Old/New Testament
బబులోను సైన్యం ఈజిప్టును ఎదుర్కొంటుంది
30 మరొకసారి యెహోవా మాట నాకు చేరింది. ఆయన ఇలా అన్నాడు: 2 “నరపుత్రుడా, నా తరపున మాట్లాడుతూ ఈ విధంగా చెప్పుము, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“‘నీవు దుఃఖపడి,
“భయంకరమైన రోజు దరిచేరుతున్నది” అని ప్రకటించుము.
3 ఆ రోజు దగ్గరలో ఉంది!
అవును. యెహోవా తీర్పు తీర్చే రోజు దగ్గర పడుతున్నది.
అది మేఘాల రోజు.
అది రాజ్యాలపై తీర్పు ఇచ్చే సమయం!
4 ఈజిప్టు మీదకి ఒక కత్తి వస్తుంది!
ఈజిప్టు పతనమయ్యే సమయాన ఇథియోపియ (కూషు) ప్రజలు భయంతో చెదరిపొతారు.
ఈజిప్టు ప్రజలను బబులోను సైన్యం బందీలుగా పట్టుకుపోతుంది.
ఈజిప్టు పునాదులు కదిలిపోతాయి!
5 “‘ఆ అనేక మంది ప్రజలు ఈజిప్టుతో శాంతి ఒప్పందాలు చేసుకున్నారు. కాని ఇథియోపియ (కూషు), పూతు, లూదు, అరేబియా (మిశ్రమ ప్రజలు), లిబ్యా (కూబు), ఇశ్రాయేలు (నా నిబంధన దేశము) ప్రజలు-అందరూ నాశనం చేయబడతారు!
6 “‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“అవును. ఈజిప్టును బలపర్చిన వారంతా పడిపోతారు!
దాని బలగర్వం తగ్గి పోతుంది.
మిగ్దోలు నుండి ఆశ్వన్ (సెవేనే) వరకు గల
ఈజిప్టు ప్రజలంతా చంపబడతారు.”
నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు!
7 నాశనం చేయబడిన దేశాలలో ఈజిప్టు కూడా కలిసిపోతుంది.
శూన్యంగా మిగిలిన రాజ్యాలలో ఈజిప్టు ఒకటి అవుతుంది.
8 ఈజిప్టులో అగ్ని రగిలిస్తాను.
దానితో దాని సహాయకులు నాశనమై పోతారు.
అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.
9 “‘ఆ సమయాన నేను దూతలను పంపుతాను. వారు ఓడలలో పయనించి ఇథియోపియ (కూషు)కు దుర్వార్త తీసుకొని వెళతారు. ఇథియోపియ ఇప్పుడు క్షేమంగా ఉన్నాననుకుంటూ ఉంది. కాని ఈజిప్టు శిక్షించ బడినప్పుడు ఇథియోపియ ప్రజలు భయంతో కంపించిపోతారు. ఆ సమయం వస్తూ ఉంది!’”
10 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“బబులోను రాజైన నెబుకద్నెజరును
నేను వినియోగించి ఈజిప్టు ప్రజలను నాశనం చేస్తాను.
11 నెబుకద్నెజరు, అతని మనుష్యులు
జాతులన్నిటిలోనూ అతి భయంకరులు.
ఈజిప్టును నాశనం చేయటానికి వారిని తీసుకొనివస్తాను.
ఈజిప్టు మీద వారు తమ కత్తులు దూస్తారు.
వారు దేశాన్ని శవాలతో నింపివేస్తారు.
12 నైలునది ఎండిపోయేలా నేను చేస్తాను.
అలా ఎండిన భూభూగాన్ని దుష్ట జనులకు అమ్మి వేస్తాను.
ఆ భూమిని నిర్మానుష్యం చేయటానికి నేను అన్యజనులను వినియోగిస్తాను.
యెహోవానైన నేను ఈ విషయాలు చెపుతున్నాను!”
ఈజిప్టు విగ్రహాలు నాశనం చేయబడుతాయి
13 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“ఈజిప్టులో ఉన్న విగ్రహాలను కూడా నేను నాశనం చేస్తాను.
