Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 దినవృత్తాంతములు 4-6

ఆలయ సామగ్రి

ఒక బలిపీఠాన్ని చేయటానికి సొలొమోను కంచును వినియోగించాడు. ఆ కంచు పీఠం ముప్పై అడుగుల పొడవు, ముప్పై అడుగుల వెడల్పు, పద్దెనిమిది అడుగుల ఎత్తు గలిగి వుంది. కరిగిన కంచును వినియోగించి సొలొమోను ఒక పెద్ద కోనేరును[a] (సముద్రం) చేయించాడు. ఆ కోనేరు (సముద్రం) గుండ్రని ఆకారంలో వుంది. దాని వ్యాసం పద్దెనిమిది అడుగులు. దాని ఎత్తు ఏడున్నర అడుగులు. దాని చుట్టు కొలత నలుబదియైదు అడుగులు. కోనేరు (సముద్రం) క్రింది అంచు చుట్టూ పద్దెనిమిది అడుగుల మేరకు కంచుగిత్తల బొమ్మలున్నాయి. ఆ గిత్తలు రెండు వరుసల్లో కోనేరు (సముద్రం) ను పోతపోసినప్పుడే పోతలో వచ్చాయి. ఆ పెద్ద కోనేరు (సముద్రం) పన్నెండు పెద్ద గిత్తల విగ్రహాలపై నిలపబడింది. మూడు గిత్తలు ఉత్తరానికి, మూడు దక్షిణానికి, మూడు తూర్పుకు, మూడు గిత్తలు పడమటి వైపుకు తిరిగి వున్నాయి. ఆ పెద్ద కోనేరు (సముద్రం) ఈ గిత్తల మీద నిలపబడింది. ఆ గిత్తలన్నీ వాటి వెనుక భాగాల క్రింద మధ్యలో ఒకదానికొకటి ఆనుకొని వుండి నిలబడి వున్నాయి. కంచు కోనేరు (సముద్రపు) మందం మూడు అంగుళాలు. కోనేరు సముద్రపు అంచు గిన్నె అంచులాగా వుంది. అంచు తామర పుష్పంలా అగపడుతుంది. దానిలో పదిహేడు వేల ఐదువందల గేలనుల (ముప్పై పుట్లు) నీరు పడుతుంది.

సొలొమోను పది వెడల్పైన తొట్టెలను నిర్మించాడు. వాటిలో ఐదింటిని కోనేరు (సముద్రం) సముద్రంకు కుడి పక్కన, ఐదింటిని ఎడమ ప్రక్కన వుంచాడు. ఈ తొట్లను దహన బలులుగా అర్పించే జంతువులను కడగటానికి వినియోగిస్తారు. కాని పెద్ద కోనేరు (సముద్రం) ను మాత్రం యాజకులు తాము బలులు యిచ్చేముందు పవిత్ర స్నానాలు చేయటానికి వినియోగించేవారు.

సొలొమోను పది బంగారపు దీపస్తంభాలు చేయించాడు. ఈ దీపస్తంభాలు చేయటానికి, మునుపటి దీపస్తంభాల నమూనాలనే సొలొమోను అనుకరించాడు. ఈ దీపస్తంభాలను అతడు ఆలయంలో వుంచాడు. కుడిప్రక్క ఐదు, ఎడమప్రక్క ఐదు దీపస్తంభాలను వుంచాడు. సొలొమోను పది బల్లలు చేయించి ఆలయంలో వుంచాడు. ఆలయంలో ఐదు బల్లలు కుడిప్రక్కన, ఐదు బల్లలు ఎడమప్రక్కన వుంచాడు. సొలొమోను వంద తొట్లు చేయించటానికి బంగారం వినియోగించాడు. ఆలయం వెలుపల సొలొమోను యాజకుల పురాన్ని, పెద్ద ఆవరణను నిర్మించి వాటికి వెలుపలి ద్వారాలను ఏర్పాటు చేశాడు. ఆ ద్వారాల తలుపులకు కంచు రేకులు తాపడం చేయించాడు. 10 పిమ్మట పెద్ద కంచు కోనేరు (సముద్రం) ను ఆలయంకి కుడి పక్కగా ఆగ్నేయ (తూర్పు-దక్షిణాల మూల) భాగాన వుంచాడు.

