Old/New Testament
దావీదు మనుష్యులను అమ్మోనీయులు అవమాన పరచటం
19 అమ్మోనీయుల రాజు పేరు నాహాషు. నాహాషు చనిపోగా అతని కుమారుడు నూతన రాజయ్యాడు. 2 ఇది విన్న దావీదు, “నాహాషు నాపట్ల చాలా దయతో వున్నాడు. నేను కూడ నాహాషు కుమారుడు హానూను పట్ల దయగలిగి వుంటాను” అని అన్నాడు. కావున తన తండ్రి చనిపోయిన సందర్భంగా హనూనును పలకరించే నిమిత్తం దావీదు తన మనుష్యులను పంపాడు. హానూనును ఓదార్చటానికి దావీదు దూతలు మోయాబు దేశానికి వెళ్లారు.
3 అమ్మోనీయుల పెద్దలు హానూనుతో ఇలా అన్నారు: “నీవు మోసంలో పడవద్దు. దావీదు నిజంగా నిన్ను ఓదార్చటానికి గాని, చనిపోయిన నీ తండ్రి పట్ల గౌరవభావంతో గాని తన మనుష్యులను పంపలేదు! దావీదు తన మనుష్యులను కేవలం నీమీద, నీ రాజ్యం మీద నిఘావేసి రహస్యాలను సేకరించటానికే పంపాడు. నిజానికి దావీదు నీ రాజ్యాన్ని నాశనం చేయ సంకల్పించాడు.” 4 దానితో దావీదు మనుష్యులను హానూను బంధించి వారి గడ్డాలు[a] గొరిగించాడు. తొడల దగ్గర వారి బట్టలు కూడ హానూను కత్తిరించాడు. తరువాత వారిని పంపివేశాడు.
5 దావీదు మనుష్యులు ఆ పరిస్థితిలో ఇంటికి వెళ్లటానికి సిగ్గుతో చాలా బాధపడ్డారు. అది చూసిన కొంత మంది మనుష్యులు దావీదు వద్దకు వెళ్లి అతని మనుష్యులకు జరిగిన అవమానాన్ని తెలియజేశారు. అది విన్న దావీదు తన మనుష్యులకు ఇలా కబురు పంపాడు: “మీ గడ్డాలు పెరిగే వరకు మీరు యెరికో పట్టణంలో వుండండి. తరువాత మీరు ఇండ్లకు తిరిగిరండి.”
6 ఇది జరిగిన పిమ్మట అమ్మోనీయులు తాము దావీదుకు బద్ధశత్రువులైనట్లు గుర్తించారు. దానితో హానూను, అమ్మోనీయులు డెబ్బై ఐదువేల పౌనుల[b] (రెండువేల మణుగులు) వెండిని వెచ్చించి మెసపొతేమియా (అరామ్నహరయీము) నుండి రథాలను, రథసారధులను కొన్నారు. వారింకా అరాములోని మయకా, సోబా నగరాల నుండి కూడ రథాలను, వాటిని తోలే వారిని సేకరించారు. 7 అమ్మోనీయులు ముప్పది రెండువేల రథాలను కొన్నారు. వారు మయకా రాజుకు, అతని సైన్యానికి కొంత సొమ్ము చెల్లించి వారి సహాయాన్ని కూడ అర్థించారు. మయకా రాజు, అతని సైనికులు వచ్చి మెదెబా పట్టణం వద్ద గుడారాలు వేశారు. అమ్మోనీయులు తమ పట్టణాల నుండి బయటకు వచ్చి యుద్ధానికి సిద్ధమయ్యారు.