మెంఫిస్ (నొపు)లో ఉన్న విగ్రహాలన్నిటినీ తొలగిస్తాను.
ఈజిప్టులో ఇక ఎంత మాత్రం నాయకుడెవడు ఉండడు.
ఈజిప్టు రాజ్యంలో భయాన్ని పుట్టిస్తాను.
14 పత్రోసును శూన్య రాజ్యంగా మార్చివేస్తాను.
సోయనులో అగ్ని రగుల్చుతాను.
‘నో’ నగరాన్ని శిక్షిస్తాను.
15 ఈజిప్టుకు కోటవలె అండగా నిల్చిన సీను మీద నా కోపాన్ని కుమ్మరిస్తాను!
‘నో’ నగర వాసులను నేను నాశనం చేస్తాను.
16 ఈజిప్టులో నేను అగ్ని ముట్టిస్తాను.
సీను అనబడే ప్రాంతం భయానికి గురియవుతుంది.
‘నో’ నగరంలోకి సైనికులు విరుచుకుపడ్తారు.
శత్రువులు దాన్ని పగటిపూట ఎదుర్కొంటారు.
17 ఓను, పిబేసెతు పట్టణాల యువకులు యుద్ధంలో చనిపోతారు.
స్త్రీలు బందీలుగా పట్టుకుపోబడతారు.
18 ఈజిప్టు ఆధిపత్యాన్ని (కాడిని) తహపనేసులో నేను విరిచినప్పుడు అక్కడ అంధకారం ఏర్పడుతుంది.
ఈజిప్టు యొక్క బలగర్వం అంతమవుతుంది!
ఈజిప్టును ఒక మేఘం ఆవరిస్తుంది.
ఆమె కుమార్తెలు చెరపట్టబడి తీసుకుపోబడతారు.
19 ఆ విధంగా నేను ఈజిప్టును శిక్షిస్తాను.
అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు!”
ఈజిప్టు శాశ్వతంగా బలహీనమవుతుంది
20 చెరకి కొనిపోబడిన పదకొండవ సంవత్సరం మొదటి నెల (ఏప్రిల్) ఏడవ రోజున యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 21 “నరపుత్రుడా, ఈజిప్టు రాజైన ఫరో చేతిని (శక్తిని) నేను విరిచివేశాను. ఆ చేతికి ఎవ్వరూ కట్టు కట్టలేరు. అది నయం కాదు. ఆ చేయి మళ్లీ కత్తి పట్టే బలాన్ని పుంజుకోలేదు.”
22 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “నేను ఈజిప్టు రాజైన ఫరోకు విరోధిని. అతని మంచి చేతిని, గతంలో విరిగిన అవిటి చేతిని, రెండింటినీ నేను విరుగగొడతాను. అతని చేతి నుండి కత్తి జారి క్రిందపడేలా చేస్తాను. 23 ఈజిప్టువారిని వివిధ దేశాలకు చెదరగొడతాను. 24 బబులోను రాజు చేతులను నేను బలపర్చుతాను. నా కత్తిని అతని చేతిలో ఉంచుతాను. కాని ఫరో చేతులను నేను విరుగ గొడతాను. అప్పుడు ఫరో మరణించుతాడు. వేదన పడేలా బాధపడతాడు. 25 ఆ విధంగా బబులోను రాజు చేతులను బలపర్చి, ఫరో రాజు చేతులను నేను బలహీన పర్చుతాను. నేనే యెహోవానని వారప్పుడు తెలుసుకుంటారు.
“నేను నా కత్తిని బబులోను రాజు చేతిలో ఉంచుతాను. అతడా కత్తిని ఈజిప్టు రాజ్యం మీదికి విసురుతాడు. 26 నేను ఈజిప్టువారిని వివిధ దేశాలకు తరిమివేస్తాను. అప్పడు నేను యెహోవానని వారు తెలుసుకొంటారు.”
దేవదారు వృక్షంవంటి అష్షూరు
31 చెరకి కొనిపోబడిన పదకొండవ సంవత్సరం మూడవ నెల మొదటి రోజున యెహోవా మాట నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 2 “నరపుత్రుడా, ఈజిప్టు రాజైన ఫరోకు మరియు అతని ప్రజలకు ఈ విషయాలు తెలియజేయుము,
“‘గొప్పతనంలో
నీవు ఎవరిలా ఉన్నావు?
