Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెహెజ్కేలు 3-4

దేవుడు నాతో ఇలా చెప్పాడు: “ఓ నరపుత్రుడా, నీవు చూస్తున్న దానిని తిను. ఈ గ్రంథపు చుట్టను తిని, ఇశ్రాయేలు వంశం వారికి దీనిలోనున్న విషయాలన్నిటినీ తెలియజెప్పు.”

ఆ తరువాత నేను నా నోరు తెరువగా, అతడు గ్రంథపు చుట్టను నాకు తినిపించెను. పిమ్మట దేవుడు ఇలా అన్నాడు: “నరపుత్రుడా, ఈ కాగితం చుట్టను నీకిస్తున్నాను. దానిని మ్రింగివేయి! ఆ గ్రంథపు చుట్ట నీ శరీరాన్ని నింపివేయనీ.”

నేను దానిని తినేశాను. అది తేనెలా మధురంగా ఉంది.

అప్పుడు దేవుడు నాతో ఇలా అన్నాడు, “నరపుత్రుడా, ఇశ్రాయేలు వంశంవారి వద్దకు వెళ్లు. వారికి నా మాటలన్నీ తెలియజేయుము. భాష తెలియని పరదేశీయుల వద్దకు నిన్ను నేను పంపటంలేదు. ఏ ఇతర భాషను నీవు నేర్చుకునే పనిలేదు. నేను నిన్ను ఇశ్రాయేలు వంశం వారివద్దకు పంపుతున్నాను! నీవు అర్థం చేసుకోలేని పలుభాషలు మాట్లాడే అనేక ఇతర దేశాల ప్రజల వద్దకు నేను నిన్ను పంపటం లేదు. నీవు గనుక వారి వద్దకు వెళ్లి మాట్లాడితే వారు వింటారు. కాని నీవాకఠిన భాషలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. లేదు! నేను నిన్ను ఇశ్రాయేలు వంశం వద్దకు పంపుతున్నారు. వారున్నారే వారు తల బిరుసు కలిగి ఉన్నారు. వారు చాలా మొండివారు! ఇశ్రాయేలీయులు నీవు చెప్పేది వినటానికి నిరాకరిస్తారు. వారు నా మాట వినదల్చుకోలేదు! కాని వారు ఎంత మొండివారో, నిన్ను కూడా అంత మొండివానిగా నేను చేస్తాను. నీ తల కూడా వారి తలలా కఠినంగా ఉంటుంది! చెకుముకిరాయి కంటె వజ్రం కఠినమైనది. అదే రకంగా, నీ తల వారి తలకంటె గట్టిగా తయారవుతుంది. నీవు మిక్కిలి మొండిగా ఉంటావు. అందువల్ల వారంటే నీవు భయపడవు. ఎల్లప్పుడూ నా మీద తిరుగుబాటు చేసే ఆ ప్రజలంటే నీవు భయపడవు.”

10 ఇంకా దేవుడు ఇలా చెప్పాడు, “నరపుత్రుడా, నేను నీకు చెప్పే ప్రతీ మాటను వినాలి. విని, వాటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. 11 పిమ్మట దేశాన్నుండి వెళ్ల గొట్ట బడిన నీ ప్రజలందరి వద్దకు వెళ్లు. వారి వద్దకు వెళ్లి, ‘మన ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు’ అని పలుకు. వారు వినరు. వారు పాపం చేయటం మానరు. అయినా నీవు ఈ విషయాలు చెప్పాలి.”