8 అమ్మోనీయులు యుద్ధానికి సిద్ధమవుతున్నారని దావీదు విన్నాడు. అతను యోవాబును, ఇశ్రాయేలు సైన్యాన్నంతటినీ అమ్మోనీయులను ఎదుర్కోటానికి పంపాడు. 9 అమ్మోనీయులంతా బహిరంగంగా వచ్చి యుద్ధానికి సిద్ధంగా వున్నారు. వారు నగర ద్వారం వద్ద వున్నారు. వారికి సహాయంగా వచ్చిన రాజులు వారి సేనలతో బయట పొలాలలో దిగియుండిరి.
10 తనపై యుద్ధం చేయటానికి రెండు సైనిక కూటాలవారు సిద్ధంగా వున్నట్లు యోవాబు చూశాడు. ఒక వర్గం తనముందు, రెండవ వర్గం తన వెనుక వున్నాయి. అప్పుడు యోవాబు ఇశ్రాయేలు సైన్యంలో కాకలు తీరిన వారిని కొంతమందిని ఎంపిక చేశాడు. వారిని అరాము సైన్యంతో పోరాడటానికి పంపాడు. 11 యోవాబు మిగిలిన ఇశ్రాయేలు సైన్యాన్ని అబీషై అధీనంలో వుంచాడు. యోవాబు సోదరుడే అబీషై. ఆ సైనికులు అమ్మోనీయుల సైన్యంతో యుద్ధం చేయటానికి వెళ్లారు. 12 అబీషైతో యోవాబు ఇలా అన్నాడు: “అరాము సైన్యం గనుక నామీద పైచేయిగా వుంటే నీవు నాకు సహాయంగా రావాలి. ఒకవేళ అమ్మోనీయుల సైనికులు గనుక నీ శక్తికి మించివుంటే నేను నీకు సహాయంగా వస్తాను. 13 మన ప్రజల కొరకు, మన దేవుని నగరాల కొరకు పోరాడే ఈ తరుణంలో మనం చాలా ధైర్యంగా వుండాలి! యెహోవా ఏది మంచిదని తలుస్తాడో దానిని ఆయన చేయుగాక!”
14 యోవాబు, అతని సైనికులు కలిసి అరాము నుండి వచ్చిన సైన్యాన్ని ఎదుర్కొన్నారు. అరాము సైన్యం యోవాబు సైనికుల ధాటికి తట్టుకోలేక పారిపోయింది. 15 అరాము సైన్యం పారిపోవటం అమ్మోను సైనికులు చూసి, వారు కూడ పారిపోయారు. వారు అబీషైకి, అతని సైన్యానికి జడిసి పారిపోయారు. అమ్మోనీయులు తమ నగరంలోకి వెళ్లిపోయారు. యోవాబు యెరూషలేముకు తిరిగి వెళ్లాడు.
16 ఇశ్రాయేలు తమను ఓడించినట్లు అరాము నాయకులు అర్థం చేసుకున్నారు. యూఫ్రటీసు నదికి తూర్పున నివసిస్తున్న అరామీయులను సహాయంగా రమ్మని వారు కబురు పంపారు. అరాముకు చెందిన హదదెజెరు సైన్యానికి షోపకు అధిపతి. అరాములో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన సైన్యాలను కూడ షోపకు నడిపించాడు.
17 అరాము ప్రజలు యుద్ధ ప్రయత్నాలు చేస్తున్నారనే వార్త దావీదు విన్నాడు. అందువల్ల దావీదు ఇశ్రాయేలు ప్రజలందరినీ సమీకరించాడు. దావీదు వారిని యోర్దాను నదిని దాటించాడు. వారు అరామీయులకు ఎదురుపడి నిలబడ్డారు. దావీదు తన సైన్యాన్ని యుద్ధానికి సమాయత్తపరచి అరామీయులతో తలపడ్డాడు. 18 ఇశ్రాయేలీయుల నుండి అరామీయులు పారిపోయారు. దావీదు, అతని సైనికులు కలిసి ఏడువేల మంది అరాము రథసారధులను, నలుబదివేల మంది అరాము సైనికులను చంపివేశారు.
