Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఎస్తేరు 9-10

యూదుల విజయం

పన్నెండో నెల (అదారు) 13వ రోజున ప్రజలందరూ మహారాజు ఆజ్ఞను మన్నించవలసి వుంది. అది యూదులను చంపాలని యూదుల శత్రువులు ఆశించిన రోజు. అయితే, యిప్పుడు ఆ పరిస్థితులు తారుమారయ్యాయి. తమను ద్వేషించిన తమ శత్రువులకంటె యూదులు ఇప్పుడు బలంగా వున్నారు. అహష్వేరోషు మహారాజు సామ్రాజ్యంలోని అన్ని నగరాల్లోని యూదులూ సమావేశమయ్యారు. తమను నాశనం చేయాలని కోరినవారి పైన దాడిచేసేటంత బలాన్ని సమకూర్చుకునేందుకుగాను వాళ్లు సమకూడారు. దానితో, వాళ్లని ఎదిరించి నిలబడగల శక్తిగలవారు ఎవ్వరూ లేకపోయారు. యూదులంటే జనం భయపడ్డారు. సామంత రాజ్యాల్లోని అధికారులు, సామ్రాజ్యాధిపతులు, రాజ్య పాలకులు, రాజోద్యోగులు అందరూ యూదులకు తోడ్పడ్డారు. వాళ్ల ఈ తోడ్పాటుకి మొర్దెకై పట్లనున్న భయమే కారణం. మహారాజు భవనంలోని అతి ముఖ్యుల్లో మొర్దెకై ఒకడయ్యాడు. సామంత రాజ్యాల్లోని ప్రతి ఒక్కరికి మొర్దెకై పేరు తెలుసు. అతనికెంత ప్రాముఖ్యం వుందో తెలుసు. మొర్దెకై నానాటికీ మరింత శక్తివంతమైన వ్యక్తి అయ్యాడు.

యూదులు తమ శత్రువులందర్నీ ఓడించారు. వాళ్లు తమ శత్రువుల్ని హతమార్చేందుకూ, నాశనం చేసేందుకూ కత్తులు ప్రయోగించారు. తమని ద్వేషించినవారి పట్ల యూదులు తమ చిత్తం వచ్చినట్లు వ్యవహరించారు. యూదులు రాజధాని అయిన షూషను నగరంలో 500 మందిని హతమార్చి, నాశనం చేశారు. యూదులు ఈ క్రిందివారిని కూడా మట్టు పెట్టారు: పర్షందాతా, దల్పోను, అస్పాతా, పోరాతా, అదల్యా, అరీదాతా, పర్శష్తా, అరీసై, అరీదై, వైజాతా. 10 ఈ పదిమందీ హామాను కొడుకులు. హమ్మెదాతా కొడుకైన హామాను యూదులకు గర్భశత్రువు. యూదులు హామాను కొడుకులందర్నీ చంపేశారుగాని, వాళ్లకి చెందిన ఆస్తిపాస్తులు వేటినీ వాళ్లు తాకలేదు.

11 ఆ రోజున రాజధాని అయిన షూషను నగరంలో చంపివేయబడిన వాళ్ల సంఖ్యను మహారాజ తెలుసు కున్నాడు. 12 అప్పుడు మహారాజు మహారాణి ఎస్తేరుతో ఇలా అన్నాడు: “షూషను నగరంలో యూదులు హామాను కొడుకులు పదిమందితో బాటు 500 మందిని చంపేశారు. ఇప్పుడిక మహారాజు సామ్రాజ్యంలోని యితర సామంత రాజ్యాల్లో ఏమి జరగాలని నీవు కోరుకుంటున్నావో చెప్పు. నేను అలా చేయిస్తాను. నీవు కోరుకో, కోరుకున్నదేదైనా సరే, నేను చేయిస్తాను.”

13 ఎస్తేరు ఇలా కోరింది, “మహారాజుకి సమ్మతమైతే, షూషను నగరంలోని యూదులను రేపుకూడా యీ కార్యక్రమం కొనసాగించనివ్వండి, హామాను కొడుకులు పదిమంది కళేబరాలనూ ఉరికంబం మీద వేలాడదీయించండి.”