12 పిమ్మట గాలి (ఆత్మ) నన్ను పైకి లేపింది. అప్పుడు వెనుక నుండి నేనొక స్వరం విన్నాను. అది ఉరుములా చాలా బిగ్గరగా ఉంది. ఆ స్వరం, “యెహోవా మహిమ ధన్యమైనది!” అని పలికింది. 13 ఆ తరువాత జంతువుల రెక్కలు కదలసాగాయి. రెక్కలు ఒక దానితో ఒకటి తాకగా అవి చాలా గట్టిగా శబ్దం చేశాయి. వాటి ముందునున్న చక్రాలు కూడ పెద్ద శబ్దం చేశాయి. ఆ శబ్దం ఉరుము ఉరిమినట్లుగా ఉంది. 14 గాలి (ఆత్మ) నన్ను పైకెత్తి దూరంగా తీసుకొని వెళ్లింది. నేను ఆ స్థలాన్ని వదిలిపెట్టాను. నేను నా ఆత్మలో దుఃఖించి తల క్రిందులయ్యాను! యెహోవా ప్రభావం నాలో శక్తివంతంగా పనిచేస్తూ ఉంది! 15 టెల్ అవీవ్‌కు[a] బలవంతంగా తీసుకొనిపోబడి, అక్కడ ప్రవాసంలోవున్న ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్లాను. ఆ ప్రజలు కెబారు కాలువ వద్ద నివసించారు. ఆ ప్రజలను నేను పరామర్శించాను. అక్కడ నేను వాళ్ల మధ్యలో ఏడు రోజులు భయంతోనూ, మౌనంతోనూ కూర్చుంటిని.

ఇశ్రాయేలు కావలివాడు

16 ఏడు రోజుల తరువాత యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా చెప్పాడు: 17 “ఓ నరపుత్రుడా, ఇశ్రాయేలుకు నిన్ను కావలివానిగా చేస్తున్నాను. వారికి జరుగబోయే కీడును గూర్చి నేను నీకు తెలియజేస్తాను. కనుక ఆ పరిణామాలను గూర్చి నీవు వారికి హెచ్చరిక చేయాలి. 18 ‘ఈ దుష్ట వ్యక్తి చనిపోతాడు.’ అని నేను చెప్పితే, నీవతనిని హెచ్చరించాలి.! అతని జీవన విధానం మార్చుకొని, పాపం చేయటం మానమని చెప్పాలి. నీవతనిని హెచ్చరించకపోతే, ఆ వ్యక్తి చనిపోతాడు. అతడు పాపం చేశాడు గనుక అతడు చనిపోతాడు. కాని అతని చావుకు నిన్ను కూడా బాధ్యుణ్ణి చేస్తాను! ఎందుకంటే, నీవతని వద్దకు వెళ్లి అతనిని హెచ్చరిస్తే అతని ప్రాణం రక్షింపబడేది.

19 “ఒకవేళ నీవా వ్యక్తి వద్దకు వెళ్లి అతని జీవిత విధానాన్ని మార్చుకోమనీ, చెడు కార్యాలు చేయటం మానమనీ చెప్పావనుకో. ఆ వ్యక్తి నీమాట వినక పోవచ్చు. అప్పుడతడు చనిపోతాడు. అతడు పాపి గనుక చనిపోతాడు. అయినా నీవతనిని హెచ్చరించావు. అందువల్ల నిన్ను నీవు రక్షించుకున్నవాడివవుతావు.

20 “లేదా, ఒక మంచి వ్యక్తి మధ్యలో మంచి పనులు చేయడం మానివేసి చెడుపనులు చేస్తాడు. అప్పుడు నేను అతని ముందు ఏదైనా తగిలి పడటానికి (పాపంలో పడటానికి) ఉంచవచ్చు. అతడు చెడుకార్యాలు చేయటం మొదలు పెడతాడు. దానితో అతడు చనిపోతాడు. తన పాపాల కారణంగా అతడు చనిపోతాడు. దానికి తోడు నీవతనిని హెచ్చరించలేదు. అందువల్ల అతని చావుకు నిన్ను బాధ్యుణ్ణి చేస్తాను. చివరికి అతడు చేసిన మంచి పనులేవీ ప్రజలు గుర్తు పెట్టుకోరు.

21 “నీవొక మంచి మనిషిని పాపం చేయవద్దని హెచ్చరిస్తావనుకో; అతడు పాపం చేయటం మానితే అతడు రక్షించబడతాడు. ఎందువల్లనంటే నీవతనికి హెచ్చరిక చేయటం, అతడు నీ మాటను వినటం జరిగాయి గనుక. ఈ విధంగా నీవు నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు.”

