Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యిర్మీయా 40-42

యిర్మీయా విడుదల

40 యిర్మీయా రామా నగరంలో విడుదలైన పిమ్మట యోహోవా వాక్కు అతనికి వినిపించింది. బబులోను రాజు ప్రత్యేక అంగరక్షక దళాధిపతియైన నెబూజరదాను యిర్మీయాను రామా నగరంలో ఉన్నట్లు కనుగొన్నాడు. యిర్మీయా గొలుసులతో బంధింపబడ్డాడు. యెరూషలేము నుండి యూదా నుండి తేబడిన బందీలందరితో పాటు యిర్మీయా కూడా ఉన్నాడు. ఆ ప్రజలంతా బంధీలుగా బబులోనుకు తీసికొని పోబడుతున్నారు. దళాధిపతి నెబూజరదాను యిర్మీయాను చూచినప్పుడు అతనితో మాట్లాడి ఇలా అన్నాడు: “యిర్మీయా, నీ దేవుడైన యెహోవా ఈ విపత్తు ఈ ప్రదేశానికి వస్తుందని చెప్పియున్నాడు. యెహోవా ఏమి చేస్తానని చెప్పియున్నాడో అంతా జరిగేలా చేశాడు. మీ యూదా ప్రజలంతా యెహోవాపట్ల పాపం చేశారు. కావున మీకు ఈ ఆపద సంభవించింది. మీ ప్రజలు దేవునికి విధేయులుగా లేరు. కాని యిర్మీయా, నిన్ను నేనిప్పుడు విడుదల చేస్తాను. నీ మణికట్టుల నుండి సంకెళ్లను తీసివేస్తున్నాను. నీవు రాదలచుకొంటే నాతో బబులోనుకు రా. వస్తే నీ యోగక్షేమాల విషయంలో నేను తగిన శ్రద్ధ తీసికొంటాను. నీకు నాతో రావటానికి ఇష్టం లేకపోతే రావద్దు. చూడు; దేశమంతా నీకు బాహాటంగా తెరచబడి ఉంది. నీ ఇష్టము వచ్చిన చోటికి వెళ్లు. లేక షాఫాను పుత్రుడైన ఆహీకాము కుమారుడు గెదల్యావద్దకు తిరిగి వెళ్లు.[a] యూదా పట్టణాల పరిపాలనా నిర్వహణకై బబులోను రాజు గెదల్యాను పాలకునిగా ఎంపిక చేశాడు. నీవు వెళ్లి గెదల్యాతో కలిసి ప్రజల మధ్య నివసించు. లేదా నీ ఇష్టమొచ్చిన మరెక్కడికైనా సరే వెళ్లు.”

పిమ్మట నెబూజరదాను యిర్మీయాకు కొంత ఆహారాన్ని, ఒక కానుకను ఇచ్చి అతనిని పంపివేశాడు. కావున యిర్మీయా మిస్పా వద్ద వున్న అహీకాము కుమారుడైన గెదల్యా వద్దకు వెళ్లాడు. యిర్మీయా గెదల్యాతో కలిసి యూదా రాజ్యంలో మిగిలి ఉన్న ప్రజల మధ్య నివసించాడు.

గెదల్యా యొక్క స్వల్పకాలిక పాలన

యెరూషలేము నాశనం చేయబడినప్పుడు యూదా రాజ్య సైన్యంలోని కొంతమంది, సైనికులు అధికారులు, తదితర మనుష్యులు బయట ప్రాంతంలో వుండిపోయారు. రాజ్యంలో మిగిలిన ప్రజలను పాలించటానికి అహీకాము కుమారుడైన గెదల్యాను బబులోను రాజు నియమించినట్లు ఆ సైనికులు విన్నారు. యూదా రాజ్యంలో మిగిలిన ప్రజలలో మిక్కిలి పేదవారు, బబులోనుకు బందీలుగా తీసికొనిపోవటానికి అనువుగాని స్త్రీ పురుషులు, పిల్లలు వున్నారు. కావున ఆ సైనికులు మిస్పావద్ద గెదల్యాను కలవటానికి వచ్చారు. ఆ వచ్చిన సైనికులలో నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, కారేహ కుమారులైన యోహోనాను మరియు యోనాతాను, తన్హుమెతు కుమారుడైన శెరాయా, నెటోపాతీయుడైన ఏపయి యొక్క కుమారుడు, మాయకాతీయుని కుమారుడైన యెజన్యా, వారితో ఉన్న మనుష్యులు ఉన్నారు.