11 హూరాము కుండలను, పారలను, గిన్నెలను తయారు చేశాడు. పిమ్మట హూరాము రాజైన సొలొమోను తలపెట్టిన ఆలయంలో తన పనంతా పూర్తి చేశాడు. 12 హూరాము మరి రెండు స్తంభాలు, వాటిపైన వెడల్పు పళ్ళెములను చేశాడు. ఆ స్తంభాలపైనున్న వెడల్పైన పళ్లెములను అలంకారంగా కప్పటానికి రెండు వలల్లాంటి అల్లికలను కూడ చేశాడు. 13 ఆ రెండు అల్లికల మీద వేలాడదీయటానికి నాలుగు వందల దానిమ్మకాయల ప్రతిమలు కూడా చేశాడు. అలంకరణగా రెండు వరుసల దానిమ్మకాయల బొమ్మలు చుట్టబడ్డాయి. స్తంభాల మీదనున్న పెద్ద పళ్ళెములను వలలు కప్పివున్నాయి. 14 హూరాము తొట్లను, వాటి కింది కుదురులను కూడా చేశాడు. 15 హూరాము కంచు కోనేరును (సముద్రం), దాని కింది పన్నెండు గిత్తలను చేశాడు. 16 హూరాము పాత్రలను, పారలను, శూలాలను, మరియు రాజైన సొలొమోను నిర్మిస్తున్న ఆలయానికి కావలసిన తదితర వస్తువులను చేశాడు. ఈ వస్తుసామగ్రంతా మెరుగు దిద్దిన కంచుతో చేయబడింది. 17 రాజైన సొలొమోను ముందుగా ఈ వస్తువులను మట్టి మూసలలో పోతపోయించాడు. ఈ మూసలు యోర్దానులోయలో సుక్కోతు, జెరేదాతను పట్టణాల మధ్య తయారు చేయబడ్డాయి. 18 సొలొమోను చేయించిన ఈ రకమైన వస్తుసామగ్రి ఎంత వుందనగా వాటికి పట్టిన కంచును తూచి లెక్క గట్టటానికి ఎవ్వరూ ప్రయత్నించియుండలేదు.

19 సొలొమోను ఆలయానికి కావలసిన సామాన్లు కూడా చేయించాడు. సొలొమోను బంగారు బలిపీఠం చేయించాడు. దైవ సన్నిధిలో నైవేద్యం వుంచాటానికి తగిన బల్లలు చేయించాడు. 20 సొలొమోను దీపస్తంభాలు, దీపాలు మేలిమి బంగారంతో చేయించాడు. అతి పవిత్ర స్థలం ముందు ఈ దీపాలు నిర్ణయించిన ఒక క్రమపద్ధతిలో వెలుగుతాయి. 21 ప్రమిదలు నిలిపే పుష్పాలవంటి కుదుర్లు, ప్రమిదలు, పట్టుకారులు, అన్నీ మేలిమి బంగారంతో సొలొమోను చేయించాడు. 22 వత్తులు ఎగదోయు పని ముట్లను, తొట్లను, గిన్నెలను, సాంబ్రాణి పొగవేయు ధూప కలశాలు చేయటానికి కూడా సొలొమోను శుద్ధ బంగారం వినియోగించాడు. ఆలయ ద్వారాలకు, అతి పవిత్ర స్థలం తలుపులకు, ఆలయం తలుపులకు సొలొమోను శుద్ధ బంగారం వినియోగించాడు.

దానితో సొలొమోను యెహోవా ఆలయ నిర్మాణానికి తలపెట్టిన పనంతా పూర్తయ్యంది. తన తండ్రి దావీదు ఆలయానికిచ్చిన వస్తువులన్నిటినీ సొలొమోను ఆలయంలోకి తెచ్చాడు. వెండి బంగారాలతో చేసిన వస్తువులను, తదితర సామానులన్నిటినీ సొలొమోను లోనికి తెచ్చాడు. ఆ వస్తువులన్నిటినీ సొలొమోను ఆలయపు ఖజానాలో భద్రపర్చాడు.

