Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెహెజ్కేలు 5-7

యెరూషలేము ప్రజలు చెదరిపోవుట

1-2 “నరపుత్రుడా, నీ ఆకలి సమయం[a] అనంతరం నీవు ఈ పనులు చేయాలి: ఒక పదునైన కత్తి తీసుకో. దానిని మంగలి కత్తిలా వినియోగించి, నీ జుట్టును, గడ్డాన్ని గొరిగివేయుము. అలా తీసిన నీ జుట్టును ఒక తాసులో తూకం వేయుము. ఆ జుట్టును మూడు సమభాగాలుగా తూచాలి. నీ జుట్టులో ఒక భాగాన్ని నగరం బొమ్మ ఉన్న ఇటుక మీద పెట్టి, ఆ జుట్టును నగరంలో కాల్చివేయుము. కొంతమంది ప్రజలు నగరంలో చనిపోతారనే దానికి ఇది ఒక సూచన. ఒక కత్తితో రెండవ భాగం జుట్టును చిన్న చిన్న ముక్కలుగా చేయుము. ఆ జుట్టును నగరం (ఇటుక) చుట్టూ జల్లు. కొంతమంది ప్రజలు నగరం వెలుపల చనిపోతారని ఇది తెలియజేస్తుంది. నీ జుట్టులో మూడవ భాగాన్ని గాలిలోకి విసిరివేయుము. దానిని గాలిలో బహుదూరం కొట్టుకొనిపోనిమ్ము. కొంత మంది ప్రజలను నేను నా కత్తిని బయటికిలాగి బహుదూర దేశాలకు తరిమివేస్తానని ఇది సూచిస్తుంది. కాని తరువాత నీవు వెళ్లి కొట్టుకుపోయిన వెంట్రుకలలో కొన్నింటిని ఏరి తేవాలి. వాటిని నీ దుస్తులతో చుట్టు. ఇది నా ప్రజలలో కొంతమందిని తిరిగి నా వద్దకు తెచ్చుకుంటాననే దానికి సూచన. ఎగిరిపోయిన వెంట్రుకలలో మరికొన్నింటిని ఏరి, తెచ్చి, వాటిని నిప్పులో వేయుము. ఇది ఇశ్రాయేలు ఇల్లంతా అగ్నికి గురియై నాశనమవుతుందనడానికి ఒక సూచన.”

నా ప్రభువైన యెహోవా ఇంకా ఇలా చెప్పియున్నాడు. “ఆ ఇటుకరాయి యెరూషలేముకు గురుతు. యెరూషలేమును ఇతర రాజ్యాలకు మధ్య ఉంచుతాను. దాని చుట్టూ దేశాలుంటాయి. ఆ ప్రజలు నా ఆజ్ఞలను ధిక్కరించారు. ఇతర దేశాల వారికంటె వీరు మిక్కిలి హీనులయ్యారు. వారిచుట్టూ వున్న దేశాల ప్రజలకంటె ఈ ప్రజలే నా ధర్మాన్ని ఎక్కువగా ఉల్లంఘించారు. నా ఆజ్ఞలను వినటానికి వారు నిరాకరించారు! నా నియమాలను వారు మన్నించ లేదు!”

కావున నా ప్రభువైన యెహోవా ఇలా అన్నాడు: “మీకు నేను భయంకర పరిస్థితులు కల్పిస్తాను. ఎందుకనగా మీరు నా ధర్మాన్ని అంగీకరించి, అనుసరించలేదు. మీరు నా ఆజ్ఞలను పాటించలేదు. మీ చుట్టూవున్న ప్రజలకంటే నా న్యాయసూత్రాలను మీరే ఎక్కువగా ఉల్లంఘించారు! ఆ ప్రజలు తప్పుగా భావించే పనులను కూడా మీరు చేశారు!” అందువల్ల నా ప్రభువైన యెహోవా చెప్పినదేమంటే, “కాబట్టి ఇప్పుడు, నేను కూడా మీకు వ్యతిరేకిని. ఇతర ప్రజలంతా చూసేలా నేను మిమ్ముల్ని శిక్షిస్తాను. గతంలో నేనెన్నడూ చేయని పనులు మీకు నేను చేస్తాను. ఆ భయంకరమైన శిక్షను ఇకముందెన్నడూ విధించను! ఎందువల్లనంటే మీరు అనేక భయంకరమైన పనులు చేశారు. 10 యెరూషలేము ప్రజలు చాలా ఆకలితో ఉండి, తండ్రులు వారి బిడ్డలనే తినివేస్తారు. పిల్లలు వారి తండ్రులను తినివేస్తారు. అనేక విధాలుగా మిమ్ముల్ని నేను శిక్షిస్తాను. చావగా మిగిలిన ప్రజలను నేను అన్ని దిక్కులలో చిందర వందరగా వదిలి వేస్తాను.”