షాఫాను మనుమడు, అహీకాము కుమారుడు అయిన గెదల్యా ఆ సైనికులకు, వారితో ఉన్న మనుష్యులకు భద్రత కల్పించటానికి ఒక ప్రమాణం చేశాడు. గెదల్యా ఇలా అన్నాడు: “సైనికులారా, కల్దీయులకు సేవ చేయటానికి మీరు భయపడకండి. రాజ్యంలో స్థిరపడి బబులోను రాజుకు సేవ చేయండి. మీరిది చేస్తే, మీకు అంతా సవ్యంగా జరిగిపోతుంది. 10 నేను కూడా మిస్పాలోనే నివసిస్తాను. కల్దీయులు ఇక్కడికి వచ్చినప్పుడు మీ తరపున నేను వారితో మాట్లాడతాను. మీరు ఆ పనిని నాకు వదలండి. వేసవి ద్రాక్షపంట నుండి రసం తీయాలి. నూనె కూడ తీయాలి. మీరు తయారు చేసినవన్నీ జాడీలలో నిలువ చేయండి. మీరు ఆక్రమించుకున్న పట్టణాలలో నివసించండి.”

11 మోయాబు, అమ్మోను, ఎదోము, ఇంకను ఇతర దేశాలలో వున్న యూదా ప్రజలంతా బబులోను రాజు యూదా రాజ్యంలో కొంతమందిని వదిలి వెళ్లినట్లువిన్నారు. షాఫాను మనుమడు, అహీకాము కుమారుడు అయిన గెదల్యాను బబులోను రాజు వారిపై పాలకునిగా నియమించినట్లు కూడ విన్నారు. 12 ఆ యూదా ప్రజలు ఈ వార్త విన్న తరువాత యూదా రాజ్యానికి తిరిగి వచ్చారు. చిందరవందరగా వివిధ దేశాల్లో ఉన్న యూదా వారంతా మిస్పాకు తిరిగి వచ్చి గెదల్యాను ఆశ్రయించారు. తిరిగి వచ్చి, వారు చాల ద్రాక్షరసాన్ని తీసి, వేసవి పండ్లను సేకరించారు.

13 బయట పల్లెల్లో ఉన్న కారేహ కుమారుడైన యోహానాను, ఇతర యూదా సైన్యాధికారులు గెదల్యా యొద్దకు వచ్చారు. గెదల్యా మిస్పా పట్టణంలో ఉన్నాడు. 14 యోహానాను, మరియు అతనితో ఉన్న అధికారులు గెదల్యాతో, “అమ్మోనీయుల రాజైన బయలీను నిన్ను చంపజూస్తున్నాడు. అది నీకు తెలుసా? నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును నిన్ను చంపటానికి పంపాడు” అని అన్నారు. కాని అహీకాము కుమారుడైన గెదల్యా వారి మాట నమ్మలేదు.

15 పిమ్మట కారేహ కుమారుడైన యోహానాను మిస్పాలో గెదల్యాతో ఏకాంతంగా మాట్లాడాడు. గెదల్యాతో యోహానాను ఇలా అన్నాడు: “నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును నన్ను వెళ్లి చంపనిమ్ము. దానిని గురించి ఎవ్వరికీ తెలియకుండా నేను చేస్తాను. ఇష్మాయేలు నిన్ను చంపకుండా మేము చూస్తాము. అతడు నిన్ను చంపితే నిన్నాశ్రయించి వచ్చిన యూదా ప్రజలంతా మళ్లీ వివిధ దేశాలకు చెల్లాచెదురై పోతారు. అంటే మిగిలిన కొద్దిమంది యూదావారు కూడా నశించి పోతారన్నమాట.”

16 కాని, అహీకాము కుమారుడైన గెదల్యా తన హితంగోరి చెప్పిన కారేహ కుమారుడైన యోహానానుతో, “ఇష్మాయేలును చంపవద్దు. నీవు ఇష్మాయేలును గురించి చెప్పుచున్న విషయాలు నిజం కావు” అని అన్నాడు.

