Old/New Testament
యూదా రాజుగా అబీయా
13 ఇశ్రాయేలు రాజుగా యరొబాము[a] పద్దెనిమిదవ సంవత్సరంలో కొనసాగుతూ వుండగా, అబీయా యూదాకు కొత్తగా రాజయ్యాడు. 2 అబీయా యెరూషలేములో మూడేండ్లు పాలించాడు. అబీయా తల్లి పేరు మయకా.[b] మయకా తండ్రి పేరు ఊరియేలు. ఊరియేలు గిబియా పట్టణంవాడు. అబీయాకు యరొబాముకు మధ్య యుద్ధం జరిగింది. 3 అబీయాకు నాలుగు లక్షలమంది ధైర్యంగల సైనికులున్నారు. అబీయా ఆ సైన్యాన్ని యుద్ధానికి నడిపించాడు. యరొబాముకు ఎనిమిది లక్షలమంది ధైర్యంగల సైనికులున్నారు. అబీయాతో యుద్ధానికి యరొబాము సిద్ధమయ్యాడు.
4 అప్పుడు అబీయా కొండల దేశమైన ఎఫ్రాయిములో వున్న సెమరాయిము పర్వతం మీద నిలబడి యీలా అన్నాడు: “యరొబామూ, ఇశ్రాయేలీయులందరూ నేను చెప్పేది వినండి. 5 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుకు, అతని కుమారులకు శాశ్వతంగా ఇశ్రాయేలు రాజులు కావటానికి హక్కు ఇచ్చాడని మీరు తెలుసుకోవాలి. ఉప్పు ఒడంబడిక[c] ద్వారా దావీదుకు దేవుడు ఈ హక్కు యిచ్చాడు. 6 కాని యరొబాము యెహోవాకు వ్యతిరేకి అయ్యాడు! యరొబాము నెబాతు కుమారుడు. నెబాతు దావీదు కుమారుడైన సొలొమోను అధికారులలో ఒకడు. 7 అయితే పనికి మాలిన, దుష్టవ్యక్తులు యరొబాముకు స్నేహితులయ్యారు. యరొబాము, ఆ చెడ్డ మనుష్యులే రెహబాముకు ఎదురు తిరిగారు అప్పుడు రెహబాము చిన్నవాడు. అనుభవంలేనివాడు. అందువల్ల యరొబామును, అతని చెడు స్నేహితులను రెహబాము అదుపులో పెట్టలేకపోయాడు.
8 “ఓ యరొబామూ! నీవు, నీతో వున్న ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు యెహోవా రాజ్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు యెహోవా రాజ్యం దావీదు కుమారులకు చెందుతుంది. మీరు చాలామంది వున్నారు. యరొబాము మీకు బంగారు గిత్తలను చేయించి వాటిని దేవుళ్లవలె పూజించమన్నాడు. 9 మీరు యెహోవా యాజకులను, లేవీయులను వెళ్లగొట్టారు. యాజకులు అహరోను సంతతివారు. మీ స్వంత యాజకులను మీరు ఎంపిక చేసుకున్నారు. ఇది పరదేశీయులు చేసే పద్ధతి. ఒక గిత్తను గాని, ఏడు గొర్రె పొట్టేళ్లనుగాని తీసుకొని తనను పరిశుద్ధునిగా చేసుకోవటానికి ఎవడు వచ్చినా అతడు దేవుళ్ళుకాని విగ్రహాలకు యాజకులు కావచ్చు.