3 మిక్కిలి ఉన్నతంగా పెరిగి తన అందమైన కొమ్మలతో దట్టమైన నీడనిస్తూ
లెబానోనులో పెరిగిన కేదారు వృక్షం అష్షూరు రాజ్యమే.
దాని తల మేఘాల్లో ఉంది!
4 మంచి నీటివనరు చెట్టును బాగా పెరిగేలా చేసింది.
లోతైన నది అది ఎత్తుగా పెరగటానికి దోహదమిచ్చింది.
చెట్టు నాటబడిన ప్రాంతంలో నదులు ప్రవహించాయి.
దాని కాలువలే అక్కడి పొలాల్లో ఉన్న చెట్లకు నీటిని అందజేశాయి
5 ఆ వృక్షం అలా మిగిలిన చెట్లన్నిటిలో పొడవుగా పెరిగింది.
దానికి ఎన్నో కొమ్మలు పెరిగాయి.
నీరు పుష్కలంగా ఉంది.
అందువల్ల దాని కొమ్మలు విస్తరించాయి.
6 కావున పక్షులన్నీ దాని
కొమ్మల్లో గూళ్లు కట్టుకున్నాయి.
ఆ ప్రాంతంలో జంతువులన్నీ దాని
చల్లని నీడలో తమ పిల్లల్ని పెట్టాయి.
గొప్ప రాజ్యాలన్నీ
ఆ చెట్టు నీడలో నివసించాయి!
7 ఆ విధంగా ఆ చెట్టు తన గొప్పతనంలోను,
తన పొడవైన కొమ్మలతోను,
ఎంతో ఆందంగా కన్పించింది.
ఎందువల్ల ననగా దానివేళ్ళు నీరు బాగా అందేవరకు నాటుకున్నాయి!
8 దేవుని ఉద్యానవనంలో ఉన్న కేదారు వృక్షాలు
కూడా ఈ చెట్టంత పెద్దగా లేవు.
దీనికి ఉన్నన్ని కొమ్మలు సరళ వృక్షాలకు కూడా లేవు.
అక్షోట (మేడి) చెట్లకు అసలిటువంటి కొమ్మలే లేవు.
దేవుని ఉద్యానవనంలో
ఇంత అందమైన చెట్టేలేదు.
9 అనేకమైన కొమ్మలతో
ఈ చెట్టును నేను అందమైనదిగా చేశాను.
ఏదెనులో దేవుని ఉద్యానవనంలో ఉన్న చెట్లన్నీ
దీనిపట్ల అసూయ చెందాయి!’”
10 కావున నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “ఈ చెట్టు విస్తరించి పొడవుగా పెరిగింది. దాని తలని మబ్బుల్లో పెట్టుకుంది. దాని ఎత్తు చూసుకొని అది గర్వపడింది. 11 అందువల్ల ఒక పరాక్రమశాలియగు రాజు ఆ చెట్టును ఉంచుకొనేలా చేస్తాను. అది చేసిన చెడ్డ పనులకు ఆ పాలకుడు దానిని శిక్షిస్తాడు. అతని చెడు తనంవల్ల నేను ఆ చెట్టును నాతోటనుండి తీసుకొంటిని. 12 దేశాలన్నిటిలో క్రొత్తవాళ్లు, చాలా క్రూరులయిన వాళ్లు దానిని నరికి పడవేశారు. ఆ చెట్టు కొమ్మలు కొండల మీదను, లోయలలోను చెల్లా చెదరుగా పడవేశారు. ఆ దేశం గుండా ప్రవహించే నదులలో విరిగిన కొమ్మలు కొట్టుకు పోయాయి. ఆ చెట్టు క్రింద నీడ ఇక ఏ మాత్రం లేకపోవటంతో వివిధ దేశాల ప్రజలంతా దానిని వదిలిపెట్టారు. 13 ఇప్పుడు పక్షులు పడిపోయిన ఆ చెట్టు మీదే నివసిస్తాయి. దాని పడిపోయిన కొమ్మలమీద ఆడవి జంతువులన్నీ నడుస్తాయి.