41 ఎలీషామా మనుమడు, నెతన్యా కుమారుడు అగు ఇష్మాయేలు ఏడవ మాసంలో అహీకాము కుమారుడైన గెదల్యా వద్దకు వచ్చాడు. అతనితో తమ మనుష్యులు పదిమంది ఉన్నారు. వారు మిస్పా పట్టణానికి వచ్చారు. ఇష్మాయేలు రాజ కుటుంబంలో ఒక సభ్యుడు. యూదా రాజు అధికారులలో ఒకడు. ఇష్మాయేలు, అతని మనుష్యులు గెదల్యాతో కలిసి భోజనం చేశారు. వారంతా కలిసి భోజనం చేస్తూవుండగా, ఇష్మాయేలు మరియు అతని పదిమంది మనుష్యులు లేచి అహీకాము కుమారుడైన గెదల్యాను కత్తితో పొడిచి చంపారు. గెదల్యా యూదా పాలకుడుగా బబులోను రాజుచే ఎంపిక చేయబడిన వ్యక్తి. మిస్పా పట్టణంలో గెదల్యాతో ఉన్న యూదా ప్రజలందరిని కూడ ఇష్మాయేలు చంపివేశాడు. అంతేగాదు. గెదల్యాతో వున్న కల్దీయుల సైనికులను కూడ ఇష్మాయేలు చంపివేశాడు.

4-5 గెదల్యా హత్య గావింపబడిన మరుసటి రోజు ఎనభై మంది మనుష్యులు మిస్పాకు వచ్చారు. వారు ధాన్యపు నైవేద్యాలు, ధూపానికి సాంబ్రాణిని దేవాలయానికి తీసికొని వస్తున్నారు. ఆ ఎనభై మంది వ్యక్తులూ వారి గడ్డాలు గీయించుకొని తమ బట్టలు చింపుకొని, తమ శరీరాలను చీరుకొన్నారు[b] వారు షెకెము, షిలోహు, షోమ్రోనుల నుండి వచ్చారు. వారిలో ఏ ఒక్కరికి గెదల్యా హత్య గావింపబడినట్లు తెలియదు. ఆ ఎనభై మందిని కలవటానికి ఇష్మాయేలు మిస్పా పట్టణం నుండి వారికి ఎదురేగాడు. అతడు వారిని కలవటానికి వెళుతూ రోదించాడు.[c] ఇష్మాయేలు ఆ ఎనభై మంది మనుష్యులనూ కలిసి కొని, “నాతో రండి. మనం అహీకాము కుమారుడైన గెదల్యాను కలుద్దాము” అని చెప్పాడు. ఆ ఎనభై మంది మిస్పా పట్టణంలోకి వెళ్లారు. అప్పుడు ఇష్మాయేలు, అతని మనుష్యులు కలిసి ఆ వచ్చిన వారిలో డెబ్బయి మందిని చంపివేశారు. వారా శవాలను నీళ్లను నిల్వచేయటానికి నిర్మించిన నూయి వంటి గోతిలో పడవేశారు. కాని మిగిలిన పదిమంది ఇష్మాయేలుతో, “మమ్మల్ని చంపవద్దు! మావద్ద గోధుమ, యవల ధాన్యాలు ఉన్నాయి. మావద్ద తైలము, తేనె కూడ ఉన్నాయి. వాటిని మేమొక పొలంలో దాచాము (వాటిని మీకు ఇస్తాము)” అని చెప్పారు. అందువల్ల ఇష్మాయేలు ఆ పది మందినీ వదిలి పెట్టాడు. ఇతరులతో పాటు అతడు వారిని చంపలేదు. (ఈ నీటి గొయ్యి చాలా పెద్దది. ఆసా అనే యూదా రాజుచే అది నిర్మించబడింది. యుద్ధ కాలంలో నీటిని నిలువచేయటానికి రాజైన ఆసా[d] దానిని నిర్మింప చేశాడు. ఇశ్రాయేలు రాజైన బయషా నుండి తన పట్టణాన్ని రక్షించుకోవటానికి ఆసా ఇలా చేశాడు. అయితే ఇష్మాయేలు మాత్రం ఆ గొయ్యి నిండేవరకు దానిలో శవాలను పడవేశాడు.)