19 ఇశ్రాయేలీయులు తమను ఓడించారని హదదెజెరు సైన్యాధికారులు తెలుసుకొని, దావీదుతో సంధి చేసుకొన్నారు. వారు దావీదుకు సేవకులయ్యారు. అటు తరువాత అరామీయులు ఎన్నడూ అమ్మోనీయులకు సహాయం చేయలేదు.
అమ్మోనీయులను యోవాబు నాశనం చేయటం
20 ఆ తరువాత సంవత్సరం (వసంత కాలం) లో యోవాబు ఇశ్రాయేలు సైన్యాన్ని యుద్ధానికి నడిపాడు. సంవత్సరంలో అది రాజులు దండ యాత్రలు చేయటానికి అనువైన సమయం. కాని దావీదు మాత్రం యెరూషలేములోనే వున్నాడు. ఇంతలో ఇశ్రాయేలు సైన్యం అమ్మోను రాజ్యం మీదికి దండెత్తి, దానిని నాశనం చేసింది. పిమ్మట వారు రబ్బా నగరానికి వెళ్లారు. వారు నగరాన్ని చుట్టుముట్టి, ప్రజల రాకపోకలు నిలిపివేసారు. యోవాబు, ఇశ్రాయేలు సైనికులు రబ్బా నగరం నాశనమయ్యే వరకు దానిపై దాడిచేసారు.
2 తరువాత దావీదు వచ్చి ఆ రాజు తలపై కిరీటాన్ని తీసుకున్నాడు. ఆ బంగారు కిరీటం డెబ్బై ఐదు పౌనుల (రెండు మణుగుల) బరువుంది. కిరీటంలో విలువైన రత్నాలు పొదగబడ్డాయి. ఆ కిరీటం దావీదు తలపై పెట్టబడింది. రబ్బా నగరం నుండి దావీదు అనేక విలువైన వస్తు సామగ్రిని తెప్పించాడు. 3 రబ్బా నగర వాసులను దావీదు తీసుకొనివచ్చి వారిచే రంపాలతోను, ఇనుప సమ్మెటలతోను, గొడ్డళ్లతోను బలవంతంగా పని చేయించాడు. ప్రతి అమ్మోనీయుల నగరంలోను దావీదు ఈ విధంగానే చేసాడు. తరువాత దావీదు, అతని సైన్యం యెరూషలేముకు తిరిగి వెళ్లారు.
ఫిలిష్తీ యోధుల సంహారం
4 ఇదంతా అయిన పిమ్మట ఇశ్రాయేలు ప్రజలు గెజెరు పట్టణం వద్ద ఫిలిష్తీయులతో తలపడ్డారు. ఈసారి హుషాతీయుడైన సిబ్బెకై సిప్పయి అను వానిని చంపివేసాడు. సిప్పయి ఫిలిష్తీ యోధుల సంతతివాడు. దానితో ఫిలిష్తీయులు ఇశ్రాయేలు వారికి బానిసలయ్యారు.
5 ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల పైకి మరోసారి యుద్ధానికి వెళ్లారు. యాయీరు కుమారుడైన ఎల్హానాను అనేవాడు లహ్మీని చంపాడు. లహ్మీ అనేవాడు గొల్యాతు సోదరుడు. గొల్యాతు గాతు పట్టణానికి చెందినవాడు. లహ్మీ చేతిలోని ఈటె చాలా పెద్దది. బరువైనది. అది నేతగాని మగ్గం దోనెవలె వుంటుంది.
