Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 దినవృత్తాంతములు 15-16

ఆసా చేసిన మార్పులు

15 దేవుని ఆత్మ అజర్యా మీదికి వచ్చింది. అజర్యా ఓబేదు కుమారుడు. ఆసాను కలుసుకోవటానికి అజర్యా వెళ్లాడు. అజర్యా యిలా అన్నాడు: “ఆసా, యూదా ప్రజలారా, బెన్యామీను ప్రజలారా నేను చేప్పేది వినండి! మీరు యెహోవాను నమ్మకొని ఉన్నన్ని రోజులూ, యెహోవా మీతో వుంటాడు. మీరు యెహోవాను వెదికితే, మీరాయనను కనుగొంటారు. కాని మీరు ఆయనను వదిలివేస్తే, ఆయన మిమ్మల్ని వదిలివేస్తాడు. చాలాకాలం ఇశ్రాయేలుకు ఒక నిజమైన దేవుడు లేకుండా వుండిపోయింది. వారు బోధించే యాజకుడుగాని, ధర్మశాస్త్రంగాని లేకుండా వుండి పోయారు. కాని ఇశ్రాయేలు ప్రజలకు కష్టంవచ్చినప్పుడు వారు మళ్లీ దేవుడైన యెహోవాను ఆశ్రయించారు. ఆయన ఇశ్రాయేలు దేవుడు. వారాయనను వెదకగా, యెహోవా వారికి కన్పించాడు. ఆ కష్టకాలంలో ఏ ఒక్కడూ క్షేమంగా ప్రయామాణం చేయగలిగేవాడు కాదు. రాజ్యాలన్నిటిలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఒక రాజ్యం మరో రాజ్యాన్ని, ఒక నగరం మరో నగరాన్ని నాశనం చేసికోసాగాయి. దేవుడు వాటిని సర్వవిధాలుగా కల్లోల పెట్టిన కారణంగా ఆ పరిణామాలు వచ్చాయి. కావున ఆసా, నీవు మరియు యూదా, బెన్యామీను ప్రజలు బలవంతులై యుండండి. బలహీనులు కావద్దు. అధైర్యపడవద్దు. ఎందుకంటే, మీ మంచి పనులకు తగిన ఫలితం దొరుకుతుంది!”

ప్రవక్త ఓబేదు మాటలు, వర్తమానం విన్న ఆసాకు చాలా ధైర్యం వచ్చింది. తరువాత అతడు యూదా, బెన్యామీను ప్రాంతాలన్నిటిలో వున్న అసహ్యకరమైన విగ్రహాలను తొలగించాడు. తానువశపర్చుకున్న ఎఫ్రాయిము కొండల ప్రాంతంలోని పట్టణాలలో వున్న హేయమైన విగ్రహాలను కూడా ఆసా తొలగించాడు. ఆలయ ముఖమండపంలో వున్న దేవుని బలిపీఠాన్ని కూడా అతడు బాగు చేయించాడు.

పిమ్మట యూదా, బెన్యామీను ప్రజలందరినీ ఆసా సమావేశపర్చాడు. అంతేగాక ఎఫ్రాయిము, మనష్షే, మరియు షిమ్యోను కుటుంబాల వారిని కూడా పిలిచాడు. వీరు ఇశ్రాయేలునుండి వలసపోయి యూదాలో స్థిరపడినవారు. వారిలో చాలామంది యూదాకు వచ్చిన కారణమేమంటే, ఆసా దేవుడైన యెహోవా ఆసా పక్షాన వున్నట్లు వారు గమనించారు.