10 మిస్పా పట్టణంలో ఉన్న ఇతర ప్రజలందరినీ ఇష్మాయేలు పట్టుకున్నాడు. అలా పట్టుకున్న వారిలో రాజు కుమార్తెలు మరియు అక్కడ మిగిలియున్న ఇతర ప్రజలు వున్నారు. ఎవరినైతే నెబూజరదాను పాలించమని గెదల్యాను నియమించాడో, వారే ఆ ప్రజలు. నెబూజరదాను బబులోను రాజుయొక్క ప్రత్యేక అంగరక్షక దళాధిపతి. ఇష్మాయేలు తాను పట్టుకున్న ప్రజలను తీసికొని అమ్మోను దేశానికి పోవటానికి బయలు దేరాడు.

11 కారేహ కుమారుడైన యెహానాను మరియు అతనితో ఉన్న సైన్యాధికారులు ఇష్మాయేలు చేసిన క్రూరమైన పనులన్నిటి గురించి విన్నారు. 12 కావున యోహానాను, అతనితో వున్న సైన్యాధికారులు తమ సైనికులను వెంట తీసికొని నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును ఎదుర్కోవటానికి వెళ్లారు. గిబియోను వద్ద గల పెద్ద చెరువు దగ్గర వారు ఇష్మాయేలును పట్టుకున్నారు. 13 ఇష్మాయేలును బందీలుగా పట్టుకు పోతున్న యోహానానును, సైన్యాధికారులను చూచి జనులు చాలా సంతోషించారు. 14 అప్పుడు మిస్పా పట్టణంలో ఇష్మాయేలు బందీలుగా తీసికొన్న వారంతా కారేహ కుమారుడైన యోహానాను వద్దకు పరుగెత్తారు. 15 కాని ఇష్మాయేలు మరియు అతనితో ఉన్న వారిలో ఎనిమిది మంది యోహోనాను నుండి తప్పించుకున్నారు. వారు అమ్మోనీయుల వద్దకు పారిపోయారు.

16 ఆ విధంగా కారేహ కుమారుడైన యోహానాను, సైనికాధికారులు బందీలను రక్షించారు. ఇష్మాయేలు గెదల్యాను హత్య చేసి ఆ ప్రజలను మిస్పా పట్టణంలో పట్టుకున్నాడు. బ్రతికి బయటపడిన వారిలో సైనికులు, స్త్రీలు, పిల్లలు మరియు న్యాయాధికారులు వున్నారు, యెహానాను వారిని గిబియోను పట్టణం నుండి తిరిగి తీసికొని వచ్చాడు.

ఈజిప్టుకు తప్పించుకొనుట

17-18 యోహానాను, ఇతర సైనికాధికారులు కల్దీయుల విషయంలో భయపడ్డారు. బబులోను రాజు గెదల్యాను యూదా రాజ్యానికి పాలకునిగా ఎంపిక చేశాడు. కాని ఇష్మాయేలు గెదల్యాను హత్య చేశాడు. దానితో కల్దీయులకు కోపం వస్తుందేమోనని యోహానాను భయపడ్డాడు. కావున వారు ఈజిప్టుకు పారిపోవాలని నిశ్చయించుకొన్నారు. ఈజిప్టుకు పోతూ మార్గం మధ్యలో వారు గెరూతు కింహాము వద్ద ఆగారు. గెరూతు కింహాము బేత్లెహేము పట్టణం దగ్గర ఉన్నది.

42 వారు గెరూతు కింహాము వద్ద ఉండగానే యోహానాను, హోషేయా కుమారుడైన యెజన్యా అనే మరో వ్యక్తి కలిసి ప్రవక్తయైన యిర్మీయా వద్దకు వెళ్లారు. సైన్యాధికారులంతా యోహానాను, యెజన్యానులతో కలిసి వెళ్లారు. అల్పులు మొదలు ఉన్నతుల వరకు అంతా యిర్మీయా వద్దకు వెళ్లారు. వారంతా ఇలా అన్నారు: “యిర్మీయా, దయచేసి మా అభ్యర్థన ఆలకించు. యూదా సంతతిలో బతికి బయటపడిన ఈ ప్రజలందరిని గురించి నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుము. యిర్మీయా, మాలో ఎక్కువ మంది మిగలలేదు. ఒకప్పుడు మేము ఎక్కువ సంఖ్యలో ఉన్నాము. యిర్మీయా, మేము ఎక్కడికి వెళ్లవలెనో, ఏమి చేయవలెనో నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసి తెలుసుకో.”