22 పిమ్మట యెహోవా హస్తం ఆ స్థలంలో నా మీదికి వచ్చింది. “లెమ్ము; లోయలోకి వెళ్లు. అక్కడ నేను నీతో మాట్లాడతాను” అని దేవుడు నాకు చెప్పాడు.

23 నేను లేచి లోయలోకి వెళ్లాను. యెహోవా మహిమ అక్కడ ఉంది. గతంలో నేను కెబారు కాలువవద్ద చూసినట్లే అది ఉంది. నేను శిరస్సు నేలకు ఆన్చి సాష్టాంగ నమస్కారం చేశాను. 24 కాని, ఇంతలో ఒక గాలి (ఆత్మ) వచ్చి నన్ను నా పాదాలపైకి లేపింది. ఆయన నాతో ఇలా అన్నాడు, “నీవు ఇంటికి వెళ్లి లోపల కూర్చుని గడియపెట్టుకో. 25 ఓ నరపుత్రుడా, ప్రజలు నీ వద్దకు వచ్చి, నిన్ను తాళ్లతో బంధిస్తారు. వారు నిన్ను ప్రజల మధ్యకు వెళ్లనీయరు. 26 నేను నీ నాలుకను నీ అంగిలి గుంటలో అతుక్కుపోయేలా చేస్తాను. దానితో నీవు మాట్లాడలేవు. అందువల్ల వారు తప్పు చేస్తున్నట్లు వారికి చెప్పే మనుష్యుడెవ్వడూ ఉండడు. ఎందువల్లనంటే ఆ జనులు నా మీద ఎల్లప్పుడూ తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. 27 కాని నేను నీతో మాట్లాడతాను. పిమ్మట నీవు మళ్లీ మాట్లాడటానికి అనుమతిస్తాను. అయితే నీవు మాత్రం ‘మన ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు’ అని వారికి చెప్పాలి. ఏ వ్యక్తి అయినా వినగోరితే మంచిదే. ఎవ్వరూ వినటానికి ఇష్టపడకపోయినా మంచిదే. ఆ ప్రజలు ఎల్లప్పుడూ నాకు వ్యతిరేకులవుతూ ఉన్నారు.

యెరూషలేము దాడిని గూర్చి హెచ్చరికలు

“నరపుత్రుడా, ఒక ఇటుక తీసుకొని దానిమీద ఒక బొమ్మ గియ్యి. యెరూషలేము నగరపు బొమ్మ వేయుము. నీవా నగరాన్ని ముట్టుడించే సైన్యంలాగా చిత్రీకరించు. నగరాన్ని తేలికగా పట్టుకొనేటందుకు అనువుగా దానిచుట్టూ ఒక మట్టిగోడ నిర్మించు. నగరపు గోడవరకు ఒక మట్టి రహదారి వేయుము. సమ్మెటల్ని (ముఖ్య నాయకుల్ని) తెప్పించి, నగరం చుట్టూ సైనిక స్థావరాలను ఏర్పాటు చేయండి. పిమ్మట ఒక ఇనుప పెనము తీసుకొని దానిని నీకు, నగరానికి మధ్య ఉంచు. అది నిన్ను, నగరాన్ని వేరుచేసే ఇనుప గోడలా ఉంటుంది. ఈ రకంగా నీవా నగరానికి వ్యతిరేకంగా వున్నట్లు నీవు చూపిస్తావు. నీవా నగరాన్ని చుట్టుముట్టి దానిపై దాడి చేస్తున్నట్లు వుంటుంది. ఎందువల్లనంటే ఇశ్రాయేలు వంశానికి ఇది ఒక ఉదాహరణగా వుంటుంది. (దేవుడనైన) నేను యెరూషలేమును నాశనం చేస్తానని అది నిరూపిస్తుంది.

