Old/New Testament
విగ్రహారాధనకు విరోధంగా హెచ్చరికలు
14 ఇశ్రాయేలు పెద్దలలో కొంతమంది నా వద్దకు వచ్చారు. వారు నాతో మాట్లాడాలని నావద్ద కూర్చున్నారు. 2 ఆ సమయంలో యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఈ విధంగా చెప్పాడు. 3 “నరపుత్రుడా, ఈ మనుష్యులు నీతో మాట్లాడాలని వచ్చారు. వారు నా సలహా కోరమని నిన్ను అడగటానికి వచ్చారు. కాని ఈ మనుష్యులు ఇంకా హేయమైన విగ్రహాలను కలిగివున్నారు. వారు పాపం చేయటానికి కారణమైన వస్తువులను వారింకా విడనాడలేదు. ఆ విగ్రహాలను వారింకా పూజిస్తూనే వున్నారు. అందువల్ల వారు నా సలహా కొరకు రావలసిన అవసరం ఏముంది? వారి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలా? అవసరం లేదు! 4 అయినా నేను వారికి ఒక సమాధానం ఇస్తాను. ఆది నేను వారిని శిక్షించటం! ఈ విషయాలు నీవు వారికి చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ఇశ్రాయేలుకు చెందిన వాడెవడైనా ఒక ప్రవక్త వద్దకు వచ్చి నా సలహా కోరితే, ఆ ప్రవక్త వానికి సమాధానం చెప్పడు. నాకై నేనే ఆ వ్యక్తి ప్రశ్నకు సమాధానమిస్తాను. ఆ వ్యక్తి తన హేయమైన విగ్రహాలను కలిగివున్నా, తన పాపాలకు కారణమైన వస్తువులను దాచివుంచినా, అతడా విగ్రహారాధన చేసినా, నేనతనికి సమాధానమిస్తాను. వానివద్ద అపవిత్ర విగ్రహాలున్నా నేనతనితో మాట్లాడతాను. 5 ఎందుకనగా నేను వారి హృదయాలను తాకకోరుచున్నాను. వారి నీచమైన విగ్రహాల కొరకు వారు నన్ను విడిచిపెట్టినా, నేను వారిని ప్రేమిస్తున్నట్లు చూపదలిచాను.’
6 “కావున ఇశ్రాయేలు వంశం వారికి ఈ విషయాలు చెప్పు. వారితో ఇలా అనాలి, ‘నా ప్రభువైన యెహోవా ఏమి చెబుతున్నాడనగా: నా వద్దకు తిరిగి రండి. మీ అపవిత్ర విగ్రహాలను వదిలివేయండి. ఆ బూటకపు దేవుళ్ళ నుండి దూరంకండి. 7 ఏ ఇశ్రాయేలీయుడు గాని, ఇశ్రాయేలులో నివసించే పరదేశీయుడుగాని నా వద్దకు సలహా కోరివస్తే, వానికి నేను సమాధానమిస్తాను. అతను అపవిత్ర విగ్రహాలను కలిగియున్నా, తను పాపాలు చేయటానికి కారకమైన వస్తువులను అతను దాచుకున్నా, అతను విగ్రహాలను ఆరాధించినా, అతనికి నేను సమాధానమిస్తాను. నేను వారికిచ్చే సమాధాన మిది: 8 నేనా వ్యక్తికి వ్యతిరేకినవుతాను. నేను వానిని నాశనం చేస్తాను. ఇతర ప్రజలకు అతడొక ఉదాహరణగా మిగులుతాడు. ప్రజలతనిని చూసి నవ్వుతారు. నా ప్రజల మధ్యనుండి అతనిని తొలగిస్తాను. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకొంటారు! 9 ఏ ప్రవక్తయేగాని మూర్ఖంగా తన స్వంత సమాధానమిస్తే, అతడెంత మూర్ఖుడో నేనతనికి నిరూపిస్తాను! అతనికి వ్యతిరేకంగా నా శక్తిని వినియోగిస్తాను. అతనని నాశనం చేసి, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల నుండి అతనిని తొలగిస్తాను. 10 కావున, సలహా కొరకు వచ్చిన వ్యక్తి, సమాధాన మిచ్చిన ప్రవక్త, ఇద్దరూ ఒకే శిక్షకు గురియవుతారు. 11 ఎందుకంటే, దానివల్ల ఆ ప్రవక్తలు నా ప్రజలను నాకు దూరం చేయకుండా ఆగిపోతారు. తద్వారా, నా ప్రజలు వారి పాపాలలో అపవిత్రము కాకుండా ఆగిపోతారు. అప్పుడు వారు నా ప్రత్యేక ప్రజలవుతారు. నేను వారి దేవుడనవుతాను.’” ఈ విషయాలన్నీ ప్రభువైన యెహోవా చెప్పాడు.