10 ఆసా పరిపాలనలో పదిహేను సంవత్సరాలు దాటి మూడవనెల గడుస్తూవుండగా ఆసా, అతని ప్రజలూ యెరూషలేములో సమావేశమయ్యారు. 11 ఆ సమయంలో వారు ఏడువందల గిత్త దూడలను, ఏడువేల గొర్రెలను, మేకలను యెహోవాకు బలి యిచ్చారు. ఆ జంతువులను, ఇతర విలువైన వస్తువులను ఆసా సైన్యం తమ శత్రువుల నుండి తీసుకొన్నారు. 12 తరువాత వారు తమ పూర్ణ హృదయంతోను, తమ ఆత్మసాక్షితోను యెహోవాను సేవించటానికి ఒక ఒడంబడిక చేసుకొన్నారు. ఆయన వారి పూర్వీకులు సేవించిన దేవుడు. 13 ఎవ్వరైనా దేవాధి దేవుని పూజించటానికి నిరాకరిస్తే అతడు చంపబడాలి. అట్టి మనిషి ఉన్నతుడేగాని, అల్పుడేగాని, పురుషుడే గాని, స్త్రీయేగాని ఎవ్వరైనా విచారణ లేకుండా చంపబడవలసినదే. 14 అప్పుడు ఆసా మరియు ప్రజలు యెహోవాకు ఒక ప్రమాణం చేశారు. వారు ఏకగ్రీవంగా పెద్దగా అరిచారు. వారు బూరలు, పొట్టేలు కొమ్ములు వూదారు. 15 యూదా ప్రజలంతా వారు చేసిన ప్రమాణం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేశారు. గనుక వారికా సంతోషం. పూర్ణ హృదయంతో వారు దేవుని అనుసరించారు. వారు దేవుని కొరకు వెదకి, ఆయనను దర్శించారు. కావున యెహోవా వారికి దేశమంతా శాంతియుత వాతవరణం నెలకొనేలా చేశాడు.

16 ఆసా తన తల్లియైన మయకాను రాజమాత పదవినుండి తొలగించాడు. అషేరా దేవతా స్తంభాన్ని[a] నెలకొల్పటం ద్వారా ఆమె చేయించిన హేయమైన కార్యానికి అతడాపని చేశాడు. అషేరా స్తంభాన్ని ఆసా నరికించి చిన్న చిన్న ముక్కలు చేశాడు. తరువాత అతడా ముక్కలను కిద్రోను లోయలో తగులబెట్టాడు. 17 అయితే యూదాలో వున్న ఉన్నత స్థలాలు తొలగింపబడలేదు. అయినప్పటికి ఆసా హృదయం అతని జీవితాంతం యెహోవాకు విశ్వాసపాత్రంగా వుంది.

18 ఆసా తానూ, తన తండ్రీ దేవునికి సమర్పించిన కానుకలను, ఇతర విలువైన వస్తువులను ఆలయంలో వుంచాడు. ఆ వస్తువులన్నీ వెండి, బంగారాలతో చేయించినవి. 19 ఆసా పాలనలో ముప్పైయైదవ సంవత్సరం[b] వరకు యుద్ధాలు ఏ మాత్రం జరగలేదు.

ఆసా కడపటి సంవత్సరాలు

16 ఆసా పాలనలో ముప్పై ఆరవ సంవత్సరంలో యూదా రాజ్యం మీదికి బయెషా దండెత్తాడు. బయెషా ఇశ్రాయేలు రాజు. అతడు రామా పట్టణానికి వెళ్లి దానిని కోటలా మర్చాడు. రామా పట్టణాన్ని బయెషా ఒక కీలక స్థానంగా వినియోగించి యూదా రాజు ఆసా వద్దకు వెళ్లటానికిగాని, అతని వద్ద నుండి బయటకు రావటానికి గాని ప్రజలకు ఆస్కారం లేకుండా చేశాడు. ఆలయం ఖజానాలో వున్న వెండి, బంగారు నిల్వలను ఆసా తీశాడు. రాజగృహంలో వున్న వెండి, బంగారాలను కూడా అతడు తీశాడు. తరువాత ఆసా తన దూతలను బెన్హదదు వద్దకు పంపాడు. బెన్హదదు అరాము (సిరియా) రాజు. అతడు దమస్కు (డెమాస్కస్) పట్టణంలో నివసిస్తున్నాడు. ఆసా పంపిన వర్తమానం యీలా వుంది. “బెన్హదదూ, మన ఇద్దరి మధ్య ఒక ఒడంబడిక కొనసాగేలా చూడు. అది నీ తండ్రికి, నా తండ్రికి మధ్య కొనసాగిన ఒడంబడికలా వుండాలి. చూడండి, మీకు నేను వెండి బంగారాలు పంపిస్తున్నాను. కనుక నీవిప్పుడు ఇశ్రాయేలు రాజైన బయెషాతో నీకున్న ఒడంబడికను రద్దు చేసుకోవాలి. తద్వారా అతడు నామీదకు రాకుండా, నన్ను ఒంటరిగా వదిలి, నన్ను బాధపెట్టడు.”