6 గాతు పట్టణం వద్ద ఫిలిష్తీయులతో ఇశ్రాయేలు వారు మరొక యుద్ధం చేశారు. ఈ పట్టణంలో చాలా పొడుగైన మనిషి ఒకడున్నాడు. వాని కాళ్లకు, చేతులకు ఇరవై నాలుగు వేళ్లున్నాయి. వాని ప్రతి చేతికి, ప్రతి కాలికి ఆరేసి వేళ్లు చొప్పున వున్నాయి. అతడు కూడ ఫిలిష్తీయుల రెఫాయిము సంతానంలోనివాడే. 7 ఆ మనుష్యుడు ఇశ్రాయేలు వారిని చూచి ఎగతాళి చేసినప్పుడు, యోనాతాను వానిని చంపివేశాడు. యోనాతాను తండ్రి పేరు షిమ్యా. షిమ్యా దావీదుకు సోదరుడు.
8 ఆ ఫిలిష్తీయులంతా గాతు పట్టణానికి చెందిన రెఫాయిము సంతానమే. దావీదు, అతని సేవకులు కలిసి ఆ రాక్షసులనందరినీ చంపివేసారు.
ఇశ్రాయేలీయులను లెక్కించిన దావీదు పాపం
21 ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా సాతాను పనిచేస్తూవున్నాడు. ఇశ్రాయేలీయుల జనాభా లెక్కలు తీసేటందుకు అతడు దావీదును ప్రోత్సహించాడు.[c] 2 కావున దావీదు యోవాబును, ఇతర ప్రజా నాయకులను పిలిచి ఇశ్రాయేలు ప్రజలందరినీ లెక్కపెట్టి ఎంతమంది వున్నారో చెప్పమన్నాడు. “దేశంలో బెయేర్షెబా నుండి దాను పట్టణం వరకు ప్రతి ఒక్కరినీ లెక్కపెట్టి నాకు చెప్పండి. అప్పుడు దేశ జనాభా వివరాలు నాకు తెలుస్తాయి” అని అన్నాడు.
3 కాని యోవాబు ఇలా సమాధానమిచ్చాడు: “యెహోవా తన రాజ్యాన్ని వందరెట్లు అభివృద్ధి చేయుగాక! నా ఏలినవాడా, మహారాజా! ఇశ్రాయేలు ప్రజలంతా నీ సేవకులు. ఈ పని నీవెందుకు చేయదలిచావు? దీనివల్ల నీవు ఇశ్రాయేలు ప్రజలందరినీ పాపం చేసిన నేరస్థులుగా చిత్రిస్తున్నావు!”
4 కాని రాజైన దావీదు మొండివైఖరి దాల్చాడు. రాజు చెప్పినట్లు యోవాబు చేయక తప్పలేదు. అందువల్ల యోవాబు ఇశ్రాయేలు దేశంలో ప్రజలను లెక్కిస్తూ నలుమూలలా తిరిగాడు. తరువాత యోవాబు యెరూషలేముకు తిరిగి వచ్చి 5 దేశంలో ఎంత జనాభా వున్నదీ దావీదుకు చెప్పాడు. ఇశ్రాయేలులో కత్తి పట్టగల యోధులు పదకొండు లక్షల మంది వున్నారు. యూదాలో కత్తి పట్టగల శూరులు నాలుగు లక్షల డెబ్బది వేలమంది వున్నారు. 6 లేవి, బెన్యామీను వంశీయులను మాత్రం యోవాబు లెక్కించలేదు. రాజైన దావీదు ఆజ్ఞ తనకు ఇష్టం లేనిదైనందుననే యోవాబు ఆ వంశీయులను గణించలేదు. 7 దేవుని దృష్టిలో దావీదు గొప్ప తప్పిదం చేశాడు. అందువల్ల దేవుడు ఇశ్రాయేలును శిక్షించాడు.
ఇశ్రాయేలును దేవుడు శిక్షించటం
8 పిమ్మట దేవునితో దావీదు ఇలా విన్నవించుకున్నాడు: “నేను చాలా తెలివితక్కువ పనిచేశాను. ఇశ్రాయేలు జనాభా లెక్కలు తీయించి నేను ఒక మహాపాపం చేశాను. ఇప్పుడు నీ సేవకుడనైన నా తప్పు మన్నించి నా పాపాన్ని తొలగించమని వేడుకుంటున్నాను.”
