Old/New Testament
నాయకులకు విరోధంగా ప్రవచనాలు
11 తరువాత ఆత్మ (గాలి) నన్ను యెహోవా ఆలయపు తూర్పుద్వారం వద్దకు తీసుకొని వెళ్లింది. సూర్యుడు ఉదయించే వైపుకు ఈ ద్వారం తిరిగి ఉంది. ఈ ద్వారం ముందు ఇరవైఐదు మంది మనుష్యులున్నట్లు నేను చూశాను. అజ్జూరు కుమారుడైన యజన్యా వారితోవున్నాడు. బెనాయా కుమారుడు పెలట్యా కూడా అక్కడ వున్నాడు. పెలట్యా ఆ ప్రజలకు నాయకుడుగా ఉండెను.
2 పిమ్మట దేవుడు నాతో ఇలా అన్నాడు: “నరపుత్రుడా, ఈ నగరానికి కీడు మూడే పథకాలు వేసేవారు వీరే. ప్రజలు చెడు కార్యాలు చేయటానికి వీరు నిత్యం ప్రోత్సహిస్తారు. 3 ఈ మనుష్యులు, ‘మా ఇండ్లు మేము త్వరలో తిరిగి నిర్మించుకుంటాము. కుండలో మాంసంలా మేమీ నగరంలో సురక్షితంగా ఉన్నాము!’ అని అంటున్నారు. 4 వారీ అబద్ధాలు చెపుతున్నారు. కావున నీవు నా తరపున ప్రజలతో మాట్లాడాలి. ఓ నరపుత్రుడా, నీవు వెళ్లి ప్రజలకు భవిష్యత్తు యొక్క నిజాలను ప్రకటించు.”
5 ఆ తరువాత యెహోవా ఆత్మ నా మీదికి వచ్చాడు. దేవుడు ఇలా చెప్పాడు: “యెహోవా ఈ మాట చెప్పాడని వారికి తెలియజేయి: ఇశ్రాయేలు వంశీయులారా, మీరు పెద్ద పెద్ద విషయాలు చేయపూనుకొంటున్నారు. కాని మీరు ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు! 6 మీరీ నగరంలో అనేక మందిని చంపివేశారు. వీధులన్నిటినీ మీరు శవాలతో నింపివేశారు. 7 ఇప్పుడు మన ప్రభువైన యెహోవా చెపుతున్నదేమంటే, ‘ఈ శవాలే ఆ మాంసం. నగరమే ఆ కుండ. కాని అతడు (నెబకద్నెజరు) వచ్చి ఈ సురక్షితమైన కుండలో నుండి మిమ్మల్ని తీసుకొనిపోతాడు! 8 మీరు కత్తికి భయపడుతున్నారు. కాని మీ మీదికి నేను కత్తిని తీసుకువస్తున్నాను!’” మన ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. కావున అవి నెరవేరితీరుతాయి!
9 దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “మిమ్మల్ని ఈ నగరం నుండి నేను బయటికి తీసుకొని వెళతాను. మిమ్మల్ని అన్యులకు అప్పగిస్తాను. నేను మిమ్మల్ని శిక్షిస్తాను! 10 మీరు కత్తికి గురియై చనిపోతారు. నేను మిమ్మల్ని అక్కడే ఇశ్రాయేలులో శిక్షిస్తాను. తద్వారా మిమ్మల్ని శిక్షించేది నేనే అని మీరు తెలుసుకొంటారు. నేనే యెహోవాను. 11 అవును. ఈ నగరం వంటపాత్ర అవుతుంది. మీరు అందులో ఉడికే మాంసం! మిమ్మల్ని ఇక్కడే ఇశ్రాయేలులో శిక్షిస్తాను. 12 అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. మీరు భగ్నపర్చింది నా ధర్మాన్నే! మీరు నా ఆజ్ఞలను శిరసావహించలేదు. మీ చుట్టూ వున్న దేశాల ప్రజల మాదిరిగానే మీరూ జీవించటానికి నిర్ణయించుకున్నారు.”
13 నేను దేవుని తరపున మాట్లాడటం పూర్తిచేసిన వెంటనే బెనాయా కుమారుడైన పెలట్యా చని పోయాడు! నేను వెంటనే సాష్టాంగపడి, నా శిరస్సు భూమికి ఆనించి ఇలా పెద్ద గొంతుకతో అరిచాను: “నా ప్రభువైన ఓ యెహోవా, నీవు ఇశ్రాయేలులో మిగిలిన వారందరినీ పూర్తిగా నాశనం చేయబోతున్నావు!”