అప్పుడు ప్రవక్తయైన యిర్మీయా ఇలా అన్నాడు: “మీరు నన్ను చేయమని అడిగిన విషయాలను నేను అర్థం చేసికొన్నాను. మీ దేవుడైన యెహోవాకు మీరడిగిన విధంగా నేను ప్రార్థన చేస్తాను. యెహోవా చెప్పినదంతా నేను మీకు తెలియజేస్తాను. మీకు నేనేదీ దాచి పెట్టను.”

తరువాత ప్రజలు యిర్మీయాతో ఇలా అన్నారు, “నీ దేవుడైన యెహోవా చెప్పినదంతా మేము చేయకపోతే దేవుడే మాకు వ్యతిరేకంగా నిజమైన సాక్షి అవుతాడు. నీ దేవుడైన యెహోవా మేము ఏది చేయాలో నీకు తెలియజేస్తాడని మాకు తెలుసు. యెహోవా వర్తమానం మాకు సమ్మతమవుతుందా, సమ్మతం కాదా అనేది సమస్య కాదు. మా యెహోవా దేవుని పట్ల మేము విధేయులమై ఉంటాము. మేము నిన్ను ఒక సందేశం తెచ్చుట కొరకు పంపుచున్నాము. దానికి మేము కట్టుబడి ఉంటాము. మా దేవుడైన యెహోవాకు మేము విధేయులమైనప్పుడు మాకు మంచి విషయాలు జరుగుతాయని మాకు ఖచ్చితముగా తెలుసు.”

పది రోజులు జరిగిన పిమ్మట యెహోవా వాక్కు యిర్మీయాకు వినిపించింది. అప్పుడు కారేహ కుమారుడైన యోహానానును, అతనితో ఉన్న సైన్యాధికారులను యిర్మీయా ఒక చోటికి పిలిచాడు. అతి సామాన్యుడి మొదలు అతి ముఖ్యమైన వ్యక్తి వరకు ప్రజలందరినీ కూడ యిర్మీయా ఒక చోటికి పిలిచాడు. అప్పుడు యిర్మీయా వారితో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వద్దకు మీరు నన్ను పంపారు. మీరు నన్ను అడగమన్నదంతా నేను యెహోవాను అడిగాను. యెహోవా ఇలా చెపుతున్నాడు: 10 ‘ప్రజలారా మీరు యూదాలో ఉంటే నేను మిమ్మల్ని బలపర్చుతాను—మిమ్మల్ని నాశనం చేయను. మీరు స్థిరపడేలా చేస్తాను. నేను మిమ్మల్ని పెకలించి వేయను. నేనిది ఎందుకు చేయదలచుకున్నానంటే, నేను మీకు కలుగజేసిన భయంకర విషయాల పట్ల నేను విచారిస్తున్నాను. 11 బబులోను రాజు విషయంలో ఇప్పుడు మీరు భయపడుతున్నారు. కాని అతనిని చూచి మీరు భయపడవద్దు. బబులోను రాజంటే మీరు భయపడవద్దు.’ ఇదే యెహోవా సందేశం. ‘ఎందువల్ల నంటే, నేను మీతో ఉన్నాను. నేను మిమ్మల్ని కాపాడతాను. నేను మిమ్మల్ని రక్షిస్తాను. అతడు మీ మీద చెయ్యి వేయలేడు. 12 నేను మీ పట్ల దయగలిగి వుంటాను. బబులోను రాజు కూడ మీ పట్ల కనికరం చూపుతాడు. అతడు మిమ్మల్ని మీ దేశానికి తిరిగి తీసుకొని వస్తాడు.’ 13 ‘మేము యూదాలో వుండమని’ మీరు అనవచ్చు. అలా అంటే మీరు మీ యెహోవా దేవుని అనుసరించనట్లే. 14 ‘అది కాదు. మేము వెళ్లి ఈజిప్టులో నివసిస్తాము. ఆ దేశంలో మాకు యుద్ధ భయం ఉండదు. మేమక్కడ యుద్ధ భేరీలు వినము. మేము అక్కడ ఆకలితో బాధపడము అని మీరు అనవచ్చు.’ 15 యూదాలో మిగిలిన ప్రజలారా, మీరలా అంటే యెహోవా వర్తమానం ఏమిటో వినండి. ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా చెప్పుచున్నాడు: ‘మీరు ఈజిప్టునందు నివసింప నిశ్చయిస్తే మీకు ఇలా జరుగుతుంది: 16 మీరు యుద్ధమనే కత్తికి భయపడ్డారు. కాని అది మిమ్మల్ని అక్కడ ఓడిస్తుంది. మీరు ఆకలి విషయంలో భయపడ్డారు. కాని మీరు ఈజిప్టులో క్షామానికి గురియగుతారు. మీరక్కడ చనిపోతారు. 17 ఈజిప్టుకు వెళ్లి అక్కడ నివసించాలనుకునే ప్రతివాడు కత్తివాతబడి గాని, ఆకలిచేగాని, భయంకర వ్యాధులచేగాని చనిపోతాడు. ఈజిప్టుకు వెళ్లే ఏ ఒక్కడు బతకడు. నేను వారికి కలుగజేసే భయంకర పరిస్థితుల నుండి ఏ ఒక్కడూ తప్పించుకోలేడు.’

