Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యిర్మీయా 37-39

యిర్మీయాను బంధించటం

37 నెబుకద్నెజరు బబులోను రాజు. యూదా రాజుగా యెహోయాకీము కుమారుడైన యెహోయాకీను[a] స్థానంలో సిద్కియాను నెబుకద్నెజరు నియమించాడు. సిద్కియా రాజైన యోషీయా కుమారుడు. యెహోవా యిర్మీయాకు బోధననిమిత్తం ఇచ్చిన వర్తమానాలను సిద్కియా లక్ష్య పెట్టలేదు. సిద్కియా సేవకులు, యూదా ప్రజలు కూడ యెహోవా వర్తమానాల పట్ల శ్రద్ధ వహించలేదు.

యెహుకలు అనువానిని, యాజకుడైన జెఫన్యాను రాజైన సిద్కియా ప్రవక్తయగు యిర్మీయా వద్ధకు ఒక సందేశమిచ్చి పంపాడు. యెహుకలు తండ్రి పేరు షెలెమ్యా. యాజకుడైన జెఫన్యా తండ్రి పేరు మయశేయా. వారు యిర్మీయాకు తెచ్చిన వర్తమానం యిలా ఉంది: “యిర్మీయా, మా కొరకు మన యెహోవా దేవుని ప్రార్థించు.”

(ఆ సమయంలో ఇంకా యిర్మీయా చెరసాలలో నిర్బంధించబడలేదు. కావున అతనెక్కడికి వెళ్లాలన్నా స్వేచ్ఛ కలిగియున్నాడు. అదే సమయంలో ఈజిప్టు నుండి ఫరో సైన్యం కూడా యూదా వైపుకు కదలి వచ్చింది. కల్దీయుల సైన్యం యెరూషలేమును ఓడించటానికి దానిని చుట్టుముట్టింది. అయితే, ఈజిప్టు నుండి వచ్చిన సైన్యం (కల్దీయులు) తమ మీదికి వస్తున్నట్లు వారు విన్నారు. కావున బబులోను సైన్యం యెరూషలేమును వదలి ఈజిప్టు సైన్యాన్ని ఎదిరించటానికి వెళ్లింది.)

యెహోవా నుండి ఒక వర్తమానం ప్రవక్తయైన యిర్మీయాకు వచ్చింది: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ వర్తమానం చెప్పుచున్నాడు: ‘యెహుకలు మరియు జెఫన్యా! యూదా రాజైన సిద్కియా నన్ను ప్రశ్నలడిగే నిమిత్తం మిమ్మల్ని నావద్దకు పంపినట్లు నాకు తెలుసు. రాజైన సిద్కియాకు ఇలా చెప్పండి: ఫరో సైన్యం బబులోను సైన్యాన్ని ఎదుర్కొనే విషయంలో నీకు సహాయం చేయాలని ఈజిప్టు నుండి ఇక్కడికి కదలి వస్తున్నది. కాని ఫరో సైన్యం ఈజిప్టుకు తిరిగి వెళ్లిపోతుంది. ఆ తరువాత బబులోను సైన్యం ఇక్కడికి తిరిగి వస్తుంది. వారు యెరూషలేము మీద దాడి చేస్తారు. బబులోను సైన్యం ఆ పిమ్మట యెరూషలేమును వశపర్చుకొని దానిని తగలబెడుతుంది.’ యెహోవా ఇలా అంటున్నాడు: ‘యెరూషలేము ప్రజలారా మిమ్మల్ని మీరు మోసగించుకోవద్దు. “బబులోను సైన్యం మమ్మల్ని వదలి తప్పక వెళ్లి పోతుంది” అని మీకు మీరు అనుకోవద్దు. వారు మిమ్మల్ని వదలరు. 10 యెరూషలేము ప్రజలారా, మిమ్మల్ని ఎదుర్కొనే కల్దీయుల సైన్యాన్నంతా మీరు ఓడించగలిగినా వారి డేరాలలో కొద్దిమంది గాయపడిన సైనికులు మిగులుతారు. ఆ కొద్దిమంది గాయపడిన మనుష్యులే వారి డేరాల నుండి వచ్చి యెరూషలేమును తగలబెడతారు.’”

