Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 దినవృత్తాంతములు 7-9

ఆలయాన్ని దేవునికి అంకింతం చేయటం

సొలొమోను ప్రార్థన పూర్తి చేసేసరికి ఆకాశం నుండి అగ్ని దిగి దహనబలులను, మిగిలిన అర్పణలను దహించి వేసింది. యెహోవా మహిమ ఆలయాన్ని నింపివేసింది. యెహోవా మహిమ నిండి వున్న ఆలయంలో యాజకులు ప్రవేశించలేక పోయారు. ఆకాశం నుండి అగ్ని దిగిరావటం ఇశ్రాయేలీయులంతా చూశారు. యెహోవా మహిమ ఆలయాన్ని ఆవరించి వుండటం కూడ వారు చూశారు. వారంతా బాటపై సాష్టాంగ పడ్డారు. వారు యెహోవాను స్తుతించి, నమస్కరించారు. వారింకా యిలా అన్నారు:

“ప్రభువు ఉత్తముడు,
    ఆయన కరుణ ఎప్పటికీ కొనసాగుతుంది.”

పిమ్మట రాజైన సొలొమోను, ఇశ్రాయేలు ప్రజలందరు యెహోవా ముందు బలులు అర్పించారు. రాజైన సొలొమోను ఇరవై రెండువేల గిత్తలను, ఒక లక్షా ఇరవైవేల గొర్రెలను బలియిచ్చాడు. రాజు, ప్రజలు అంతా కలిసి ఆలయాన్ని పవిత్రం చేశారు. అది యెహోవా ఆరాధనకై వినియోగింపబడాలి. యాజకులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి సిద్ధంగా నిలబడ్డారు. లేవీయులు కూడ యెహోవా మేళం వాయించే పనిముట్లు పట్టుకుని నిలిచారు. దేవునికి వందనాలర్పించే నిమిత్తం ఈ వాద్య విశేషాలను రాజైన దావీదు చేయించాడు. “దేవుని ప్రేమ అనంతం!” అని యాజకులు, లేవీయులు పలికారు. లేవీయులకు ఎదురుగా నిలబడి యాజకులు బాకాలు ఊదారు. ఇశ్రాయేలీయులందరూ నిలబడ్డారు.

ఆలయం ముందున్న ఆవరణ మధ్య భాగాన్ని సొలొమోను ప్రతిష్ఠించాడు. అక్కడే సొలొమోను దహనబలులు,[a] సమాధాన బలుల కొవ్వును అర్పించాడు. తాను నిర్మించిన కంచు బలిపీఠం దహనబలులు, ధాన్యపు అర్పణలు, కొవ్వును పెట్టటానికి చాలనందున, సొలొమోను ఆలయ ఆవరణ మధ్య భాగాన్ని వినియోగించాడు.

సొలొమోను, ఇశ్రాయేలు ప్రజలు కలిసి ఏడు రోజులపాటు పండుగ చేశారు. సొలొమోనుతో చాలా మంది జనం వున్నారు. హమాతు పట్టణద్వారం నుండి ఈజిప్టు సెలయేటి వరకు వున్న ప్రాంత మంతటి నుండి జనసమూహాలు వచ్చాయి. ఏడు రోజుల పండుగ ఆచరణ ముగిశాక, ఎనిమిదవ రోజున వారు పవిత్ర సమావేశం ఏర్పాటు చేశారు. బలిపీఠాన్ని వారు పవిత్రం (శుద్ధి) చేశారు. దానిని దైవారాధనలోనే వినియోగిస్తారు. వారు ఏడు రోజులు పండుగ ఆచరించారు. 10 ఆ సంవత్సరం ఏడవ నెల ఇరవై మూడవ రోజు సొలొమోను ప్రజలందరినీ తమ తమ ఇండ్లకు పంపివేశాడు. యెహోవా దావీదుపట్ల, సొలొమోను పట్ల, ఇశ్రాయేలు ప్రజలపట్ల ఎంతో ఉదారంగా వున్నందుకు ప్రజలంతా చాలా సంతోషించారు. వారి హృదయాలు ఆనందమయమయ్యాయి.

