మన యేసు క్రీస్తు ప్రభువు ముందే స్పష్టం చేసినట్లు, నేను త్వరలోనే ఈ దేహాన్ని వదిలివేస్తానని నాకు తెలుసు.[a] 15 నేను వెళ్ళాక కూడా మీరీ విషయాల్ని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకొనేటట్లు నేను అన్ని విధాలా పాటుపడతాను.
ప్రవచన వాక్యం
16 యేసు క్రీస్తు ప్రభువు రాకను గురించి, ఆయన శక్తిని గురించి తెలివిగా అల్లిన కథల ద్వారా మేము మీకు చెప్పలేదు. మేము ఆయన గొప్పతనాన్ని కళ్ళారా చూసాము. 17 ఆయన తన తండ్రి అయిన దేవుని నుండి కీర్తిని, మహిమను పొందుతుండగా, గొప్ప బలముగల స్వరము వినిపించింది: “ఈయన నా కుమారుడు. ఈయన పట్ల నాకు చాలా ప్రేమ ఉంది. ఈయన కారణంగా నాకు చాలా ఆనందం కలుగుతోంది”[b] అని, 18 పవిత్రమైన పర్వతంపై మేము ఆయనతో ఉన్నప్పుడు పరలోకంనుండి ఈ స్వరం వినిపించటం మేము స్వయంగా విన్నాము.[c]
19 అందువల్ల, ప్రవక్తలు చెప్పిన సందేశమంటే మాకు యింకా ఎక్కువ విశ్వాసం కలిగింది. మీరు ఆ సందేశాన్ని గమనించటం మంచిది. ఆ సందేశం చీకటిలో వెలిగే వెలుగులాంటిది. సూర్యోదయమయ్యే వరకూ, వేకువ చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకూ ఆ వెలుగును మీరు గమనిస్తూ ఉండాలి. 20 అన్నిటికన్నా ముఖ్యంగా మీరు తెలుసుకోవలసినది ఏమిటంటే, ప్రవచనాల్లో వ్రాయబడిన విషయాలు, ప్రవక్తలు తమ వ్యక్తిగత అభిప్రాయాలతో వ్రాయలేదు. 21 ఎందుకంటే, “ప్రవచనం” మానవులు తమ యిష్ట ప్రకారం పలికింది కాదు. పవిత్రాత్మచే ప్రేరేపణ పొంది వాళ్ళు దేవుణ్ణుండి సందేశాన్ని పలికారు.
© 1997 Bible League International