Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 రాజులు 15-16

యూదా మీద అజర్యా పరిపాలన

15 ఇశ్రాయేలు రాజుగా యరొబాము పరిపాలన చేసే 27వ సంవత్సరమున యూదాకు రాజైన అమాజ్యా కుమారుడు అజర్యా రాజయ్యాడు. అతను పరిపాలన ప్రారంభించేనాటికి, అజర్యా 16 సంవత్సరముల వయస్సు గలవాడు. యెరూషలేములో 52 సంవత్సరాలు పరిపాలించాడు. అజర్యా తల్లి పేరు యెరూషలేముకు చెందిన యెకొల్యా. తన తండ్రి అమాజ్యావలె, అజర్యా యెహోవా మంచివని చెప్పిన పనులు చేశాడు. అతని తండ్రి అమాజ్యా చేసిన వాటినే అజర్యా అనుసరించాడు. కాని అతను ఉన్నత స్థానాలను పాడు చేయలేదు. ఈ ఉన్నత స్థలాల్లో[a] ప్రజలింకా బలులు అర్పించుచూ, ధూపం వేయుచుండిరి.

యెహోవా అజర్యా రాజును కుష్ఠరోగిగా చేశాడు. అతను మరణించేంత వరకు కుష్ఠరోగియే. అజర్యా విడిగా ఒక ఇంట్లో ఉన్నాడు. రాజు కుమారుడైన యోతాము రాజభవన సంరక్షణలో శ్రద్ధ వహించాడు. ప్రజలను న్యాయ విచారణ చేశాడు.

అజర్యా చేసిన ఘనకార్యాలన్నీ “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడినవి. అజర్యా మరణించగా, దావీదు నగరంలో అతని పూర్వీకులతో పాటు సమాధి చేయబడ్డాడు. అజర్యా కుమారుడు యెతాము, అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.

ఇశ్రాయేలు మీద జెకర్యా కొద్ది కాలపు పరిపాలన

యరొబాము కుమారుడైన జెకర్యా ఇశ్రాయేలులోని షోమ్రోనుపై ఆరు నెలలు పరిపాలించాడు. ఇది యూదా రాజుగా అజర్యా పరిపాలనకు వచ్చిన 38వ సంవత్సరమున జరిగింది. యెహోవా తప్పు అని చెప్పిన పనులు జెకర్యా చేశాడు. అతని పూర్వీకులు చేసిన వాటినే అతను చేసాడు. నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలవల్ల ఇశ్రాయేలును పాపమునకు పాల్పడజేసిన ఆ పాపకార్యాలను అతను ఆపలేదు.

10 యాబేషు కుమారుడైన షల్లూము జెకర్యాకు విరోధంగా కుట్రపన్నాడు. షల్లూము జెకర్యాను ప్రజల ముందర చంపివేశాడు. అతని తర్వాత షల్లూము క్రొత్తగా రాజయ్యాడు. 11 జెకర్యా చేసిన ఇతర పనులన్నీ “ఇశ్రాయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడి వున్నవి. 12 ఈ విధంగా యెహోవా చెప్పినవన్నీ నిజమయ్యాయి. యెహూ యొక్క సంతతిలోని నాలుగు తరాల వారు ఇశ్రాయేలు రాజులుగా ఉందురని యెహోవా చెప్పాడు.

ఇశ్రాయేలు మీద షల్లూము కొద్దికాలము అధికారం చేయుట

13 యాబేషు కుమారుడైన షల్లూము ఇశ్రాయేలుకు రాజయ్యాడు. ఇది యూదా రాజుగా ఉజ్జియా పరిపాలన చేసే 39వ సంవత్సరంలో జరిగింది. షోమ్రోనులో షల్లూము ఒక నెల పరిపాలించాడు.

14 గాదీ కుమారుడైన మెనహేము తిర్సానుండి షోమ్రోనుకు వచ్చాడు. మెనహేము యాబేషు కుమారుడైన షల్లూమును చంపివేశాడు. తర్వాత మెనహేము, అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.

15 షల్లూము చేసిన అన్ని పనులు జెకర్యాకు విరుద్ధంగా అతని పథకములతో సహా “ఇశ్రయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడ్డాయి.

ఇశ్రాయేలులో మెనహేము పరిపాలన

16 షల్లూము మరణానంతరం, మెనహేము తిప్సహు ఆ పరిసర ప్రాంతాన్ని ఓడించాడు. అతనికై ప్రజలు నగరద్వారాన్ని తెరవడానికి అంగీకరించలేదు. అందువల్ల మెనహేము వారిని ఓడించాడు. నగరంలోని గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చాడు.