యెహోవా సొలొమోను వద్దకు రావటం

11 సొలొమోను ఆలయాన్ని, రాజభవనాన్ని నిర్మించటం పూర్తిచేశాడు. ఆలయ నిర్మాణంలోను, తన ఇంటి నిర్మాణంలోను సొలొమోను అనుకున్న పనులన్నీ పూర్తిచేశాడు. 12 ఆ రాత్రి యెహోవా సొలొమోనుకు దర్శనమిచ్చాడు. యెహోవా ఇలా అన్నాడు:

“సొలొమోనూ, నీ ప్రార్థన నేను విన్నాను. బలులు యివ్వటానికి అనువైన ప్రదేశంగా ఈ స్థలాన్ని నేనే ఎంపిక చేశాను. 13 వర్షాలు లేకుండా నేను ఆకాశాన్ని మూసివేసినప్పుడుగాని, దేశాన్ని నాశనం చేసే విధంగా నేను మిడతల దండులను పంపినుప్పుడుగాని, నేను నా ప్రజలకు వ్యాధులు సొకేలా చేసినప్పుడుగాని, 14 నా పేరు మీద పిలవబడే నా ప్రజలు అణకువతో వుండి నన్ను ప్రార్థిస్తే, నా కొరకు ఎదురు చూస్తే, వారు తమ చెడు మార్గాలను విడనాడితే, నేనప్పుడు ఆకాశం నుండి వారి మొర ఆలకిస్తాను. నేను వారి పాపాలను క్షమిస్తాను. నేను వారి దేశాన్ని బాగు చేస్తాను. 15 నేను నా నేత్రలను తెరచియున్నాను. నా చెవులు ఈ ప్రదేశంలో చేసిన ప్రార్థనలను వింటాయి. 16 ఇక్కడ నా పేరు శాశ్వతంగా ఉండునట్లు నేనీ ప్రదేశాన్ని ఎంపిక చేసి, దానిని పవిత్రంగా మార్చాను. అవును; నా కళ్లు, నా హృదయం ఇక్కడ ఈ ఆలయంలో ఎల్లప్పుడూ వుంటాయి. 17 సొలొమోనూ, నీవిప్పుడు నీ తండ్రి మెలగిన రీతిలో నా ముందు జీవిస్తే, నా ఆజ్ఞలన్నీ పాటిస్తే, నా ధర్మశాస్త్రాన్ని, నియమాలను అనుసరిస్తే, 18 నిన్నొక శక్తి గల రాజుగా చేస్తాను. నీ రాజ్యాన్ని సుస్థిరమైనదిగా చేస్తాను. నీ తండ్రియైన దావీదుతో అదే ఒడంబడిక చేశాను. ‘దావీదూ, ఇశ్రాయేలు రాజుగా నీ కుటుంబంలో ఒకడు కొనసాగుతాడు’ అని నేను చెప్పియున్నాను.

19 “కానీ నీవు నా ధర్మాన్ని, ఆజ్ఞలను శిరసావహించనిచో, నీవు గనుక అన్యదేవతారాధనకు పాల్పడితే, 20 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలను నేను వారికిచ్చిన రాజ్యం నుండి బయటకు త్రోసివేస్తాను. నా నామముతో పవిత్రపర్చబడిన ఈ ఆలయాన్ని నేను వదలి వేస్తాను. ఇతర దేశాలన్నీ చెడుమాటలు పలికేలా ఈ ఆలయమును మార్చివేస్తాను. 21 అత్యున్నతంగా గౌరవింపబడిన ఈ ఆలయం ప్రక్కగా వెళ్లే వారెవరైనా చూసి ఆశ్చర్యపోతారు. ‘ఈ రాజ్యానికి, ఈ ఆలయానికి, యెహోవా ఎందుకింత భయంకర పరస్థితి కల్పించాడు?’ అని అనుకుంటారు. 22 పిమ్మట వారు ఈ రకంగా సమాధానం చెప్పుకుంటారు: ‘వారి పూర్వీకుల దేవుడైన యెహోవాను ఇశ్రాయేలు ప్రజలు అనుసరించలేదు. ఆయనే వారిని ఈజిప్టు నుండి విముక్తి చేసి బయటకు తీసుకొనివచ్చాడు. కాని ఇశ్రాయేలు ప్రజలు అన్యదేవతలను సేవించారు. వారు విగ్రహాలను కొలిచారు. అందువల్లనే యెహోవా ఈ భయంకర పరిస్థితులు ఇశ్రాయేలు ప్రజలకు కల్పించాడు అని అనుకుంటారు.’”