11 కల్దీయుల సైన్యం ఈజిప్టు రాజైన ఫరో సైన్యాన్ని ఎదుర్కొనటానికి యెరూషలేమును వదిలిన సమయంలో 12 యిర్మీయా యెరూషలేము నుండి బెన్యామీను దేశానికి[b] వెళ్లగోరాడు. అక్కడ తన కుటుంబ ఆస్తుల పంపకం విషయంలో యిర్మీయా వెళ్లాడు. 13 కాని యెరూషలేములో బెన్యామీను ద్వారం[c] వద్దకు వెళ్లే సరికి రక్షక భటాధికారి యిర్మీయాను నిర్బంధించాడు. ఈ అధికారి పేరు ఇరీయా. ఇరీయా తండ్రి పేరు షెలెమ్యా. షెలెమ్యో తండ్రి పేరు హనన్యా. రక్షక భటాధికారి అయిన ఇరీయా యిర్మీయాను నిర్బంధంలోకి తీసుకొని “యిర్మీయా, నీవు మమ్మల్ని వదిలి బబులోను పక్షం వహించటానికి వెళ్తున్నావు” అని అన్నాడు.

14 “అది నిజం కాదు! నేను బబులోను పక్షం వహించటానికి వెళ్లటం లేదు” అని యిర్మీయా ఇరీయాతో అన్నాడు. కాని యిర్మీయా చెప్పేది ఇరీయా వినటానికి నిరాకరించాడు. యిర్మీయాను ఇరీయా నిర్బంధించి యెరూషలేములో రాజ్యాధికారుల వద్దకు తీసికొని వెళ్లాడు. 15 ఆ అధికారులు యిర్మీయా పట్ల చాలా కోపగించారు. యిర్మీయాను దండించాలని వారు ఆజ్ఞ ఇచ్చారు. వారు యిర్మీయాను కారాగారంలో నిర్బంధించారు. యోనాతాను అనేవాని ఇంటిలో ఈ చెరసాల ఉంది. యోనాతాను యూదా రాజుకు లేఖకుడు. యోనాతాను ఇంటిని చెరసాలగా మార్చారు. 16 యోనాతాను ఇంటి క్రిందవున్న చెరసాల గదిలో వారు యిర్మీయాను నిర్బంధించారు. అది ఇంటి క్రింద భూమిలో కట్టిన ఒక చెరసాల గది. యిర్మీయా అందులో చాలాకాలం ఉన్నాడు.

17 పిమ్మట రాజైన సిద్కియా మనుష్యులను పంపగా వారు యిర్మీయాను రాజభవనానికి తీసికొని వచ్చారు. యిర్మీయాతో సిద్కియా ఏకాంతంగా మాట్లాడాడు. “యెహోవా నుండి ఏమైనా సందేశం వచ్చిందా?” అని యిర్మీయాను అడిగాడు.

“అవును. యెహోవా సందేశం ఒకటి ఉంది సిద్కియా, నీవు బబులోను రాజుకు ఇవ్వబడతావు” అని యిర్మీయా సమాధాన మిచ్చాడు. 18 తరువాత యిర్మీయా రాజైన సిద్కియాతో ఇలా అన్నాడు. “నేను ఏమి తప్పు చేశాను? నీ పట్లగాని, నీ అధికారుల పట్లగాని యెరూషలేము ప్రజల పట్లగాని నేను చేసిన నేరం ఏమిటి? నన్నెందుకు కారాగృహంలో పడవేశావు? 19 సిద్కియా రాజా, నీ ప్రవక్తలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆ ప్రవక్తలు నీకు తప్పుడు వర్తమానం యిచ్చారు. ‘బబులోను రాజు నిన్నుగాని, ఈ యూదా రాజ్యాన్ని గాని ఎదుర్కోడు’ అని వారన్నారు. 20 కాని మహారాజా, ఇప్పుడు నేను చెప్పేది దయచేసి వినండి. దయచేసి నా విన్నపం ఆలకించండి. నేనడిగేది ఏమంటే లేఖకుడైన యోనాతాను ఇంటికి నన్ను మరల పంపవద్దు. మీరు నన్ను మరల పంపితే నేనక్కడ చనిపోతాను.”