17 అజర్యా యూదా రాజుగా వున్న 39వ సంవత్సరమున, గాదీ కుమారుడైన మెనహేము ఇశ్రాయేలుకు రాజయ్యాడు. షోమ్రోనులో మెనహేము పది సంవత్సరాల పాటు పరిపాలించాడు. 18 యెహోవా చెడ్డవని చెప్పిన పనులు మెనహేము చేశాడు. నెబాతు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలీయులను పాపాలకు గురిచేసిన ఆ పాపాలను మెనహేము ఆపలేదు.

19 అష్షూరు రాజయిన పూలు ఇశ్రాయేలుకు ప్రతి కూలంగా యుద్ధం చేయడానికి వచ్చాడు. మెనహేము పూలుకు 75,000 పౌన్ల వెండి ఇచ్చాడు. పూలు మెనహేముకి సహాయపడుననీ, మెనహేము రాజ్యాన్ని బలిష్ఠం చేయుననీ అనుకుని అతను అలా చేశాడు. 20 ధనవంతులూ, అధికారం గలవారూ పన్నులు చెల్లించునట్లుగా చేసి మెనహేము డబ్బును వసూలు చేశాడు. మెనహేము ప్రతి వ్యక్తికీ 20 తులాల వెండి పన్నుగా విధించాడు. తర్వాత మెనహేము అష్షూరు రాజుకి ఆ డబ్బు ఇచ్చాడు. అందువల్ల అష్షూరు రాజు ఇశ్రాయేలును విడిచి వెళ్లాడు.

21 మెనహేము చేసిన అన్ని గొప్పకార్యాలు “ఇశ్రాయేలు రాజుల చరితగ్రంథంలో” వ్రా యబడినవి. 22 మెనహేము మరణించగా, అతని పూర్వికులతో పాటు, అతడు సమాధి చేయబడ్డాడు. మెనహేము కుమారుడు పెకహ్యా అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.

ఇశ్రాయేలులో పెకహ్యా పరిపాలనఏ

23 అజర్యా యూదా రాజుగా వున్న 50 వ సంవత్సరమున, మెనహేము కుమారుడైన పెకహ్యా షోమ్రోనులోని ఇశ్రాయేలుకు రాజయ్యాడు. పెకహ్యా రెండేండ్లు పాలించాడు. 24 యెహోవా తప్పని చెప్పిన కార్యాలను పెకహ్యా చేశాడు. నెబాతు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలును పాపకార్యాలకు గురిచేసిన ఆ పాపాలను పెకహ్యా ఆపలేదు.

25 పెకహ్యా సైన్యానికి అధిపతి అయిన పెకహు రెమల్యా కుమారుడు. పెకహు రాజైన పెకహ్యాకు విరోధముగా పన్నాగము చేశాడు. అతనిని షోమ్రోనులోని రాజభవనములో అతను చంపాడు. గిలాదునుంచి వచ్చిన 50 మంది మనుష్యులు పెకహ్యాని చంపేటప్పుడు పెకహుతో పాటువున్నారు. అతని తర్వాత పెకహు క్రొత్తగా రాజయ్యాడు.

26 పెకహ్యా చేసిన అన్ని గొప్పకార్యాలు “ఇశ్రాయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో రాయబడినవి.

ఇశ్రాయేలులో పెకహు పరిపాలన

27 యూదా రాజుగా అజర్యా వున్న 52వ సంవత్సరమున షోమ్రోనులోని ఇశ్రాయేలుని రెమల్యా కొడుకైన పెకహు పరిపాలించసాగాడు. పెకహు 20 సంవత్సరాలు పరిపాలించాడు. 28 యెహోవా చెడ్డవని చెప్పిన పనులు పెకహు చేశాడు. నెబాతు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలుని పాపానికి గురిచేసిన ఆ పాపాలను పెకహు ఆపలేదు.

29 అష్షూరు పాలకుడైన తిగ్లత్పిలేసెరు ఇశ్రాయేలుకు ప్రతికూలంగా యుద్ధం చేయడానికి వచ్చాడు. ఇశ్రాయేలు రాజుగా పెకహు వున్న కాలంలో ఇది జరిగింది. తిగ్లత్పిలేసరు, ఈయోను, ఆబేల్బేత్మయకా, హాసోరు, గిలాదు, యానోయహు కెదెషు గలిలయ మరియు నఫ్తాలీ ప్రాంతమంతటినీ స్వాధీనం చేసుకున్నారు. ఈ అన్ని స్థలాలనుండి తిగ్లత్పిలేసరు ప్రజలను బందీలుగా అష్షూరుకు తీసుకు వెళ్లాడు.