పవిత్ర పెట్టె ఆలయానికి తేబడటం

ఇశ్రాయేలు పెద్దలందరిని, వంశనాయకులందరినీ ఇశ్రాయేలులో వున్న వంశపెద్దలందరినీ సొలొమోను పిలిపించాడు. వారందరినీ యెరూషలేములో సమావేశ పర్చాడు. యెహోవా ఒడంబడిక పెట్టెను దావీదు నగరం నుండి తెప్పించే ఏర్పాట్లు చేసేటందుకు సొలొమోను ఈ సమావేశం ఏర్పాటు చేశాడు. దావీదు నగరానికే సీయోను అని పేరు. ఈ సందర్భంగా ఏర్పాటైన ఒక పర్ణశాల పండుగలో ప్రజలంతా రాజైన సొలొమోనును కలిశారు. ఆ సంవత్సరం ఏడవ నెలలో ఈ విందు ఏర్పాటు చేయబడింది.

ఇశ్రాయేలు పెద్దలంతా వచ్చిన పిమ్మట లేవీయులు ఒడంబడిక పెట్టెను లేవదీశారు. పిమ్మట యాజకులు, లేవీయులు కలిసి ఒడంబడిక పెట్టెను యెరూషలేముకు మోశారు. యాజకులు, లేవీయులు సన్నిధి గుడారాన్ని, దానిలో వున్న పవిత్ర వస్తువులను యెరూషలేముకు తెచ్చారు. రాజైన సొలొమోను, ఇశ్రాయేలు ప్రజలు ఒడంబడిక పెట్టెముందు గుమికూడారు. రాజైన సొలొమోను, ఇశ్రాయేలీయులు గొర్రెలను, గిత్తలను, బలియిచ్చారు. బలి యిచ్చిన గొర్రెలు, గిత్త దూడలు ఎవ్వరూ లెక్కపెట్టలేనన్ని వున్నాయి. తరువాత యాజకులు యెహోవా ఒడంబడిక పెట్టెను, దానికై నిర్దేశించిన స్థలానికి తీసుకొని వచ్చారు. ఆ స్థలమే ఆలయంలోని అతి పవిత్ర స్థలం. ఒడంబడిక పెట్టె అతి పవిత్ర స్థలంలో కెరూబుల రెక్కల క్రింద వుంచారు. ఒడంబడిక పెట్టె వుంచబడిన స్థలంమీద కెరూబుల రెక్కలు విప్పివున్నాయి. కెరూబులు ఒడంబడిక పెట్టెమీద, దానిని మోసే కర్రమీద నిలబడివున్నాయి. అతి పవిత్ర స్థలం ముందు నుంచి చూస్తే వాటి చివరలు కనబడేటంత పొడవుగా పెట్టెను మోసే కర్రలు వున్నాయి. కాని ఆలయం బయట నుంచి ఎవ్వరూ ఆ కర్రలను చూడలేరు. ఈనాటికీ ఆ కర్రలు అక్కడ వున్నాయి. 10 ఒడంబడిక పెట్టెలో రెండు శిలాఫలకాలు తప్ప మరేమీ లేవు. (అవి దేవుని పది ఆజ్ఞలున్న ఫలకాలు). హూరేబు పర్వతం మీద ఆ రెండు ఫలకాలను మోషే ఒడంబడిక పెట్టెలో వుంచాడు. ఇశ్రాయేలు ప్రజలతో యెహోవా ఒక ఒడంబడిక చేసికొన్న చోటే ఈ హోరేబు. ఇది ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుండి స్వతంత్రులై బయటకు వచ్చిన పిమ్మట జరిగింది.

11 పిమ్మట అతి పవిత్ర స్థలంలోనికి వెళ్లిన యాజకులంతా బయటకు వచ్చారు. వారంతా శుభ్రంగా వున్నారు. అప్పట్లో వారు యాజకులలో ఏ వర్గానికి చెందిన వారు అన్నది ముఖ్యంగాదు. వారంతా అతి పవిత్ర స్థలంలో నుంచి బయటికి వచ్చి తమకు తాము పరిశుద్ధులైనారు. 12 బలిపీఠానికి తూర్పు దిశలో లేవీయులకు చెందిన గాయకులంతా నిలబడ్డారు. ఆసాపు, హేమాను, యెదూతూను వర్గాలకు చెందిన గాయక బృందాల వారంతా అక్కడ వున్నారు. వారి కుమారులు, బంధువులు కూడా అక్కడ వున్నారు. లేవీ గాయకులంతా సన్నని నారతో నేసిన తెల్లని వస్త్రాలు ధరించారు. వారి చేతుల్లో పెద్ద పెద్ద తాళాలు, తంబురలు, సితారలు వున్నాయి. లేవీ గాయకులతో పాటు నూటఇరవై మంది యాజకులున్నారు. ఆ నూట ఇరవై మంది యాజకులు బూరలు ఊదారు. 13 బూరలు ఊదిన వారు, పాటలు పాడినవారు, సొంపుగా ఒక్క మనిషివలె ఊది, పాడారు. వారు యెహోవాకి స్తోత్రం చేసినప్పుడు కృతజ్ఞతలు పలికినప్పుడు ఏక కంఠంగా వినిపించింది. బూరలతోను, తాళాలతోను, ఇతర వాద్య విశేషాలతోను వారు పెద్ద శబ్దం వచ్చేలా చేశారు. వారు యిలా పాడారు:

“ప్రభువు మంచివాడు,
    దేవుని కరుణ శాశ్వత మైనది!”

అటు తర్వాత ఆలయాన్ని ఒక మేఘం ఆవరించింది. 14 ఆ మేఘంవల్ల యాజకులు తమ సేవా కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు. దానికి కారణమేమనగా యెహోవా యొక్క మహిమ ఆలయాన్ని నింపివేసింది.

తరువాత సొలొమోను యిలా అన్నాడు:

“యెహోవా, నల్లని మేఘంలో
    నివసిస్తానని అన్నాడు.
ఓ ప్రభూ, నీ కొరకు ఒక ఆలయాన్ని నిర్మించాను. అది ఒక ఉన్నతమైన ఆలయం.
    శాశ్వతంగా నీవు నివసించటానికి అది నిలయం!”

సొలొమోను ప్రసంగం

సొలొమోను వెనుదిరిగి తన ముందు నిలబడిఉన్న ప్రజలందరనీ దీవించాడు. సొలొమోను యీలా అన్నాడు:

“ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం చేయండి! నా తండ్రి దావీదుకు తానేమి చేస్తానని వాగ్దానం చేశాడో, యెహోవా అదంతా నెరవేర్చినాడు. యెహోవా దేవుడు యిలా చెప్పియున్నాడు: ‘నా ప్రజలను ఈజిప్టు నుండి తీసుకొని వచ్చినప్పటినుండి ఇశ్రాయేలు వంశాలవారున్న ఏ నగరాన్నీ నాకు ఒక ఆలయాన్ని కట్టించటానికి నేను కోరుకోలేదు. నా ప్రజలైన ఇశ్రాయేలీయులను నడిపించటానికి నేను ఏ వ్యక్తినీ నాయకునిగా ఎంపిక చేయలేదు. కాని ఇప్పుడు నా పేరు మీద యెరూషలేమును ఎన్నుకున్నాను. పైగా నా ప్రజలైన ఇశ్రాయేలీయులను నడిపించటానికి దావీదును ఎంపిక చేశాను.’

“ఇశ్రాయేలు దేవుడగు యెహోవాకు నా తండ్రియగు దావీదు ఒక ఆలయాన్ని నిర్మింప గోరాడు. కాని. యెహోవా నా తండ్రితో, ‘దావీదూ, నీవు నా పేరు మీద ఒక ఆలయాన్ని నిర్మింప తలంచటం బాగానే వుంది. కాని, నీవు ఆలయాన్ని నిర్మించకూడదు. నా పేరు మీద నీ స్వంత కుమారుడు ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు’ అని చెప్పాడు. 10 యెహోవా ఏమి చేస్తానని చెప్పాడో ఇప్పుడది చేశాడు. నా తండ్రి స్థానంలో నేను కొత్త రాజును. దావీదు నా తండ్రి. ఇప్పుడు నేను ఇశ్రాయేలుకు రాజును. అదే యెహోవా చేసిన వాగ్దానం. మరి నేను ఇశ్రాయేలు దేవుడగు యెహోవాకు ఒక ఆలయాన్ని నిర్మించాను. 11 ఒడంబడిక పెట్టెను ఆలయంలో వుంచాను! ఈ ఒడంబడిక పెట్టెలోనే దేవుని పది ఆజ్ఞల రాతిపలకలు వుంచబడినవి. దేవుడు ఈ ఒడంబడికను ఇశ్రాయేలు ప్రజలతో చేసు కొన్నాడు.”