యెరూషలేము శేషులకు విరోధంగా ప్రవచనాలు
14 కాని యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా చెప్పాడు: 15 “నరపుత్రుడా, ఈ దేశాన్నుండి వెడలగొట్టబడిన ఇశ్రాయేలు సంతతివారగు నీ సోదరులను నీవు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఇక్కడికి చాలా దూరంలో వున్న దేశంలో వారు నివసిస్తున్నారు. అయినా నేను వాళ్ళను తిరిగి రప్పిస్తాను. ‘కాని యెరూషలేములో ఉంటున్న జనులు యెహోవాకు దూరంగా ఉండండి. ఈ దేశం మాకు ఇవ్వబడింది.’ ఇది మాది అని అంటున్నారు.
16 “కావున ఈ విషయాలు ఆ ప్రజలకు తెలియ జేయుము, మన ప్రభువైన యెహోవా చెప్పున దేమంటే, ‘నా ప్రజలు దూరదేశాలకు తరలిపోయేలా నేను ఒత్తిడి చేసిన మాట నిజమే. అనేక దేశాలలో నివసించేలా వారిని చెల్లా చెదురు చేశాను. అయినా వాళ్ళు ఆ దేశాలలో ఉన్నప్పుడు కొద్దికాలం నేనే వారి ఆలయమై ఉంటాను. 17 కావున వారి ప్రభువైన యెహోవా వారిని తిరిగి తీసుకువస్తాడని నీవు ఆ ప్రజలకు చెప్పాలి. నేను మిమ్మల్ని అనేకదేశాలకు చెదరగొట్టాను. కాని మిమ్మల్ని మళ్లీ చేరదీసి, ఆయా దేశాలనుండి తిరిగి తీసుకొని వస్తాను. ఇశ్రాయేలు దేశాన్ని మళ్లీ మీకు ఇస్తాను! 18 నా ప్రజలు తిరిగి వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న అపవిత్రమైన విగ్రహాలన్నింటినీ వారు నాశనం చేస్తారు. 19 నేను వారందరినీ చేరదీసి, ఒక్క మనిషిలా వారిలో ఐకమత్యం కలుగజేస్తాను. వారికి నూతన ఆత్మ కలుగజేస్తాను. రాతి గుండెను తీసివేసి, దాని స్థానంలో మాంసపు గుండెను అమర్చుతాను. 20 అప్పుడు వారు నా ధర్మాలను పాటిస్తారు. వారు నా ఆజ్ఞలను పాటిస్తారు. నేను వారికి చెప్పిన పనులు చేస్తారు. అప్పుడు వారు నిజంగా నా ప్రజలవుతారు. నేను వారి దేవుడి నవుతాను.’”
యెహోవా మహిమ యెరూషలేమును వదలుట
21 దేవుడు ఇంకా ఇలా అన్నాడు: “కాని ఇప్పుడు వారి హృదయాలు ఆ భయంకరమైన, హేయమైన విగ్రహాలకు చెందివున్నాయి. కనుక ఆ ప్రజలు చేసిన దుష్కార్యాలకు నేను వారిని శిక్షించాలి.” నా ప్రభువైన యెహోవా ఆ మాటలు చెప్పాడు. 22 పిమ్మట కెరూబులు తమ రెక్కలు విప్పి గాలిలో ఎగిరిపోయారు. చక్రాలు వారితో వెళ్లాయి. ఇశ్రాయేలు దేవుని మహిమ వారిపైన ఉంది. 23 యెహోవా మహిమ గాలిలోకి లేచి యెరూషలేమును వదిలి వెళ్లింది. యెరూషలేముకు తూర్పున వున్న కొండ[a] మీద దేవుడు ఒక్క క్షణం ఆగాడు. 24 పిమ్మట ఆత్మ నన్ను గాలిలోకి లేపి మళ్ళీ బబులోను (బాబిలోనియా)కు తీసుకొని వచ్చాడు. ఆయన నన్ను ఇశ్రాయేలు నుండి బలవంతంగా వెళ్లగొట్టబడిన ప్రజల వద్దకు తీసుకొనివచ్చాడు. ఆ దర్శనంలోనే యెహోవా ఆత్మ గాలిలోకి లేచి, నన్ను వదిలి వెళ్లాడు. అవన్నీ నేను దర్శనంలో చూశాను. 25 పిమ్మట బందీలుగా వున్న (చెరపట్టబడిన) ప్రజలతో నేను మాట్లాడాను. యెహోవా నాకు చూపిన అన్ని విషయాల గురించీ వారికి చెప్పాను.