సొలొమోను నిర్మించిన నగరాలు

ఆలయ నిర్మాణానికి, తన స్వంత ఇంటి నిర్మాణానికి సొలొమోనుకు ఇరవై సంవత్సరాలు పట్టింది. పిమ్మట హీరాము తనకు ఇచ్చిన పట్టణాలను తిరిగి నిర్మించాడు. ఆ పట్టణాలలో కొంత మంది ఇశ్రాయేలీయులను సొలొమోను నివసింపనిచ్చాడు. దీని తరువాత సొలొమోను సోబాలోని హమాతు నగరాన్ని వశపర్చుకున్నాడు. సొలొమోను తద్మోరు అనే పట్టణాన్ని కూడా ఎడారిలో నిర్మించాడు. హమాతులోని పట్టణాలన్నిటినీ వస్తుసామగ్రులను నిలవచేయటానికి నిర్మించాడు. సొలొమోను ఎగువ బేత్ హోరోను, దిగువ బేత్ హోరోను పట్టణాలను కూడ కట్టించాడు. అతడీ పట్టణాలను బలమైన కోటలుగా తయారు చేశాడు. వాటి చుట్టూ గోడలు, వాటి ద్వారాలు, ద్వారాలకు కడ్డీలు ఏర్పాటు చేశాడు. బయలతు పట్టణాన్ని వస్తువులు నిల్వచేసే ఇతర పట్టణాలను సొలొమోను మళ్లీ కట్టించాడు. రథశాలలున్న పట్టణాలను, గుర్రాలను నడిపే రౌతుల నగరాలన్నిటినీ సొలొమోను కట్టించాడు. యెరూషలేములోను, లెబానోనులోను, తాను రాజుగా వున్న ప్రాంతాలన్నిటిలోను సొలొమోను తనకు కావలసిన వాటినన్నిటినీ కట్టించాడు.

7-8 ఇశ్రాయేలీయులు నివసిస్తున్న దేశంలో చాలా మంది పరదేశీయులున్నారు. వారిలో హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు వున్నారు. ఆ పరదేశీయులందరినీ సొలొమోను బానిసలుగా పనిచేయించాడు. వారు ఇశ్రాయేలీయులు కారు. వారంతా దేశాన్ని వదలిపోగా మిగిలిన వారంతా పరదేశీయుల సంతతివారు. పైగా వారు ఇశ్రాయేలీయులచే చంపబడకుండా మిగిలిపోయినవారు. ఈవెట్టి చాకిరి ఈనాటికీ కొనసాగుతూనే వుంది. ఇశ్రాయేలీయులైన వారెవరినీ బానిసలుగా చేయమని సొలొమోను వత్తిడి చేయలేదు. ఇశ్రాయేలు ప్రజలు సొలొమోను యొక్క పోరాట యోధులు వారు అతని సైనికాధికారులలో ముఖ్యులుగాను, రథాలకు అధిపతులుగాను, రథసారధులకు నాయకులుగాను నియమింప బడ్డారు. 10 కొంతమంది ఇశ్రాయేలీయులు సొలొమోను ముఖ్యాధిపతులకు పైఅధికారులుగా వున్నారు. ప్రజల కార్యకలపాలు తనిఖీ చేయటానికి ఇలాంటివారు రెండు వందల ఏబై మంది ఉన్నారు.

11 ఫరోరాజు కుమార్తెను దావీదు నగరం నుండి ఆమె కొరకు కట్టించిన భవంతికి సొలొమోను తీసుకొని వచ్చాడు. “నా భార్య రాజైన దావీదు ఇంటిలో నివసించ కూడదు. ఎందువల్లనంటే దేవుని ఒడంబడిక పెట్టె వెళ్లిన ప్రతిచోటూ పవిత్రమైనది” అని సొలొమోను అన్నాడు.