14 “ఆ నీటి ప్రక్కనున్న ఏ చెట్టూ ఇక మీదట గర్వపడదు. అవి ఆకాశాన్నంటుకోవాలని తాపత్రయ పడవు. ఆ నీరును పీల్చే బలమైన చెట్లలో ఏ ఒక్కటీ పొడవుగా ఉన్నానని గొప్పలు చెప్పుకోదు. ఎందువల్లనంటే అవన్నీ చనిపోవటం ఖాయం. అవన్నీ పాతాళ లోకంలోకి పోతాయి. అవి (వారు) మృతి చెందిన వారితో పాతాళంలో కలవటం తధ్యం.”
15 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “ఆ చెట్టు పాతాళానికి వెళ్లిన రోజున ప్రజలంతా సంతాపం పొందేలా చేశాను. అగాధమైన సముద్రంలో దాన్ని కప్పివేశాను. దాని నదులన్నిటినీ నిలుపు జేశాను. నీరంతా ప్రవహించటం ఆగిపోయింది. లెబానోను దాని కొరకు దుఃఖించేలా చేశాను. ఆ మహావృక్షం కొరకు ఆ ప్రాంతంలో ఉన్న చెట్లన్నీ విచారంతో క్రుంగిపోయాయి. 16 ఆ చెట్టు పడిపోయేలా నేను చేశాను. అది పతనమయినప్పుడు వచ్చిన శబ్దంతో దేశాలు భయంతో వణికిపోయాయి. ఆ వృక్షం మృతుల స్థానానికి వెళ్లేలా చేశాను. అది మృతులతో కలిసి ఉండటానికి పాతాళానికి చేరింది. గతంలో ఏదెనులో ఉన్న అన్ని చెట్లు, లెబానోనులో ఉన్న శ్రేష్ఠమైన చెట్లు ఆ నీటిని పీల్చాయి. ఆ చెట్లు పాతాళ లోకంలో ఓదార్చబడ్డాయి. 17 అవును. మృతుల స్థానానికి మహా వృక్షంతో పాటు మిగిలిన చెట్లు కూడ పోయాయి. యుద్ధంలో హతులైన ప్రజలను అవి కలిశాయి. ఆ మహా వృక్షం మిగిలిన చెట్లను బలపర్చింది. దేశాల మధ్య ఆ మహా వృక్షం యొక్క నీడలో ఆ చెట్లు నివసించాయి.
18 “కావున ఈజిప్టూ, ఏదెనులో నిన్ను ఏ చెట్టుతో పోల్చను? ఆ చెట్లన్నీ పెద్దవీ, బలిష్ఠమయినవీ. ఏదెనులోని చెట్లతో పాటు నీవు అధోలోకానికి పోతావు. విదేశీయులతోను[a] యుద్ధంలో మరణించిన వారితోను కలిసి నీవు మృత్యుస్థానంలో పడివుంటావు.
“ఫరోకు మరియు అతని ప్రజలందరికీ ఇది సంభవిస్తుంది!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
ఫరో ఒక సింహమా? ఘటసర్పమా?
32 చెరకి కొనిపోబడిన పన్నెండవ సంవత్సరం, పన్నెండవ నెల (మార్చి) మొదటి రోజున యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 2 “నరపుత్రుడా, ఈజిప్టు రాజైన ఫరోను గురించి ఈ విషాద గీతిక ఆలపించు. అతనితో ఇలా చెప్పు:
“‘దేశాల మధ్య గర్వంగా తిరుగాడే బలమైన యువకిశోరం అని నీకు నీవే తలుస్తున్నావు.
కాని, నిజానికి నీవు సముద్రాల్లో తిరుగాడే మహాసర్పానివా.
నీటి కాలువల గుండా నీ దారిని తీసుకొంటున్నావు.
నీ కాళ్లతో కెలికి నీళ్లను మురికి చేస్తున్నావు.
నీవు ఈజిప్టు నదులను కెలుకుతున్నావు.’”