10 “కాని, మా విషయానికి వస్తే యెహోవాయే మా దేవుడు. యూదా ప్రజలమైన మేము దేవునిపట్ల భయభక్తులు కలిగియున్నాము. మేము ఆయనను వదిలిపెట్టలేదు! యెహోవాను సేవించే యాజకులు అహరోను సంతతివారే. యెహోవా సేవలో యాజకులకు లేవీయులు తోడ్పడతారు. 11 వారు దహనబలులు, సుగంధద్రవ్యాలతో ధూపం నిత్యం ఉదయ సాయంకాలాల్లో సమర్పిస్తారు. ఆలయంలో ప్రత్యేకమైన బల్లమీద నైవేద్యపు రొట్టెలను వారు వరుసలలో పెడతారు. వారు ప్రతి సాయంత్రం బంగారు దీపస్తంభం నిలిపి ప్రమిదలు వెలిగిస్తారు. మన దేవుడైన యెహోవా ఆజ్ఞను మేము అనుసరిస్తాము. కాని యరొబామూ, నీవు మరియు నీతోవున్న ఇశ్రాయేలీయులూ యెహోవాను లక్ష్యపెట్టడంలేదు. మీరు ఆయనను వదిలి పెట్టారు. 12 దేవుడే మాకు తోడై వున్నాడు. ఆయనే మా అధిపతి. ఆయన యాజకులు మాతో వున్నారు. మీపై యుద్ధానికి యెహోవా యాజకులు బూరలు ఊది మమ్మల్ని పిలుస్తారు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీ పూర్వీకుల దేవుడగు యెహోవా మీదికి యుద్ధానికి పోకండి. ఎందువల్లనంటే, మీరు విజయం పొందలేరు!”
13 కాని యరొబాము కొంతమంది సైనికులను అబీయా సైన్యం వెనుక చాటుగా పొంచి వుండటానికి పంపాడు. యరొబాము సైన్యం అబీయా సైన్యానికి ఎదురుగా వుంది. యరొబాము సైన్యం నుండి రహస్యంగా వెళ్లిన సైనికులు అబీయా సైన్యానికి వెనకగా వున్నారు. 14 యూదాకు చెందిన అబీయా సైన్యంలోని భటులు వెనుదిరిగి చూచినప్పుడు యరొబాము సైన్యం తమను ముందు నుండి, వెనుక నుండి ఎదుర్కొంటున్నట్లు భావించారు. యూదా సైనికులు యెహోవాను పిలిచారు. యాజకులు బూరలు ఊదారు. 15 పిమ్మట అబీయా సైన్యం కేకలు పెట్టింది. యూదా సైనికులు యుద్ధ నినాదాలు చేసినప్పుడు, దేవుడు యరొబాము సైన్యాన్ని ఓడించాడు. ఇశ్రాయేలు నుండి వచ్చిన యరొబాము సైన్యాన్ని యూదా నుంచి వచ్చిన అబీయా సైన్యం ఓడించింది. 16 యూదా సైనికుల నుండి ఇశ్రాయేలు సైనికులు పారిపోయారు. ఇశ్రాయేలు సైన్యాన్ని ఓడించేలా దేవుడు యూదా సైన్యానికి తోడ్పడ్డాడు. 17 అబీయా సైన్యం ఇశ్రాయేలు సైన్యాన్ని చిత్తుగా ఓడించింది. ఐదులక్షల మంది ఇశ్రాయేలు యోధులు చనిపోయారు. 18 ఆ విధంగా అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఓడింపబడ్డారు; యూదా ప్రజలు గెలిచారు. వారి పూర్వీకుల దేవుడైన యెహోవా మీద వారు ఆధారపడిన కారణంగా యూదా సైన్యం విజయం సాధించింది.
19 అబీయా సైన్యం యరొబాము సైన్యాన్ని తరిమి కొట్టింది. అబీయా సైన్యం యరొబాముకు చెందిన బేతేలు, యెషానా, ఎఫ్రోను పట్టణాలను పట్టుకుంది. వారు ఆ పట్టణాలతో పాటు వాటి పరిసర గ్రామాలను కూడా వశపర్చుకున్నారు.
20 అబీయా నివసించియున్నంత కాలం యరొబాము బలమైన రాజు కాలేకపోయాడు. యెహోవా యరొబామును చంపేశాడు. 21 అబీయా మిక్కిలి బలవంతుడైన రాజయ్యాడు అతడు పదునల్గురు స్త్రీలను వివాహమాడాడు. అతడు ఇరువై యిద్దరు కుమారులకు, పదహారుగురు కుమార్తెలకు తండ్రి అయ్యాడు. 22 అబీయా చేసిన ఇతర కార్యాలన్నీ ప్రవక్తయగు ఇద్దో రచనల్లో పొందుపర్చబడ్డాయి.