11 నా ప్రభువైన యెహోనా ఇలా చెప్పాడు, “యెరూషలేమా, నా జీవము తోడుగా నిన్ను నేను శిక్షిస్తానని చెపుతున్నాను! నిన్ను శిక్షిస్తానని నేను ప్రమాణ పూర్వకంగా చెపుతున్నాను! ఎందుకంటే, నా పవిత్ర స్థలానికి నీవు భయంకరమైన పనులు చేశావు. దానిని అపవిత్ర పర్చుతూ ఘోరమైన పనులు చేశావు! నేను నిన్ను శిక్షిస్తాను. నీ పట్ల కరుణ ఏ మాత్రం చూపించను. నిన్ను చూచి నేను విచారపడను! 12 నగరంలో నీ ప్రజలలో మూడవ వంతు వ్యాధిపీడితులై ఆకలితో చనిపోతారు. నీ ప్రజలలో మూడవ వంతు నగరం వెలుపల యుద్ధంలో చనిపోతారు. అప్పుడు నా కత్తిని బయటికిలాగి మీలో మరొక మూడో వంతు మందిని దూర దేశాలకు తరిమి వేస్తాను. నీ చుట్టూ ఉన్న ప్రజలు యుద్ధంలో వారిని చంపివేస్తారు! అప్పుడు మాత్రమే నేను నీ పట్ల నా కోపాన్ని ఉపసంహరించుకుంటాను. 13 అప్పుడు మాత్రమే నీ ప్రజల పట్ల నా కోపాన్ని తగ్గించుకుంటాను. వారు నా పట్ల చేసిన పాపకార్యాలకే వారు శిక్షింపబడ్డారని నాకు తెలుసు. నేను వారి యెహోవానని వారప్పుడు తెలుసుకుంటారు. వారి పట్ల నాకుగల గాఢమైన ప్రేమ[b] వల్ల నేను వారితో మాట్లాడానని కూడా వారు తెలుసు కుంటారు!”

14 దేవుడు ఇలా చెప్పాడు: “యెరూషలేమా, నిన్ను నేను నాశనం చేస్తాను. నీవు కేవలం ఒక రాళ్ల కుప్పలా మిగిలిపోతావు. నీ చుట్టూ వున్న ప్రజలు నిన్ను ఎగతాళి చేస్తారు. నీ ప్రక్కగా వెళ్లే ప్రతివాడూ నిన్ను చూచి పరిహసిస్తాడు. 15 నీ చుట్టూ వున్న ప్రజలు నిన్ను పరిహసిస్తారు. కాని వారికి నీవొక గుణపాఠంలా కూడ మిగులుతావు. నేను నీ పట్ల కోపగించి, నిన్ను శిక్షించినట్లు వారు చూస్తారు, నేను మిక్కిలి కోపంగా ఉన్నాను. నేను నిన్ను హెచ్చరించాను. యెహోవానైన నేను ఏమి చేస్తానో నీకు చెప్పాను! 16 నీకు లభించే ఆహారాన్ని తీసేసి మరల మరల ఆకలిగొలిపే ఆ సమయాన్ని కలుగజేస్తానని చెప్పియున్నాను. నిన్ను నాశనం చేసే భయంకర పరిణామాలు కలుగజేస్తానని నీకు చెప్పియున్నాను. ఆ కరువు పరిస్థితులు అనేకసార్లు వచ్చాయి. మీకు ఆహార పదార్థాలు సరఫరా కాకుండా చేశాను. 17 నేను ఆకలిని, క్రూరమృగాలను నీ మీదకు పంపుతాను. ఆవి నీ పిల్లలను చంపుతాయి. నగరమంతా వ్యాధులు, మరణాలు సంభవిస్తాయని నేను చెప్పియున్నాను. మీ మీదికి శత్రు సైన్యాలను తెప్పించి యుద్ధం చేయిస్తాను. యహోవానగు నేను ఈ విషయాలన్నీ సంభవిస్తాయని నీకు చెప్పియున్నాను. అవన్నీ జరిగి తీరాయి!”

