Old/New Testament
రాజ్యాలకు సంబంధించిన యెహోవా సందేశాలు
46 ప్రవక్తయైన యిర్మీయాకు ఈ సందేశాలు వచ్చాయి. ఆ సందేశాలు వివిధ దేశాలకు సంబంధించి ఉన్నాయి.
ఈజిప్టును గురించిన వర్తమానం
2 ఈ వర్తమానం ఈజిప్టు[a] దేశాన్ని గురించి చెప్పబడినది. అది ఫరోనెకో సైన్యానికి సంబంధించినది. నెకో ఈజిప్టు రాజు. అతని సైన్యం కర్కెమీషు అనే పట్టణం వద్ద ఓడింపబడింది. కర్కెమీషు యూఫ్రటీసు నదీతీర పట్టణం. బబులోను రాజైన నెబుకద్నెజరు ఫరోనెకో సైన్యాన్ని కర్కెమీషు వద్ద ఓడించాడు. అప్పుడు యూదా రాజైన యెహోయాకీము పాలనలో నాల్గవ సంవత్సరం గడుస్తూ ఉంది. రాజైన యెహోయాకీము యోషీయా కుమారుడు. ఈజిప్టుకు సంబంధించిన యెహోవా సందేశం ఇలా ఉంది:
3 “మీ చిన్న, పెద్దడాళ్లను తీసుకోండి.
యుద్ధానికి నడవండి.
4 గుర్రాలను సిద్ధం చేయండి.
సైనికులారా, మీరు గుర్రాలను ఎక్కండి.
యుద్ధానికై మీమీ సంకేత స్థలాలకు వెళ్లండి.
మీ శిరస్త్రాణాలను పెట్టుకోండి.
మీ ఈటెలకు పదును పెట్టండి.
మీ కవచాలను ధరించండి.
5 నేనేమిటి చూస్తున్నాను?
ఆ సైన్యం భయపడింది!
సైనికులు పారిపోతున్నారు.
ధైర్యవంతులైన వారి సైనికులు ఓడింపబడ్డారు.
వారు తత్తరపడి పారిపోతున్నారు.
వారు వెనుదిరిగి చూడకుండా పోతున్నారు.
ఎటు చూచినా భయం.”
యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
6 “వేగంగా పరుగెత్తేవారు,
బలవంతులు కూడా తప్పించుకోలేరు.
వారు తూలి పడిపోతారు.
ఉత్తరదేశంలో యూఫ్రటీసు నదీ తీరాన ఇది జరుగుతుంది.
7 నైలు నదిలా ఆ వచ్చేది ఎవరు?
పరవళ్లు తొక్కుతూ ప్రవహించే ఆ మహానదిలా వచ్చేది ఎవరు?
8 పొంగి ప్రవహించే నైలు నదిలా
వచ్చేది ఈజిప్టు దేశమే.
మహా వేగంతో ప్రవహించే
మహా నదిలా వచ్చేది ఈజిప్టు దేశమే.
‘నేను వచ్చి భూమిని కప్పివేస్తాను.
నేను నగరాలను, వాటి నివాసులను నాశనం చేస్తాను’ అని ఈజిప్టు అంటున్నది.
9 గుర్రపు రౌతుల్లారా, యుద్ధానికి కదలండి.
సారధుల్లారా, శరవేగంతో రథాలు తోలండి.
యోధుల్లారా ముందుకు పదండి.
కూషు, పూతు సైనికులారా మీ డాళ్లను చేబూనండి.
లూదీయులారా, మీ విల్లంబులు వాడండి.
10 “కాని ఆ రోజు సర్వశక్తిమంతుడైన మన యెహోవా గెలుస్తాడు!
ఆ సమయంలో ఆయన శత్రువులకు తగిన శిక్ష ఆయన విధిస్తాడు.
యెహోవా శత్రువులు వారికి అర్హమైన శిక్ష అనుభవిస్తారు తన పని పూర్తి అయ్యేవరకు కత్తి హతమారుస్తుంది.