9-10 గాదు ఒక దీర్ఘదర్శి (ప్రవక్త), దావీదుకు భవిష్యత్తును చెప్పే మార్గదర్శకుడు. ఒకనాడు గాదుతో యెహోవా ఇలా అన్నాడు: “నీవు వెళ్లి దావీదుకు ఇలా చెప్పుము: ‘యెహోవా ఈ విధంగా తెలియజేస్తున్నాడు: నేను నీకు మూడు అవకాశాలు సూచిస్తున్నాను. వాటిలో నీవు ఒక దానిని ఎంపిక చేయాలి. అప్పుడు నీవు కోరిన విధంగా నిన్ను శిక్షిస్తాను.’”
11-12 ప్రవక్తయగు గాదు తరువాత దావీదు వద్దకు వెళ్లి ఈ విధంగా చెప్పాడు: “యెహోవా సెలవిచ్చునదేమనగా, ‘దావీదూ, నీకు ఏ శిక్ష కావాలో నీవే కోరుకో మూడు సంవత్సరాల కరువు పరిస్థితి, లేక నీ శత్రువులు కత్తిపట్టి మిమ్మల్ని తరుముకుంటూ రాగా మూడు నెలల పాటు మీరు వారి నుండి పారిపోవుట లేక యెహోవా మిమ్మల్ని మూడు రోజులు శిక్షకు గురిచేయుట. అనగా ఈ మూడు రోజుల్లో దేశమంతా భయంకర వ్యాధులు ప్రబలుతాయి. యెహోవా దూత దేశం నలుమూలలా తిరుగుతూ ప్రజానాశనం చేస్తాడు’. దావీదూ, దేవుడు ఇప్పుడు నన్ను పంపియున్నాడు. కావున దేవునికి నేను ఏమి సమాధానం చెప్పాలో నిర్ణయించి నీవు నాకు తప్పక తెలియజేయాలి.”
13 అందుకు ప్రవక్తయగు గాదుతో దావీదు ఇలా అన్నాడు: “నేను ఆపదలో వున్నాను. నాకు శిక్ష విధించటానికి వేరొక మనుష్యుని నిర్ణయం నాకు అక్కరలేదు. యెహోవా దయామయుడు. కావున నన్ను ఎలా శిక్షించాలో యెహోవానే నిర్ణయించనీయుము.”
14 అప్పుడు యెహోవా ఇశ్రాయేలంతా భయంకర వ్యాధులు సోకేలా చేశాడు. దానితో డెబ్బయి వేల మంది ప్రజలు చనిపోయారు. 15 యెరూషలేమును నాశనం చేయటానికి దేవుడు ఒక దేవదూతను పంపాడు. ఆ దేవదూత యెరూషలేమును నాశనం చేయ మొదలు పెట్టినప్పుడు యెహోవా చూసి బాధపడ్డాడు. అందువల్ల ఇశ్రాయేలును నాశనం చేయకూడదని ఆయన అనుకున్నాడు. ఇశ్రాయేలును నాశనం చేస్తున్న దేవదూతతో యెహోవా. “అది చాలు! ఆపివేయి” అని అన్నాడు. యెహోవాదూత యెబూసీయుడగు[d] ఒర్నాను నూర్పిడి కళ్లం వద్ద నిలబడివున్నాడు.
16 దావీదు తలఎత్తి చూడగా యెహోవాదూత ఆకాశంలో కన్పించాడు. దేవదూత తన ఖడ్గాన్ని యెరూషలేము పైకి చాపివున్నాడు. అప్పుడు దావీదు, తదితర పెద్దలు సాష్టాంగ నమస్కారం చేశారు. దావీదు, ఇతర పెద్దలు తమ సంతాపాన్ని తెలియజేసే ప్రత్యేక దుస్తులు ధరించారు. 17 దావీదు యెహోవాతో ఇలా విన్నవించుకున్నాడు: “పాపం చేసిన వాణ్ణి నేను! జనాభా లెక్కలు తీయమని నేనే ఆజ్ఞాపించాను! నేను పొరపాటు చేశాను! కాని ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏమి నేరం చేశారు? నా దేవుడైన యెహోవా, నన్ను, నా కుటుంబాన్ని శిక్షించుము! నీ ప్రజలను నాశనం చేస్తున్న మహావ్యాధులను అరికట్టుము!”