యెరూషలేము శిక్షించబడుతుంది
12 పిమ్మట యెహోవా వాక్కు నాకు తిరిగి వినిపించింది. ఆయన ఇలా చెప్పాడు, 13 “నరపుత్రుడా, నన్ను వదిలిపెట్టిన, నా పట్ల పాపంచేసిన ఏ దేశాన్నయినా నేను శిక్షిస్తాను. వారికి ఆహార సరఫరాలను నిలిపి వేస్తాను. వారికి కరువు కాలం రప్పించి, ఆ దేశ జనాభాని పశుసంపదను తొలగిస్తాను. 14 ఆ దేశంలో నోవహు, దానియేలు, యోబు నివసిస్తున్నప్పటికీ దానిని నేను శిక్షిస్తాను. ఆ మనుష్యులు వారి మంచితనం చేత వారి ప్రాణాలను కాపాడుకొనగలరు. కాని మొత్తం దేశాన్ని వారు రక్షించలేరు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
15 దేవుడు ఇంకా ఇలా తెలియజెప్పాడు: “లేదా, నేను ఆ రాజ్యానికి క్రూర మృగాలను పంపవచ్చు. ఆ జంతువులు ప్రజలందరినీ చంపివేయవచ్చు. ఈ క్రూర మృగాల కారణంగా ఆ దేశం గుండా ఎవ్వరూ ప్రయాణం చేయరు. 16 ఒకవేళ ఆ దేశంలో నోవహు, దానియేలు, యోబు[a] నివసిస్తూవుంటే ఆ ముగ్గురు మంచి వ్యక్తులనూ నేను రక్షిస్తాను. ఆ ముగ్గురు మనుష్యులూ తమ ప్రాణాలను కాపాడుకోగలరు. నా జీవ ప్రమాణంగా వారు ఇతరుల ప్రాణాలను గాని, కనీసం వారి కుమారులను, కుమార్తెలను గాని రక్షించలేరని నిశ్చయంగా చెబుతున్నాను! ఆ చెడ్డదేశం నాశనం చేయబడుతుంది!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
17 దేవుడు ఈ విధంగా చెప్పాడు: “లేదా, నేను శత్రుసైన్యాన్ని ఆ దేశం మీదికి పంపవచ్చు. ఆ సైనికులు ఆ రాజ్యాన్ని నాశనం చేస్తారు. దేశంలో వున్న మనుష్యులను, జంతువులను తొలగించి వేస్తాను. 18 నోవహు, దానియేలు, యోబు అక్కడ వుంటే, ఆ ముగ్గురు మంచి వ్యక్తులను నేను రక్షిస్తాను. ఆ ముగ్గురు మునుష్యులూ వారి ప్రాణాలను కాపాడుకోగలుగుతారు. కాని, నా జీవ ప్రమాణంగా ఇతర ప్రజల ప్రాణాలను గాని, తమ స్వంత కుమారుల, కుమార్తెల ప్రాణాలను గాని కాపాడలేరని చెబుతున్నాను. ఆ చెడ్డదేశం నాశనం చేయబడుతుంది!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
19 దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “లేదా, ఆ దేశం మీద ఒక వ్యాధి ప్రబలేలా నేను చేయవచ్చు. ఆ ప్రజల మీద నా కోపం కుమ్మరిస్తాను. ఆ రాజ్యంనుండి ప్రజలందరినీ, పశువులన్నిటినీ నేను తొలగించి వేస్తాను. 20 ఒకవేళ నొవహు, దానియేలు, యోబు అక్కడ నివసిస్తే, ఆ ముగ్గురు మనుష్యులను నేను రక్షిస్తాను. ఎందువల్లనంటే వారు మంచి వ్యక్తులు. ఆ ముగ్గురూ తమ ప్రాణాలను కాపాడుకోగలరు. కాని, నా ఆత్మ సాక్షిగా వారు ఇతర ప్రజలను గాని, వారి స్వంత కొడుకులను, కుమార్తెలను గాని రక్షించలేరు!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