12 యెహోవా బలిపీఠం మీద సొలొమోను దహన బలులు అర్పించాడు. 13 మోషే ఆజ్ఞాపించిన విధంగా సొలొమోను ప్రతిరోజూ బలులు అర్పించాడు. బలులు ప్రతి సబ్బాతు దినాన, ప్రతి అమావాస్య రోజున, మరియు సంవత్సరంలో వచ్చే మూడు పండుగ సెలవు రోజులలోను అర్పించేవారు. ఆ మూడు పండుగలకు పులియని రొట్టెల పండుగ, వారాల పండుగ మరియు పర్ణశాలల పండుగ అని పేర్లు. 14 తన తండ్రి దావీదు ఉపదేశాలన్నిటినీ సొలొమోను పాటించాడు. సొలొమోను వివిధ కార్యాలకు అర్హతగల యాజక వర్గాలను నియమించాడు. లేవీయులను కూడ వారికి తగిన పనులకు సొలొమోను నియమించాడు. భక్తిగీతాల కార్యక్రమ నిర్వహణ, ఆలయంలో దేవుని సేవలో నిత్యం కావలసిన వస్తువులు చేయుటలో యాజకులకు తోడ్పడటం లేవీయుల పని. ప్రతి ద్వారంవద్ద సేవ చేయటానికి తగిన విధంగా జట్లను సొలొమోను ఎంపిక చేశాడు. ఈ రకంగా చేయమని యెహోవా సేవకుడైన దావీదు ఆజ్ఞాపించాడు. 15 యాజకులకు, లేవీయులకు సొలొమోను ఇచ్చిన ఆదేశాలను ఇశ్రాయేలు ప్రజలు మార్చటంగాని, అనాదరించటంగాని చేయలేదు. కనీసం విలువైన వస్తువుల భద్రత విషయాలలో కూడ వారు ఏ ఒక్క ఆదేశాన్నీ మార్చలేదు.

16 సొలొమోను చేయవలసిన పనంతా పూర్తి అయ్యింది. ఆలయ నిర్మాణం మొదలైనప్పటి నుండి అది పూర్తి అయ్యేవరకు పనియావత్తూ ఒక క్రమ పద్ధతిలో సాగింది. ఆ విధంగా ఆలయం నిర్మింపబడింది.

17 పిమ్మట సొలొమోను ఎసోన్గెబరు, ఏలతు పట్టణాలకు వెళ్లాడు. ఆ పట్టణాలు ఎదోము దేశంలో ఎర్ర సముద్ర తీరంలో వున్నాయి. 18 హీరాము ఓడలను సొలొమోను వద్దకు పంపాడు. హీరాము స్వంత మనుష్యులు ఓడలను నడిపారు. సముద్రయానంలో హీరాము మనుష్యులు ఆరితేరినవారు. హీరాము మనుషష్యులు సొలొమోను సేవకులతో కలిసి ఓఫీరుకు వెళ్లి పదిహేడు టన్నుల[b] బంగారాన్ని రాజైన సొలొమోనుకు తీసుకొని వచ్చారు.