18 “ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు, ‘యెరూషలేము పట్ల నా కోపాన్ని చూపాను. యెరూషలేములో నివసించే ప్రజలను నేను శక్షించాను. అదేరీతిగా ఈజిప్టుకు వెళ్లే ప్రతివాని పట్లా నా కోపం చూపిస్తాను. ప్రజలు తమ శత్రువులకు కీడు జరగాలని కోరుకున్నప్పుడు మీకు జరిగినట్లు జరగాలని మిమ్మల్ని ఒక ఉదాహరణగా తీసుకుంటారు. మీరు శాపగ్రస్తులౌతారు. మిమ్మల్ని చూచి ప్రజలు సిగ్గు చెందుతారు. ప్రజలు మిమ్మల్ని అవమాన పర్చుతారు. మీరు మళ్లీ యూదా రాజ్యాన్ని చూడరు.’

19 “యూదాలో మిగిలివున్న ప్రజలారా, ‘మీరు ఈజిప్టుకు పోవద్దు’ అని యెహోవా మీకు చెప్పియున్నాడు. ఇప్పుడే మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను. 20 మీకు చావు తీసికొనివచ్చే తప్పు మీరు చేస్తున్నారు. ‘మీరే నన్ను మీ ప్రభువైన దేవుని వద్దకు పంపారు. మన ప్రభువైన దేవుణ్ణి మా కొరకు ప్రార్థించు. యెహోవా ఏమి చేయమని చెప్పుచున్నాడో అదంతా మాకు తెలియజేయుము. మేము యెహోవా చెప్పినట్లు నడచుకొంటాము’ అని మీరే నాతో అన్నారు. 21 కావున ఈ రోజు యెహోవా సందేశాన్ని మీకు వినిపించాను. కాని మీరు ప్రభువైన మీ దేవునికి విధేయులు కాలేదు. ఆయన మిమ్మల్ని ఏమి చేయమని చెప్పటానికి నన్ను పంపియున్నాడో అదంతా మీరు చేయలేదు! 22 కావున ఇప్పుడిది బాగా అర్థం చేసికొనండి: మీరు ఈజిప్టుకు వెళ్లి అక్కడ నివసించాలని అనుకుంటున్నారు. కాని ఈజిప్టులో మీరు కత్తివేటుకు గురియైగాని, ఆకలిచేగాని, భయంకర రోగాలతో గాని చనిపోతారు.”

హెబ్రీయులకు 4

దేవుని విశ్రాంతిలో ప్రవేశించుదుమన్న వాగ్దానం యింకా అలాగే ఉంది. అందువలన అక్కడికి వెళ్ళగలిగే అవకాశాన్ని ఎవ్వరూ జారవిడుచుకోకుండా జాగ్రత్త పడదాం. ఎందుకంటే, వాళ్ళకు ప్రకటింపబడినట్లే మనకు కూడా సువార్త ప్రకటింపబడింది. కాని, వాళ్ళు ఆ సువార్తను విశ్వాసంతో వినలేదు గనుక అది వాళ్ళకు నిష్ర్పయోజనమైపోయింది. సువార్తను విశ్వసించే మనం దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తాము.