సొలొమోను ప్రార్థన

12 సొలొమోను యెహోవా బలిపీఠానికి ఎదురుగా నిలబడ్డాడు. సమావేశమైన ఇశ్రాయేలు ప్రజల కెదురుగా అతడు నిలబడ్డాడు. పిమ్మట సొలొమోను తన రెండు చేతులూ చాచాడు. 13 సొలొమోను కంచుతో ఒక ఎత్తైన వేదిక నిర్మించాడు. దాని పొడవు ఏడున్నర అడుగులు; వెడల్పు ఏడున్నర ఆడుగులు; ఎత్తు ఎడున్నర అడుగులు అతడు దానిని బయట ఆవరణలో మధ్యగా వుంచాడు. అతడు దానిమీదకు ఎక్కి, సమావేశమైన ఇశ్రాయేలు ప్రజానీకం ముందు మోకరించాడు. సొలొమోను తన చేతులను ఆకాశంవైపుకు ఎత్తాడు. 14 పిమ్మట సొలొమోను యిలా ప్రార్థన చేశాడు:

“ఇశ్రాయేలు దేవుడవగు ఓ ప్రభూ, నీవంటి దేవుడు భూమిమీదగాని, ఆకాశంలోగాని మరొక్కడు లేడు. ప్రేమ, కరుణతో కూడిన నీ ఒడంబడికను నీవు నిలబెట్టుకున్నావు. నీ ప్రజలంతా పూర్ణహృదయంతో సన్మార్గులై, నిన్ను అనుసరిస్తే నీ ఒడంబడిక కొనసాగిస్తావు. 15 నీ సేవకుడైన దావీదుకు నీవిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చావు. దావీదు నా తండ్రి. స్వయంగా నీ నోటితో ఆ వాగ్దానం చేశావు. ఈనాడు ఆ వాగ్దానాన్ని స్వయంగా నీ చేతులతో నిజమయ్యేలా చేశావు. 16 ఇశ్రాయేలు దేవుడవగు ఓ ప్రభూ, ఇప్పుడు నీవు నీ సేవకుడైన దావీదుకు ఇచ్చిన మాట నిలబెట్టుము. నీవిలా మాట యిచ్చావు: ‘దావీదూ, నా సన్నిధిలో ఇశ్రాయేలు సింహాసనంపై నీ కుటుంబంలో ఒకడు తప్పక కొనసాగుతాడు. నీ కుమారులు వారు చేసే కార్యాలలో తగిన జాగ్రత్త వహిస్తేనే ఇది జరుగుతుంది. నా ధర్మాశాస్త్రాన్ని నీవు అనుసరించిన రీతిలో, నీ కుమారులు కూడ నా ధర్మాశాస్త్రాన్ని పాటించాలి.’ 17 ఇశ్రాయేలు దేవుడవగు ఓ ప్రభూ, నీ వాగ్దానం నిజమగుగాక! ఈ వాగ్దానం నీ సేవకుడైన దావీదుకు యిచ్చాయున్నావు.

18 “ఓ దేవా, నీవు నిజంగా మానవులతో కలిసి భూమి మీద నివసించవని మాకు తెలుసు. ఆకాశాలు గాని, మహా ఆకాశాలు గాని నిన్ను నిలుపజాలవు! అటువంటప్పుడు నేను నిర్మించిన ఈ చిన్న ఆలయం నిన్ను భరింపలేదని కూడా మాకు తెలుసు! 19 కానీ నీ కరుణ కొరకు నేను చేయు ప్రార్థనను, అభ్యర్థనను ఆలకించు. నా దేవుడైన ప్రభూ, నా మొరాలకించుము! నీ కొరకు నా ప్రార్థనయందు శ్రద్ధ వహించుము. నేను నీ సేవకుడను. 20 ఈ ఆలయాన్ని నీవు కన్నులార రాత్రింబవళ్లు చూడాలని నా ప్రార్థన. ఈ స్థలంలో నీ పేరును ప్రతిష్ఠిస్తావని నీవు చెప్పియున్నావు. ఈ ఆలయాన్ని చూస్తూ నేను చేసే నా ప్రార్థనను నీవు విందువుగాక! 21 నేను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు చేయు ప్రార్థనలను ఆలకించుము. ఈ ఆలయాన్ని చూస్తూ మేము చేయు ప్రార్థనలయందు లక్ష్యముంచుము. ఆకాశంలో నీవున్న చోటు నుంచే మా ప్రార్థన వినుము. నీవు మా ప్రార్థనలను విన్నప్పుడు మమ్మల్ని మన్నించుము.