రాజైన ఆసా వర్తమానాన్ని బెన్హదదు అంగీకరించాడు. బెన్హదదు తన సైన్యాధిపతులను ఇశ్రాయేలు పట్టణాలపై దాడులు జరపమని పంపాడు. ఆ అధిపతులు ఈయోను, దాను ఆబేల్మాయీము పట్టణాలపై దాడి చేశారు. నఫ్తాలి ప్రాంతంలోవున్న పట్టణాలను కూడ వారు ఎదుర్కొన్నారు. ఈ పట్టణాలలో ధనాగారాలు వున్నాయి. ఇశ్రాయేలు పట్టణాలపై దాడులను గూర్చి బయెషా విన్నాడు. అది విని రామా పట్టణాన్ని దుర్గంగా మార్చే పనిని బయెషా విరమించుకున్నాడు. పనిని మధ్యలో ఆపివేశాడు. ఆ తరువాత రాజైన ఆసా యూదా ప్రజలను సమావేశపర్చాడు. వారంతా రామా పట్టణానికి వెళ్లి బయెషా కోట కట్టించటానికి తెప్పించిన రాళ్లను, కలపను పట్టుకుపోయారు. ఆసా, యూదా ప్రజలు ఆ రాళ్లను, కలపను గెబ, మిస్పా పట్టణాలను బలంగా కట్టడానికి వినియోగించారు.

ఆ సమయంలో దీర్ఝదర్శియైన హనానీ యూదా రాజైన ఆసా వద్దకు వచ్చాడు. హనానీ యీలా అన్నాడు: “ఆసా, నీకు సహాయం చేయటానికి నీవు అరాము (సిరియా) రాజుమీద ఆధారపడ్డావు గాని, దేవుడైన యెహోవాపై ఆధారపడలేదు. నీవు దేవుని మీద ఆధారపడవలసింది. నీవు సహాయానికి యెహోవాపై ఆధారపడలేదు గనుక, అరాము రాజు సైన్యం నీ అధీనం నుండి తప్పించుకున్నది. ఇథియోపియనులు లూబీయులు (లిబియావారు) చాలా శక్తివంతమైన పెద్ద సైన్యాలను కలిగియున్నారు. వారికి అనేక రథాలున్నాయి, రథసారధులు వున్నారు. కాని ఆసా, అంత పెద్ద సైన్యాన్ని ఓడించటానికి నీవు యెహోవాను నమ్ముకొని, ఆయన మీద ఆధారపడ్డావు. నీవు వారిని ఓడించేలా యెహోవా నీకు సహాయపడ్డాడు. యెహోవా కండ్లు భూమి నలుమూలలా పరిశీలించి తన పట్ల భక్తి విశ్వాసాలున్న వారిని చూస్తాయి. యెహోవా వారిని బలపర్చి రక్షిస్తాడు. ఆసా, నీవొక బుద్ధిలేని పని చేశావు. అందువల్ల ఇప్పటి నుండి నీవు యుద్ధాలు చేయవలసి వస్తుంది.”