యెహెజ్కేలు బంధీగా వదలుట
12 తరువాత యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 2 “నరపుత్రుడా, నీవు తిరుగుబాటుదారుల మధ్య వున్నావు. వారు ఎప్పుడూ నాకు వ్యతిరేకంగా వుంటున్నారు. నేను వారి కొరకు చేసిన పనులను చూడటానికి వారికి కళ్ళున్నాయి. అయినా వాటినివారు చూడలేరు. వారిని నేను చేయమని చెప్పిన విషయాలను వినటానికి వారికి చెవులున్నాయి. అయినా వారు నా ఆజ్ఞలను వినరు. ఎందువల్లనంటే వారు తిరుగుబాటుదారులు. 3 కావున, నరపుత్రుడా, నీ సామాన్లు సర్దుకో. నీవొక సుదూర దేశానికి పోతున్నట్లు నటించు. ప్రజలిదంతా చూసేలా నీవు చేయాలి. బహుశః వారు నిన్ను చూడవచ్చు. కాని వారు మిక్కిలి తిరుగుబాటుదారులు.
4 “ప్రజలు నిన్ను చూసే విధంగా నీ సామాన్లు పగటిపూట బయటకు తీసుకొని వెళ్ళు. మళ్లీ సాయంత్రం నీవొక బందీవలె దూరదేశానికి వెళ్తున్నట్లు ప్రవర్తించు. 5 మళ్లీ ఆ జనులు గమనిస్తూ వుండగా గోడకు కన్నం పెట్టి, దాని గుండా నీవు బయటికి వెళ్లు. 6 రాత్రిపూట నీ సామాను సంచి భుజం మీద వేసుకొని బయలుదేరు. నీవు ఎక్కడికి వెళ్ళుతున్నావో నీకే తెలియని విధంగా నీ ముఖాన్ని కప్పుకోవాలి. జనులు నిన్ను గమనించేందుకు నీవీ పనులు చేయాలి. ఎందువల్లనంటే ఇశ్రాయేలు వంశానికి ఒక ఆదర్శంగా నేను నిన్ను వినియోగించుకుంటున్నాను!”
7 కావున నేను (యెహెజ్కేలు) యెహోవా ఆజ్ఞ ప్రకారం చేశాను. పగటివేళ నా సంచులు తీసుకొని నేనొక దూరదేశానికి వెళ్లి పోతున్నట్లు నటించాను. ఆ సాయంత్రం నా చేతులతో గోడకు కన్నం వేశాను. రాత్రివేళ నా సంచి చంకకు తగిలించుకొని బయలు దేరాను. ఈ పనులన్నీ ప్రజలు గమనించే విధంగా చేశాను.
8 మరునాటి ఉదయం యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 9 “నరపుత్రుడా, ఇశ్రాయేలీయులైన ఆ తిరుగుబాటుదారులు నీవు ఏమి చేస్తున్నావని నిన్ను అడిగారా? 10 వారి ప్రభువగు యెహోవా ఈ విషయాలు చెప్పాడని తెలియజేయి. ఈ విషాద సమాచారం యెరూషలేము నాయకునకు (పాలకుడు), అక్కడ నివసిస్తున్న ఇశ్రాయేలీయులందరికీ సంబంధించినది. 11 ‘మీ అందరికీ నేను (యెహెజ్కేలు) ఒక ఆదర్శం అనీ, నేను చేసి చూపించినవి మీకు తప్పక జరుగుతాయని’ చెప్పుము. మీరు తప్పక దూరదేశాలకు బలవంతాన బందీలుగా తీసుకొని పోబడతారు. 12 మీ నాయకుడు (పాలకుడు) రాత్రి పూట గోడకు కన్నం వేసి దొంగచాటుగా బయటకు పారిపోతాడు. ప్రజలతనిని గుర్తు పట్టకుండా, అతడు తన ముఖాన్ని కప్పుకుంటాడు. అతడెక్కడికి వెళ్ళుచున్నాడో అతని కన్నులు చూడలేవు. 13 అతడు తప్పించుకోవటానికి ప్రయత్నిస్తాడు. కాని నేను (దేవుడు) అతనిని పట్టుకుంటాను! అతడు నా వలలో చిక్కుకుంటాడు. నేనతనిని కల్దీయుల రాజ్యమైన బబులోను (బాబిలోనియా)కు తీసుకొని వస్తాను. కాని అతడు మాత్రం తనెక్కడికి పోతున్నాడో చూడలేడు. శత్రువు అతని కన్నులను పీకి గుడ్డివాణ్ణి చేస్తాడు అప్పుడు అక్కడ అతడు చనిపొతాడు. 14 రాజ వంశీయులను ఇశ్రాయేలు చుట్టూ ఉన్న అన్యదేశాలలో నివసించేలా వారిని ఒత్తిడి చేస్తాను. అతని సైన్యాన్ని చెల్లా చెదురు చేస్తాను. శత్రు సైన్యాలు వారిని తరిమి కొడతాయి. 15 అప్పుడా ప్రజలు నేను యెహోవాను అని తెలుసుకొంటారు. నేనే వారిని అన్యదేశాలలో విసిరి వేశానని తెలుసుకొంటారు. ఇతర దేశాలకు పోయేలా వారిని నేనే ఒత్తిడి చేశానని తెలుసుకొంటారు.