షేబదేశపు రాణి సొలొమోనును దర్శించటం

షేబ దేశపు రాణి సొలొమోను కీర్తిని గురించి విన్నది. కఠినమైన, చిక్కు ప్రశ్నలు వేసి సొలొమోనును పరీక్షించాలని ఆమె యెరూషలేముకు వచ్చింది. షేబ రాణి తన వెంట అనేకమంది మనుష్యులను తీసుకొని వచ్చింది. సుగంధ ద్రవ్యాలు, బంగారం, విలువైన రత్నాలు మోసుకొని వచ్చిన ఒంటెలు ఆమెతో వున్నాయి. ఆమె సొలమోను వద్దకు వచ్చి అతనితో మాట్లాడింది. ఆమె వద్ద సొలొమోనును అడగటానికి ఎన్నో ప్రశ్నలున్నాయి. ఆమె ప్రశ్నలన్నిటికీ సొలొమోను సమాధాన మిచ్చాడు. వివరించి చెప్పటానికిగాని, సమాధాన మివ్వటానికిగాని సొలొమోనుకు కష్టమైనదేదీ కన్పించలేదు. సొలొమోను జ్ఞానాన్ని, అతడు నిర్మించిన భవంతులను షేబ దేశపు రాణి స్వయంగా చూసింది. సొలొమోను బల్లమీద రాజ భోజన పదార్థాలను, అతని ముఖ్య అధికారులనేకమందిని ఆమె చూసింది. అతని సేవకులు పనిచేసే తీరును, వారు ధరించే దుస్తులను ఆమె చూసింది. సొలొమోనుకు ద్రాక్షరసము వడ్డించే వారిని, వారి దుస్తులను ఆమె చూసింది. ఆలయంలో సొలొమోను అర్పించిన దహన బలులను కూడ ఆమె చూసింది. షేబ దేశపు రాణి వాటన్నింటినీ చూసినప్పుడు ఆమె ఆశ్చర్యపడింది!

అప్పుడామె రాజైన సొలొమోనుతో యిలా అన్నది: “నీ ఘనమైన కార్యాలను గురించి, నీ అద్భుతమైన తెలివితేటల గురించి నేను నా దేశంలో విన్న విషయాలన్నీ నిజమని తెలుసుకున్నాను. నేనిక్కడికి వచ్చి, నా కన్నులతో స్వయంగా చూచేవరకు నేనా విషయాలను నమ్మలేదు. ఆహా! నీకున్న మహాజ్ఞానంలో కనీసం సగం కూడ నాకు చెప్పబడలేదు! నేను విన్న విషయాలను మించి వున్నావు నీవు! నీవు, నీ భార్యలు, అధికారులు చాలా అదృష్టవంతులు! నీకు సేవ చేస్తూనే నీ జ్ఞాన వాక్కులను వారు వినగలరు! నీ దేవుడైన ప్రభువుకు వందనాలు! నీ పట్ల ఆయన సంతోషంగా వున్నాడు. అందువల్ల ఆయన తరపున రాజ్యమేలటానికి సింహాసనంపై నిన్ను కూర్చోపెట్టాడు. నీ దేవుడు ఇశ్రాయేలును ప్రేమిస్తున్నాడు. ఆయన సహాయం ఇశ్రాయేలుకు శాశ్వతంగా వుంటుంది. అందువల్లనే ఏది న్యాయమైనదో, ఏది మంచిదో అది చేయటానికి యెహోవా నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు.”

తరువాత షేబ దేశపు రాణి సొలొమోను రాజుకు నాలుగున్నర టన్నుల (రెండు వందల నలబై మణుగులు) బంగారం, లెక్కకు మించి సుగంధ ద్రవ్యాలు, విలువైన రత్నాలు ఇచ్చింది. షేబ దేశపు రాణి ఇచ్చినట్లు రాజైన సొలొమోనుకు ఎవ్వరూ అటువంటి మేలి రకపు సుగంధ ద్రవ్యాలను ఇచ్చివుండలేదు.

10 హీరాము సేవకులు, సొలొమోను సేవకులు ఓఫీరు[c] నుండి బంగారం తీసుకొని వచ్చారు. వారింకా చందనపు కర్రను, విలవైన రత్నాలను తెచ్చారు. 11 ఆలయంలో మెట్ల నిర్మాణానికి, రాజభవన నిర్మాణంలోను రాజైన సొలొమోను చందనపు కర్రను ఉపయోగించాడు. సంగీత విధ్వాంసుల కొరకు తంబురలు, సితరాలు చేయటానికి కూడ సొలొమోను ఈ కర్రను వినియోగించాడు. యూదాలో చందనపు కర్రతో చేయబడిన చిత్రవిచిత్ర కళాఖండాలను ఎవ్వరూ ముందెన్నడూ చూసి వుండలేదు.

12 రాజైన సొలొమోను కూడ షేబ దేశపు రాణికి ఆమెకు కావలసిన వాటిని, అడిగిన ప్రతి దానిని ఇచ్చాడు. తనకు ఇవ్వటానికి ఆమె తెచ్చిన దానికంటె ఎక్కువగానే సొలొమోను ఇచ్చాడు. తరువాత షేబ దేశపు రాణి, ఆమె పరివారం తమ దేశానికి వెళ్లిపోయారు.