ఇశ్రాయేలుకు విరోధంగా ప్రవచనాలు

మళ్లీ యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, ఇశ్రాయేలు పర్వతాలవైపు తిరిగి, నా తరపున వాటికి వ్యతిరేకంగా మాట్లాడు. ఆ పర్వతాలకు ఈ విషయాలు తెలియజెప్పు: ‘ఇశ్రాయేలు పర్వతములారా, నా ప్రభువైన యెహోవా సందేశాన్ని వినండి! నా ప్రభువైన యెహోవా కొండలకు, పర్వతాలకు, కనుమలకు, లోయలకు ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. చూడండి! (దేవుడనగు) నేను మీపై యుద్ధానికి శత్రువును రప్పిస్తున్నాను. మీ ఉన్నత స్థలాలు.[c] నేనే నాశనం చేస్తాను మీ బలిపీఠాలు ముక్కలు చేయబడతాయి! మీ ధూప వేదికలు నాశనం చేయబడతాయి. మీ హేయమైన విగ్రహాలముందే మీ శవాలను పడవేస్తాను. ఇశ్రాయేలు ప్రజల శవాలను అసహ్యమైన విగ్రహాల ముందు పడవేస్తాను. మీ ఎముకలను మీ పీఠాల చుట్టూ వెదజల్లుతాను. మీ ప్రజలెక్కడ వుంటే అక్కడ వాళ్ళు నాశనం చేయబడతారు. వారి నగరాలు రాళ్లగుట్టల్లా మారిపోతాయి. వారి ఉన్నత స్థలాలు నాశనం చేయబడతాయి. ఎందుకంటే, ఆ పూజా స్థలాలు మరెన్నడూ వినియోగింపబడకుండా వుండేటందుకు. ఆ బలి పీఠాలు నాశనం చేయబడతాయి. ప్రజలు మరెన్నడూ ఆ రోత విగ్రహాలను ఆరాధించరు. ఆ ధూప పీఠాలు ధ్వంసం చేయబడతాయి. మీరు చేసిన వస్తువులన్ని సర్వనాశనం చేయబడతాయి! మీ ప్రజలు చంపబడతారు. అప్పుడు నేనే ప్రభువు (యెహోవా) నని మీరు తెలుసుకుంటారు!’”

దేవుడు ఇలా చెప్పాడు: “కాని మీలో చాలా కొద్ది మంది తప్పించుకునేలా నేను చేస్తాను. వారు అన్య దేశాలలో స్వల్పకాలం పాటు నివసిస్తారు. వారిని నేను చెల్లా చెదురుచేసి, ఇతర దేశాలలో నివసించేలా ఒత్తిడి చేస్తాను. అలా మిగిలిన వారు బందీ చేయబడతారు. వారు అన్యదేశాలలో నివసించేలా తరిమివేయబడతారు. కాని, అలా మిగిలిన వారు నన్ను తలచుకొంటారు. నేను వారి గుండెలు బద్దలయ్యేలా చేశాను. వారు చేసిన చెడు కార్యాలకు వారిని వారే అసహ్యించుకుంటారు. గతంలో వారు నాకు విముఖులై, నన్ను వదిలిపెట్టారు. హేయమైన వారి విగ్రహాల వెంట వారు వెళ్ళారు. తన భర్తను వదిలి, పరాయి పురుషుని వెంటబడిన స్త్రీవలె వారున్నారు. వారెన్నో భయంకరమైన పనులు చేశారు. 10 చివరికి, నేనే యెహోవానని వారు తెలుసుకొంటారు. నేనేదైనా చేస్తానంటే, అది చేసి తీరుతానని కూడా తెలుసుకొంటారు! వారికి జరిగిన కీడంతా నేనే జరిపించినట్లు వారు తెలుసుకొంటారు.”