16 “కాని కొద్దిమంది ప్రజలను మాత్రం బ్రతక నిస్తాను. రోగాలవల్ల గాని, ఆకలిచేత గాని లేక యుద్ధం వల్ల గాని వారు చనిపోరు. వారు నాపట్ల చేసిన భయంకర నేరాలను గురించి ఇతర ప్రజలకు తెలియజెప్పటానికిగాను వారిని నేను బ్రతకనిస్తాను. పిమ్మట వారు నేను యెహోవానని తెలుసుకొంటారు.”
భయంతో వణకుట
17 ఆ పిమ్మట మళ్లీ యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 18 “నరపుత్రుడా, నీవు చాలా భయపడినవానిలా వ్యవహరించాలి. నీవు ఆహారం తీసుకొనే సమయంలో వణకాలి. నీవు నీరుతాగేటప్పుడు వ్యాకుల పడుతున్నట్లు, భయపడుతున్నట్లు ప్రవర్తించాలి. 19 ఈ విషయాలు నీవు సామాన్య ప్రజలకు తెలియజెప్పాలి. నీవు ఇలా అనాలి: ‘యెరూషలేము ప్రజలకు, ఇశ్రాయేలులో ఇతర ప్రాంతాల ప్రజలకు మన ప్రభువైన యెహోవా చేపుతున్నాడు, మీరు మీ ఆహారం తీసుకొనేటప్పుడు మిక్కిలి కలత చెందుతారు. మీరు నీరు తాగేటప్పుడు. భయకంపితులవుతారు. ఎందువల్లనంటే, మీ దేశంలో అన్ని వస్తువులూ సర్వనాశనం చేయబడతాయి! అక్కడ నివసిస్తున్న ప్రజలందరి పట్ల శత్రువు చాలా క్రూరంగా ప్రవర్తిస్తాడు. 20 మీ నగరాలలో చాలా మంది ప్రజలు నివసిస్తున్నారు. కాని ఆ నగరాలన్నీ నాశనం చేయబడతాయి. మీ దేశం యావత్తూ నాశనం చేయబడుతుంది! అప్పుడు నేనే యెహోవానని మీరు గుర్తిస్తారు.’”
నాశనం వస్తుంది
21 యెహోవా వాక్కు నాకు మరల వినవచ్చింది. ఆయన ఇలా చెప్పాడు: 22 “నరపుత్రుడా, ఇశ్రాయేలును గురించి ఎందుకు ఈ పాట పాడుకుంటారు?
‘ఆపద త్వరలో రాదు,
దర్శనాలు నిజం కావు.’
23 “వారి ప్రభువైన యెహోవా ఆ పాటను ఆపుచేయిస్తాడని ప్రజలకు చెప్పు. ఇశ్రాయేలును గురించి ఆ మాటలు వారిక ఎన్నడూ పలుకరు. ఇప్పుడు వారీ పాటపాడతారు.
‘ఆపద ముంచుకు వస్తూ ఉంది,
స్వప్న దర్శనాలన్నీ నిజమై తీరుతాయి.’