21 మళ్లీ నా ప్రభువైన యెహోవా ఈ విధంగా చెప్పాడు: “కావున యెరూషలేము పరిస్థితి ఎంత దారుణంగా వుంటుందో ఆలోచించు. ఆ నాలుగు రకాల శిక్షలనూ ఆ నగరం మీదికి పంపుతాను! ఆ నగరం మీదికి శత్రుసైన్యాలను. క్షామాన్ని, రోగాలను, క్రూర మృగాలను పంపుతాను. ఆ రాజ్యం నుండి ప్రజలను, పశువులను అందరినీ తొలగిస్తాను! 22 కొంతమంది ప్రజలు ఆ దేశంనుండి తప్పించు కుంటారు. వారు తమ కుమారులను, కుమార్తెలను తీసుకొని నీ సహాయం కొరకు వస్తారు. నిజంగా వారెంత చెడ్డవారో నీవప్పుడు తెలుసుకొంటావు. నేను యెరూషలేము మీదకి రప్పించే కష్టాలను గూర్చి నీవప్పుడు యోచించి అవి వారికి తగినవేనని నీవనుకుంటావు. 23 నీవు వారి జీవన విధానాన్ని, వారు చేసే చెడుకార్యాలను చూస్తావు. నేనా ప్రజలను శిక్షించటానికి తగిన కారణమున్నట్లు నీవు అప్పుడు తెలుసుకుంటావు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
ద్రాక్షావల్లి యెరూషలేము దహించబడుతుంది
15 మరల దేవుని వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 2 “ఓ నరపుత్రుడా, అడవిలో నరికి తెచ్చిన చిన్న కొమ్మల కన్నా ద్రాక్షాతీగ పుల్లలు ఏమైనా మిన్న అయినవా? కాదు! 3 ద్రాక్షా తోటల[b] నుంచి తెచ్చిన పుల్లలను ఏ పనికైనా నీవు వినియోగించగలవా? లేదు! ఆ కట్టెను పాత్రలు తగిలించే కొక్కెములకైనా నీవు వినియోగించగలవా? లేదు! 4 ప్రజలా పుల్లలను కేవలం నిప్పులో వేస్తారు. కొన్ని పుల్లలు రెండు చివరలా మండుతూ మధ్య భాగం పొగకమ్మి నల్లబడతాయి. అంతేగాని పుల్లలు పూర్తిగా తగులబడవు. ఆ సగం కాలిన పుల్లతో నీవేమైనా చేయగలవా? 5 ఆ పుల్ల కాలక ముందు దానితో నీవు ఏమీ చేయలేకపోతే, నిజానికి అది కాలిన తరువాత దానితో నీవు ఏమి చేయగలవు! 6 కావున ద్రాక్షా తోటలో తెచ్చిన పుల్లలూ కేవలం అడవిలో తెచ్చిన పుల్లల మాదిరే వుంటాయి. ప్రజలా పుల్లలను నిప్పులో వేస్తారు. నిప్పు వాటిని కాల్పివేస్తుంది. అదేరకంగా, యెరూషలేములో నివసిస్తున్న ప్రజలను నేను అగ్నిలో పడవేస్తాను!