“నా కోపంతో ప్రమాణం చేసి చెప్పుచున్నాను:
    ‘నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను’”(A)

అని దేవుడు అన్నాడు. ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత ఆయన కార్యం ముగిసింది. కాని, “దేవుడు ప్రపంచాన్ని సృష్టించటం ముగించిన తర్వాత విశ్రాంతి తీసుకొనెను”(B) అని ఏడవ రోజును గురించి ఒక చోట వ్రాయబడి ఉంది. దేవుడు ఈ విషయాన్ని గురించి మళ్ళీ చెబుతూ, “నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను” అని అన్నాడు.

ఆ విశ్రాంతిలో ప్రవేశించటానికి అవకాశం ఇంకావుంది. ఇదివరలో శుభసందేశాన్ని విన్నవాళ్ళు, వాళ్ళ అవిధేయతవల్ల లోపలికి వెళ్ళలేకపొయ్యారు. అందువల్ల దేవుడు మరొక దినాన్ని నిర్ణయించాడు. దాన్ని “ఈ రోజు” అని అన్నాడు. నేను ముందు వ్రాసినట్లు చాలాకాలం తర్వాత దేవుడు దావీదు ద్వారా ఈ విధంగా మాట్లాడాడు:

“ఈ రోజు మీరాయన స్వరం వింటే,
    మూర్ఖంగా ప్రవర్తించకండి.”(C)

యెహోషువ వాళ్ళకు విశ్రాంతి ఇచ్చినట్లయితే దేవుడు ఆ తర్వాత మరొక రోజును గురించి మాట్లాడి ఉండేవాడు కాదు. అందువల్ల, దేవుని ప్రజల కోసం “విశ్రాంతి” కాచుకొని ఉంది. 10 దేవుడు తన పని ముగించి విశ్రమించాడు. అలాగే, దేవుని విశ్రాంతిలో ప్రవేశించే ప్రతి ఒక్కడూ తన పనినుండి విశ్రాంతి పొందుతాడు. 11 అందువల్ల ఆ విశ్రాంతిని పొందటానికి మనం అన్ని విధాలా ప్రయత్నంచేద్దాం. వాళ్ళలా అవిధేయతగా ప్రవర్తించి క్రింద పడకుండా జాగ్రత్తపడదాం.

12 దైవసందేశం సజీవమైంది. దానిలో చురుకుదనం ఉంది. అది రెండు వైపులా పదునుగానున్న కత్తికన్నా పదునైంది. అది చొచ్చుకొని పోయి ఆత్మను, ప్రాణాన్ని, కీళ్ళను, ఎముకలో ఉన్న మూలుగను విభాగించగలదు. అది మనస్సు యొక్క భావాలమీద, ఆలోచనల మీద తీర్పు చెప్పగలదు. 13 సృష్టిలో ఉన్న ఏ వస్తువూ దేవుని దృష్టినుండి తప్పించుకోలేదు. కళ్ళ ముందు పరచబడినట్లు ఆయనకు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అలాంటి దేవునికి మనం మనకు సంబంధించిన లెక్కల్ని చూపవలసి వుంటుంది.

యేసు గొప్ప ప్రధాన యాజకుడు

14 పరలోకానికి వెళ్ళిన యేసు దేవుని కుమారుడు. ఆయనే మన ప్రధాన యాజకుడు. మనం బహిరంగంగా అంగీకరించిన విశ్వాసాన్ని విడువకుండా దృఢంగా ఉండాలి. 15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతలను చూసి సానుభూతి చెందుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మనలాగే అన్ని రకాల పరీక్షలకు గురి అయ్యాడు. కాని, ఆయన ఏ పాపమూ చెయ్యలేదు. 16 అందువలన మనకు అనుగ్రహం ప్రసాదించే దేవుని సింహాసనం దగ్గరకు విశ్వాసంతో వెళ్ళుదాం. అలా చేస్తే మనకు అవసరమున్నప్పుడు, ఆయన దయ, అనుగ్రహము మనకు లభిస్తాయి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International