30 హోషేయా కొడుకు ఏలా, రెమల్యా కొడుకు పెకహు మీద పన్నాగం పన్నాడు. హోషేయా పెకహును చంపివేశాడు. అప్పుడు హోషేయా పెకహుకు పిదప క్రొత్తగా రాజు అయ్యాడు. ఇది ఉజ్జియా కొడుకు యోతాము యొక్క 20వ సంవత్సరం యూదా పరిపాలనలో జరిగింది.

31 పెకహు చేసిన అన్ని ఘనకార్యములు “ఇశ్రాయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడినవి.

యూదాపై యోతాము పరిపాలన

32 ఉజ్జియా కుమారుడైన యోతాము యూదాకు రాజయ్యాడు. రెమల్యా కొడుకైన పెకహు ఇశ్రాయేలుకు రాజుగా వున్న రెండవ సంవత్సరంలో ఇది జరిగింది. 33 యోతాము రాజయినప్పుడు, అతను 25 యేండ్లవాడు. యోతాము యెరూషలేములో 16 సంవత్సరాలు పాలించాడు. యోతాము తల్లి పేరు యెరూషా. ఆమె సాదోకు కుమార్తె. 34 తన తండ్రి ఉజ్జియావలె, యెహోవా మంచివని చెప్పిన పనులు యోతాము చేశాడు. 35 కాని అతను ఉన్నత స్థలాలను పాడు చేయలేదు. ఈ ఉన్నత స్థలాలలో ప్రజలు నేటికి బలులు అర్పించుచూ ధూపం వేయుచున్నారు. యెహోవా ఆలయానికి గల పై ద్వారమును యోతాము నిర్మించాడు. 36 యోతాము చేసిన అన్ని ఘనకార్యాలు “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడినవి.

37 ఆ సమయమున, సిరియా రాజయిన రెజీనును, రెమల్యా కొడుకైన పెకహును యూదాకు ప్రతికూలంగా యుద్ధం చేయడానికి యెహోవా పంపాడు.

38 యోతాము మరణించగా, అతని పూర్వికులతో పాటు అతను అతని పూర్వికుడైన దావీదు పేరు మీదగల నగరంలో సమాధి చేయబడ్డాడు. యోతాము కుమారుడు అహాజు అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.

యూదాలో అహాజు రాజు అగుట

16 యోతాము కుమారుడైన అహాజు యూదాకు రాజయ్యాడు. రెమల్యా కుమారుడైన పెకహు ఇశ్రాయేలుకు రాజుగా వున్న 17వ సంవత్సరమున అది జరిగింది. అహాజు రాజయ్యేనాటికి, అతను 20 యేండ్లవాడు. యోరూషలేములో అహాజు 16 సంవత్సరాలు పరిపాలించాడు. యెహోవా చేయుమని చెప్పిన పనులు అహాజు చేయలేదు. తన పూర్వికుడైన దావీదు దేవునికి విధేయుడు. కానీ తన పూర్వీకులవలె అహాజు యెహోవాకి విధేయత చూపలేదు. అహాజు ఇశ్రాయేలు రాజులవలె నివసించాడు. అతను తన కుమారుని కూడా అగ్నిలో బలిగా అర్పించాడు. ఇశ్రాయేలు వారు వచ్చినప్పుడు యెహోవా విడిచి వెళ్లుటకు కారణమైన ఆ జనాంగములు చేసిన భయంకర పాపాలను అతను అనుసరించాడు. అహాజు బలులు అర్పిస్తూ ఉన్నత స్థలాలలో ధూపం వేసాడు; కొండల మీద ప్రతి పచ్చని చెట్టు క్రిందను వెలిగించాడు.

సిరియా రాజయిన రెజీను రెమల్యా కుమారుడు మరియు ఇశ్రాయేలు రాజయిన పెకహు యెరూషలేముకు ప్రతికూలంగా యుద్ధం చేయడానికి వచ్చారు. రెజీను పెకహు కలిసి అహాజుని చుట్టుముట్టారు; కాని ఓడించలేకపోయారు. ఆ సమయంలో సిరియా రాజయిన రెజీను సిరియా కోసం ఏలతును తిరిగి పొందాడు. ఏలతులో నివసించే యూదా వారినందరిని రెజీను తీసుకుపోయాడు. ఏలతులో స్థిరపడిన సిరియనులు నేటికీ అక్కడే నివసిస్తున్నారు.