24 “నిజానికి ఇకమీదట ఇశ్రాయేలులో అసత్య దర్శనాలు ఉండవు. నీజం కాని భవిష్యత్తును చెప్పే తాంత్రికులు మరి ఉండబోరు. 25 ఎందువల్లనంటే, నేనే యెహోవాను. నేను చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పి తీరుతాను. అది తప్పక జరిగి తీరుతుంది! నేను కాలయాపన చేయను. ఆ కష్టాలు త్వరలో మీ కాలంలోనే రాబోతున్నాయి. ఓ తిరుగుబాటు ప్రజలారా, నేను ఏదైనా చెప్పితే అది జరిగేలా చేస్తాను.” ఇవీ నా ప్రభువైన యెహోవా చెప్పిన మాటలు.
26 మళ్లీ యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 27 “నరపుత్రుడా, నేను నీకిచ్చిన దర్శనాలు భవిష్యత్తులో ఎప్పుడో జరుగుతాయని ఇశ్రాయేలు ప్రజలు అనుకొంటున్నారు. ఇప్పటి నుంచి చాలా సంపత్సరాల తరువాత జరుగబోయే విషయాలను గురించి నీవు మాట్లాడుతున్నావని వారనుకుంటున్నారు. 28 కావున నీవు వారికి ఈ విషయాలు చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా ఇలా తెలియజేస్తున్నాడు: నేనిక ఎంతమాత్రం ఆలస్యం చేయను. నేనేదైనా జరుగుతుందని చెప్పితే అది తప్పక జరిగి తీరుతుంది!’” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
అబధ్ధ ప్రవక్తలకు విరోధంగా హెచ్చరికలు
13 మరొకసారి యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఈ విధంగా చెప్పాడు: 2 “నరపుత్రుడా, నీవు నా తరపున ఇశ్రాయేలు ప్రవక్తలతో మాట్లాడాలి. ఆ ప్రవక్తలు వాస్తవానికి నా తరపున మాట్లాడటం లేదు. ఆ ప్రవక్తలు తాము చెప్పదలచుకొన్న విషయాలే చెప్పుచున్నారు. కావున నీవు వారితో మాట్లాడవలెను. వారికి ఈ విషయాలు చెప్పు: ‘యెహోవా నుండి వచ్చిన వర్తమానం వినండి! 3 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెబుతున్నాడు. దుష్ట ప్రవక్తలగు మీకు కీడు మూడుతుంది. మీరు మీ ఆత్మల్నే అనుసరిస్తున్నారు. మీరు స్వప్న దర్శనాలలో చూసిన వాస్తవాలను ప్రజలకు చెప్పుటలేదు.
4 “‘ఓ ఇశ్రాయేలూ! నీ ప్రవక్తలు, పాడుబడిన ఇండ్లల్లో పరుగెత్తే గుంట నక్కలా వుంటారు. 5 బీటలు వారిన నగర గోడల వద్ద నీవు సైనికులను కాపలా వుంచలేదు. ఇశ్రాయేలు వంశాన్ని కాపాడటానికి నీవు గోడలను నిర్మించలేదు. కావున యెహోవాకు మిమ్మల్ని శిక్షించే రోజు వచ్చినప్పుడు, నీవు యుద్ధంలో పరాజయం పొందుతావు!
6 “‘దొంగ ప్రవక్తలు తమకు దర్శనాలు కలిగాయని అన్నారు. కొన్ని తంత్రాలు చేసి వారు చెప్పిన విషయాలు జరుగుతాయని అన్నారు. కాని వారు అబద్ధమాడారు. వారిని యెహోవాయే పంపినట్లు వారు చెప్పారు. అదికూడా అబద్ధమే. వారి అబద్ధాలు నిజమవ్వాలని వారింకా ఎదురు చూస్తూనే వున్నారు.
7 “‘దొంగ ప్రవక్తలారా, మీరు చూసిన దర్శనాలు నిజం కావు. మీరు తంత్రాలు జరిపి, అనేక విషయాలు జరుగుతాయని చెప్పారు. కాని మీరు చెప్పింది అబద్ధం! యెహోవా ఆ విషయాలు చెప్పాడని మీరు ప్రకటించారు. కాని నేను మీతో మాట్లాడలేదు.’”
8 కాపున ఇప్పుడు నా ప్రభువైన యెహోవా నిజంగా మాట్లాడతాడు! ఆయన చెప్పినదేమంటే, “మీరు అబద్ధమాడారు. సత్యదూరమైన దర్శనాలను మీరు చూశారు. కావున ఇప్పుడు నేను (దేవుడు) మీకు వ్యతిరేకినయ్యాను!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 9 యెహోవా ఇంకా ఇలా చెప్పాడు, “అబద్ధపు దర్శనాలను చూచి, అబద్ధాలు చెప్పిన ప్రవక్తలను నేను శిక్షిస్తాను. వారిని నా ప్రజల మధ్యనుండి తొలగిస్తాను. వారి వేర్లు ఇశ్రాయేలు వంశావళిలో ఉండవు. వారు మరెన్నటికీ ఇశ్రాయేలు రాజ్యానికి తిరిగిరారు. అప్పుడు మీ ప్రభువగు యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు!