22 “ఒక మనిషి వేరొక మనిషిపట్ల అపచారం చేసిన నేరానికి పాల్పడవచ్చు. అది జరిగినప్పుడు నిందితుడు నీపేరు మీద ఒక ప్రమాణం చేయాలి. ఆలయంలోని నీ బలిపీఠం ముందు అతడు ప్రమాణం చేయటానికి వచ్చినప్పుడు 23 నీవు ఆకాశంలోని నీ నివాసము నుండి వినుము. అప్పుడు నీ సేవకులను విచారించి చర్య తీసుకొనుము. దుష్టుని శిక్షించుము. అతడు ఇతరులను బాధ పెట్టిన విధంగా తానుకూడా ఆ బాధను అనుభవించేలా చేయుము. మంచి కార్యములు చేసిన వాని నిర్దోషిత్వాన్ని నిరూపింపుము.

24 “నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నీపట్ల పాపం చేసిన కారణంగా ఒక శత్రువు వారిని ఓడించవచ్చు. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి నీ నామస్మరణ చేసి నిన్నాశ్రయించి ఈ ఆలయంలో నిన్ను ప్రార్థస్తూ వేడుకుంటే, 25 ఆకాశంలో వుండి నీ ఇశ్రాయేలీయుల రోదన విని వారిని క్షమింపుము. నీవు వారికి, వారి పూర్వీకులకు ఇచ్చిన రాజ్యానికి వారిని తిరిగి తీసుకొని రమ్ము.

26 “వర్షాలు లేకుండ ఆకాశం కుంచుకుపోవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు నీపట్ల పాపం చేసినట్లయితే ఇది జరుగుతుంది. కాని ఇశ్రాయేలీయులు నీ శిక్షకు గురియై తమ తప్పు తెలిసికొని పశ్చాత్తాపము పొంది, ఆలయం వైపు తిరిగి నీ నామస్మరణ చేసి ప్రార్థిస్తే, 27 నీవు ఆకాశంలో నుండి వారి మొరాలకించుము. వారి విన్నపము ఆలకించి వారి పాపాలను క్షమించుము. ఇశ్రాయేలు ప్రజలు నీ సేవకులు. వారు జీవించవలసిన సన్మార్గాన్ని వారికి బోధించుము. నీ రాజ్యంలో వర్షాలు కురిపించుము. నీవు ఈ రాజ్యాన్ని నీ ప్రజలకు ఇచ్చావు.

28 “ఈ రాజ్యంలో కరువు రావచ్చు. వ్యాధులు వ్యాపించవచ్చు. పంటలకు తెగుళ్లు సోకవచ్చు. తోటలకు తేనెమంచు వ్యాధుల, మిడతల, పురుగుల పీడ సంభవించవచ్చు. ఇశ్రాయేలీయుల నగరాలపై శత్రుదాడులు జరిగినప్పుడుగాని, ఇశ్రాయేలులో ఏ రకమైన వ్యాధులు ప్రబలినా, 29 ఇశ్రాయేలు ప్రజలు తమ బాధలు గ్రహించి నిన్ను ప్రార్థించి వేడుకుంటే, ఏ బాధితుడేగాని ఈ ఆలయాన్ని చూస్తూ చేతులెత్తి ప్రార్థిస్తే, 30 నీ నివాస స్థలమైన ఆకాశంనుండి వారి అభ్యర్థన ఆలకించుము. వారి మొరాలకించి, వారిని క్షమించుము. ప్రతి వ్యక్తికి వానికి అర్హమైన దాని నివ్వుము. ఎందువల్లననగా ప్రతివాని హృదయం నీకు తెలుసు. మానవ హృదయాలను తెలుసుకొనే శక్తి నీ వొక్కనికే వుంది. 31 అప్పుడు మా పూర్వీకులకు నీవిచ్చిన ఈ రాజ్యంలో ప్రజలు నివసించినంత కాలం నీపట్ల భయభక్తులు కలిగి వుంటారు. 32 నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు చెందని పరదేశీయుడెవడైనా తన సుదూరదేశం నుండి ఇక్కడికి రావచ్చును. అతడు నీ మహోన్నత నామం వినిగాని, తిరుగులేని నీ బాహుబలం గూర్చి వినిగాని, చాచిన నీ చేతుల ప్రభావం వినిగాని రావచ్చును. అతడు వచ్చి నీ ఆలయంవైపు చూస్తూ ప్రార్థన చేస్తే, 33 నీ ఆకాశ నివాసం నుండి వాని ప్రార్థన ఆలకించుము. ఆ పరదేశి కోరిన సహాయాన్ని అందించుము. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ నీ నామ మహిమను, నీ ప్రభావాన్ని తెలుసుకొని, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులవలె నీ పట్ల భయ భక్తులతో మెలుగుతారు. దానితో ప్రపంచ ప్రజలంతా నేను నిర్మించిన ఈ ఆలయం నీ పేరు మీద పిలువ బడుతూ వుందని తెలుసుకుంటారు.