11 మళ్లీ నా ప్రభువైన యెహోవా ఇలా చెప్పాడు: “నీ చేతులు చరిచి, నీ పాదాలను దట్టించుము. ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఘోరమైన చెడ్డ పనులన్నిటినీ విమర్శిస్తూ మాట్లాడు. వారు వ్యాధుల వల్ల, ఆకలిచేత చనిపోతారని వారిని హెచ్చరించు. వారు యుద్ధంలో చనిపోతారని తెలియజేయుము. 12 దూరాన వున్నవారు రోగపీడితులై చనిపోతారు. ఈ ప్రదేశానికి దగ్గరగా వున్న ప్రజలు కత్తిచేత చంపబడతారు. ఇంకను నగరంలో మిగిలిన ప్రజలు ఆకలితో మాడి చనిపోతారు. అప్పుడు మాత్రమే నా కోపం తగ్గుతుంది. 13 అప్పుడు మాత్రమే నేను యెహోవానని మీరు తెలుసుకొంటారు. మీ అపవిత్రమైన మీ విగ్రహాలముందు, వాటి బలిపీఠాల చుట్టూ పడిన మీ శవాలను చూచినప్పుడు మీరిది తెలుసుకుంటారు. ఆ శవాలు మీ ఆరాధనా స్థలాలున్న ప్రతిచోట, ప్రతి కొండ, పర్వతం మీద, ప్రతి పచ్చని చెట్టు, ఆకులున్న ప్రతి సింధూర వృక్షం క్రింద పడి వుంటాయి. ఆ స్థలాలన్నిటిలో మీరు మీ బలులు సమర్పించారు. అవి మీ హేయమైన విగ్రహాలకు సుగంధ పరిమళాలు. 14 కాని మీ మీదికి నా చెయ్యెత్తి, మిమ్ముల్ని నేను శిక్షించాను! నేను మీ దేశాన్ని నాశనం చేశాను. అది దిబ్లాతు ఎడారి[d] కంటె ఎక్కువగా శూన్య ప్రదేశమయ్యింది. ఇప్పుడు మీ ప్రజలు నివసించే ప్రతి చోటా నేనే యెహోవానని తెలుసుకొంటారు!”

యెరూషలేముకు నాశనం వస్తుంది

పిమ్మట యెహోవా వాక్కు నాకు చేరింది. ఆయన ఇలా అన్నాడు: “నరపుత్రుడా, నా ప్రభువైన యెహోవా నుండి ఒక సందేశం ఉంది. అది ఇశ్రాయేలు దేశానికి సంబంధించినది:

“అంతం వచ్చింది.
    దేశం యావత్తూ నాశనమవుతుంది.
ఇప్పుడు నీ అంతం సమీపించింది.
    నేను నీ పట్ల ఎంత కోపంగా ఉన్నానో చూపిస్తాను.
నీ చెడు కార్యాలకు నిన్ను నేను శిక్షిస్తాను.
    నీవు చేసిన భయంకరమైన పనులకు ఫలమనుభవిస్తావు.
నీ పట్ల నేను కనికరం చూపను. నిన్ను చూచి విచారించను.
    నీవు చేసిన చెడ్డకార్యాలకు నిన్ను నేను శిక్షిస్తున్నాను.
నీవు ఘోరమైన పనులు చేశావు.
    నేను యెహోవానని నీవిప్పుడు తెలుసు కొంటావు.”

నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు, “ఒక విపత్తు తరువాత మరొకటి వస్తుంది: అంతం సమీపిస్తున్నది! అవసానదశ వస్తున్నది. అది అతి త్వరలో సంభవిస్తుంది! ఇశ్రాయేలులో నివసిస్తున్న ప్రజలారా, హెచ్చరించే ఈల శబ్దం వింటున్నారా? శత్రువు వచ్చిపడుతున్నాడు. శిక్షాకాలం అతి దగ్గరలో ఉంది! శత్రుసైన్యపు రణగొణ ధ్వనులు పర్వతాలపై మరీ మరీ ఎక్కువగా వినవస్తున్నాయి. నేనెంత కోపంగా వున్నానో అతి త్వరలో మీకు నేను చూపిస్తాను. మీమీద నాకున్న కోపాన్నంతా చూపిస్తాను. మీరు చేసిన చెడు కార్యాలకు మిమ్ముల్ని నేను శిక్షిస్తాను. మీరు చేసిన భయంకరమైన పనులన్నిటికీ మీరు ప్రతి ఫలం చెల్లించేలా చేస్తాను. మీ పట్ల ఏ మాత్రం కనికరం చూపను. మిమ్ముల్ని చూచి విచారపడను. మీరటువంటి భయంకరమైన పాపాలు చేశారు. నేను ప్రభువైన యెహోవానని, నేనే మిమ్ముల్ని కొడతానని మీరు తెలుసుకుంటారు.