10 అతడు చెప్పిన దానికి హనానీపై ఆసాకు కోపం వచ్చింది. ఆసాకు ఎంత పిచ్చి కోపం వచ్చిందంటే అతడు హనానీని చెరసాలలో పెట్టించాడు. అదే సమయంలో ఆసా కొంతమంది మనుష్యులతో చాలా సంకుచితంగా, కఠినంగా ప్రవర్తించాడు.

11 మొదటి నుండి చివరి వరకు ఆసా చేసిన కార్యాలన్నీ యూదా, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి. 12 ఆసా రాజుగా కొనసాగిన ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో[c] అతని పాదాలకు జబ్బు చేసింది. అతని జబ్బు చాలా ప్రమాదంగా వున్నప్పటికీ, ఆసా యెహోవా నుండి సహాయం కోరలేదు. ఆసా వైద్యుల నుండి వైద్య సహాయంకొరకు చూశాడు. 13 ఆసా తన పరిపాలనలో నలబై ఒకటవ సంవత్సరంలో చనిపోయాడు. ఆ విధంగా ఆసా తన పూర్వీకులతో నిద్రించాడు. 14 దావీదు నగరంలో తనకై తాను సిద్ధపర్చుకున్న సమాధిలోనే ప్రజలు ఆసాను వుంచారు. ఆసాకు గౌరవ సూచకంగా సుగంధ దినుసులతోను, పరిమళ ద్రవ్యములతోను నిండిన పడక మీద జనులు వుంచి, అతనిని దహించారు.[d]

యోహాను 12:27-50

యేసు తన మరణాన్ని గురించి మాట్లాడటం

27 “ఇక నా ఆత్మ కలవరం చెందుతున్నది. తండ్రీ నేనేమనాలి? ఈ గడియనుండి నన్ను రక్షించుమని అడగాలా? కాదు! నేను వచ్చింది ఈ గడియ కోసమే కదా! 28 తండ్రీ నీ పేరుకు మహిమ కలిగించుకో.”

అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం, “నేను యిదివరలో నా పేరుకు మహిమ కలిగించాను. మళ్ళీ దానికి మహిమ కలిగిస్తాను!” అని అన్నది.

29 అక్కడ నిలుచున్న ప్రజలు యిది విన్నారు. కొందరు ఉరిమిందన్నారు.

మరి కొందరు, “దేవదూత ఆయనతో మాట్లాడాడు” అని అన్నారు.

30 యేసు, “ఆ గొంతు మీ కోసం పలికింది. నా కోసం కాదు. 31 ఈ ప్రపంచంపై తీర్పు చెప్పే సమయం వచ్చింది. ఈ లోకాధికారిని బయటకు తరిమి వేసే సమయం వచ్చింది. 32 కాని దేవుడు నన్ను ఈ భూమ్మీదినుండి పైకెత్తినప్పుడు నేను ప్రజలందర్ని నా యొద్దకు ఆకర్షిస్తాను. వాళ్ళను నా దగ్గరకు పిలి పించుకుంటాను” అని అన్నాడు. 33 ఇది చెప్పి తాను ఏ విధంగా మరణించనున్నాడో సూచించాడు.

34 ప్రజలు, “మేము ధర్మశాస్త్రం ద్వారా ‘క్రీస్తు’ చిరకాలం ఉంటాడని విన్నాము. అలాంటప్పుడు మనుష్యకుమారుణ్ణి దేవుడు పైకెత్తుతాడని ఎట్లా అనగలుగుతున్నావు? ఈ మనుష్యకుమారుడెవరు?” అని అన్నారు.

35 అప్పుడు యేసు వాళ్ళతో, “వెలుగు మీకోసం యింకా కొంత కాలం మాత్రమే ఉంటుంది. చీకటి రాకముందే, అంటే వెలుగు ఉండగానే ప్రయాణం సాగించండి. చీకట్లో నడిచే వ్యక్తికి తానెక్కడికి వెళుతున్నాడో తెలియదు. 36 వెలుగు ఉన్నప్పుడే దాన్ని విశ్వసించండి. అప్పుడు మీరు వెలుగు యొక్క సంతానంగా లెక్కింపబడతారు” అని అన్నాడు. యేసు మాట్లాడటం ముగించాక వాళ్ళకు కనిపించకుండా ఉండాలని దూరంగా వెళ్ళిపోయాడు.