14 అబీయా తన పూర్వీకులతో నిద్రంచాడు. దావీదు నగరంలో ప్రజలు అతనిని సమాధి చేశారు. పిమ్మట అబీయా కుమారుడు ఆసా అతని స్థానంలో కొత్తగా రాజయ్యాడు. ఆసా పరిపాలనా కాలంలో పది సంవత్సరాలపాటు దేశంలో శాంతి నెలకొన్నది.
యూదా రాజుగా ఆసా
2 తన దేవుడైన యెహోవా దృష్టకి మంచివైన, న్యాయమైన పనులు ఆసా చేశాడు. 3 విగ్రహాలను ఆరాధించటానికి వినియోగించిన వింత బలిపీఠాలను ఆసా తొలగించాడు. ఆసా ఉన్నత స్థలాలను తీసివేసి, స్మారక శిలలను[d] పగులగొట్టాడు. అషేరా దేవతా స్తంభాలను[e] కూడా ఆసా విరుగగొట్టాడు. 4 యూదా ప్రజలను దేవుడైన యెహోవాను అనుసరించమని ఆసా ఆదేశించాడు. ఆయన వారి పూర్వీకులు ఆరాధించిన దైవం. అందుచే ఆయన ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలను పాటించమని ఆసా వారికి ఆదేశించాడు. 5 యూదా పట్టణాలన్నిటి నుండి ఆసా ఉన్నత స్థలాలను, ధూప పీఠాలను తీసివేశాడు. ఆసా రాజుగా వున్న కాలంలో రాజ్యంలో శాంతి నెలకొన్నది. 6 యూదాలో శాంతి విలసిల్లిన కాలంలోనే ఆసా బలమైన నగరాలు నిర్మించాడు. యెహోవా శాంతియుత వాతావరణం కల్పించటంతో ఆసాకు ఆ కాలంలో యుద్ధాలు లేవు.
7 ఆసా యూదా ప్రజలతో యిలా చెప్పాడు: “మనమీ పట్టణాలను నిర్మించి, వాటిచుట్టూ ప్రాకారాలు కట్టిద్దాము. మనం బురుజులను, ద్వారాలను, ద్వారాలకు కడ్డీలను ఏర్పాటు చేద్దాము. ఈ దేశంలో ఇంకను నివసిస్తూండగానే మనమీ పనులు చేద్దాము. ఈ దేశం మనది. ఎందువల్లననగా మన ప్రభువైన దేవుని మనం అనుసరించాము. మనచుట్టూ ఆయన మనకు శాంతియుత వాతావరణం కల్పించాడు.” పిమ్మట వారు నగర నిర్మాణాలు చేపట్టి విజయం సాధించారు.
8 ఆసాకు మూడు లక్షలమంది యూదా వంశాల వారున్న సైన్యం; రెండు లక్షల ఎనబై వేలమంది బెన్యామీను కుటుంబాలకు చెందిన వారు సైన్యం వున్నాయి. యూదా సైనికులు పెద్ద పెద్ద డాళ్లను, ఈటెలను ధరించారు. బెన్యామీను సైనికులు చిన్న డాళ్లను ధరించి, ధనుస్సులతో బాణాలు వేయగల నేర్పరులు. వారంతా బలమైన, ధైర్యంగల సైనికులు.
9 పిమ్మట జెరహు అనేవాడు ఆసా మీదికి దండెత్తాడు. జెరహు ఇథియోపియావాడు.[f] జెరహు సైన్యంలో పదిలక్షలమంది సైనికులు, మూడు వందల రథాలు వున్నాయి. జెరహు సైన్యం మారేషా వరకు చొచ్చుకు వచ్చింది. 10 జెరహును ఎదుర్కోవటానికి ఆసా బయలుదేరి వెళ్లాడు. మారేషా వద్ద జెపాతా లోయలో ఆసా సైన్యం యుద్ధానికి సిద్ధమయ్యింది.
11 ఆసా తన దేవుడైన యెహోవాకు యిలా ప్రార్థన చేశాడు “ప్రభూ, బలవంతుల నుండి బలహీనులను రక్షించేవాడవు నీ వొక్కడివే! ఓ ప్రభూ, మా దైవమా మాకు సహాయం చేయుము! మేము నీమీద ఆధారపడి యున్నాము. ఈ మహా సైన్యాన్ని నీ పేరుతో మేము ఎదిరించబోతున్నాము. యెహోవా, నీవు మా దేవుడవు. నీమీద విజయాన్ని ఎవ్వరికీ చేకూర నీయకుము!”