దాని రక్తదాహం తీరేవరకు కత్తి సంహరిస్తుంది. ఇది జరుగుతుంది.
ఎందువల్లనంటే సర్వశక్తిమంతుడైన మన యెహోవాకు ఒక బలి జరగవలసి వుంది.
ఆ బలి ఈజిప్టు సైన్యమే! అది ఉత్తర దేశాన యూఫ్రటీసు నది ఒడ్డున జరుగుతుంది.
11 “ఈజిప్టు, గిలియాదు వరకు వెళ్లి మందు తెచ్చుకో.
నీవు మందులనేకం తయారుచేస్తావు, అయినా అవి నీకు ఉపయోగపడవు.
నీ గాయాలు మానవు.
12 నీ రోదనను దేశాలు వింటాయి.
నీ ఏడ్పు ప్రపంచమంతా వినపడుతుంది.
ఒక ధైర్యశాలి మరియొక ధైర్యశాలి అయిన యోధునిపై పడతాడు.
ఆ యోధులిద్దరూ కలిసి క్రింద పడతారు.”
13 ప్రవక్తయైన యిర్మీయాకు యెహోవా ఈ వర్తమానం అందజేశాడు. ఈజిప్టును ఎదుర్కోవటానికి కదలివచ్చే నెబుకద్నెజరును గురించి ఈ వర్తమానం ఇవ్వబడింది.
14 “ఈ సందేశాన్ని ఈజిప్టులో తెలియజెప్పండి.
మిగ్దోలు నగరంలో బోధించండి.
ఈ సందేశాన్ని నోపు (మెంఫిన్) లోను, తహపనేసులోను ప్రచారం చేయండి:
‘యుద్ధానికి సిద్ధపడండి.
ఎందువల్లనంటే మీ చుట్టూవున్న ప్రజలు కత్తిచే చంపబడుతున్నారు.’
15 ఈజిప్టూ, నీ బలమైన యోధులెందుకు చంపబడతారు?
వారు నిలువలేరు.
ఎందువల్లనంటే యెహోవా వారిని నేలకు పడదోస్తాడు!
16 ఆ సైనికులు పదేపదే తూలిపోతారు.
వారొకరి మీద మరొకరు పడతారు.
వారు, ‘లేవండి, మనం మన స్వంత ప్రజల వద్దకు వెళదాం.
మనం మన మాతృభూమికి వెళ్లిపోదాము.
మన శత్రువు మనల్ని ఓడిస్తున్నాడు.
మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి’ అని అంటారు.
17 వారి స్వస్థలాలో ఆ సైనికులు,
‘ఈజిప్టు రాజైన ఫరో కేవలం ఆడంబరమైన వాడు;
అతని ప్రభావం అయిపోయింది, అని అనుకుంటారు.’”
18 ఈ వర్తమానం రాజునుండి వచ్చనది.
సర్వశక్తిమంతుడైన యెహోవాయే ఆ రాజు.
“నిత్యుడనగు నా తోడుగా ప్రమాణము చేస్తున్నాను.
ఒక మహాశక్తివంతుడైన నాయకుడు వస్తాడు.
తాబోరు కొండలా, సముద్రతీరానగల కర్మెలు పర్వతంలా అతడు గొప్పవాడై ఉంటాడు.
19 ఈజిప్టు ప్రజలారా, మీ వస్తువులు సర్దుకోండి.
బందీలై పోవటానికి సిద్ధమవండి.
ఎందువల్లనంటే, నోపు (మెంఫిస్) నగరం శిథిలమై నిర్మానుష్యమవుతుంది.
నగరాలు నాశనమవుతాయి.
వాటిలో ఎవరూ నివసించరు!
20 “ఈజిప్టు ఒక అందమైన ఆవులా ఉంది.
కాని ఉత్తరాన్నుండి ఒక జోరీగ దాన్ని ముసరటానికి వస్తున్నది.
21 ఈజిప్టు సైన్యంలో కిరాయి సైనికులు కొవ్విన కోడెదూడల్లా ఉన్నారు.
అయినా వారంతా వెన్నుజూపి పారిపోతారు.