21 కావున యిర్మీయాను రాజభవనపు ఆవరణలోనే నిర్బందించి ఉంచాలని రాజైన సిద్కియా ఆజ్ఞాపించాడు. వీధిలోని రొట్టెల దుకాణము నుండి రొట్టె తెచ్చి యిర్మీయాకు ఇవ్వాలని కూడ రాజు ఆజ్ఞాపించాడు. నగరంలో అమ్మే రొట్టెలు అయిపోయే వరకు యిర్మీయాకు రొట్టెలు ఇవ్వబడ్డాయి. ఆ విధంగా రాజ ప్రాంగణంలో యిర్మీయా బందీగా ఉన్నాడు.

యిర్మీయా నీళ్లగోతిలోనికి తోయబడటం

38 కొంతమంది రాజ్యాధికారులు యిర్మీయా బోధిస్తున్నది విన్నారు. వారు మత్తాను కుమారుడైన షెఫట్య, పషూరు కుమారుడైన గెదల్యా, షెలెమ్యా కుమారుడైన యూకలును మరియు మల్కీయా కుమారుడైన పషూరు. యిర్మీయా ఈ వర్తమానాన్ని ప్రజలందరికి ఇలా చెప్పుచున్నాడు: “యెహోవా సెలవిస్తున్నదేమనగా, ‘యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్కడు కత్తివల్లగాని, ఆకలివలనగాని, రోగంతోగాని చనిపోతాడు. కాని బబులోను సైన్యానికి లొంగిపోయిన ప్రతి ఒక్కడూ బ్రతుకుతాడు. వారు వారి ప్రాణాలతో తప్పించుకో గలుగుతారు.’ యెహోవా ఇంకా ఇలా అంటున్నాడు: ‘ఈ యెరూషలేము నగరం నిశ్చయంగా బబులోను రాజుకు ఇవ్వబడుతుంది. అతడి నగరాన్ని పట్టుకుంటాడు.’”

ప్రజలకు ఈ విషయాలను యిర్మీయా తెలియపర్చుతూ ఉండగా విన్న రాజ్యాధికారులు రాజైన సిద్కియా వద్దకు వెళ్లారు. వారు వెళ్లి, “యిర్మీయాను చంపివేయాలి. నగరంలో ఇంకా ఉన్న సైనికులను అధైర్యపరుస్తున్నాడు. తాను చెప్పే విషయాలతో యిర్మీయా ప్రతి ఒక్కడినీ నిరుత్సాహ పరుస్తున్నాడు. యిర్మీయా మనకు శభం కలగాలని కోరుకోవటం లేదు. అతడు యెరూషలేము ప్రజలను నాశనం చేయాలని కోరుకుంటున్నాడు” అని చెప్పారు.

“యిర్మీయా మీ స్వాధినంలోనే ఉన్నాడు. మిమ్మల్ని ఆపటానికి నేనేమీ చేయను” అని రాజైన సిద్కియా అన్నాడు.

దానితో ఆ అధికారులు యిర్మీయాను మల్కీయా యొక్క నీళ్లగోతిలోనికి[d] దించారు. (మల్కీయా రాజు యొక్క కుమారుడు) రాజభటుడు ఉండే ప్రాంగణంలోనే ఆ నీటి గొయ్యి ఉంది. ఆ అధికారులు తాళ్ల సహాయంతో యిర్మీయాను గోతిలోనికి దించారు. గోతిలో నీరు లేదు గాని, అడుగున బురద పేరుకొని ఉంది. ఆ బురదలో యిర్మీయా కూరుకుపోయాడు.

కాని ఎబెద్మెలెకు అనేవాడు అధికారులు యిర్మీయాను నీటిగోతిలోకి దించినట్లు విన్నాడు. ఎబెద్మెలెకు కూషీయుడు (ఇతియోపియ అనే దేశపువాడు) అతడు నపుంసకుడు (కొజ్జా)[e] రాజ భవనంలో ఉద్యోగి. రాజైన సిద్కియా బెన్యామీను ద్వారం వద్ద కూర్చుని ఉండగా ఎబెద్మెలెకు రాజభవనం నుండి రాజును కలిసి మాట్లాడటానికి ద్వారం వద్దకు వెళ్లాడు. 8-9 ఎబెద్మెలెకు ఇలా అన్నాడు: “నా ఏలినవాడవగు ఓ రాజా, ఆ అధికారులు చాలా క్రూరంగా ప్రవర్తించారు. ప్రవక్తయైన యిర్మీయా పట్ల వారు బహు క్రూరంగా వ్యవహరించారు. వారతనిని నీళ్లు నిలువజేసే గోతిలో పడవేశారు. అతనక్కడ చని పోయేలా వదిలి వేశారు.”[f]