10 “ఆ బూటకపు ప్రవక్తలు పదే పదే నా ప్రజలకు అబద్ధాలు చెప్పారు. శాంతి విలసిల్లుతుందని ఆ ప్రవక్తలు చెప్పారు. కాని శాంతి లేదు. గోడలు కట్టుదిట్టం చేసి, ప్రజలు యుద్ధానికి సిద్ధపడవలసి ఉంది. అయితే వారు పగిలిన గోడలమీద పలుచని పూత మాత్రం పూస్తున్నారు. పగుళ్లకు బంకమట్టి వ్రాస్తున్నారు. 11 నేను వారి మీదికి తీవ్రమైన వడగండ్ల వాన (శత్రు సైన్యం) పంపుతానని నీవు వారికి చెప్పు. పెనుగాలి వీస్తుంది. తుఫాను వస్తుంది. అప్పుడు ఆ గోడ కూలిపోతుంది. 12 గోడ కూలినప్పుడు ప్రజలు ప్రవక్తలను, ‘మీరు గోడలకు పూసిన బంకమట్టి ఏమయ్యింది?’” అని అడుగుతారు. 13 నా ప్రభువైన యెహోవా ఇలా చెబుతున్నాడు, “నేను కోపంగా వున్నాను. మీ మీదికి నేనొక తుఫాను పంపుతాను. నేను కోపగించివున్నాను. మీ మీదికి జడివాన పంపుతాను. నేను కోపంగావున్నాను. ఆకాశాన్నుండి వడగండ్లు పడేలా చేసి మిమ్మల్ని సర్వనాశనం చేస్తాను! 14 గోడమీద మీరు పలుచనైన బంకమట్టి పులిమారు. కాని నేను మొత్తం గోడనే నాశనం చేస్తాను. దానిని కూలగొడతాను. ఆ గోడ మీ మీద పడుతుంది. అప్పుడు నేనే యెహోవానని మీరు గుర్తిస్తారు. 15 గోడమీద, ఆ గోడకు పూత పూసిన వారిమీద నా కోపం చూపటం పూర్తిచేస్తాను. అప్పుడు, ‘గోడా లేదు, గోడకు పూతపూసే పని వాళ్ళూ లేరు’ అని నేనంటాను.
16 “ఈ విషయాలన్నీ ఇశ్రాయేలులో వున్న దొంగ ప్రవక్తలకు సంభవిస్తాయి. ఆ ప్రవక్తలు యెరూషలేము ప్రజలతో మాట్లాడుతూ, శాంతి నెలకొంటుందని అంటారు. కాని శాంతి లేదు.” ఈ విషయాలన్నీ నా ప్రభువైన యెహోవా చెప్పాడు.
17 దేవుడు ఈ విధంగా చెప్పాడు: “నరపుత్రుడా, ఇశ్రాయేలులో స్త్రీ ప్రవక్తల విషయం చూడు. ఈ ఆడ ప్రవక్తలు నా తరపున మాట్లాడరు. వారు చెప్పదలచుకొన్నవే వారు చెప్పుతారు. కావున నీవు నా పక్షాన వారికి వ్యతిరేకంగా మాట్లాడాలి. వారికి నీవు ఈ విషయాలు చెప్పాలి. 18 నా ప్రభువైన యెహోవా ఈ రకంగా చెపుతున్నాడు, ఓ స్త్రీలారా, మీకు కీడు జరుగుతుంది. ప్రజలు వారి చేతులమీద ధరించటానికి మీరు గుడ్డలతో కంకణాలు కుడతారు. ప్రజలకు కావలసిన రకరకాల తలముసుగులు ప్రత్యేకంగా తయారు చేస్తారు. అవన్నీ ప్రజల జీవితాలను కట్టుబాట్లలో వుంచే మహిమగల వస్తువులని మీరు చెబుతున్నారు. మీ బ్రతుకుదెరువు కోసం ప్రజలను మీ వలలలో వేసుకొంటున్నారు! 19 నేను ముఖ్యుడను కానని ప్రజలు నమ్మేలా వారిని మీరు మభ్యపెడుతున్నారు. గుప్పెడు గింజల కోసం, పట్టెడు అన్నం కోసం మీరీ పనులన్నీ చేస్తూ ప్రజలను నాకు వ్యతిరేకులుగా చేస్తున్నారు. నా ప్రజలకు మీరు అబద్ధాలు చెబుతున్నారు. ప్రజలు కూడా అబద్ధాలు వినటానికే ఇష్టపడుతున్నారు. బ్రతక వలసిన ప్రజలను మీరు చంపుతున్నారు. చావవలసిన మనుష్యులను మీరు జీవించేలా చేస్తున్నారు. 