3 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“అనేక మంది ప్రజలను నేను ఒక దగ్గరికి చేర్చాను.
నేనిప్పుడు నా వలను నీ మీదికి విసురుతాను.
ఆ ప్రజలంతా అప్పుడు నిన్ను లోపలికి లాగుతారు.
4 పిమ్మట నిన్ను ఎండిన నేలపై నేను పడేస్తాను.
నిన్ను పొలాల్లో విసరివేస్తాను.
నిన్ను తినటానికి పక్షులన్నిటినీ రప్పిస్తాను.
కడుపునిండా నిన్ను తినటానికి అన్నిచోట్ల నుండి అడవి జంతువులను రప్పిస్తాను.
5 నీ కళేబరాన్ని పర్వతాల మీద చిందర వందరగా వేస్తాను.
నీ కళేబరంతో లోయలు నింపుతాను.
6 నీ రక్తాన్ని పర్వతాలపై నేను ఒలక బోస్తాను.
అది భూమిలో ఇంకిపోతుంది.
నదులన్నీ నీతో నిండి ఉంటాయి.
7 నిన్ను మాయం చేస్తాను.
నేను ఆకాశాన్ని కప్పివేసి నక్షత్రాలు కన్పించకుండా చేస్తాను.
ఒక మేఘంతో నేను సూర్యుణ్ణి కప్పివేయగా చంద్రుడు ప్రకాశించడు.
8 ఆకాశంలో మెరిసే జ్యోతులన్నీ నీపై వెలుగును ప్రసరించకుండా చేస్తాను.
నీ దేశమంతటా నేను చీకటిమయం చేస్తాను.
9 “నిన్ను నాశనం చేయటానికి నీ మీదికి నేను శత్రువును తీసుకొని వచ్చినట్లు తెలుసుకొని అనేక మంది ప్రజలు దుఃఖముఖులై, తలక్రిందులౌతారు. నీ వెరుగని దేశాలు కూడా కలవరపాటు చెందుతాయి. 10 నీ విషయంలో చాలా మంది ఆశ్చర్యపోయేలా చేస్తాను. నేను నా కత్తిని వారి ముందు ఝుళిపించడానికి మునుపే వారి రాజులు నీ విషయంలో విపరీతంగా భయపడతారు. నీవు పతనమైన రోజున ప్రతిక్షణం రాజులు భయంతో కంపించి పోతారు. ప్రతీ రాజూ తనభద్రత కొరకు భయపడతాడు.”
11 దానికి తగిన కారణం నా ప్రభువైన యెహోవా ఇలా తెలియజేస్తున్నాడు: “బబులోను రాజు యొక్క కత్తి నీపై యుద్ధానికి వస్తుంది. 12 యుద్ధంలో నీ ప్రజలను చంపటానికి నేను ఆ సైనికులను వినియోగిస్తాను. అన్ని దేశాలలో అతి భయంకరమైన దేశం నుండి ఆ సైనికులు వస్తారు. ఈజిప్టు అతిశయపడే వస్తువులన్నిటినీ వారు ధ్వంసం చేస్తారు. ఈజిప్టు ప్రజలు నాశనం చేయబడతారు. 13 ఈజిప్టు నదీ తీరాలలో అనేకమైన జంతువులున్నాయి. ఆ జంతువులన్నిటినీ కూడ నేను నాశనం చేస్తాను! ప్రజలిక ఎంతమాత్రం తమ కాళ్లతో నీటిని మురికిచేయరు. ఆవుల గిట్టలు ఇక ఎంతమాత్రం నీటిని మురికి చేయవు. 14 ఆ విధంగా ఈజిప్టు నీటిని నేను శాంతపర్చుతాను. వారి నదులు ప్రశాంతంగా ప్రవహించేలా చేస్తాను. అవి నూనెవలె మృదువుగా జాలు వారుతాయి.” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు. 15 “నేను ఈజిప్టు దేశాన్ని ఏమీ లేకుండా చేస్తాను. ఆ రాజ్యం సమస్తాన్ని కోల్పోతుంది. ఈజిప్టులో నివసిస్తున్న ప్రజలందరినీ నేను శిక్షిస్తాను. అప్పుడు నేనే యెహోవానని, ప్రభువునని వారు గుర్తిస్తారు!