14 మహారాజు అలాగే ఉత్తరువు ఇచ్చాడు. ఆ ఉత్తరువు షూషను నగరంలో మరోక రోజు అమలు జరిగింది. హామాను కొడుకులు పదిమందీ ఉరి కొయ్యలకు వేలాడదీయబడ్డారు. 15 అదారు నెల 14వ రోజున షూషను నగరంలో యూదులందరూ గుమికూడి, మరో 300 మంది పురుషులను చంపేశారు. అయితే, వాళ్లకి చెందిన ఏ వస్తువుల్నీ యూదులు ముట్టలేదు.

16 అదే సమయంలో యితర సామంత రాజ్యాల్లోని యూదులు కూడా తమని తాము కాపాడుకోగల బలాన్ని పుంజుకునేందుకు గాను వాళ్లు సమావేశ మయ్యారు. వాళ్లు అలా తమ శత్రువులను వదిలించుకున్నారు. యూదులు తమ శత్రువుల్లో 75,000 మందిని హతమార్చారు. అయితే, వాళ్లకి చెందిన వస్తువులు వేటినీ యూదులు చేజిక్కించుకోలేదు. 17 అదారు నెల 13వ రోజున యిది జరిగింది. 14వ రోజున యూదులు విశ్రమించారు. యూదులు ఆరోజును తమ సంతోషకరమైన సెలవు దినం చేసుకున్నారు.

పూరీము పండుగ

18 షూషను నగరంలోని యూదులు అదారు నెల 13, 14 తేదీల్లో సమావేశమయ్యారు. తర్వాత 15వ రోజున వాళ్లు విశ్రమించారు. అందుకని, 15వ రోజును వాళ్లు సంతోషకరమైన పండుగ దినం చేసుకున్నారు. 19 కాగా దేశంలో, చిన్నచిన్న గ్రామాల్లో జీవించే యూదులు ఈ పూరీము పండుగను అదారు నెల 14వ రోజున జరుపుకుంటారు. వాళ్లీ 14వ రోజును ఆనందదాయకమైన పండుగగా జరుపుకుంటారు. వాళ్లు ఆ రోజున విందులు జరుపుకుంటారు. ఒకరి కొకరు బహూమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.

20 అప్పుడు జరిగిన ఘటనలన్నింటినీ మొర్దెకై గ్రంథస్తం చేయించాడు. తర్వాత అతను అహష్వేరోషు మహారాజు సామంత రాజ్యాలన్నింటిలోని యూదులందరికీ లేఖలు పంపాడు. అతనా లేఖలను దగ్గర ప్రాంతాలకే కాకుండా దూర ప్రాంతాలకు కూడా పంపాడు. 21 ఏటా అదారు నెల 14, 15 తేదీల్లో యూదులందరూ పూరీము పండుగను పాటించాలని తెలియ చెప్పేందుకుగాను మొర్దెకై ఈ పని చేశాడు. 22 అవి యూదులు తమ శత్రువులను నిశ్శేషం చేసిన రోజులు. అందుకని యూదులు పండుగ దినాలుగా జరుపుకోవాలి. తమ దుఃఖం సంతోషంగా మారిన ఆ నెలను కూడా వాళ్లు పండుగ మాసంగా జరుపుకోవాలి. వాళ్ల రోదన పండుగ దినాలుగా మారిన నెల అది. మొర్దెకై యూదులందరికీ లేఖలు వ్రాశాడు. అతను ఆ రోజులను ఆనందం వెల్లివిరిసే పండుగ దినాలుగా జరుపుకోమని యూదులకు ఆజ్ఞాపించాడు. వాళ్లా రోజుల్లో విందులు జరుపుకోవాలి, ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవాలి, పేదలకు కానుకలివ్వాలి.

23 యూదులు మొర్దెకై తమకు వ్రాసిన విధంగా చేసేందుకు అంగీకరించారు. తాము ప్రారంభించిన వేడుకలను కొనసాగించేందుకు సమ్మతించారు.