18 అప్పుడు యెహోవాదూత ప్రవక్తయగు గాదుతో ఇలా అన్నాడు: “యెహోవాను ఆరాధించటానికి ఒక బలిపీఠం నిర్మించమని దావీదుకు చెప్పుము. యెబూసీయుడగు ఒర్నాను నూర్పిడి కళ్లం వద్దనే దావీదు ఆ బలిపీఠాన్ని నిర్మించాలి.” 19 గాదు ఆ విషయాలను దావీదుకు తెలియజేశాడు. దావీదు ఒర్నాను నూర్పిడి కళ్లం వద్దకు వెళ్లాడు.
20 ఒర్నాను గోధుమ పోతపోస్తున్నాడు. అతను తిరిగి చూసి యెహోవా దూతను గమనించాడు. ఒర్నాను నలుగురు కుమారులూ పారిపోయి దాక్కున్నారు. 21 దావీదు ఒర్నాను వద్దకు వస్తున్నాడు. ఒర్నాను తన కళ్లం వదిలి దావీదు వద్దకు వెళ్లి అతని ముందు సాష్టాంగపడ్డాడు.
22 దావీదు ఒర్నానుతో, “నీ నూర్పిడి కళ్లాన్ని నాకివ్వు. ఈ స్థలంలో యెహోవాని ఆరాధించటానికి నేనొక బలిపీఠాన్ని నిర్మిస్తాను. ఈ కళ్లాన్ని పూర్తి ధరకు నాకు అమ్మివేయి. అప్పుడు ఈ భయంకర వ్యాధులు ఆగిపోతాయి” అని చెప్పాడు.
23 ఒర్నాను దావీదుకు ఇలా సమాధానమిచ్చాడు: “ఈ నూర్పిడి కళ్లాన్ని తీసుకొనుము! నీవు నా ఏలినవాడవైన రాజువు. నీవు కోరిన విధంగా చేయుము. దహన బలులుగా సమర్పించటానికి నేను నీకు పశువులను కూడ ఇస్తాను. పీఠం మీద అగ్ని వెలిగించటానికి కళ్లంలో వేసే బల్ల చెక్కలను కూడ ఇస్తాను. ధాన్యార్పణను చెల్లించటానికి నేను గోధుమలు కూడ ఇస్తాను. నేను ఇవన్నీ నీకు ఇస్తాను!”
24 కాని దావీదు ఒర్నానుతో ఇలా అన్నాడు: “వద్దు నేను పూర్తి వెలయిచ్చే దీనిని కొనాలి. నీకు చెందినదేదీ నేను ఉచితంగా తీసుకొని యెహోవాకి ఇవ్వను. నాకు ఊరకనే వచ్చిన దానినేదీ నేను యెహోవాకి అర్పణగా చెల్లించను.”
25 కావున దావీదు ఒర్నానుకు సుమారు ఆరువందల తులాల (పదిహేను పౌనులు) బంగారం ఇచ్చి ఆ స్థలం తీసుకున్నాడు. 26 యెహోవాను ఆరాధించటానికి అక్కడ దావీదు ఒక బలిపీఠం కట్టించాడు. దావీదు దహన బలులు, సమాధాన బలులు సమర్పించాడు. దావీదు యెహోవాని ప్రార్థించాడు. ఆకాశం నుండి అగ్నిని క్రిందికి పంపి యెహోవా దావీదు ప్రార్థనను ఆలకించాడు. దహనబలులు ఇచ్చే పీఠం మీదికి అగ్ని దిగింది. 27 అప్పుడు తన కత్తిని ఒరలో పెట్టుమని యెహోవా తన దూతకు ఆజ్ఞాపించాడు.