సొలొమోను మహా సంపద

13 ఒక్క సంవత్సరంలో సొలొమోను సేకరించిన బంగారం ఇరవై ఐదు టన్నులు (ఒక వెయ్యి మూడు వందల ముప్పై రెండు మణుగులు) తూగింది. 14 సంచార వర్తకులు, వ్యాపారులు సొలొమోనుకు చాలా బంగారం తెచ్చారు. అరబీ రాజులందురూ, దేశంలో ప్రాంతీయ పాలకులూ సొలొమోనుకు వెండి బంగారాలు తెచ్చియిచ్చారు.

15 బంగారు రేకులు తాపిన రెండు వందల పెద్దడాళ్లను సొలొమోను చేయించాడు. ప్రతి డాలుకూ సుమారు ఏడున్నర పౌనుల (ఆరు వందల తులాల) సాగగొట్టిన బంగారం పట్టింది. 16 బంగారు రేకులు వేయించి మూడు వందల చిన్న డాళ్లను కూడ సొలొమోను చేయించాడు. సుమారు మూడు ముప్పాతిక పౌనుల (మూడ వందల తులాల) బంగారం ఒక్కొక్క డాలుకు పట్టింది. లెబానోను అరణ్యంలో కట్టిన భవనంలో రాజైన సొలొమోను ఈ డాళ్లను వుంచాడు.

17 ఒక పెద్ద దంతపు సింహాసనాన్ని సొలొమోను రాజు చేయించాడు. మేలిమి బంగారపు రేకులు దానికి తాపించాడు. 18 సింహాసనానికి ఆరు మెట్లున్నాయి. బంగారంతో చేయించిన కాలిపీట దాని ముందు వుంది. సింహాసనానికిరుపక్కల చేతులు ఆనించటానికి తగిన ఆసరా ఏర్పాటు వుంది. చేతి ఆసరాలకు రెండు పక్కలా రెండు సింహపు విగ్రహాలున్నాయి. 19 ప్రతి మెట్టుకూ అటు ఇటు రెండేసి సింహాల విగ్రహాలు చొప్పున ఆరు మెట్లకు పన్నెండు సింహాపు విగ్రహాలు అమర్చబడ్డాయి. ఏ యితర సామ్రాజ్యంలోనూ ఈ రకమైన సింహాసనం చేయించబడలేదు.

20 సొలొమోను రాజు తాగే గిన్నెలన్నీ బంగారంతో చేసినవే. “లెబానోను అరణ్య” భవనంలో వాడే వస్తుసామగ్రి అంతా శుద్ధ బంగారంతో చేయబడింది. సొలొమోను కాలంలో వెండి విలువైన లోహంగా చూడబడలేదు.

21 తర్షీషు[d] వరకు ప్రయాణం చేసిన ఓడలు సొలొమోను రాజుకు వున్నాయి. హీరాము మనుష్యులు సొలొమోను ఓడలను నడిపేవారు. మూడు సంవత్సరాల కొకసారి ఓడలు వెండి బంగారాలు, ఏనుగు దంతాలు, కోతులు, నెమళ్లు మొదలగు వాటిని తీసుకొని సొలొమోను రాజ్యానికి తిరిగి వచ్చేవి.

22 భూలోకంలో వున్న రాజులందరికంటె సొలొమోను భాగ్యంలోను, తెలివితేటలలోను గొప్ప వాడయ్యాడు. 23 ప్రపంచ దేశాల రాజులంతా సొలొమోను వివేకవంతమైన న్యాయ నిర్ణయాలను వినటానికి అతనిని దర్శించేవారు. సొలొమోనుకు ఆ తెలివితేటలను దేవుడే ప్రసాదించాడు. 24 ప్రతి సంవత్సరం సొలొమోనును దర్శించటానికి వచ్చే రాజులందరూ కానుకలు తెచ్చేవారు. వారు వెండి బంగారు వస్తువులు, బట్టలు, కవచాలు, సుగంధ ద్రవ్యాలు, గుర్రాలు, కంచరగాడిదలను తెచ్చేవారు.