శత్రు దాడికి వారు తట్టుకోలేరు.
వారి వినాశన కాలం సమీపిస్తూ ఉన్నది.
వారు అనతి కాలంలోనే శిక్షింపబడుతారు.
22 బుసకొట్టుతూ పారిపోవటానికి ప్రయత్నించే
పాములా ఈజిప్టు వుంది.
శత్రువు మిక్కిలి దరిజేరుతూ వున్నాడు.
అందుచే ఈజిప్టు సైన్యం పారిపోవటానికి ప్రయత్నిస్తూ ఉంది.
గొడ్డళ్లు చేపట్టి శత్రవులు ఈజిప్టు మీదికి వస్తున్నారు.
వారు చెట్లను నరికే మనుష్యుల్లా వున్నారు.”
23 యెహోవా ఈ విషయాలు చెప్పుచున్నాడు,
“ఈజిప్టు అరణ్యాన్ని (సైన్యం) శత్రువు నరికివేస్తాడు.
అరణ్యంలో (సైన్యం) చెట్లు (సైనికులు) చాలా వున్నాయి. కాని
అది నరికివేయబడుతుంది.
మిడుతలకంటె ఎక్కువగా శత్రు సైనికులున్నారు.
లెక్కకు మించి శత్రు సైనికులున్నారు.
24 ఈజిప్టుకు తలవంపులవుతుంది.
ఉత్తరాన్నుండి వచ్చే శత్రు సైన్యం వారిని ఓడిస్తుంది.”
25 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెప్పుచున్నాడు, “అతి త్వరలో థేబెసు దేవతయైన ఆమోనును[b] నేను శిక్షింపనున్నాను. నేను ఫరోను, ఈజిప్టును మరియు దాని దేవతలను శిక్షిస్తాను. ఈజిప్టు రాజులను నేను శిక్షిస్తాను. ఫరో మీద ఆధారపడి, అతన్ని నమ్మిన ప్రజలను కూడా నేను శిక్షిస్తాను. 26 వారి శత్రువుల చేతుల్లో వారంతా ఓడిపోయేలా నేను చేస్తాను. ఆ శత్రువులు వారిని చంపగోరుతున్నారు. నేనా ప్రజలను బబులోను రాజైన నెబుకద్నెజరుకు, అతని సేవకులకు అప్పగిస్తాను.
“చాల కాలం ముందట ఈజిప్టు శాంతియుతంగా వుండేది. ఈ కష్ట కాలాలు అయిన తర్వాత ఈజిప్టు మరలా శాంతంగా వుంటుంది.” ఈ విషయాలను యెహోవా చెప్పాడు.
ఉత్తర ఇశ్రాయేలు రాజ్యానికి ఒక వర్తమానం
27 “నా సేవకుడవైన యాకోబూ,[c] భయపడవద్దు.
ఇశ్రాయేలూ, బెదరవద్దు.
ఆ దూర ప్రాంతాలనుండి నేను మిమ్మల్ని తప్పక రక్షిస్తాను.
వారు బందీలుగా వున్న దేశాలనుండి మీ పిల్లల్ని కాపాడతాను.
యాకోబుకు మరల శాంతి, రక్షణ కల్పించబడతాయి.
అతనిని ఎవ్వరూ భయపెట్టలేరు.”
28 యెహోవా ఇలా అంటున్నాడు,
“నా సేవకుడవైన యాకోబూ, భయపడకు.
నేను నీతో వున్నాను.
నిన్ను అనేక ఇతర దేశాలకు నేను పంపియున్నాను.
ఆ రాజ్యాలన్నిటినీ నేను సర్వనాశనం చేస్తాను.
కాని నిన్ను నేను పూర్తిగా నాశనం కానీయను.
నీవు చేసిన నీచమైన కార్యాలకు నీవు తప్పక శిక్షింపబడాలి.
కావున నీవు శిక్ష తప్పించుకొనేలా నిన్ను వదలను.