20 కావున ప్రభువైన యెహోవా ఈలాగు చెబుతున్నాడు, మీరు బట్టతో కంకణాలు కట్టి ప్రజలను చిక్కించుకుంటున్నారు. కాని నేనా ప్రజలను విడుదల చేస్తాను. ఆ కంకణాలు మీ చేతుల నుండి లాగి పారవేస్తాను. అప్పుడు ప్రజలు మీ నుండి విముక్తి పోందుతారు. పంజరంలో నుండి ఎగిరిపోయే పక్షుల్లా వారు వుంటారు! 21 నేను వారి ముసుగులను చించివేస్తాను. మీ దుష్టశక్తి నుండి నా ప్రజలను కాపాడతాను. మీ బోను నుండి ఆ ప్రజలు తప్పించుకుంటారు. నేనే యెహోవానని అప్పుడు మీరు తెలుసుకుంటారు.
22 “‘ప్రవక్తలైన మీరు అసత్యాలు చెబుతున్నారు. మీ అబద్ధాలు మంచి వ్యక్తులకు బాధ కలుగజేస్తాయి. మంచి ప్రజలను బాధించటం నాకు ఇష్టంలేని పని, దుష్ట జనాన్ని మీరు బలపర్చి, వారిని ప్రోత్సహిస్తారు. వారి నడవడికను మార్చుకోమని మీరు వారికి చెప్పరు. మీరు వారి ప్రాణాలను రక్షించటానికి ప్రయత్నించరు, 23 కావున ఇక మీదట మీరు పనికిరాని దర్శనాలను చూడరు. మీరిక ఎంతమాత్రం గారడీలు చేయరు. మీ శక్తుల నుండి నా ప్రజలను నేను రక్షిస్తాను. అప్పుడు మీరు నన్ను యెహోవా అని తెలుసుకొంటారు.’”
1 దేవునికి, యేసుక్రీస్తు ప్రభువుకు సేవకుడైన యాకోబునైన నేను, చెదరిపోయి, పలు ప్రాంతాలలో నివసిస్తున్న పన్నెండు గోత్రాల వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వ్రాయునదేమనగా:
విశ్వాసము, జ్ఞానము
2-3 నా సోదరులారా! మీకు పరీక్షలు కలిగినప్పుడు పరమానందంగా భావించండి. విశ్వాసం పరీక్షింపబడటం వల్ల సహనం కలుగుతుందని మీకు తెలుసు. 4 మీరు చేసే పనిలో పూర్తిగా సహనం చూపండి. అలా చేస్తే మీరు బాగా అభివృద్ధి చెంది పరిపూర్ణత పొందుతారు. అప్పుడు మీలో ఏ లోపం ఉండదు.
5 మీలో జ్ఞానం లేనివాడు ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి. దేవుడు కోపగించుకోకుండా అందరికీ ధారాళంగా యిస్తాడు. కనుక మీకు కూడా యిస్తాడు. 6 కాని దేవుణ్ణి అడిగినప్పుడు సంశయించకుండా విశ్వాసంతో అడగండి. సంశయించేవాడు గాలికి ఎగిరి కొట్టుకొను సముద్రం మీది తరంగంతో సమానము. 7 అలాంటివాడు ప్రభువు నుండి తనకు ఏదైనా లభిస్తుందని ఆశించకూడదు. 8 అలాంటివాడు ద్వంద్వాలోచనలు చేస్తూ అన్ని విషయాల్లో చంచలంగా ఉంటాడు.
ధనము, దరిద్రము
9 దీనస్థితిలో ఉన్న సోదరుడు తనకు గొప్ప స్థానం లభించినందుకు గర్వించాలి. 10 ధనవంతుడు తాను కూడా గడ్డిపువ్వులా రాలిపోవలసినవాడే కనుక తనకు దీనస్థితి కలిగినందుకు ఆనందించాలి. 11 ఎందుకంటే, సూర్యుడు ఉదయిస్తాడు. మండుటెండకు గడ్డి ఎండిపోతుంది. దాని పువ్వులు రాలి దాని అందం చెడిపోతుంది. అదే విధంగా ధనవంతుడు తన వ్యాపారం సాగిస్తుండగానే మరణిస్తాడు.