యూదులు నిరాకరించటం

37 యేసు ఇన్ని మహాత్కార్యాలు వాళ్ళ సమక్షంలో చేసినా వాళ్ళలో ఆయన పట్ల విశ్వసం కలుగలేదు. 38 ప్రవక్త యెషయా చెప్పిన ఈ వాక్యాలు నిజం కావటానికి యిలా జరిగింది:

“ప్రభూ! మా సందేశం ఎవరు విశ్వసించారు?
    ప్రభువు తన శక్తిని ఎవరికి చూపాడు?”(A)

39 అందుచేత వాళ్ళు విశ్వసించలేక పోయారు. ఈ విషయాన్ని యెషయా ప్రవక్త మరొక చోట చెప్పినది నెరవేరునట్లు యిలా జరిగింది:

40 “ప్రభువు వాళ్ళ కళ్ళు కప్పి,
    వాళ్ళ హృదయాలు మూసి వేశాడు.
వాళ్ళు చూడరాదని, వాళ్ళు అర్థం చేసుకోరాదని ఆయన ఉద్దేశ్యం.
అలా చేయకపోతే వాళ్ళు నా వైపు మళ్లుతారు
    వాళ్ళకు నేను నయం చేయవలసివస్తుంది.”(B)

41 యెషయా యేసు మహిమను చూసాడు. కనుకనే ఆయన్ని గురించి ఆ విధంగా మాట్లాడాడు.

42 ఈ పరిస్థితుల్లో కూడా యూదుల నాయకుల్లో కొందరు యేసును విశ్వసించారు. కాని పరిసయ్యులు తమను సమాజం నుండి బహిష్కరిస్తారనే భయం వల్ల ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పలేదు. 43 ఎందుకంటే, వీళ్ళకు దేవుని మెప్పుకన్నా ప్రజల పొగడ్తలంటే ఎక్కవ యిష్టం.

యేసు బోధ జనులకు తీర్పు తీర్చును

44 యేసు, “నన్ను విశ్వసించేవాడు, నన్నే కాక నన్ను పంపిన వానియందు కూడా విశ్వసిస్తాడు. 45 అతడు నన్ను చూసేటప్పుడు నన్ను పంపిన వానిని చూస్తున్నట్లే! 46 నేను ఈ ప్రపంచంలోకి వెలుగ్గా వచ్చాను! ఎందుకంటే నన్ను విశ్వసించేవాడు చీకటిలో ఉండ కూడదని. అందుచేత నేను చెప్పే మాటలన్నీ తండ్రీ నాతో చెప్పుమని ఇచ్చిన మాటలే.

47 “ఎవడైనను నా మాటలు విని వాటిని అనుసరించని వానికి నేను తీర్పు తీర్చను. ఎందుకంటే నేను ఈ ప్రపంచానికి తీర్పు తీర్చటానికి రాలేదు, కాని నేను రక్షించటానికి వచ్చాను. 48 నన్ను, నా మాటల్ని ఇష్టపడక వ్యతిరేకించేవానిపై ఒక న్యాయాధిపతి ఉన్నాడు. నేను పలికిన మాటయే చివరి దినమున వానికి తీర్పుతీరుస్తుంది. 49 నేను నా యిష్ట ప్రకారం మాట్లాడలేదు, గాని నా తండ్రి ఏమి చెప్పుమని నాకు ఆజ్ఞాపించాడో అలాగే చెప్పాను. 50 ఆయన ఆజ్ఞ నిత్య జీవానికి నడిపిస్తుందని నాకు తెలుసు. అందుచేత నేను చెప్పే మాటలన్నీ తండ్రి నాతో చెప్పుమని ఇచ్చిన మాటలే” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International