“తరువాత నీవు ఎడమ ప్రక్కకి పడుకో, ఇశ్రాయేలీయుల పాపాలన్నీ నీవు భరిస్తున్నట్లు నిరూపించే విధంగా నీవాపని చేయాలి. నీవు ఎడమ ప్రక్కన ఎన్నాళ్లు పడుకొని ఉంటే అన్నాళ్లు నీవా పాపాలను మోస్తావు. నీవు వారి పాపాన్ని మూడు వందల తొంభై రోజులు[b] భరించాలి. ఈ ప్రకారం ఇశ్రాయేలు ఎంతకాలం శిక్షింపబడుతుందో నేను తెలియజేస్తున్నాను. ఒక్కరోజు ఒక్క సంవత్సరానికి సమానం.

“ఆ తరువాత నీవు కుడి ప్రక్కకి తిరిగి నలభై రోజులు పడుకోవాలి. ఈసారి నీవు యూదావారి పాపాలను నలభై రోజులపాటు భరిస్తావు. ఒక రోజు ఒక సంవత్సరానికి సమానం. యూదా ఎంతకాలం శిక్షింపబడాలో నేను నీకు ఈ విధంగా తెలియజేస్తున్నాను.”

దేవుడు మళ్లీ మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు, “ఇప్పుడు నీవు నీ చొక్కా చేతిని పైకి మడిచి, ఆ ఇటుక మీదికి నా చేతినెత్తు. యెరూషలేము నగరంపై దాడి చేస్తున్నట్లు నీవు ప్రవర్తించు. నీవు నా తరఫు దూతగా మాట్లాడుతున్నట్లు చూపటానికి ఈ విధంగా చేయుము. ఇప్పుడు చూడు, నిన్నిప్పుడు తాళ్లతో కట్టుతున్నాను. నగరంపై నీ దాడి పూర్తయ్యేవరకు నీవు అటు, ఇటు కదలలేవు.”

దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “రొట్టె చేయటానికి నీవు కొంత ధాన్యాన్ని తీసుకొనిరా. కొన్ని గోధుమలు, బార్లీ బియ్యము (యవలు), చిక్కుడు గింజలు, పప్పులు, జొన్నలు, సజ్జలు తీసుకో. వీటన్నిటినీ కలిపి రోటిలో వేసి దంచి పిండి చేయుము. ఈ పిండిని ఉపయోగించి రొట్టె చేయుము. నీవు ప్రక్కకు తిరిగి పడుకొనే మూడువందల తొంభై రోజులూ ఈ రొట్టెనే తినాలి. 10 రొట్టెను చేయటానికి ఈ పిండిని రోజుకు ఒక గిన్నెడు (సుమారు ఇరవై తులాలు) మాత్రమే ఉపయోగించటానికి నీకు అనుమతి ఇవ్వబడింది. అవసరమైనప్పుడల్లా రోజంతా ఆ రొట్టెనే నీవు తినాలి. 11 ప్రతి రోజూ మూడు గిన్నెల నీరే నీవు తాగాలి. రోజంతా తగిన సమయానికి దానిని తాగాలి. 12 ప్రతిరోజూ నీ రొట్టెను నీవే చేసుకోవాలి. నీవు మనుష్యుల మలం తెచ్చి, ఎండబెట్టి, దానిని కాల్చాలి. మండే ఆ మనుష్యుల మలం మీద నీవు ఆ రొట్టెను కాల్చాలి. ప్రజల ఎదుట ఈ రొట్టెనే నీవు కాల్చితినాలి.” 13 మళ్లీ యెహోవా ఇలా చెప్పాడు: “ఈ పని చేయటం ద్వారా ఇశ్రాయేలు వంశీయులు పరాయి దేశాలలో అపరిశుభ్రమైన రొట్టెలు[c] తింటారని నీవు సూచిస్తావు. వారు ఇశ్రాయేలు వదిలి అన్యదేశాలకు పోయేలా నేను వారిని ఒత్తిడి చేశాను!”