పరీక్షలు, దుర్బుద్ధులు
12 పరీక్షా సమయంలో సహనం కలవాడు ధన్యుడు. ఆ విధంగా పరీక్షింపబడినవాడు జీవకిరీటాన్ని పొందుతాడు. అంటే దేవుడు తనను ప్రేమించినవాళ్ళకు చేసిన వాగ్దానం అతడు పొందుతాడన్నమాట. 13 ఒకడు శోధింపబడినప్పుడు, దేవుడు నన్ను శోధిస్తున్నాడని అనకూడదు. ఎందుకంటే దేవుడు చెడుద్వారా శోధింపడు. ఆయన ఎవర్నీ శోధించడు. 14 దురాశలకు లోనై ఆశల్లో చిక్కుకు పోయినప్పుడు నీతికి దూరమై చెడును చెయ్యాలనే బుద్ధి పుడుతుంది. 15 దురాశ గర్భం దాల్చి పాపాన్ని ప్రసవిస్తుంది. ఆ పాపం పండి మరణాన్ని కంటుంది.
16 నా ప్రియమైన సోదరులారా! మోసపోకండి. 17 ప్రతి మంచి వరానికి, ప్రతి శ్రేష్ఠమైన వరానికి పరలోకం మూలం. వెలుగును సృష్టించిన తండ్రి ఈ వరాలిస్తాడు. ఆ వరాలిచ్చే తండ్రి మార్పుచెందడు. ఆయన ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాడు. 18 దేవుడు తన సృష్టిలో మనము ప్రథమ ఫలాలుగా ఉండాలని సత్యవాక్యం ద్వారా మనకు జన్మనివ్వటానికి సంకల్పించాడు.
వినటం, చెయ్యటం
19 నా ప్రియమైన సోదరులారా! ఈ విషయాల్ని తెలుసుకోండి: ప్రతి మనిషి వినటానికి సిద్ధంగా ఉండాలి. మాట్లాడే ముందు ఆలోచించాలి. కోపాన్ని అణచుకోవాలి. 20 ఎందుకంటే కోపం ద్వారా దేవుడు ఆశించే నీతి కలుగదు. 21 అందువల్ల దుర్మార్గాల్ని, అవినీతిని పూర్తిగా వదిలివెయ్యండి. మీలో నాటుకుపోయిన దైవసందేశాన్ని విధేయతతో ఆచరించండి. అది మీ ఆత్మల్ని రక్షించగలదు.
22 దైవసందేశం చెప్పినట్లు చెయ్యండి. దాన్ని విని కూడా మీరు ఏమీ చెయ్యలేకపోతే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొన్న వాళ్ళవుతారు. 23-24 దైవసందేశం విని అది చెప్పినట్లు చెయ్యని వాడు అద్దంలో తన ముఖం చూసుకొని తానేవిధంగా కనిపించాడో వెంటనే మరచిపోయే వ్యక్తిలాంటివాడు. 25 స్వేచ్ఛను కలిగించే పరిపూర్ణమైన ధర్మశాస్త్రాన్ని పరిశీలిస్తూ దాని ప్రకారం జీవించేవాడు క్రియచేస్తున్న వానిగా పరిగణింపబడతాడు. అలాంటివాడు విని మరచిపోయే రకం కాదు. అతడు చేస్తున్న ప్రతీ కార్యము ఫలించాలని దేవుడు అతణ్ణి దీవిస్తాడు.
దేవుణ్ణి ఆరాధించే సత్యమార్గం
26 తానొక విశ్వాసినని తలంచి తన నాలుకకు కళ్ళెం వేసుకోకపోతె తనకు తాను మోసం చేసుకొన్నవాడౌతాడు. అతని విశ్వాసం నిష్ప్రయోజనమౌతుంది. 27 అనాథుల్ని, వితంతువుల్ని కష్టాల్లో ఆదుకోవటం, ఈ ప్రపంచంలో ఉన్న చెడువల్ల మలినం కాకుండా ఉండటము, ఇదే మన తండ్రియైన దేవుడు అంగీకరించే నిజమైన భక్తి.
© 1997 Bible League International