10 అప్పుడు రాజైన సిద్కియా ఇతియోపియ వాడగు ఎబెద్మెలెకుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది ఇలా ఉంది: “ఎబెద్మెలెకూ, రాజభవనం నుంచి నీతో ముగ్గురు[g] మనుష్యులను తీసికొని వెళ్లు. యిర్మీయా చనిపోకముందే వారి సహాయంతో అతనిని గోతిలోనుండి పైకి తియ్యి.”

11 తరువాత ఎబెద్మెలెకు తనతో మనుష్యులను తీసుకొని వెళ్లాడు. ముందుగా అతడు రాజభవనంలో సామాను భద్రపరచే గిడ్డంగి క్రిందవున్న గదిలోనికి వెళ్లాడు. ఆ గదినుండి కొన్ని పాత బట్టలను, చింపిరి గుడ్డలను అతడు తీసికొన్నాడు. కొన్ని తాళ్ల సహాయంతో ఆ బట్టలను గోతిలో ఉన్న యిర్మీయాకు వదిలాడు. 12 ఇతియోపియ వాడగు ఎబెద్మెలెకు యిర్మీయాను పిలిచి ఇలా అన్నాడు: “ఈ గుడ్డ పేలికలను, పాత బట్టలను నీ చంకలలో పెట్టుకో మేము నిన్ను పైకిలాగినప్పుడు ఈ బట్టలు నీ చంకలలో మెత్తలవలె ఉండి తాళ్ల వలన నీకు బాధ కలుగదు.” ఎబెద్మెలెకు చెప్పినట్లుగా యిర్మీయా చేశాడు. 13 ఆ మనుష్యులు యిర్మీయాను తాళ్ల సహాయంతో పైకిలాగి, నీళ్ల గొయ్యి నుండి బయటికి తీశారు. ఆలయ ఆవరణలోనే యిర్మీయా రక్షకభటుల ఆధీనంలో ఉన్నాడు.

యిర్మీయాను సిద్కియా కొన్ని ప్రశ్నలడగటం

14 పిమ్మట రాజైన సిద్కియా తన సేవకునితో ప్రవక్తయైన యిర్మీయాను పిలిపించాడు. దేవాలయంలో మూడవ ద్వారం వద్దకు అతడు యిర్మీయాను పిలువనంపాడు. అప్పుడు రాజు “యిర్మీయా, నేను నిన్నొక విషయం అడగదలిచాను. ఏమీ దాయకుండా చిత్త శుద్ధితో అంతా చెప్పు” అని అన్నాడు.

15 “నేను నీకు సమాధానం ఇస్తే నీవు నన్ను చంపివేస్తావు. నేను నీకేదైనా సలహా ఇచ్చినా నీవు దానిని వినిపించుకోవు” అని యిర్మీయా సిద్కియాతో అన్నాడు.

16 కాని రాజైన సిద్కియా యిర్మీయాకు ఒక ప్రమాణం చేశాడు. సిద్కియా ఇది రహస్యంగా చేశాడు. సిద్కియా ఇలా ప్రమాణం చేశాడు: “యిర్మీయా, మనందరికీ జీవం పోసిన ప్రాణదాత, నిత్యుడు అయిన యెహోవా సాక్షిగా నిన్ను నేను చంపను. అంతే గాదు. నిన్ను చంపజూచే అధికారులకు నిన్ను అప్పగించనని కూడా నేను నీకు ప్రమాణం చేస్తున్నాను.”