34 “నీవు నీ ప్రజలను తమ శత్రువుల మీదికి ఒక చోటికి యుద్దానికి పంపితే, వారు ఈ నగరంవైపు, నేను నిర్మించిన ఈ ఆలయంవైపు తిరిగి నిన్ను తలంచి ప్రార్థన చేసిన పక్షంలో 35 వారి ప్రార్థన ఆకాశంనుండి నీవు ఆలకించి తగిన సహాయం చేయుము.

36 “ప్రజలు నీకు విరుద్ధంగా పాపం చేస్తారు. సామాన్యంగా పాపం చేయని మానవులుండరు. అలాగే ఈ ప్రజలు నీపట్ల పాపం చేసినప్పుడు నీకు వారిపై కోపం రావటం సహజం. ఒకానొక శత్రువు వచ్చి వారిని ఓడించి బందీలుగా దూరదేశానికో, దగ్గర దేశానికో తీసుకొని పోయేలా నీవు చేయవచ్చు. 37 కాని వారు బందీలుగా వున్న రాజ్యంలో వున్నప్పుడు వారిలో పరివర్తన వచ్చి నిన్ను ప్రాధేయపడవచ్చు. ‘మేము పాపం చేశాము; మేము తప్పు చేశాము; మేము దుర్మార్గంగా ప్రవర్తించాము,’ అని వారు పరితపించవచ్చు. 38 పరితపించి వారు మళ్లీ హృదయపూర్వకంగా, ఆత్మ సాక్షిగా తాము బందీలుగా వున్న దేశంలోనే వారు నిన్ను ఆశ్రయించవచ్చు. నీవు వారి పితరులకు యిచ్చిన దేశంవైపు, నీవు ఎంపిక చేసిన నీ నగరంవైపు చూస్తూ నిన్ను ప్రార్థించవచ్చు. నేను నీ పేరు మీద నిర్మించిన ఈ ఆలయంవైపు తిరిగి ప్రార్థించవచ్చు. 39 ఇలా జరిగిన సందర్భంలో ఆకాశంలో నుండి నీవు వారి మొర ఆలకించుము. ఆకాశం నీ నివాసం. నీపట్ల పాపం చేసిన నీ ప్రజలైన వారి ప్రార్థన, వారి మనవి ఆలకించి, వారిని క్షమించి సహాయపడుము. 40 ఓ నాప్రభూ, నీ నేత్రాలను విప్పమని, నీ చెవులను ఒగ్గుమని నేను ప్రాధేయపడుచున్నాను. ఈ స్థానంలో మేము చేసే ప్రార్థనపట్ల శ్రద్ధ వహించుము.

41 “ఓ ప్రభూ, మేలుకో తండ్రీ, నీ మహత్తర శక్తికి నిదర్శనమైన ఒడంబడిక పెట్టెతో
    నీ విశ్రాంతి ఆలయాన్ని ప్రవేశించుము.
నీ యాజకులు రక్షణ పొందుదురు గాక!
    ఓ ప్రభూ, దేవా, పవిత్రులైన నీ ప్రజలకు సుఖశాంతులను కలుగజేయుము!
42 ఓ దేవా, నీవల్ల అభిషిక్తుడైన వానిని తిరస్కరించవద్దు.
    నీ సేవకుడైన దావీదు చేసిన విశ్వాసపాత్రమైన కార్యాలను జ్ఞాపకముంచు కొనుము!”