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 7 “ఆ ప్రజలను నేను శిక్షిస్తాను. కాని వారిలో కొంతమంది పూర్తిగా కాలని పుల్లల వంటివారు. వారు శిక్షింపబడతారు. అంతేగాని వారు సర్వనాశనం చేయబడరు. నేను ఈ ప్రజలను శిక్షించటం నీవు చూస్తావు. ఆ శిక్షించింది యెహోవాయే అని కూడా నీవు తెలుసుకుంటావు! 8 ప్రజలు బూటకపు దేవుళ్లను ఆరాధించే నిమిత్తం నన్ను వదిలిపెట్టిన కారణంగా, నేను ఆ రాజ్యాన్ని నాశనం చేస్తాను.” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
పక్షపాతం చూపరాదు
2 నా సోదరులారా! తేజోవంతుడైన మన యేసుక్రీస్తు ప్రభువును విశ్వసిస్తున్న మీరు పక్షపాతం చూపకూడదు. 2 బంగారు ఉంగరాలు, మంచి దుస్తులు వేసుకొన్నవాడొకడు, మాసిన దుస్తులు వేసుకొన్నవాడొకడు మీ సమావేశానికి వస్తారనుకోండి. 3 అప్పుడు మీరు మంచి దుస్తులు వేసుకొన్నవాని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తూ, “రండి! ఈ మంచి స్థానంలో కూర్చోండి” అని అంటూ, పేదవానితో, “నీవక్కడ నిలబడు!” అనిగాని, “నా కాళ్ళ దగ్గర కూర్చో” అనిగాని అంటే, 4 మీరు వ్యత్యాసము చూపుతున్నట్లే కదా! దుర్బుద్ధితో తీర్పు చెప్పినట్లే కదా!
5 నా ప్రియమైన సోదరులారా! ప్రపంచం దృష్టిలో పేదవాళ్ళు విశ్వాసంలో ధనికులు కావాలనీ, వాళ్ళు తన రాజ్యానికి వారసులు కావాలనీ దేవుడు వాళ్ళను ఎన్నుకోలేదా? తనను ప్రేమించినవాళ్ళకు రాజ్యాన్నిస్తానని దేవుడు యింతకు క్రితమే వాగ్దానం చేసాడు. 6 మీరు పేదవాళ్ళను అవమానిస్తున్నారు. మిమ్మల్ని దోచుకొనే వాళ్ళు ధనికులే కదా! వాళ్ళేకదా మిమ్ములను న్యాయస్థానానికి ఈడ్చేది? 7 మీరు ఎవరికి చెందారో గౌరవప్రదమైన ఆయన పేరును దూషిస్తున్నది వాళ్ళే కాదా?
8 “నీ పొరుగింటివాణ్ణి నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా ప్రేమించు”(A) అని ధర్మశాస్త్రంలో ఉన్న ఈ ఆజ్ఞను మీరు నిజంగా పాటిస్తే మీలో సత్‌ప్రవర్తన ఉన్నట్లే. 9 కాని ఒకవేళ మీరు పక్షపాతం చూపితే పాపం చేసినవాళ్ళౌతారు. తద్వారా ధర్మశాస్త్రం ప్రకారం మీరు నీతిని ఉల్లంఘించినవాళ్ళౌతారు.
10 ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్న నియమాలన్నిటినీ పాటిస్తూ ఒకే ఒక నియమాన్ని ఉల్లంఘిస్తే అలాంటివాడు ధర్మశాస్త్రాన్నంతా ఉల్లంఘించినవాడౌతాడు. 11 ఎందుకంటే, “వ్యభిచారం చేయరాదు”(B) అని అన్నవాడే “హత్యచేయరాదు” అని కూడా అన్నాడు. మీరు వ్యభిచారం చేసివుండక పోవచ్చు. కాని హత్య చేసి ఉంటే! అలాంటప్పుడు మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్లే కదా!