17 అప్పుడు యిర్మీయా రాజైన సిద్కియాతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విధంగా చెప్పాడు, ‘నీవు బబులోను అధికారులకు లొంగిపోతే నీ ప్రాణం కాపాడబడుతుంది. యెరూషలేము నగరం కూడ తగుల బెట్టబడదు. నీవు, నీ కుటుంబం సజీవంగా ఉంటారు. 18 నీవు బబులోను రాజుయొక్క అధికారులకు లొంగి పోవటానికి నిరాకరిస్తే, యెరూషలేము కల్దీయుల సైన్యానికి ఇవ్వబడుతుంది. వారు యెరూషలేమును తగులబెడతారు. నీవు కూడ వారి బారి నుండి తప్పించుకోలేవు.’”

19 “కాని ఇప్పటికే బబులోను సైన్యపు పక్షం వహించిన యూదా ప్రజల విషయంలో నేను భయపడుతున్నాను. పైగా సైనికులు నన్ను యూదా ప్రజలకు ఇస్తే వారు నన్ను అవమానపర్చి, గాయపర్చుతారని కూడా నేను భయపడతున్నాను.” అని యిర్మీయాకు రాజైన సిద్కియా బదులు చెప్పాడు.

20 అందుకు యిర్మీయా ఇలా అన్నాడు: “సైనికులు నిన్ను ఆ యూదా ప్రజలకు అప్పజెప్పరు. నేను చెప్పినట్లు విని యెహోవాకు విధేయుడవై ఉండుము. అప్పుడు పరిస్థితులు నీకు అనుకూలిస్తాయి. నీ ప్రాణం రక్షింపబడుతుంది. 21 కాని నీవు బబులోను సైన్యానికి లొంగిపోవటానికి నిరాకరిస్తే ఏమి జరుగుతుందో యెహోవా నాకు చూపించాడు. యెహోవా ఇలా అన్నాడు: 22 యూదా రాజగృహంలో మిగిలివున్న స్త్రీలంతా బయటకు లాగబడతారు. వారు బబులోను రాజు ముఖ్య అధికారుల వద్దకు తేబడుతారు. నీ స్త్రీలే నిన్ను ఒక పాట పాడి ఎగతాళి చేస్తారు. ఆ స్త్రీలు ఇలా అంటారు.

‘నీ మంచి స్నేహితులే నిన్ను తప్పుదోవ పట్టించారు.
    నీవారు నీకంటె బలవంతులైనారు.
అటువంటి స్నేహితులనే నీవు నమ్మావు.
    నీ కాళ్లు బురదలో కూరుకున్నాయి.
    నీ స్నేహితులు నిన్ను వదిలి పెట్టారు.’

23 “నీ భార్యలు, పిల్లలు అందరూ బయటకు ఈడ్వబడతారు. వారు కల్దీయుల సైన్యానికి అప్పగించబడతారు. నీవు కూడ బబులోను సైన్యం నుండి తప్పించుకోలేవు. నీవు బబులోను రాజుచే పట్టు కొనబడతావు. యెరూషలేము తగులబెట్టబడుతుంది.”

24 అప్పుడు సిద్కియా యిర్మీయాతో ఇలా అన్నాడు: “నేను నీతో మాట్లాడుతున్నానని ఎవ్వరికీ తెలియనీయవద్దు. చెప్పితే నీవు చనిపోతావు. 25 ఆ అధికారులు నేను నీతో మాట్లాడినట్లు తెలిసికోవచ్చు. అప్పుడు వారు నీ వద్దకు వచ్చి, ‘యిర్మీయా, నీవు రాజైన సిద్కియాకు ఏమి చెప్పావో అది మాకు తెలియజేయుము. రాజైన సిద్కియా నీకు ఏమి చెప్పినాడో కూడ మాకు చెప్పు. మాకు నిజాయితీగా అంతాచెప్పు. లేకుంటే మేము నిన్ను చంపివేస్తాం’ అని అంటారు. 26 వారు నీతో అలా అన్నప్పుడు, ‘నన్ను మరల యెనాతాను ఇంటి క్రిందగల చెరసాల గదిలోకి పంపవద్దని రాజును వేడుకుంటున్నాను. మళ్లీ నేనా చెరసాల గదికి పంపబడితే చనిపోతాను’ అని అన్నట్లు చెప్పు.”