నిన్ను క్రమశిక్షణలో పెడతాను. అయినా నీ పట్ల న్యాయపరమైన ఉదారంతో మాత్రమే ఉంటాను.”
ఫిలిప్తీయుల గురించిన సందేశం
47 ప్రవక్తయైన యిర్మీయాకు యెహోవా నుండి ఈ సందేశం వచ్చింది. ఆ వర్తమానం ఫిలిష్తీయులను గురించినది. గాజా నగరంపై ఫరో దాడి చేయటానికి ముందుగా ఈ వర్తమానం వచ్చింది.
2 యెహోవా ఇలా చెపుతున్నాడు,
“చూడు, శత్రుసైనికులు ఉత్తరాన సమకూడుతున్నారు.
శరవేగంతో పొంగి ప్రవహించే నదిలా వారు వస్తారు.
దేశాన్నంతా ఒక మహా వెల్లువలా వారు ఆవరిస్తారు.
వారు అన్ని పట్టణాలను, వాటి ప్రజలను చుట్టుముడతారు. దేశంలో ప్రతి పౌరుడూ సహాయంకొరకు ఆక్రందిస్తాడు.
3 పరుగెత్తే గుర్రపు డెక్కల చప్పుడు వారు వింటారు.
రథాల చప్పుడు వారు వింటారు. కదిలే చక్రాల రణగొణ ధ్వని వారు వింటారు.
తండ్రులు తమ పిల్లలకు రక్షణ కల్పించలేరు.
ఆ తండ్రులు సహాయం చేయలేనంత బలహీనులవుతారు.
4 ఫిలిష్తీయులనందరినీ యెహోవా
త్వరలో నాశనం చేస్తాడు!
తూరు, సీదోనులకు సహాయపడే మిగిలిన
వారందరినీ నాశనం చేస్తాడు.
ఫిలిష్తీయులను యెహోవా అతి త్వరలో నాశనం చేస్తాడు.
క్రేతు[d] ద్వీపవాసులలో మిగిలిన వారందరినీ ఆయన నాశనం చేస్తాడు.
5 గాజా ప్రజలు ధుఃఖంతో తమ తలలు గొరిగించుకుంటారు.
ఆష్కెలోను ప్రజల నోరు నొక్కబడుతుంది.
లోయలో మిగిలిన ప్రజలారా, ఎంతకాలం మిమ్మల్ని మీరు గాయపర్చుకుంటారు?[e]
6 “ఓ యెహోవా ఖడ్గమా, నీవు ఎంతకాలము పోరాడెదవు.
నీ ఒరలోనికి నీవు వెళ్లుము!
ఆగిపో! శాంతించు, అని మీరంటారు.
7 కాని యెహోవా ఖడ్గం ఏ విధంగా విశ్రాంతి తీసుకుంటుంది?
యెహోవా దానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు.
అష్కెలోను నగరాన్ని, సముద్ర తీరాన్ని
ఎదుర్కొనమని యెహోవా దానికి ఆజ్ఞ ఇచ్చాడు.”
6 అందువల్ల క్రీస్తును గురించి బోధింపబడిన ప్రాథమిక పాఠాలను చర్చించటం మాని ముందుకు వెళ్తూ పరిపూర్ణత చెందుదాం. ఘోరమైన తప్పులు చేసి మారుమనస్సు పొందటం, దేవుని పట్ల విశ్వాసం, 2 బాప్తిస్మమును[a] గురించి బోధించటం, చేతులు తల మీద ఉంచి అభిషేకించటం, చనిపోయినవాళ్ళు తిరిగి బ్రతికి రావటం, శాశ్వతమైన తీర్పు, యివి మన పునాదులు. ఈ పునాదుల్ని మళ్ళీ మళ్ళీ వేయకుండా ఉందాం. 3 దేవుడు సమ్మతిస్తే అలాగే జరుగుతుంది.