25 సొలొమోనుకు గుర్రాలను, రథాలను వుంచటానికి నాలుగువేల శాలలున్నాయి. అతనికి పన్నెండు వేలమంది రథసారధులున్నారు. రథాలకు ప్రత్యేక నగరాలను ఏర్పాటుచేసి, మరికొన్ని తనతో యెరూషలేములో వుంచుకున్నాడు. 26 యూఫ్రటీసు నది మొదలు ఫిలిష్తీయుల దేశం, మరియు ఈజిప్టు సరిహద్దు వరకు వున్న రాజులందరికీ సొలొమోను రాజైయున్నాడు. 27 సొలొమోను రాజు వద్ద నిలవవున్న వెండి యెరూషలేములో కొండ గుట్టల్లా పడివుంది. అతని వద్ద పల్లపు ప్రాంతంలో[e] వున్న మేడిచెట్లంత విస్తారంగా దేవదారు చెట్ల కలపవుంది. 28 ఈజిప్టు నుండి, తదితర దేశాలనుండి ప్రజలు సొలొమోనుకు గుర్రాలను తెచ్చి యిచ్చేవారు.

సొలొమోను మరణం

29 మొదటినుండి చివరివరకు సొలొమోను చేసిన పనులన్నీ ప్రవక్తయైన నాతాను ప్రవచనాలలోను, షిలో హువాడైన అహీయా ప్రవచనాలలోను మరియు దీర్ఘదర్శి అయిన ఇద్దో దర్శనాలలోను పొందుపర్చబడినాయి. అహీయా షిలోనీయుడు. ఇద్దో దీర్ఘదర్శి (ప్రవక్త). ఇద్దో యరొబామును గురించి రాశాడు. యరొబాము నెబాతు కుమారుడు. 30 సొలొమోను నలబై యేండ్లపాటు యెరూషలేము నుండి ఇశ్రాయేలంతటినీ పాలించాడు. 31 పిమ్మట సొలొమోను చనిపోయాడు.[f] తన తండ్రి దావీదు నగరంలో ప్రజలతనిని సమాధి చేశారు. సొలొమోను స్థానంలో అతని కుమారుడైన రెహబాము నూతన రాజయ్యాడు.

యోహాను 11:1-29

లాజరు మరణము

11 బేతనియ గ్రామానికి చెందిన లాజరుకు జబ్బు చేసింది. మరియ, ఆమె సోదరి మార్త కూడా ఆ గ్రామంలో ఉండే వాళ్ళు. ఒకప్పుడు ప్రభువు పాదాల మీద అత్తరు పోసి తన తల వెంట్రుకలతో తుడిచింది ఈ మరియయే! జబ్బుతో ఉండిన లాజరు మరియ సోదరుడు. ఈ స్త్రీలు, “ప్రభూ! మీరు ప్రేమిస్తున్న లాజరు జబ్బుతో ఉన్నాడు” అన్న వార్త యేసుకు పంపారు.

యేసు, విని, “ఈ జబ్బు చంపటానికి రాలేదు. దేవుని కుమారునికి మహిమ కలుగచేసి తద్వారా దేవుని మహిమను ప్రకటించటానికి వచ్చింది” అని అన్నాడు. యేసుకు మార్త పట్ల, ఆమె సోదరి పట్ల, లాజరు పట్ల ప్రేమ ఉంది. లాజరు జబ్బుతో ఉన్నాడని యేసు విన్నాడు. అక్కడ రెండురోజులు ఉండి, ఆ తర్వాత తన శిష్యులతో, “మనమంతా యూదయకు తిరిగి వెళ్దాం” అని అన్నాడు.

వాళ్ళు, “కాని రబ్బీ! యింతకు ముందే యూదులు మిమ్మల్ని రాళ్ళతో కొట్టాలని ప్రయత్నించారు. అయినా మీరు తిరిగి అక్కడికి వెళ్తున్నారా?” అని అడిగారు.