27 అనుకున్నదంతా జరిగింది. రాజ్యాధికారులు యిర్మీయాను ప్రశ్నించటానికి వచ్చారు. యిర్మీయా మాత్రం రాజు ఆజ్ఞానుసారం ఆయన చెప్పిన రీతిగా వారికి సమాధానమిచ్చాడు. అప్పుడా అధికారులు యిర్మీయాను ఒంటరిగా వదిలారు. యిర్మీయా మరియు రాజు ఏమి మాట్లాడారో ఏ ఒక్కరూ వినలేదు.

28 యెరూషలేము ముట్టడింపబడేనాటి వరకు యిర్మీయా ఆలయ ప్రాంగణంలో బందీగా ఉన్నాడు.

యెరూషలేము పతనం

39 యెరూషలేము ఈ విధంగా లోబరచుకోబడింది: యూదా రాజ్యంలో సిద్కియా పాలన తొమ్మిది సంవత్సరాలు దాటి పదవ నెల గడుస్తూఉంది. అప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యాన్నంతా కూడగట్టుకొని యెరూషలేము మీదికి తరలి వచ్చాడు. దానిని ఓడించటానికి అతడు నగరాన్ని ముట్టడించాడు. సిద్కియా పాలనలో పదకొండు సంవత్సరాల నాలుగు నెలలు దాటి తొమ్మిదవ రోజున యెరూషలేము నగర ప్రాకారం (గోడ) పగులగొట్టబడింది. దానితో బబులోను రాజు యొక్క ఉన్నతాధికారులంతా యెరూషలేము నగరం ప్రవేశించారు. వారు మధ్య ద్వారం వద్దకు వచ్చి కూర్చున్నారు. ఆ వచ్చిన వారిలో సిమ్గరు జిల్లాకు పాలకుడైన నేర్గల్‌షరేజరు; మరొక ప్రముఖమైన అధికారి శర్సెకీము; తదితర ఉన్నతాధికారులు ఉన్నారు.

యూదా రాజగు సిద్కియా బబులోను నుంచి వచ్చిన అధికారులను చూచి తన సైనికులతో కలసి పారిపోయాడు. రాత్రి సమయంలో వారు యెరూషలేమును వదిలి రాజుయొక్క ఉద్యానవనం ద్వారా బయటకు వెళ్లారు. రెండు గోడల మధ్య వున్న ద్వారం గుండా వారు వెళ్లారు. వారక్కడి నుండి ఎడారివైపు వెళ్లారు. కాని కల్దీయుల సైన్యం సిద్కియాను, అతనితో ఉన్న సైనికులను తరుముకుంటూ పోయారు. కల్దీయుల సైన్యం సిద్కియాను యెరికో మైదానాలలో పట్టుకున్నారు. వారు సిద్కియాను పట్టుకుని బబులోను రాజగు నెబుకద్నెజరు వద్దకు తీసికొని వెళ్లారు. నెబుకద్నెజరు ఆ సమయంలో హమాతు రాజ్యంలో ఉన్న రిబ్లా పట్టణంలో ఉన్నాడు. ఆ ప్రదేశంలో సిద్కియాకు వ్యతిరేకంగా నెబుకద్నెజరు తన తీర్పును ఇచ్చాడు. రిబ్లా పట్టణంలో సిద్కియా కుమారులను అతను చూస్తూ ఉండగానే బబులోను రాజు చంపివేశాడు. మరియు సిద్కియా చూస్తూ ఉండగానే యూదా రాజ్యాధికారులందరినీ నెబుకద్నెజరు చంపివేశాడు. తరువాత సిద్కియా కండ్లను నెబుకద్నెజరు పెరికివేశాడు. అతడు సిద్కియాకు కంచు సంకెళ్లను తగిలించి బబులోనుకు తీసికొని పోయాడు.

బబులోను సైన్యం రాజగృహానికి, యెరూషలేము వాసుల ఇండ్లకు నిప్పు పెట్టారు. మరియు వారు యెరూషలేము గోడలను పడగొట్టారు. నెబూజరదాను అను వ్యక్తి బబులోను రాజు ప్రత్యేక అంగరక్షకుల దళానికి అధిపతి. అతడు యెరూషలేములో ఉన్న వారిని బందీలుగా పట్టుకున్నాడు. అతడు వారిని బబులోనుకు తీసికొని పోయాడు. 10 కాని ప్రత్యేక అంగరక్షకుల దళాధికారి నెబూజరదాను యూదాలోని కొంతమంది పేద ప్రజలను నగరంలో వదిలివేశాడు. వారు ఆస్తి పాస్తులు ఏమీ లేనివారు. కావున ఆ రోజున నెబూజరదాను యూదాలోని పేద ప్రజలకు ద్రాక్షాతోటలను, పొలాలను ఇచ్చాడు.