24 అగాగీయుడైన హామ్మెదాతా కొడుకు హామాను యూదులందరికీ గర్భశతృవు. యూదులను నాశనం చేసేందుకుగాను వాళ్లకి వ్యతిరేకంగా అతనొక దుష్ట పథకం వేశాడు. యూదులను నాశనం చేసేందుకూ, నిర్మూలించేందుకూ అనువైన రోజును ఎంపిక చేసేందుకుగాను అతను చీట్లు వేశాడు. ఆ కాలంలో దాన్ని “పూరు” అనేవారు, అందుకే ఆ పండుగను “పూరీము” అంటారు 25 హామాను దుష్కార్యాలు చేశాడు. ఎస్తేరు మహారాజు సన్నిధికి వెళ్లి, మాట్లాడింది. దానితో అతను కొత్త ఆజ్ఞలు పంపాడు. ఆ ఆజ్ఞలు హామాను దుష్ట పథకాలను భగ్నం చయడమేగాక, హామాను దుష్ట పథకంలోని దుష్కార్యాలు హామానుకీ, అతని కుటుంబ సభ్యులకీ సంభవించేలా చేశాయి! దానితో హామానూ, అతని కొడుకులూ ఉరికంబాలకు వేలాడదీయబడ్డారు.

26-27 ఆ కాలంలో చీట్లను “పూరీము” అనేవారు, అందుకే ఈ పండుగను “పూరీము” అంటారు. మొర్దెకై ఒక లేఖ వ్రాసి, యూదులను ఈ పండుగ చేసుకోవాల్సిందిగా ఆజ్ఞాపించాడు. అందుకే, యూదులు ఏటా ఈ పండుగను రెండు రోజులపాటు జరుపుకోవడం ఆచారం అయింది. 28 వాళ్లీ పండుగను తమకు గతంలో జరిగినవాటిని గుర్తుంచుకోగలిగేందుకు గాను జరుపుకుంటారు. యూదులూ, వాళ్లతో చేరేవాళ్లూ ఏటా యీ పండుగను సరైన కాలంలో, సక్రమమైన పద్ధతిలో జరుపుకుంటారు. ప్రతి తరమూ, ప్రతి కుటుంబమూ యీ రెండు రోజులనూ గుర్తుంచుకుంటాయి. వాళ్లీ పండుగను ప్రతి సామంత రాజ్యంలోనూ, ప్రతి పట్టణంలోనూ జరుపుకుంటారు. పూరీము రోజుల్లో పండుగ జరుపుకోవడాన్ని యూదులు ఎన్నడూ మానరు. యూదుల ప్రతి తరమూ, ప్రతి కుటుంబమూ ఈ పండుగను సదా గుర్తుంచుకుంటారు.

29 పూరీమును గురించిన ఉత్తరువు లేఖను అబీహాయిలు కూతురు ఎస్తేరు మహారాణీ, యూదుడైన మొర్దెకైలు కలిసి వ్రాశారు. ఈ రెండవ లేఖ నిజమని నిరూపించేందుకుగాను దాన్ని వారు మహారాజు పూర్తి అనుమతి (ఆజ్ఞ)తో వ్రాశారు. 30 మొర్దెకై ఆ లేఖలను అహష్వేరోషు మహారాజు వారి 127 సామంత రాజ్యాల్లోని యూదులందరికీ పంపాడు. ఈ పండుగ శాంతినీ, ప్రజల మధ్య పరస్పర విశ్వాసాన్నీ[a] పెంపొందించాలని జనానికి మొర్దెకై సూచించాడు. 31 పూరీము పండుగ సంబరాలు మొదలు పెట్టమని చెప్పేందుకుగాను మొర్దెకై ఈ లేఖలు వ్రాశాడు. ఈ కొత్త పండుగను ఎప్పుడు మొదలు పెట్టాలోకూడా అతను ఆ లేఖల్లో వాళ్లకి తెలియచేశాడు. యూదులకు యీ ఉత్తరువును యూదుడైన మొర్దెకై, మహారాణి ఎస్తేరూ పంపారు. తద్వారా వాళ్లు యీ రెండు రోజుల పండుగను తమ తరతరాల యూదుల కోసం స్థిరపరిచారు. తాము ఉపవాసాలు చేసి, జరిగిన చెడుగుల విషయంలో విలపించే ఇతర పండుగలను గుర్తు పెట్టుకొనేటట్లే యూదులు ఈ పండుగను కూడా గుర్తు పెట్టుకుంటారు. 32 ఎస్తేరు ఉత్తరువు పూరీము పండుగ నియమాలను స్థిరపరచింది. ఆ విషయాలు గ్రంథాల్లో నమోదు చేయబడ్డాయి.