అష్షూరు రాజయిన తిగ్లత్పిలేసెరు వద్దకు అహాజు దూతలను పంపాడు. సందేశం ఏమనగా: “నేను మీ సేవకుడను. నేను మీకు కుమారునివంటి వాడను. సిరియా రాజు, ఇశ్రాయేలు రాజుల నుండి నన్ను మీరు కాపాడవలెను. వారు నాతో యుద్ధం చేయడానికి వచ్చారు.” యెహోవా ఆలయంలోను, రాజభవన నిధులలోను వున్న వెండి బంగారాలను అహాజు తీసుకొని పోయాడు. తర్వాత అహాజు అష్షూరు రాజుకి కానుక పంపాడు. అష్షూరు రాజు అహాజు మాట ఆలకించాడు. అష్షూరు రాజు దమస్కుకు ప్రతికూలంగా యుద్ధానికి పోయాడు. రాజు ఆ నగరాన్ని వశం చేసుకున్నాడు; ప్రజలను బందీలుగా చేసి దమస్కు నుండి కీరుకి తీసుకునిపోయాడు. అతను రెజీనును కూడా చంపివేశాడు.

10 అహాజు రాజు అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరును కలుసుకునేందుకు దమస్కు వెళ్లాడు. దమస్కులో అహాజు బలిపీఠం చూశాడు. అహాజు రాజు దీని నమూనాని పద్దతిని ఊరియా యాజకునికి పంపాడు. 11 తర్వాత యాజకుడయిన ఊరియా దమస్కు నుండి అహాజు రాజు పంపిన నమూనాననుసరించి ఒక బలిపీఠం నిర్మించాడు. దమస్కు నుండి అహాజు రాజు రాకకు పూర్వమే ఊరియా యాజకుడు అదే రకమైన బలిపీఠం నిర్మించాడు.

12 దమస్కు నుండి రాజు రాగానే, అతను బలిపీఠం చూశాడు. ఆ బలిపీఠం వద్ద రాజు బలులు అర్పించాడు. 13 బలిపీఠం మీద అహాజు దహన బలులు ధాన్యార్పణలు అర్పించాడు. అతను పానీయ అర్పణలు, సమాధాన బలులు ఈ బలిపీఠం మీద అర్పించాడు.

14 అహాజు ఆలయం ముందు భాగం నుండి యెహోవా సమక్షంలోవున్న కంచు బలిపీఠం తీసుకున్నాడు. ఈ కంచు బలిపీఠం అహాజు బలిపీఠానికి యెహోవా ఆలయానికి మధ్య వున్నది. తన సొంత బలిపీఠానికి ఉత్తర దిశగా కంచు బలిపీఠం ఉంచాడు. 15 అహాజు ఊరియా యాజకునికి ఆజ్ఞ విధించాడు: “ఉదయపు దహనబలులను, సాయంకాలపు ధాన్యార్పణలను, ఈ దేశంలోని ప్రజల పానీయ అర్పణలకు ఈ పెద్ద బలిపీఠం ఉపయోగించాలి. వండబడిన బలులు దహన బలులు మరి ఇతర బలుల నుండి తీసిన రక్తాన్ని పెద్ద బలిపీఠం మీద చల్లాలి. కాని అవసరము వచ్చినప్పుడల్లా నేను కంచు బలిపీఠం ఉపయోగిస్తాను.” 16 అహాజు రాజు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఊరియా యాజకుడు జరిగించాడు.

17 యాజకులు తమ చేతులు కడుగుకొనేందుకు బళ్ల నిండుగా ఇత్తడి గంగాళాలు, లోతు పళ్లాలు వున్నవి. అహాజు రాజు ఆ గంగాళాలు, లోతు పళ్లెములు తొలగించి బండ్లని ముక్కలు చేశాడు. కంచు స్తంభాల మీద నున్న పెద్ద తొట్టిని తీసివేశాడు. ఆ పెద్ద తొట్టిని చదును చేయబడిన రాయిపై వుంచాడు. 18 ఆలయంలోని ప్రతి భాగంలో సబ్బాతు సమావేశాల కోసం పనివారు మూయబడిన ఒక ప్రదేశం తయారు చేశారు. అహాజు రాజు తన కోసం కప్పియున్న మండపము మరియు వెలుపలి ప్రవేశాన్ని తీసివేశాడు. వాటన్నిటినీ యెహోవా ఆలయంనుంచి అహాజు తీసివేశాడు. అష్షూరు రాజుకోసం అహాజు అవి చేశాడు.