యోహాను 10:24-42

24 వాళ్ళు, “నీవు మమ్మల్ని ఎంతకాలం సందేహంలో ఉంచుతావు? నీవు క్రీస్తువయినట్లైతే దాచకుండా చెప్పు” అని అన్నారు.

25 యేసు, “ఆ విషయం నేను ఇది వరకే చెప్పాను. కాని మీరు నమ్మటం లేదు. నా తండ్రి పేరిట నేను చేస్తున్న అద్భుతాలే నేను ఎవరన్న దానికి రుజువు. 26 కాని మీరు నా మందకు చెందిన వాళ్ళు కాదు. కాబట్టి నన్ను విశ్వసించటం లేదు. 27 నా గొఱ్ఱెలు నా మాట గుర్తిస్తాయి. నాకు వాటిని గురించి తెలుసు. అవి నన్ను అనుసరిస్తాయి. 28 వాటికి నేను అనంత జీవితం యిస్తాను. అవి ఎన్నటికీ మరణించవు. వాటిని నా అండ నుండి ఎవ్వరూ తీసుకొని పోలేరు. 29 వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరి కన్నా గొప్పవాడు. నా తండ్రి అండనుండి వాటిని ఎవ్వరూ తీసుకొని పోలేరు. 30 నేను, నా తండ్రి ఒకటే!” అని అన్నాడు.

31 యూదులు ఆయన్ని కొట్టాలని మళ్ళీ రాళ్ళెత్తారు. 32 కాని యేసు వాళ్ళతో, “నేను నా తండ్రి చేయుమన్న ఎన్నో మంచి పనులు చేసాను. వీటిలో దేన్ని చేసినందుకు మీరు నన్ను కొట్టాలనుకుంటున్నారు?” అని అన్నాడు.

33 యూదులు, “నీవు మంచి పనులు చేసినందుకు రాళ్ళు రువ్వటం లేదు కాని, నీవు దైవదూషణ చేస్తున్నందుకు. మనిషివై దేవుణ్ణి అని అంటున్నందుకు నిన్ను చంపదలచాము” అని అన్నారు.

34 యేసు సమాధానంగా, “మీ ధర్మశాస్త్రంలో, ‘మీరు దేవుళ్ళని’ దేవుడు అన్నట్లు వ్రాయబడి ఉంది. 35 మీ ధర్మశాస్త్రం అసత్యం చెప్పదు. దేవుడు తన సందేశం విన్న ప్రజల్ని దేవుళ్ళుగా అన్నాడు. 36 తండ్రి నన్ను ఎన్నుకొని తన కార్యం చెయ్యటానికి ఆ ప్రపంచంలోకి పంపాడు. మరి నేను దేవుని కుమారుణ్ణి అని అనటం ఆయన్ని దూషించటం ఎట్లా ఔతుంది? 37 నేను, నా తండ్రి కార్యం చేస్తే తప్ప నన్ను విశ్వసించకండి. 38 నేను నా తండ్రి కార్యాన్ని చేసాను. కనుక మరి నన్ను విశ్వసించకపోయినా కనీసం నా కార్యన్ని విశ్వసించండి. అలా చేస్తే నా తండ్రి నాలో ఉన్నాడని, నేను నా తండ్రిలో ఉన్నానని మీకు స్పష్టంగా తెలిసిపోతుంది” అని అన్నాడు.

39 ఆయన్ని బంధించాలని వాళ్ళు మరొక సారి ప్రయత్నించారు. కాని ఆయన అక్కడ నుండి వెళ్ళి పోయాడు.

40 యేసు మళ్ళీ యొర్దాను నది యొక్క అవతలి ఒడ్డుకు వెళ్ళి అక్కడ ఉండిపొయ్యాడు. ఇదివరలో యోహాను బాప్తిస్మము నిచ్చింది ఇక్కడే. 41 అనేకులు ఆయన దగ్గరకు వచ్చారు. “వాళ్ళు యోహాను ఏ మహాత్యం చెయ్యలేదు. కాని ఈయన్ని గురించి అతను చెప్పిన ప్రతీ విషయం నిజం” అని పరస్పరం మాట్లాడుకున్నారు. 42 అక్కడ అనేకులు యేసును విశ్వసించారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International