14 అప్పుడు నేనిలా (యెహెజ్కేలు) అన్నాను, “అయ్యో, నా ప్రభువైన యెహోవా, నేనెన్నడూ అపరిశుద్ధ ఆహారాన్ని తినలేదు. వ్యాధిచే చచ్చిన జంతు మాంసంగాని, అడవి జంతువుచే చంపబడిన పశువుల మాంసాన్ని గాని నేను ఎన్నడూ తినియుండలేదు. నా చిన్ననాటి నుండి ఈ నాటి వరకు నేను ఎన్నడూ అపరిశుద్ధ ఆహారం ముట్టి ఎరుగను. ఆ దుష్ట మాంసమేదీ నానోట బడలేదు.”

15 అందుకు దేవుడీలా అన్నాడు: “సరే! నీ రొట్టెను కాల్చటానికి ఎండిన ఆవుపేడ ఉపయోగించేటందుకు నీకు అనుమతి ఇస్తున్నాను. ఎండిన మనిషి మలం నీవు వినియోగించనవసరం లేదు.”

16 దేవుడు ఇంకా ఇలా అన్నాడు, “నరపుత్రుడా, యెరూషలేముకు ఆహార పదార్థాల సరఫరాను నిలిపి వేస్తున్నాను. అందువల్ల ప్రజలు తగుమాత్రం రొట్టె తినవలసి వస్తుంది. వారి ఆహార పదార్థాల సరఫరా విషయమై వారు మిక్కిలి చింతిస్తారు. వారికి తాగే నీరు కూడా పరిమితమవుతుంది. ఆ నీటిని తాగినప్పుడు వారు మిక్కిలి భీతిల్లుతారు. 17 ఎందువల్లనంటే ప్రజలకు తినటానికి తిండి, తాగటానికి నీరు తగినంత ఉండదు. ప్రజలు ఒకరిని చూచి ఒకరు భయ కంపితులవుతారు. వారివారి పాపాల కారణంగా వారు చిక్కి శల్యాలైపోతారు.

హెబ్రీయులకు 11:20-40

20 ఇస్సాకు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి, యాకోబును, ఏశావును వాళ్ళ భవిష్యత్తు ప్రకారం దీవించాడు. 21 దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి యాకోబు, తాను మరణించే ముందు యోసేపు కుమారుల్ని దీవించగలిగాడు. అంతేకాక తన చేతి కఱ్ఱపై వ్రాలి దేవుణ్ణి ప్రార్థించాడు.

22 యోసేపు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి తాను చనిపోయేముందు ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు దేశం నుండి వెళ్ళిపోతారని ముందుగానే చెప్పగలిగాడు. అంతే కాక, అప్పుడు తన ఎముకల్ని ఏమి చెయ్యాలో వాళ్ళకు చెప్పాడు.

23 మోషే తల్లి తండ్రులకు దేవుని పట్ల విశ్వాసముంది గనుక, మోషే జన్మించాక అతడు సాధారణమైన శిశువు కాడని గ్రహించగలిగారు. తద్వారా వాళ్ళు రాజశాసనానికి భయపడకుండా అతణ్ణి మూడు నెలల దాకా దాచివుంచారు.

24 మోషే దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టే, అతడు పెద్దవాడైన తర్వాత ఫరోకుమార్తె యొక్క కుమారునిగా గుర్తింపబడటానికి నిరాకరించాడు. 25 పాపం ద్వారా లభించే సుఖాల్ని కొద్దికాలం అనుభవించటానికన్నా దేవుని ప్రజలతో సమానంగా కష్టాలను అనుభవించటానికి అతడు సిద్ధమయ్యాడు. 26 అతడు ప్రతిఫలం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు కనుక, ఈజిప్టులోని ఐశ్వర్యానికన్నా క్రీస్తు కొరకు అవమానం భరించటం ఉత్తమమని భావించాడు.

27 మోషే దేవుణ్ణి విశ్వసించాడు కనుక, అతడు రాజు యొక్క ఆగ్రహానికి భయపడకుండా ఈజిప్టు దేశాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అదృశ్యంగా ఉన్నవాణ్ణి చూసినట్లు అతడు భావించటంవల్ల అతని పట్టుదల పెరిగింది. 28 అతడు దేవుణ్ణి విశ్వసించటం మూలంగానే పస్కా పండుగను, రక్తాన్ని ద్వారాలపై ప్రోక్షించాలనే ఆచారాన్ని నియమించాడు. మృత్యు దూత ఇశ్రాయేలు ప్రజల మొదటి సంతానాన్ని తాకరాదని ఈ ఆచారం నియమించాడు.