19 అహాజు చేసిన ఆ కార్యాలన్నీ “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. 20 అహాజు మరణించగా అతను దావీదు నగరంలో అతని పూర్వికులతో పాటు సమాధి చేయబడ్డాడు. అహాజు కుమారుడు హిజ్కియా, అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.

యోహాను 3:1-18

యేసు నికోదేముకు బోధించటం

నీకోదేము అనే పరిసయ్యుడు యూదుల నాయకునిగా ఉండేవాడు. అతడు ఒకనాటి రాత్రి యేసు దగ్గరకు వెళ్ళి, “రబ్బీ! నీవు దేవుని నుండి వచ్చిన బోధకుడవని మాకు తెలుసు. నీవు చేస్తున్న అద్భుతాలు దేవుని అండ లేకుండా ఎవ్వరూ చెయ్యలేరు” అని అన్నాడు.

యేసు జవాబు చెబుతూ, “ఇది సత్యం. క్రొత్తగా జన్మిస్తే తప్ప ఎవ్వరూ దేవుని రాజ్యాన్ని చూడలేరు” అని స్పష్టంగా చెప్పాడు.

నికోదేము, “కాని ఒక వ్యక్తి వృద్ధుడయ్యాక తిరిగి ఏవిధంగా జన్మిస్తాడు? మళ్ళీ జన్మించటానికి తల్లిగర్భంలోకి రెండవ సారి ప్రవేశించలేము కదా!” అని అడిగాడు.

యేసు జవాబు చెబుతూ, “ఇది సత్యం. నీళ్ళద్వారా, పవిత్రాత్మద్వారా, జన్మిస్తే తప్ప ఎవ్వరూ దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు. మానవుడు భౌతికంగా జన్మిస్తాడు. కాని, ఆధ్యాత్మికత పవిత్రాత్మ వల్ల జన్మిస్తుంది. అందువల్ల నేను, ‘నీవు మళ్ళీ జన్మించాలి’ అనటం విని అశ్చర్యపోవద్దు. గాలి తన యిష్టం వచ్చినట్లు వీస్తుంది. మీరు దాని ధ్వని వినగలరు కాని అది ఏ వైపు నుండి వీచిందో, ఏ వైపుకు వీస్తుందో చెప్పలేరు. పవిత్రాత్మవల్ల జన్మించిన ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారు” అని అన్నాడు.

“అది ఏ విధంగా సంభవమౌతుంది?” అని నికోదేము అడిగాడు.

10 యేసు, “నీవు ఇశ్రాయేలు వారిలో పండితుడవు కదా! నీకీ విషయాలు అర్థం కాలేదా? 11 ఇది నిజం. మేము మాకు తెలసిన విషయాలు చెబుతున్నాము. చూసిన వాటికి సాక్ష్యం చెబుతున్నాము. అయినా మీరు మేము చెబుతున్న వాటిని అంగీకరించరు. 12 నేను మాట్లాడిన ప్రాపంచిక విషయాలను గురించి మీరు నమ్మలేదు. అటువంటప్పుడు పరలోక విషయాలు మాట్లాడితే ఎట్లా నమ్ముతారు? 13 పరలోకం నుండి వచ్చిన మనుష్యకుమారుడు తప్ప పరలోకమునకు ఎవ్వరూ ఎప్పుడూ వెళ్ళలేదు.

14-15 “ఆయన్ని నమ్మిన ప్రతి ఒక్కడూ నశించకుండా అనంత జీవితం పోందాలంటే, మోషే ఎడారిలో పామును ఎత్తినట్లు మనుష్యకుమారుడు కూడా ఎత్త బడాలి” అని అన్నాడు.

16 దేవుడు ఈ ప్రపంచ ప్రజల్ని ఎంతగానో ప్రేమించాడు. తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ ప్రపంచంలోకి పంపాడు. ఆయన్ని నమ్మిన వాళ్ళెవ్వరూ నాశనం కాకూడదని, వాళ్ళు అనంత జీవితం పొందాలనీ ఆయన ఉద్దేశ్యం. 17 దేవుడు తన కుమారుని ద్వారా ఈ ప్రపంచానికి రక్షణనివ్వటానికే గాని తీర్పు చెప్పటానికి పంపలేదు. 18 తన కుమారుణ్ణి నమ్మినవానికి ఆయన శిక్ష విధించడు. నమ్మనివానిపై, అనగా తన ఏకైక కూమారుణ్ణి నమ్మలేదు కనుక, యిదివరకే శిక్ష విధించాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International