మొర్దెకైకి గౌరవస్థానం

10 అహష్వేరోషు మహారాజు ప్రజల దగ్గర్నుంచి పన్నులు వసూలు చేసేవాడు. సుదూర ప్రాంతాల్లో సముద్ర తీరాన వున్న నగర వాసులతో బాటు, సామ్రాజ్యంలోని ప్రజలందరూ పన్నులు చెల్లించవలసి వచ్చేది. అహష్వేరోషు మహారాజు చేసిన ఘనకార్యాలన్నీ మాదీయ, పారశీక రాజ్యాల చరిత్ర గ్రంథంలో లిఖింపబడ్డాయి. అలాగే మొర్దెకై చేసిన ఘనకార్యాలన్నీ కూడా ఆ చరిత్ర గ్రంథాల్లో చేర్చబడ్డాయి. మహారాజు మొర్దెకైకి ఘనమైన గౌరవస్థానం కల్పించాడు. సామ్రాజ్యంలో అహష్వేరోషు తర్వాత ప్రాముఖ్యంలో మొర్దెకైది ద్వితీయ స్థానం. యూదులందరిలో మొర్దెకైయే అతి ముఖ్యమైన వ్యక్తి. అతని తోటి యూదులు అతన్నెంతగానో గౌరవించేవారు. మొర్దెకై తన జాతీయ ప్రజల సంక్షేమ సౌభాగ్యాల కోసం విశేషంగా కృషి చేశాడు. మొర్దెకై యూదులందరికీ శాంతిని చేకూర్చాడు. అందుకే, సాటి యూదులందరికీ మొర్దెకై అంటే ఎంతో గౌరవం.

అపొస్తలుల కార్యములు 7:1-21

స్తెఫను ఉపన్యాసం

ఆ తర్వాత ప్రధాన యాజకుడు, “ఈ నేరారోపణలు నిజమా?” అని అతణ్ణి అడిగాడు. అతడు సమాధానంగా, “అయ్యలారా! సోదరులారా! నేను చెప్పేది వినండి. అది మన తండ్రి అబ్రాహాము ‘మెసొపొతమియలో’ నివసిస్తున్న కాలం. అంటే, అతడు అప్పటికి యింకా తన నివాసాన్ని ‘హారాను’ పట్టణానికి మార్చలేదన్న మాట. అక్కడ అతనికి తేజస్వి అయిన దేవుడు కనిపించి, ‘నీ దేశాన్ని, ప్రజల్ని వదిలి నేను చూపబోయే దేశానికి వెళ్ళు’ అని అన్నాడు.

“అందువల్ల అతడు కల్దీయుల దేశాన్ని వదిలి హారానులో స్థిరపడ్డాడు. అతని తండ్రి చనిపోయాక ఆ దేశాన్ని కూడా వదలమని, మీరిప్పుడు నివసిస్తున్న ఈ దేశంలో దేవుడతణ్ణి స్థిరపర్చాడు. దేవుడతనికి ఈ దేశంలో ఒక్క అడుగు భూమి కూడా ఆస్తిగా యివ్వలేదు. అతనికి అప్పుడు సంతానం లేకపోయినా, అతనికి, అతని తర్వాత రానున్న వాళ్ళకు ఆ దేశం ఆస్తిగా ఉంటుందని వాగ్దానం చేసాడు.

“దేవుడతనితో, ‘నీ వారసులు పరదేశంలో నివసిస్తారు. ఆ పరదేశీయులు నీ వాళ్ళను నాలుగు వందల సంవత్సరాలు తమ బానిసలుగా ఉంచుకొని వాళ్ళను కష్టపెడతారు. వాళ్ళను బానిసలుగా చేసిన దేశాన్ని నేను శిక్షిస్తాను. ఆ తర్వాత నీ ప్రజలు ఆ దేశం వదిలి నన్ను యిక్కడ ఆరాధిస్తారు’ అని అన్నాడు.