16 “ఈజిప్టు కొరకు ప్రజలు పాడే ఒక విషాద గీతిక ఇది. ఇతర దేశాల కుమార్తెలు (నగరాలు) ఈజిప్టును గూర్చి ఈ విలాప గీతం పాడతారు. ఈజిప్టును గురించి, దాని ప్రజల గురించి వారు దీనిని విలాప గీతంగా ఆలపిస్తారు.” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
ఈజిప్టు నాశనమవబోవటం
17 దేశం నుండి వెళ్లగొట్టబడిన పన్నెండవ సంవత్సరంలో, అదే నెలలో పదిహేనవ రోజున యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 18 “నరపుత్రుడా, ఈజిప్టు ప్రజల కొరకు విలపించు. ఈజిప్టును, ఇతర బలమైన దేశాల కుమార్తెలను సమాధికి నడిపించు. పాతాళానికి చేరిన ఇతర జనులతో ఉండటానికి వారిని అధోలోకానికి నడిపించు.
19 “ఈజిప్టూ, నీవు ఇతరులెవరికంటెను గొప్ప దానివి కాదు! మృత్యు స్థానానికి వెళ్లు! వెళ్లి, అక్కడ అన్యజనులతో పడివుండు.
20 “యుద్ధంలో హతులైన వారందరితో కలిసి ఉండటానికి ఈజిప్టు వెళుతుంది. శత్రువు ఆమెను, ఆమె జనులను దూరంగా లాగి పడవేసినాడు.
21 “బలవంతులు, పరాక్రమశాలులు యుద్ధంలో చంపబడ్డారు. ఆ పరాయి వారంతా మృత్యు స్థలానికి దిగి వెళ్లారు. ఆ ప్రదేశం నుండి చనిపోయిన మనుష్యులు ఈజిప్టుతోను, దాని సహాయకులతోను మాట్లాడతారు వారు కూడ యుద్ధంలో చంపబడతారు.
22-23 “అష్షూరు, దాని సర్వ సైన్యము మృత్యులోకంలో ఉన్నాయి. వారి సమాధులు అడుగున ఆ రంధ్రంలో ఉన్నాయి. అష్షూరు సైనికులంతా యుద్ధంలో హతులయ్యారు. అష్షూరు సైన్యం దాని సమాధి చుట్టూ మూగింది. బతికి ఉన్నప్పుడు వారు ప్రజలను భయపెట్టారు. కాని వారంతా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. వారంతా యుద్ధంలో చంపబడ్డారు.
24 “ఏలాము అక్కడ ఉన్నది. దాని సైన్యమంతా దాని సమాధి చుట్టూ ఉంది. వారంతా యుద్ధంలో చనిపోయారు. ఆ విదేశీయులు భూమిలోకి లోతుగాపోయారు. బతికి ఉన్నప్పుడు వారు ప్రజలను భయపెట్టారు. వారి అవమానాన్ని వారు పాతాళానికి తమ తోనే తీసుకొని పోయారు. 25 ఏలాముకు, యుద్ధంలో చనిపోయిన సైనికులందరికీ వారు పడక ఏర్పాటు చేశారు. ఏలాము సైన్యమంతా దాని సమాధి చుట్టూ చేరింది. ఆ విదేశీయులందరూ యుద్ధంలో హతులయ్యారు. వారు జీవించి ఉన్నప్పుడు వారు ప్రజలను భయపెట్టారు. కాని వారి అవమానాన్ని వారు తమతో పాతాళానికి తీసుకొని పోయారు. చనిపోయిన వారందరితోపాటు వారు ఉంచబడ్డారు.