యేసు, “దినానికి పన్నెండు గంటలు వెలుతురుంటుంది. పగటి వేళ నడిచేవాడు ప్రపంచం యొక్క వెలుగు చూస్తుంటాడు. కనుక క్రిందపడడు. 10 రాత్రి వేళ నడిచే వానిలో వెలుగు ఉండదు. కనుక క్రిందపడతాడు” అని అన్నాడు.

11 ఈ విషయాలు చెప్పాక యేసు యింకా ఈ విధంగా అన్నాడు: “మన స్నేహితుడు లాజరు నిద్రపోయాడు. అతణ్ణి నిద్రనుండి లేపటానికి నేను అక్కడికి వెళ్తున్నాను.”

12 ఆయన శిష్యులు, “ప్రభూ! నిద్ర పోతే ఆరోగ్యంగా ఉంటాడు” అని అన్నారు. 13 యేసు మాట్లాడింది అతని చావును గురించి. కాని ఆయన శిష్యులు ఆయన సహజమైన నిద్రను గురించి మాట్లాడుతున్నాడనుకున్నారు.

14 అప్పుడు యేసు స్పష్టంగా, “లాజరు చనిపోయాడు. 15 నేనక్కడ లేనిది మంచిదైంది. మీ కోసమే అలా జరిగింది. మీరు నమ్మాలని నా ఉద్దేశ్యం. ఇప్పుడు అక్కడికి వెళ్దాం” అని అన్నాడు.

16 దిదుమ అని పిలువబడే తోమా, మిగతా శిష్యులతో, “యేసుతో కలిసి చనిపోవటానికి మనం కూడా ఆయన వెంట వెళ్దాం” అని అన్నాడు.

లాజరు కుటుంబాన్ని ఓదార్చుట

17 యేసు అక్కడికి చేరుకున్నాడు. నాలుగు రోజుల ముందే లాజరు సమాధి చేయబడ్డాడని ఆయనకు తెలిసింది. 18 బేతనియ, యెరూషలేమునకు సుమారు రెండు మైళ్ళ దూరంలో ఉంటుంది. 19 చాలా మంది యూదులు మార్తను, మరియను వాళ్ళ సోదరుడు చనిపోయినందుకు ఓదార్చటానికి వచ్చారు.

20 యేసు వస్తున్నాడని విని మార్త ఆయన్ని కలుసుకోవటానికి వెళ్ళింది. కాని మరియ ఇంట్లోనే ఉండిపోయింది. 21 మార్త యేసుతో, “ప్రభూ! మీరిక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయే వాడు కాదు. 22 కాని, యిప్పటికైనా మీరడిగితే దేవుడు మీరడిగింది యిస్తాడని నాకు తెలుసు” అని అన్నది.

23 యేసు ఆమెతో, “మీ సోదరుడు మళ్ళీ బ్రతికివస్తాడు” అని అన్నాడు.

24 మార్త, “చివరి రోజున అనగా అందరూ బ్రతికి వచ్చే రోజున అతడూ బ్రతికి వస్తాడని నాకు తెలుసు” అని సమాధానం చెప్పింది.

25 యేసు, “బ్రతికించే వాణ్ణి, బ్రతుకును నేనే. నన్ను నమ్మినవాడు చనిపోయినా జీవిస్తాడు. 26 జీవిస్తున్నవాడు నన్ను విశ్వసిస్తే ఎన్నటికి మరణించడు. ఇది నీవు నమ్ముతున్నావా?” అని అడిగాడు.

27 ఆమె, “నమ్ముతున్నాను ప్రభూ! మీరు క్రీస్తు అని, ఈ ప్రపంచంలోకి వచ్చిన దేవుని కుమారుడవని నమ్ముతున్నాను” అని అన్నది.

యేసు యేడవటం

28 ఈ విధంగా అన్న తర్వాత యింటికి వెళ్ళి తన సోదరి మరియను ప్రక్కకు పిలిచి, ఆమెతో, “బోధకుడు వచ్చాడు. నీ కొరకు అడుగుతున్నాడు” అని అన్నది. 29 మరియ యిది విని వెంటనే లేచి ఆయన దగ్గరకు వెళ్ళింది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International