“సున్నతి నియమాన్ని పాటిస్తే తన వాగ్దానాన్ని నిలుపుకొంటానని దేవుడు అబ్రాహాముతో ఒక ఒప్పందం చేసాడు. ఇస్సాకు పుట్టిన ఎనిమిదవ రోజున అబ్రాహాము అతనికి సున్నతి చేయించాడు. అదే విధంగా ఇస్సాకు తన కుమారుడైన యాకోబుకు సున్నతి చేయించాడు. యాకోబు తన పన్నెండుమంది కుమారులకు సున్నతి చేయించాడు. ఈ పన్నెండు మంది పండ్రెండు వంశాలకు మూల పురుషులయ్యారు.

“వీళ్ళకు, తమలో ఒకడైన యోసేపు మీద ఈర్ష్య ఉండేది. అందువల్ల వాళ్ళతణ్ణి ఈజిప్టు దేశానికి బానిసగా అమ్మేసారు. కాని దేవుడతనికి అండగా ఉండి, 10 అతణ్ణి కష్టాలనుండి రక్షించాడు. అతనికి జ్ఞానాన్ని యిచ్చాడు. ఆ జ్ఞానంతో అతడు ఈజిప్టు రాజైన ‘ఫరో’ అభిమానాన్ని సంపాదించాడు. ఫరో అతణ్ణి ఈజిప్టు దేశానికి పాలకునిగా, తన రాజభవనాలకు అధికారిగా నియమించాడు. 11 ఇంతలో ఈజిప్టు, కనాను దేశాల్లో కరువు రాగా ప్రజలు చాలా కష్టాలనుభవించారు. మన పూర్వికులకు తినటానికి తిండి కూడా లేకుండింది.

12 “ఈజిప్టు దేశంలో ధాన్యం ఉందని తెలియగానే యాకోబు మన పూర్వికుల్ని మొదటి సారిగా అక్కడకు పంపాడు. 13 రెండవసారి వచ్చినప్పుడు, యోసేపు తానెవ్వరన్న విషయం తన సోదరులకు చెప్పాడు. యోసేపు కుటుంబాన్ని గురించి ఫరోకు తెలిసిపోయింది. 14 ఆ తర్వాత యోసేపు తన తండ్రి యాకోబును, డెభ్బై ఐదు మందిగల తన కుటుంబాన్ని పిలవనంపాడు. 15 యాకోబు ఈజిప్టు దేశానికి వచ్చాక, అతడు, మన పూర్వికులు అందరూ చనిపోయారు. 16 వాళ్ళ దేహాలు షెకెము పట్టణానికి తేబడ్డాయి. అబ్రాహాము యిదివరలో హమోరు వంశం వాళ్ళకు డబ్బిచ్చి వాళ్ళనుండి ఒక స్మశాన భూమిని కొని ఉంచాడు. వాళ్ళు అక్కడ సమాధి చేయబడ్డారు.

17 “దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానం ఫలించే సమయం దగ్గరకు వచ్చింది. ఈజిప్టులో మన వాళ్ళ సంఖ్య బహుగా పెరిగింది. 18 కొంత కాలం తర్వాత యోసేపును గురించి ఏమీ తెలియనివాడు ఈజిప్టు దేశానికి పాలకుడయ్యాడు. 19 అతడు మన వాళ్ళను మోసం చేసాడు. మన వాళ్ళ సంతానం చనిపోవాలని, వాళ్ళకు పుట్టిన పసికందుల్ని బయట వేయించి వాళ్ళ పట్ల క్రూరంగా ప్రవర్తించాడు.

20 “ఆ కాలంలోనే మోషే జన్మించాడు. ఇతడు సామాన్యుడు కాడు. మోషే మూడు నెలల దాకా తన తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు. 21 ఇతణ్ణి యింటి బయట ఉంచగానే ఫరో కుమార్తె తీసుకెళ్ళి తన స్వంత కుమారునిగా పెంచుకుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International