28 యెహోవా ఒర్నాను కళ్లంలో తన ప్రార్థన ఆలకించాడని దావీదు తెలుసుకొని ఆయనకు బలులు సమర్పించాడు. 29 (పవిత్ర గుడారం, దహనబలుల బలిపీఠం గిబియోనులో ఎత్తైన స్థలంలో వున్నాయి. ఇశ్రాయేలీయులు ఎడారిలో వున్నప్పుడు మోషే ఈ పవిత్ర గుడారాన్ని తయారు చేశాడు. 30 దావీదు భయపడిన కారణంగా అతను పవిత్ర గుడారంలోకి వెళ్లి దేవునితో మాట్లాడలేక పోయాడు. దావీదు యెహోవా దూతకు, అతని కత్తికి భయపడ్డాడు.)
8 యేసు మళ్ళీ ఒలీవల చెట్ల కొండ మీదికి వెళ్ళాడు. 2 సూర్యోదయం అవుతుండగా ఆయన మళ్ళీ మందిరంలో కనిపించాడు. అక్కడ ప్రజలు ఆయన చుట్టూ సమావేశమయ్యారు. వాళ్ళకు బోధించటానికి ఆయన కూర్చున్నాడు.
3 వ్యభిచారం చేస్తుండగా పట్టుబడిన స్త్రీని శాస్త్రులు, పరిసయ్యులు కలిసి అక్కడికి తీసుకొని వచ్చారు. ఆమెను అందరి ముందు నిలుచో బెట్టి 4 యేసుతో, “బోధకుడా! ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టుబడింది. 5 మోషే, ధర్మశాస్త్రంలో యిలాంటి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపుమని ఆజ్ఞాపించాడు. మీరేమంటారు?” అని అడిగారు.
6 ఆయన్ని పరీక్షించటానికి ఈ ప్రశ్న వేసారు. ఆయన్ని శిక్షించటానికి కారణం దొరుకుతుందని వాళ్ళ ఉద్దేశ్యం. కాని యేసు వంగి, నేలపై తన వ్రేలితో వ్రాయటం మొదలు పెట్టాడు. 7 వాళ్ళు ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. యేసు తలెత్తి చూస్తూ, “మీలో పాపం చెయ్యనివాడు ఎవరైనా ఉంటే, అతడు ఆమెపై మొదటిరాయి విసర వచ్చు!” అని అన్నాడు. 8 ఇలా అన్నాక, మళ్ళీ క్రిందికి వంగి నేలపై వ్రాస్తూ ఉన్నాడు.
9 ఇది విన్న వాళ్ళు ఒక్కొక్కరు అక్కడి నుండి వెళ్ళటం మొదలుపెట్టారు. మొదట వృద్ధులు వెళ్ళి పోయారు. చివరకు అక్కడ నిలుచున్న స్త్రీతో యేసు మాత్రం మిగిలిపోయ్యాడు. 10 యేసు తలెత్తి చూస్తూ, “వాళ్ళెక్కడమ్మా! నిన్నెవ్వరూ శిక్షించ లేదా?” అని అడిగాడు.
11 “లేదు ప్రభూ!” అని ఆమె అన్నది.
“నేను కూడా శిక్ష విధించను. వెళ్ళు! ఇకనుండి పాపం చెయ్యకు!” అని అన్నాడు.
యేసు ఈ ప్రపంచానికి వెలుగు
12 యేసు మరొక సమయంలో ప్రజలకు బోధించినప్పుడు, “నేను ప్రపంచానికి వెలుగును. నన్ను అనుసరించినవాళ్ళు అంధకారంలో నడవరు. వాళ్ళకు జీవితం యొక్క వెలుగు లభిస్తుంది” అని అన్నాడు.