10 “ఆ శిక్షాకాలం సమీపించింది. హెచ్చరిక ఈల విన్నావా? దేవుడు సూచన చేశాడు. శిక్ష మొదలవుతూ ఉంది. చేతికర్ర చిగురు తొడగటం మొదలు పెట్టింది.[e] అహంకారియైన రాజు (నెబుకద్నెజరు) ఇప్పటికే చాలా బలవంతుడైనాడు. 11 హింసావాదియైన అతడు ఆ దుష్ట ప్రజలను శిక్షించటానికి సిద్ధంగా వున్నాడు. ఇశ్రాయేలులో చాలా మంది మనుష్యులున్నారు. కాని అతడు వారిలో ఒకడు కాదు. ఆ గుంపులో అతడొకడు కాదు. ఆ ప్రజలలో అతడొక ప్రముఖ నాయకుడు కాదు.

12 “ఆ శిక్షాకాలం దరిచేరింది. ఆ రోజు ఇక్కడే వున్నది. సరుకులు కొనుగోలు చేసే జనులు సంతోషపడరు. అమ్మకపుదారులు వారి అమ్మకాల పట్ల విచారపడరు. ఎందువల్లనంటే ఆ భయంకరమైన శిక్ష ప్రతివానికి వస్తుంది గనుక. 13 తమ ఆస్తిని అమ్ముకున్న[f] ప్రజలు, మరి దాని వద్దకు వెళ్లరు. ఏ వ్యక్తి అయినా తప్పించుకుని బ్రతికితే కూడా అతడు తన ఆస్తి వద్దకు ఎన్నడూ మళ్లీ వెళ్లలేడు. ఎందువల్లనంటే, దేవుని ఈ సందేశం అందరికీ సంబంధించినది గనుక. అందువల్ల ఏ ఒక్కడైనా బ్రతికి బయటపడినా, అది ప్రజలను సంతోష పెట్టలేదు.

14 “ప్రజలను హెచ్చరించటానికి వారు బూరలు ఊదుతారు. ప్రజలు యుద్ధ సన్నద్ధులౌతారు. కాని వారు యుద్ధం చేయటానికి మాత్రం బయటికి వెళ్లరు. ఎందువల్లనంటే నేనెంత కోపంగా వున్నానో ఆ సమూహమంతటికీ చూపిస్తాను గనుక. 15 శత్రువు కత్తిపట్టి నగరం వెలుపల కాచివున్నాడు. వ్యాధులు, క్షామము నగరం లోపల ఉన్నాయి. ఏ మనిషేగాని బయట తన పొలానికి వెళ్లితే వేచి వున్న శత్రు సైనికుడు అతన్ని చంపివేస్తాడు. ఒకవేళ ఆ వ్యక్తి నగరంలోనే వుంటే ఆకలి, వ్యాధులు అతన్ని చంపివేస్తాయి.

16 “కాని కొంతమంది ప్రజలు తప్పించుకుంటారు. అలా బ్రతికినవారు పర్వతాలలోకి పారిపోతారు. అయినా వారు సంతోషంగా ఉండలేరు. వారు తమ పాపాలను తలచుకొని కుమిలిపోతారు. వారు ఏడ్చి, పావురాలవలె మూలుగుతారు. 17 ప్రజలు మిక్కిలి అలసిపోయి, దఃఖించి తమ చేతులను కూడా ఎత్తలేరు. వారి కాళ్లు నీళ్లలా ఉంటాయి. 18 వారు విషాదాన్ని సూచించే దుస్తులు ధరిస్తారు. వారిని భయం ఆవరిస్తుంది. ప్రతి ముఖంలోనూ సిగ్గు ముంచుకు రావటం చూస్తావు. విచారాన్ని వ్యక్తంచేస్తూ వారు తమ తలలను గొరిగించుకుంటారు. 19 వారి వెండి విగ్రహాలను వీధుల్లో పారవేస్తారు. బంగారము (విగ్రహాల)ను మురికి గుడ్డల్లా చూస్తారు. యెహోవా తన కోపాన్ని వారిపట్ల చూపించినప్పుడు వారి విగ్రహాలు వారిని రక్షించలేవు గనుక వారలా చేస్తారు. ప్రజలను పాపమార్గంలో పడవేయటానికి విగ్రహాలు ఒక మాయోపాయంలాంటివి. ఆ విగ్రహాలు ప్రజలకు ఆహారాన్ని ఇవ్వలేవు. వారి విగ్రహాలు వారి కడుపు నింపలేవు.