26 “మెషెకు, తుబాలు మరియు వాటి సైన్యాలు అక్కడ ఉన్నాయి. వాటి సమాధులు వాటిచుట్టూ ఉన్నాయి. విదేశీయులు యుద్ధంలో చంపబడ్డారు. వారు జీవించి ఉన్న సమయంలో వారు ప్రజలను భయపెట్టారు. 27 కాని ఏనాడో చనిపోయిన పరాక్రమశాలుల ప్రక్కన వారిప్పుడు పడుకొని ఉన్నారు! వారు తమ యుద్ధాయుధాలతో సమాధి చేయబడ్డారు. వారి కత్తులు వారి తలల క్రింద ఉంచబడతాయి. కాని వారి పాపాలు మాత్రం వారి ఎముకల మీద ఉన్నాయి. ఎందువల్లనంటే వారు జీవించి వున్న కాలంలో వారు ప్రజలను భయపెట్టారు.
28 “ఈజిప్టూ, నీవు కూడా నాశనం చేయబడతావు. సున్నతి సంస్కారం లేని విదేశీయులు నిన్ను పడుకోబెడతారు. యుద్ధంలో చనిపోయిన ఇతర సైనికులతో పాటు నీవు కూడా ఉంటావు.
29 “ఎదోము కూడా అక్కడ ఉన్నాడు. అతని రాజులు, ఇతర నాయకులు అతనితో అక్కడ ఉన్నారు. వారు శూరులైన సైనికులు కూడా. అయినా వారు యుద్ధంలో చనిపోయిన విదేశీయులతో పడివున్నారు. వారంతా అక్కడ పరాయి వారితో పడివున్నారు. బాగా లోతైన రంధ్రంలో ప్రజలతో వారు అక్కడ ఉన్నారు.
30 “ఉత్తరదేశ రాజులంతా అక్కడ ఉన్నారు! సీదోనుకు చెందిన సైనికులంతా అక్కడ ఉన్నారు. వారి బలం ప్రజలను భయపెట్టింది. కాని వారు ఇబ్బంది పడ్డారు. ఆ విదేశీయులు కూడా యుద్ధంలో చనిపోయిన ఇతరులతో పండుకొని ఉన్నారు. వారితో పాటు తమ అవమానాన్ని కూడా పాతాళానికి తీసుకొని పోయారు.
31 “మృత్యు లోకంలోకి పోయిన ప్రజలను ఫరో చూస్తాడు. అతడు, అతనితో ఉన్న అతని మనుష్యులందరూ అప్పుడు ఊరట చెందుతారు. అవును, ఫరో మరియు అతని సర్వ సైన్యం యుద్ధంలో చంపబడతారు.” ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
32 “ఫరో జీవించి ఉన్న కాలంలో అతనంటే ప్రజలు భయపడేలా నేను చేశాను. కాని ఇప్పుడతడు విదేశీయులతో పడి ఉంటాడు. ఫరో, అతని సైన్యం యుద్ధంలో చనిపోయిన ఇతర సైనికులతో పాటు పడివుంటారు.” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
మారిన జీవితాలు
4 క్రీస్తు శారీరకమైన బాధననుభవించాడు గనుక మీరు కూడా ఆ గుణాన్ని ఆయుధంగా ధరించండి. 2 ఎందుకంటే శారీరకమైన బాధననుభవించే వ్యక్తి తన మిగతా భౌతిక జీవితాన్ని, మానవులు కోరే దురాశల్ని తీర్చుకోవటానికి ఉపయోగించకుండా దైవేచ్ఛ కోసం ఉపయోగిస్తాడు. అలాంటివానికి పాపంతో సంబంధముండదు. 3 గతంలో మీరు యూదులుకాని వాళ్ళవలే పోకిరి చేష్టలకు, దురాశకు, త్రాగుడుకు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుడు విందులకు, చేయతగని విగ్రహారాధనలకులోనై జీవించారు. వారి ఇష్టము నెరవేర్చుచుండుటకు గడచిన కాలమే చాలును.
4 కాని ప్రస్తుతం మీరు వాళ్ళవలె మితిమీరిన దుష్ప్రవర్తనకు లోనై వాళ్ళతో సహ పరుగెత్తనందుకు, వాళ్ళు ఆశ్చర్యపడి మిమ్మల్ని దూషిస్తున్నారు. 5 అయితే చనిపోయినవాళ్ళ మీద బ్రతికియున్నవాళ్ళ మీద, తీర్పు చెప్పే ఆ దేవునికి వాళ్ళు సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. 6 ఈ కారణంగానే సువార్త ఇప్పుడు చనిపోయినవాళ్ళకు కూడా ప్రకటింపబడింది. వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా జీవించాలని దేవుడు మానవులపై తీర్పుచెప్పినట్లుగానే వాళ్ళమీద కూడా తీర్పు చెపుతాడు.