11 కాని యిర్మీయా విషయంలో నెబుకద్నెజరు ప్రత్యేక అంగరక్షక దళాధికారి నెబూజరదానుకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. 12 “యిర్మీయాను వెదకి తెలిసికొని అతని విషయంలో జాగ్రత్త తీసికో. అతనిని గాయపర్చవద్దు. అతనేదడిగితే అది యివ్వు” అని ఆజ్ఞ ఇచ్చాడు.

13 ప్రత్యేక అంగరక్షక దళాధికారి నెబూజరదాను, బబులోను సైన్యంలో ముఖ్యాధికారియైన నెబూషజ్బాను, మరో ఉన్నతాధికారి నేర్గల్షరేజరు మరియు ఇతర బబులోను సైన్యాధికారులు యిర్మీయాను పిలిపించారు. 14 యూదా రాజు రక్షకుల ఆధీనంలో ఆలయ ప్రాంగణంలో వున్న యిర్మీయాను ఆ వచ్చిన వ్యక్తులు బయటకు తీసికొని వెళ్లారు. బబులోను సైన్యాధికారులు యిర్మీయాను గెదల్యాకు[h] అప్పగించారు. గెదల్యా అనేవాడు అహీకాము కుమారుడు. అహీకాము అనేవాడు షాఫాను కుమారుడు. యిర్మీయాను తిరిగి ఇంటికి తీసికొని పోవటానికి గెదల్యాకు ఆజ్ఞ ఇవ్వబడింది. అందువల్ల యిర్మీయా తన ఇంటికి తీసికొనిపోబడగా అతడు తన ప్రజలతో కలిసి నివసించాడు.

ఎబెద్మెలెకునకు యెహోవా వర్తమానం

15 ఆలయ ప్రాంగణంలో యిర్మీయా బందీగా ఉన్నప్పుడు యెహోవా నుండి ఒక వర్తమానం అతనికి వచ్చింది. ఆ వర్తమానం ఇలా ఉంది: 16 “యిర్మీయా, నీవు వెళ్లి ఈ వర్తమానాన్ని ఇతియోపియవాడగు ఎబెద్మెలెకునకు అందజేయుము: ‘ఇతశ్రాయేలీయుల దేవుడు సర్వశక్తుడు అయిన యెహోవా ఇలా చెప్పుచున్నాడు, ఈ యెరూషలేము నగర విషయంలో నా వర్తమానాలన్నీ అతి త్వరలో నిజమయ్యేలా చేస్తాను. వినాశనం ద్వారా నా వర్తమానాలు నిజమవుతాయిగాని శుభ కార్యాల ద్వారా కాదు. నేను చెప్పినదంతా నిజమవటం నీ కళ్లతో నీవే చూస్తావు. 17 కాని ఎబెద్మెలెకూ, ఆ రోజున నిన్ను నేను రక్షిస్తాను.’ ఇది యెహోవా సందేశం. ‘నీవు ఎవరిని చూచి భయబడుతున్నావో వారికి నిన్ను అప్పగించను. 18 ఎబెద్మెలెకూ, నిన్ను నేను రక్షిస్తాను. నీవు కత్తివాతబడి చనిపోవు. నీవు తప్పించుకొని జీవిస్తావు. నీవు నన్ను నమ్మావు. గనుక అలా జరుగుతుంది.’” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చింది.