13 పరిసయ్యులు సవాలు చేస్తూ, “నీ పక్షాన నీవు సాక్ష్యం చెప్పుకుంటున్నావు. నీ సాక్ష్యం పనికి రాదు” అని అన్నారు.
14 యేసు సమాధానం చెబుతూ, “నేను నా పక్షాన సాక్ష్యం చెబితే ఆ సాక్ష్యం నమ్మవచ్చు. ఎందుకంటే, నేనెక్కడినుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. కాని నేను ఎక్కడినుండి వచ్చానో ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలియదు. 15 మీరు అందరి మానవులవలె తీర్పుచెబుతారు. నేను ఎవరిపైనా తీర్పు చెప్పను. 16 కాని నేను ఒక వేళ తీర్పు చెబితే నా తీర్పు సత్యసమ్మతమైనది. ఎందుకంటే, నేను ఒంటరిగా తీర్పు చెప్పటం లేదు. నన్ను పంపిన నా తండ్రి నాతో ఉన్నాడు. 17 ఇద్దరు కలసి సాక్ష్యం చెబితే ఆ సాక్ష్యాన్ని నమ్మవచ్చని మీ ధర్మశాస్త్రంలో వ్రాసారు. 18 నేను నా పక్షాన సాక్ష్యం చెబుతున్నాను. నా యింకొక సాక్షి నన్ను పంపిన ఆ తండ్రి” అని అన్నాడు.
19 అప్పుడు వాళ్ళు, “నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు?” అని అడిగారు.
యేసు, “మీకు నేను ఎవరినో, నా తండ్రి ఎవరో తెలియదు. నేనెవరినో తెలిస్తే, నా తండ్రి ఎవరో మీకు తెలుస్తుంది” అని సమాధానం చెప్పాడు. 20 ఆయనీ విషయాలన్నీ మందిరంలో కానుకలు వేసే చోట నిలుచొని బోధిస్తూ మాట్లాడాడు. అయినా ఆయన్నెవరూ బంధించలేదు; కారణం? ఆయన ఘడియ యింకా రాలేదు!
కొందరు యూదులు యేసును అపార్థము చేసికొనటం
21 యేసు మరొకసారి వాళ్ళతో, “నేను వెళ్తున్నాను. మీరు నా కోసం వెతుకుతారు. కాని నేను వెళ్ళేచోటికి మీరు రాలేరు. ఎందుకంటే మీరు మీ పాపాల్లో మరణిస్తారు” అని అన్నాడు.
22 యూదులు, “ఆత్మహత్య చేసుకొంటాడా? అందుకేనా, ‘నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు’ అని అంటున్నాడు” అని అన్నారు.
23 యేసు, “మీరు యిక్కడి వాళ్ళు. నేను పైనుండి వచ్చిన వాణ్ణి. మీరు ఈలోకపు వాళ్ళు. నేను ఈ లోకపు వాణ్ణి కాదు. 24 మీరు మీ పాపాలతో మరణిస్తారు” అని అన్నాడు.
25 వాళ్ళు, “అది సరే కాని, నీవెవరు?” అని అడిగారు.
యేసు, “నేను యింతవరకు ఎవర్నని చెబుతున్నానో ఆయన్నే” అని అన్నాడు. 26 “నేను మీ తీర్పు విషయంలో ఎన్నో సంగతులు చెప్పగలను. కాని దానికి మారుగా నన్ను పంపిన వాని నుండి విన్న వాటిని మాత్రమే ప్రపంచానికి చెబుతున్నాను. ఆయన నమ్మదగినవాడు” అని అన్నాడు.
27 ఆయన తన తండ్రిని గురించి చెబుతున్నాడు. వాళ్ళు అర్థం చేసుకోలేదు.
© 1997 Bible League International