12 పిమ్మట యెహోవా ఆసా వద్దవున్న యూదా సైన్యాన్ని ఇథియోపియా (కూషు) సైన్యాన్ని ఓడించటానికి వినియోగించాడు. ఇథియోపియా సైన్యం పారిపోయింది. 13 ఆసా సైన్యం ఇథియోపియా సైన్యాన్ని గెరారు పట్టణం వరకు తరుముకుంటూ పోయింది. ఇథియోపియా సైనికులు అనేకమంది చనిపోవటంతో యుద్ధం చేయటానికి మళ్లీ వారు ఒక సైన్యంగా కూడ గట్టుకోలేకపోయారు. యెహోవా చేత, ఆయన సైన్యం చేత వారు అణచివేయబడ్డారు. శత్రుసైన్యం నుండి ఆసా, మరియు అతని సైనికులు అనేక విలువైన వస్తువులను దోచుకున్నారు. 14 ఆసా మరియు అతని సైన్యం గెరారు దగ్గరలో వున్న అన్ని పట్టణాలను ఓడించారు. ఆ పట్టణాలలో నివసిస్తున్న ప్రజలు యెహోవాకు భయపడిపోయారు. ఆ పట్టణాలలో విలువైన వస్తు సామగ్రి విస్తారంగా వుంది. ఆ విలువైన వస్తువులన్నిటినీ ఆసా సైన్యం దోచుకుంది. 15 ఆసా సైన్యం గొర్రెల కాపరులు నివసించే ప్రాంతాల మీద కూడా దాడి చేసింది. వారు చాలా గొర్రెలను, ఒంటెలను పట్టుకుపోయారు. తరువాత ఆసా సైన్యం యెరూషలేముకు వెళ్లిపోయింది.
యేసు బేతనియలో తన స్నేహితులతో
(మత్తయి 26:6-13; మార్కు 14:3-9)
12 పస్కా పండుగకు ఆరు రోజుల ముందే యేసు బేతనియ చేరుకున్నాడు. యేసు బ్రతికించిన లాజరు యింతకు పూర్వం ఆ గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. 2 అక్కడ యేసు గౌరవార్థం ఒక విందు ఏర్పాటు చేయబడింది. మార్త వడ్డిస్తూ ఉంది. యేసుతో సహా కూర్చున్న వాళ్ళలో లాజరు ఒకడు. 3 మరియ జటామాంసి చెట్టుతో చేయబడిన ఒక సేరున్నర విలువైన మంచి అత్తరు యేసు పాదాల మీద పోసి, తన తల వెంట్రుకలతో పాదాలను తుడుచింది. ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది.
4-5 యూదా ఇస్కరియోతు యేసు శిష్యుల్లో ఒక్కడు. యేసుకు ద్రోహం చెయ్యబోయేవాడు వీడే. యూదా, “ఈ అత్తరు అమ్మి, ఆ డబ్బు పేద వాళ్ళ కెందుకివ్వలేదు. ఆ అత్తరు వెల మూడువందల దేనారా లన్నా ఉంటుంది కదా!” అని అన్నాడు. 6 యూదాకు పేద వాళ్ళపై కనికరం ఉండుటవలన యిలా అనలేదు. వీడు దొంగ. డబ్బు సంచి తన దగ్గర ఉండటంవల్ల దానిలోవున్న డబ్బు దొంగలించే వాడు.
7 యేసు, “ఆమె ఈ అత్తరుతో నన్ను సమాధికి సిద్ధం చెయ్యటానికి ఈనాటి దాకా దాన్ని దాచి ఉంచింది. 8 మీతో పేదవాళ్ళు ఎప్పటికీ ఉంటారు. కాని నేను ఎల్లకాలం మీతో ఉండను” అని అన్నాడు.