హెబ్రీయులకు 3

యేసు మోషే కన్నా గొప్పవాడు

పరలోక దేవుని పిలుపులో పాలివారైన సోదరులారా! మీరు పవిత్రత గలవాళ్ళు. మనం బహిరంగంగా విశ్వసిస్తున్న ప్రధాన యాజకుడు, దేవుని అపొస్తలుడు అయినటువంటి యేసు పట్ల మీ మనస్సు లగ్నం చెయ్యండి. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అలాగే యేసు కూడా తనను నియమించిన దేవునియందు నమ్మకస్తుడుగా ఉండెను. ఇంటికంటే, ఇల్లు కట్టిన వానికి ఎక్కువ గౌరవముంటుంది. అలాగే మోషే కన్నా యేసు ఎక్కువ గౌరవవానికి అర్హుడనిపించుకొన్నాడు. ఎందుకంటే, ప్రతి ఇంటిని ఎవరో ఒకడు కడతాడు, కాని దేవుడు అన్నిటినీ నిర్మించాడు. దేవుని ఇల్లంతటిలో మోషే సేవకునిగా విశ్వాసంతో పని చేసాడు. ఆ కారణంగా, చాలా కాలం తర్వాత మోషే జరుగబోవువాటికి సాక్షిగా ఉండెను. కాని క్రీస్తు దేవుని ఇల్లంతటికి నమ్మకస్తుడైన కుమారుడు. మనం అతిశయించే నిరీక్షణ, ధైర్యంను గట్టిగా పట్టుకొన్నవారమైతే మనం ఆయన ఇల్లౌతాం. అందువల్ల మనం అశిస్తున్న దానికోసం, విశ్వాసంతో ధైర్యంగా ఉంటే ఆ యింటికి చెందినవాళ్ళమౌతాము.

దేవుని ప్రజలకు విశ్రాంతి

7-8 అందువల్ల పరిశుద్ధాత్మ ఈ విధంగా అంటున్నాడు:

“ఆనాడు ఎడారిలో మూర్ఖులై మీరాయనకు ఎదురు తిరిగారు.
    ఆయన సహనాన్ని పరీక్షించారు.
    కాని నేడు మీరాయన మాట వింటే మీ హృదయాలు కఠిన పర్చుకోవద్దు.
నేను నలభై సంవత్సరాలు చేసినదంతా చూసి కూడా
    మీ పూర్వికులు నన్నూ, నా సహనాన్ని పరీక్షించారు.
10 ఆ కారణంగానే, ఆ ప్రజలంటే నాకు కోపం వచ్చింది,
    ‘వాళ్ళ హృదయాలు పెడదారులు పట్టాయి,
    నేను చూపిన దారుల్ని వాళ్ళు చూడ లేదు’ అని అన్నాను.
11 అందుకే, ‘నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వనని
    కోపంతో ప్రమాణం చేశాను.’”(A)

12 సోదరులారా! సజీవంగా ఉన్న దేవునికి దూరమైపోయే హృదయంకాని, విశ్వాసంలేని హృదయంకాని, మీలో ఉండకుండా జాగ్రత్త పడండి. 13 ఆ “నేడు” అనేది యింకా ఉంది గనుక, పరస్పరం ప్రతి రోజు ప్రోత్సాహపరచుకొంటూ ఉండండి. అప్పుడు పాపం మిమ్మల్ని మోసం చెయ్యలేదు. మీలో మూర్ఖత్వం ఉండదు. 14 మనలో మొదటినుండి ఉన్న విశ్వాసాన్ని చివరిదాకా గట్టిగా పట్టుకొనివుంటే, మనం క్రీస్తుతో కలిసి భాగం పంచుకొంటాం. 15 ఇంతకు ముందు చెప్పబడినట్లు:

“ఆనాడు మూర్ఖులై మీరాయనకు ఎదురు తిరిగారు
    కాని, నేడు మీరాయన మాట వింటే అలా చెయ్యకండి.”(B)

16 వీళ్ళందరూ ఈజిప్టు దేశంనుండి మోషే పిలిచుకొని వచ్చిన ప్రజలే కదా! దేవుని స్వరం విని ఎదురు తిరిగింది వీళ్ళే కదా! 17 నలభై సంవత్సరాలు దేవుడు కోపగించుకొన్నది ఎవరిమీద? పాపం చేసి ఎడారిలో పడి చనిపోయినవాళ్ళమీదనే కదా! 18 “నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను” అని, అవిధేయతగా ప్రవర్తించినవాళ్ళ విషయంలో దేవుడు ప్రమాణం చేయలేదా? 19 వాళ్ళు విశ్వసించలేదు గనుక ఆ విశ్రాంతిలో ప్రవేశించలేకపొయ్యారు. ఇది మనం గమనిస్తూనే ఉన్నాము.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International