దేవుని వరాలకు మంచి నిర్వాహకులుగా ఉండండి
7 అన్నీ అంతమయ్యే సమయం దగ్గరకు వచ్చింది. అందువల్ల స్థిరబుద్ధితో, ఆత్మనిగ్రహంతో ఉండండి. అప్పుడే మీరు ప్రార్థించ గలుగుతారు. 8 అన్నిటికన్నా ముఖ్యంగా, “ప్రేమ” పాపాలన్నిటినీ కప్పివేస్తుంది గనుక పరస్పరం హృదయపూర్వకంగా ప్రేమించుకోండి. 9 సణగకుండా, పరస్పరం అతిథి సత్కారాలు చేసుకోండి. 10 ప్రతి ఒక్కడూ ఆత్మీయంగా తాను పొందిన వరాన్ని యితర్ల సేవ చేయటానికి ఉపయోగించాలి. అనేక రకాలుగా లభించిన ఈ దైవానుగ్రహాన్ని విశ్వాసంతో ఉపయోగించాలి. 11 మాట్లాడాలని అనుకున్నవాడు దైవసందేశానుసారం మాట్లాడాలి. సేవ చేయదలచినవాడు దేవుడిచ్చిన శక్తిని ఉపయోగించి సేవ చెయ్యాలి. అలా చేస్తే, శాశ్వతంగా తేజోవంతుడూ, శక్తివంతుడూ అయినటువంటి దేవుణ్ణి యేసు క్రీస్తు ద్వారా అన్ని విషయాల్లో స్తుతించినట్లు అవుతుంది.
క్రీస్తు అనుచరుడిగా శ్రమపడటం
12 నా ప్రియమైన సోదరులారా! మీకు అగ్నిపరీక్ష జరుగుతోంది. తద్వారా ఏదో జరుగరానిది జరిగినట్లు ఆశ్చర్యపడకండి. 13 క్రీస్తు కష్టాల్లో మీరు పాలు పంచుకుంటున్నందుకు ఆనందించండి. అలా చేస్తే ఆయన మహిమ వ్యక్తమైనప్పుడు మీరు చాలా ఆనందిస్తారు. 14 ఒకవేళ క్రీస్తు పేరు కారణంగా మీకు అవమానం కలిగితే, మీరు ధన్యులు. అంటే దేవుని తేజోవంతమైన ఆత్మ మీలో ఉన్నాడన్నమాట. 15 హత్య చేసి కాని, దొంగతనం చేసి కాని, దుర్మార్గంగా ప్రవర్తించి గాని, లేక యితర్ల విషయాల్లో జోక్యం కలిగించుకోవటం వలన కాని, మీరు శిక్షను అనుభవించకూడదు. 16 మీరు క్రైస్తవులైనందువలన శిక్షననుభవించవలసివస్తే సిగ్గుపడనవసరం లేదు. మీరు క్రైస్తవులైనందుకు దేవుణ్ణి స్తుతించండి. 17 ఎందుకంటే, తీర్పు చెప్పే సమయం దగ్గరకు వచ్చింది. మొదట దేవుని కుటుంబానికి చెందిన వాళ్ళ మీద తీర్పు చెప్పబడుతుంది. మరి ఆ తీర్పు మనతో ప్రారంభమైతే దేవుని సువార్తను నిరాకరించిన వాళ్ళగతేమౌతుంది? 18 లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు:
“నీతిమంతులకే రక్షణ లభించటం కష్టమైతే,
నాస్తికుని గతి, పాపాత్ముని గతి ఏమౌతుంది?”(A)
19 అందువలన, దైవేచ్ఛ ప్రకారం కష్టాలనుభవించేవాళ్ళు, విశ్వసింప దగిన సృష్టికర్తకు తమను తాము అర్పించుకొని సన్మార్గంలో జీవించాలి.
© 1997 Bible League International