12 స్వేచ్ఛను కలిగించే క్రొత్త ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు పొందనున్న వాళ్ళలా ప్రవర్తించండి. అదేవిధంగా మాట్లాడండి. 13 దేవుడు తీర్పు చెప్పేటప్పుడు దయాహీనులపై దయ చూపడు. కాని దయచూపిన వాళ్ళు తీర్పు చెప్పే సమయంలో ఆనందిస్తారు.
విశ్వాసము, క్రియ
14 నా సోదరులారా! “నాకు విశ్వాసం ఉంది” అని అన్న వ్యక్తి ఆ విశ్వాసాన్ని క్రియా రూపకంగా చూపకపోతే అది నిష్ప్రయోజనం. అలాంటి విశ్వాసం అతణ్ణి రక్షించగలదా? 15 ఒక సోదరుడో లేక సోదరియో కూడూ గుడ్డా లేక బాధపడ్తున్నారనుకోండి. 16 అప్పుడు మీరు అతనితో, “క్షేమంగా వెళ్ళిరా! కడుపునిండా తిని, ఒంటి నిండా దుస్తులు వేసుకో!” అని అంటూ వాళ్ళ అవసరాలు తీర్చకపోతే దానివల్ల వచ్చిన లాభమేమిటి? 17 విశ్వాసంతో పాటు క్రియ లేకపోతే ఆ విశ్వాసం పూర్తిగా నిష్ప్రయోజనమైపోతుంది.
18 కాని, “ఒకనిలో విశ్వాసం ఉండవచ్చు. మరొకనిలో క్రియ ఉండవచ్చు!” అని మీరనవచ్చు! అలాగైతే క్రియలు లేకుండా మీలో ఉన్న విశ్వాసాన్ని నాకు చూపండి. నేను క్రియారూపకంగా నా విశ్వాసాన్ని చూపుతాను. 19 ఒక్కడే దేవుడున్నాడని మీరు విశ్వసిస్తారు. మంచిదే. దయ్యాలు కూడా దాన్ని నమ్ముతాయి. అయినా, దేవుడు తమను శిక్షిస్తాడేమోనని భయపడ్తూ ఉంటాయి.
20 ఓ మూర్ఖుడా! క్రియలు లేని విశ్వాసం వ్యర్థమన్న[a] దానికి నీకు ఋజువు కావాలా? 21 మన పూర్వికుడు అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠంపై బలిగా యివ్వటానికి సిద్ధమైనందుకు దేవుడతణ్ణి, అతడు చేసిన క్రియలను బట్టి నీతిమంతునిగా పరిగణించలేదా? 22 అతనిలో ఉన్న విశ్వాసము క్రియతో కలిసి పని చెయ్యటం మీరు గమనించారు. అతడు చేసిన క్రియ అతని విశ్వాసానికి పరిపూర్ణత కలిగించింది. 23 “అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు. తద్వారా దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు”(C) అని లేఖనాల్లో చెప్పిన విషయం నిజమైంది. దేవుడతణ్ణి తన మిత్రునిగా పిలిచాడు. 24 మానవునిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి మాత్రమే కాకుండా అతడు చేసిన క్రియలను బట్టి నీతిమంతునిగా పరిగణింపబడటం మీరు చూసారు.
25 మరొక ఉదాహరణ రాహాబు. ఆమె గూఢచారులకు ఆతిథ్యమిచ్చి వాళ్ళను వేరొక దారిన పంపివేసింది. ఆమె చేసిన క్రియను బట్టి దేవుడు ఆమెను నీతిమంతురాలిగా పరిగణించ లేదా?
26 ఆత్మలేని శరీరం ఏ విధంగా నిర్జీవమైందో అదే విధంగా క్రియలేని విశ్వాసము నిర్జీవమైనది.
© 1997 Bible League International