4 ఒకసారి వెలిగింపబడినవాళ్ళు, పరలోకం నుండి పొందిన వరాన్ని రుచి చూసినవాళ్ళు, ప్రవిత్రాత్మలో భాగం పంచుకున్నవాళ్ళు, 5 దైవసందేశం యొక్క మంచితనాన్ని రుచి చూసినవాళ్ళు, రానున్న కాలం యొక్క శక్తిని రుచి చూచినవాళ్ళు 6 పడిపోతే మారుమనస్సు పొందేటట్లు చేయటం అసంభవం. ఎందుకంటే, వాళ్ళు ఈ విధంగా చేసి దేవుని కుమారుణ్ణి మళ్ళీ సిలువవేసి చంపుతున్నారు. ఆయన్ని నలుగురిలో అవమానపరుస్తున్నారు.
7 తన మీద తరుచుగా పడ్తున్న వర్షాన్ని పీల్చుకొనే భూమి, తనను దున్నిన రైతులకు పంటనిచ్చిన భూమి దేవుని ఆశీస్సులు పొందుతుంది. 8 కాని, ముళ్ళ మొక్కలు, కలుపుమొక్కలతో పెరిగే భూమి నిరుపయోగమైనది. అలాంటి భూమిని దేవుడు శపిస్తాడు. చివరకు దాన్ని కాల్చి వేస్తాడు.
9 ప్రియమైన సోదరులారా! మేము మాట్లాడుతున్న ఈ రక్షణ సంబంధమైన విషయాల ద్వారా మీకు మంచి కలుగుతుందనే విశ్వాసం మాకుంది. 10 దేవుడు అన్యాయం చెయ్యడు. మీరు దేవుని ప్రజలకు సహాయం చేసారు. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. మీరు చేసిన కార్యాలను మీరాయన పట్ల చూపిన ప్రేమను ఆయన మరిచిపోడు. 11 మీ నిరీక్షణ సంపూర్ణమగునట్లుగా మీలో ప్రతి ఒక్కడు మీరిదివరకు చూపిన ఆసక్తి చివరివరకు చూపాలి. 12 మీరు సోమరులుగా నుండకూడదు. కాని వాగ్దానము చేయబడినదానిని విశ్వాసము ద్వారా, సహనము ద్వారా పొందినవారిని అనుసరించండి.
13 దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవాడెవ్వడూ లేనందు వలన స్వయంగా తన మీదే ప్రమాణం తీసుకొంటూ, 14 ఇలా అన్నాడు: “నేను నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాను. నీ సంతతిని అభివృద్ధి పరుస్తాను.” 15 అబ్రాహాము ఓర్పుతో కాచుకొన్నాడు. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు.
16 ప్రజలు తమకన్నా గొప్పవాళ్ళ మీద ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణాలు వివాదాలు సాగనీయకుండా చేసి మాటల్లో మీ సత్యాన్ని దృఢ పరుస్తాయి. 17 దేవుడు తన వాగ్దానం విషయంలో తన ఉద్దేశ్యాన్ని మార్చుకోనని వాగ్దానం పొందిన వారసులకు స్పష్టం చేయాలనుకున్నాడు. అందువల్ల ఆ వాగ్దానాన్ని తన మీద ప్రమాణం చేసి దృఢపరిచాడు. 18 అందువల్ల ఈ “రెండూ” మార్పు చెందలేవు. వీటివిషయంలో దేవుడు అసత్యమాడలేడు.
తానివ్వబోయేవాటికోసం ఆశాభావంతో పరుగెత్తుతున్నవాళ్ళకు ప్రోత్సాహం కలగాలని ఈ ప్రమాణం చేశాడు. 19 భద్రతను, దృఢత్వాన్ని కలిగించే ఈ నిరీక్షణ మన ఆత్మలకు లంగరు లాంటిది. ఈ నిరీక్షణ తెరవెనుక లోపలి భాగంలో స్థిరముగా ప్రవేశించగలదు. 20 యేసు మన కోసం, మనకన్నా ముందు ఆ తెరలోపలికి వెళ్ళాడు. మెల్కీసెదెకు క్రమంలో యేసు కూడా శాశ్వతంగా ప్రధాన యాజకుడుగా ఉంటాడు.
© 1997 Bible League International