20 “ఆ ప్రజలు వారి విలువైన ఆభరణాలు వినియోగించి ఒక విగ్రహాన్ని తయారుచేశారు. ఆ విగ్రహాన్ని చూచి వారు గర్వపడ్డారు. వారింకా భయానక విగ్రహాలు చేశారు. వారా హేయమైన వస్తువులను చేశారు. కావున దేవుడనైన నేను వారిని మసిబట్టలా విసిరి పారవేస్తాను. 21 పరాయివారు వారిని పట్టుకునేలా చేస్తాను. పరాయి ప్రజలు వారిని ఎగతాళి చేస్తారు. పరాయి జనులు వారిలో కొంతమందిని చంపివేస్తారు. మరి కొంతమందిని చెరపట్టి తీసుకొనిపోతారు. 22 నేను వారిని చూచి ముఖం తిప్పుకుంటాను. నేను వారివంక చూడను. పరాయి మనుష్యులు నా ఆలయాన్ని ధ్వంసం చేస్తారు. ఆ పవిత్ర భవనంలో రహస్య స్థానాలకు వెళ్లి అపవిత్ర పరుస్తారు.

23 “బందీల కొరకు సంకెళ్లు తయారుచేయి! ఎందుకంటే ఇతరులను చంపిన నేరానికి చాలామంది ప్రజలుంటే శిక్షింపబడతారు గనుక ఈ గొలుసులు తయారు చేయాలి. నగరంలో ప్రతిచోటా దౌర్జన్యం చెలరేగుతుంది. 24 రాజ్యాల నుండి చెడ్డ వ్యక్తులను తీసుకువస్తాను. ఆ చెడ్డ మనుష్యులు ఇశ్రాయేలీయుల ఇండ్లన్నిటినీ ఆక్రమిస్తారు. శక్తివంతులైన మీ ప్రజలందరినీ గర్వించకుండా చేస్తాను. అన్యదేశీయులు మీ ఆరాధన స్థలాలన్నిటినీ వశపర్చుకుంటారు.

25 “మీ ప్రజలందరూ భయంతో పణికిపోతారు. మీరు శాంతికోసం ఎదురుచూస్తారు. కాని అది మీకు లభ్యం కాదు. 26 ఒక విషాద గాధ తరువాత మరియొకటి మీరు వింటారు. చెడ్డవార్తలు మినహా మరేమీ వినరు. మరొక ప్రవక్త కొరకు వెదికి, దర్శన విషయం అడుగుతారు. ఒక్కటికూడ మీకు వుండదు. యాజకులు మీకు బోధించేదేమీ లేదు. పెద్దలు మీకిచ్చే మంచి సలహా ఏమీ వుండదు. 27 చనిపోయిన ప్రజల కొరకు మీ రాజు దుఃఖిస్తాడు. నాయకులు విషాద సూచక దుస్తులు ధరిస్తారు. సామాన్య జనులు మిక్కిలి భయపడతారు. ఎందువల్లనంటే వారు చేసిన పనులను నేను తిప్పికొడతాను. నేను వారికి శిక్షను నిర్ణయిస్తాను. వారిని నేను శిక్షిస్తాను. అప్పుడా ప్రజలు నేను యెహోవానని తెలుసుకుంటారు.”