లాజరుకు విరోధముగా కుట్ర
9 ఇంతలో పెద్ద యూదుల గుంపు ఒకటి యేసు అక్కడవున్నాడని విని అక్కడికి వచ్చింది. ఆయన కోసమే కాకుండా ఆయన బ్రతికించిన లాజరును కూడా చూడటానికి వచ్చారు. 10-11 తద్వారా ప్రధాన యాజకులు లాజరును కూడా చంపాలని పన్నాగం పన్నారు. ఎందుకంటే యితని కారణంగానే చాలామంది యూదులు యేసు దగ్గరకు వెళ్ళి ఆయన యందు నమ్మకం ఉంచారు.
యేసు యెరూషలేము ప్రవేశించటం
(మత్తయి 21:1-11; మార్కు 11:1-11; లూకా 19:28-40)
12 మరుసటి రోజు పండుగ కోసం వచ్చిన గుంపు ఒకటి యేసు యెరూషలేంలోకి వస్తున్నాడని విన్నది. 13 వాళ్ళు ఖర్జూరపు మట్టల్ని పట్టుకొని,
అని కేకలు వేస్తూ ఆయన్ని కలవటానికి వచ్చారు.
14 యేసు ఒక గాడిద పిల్లను కనుగొని దానిపై కూర్చున్నాడు. ఈ సందర్భాన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:
15 “సీయోను కుమారీ, భయపడకు!
గాడిద పిల్లపై కూర్చొని
నీ రాజు వస్తున్నాడు చూడు!”(B)
16 ఇవి ఆయన శిష్యులకు అప్పుడు అర్థంకాలేదు. కాని యేసు మహిమ పొందిన తర్వాత ప్రవక్తలు ఆయన్ని గురించి వ్రాశారని గుర్తించారు. అంతేగాక తాము చేసిన వాటిని గురించి అర్థం చేసుకొన్నారు.
17 యేసు లాజరును సమాధినుండి లేచి రమ్మని పిలవటము, అతణ్ణి బ్రతికించటము చూసిన ప్రజలు ఆవార్త ప్రచారం చేసారు. 18 చాలా మంది ఆయన ఈ అద్భుతాన్ని చేసాడని విన్నందువలన ఆయన్ని కలుసు కోవటానికి వెళ్ళారు. 19 అందువలన పరిసయ్యులు పరస్పరం, “చూడండి! మనం గెలవటం లేదు. ప్రపంచమంతా అతని వెంట ఎట్లా వెళ్తున్నారో చూడండి!” అని మాట్లాడుకున్నారు.
జీవము, మరణముల గురించి యేసు మాట్లాడటం
20 పండుగ రోజు ఆరాధన చెయ్యటానికి వెళ్ళిన వాళ్ళల్లో గ్రీకులు కూడా ఉన్నారు. 21 వాళ్ళు ఫిలిప్పును కలుసుకొని, “అయ్యా! మేము యేసును చూడటానికి వచ్చాము” అని అన్నారు. ఫిలిప్పు, గలిలయలోని బేత్సయిదా అనే గ్రామానికి చెందిన వాడు. 22 ఫిలిప్పు వెళ్ళి అంద్రెయతో చెప్పాడు. వీళ్ళిద్దరూ వెళ్ళి యేసుతో చెప్పారు.
23 యేసు ఇలా అన్నాడు: “మనుష్యకుమారుడు మహిమపొందు గడియ దగ్గరకు వచ్చింది. 24 ఇది నిజం. గోధుమ విత్తనం భూమ్మీద పడి చనిపోకపోతే అది ఒకటిగానే ఉంటుంది. అది చనిపోతే ఎన్నో విత్తనాల్ని ఉత్పత్తి చేస్తుంది. 25 తన ప్రాణాన్ని ప్రేమించే వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని ఈ ప్రాపంచిక జీవితాన్ని ఏవగించుకొన్నవాడు తన ప్రాణాన్ని కాపాడు కొంటాడు. పైగా అనంతజీవితం పొందుతాడు. 26 నా సేవ చేయదలచిన వాడు నన్ను అనుసరించాలి. నేను ఎక్కడ ఉంటే నా సేవకుడు అక్కడ ఉంటాడు. నా సేవ చేసేవాణ్ణి నా తండ్రి గౌరవిస్తాడు.
© 1997 Bible League International