29 దేవుణ్ణి విశ్వసించినందుకే ప్రజలు ఎఱ్ఱ సముద్రంలో ఏర్పడిన ఆరిన నేల మీద నడిచారు. కాని ఈజిప్టు దేశస్థులు అలా చెయ్యాలని ప్రయత్నించి సముద్రంలో మునిగిపొయ్యారు.

30 ప్రజలు యెరికో కోట చుట్టు ఏడు రోజులు విశ్వాసంతో తిరగటం వల్ల ఆ కోట గోడలు పడిపొయ్యాయి.

31 దేవుణ్ణి విశ్వసించటం వల్లనే, వేశ్య అయినటువంటి రాహాబు యెహోషువ పంపిన గూఢచారులకు తన యింట్లో ఆతిథ్యమిచ్చింది. ఆ కారణంగానే, అవిశ్వాసులతోసహా ఆమె మరణించలేదు.

32 ఇంకేం చెప్పమంటారు? గిద్యోనును గురించి, బారాకును గురించి, సమ్సోనును గురించి, యెఫ్తాను గురించి, దావీదును గురించి, సమూయేలును గురించి మరియు ప్రవక్తల గురించి చెప్పటానికి నాకు వ్యవధి లేదు. 33 వీళ్ళు దేవుణ్ణి విశ్వసించటంవల్ల రాజ్యాలు జయించారు. న్యాయాన్ని స్థాపించారు. దేవుడు వాగ్దానం చేసినదాన్ని పొందారు. సింహాల నోళ్ళు మూయించారు. 34 భయంకరమైన మంటల్ని ఆర్పివేశారు. కత్తి పోట్లనుండి తమను తాము రక్షించుకొన్నారు. వాళ్ళ బలహీనత బలంగా మారిపోయింది. వాళ్ళు యుద్ధాలలో గొప్ప శక్తి కనబరుస్తూ పరదేశ సైన్యాలను ఓడించారు. 35 దేవుణ్ణి విశ్వసించటం వల్లనే కొందరు స్త్రీలు చనిపోయిన తమవాళ్ళను తిరిగి సజీవంగా పొందారు. కొందరు చావునుండి బ్రతికి వచ్చాక ఉత్తమ జీవితం గడపాలనే ఉద్దేశ్యముతో చిత్రహింసలనుండి విడుదల కోరలేదు. 36 భక్తిహీనులు వీళ్ళలో కొందర్ని పరిహాసం చేస్తూ కొరడా దెబ్బలు కొట్టారు. మరి కొందర్ని సంకెళ్ళతో బంధించి చెరసాలలో వేశారు. 37 కొందర్ని రాళ్ళతో కొట్టారు; రంపంతో కోసారు; కత్తితో పొడిచి చంపారు. ఆ భక్తులు మేకల చర్మాలను, గొఱ్ఱెల చర్మాలను ధరించి అనాధలై తిరిగారు. అంతేకాక హింసను, దుష్ప్రవర్తనను సహించారు. 38 ఎడారుల్లో, పర్వత ప్రాంతాల్లో, గుహల్లో, సొరంగాల్లో నివసించారు. ఈ ప్రపంచం వాళ్ళకు తగిందికాదు.

39 వాళ్ళ విశ్వాసాన్ని దేవుడు మెచ్చుకొన్నాడు. కాని దేవుడు వాగ్దానం చేసింది వాళ్ళకు యింకా లభించలేదు. 40 దేవుడు మనకివ్వటానికి ఉత్తమమైనదాన్ని దాచి ఉంచాడు. మనతో కలిసి మాత్రమే వాళ్ళకు పరిపూర్ణత కలగాలని యిలా చేసాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International