హెబ్రీయులకు 12

కుమారులు, క్రమశిక్షణ

12 అందువల్ల మన పక్షాన కూడా ఇందరు సాక్షులున్నారు గనుక మన దారికి అడ్డం వచ్చిన వాటన్నిటిని తీసిపారవేద్దాం. మనల్ని అంటుకొంటున్న పాపాల్ని వదిలించుకొందాం. మనం పరుగెత్తవలసిన పరుగు పందెంలో పట్టుదలతో పరుగెడదాం. మన దృష్టిని యేసుపై ఉంచుదాం. మనలో విశ్వాసం పుట్టించినవాడు, ఆ విశ్వాసంతో పరిపూర్ణత కలుగ చేయువాడు ఆయనే. తనకు లభింపనున్న ఆనందం కోసం ఆయన సిలువను భరించాడు. సిలువను భరించినప్పుడు కలిగిన అవమానాల్ని ఆయన లెక్క చెయ్యలేదు. ఇప్పుడాయన దేవుని సింహాసనానికి కుడివైపున కూర్చొని ఉన్నాడు. పాపాత్ములు తనపట్ల కనబరచిన ద్వేషాన్ని ఆయన ఏ విధంగా సహించాడో జాగ్రత్తగా గమనించండి. అప్పుడు మీరు అలిసిపోకుండా, ధైర్యం కోల్పోకుండా ఉంటారు.

దేవుడు తండ్రిలాంటివాడు

మీరు పాపంతో చేస్తున్న యుద్ధంలో రక్తం చిందించవలసిన అవసరం యింతవరకు కలుగలేదు. మిమ్మల్ని కుమారులుగా భావించి చెప్పిన ప్రోత్సాహకరమైన ఈ సందేశాన్ని పూర్తిగా మరిచిపోయారు:

“నా కుమారుడా! ప్రభువు విధించిన క్రమశిక్షణను చులకన చెయ్యకు!
    నీ తప్పు ప్రభువు సరిదిద్దినప్పుడు నిరుత్సాహపడకు!
ఎందుకంటే, ప్రభువు తనను ప్రేమించిన వాళ్ళనే శిక్షిస్తాడు.
    అంతేకాక తన కుమారునిగా అంగీకరించిన ప్రతి ఒక్కణ్ణి శిక్షిస్తాడు.”(A)

కష్టాల్ని శిక్షణగా భావించి ఓర్చుకోండి. దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా చూసుకొంటాడు. తండ్రి నుండి శిక్షణ పొందని కుమారుడెవడున్నాడు? మీకు శిక్షణ లభించకపోతే మీరు దేవుని నిజమైన కుమారులు కారన్న మాట. ప్రతి ఒక్కడూ క్రమశిక్షణ పొందుతాడు. మన తండ్రులు మనకు శిక్షణనిచ్చారు. ఆ కారణంగా వాళ్ళను మనం గౌరవించాము. మరి అలాంటప్పుడు మన ఆత్మలకు తండ్రి అయిన వానికి యింకెంత గౌరవమివ్వాలో ఆలోచించండి. 10 మన తల్లిదండ్రులు వాళ్ళకు తోచిన విధంగా కొద్దికాలం పాటు మనకు క్రమశిక్షణ నిచ్చారు. కాని దేవుడు మన మంచికోసం, ఆయన పవిత్రతలో మనం భాగం పంచుకోవాలని మనకు శిక్షణనిచ్చాడు. 11 శిక్షణ పొందేటప్పుడు బాధగానే వుంటుంది. ఆనందంగా ఉండదు. కాని ఆ తర్వత శిక్షణ పొందినవాళ్ళు నీతి, శాంతి అనే ఫలం పొందుతారు.

నీవు ఎలా జీవిస్తున్నావో జాగ్రత్తగావుండు

12 అందువల్ల మీ బలహీనమైన చేతుల్ని, వణకుతున్న మోకాళ్ళను శక్తివంతం చేసుకోండి. 13 మీరు నడిచే దారుల్ని[a] సమంగా చేసుకోండి. అప్పుడు ఆ దారులు కుంటివాళ్ళకు అటంకం కలిగించటానికి మారుగా సహాయపడ్తాయి.

14 అందరిపట్ల శాంతి కనబరుస్తూ జీవించటానికి ప్రయత్నించండి. పవిత్రంగా జీవించండి. పవిత్రత లేకుండా ఎవ్వరూ ప్రభువును చూడలేరు. 15 ఒక్కరు కూడా దైవానుగ్రహానికి దూరం కాకుండా జాగ్రత్తపడండి. 16 వ్యభిచారం చెయ్యకండి. ఒక పూట భోజనం కోసం జ్యేష్ఠపుత్రునిగా తన హక్కుల్ని అమ్మివేసిన ఏశావువలె భక్తిహీనులై జీవించకండి. 17 ఏశావు ఆ తర్వాత ఆ ఆశీర్వాదం పొందాలని కోరినప్పుడు దేవుడు నిరాకరించిన విషయం మీకు తెలుసు. అతడు ఆ ఆశీర్వాదాన్ని పొందాలని పశ్చాత్తాపం చెందుతూ కన్నీళ్ళు పెట్టుకొన్నాడు. కాని లాభం కలుగలేదు.

18 తాకగల పర్వతం దగ్గరకు మీరు రాలేదు. అగ్నిజ్వాలలతో మండుతున్న పర్వతం దగ్గరకు మీరు రాలేదు. కారు మబ్బులు, చీకటి, తుఫాను కమ్ముకొన్న పర్వతం దగ్గరకు మీరు రాలేదు. 19 ఆ పర్వతం నుండి బూర ధ్వని, మాట్లాడుతున్న కంఠ ధ్వని వినటానికి రాలేదు. ఆ కంఠం విన్నవాళ్ళు భయపడి వినడానికి నిరాకరించారు. 20 ఎందుకంటే, “ఆ పర్వతాన్ని ఒక జంతువు తాకినా ఆ జంతువును రాళ్ళతో కొట్టాలి”(B) అని ఆ స్వరం ఆజ్ఞాపించింది. ఈ ఆజ్ఞను వాళ్ళు భరించలేకపొయ్యారు. 21 ఆ దృశ్యము ఎంత భయంకరంగా ఉందంటే, మోషే “నేను భయంతో వణికి పోతున్నాను”(C) అని అన్నాడు.

22 కాని మీరు సీయోను పర్వతం దగ్గరకు వచ్చారు. ఇదే పరలోకపు యెరూషలేము! సజీవుడైన దేవుని నగరం. ఆనందంతో సమూహమైన వేలకొలది దేవదూతల దగ్గరకు మీరు వచ్చారు. 23 మొట్టమొదట జన్మించిన వాళ్ళ సంఘానికి మీరు వచ్చారు. వీళ్ళ పేర్లు పరలోకంలో వ్రాయబడి ఉన్నాయి. మానవుల న్యాయాధిపతియైన దేవుని దగ్గరకు మీరు వచ్చారు. దేవుడు పరిపూర్ణత కలిగించిన నీతిమంతుల ఆత్మల దగ్గరకు మీరు వచ్చారు. 24 క్రొత్త ఒడంబడికకు మధ్యవర్తి అయిన యేసు దగ్గరకు మీరు వచ్చారు. హేబేలు రక్తానికన్నా ఉత్తమసందేశాన్నిచ్చే “ప్రోక్షింపబడే రక్తం” దగ్గరకు మీరు వచ్చారు.

25 జాగ్రత్త! మనతో మాట్లాడుతున్న ఆయన్ని నిరాకరించకండి. ఆయన ఇహలోకానికి వచ్చి పలికిన మాటల్ని ఆనాటి వాళ్ళు నిరాకరించారు. తద్వారా ఆయన ఆగ్రహంనుండి తప్పించుకోలేకపోయారు. మరి ఆయన పరలోకంనుండి పలికే మాటల్ని నిరాకరిస్తే ఆయన ఆగ్రహంనుండి ఎలా తప్పించుకొనగలము? 26 ఆనాడు ఆయన కంఠం భూకంపం కలిగించింది. కాని యిప్పుడు ఆయన, “నేను భూమినే కాక ఆకాశాన్ని కూడా మరొక్కసారి కదిలిస్తాను”(D) అని వాగ్దానం చేసాడు. 27 “మరొక్కసారి” అన్న పదాలు, కదిలే వాటిని, అంటే సృష్టింపబడ్డవాటిని నాశనం చేస్తాడని సూచిస్తున్నాయి. కదలనివి అలాగే ఉండిపోతాయి.

28 ఎవ్వరూ కదిలించలేని రాజ్యం మనకు లభింపనున్నది కనుక దేవునికి మనము కృతజ్ఞులమై ఉందాం. ఆయన్ని భయభక్తులతో, ఆయనకు యిష్టమైన విధంగా ఆరాధించుదాము. 29 ఎందుకంటే, మన దేవుడు “మండుచున్న అగ్నిలాంటివాడు.”(E)

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International