Old/New Testament
సొలొమోను జ్ఞానాన్ని కోరటం
1 యెహోవా దేవుని కృపవున్నందువల్ల సొలొమోను చాలా శక్తిమంతుడైన రాజుగా రూపొందాడు. యెహోవా సొలొమోనును గొప్ప వ్యక్తిగా చేశాడు.
2 సొలొమోను ఇశ్రాయేలు ప్రజలందరితో మాట్లాడాడు. అతడు సైన్యాధికారులతోను, దళాధిపతులతోను, న్యాయాధిపతులతోను, ఇంకను ఇశ్రాయేలులోని ప్రతి ఒక్క నాయకునితోను, ప్రతి కుటుంబ పెద్దతోను మాట్లాడాడు. 3 పిమ్మట సొలొమోను, అతని దగ్గరికి వచ్చిన ప్రజలందరూ కలిసి గిబియోనులో వున్న గుట్టమీదికి (ఉన్నత స్థలం) వెళ్లారు. దేవుని సన్నిధి గుడారం అక్కడ ఉంది. యోహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఎడారిలో వున్నప్పుడు ఈ గుడారాన్ని నిర్మించాడు. 4 దేవుని ఒడంబడిక పెట్టె[a] దావీదు కిర్యత్యారీము నుండి యెరూషలేముకు తీసుకొని వచ్చాడు. దానిని వుంచటానికి దావీదు యెరూషలేములో ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. దేవుని ఒడంబడిక పెట్టెను వుంచటానికి దావీదు యెరూషలేములో ఒక గుడారం ఏర్పాటు చేశాడు. 5 బెసలేలు కంచుతో ఒక బలిపీఠాన్ని తయారుచేశాడు. బెసలేలు తండ్రిపేరు ఊరి. ఊరి తండ్రి పేరు హూరు. కాని ఈ కంచు పీఠం గిబియోనులో పవిత్ర గుడారం ఎదుట వుంది. అందువల్ల సొలొమోను, ప్రజలు కలిసి దేవుని సలహా పొందటానికి గిబియోనుకు వెళ్లారు. 6 సన్నిధి గుడారం వద్ద దేవుని ముందున్న కంచుపీఠం వద్దకు సొలొమోను వెళ్లాడు. బలపీఠం మీద సొలొమోను వెయ్యి దహనబలులు అర్పించాడు.
7 ఆ రోజు రాత్రి దేవుడు సొలొమోనుతో స్వప్నములో యిలా అన్నాడు: “సొలొమోనూ, నీకు ఏమి కావాలో కోరుకో.”
8 సొలొమోను దేవునితో యిలా అన్నాడు: “నా తండ్రి దావీదు పట్ల నీవు చాలా దయకలిగియున్నావు. నా తండ్రి స్థానంలో కొత్త రాజుగా వ్యవహరించటానికి నీవు నన్ను ఎంపిక చేశావు. 9 నా ప్రభువైన దేవా నీవు నా తండ్రి దావీదుకు చేసిన వాగ్దానాన్ని ఇప్పుడు నెరవేర్చు. ఒక గొప్ప రాజ్యానికి నన్ను రాజుగా ఎంపిక చేశావు. ఇక్కడి జనాభా భూమి మీద ధూళిలా విస్తారంగా వుంది. 10 ఇప్పుడు నాకు తెలివిని, జ్ఞానాన్ని ప్రసాదించు. దానివల్ల ఈ అశేష ప్రజానీకాన్ని సన్మార్గంలో నడిపించగలను. నీ సహాయం లేకుండా ఈ ప్రజానీకాన్ని ఏ ఒక్కడూ పరిపాలించలేడు!”
11 అది విని సొలొమోనుతో దేవుడు యీలా అన్నాడు: “నీ ప్రవర్తన బాగుంది. నీవు ఐశ్వర్యాన్నిగాని, ధనికులకుండే భోగ భాగ్యాలను గాని, పేరుప్రతిష్ఠలనుగాని కోరలేదు. నీ శత్రువులంతా నాశనం కావాలని కూడా నీవు కోరలేదు. నీవు చాలాకాలం బ్రతకాలని దీర్ఘాయుష్షూ కోరలేదు. నా ప్రజలను పాలించటానికి నీవు తెలివిని, వివేచననూ, జ్ఞానాన్ని ప్రసాదించమని కోరావు. ఈ ప్రజలకు రాజుగా నిన్ను నేను ఎంపిక చేశాను. 12 కావున నీకు నేను తెలివిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను. నీకు ధనాన్ని, భాగ్యాలను, గౌరవాన్ని కూడ నేను ఇస్తున్నాను. నీకు ముందున్న రాజులెవ్వరూ ఇంతటి ఐశ్వర్యాన్ని, గొప్పతనాన్ని పొందియుండలేదు. నీ తరువాత వచ్చే రాజులుకూడ ఇంతటి భాగ్యాన్ని, ఘనతను కలిగియుండరు.”
13 సొలొమోను గిబియోనులోని ఆరాధనా స్థలానికి వెళ్లాడు. సన్నిధి గుడారాన్ని వదిలి, ఇశ్రాయేలు రాజుగా పాలించటానికి యెరూషలేముకు తిరిగి వెళ్లాడు.
సొలొమోను సైన్యాన్ని వృద్దిచేయటం
14 సొలొమోను గుర్రాలను, రథాలను సేకరించాడు. అతనికి పద్నాలుగువందల రథాలు, పన్నెండువేల గుర్రాలు వున్నాయి. సొలొమోను నగరాలలో ప్రత్యేక రథశాలలు నిర్మించి వాటిని అక్కడ వుంచాడు. యెరూషలేములో కూడా కొన్ని గుర్రాలను, రథాలను సొలొమోను వుంచాడు. యెరూషలేములోనే రాజగృహం కూడా వుంది. 15 యెరూషలేములో సొలొమోను విస్తారంగా వెండి బంగారాలను సేకరించి నిల్వచేశాడు. అతడు వెండి బంగారాలను ఎంత మేరకు సేకరించాడనగా వాటి నిల్వలు సామాన్య రాతిగుట్టల్లా వున్నాయి. సొలొమోను సరళ వృక్షాల కలపను చాలా సేకరించాడు. అతడు సరళ చెట్ల కలపను పల్లపు ప్రాంతాలలో విస్తరించి వున్న మేడి చెట్లంత ఎక్కువగా సేకరించాడు. 16 ఈజిప్టు నుంచి, కవే (సైలీషియా అనబడే దక్షిణటర్కీ ప్రాంతం) నుంచి సొలొమోను గుర్రాలను తెప్పించాడు. రాజు వర్తకులు ఈ గుర్రాలను కవేలో కొనేవారు. 17 రాజు వర్తకులు ఈజిప్టులో ఒక్కొక్క రథాన్ని ఆరువందల తులాల వెండిని, ఒక్కొక్క గుర్రాన్ని నూట యేబది తులాల వెండిని వెచ్చించి కోనేవారు, ఆ కాలంలో వర్తకులు గుర్రాలను, రథాలను హిత్తీయుల రాజులకు, అరాము (సిరియా) రాజులకు కూడ అమ్మేవారు.
ఆలయ, రాజగృహ నిర్మాణానికి సొలొమోను యత్నం
2 యెహోవా పేరు ఘనపర్చబడేలా ఆలయ నిర్మాణానికి సొలొమోను సన్నాహం చేశాడు. తన కొరకై ఒక రాజభవనాన్ని కూడ నిర్మించుకోవాలని సొలొమోను తలంచాడు. 2 సొలొమోను డెబ్బైవేల మందిని సరుకు చేరవేయటానికి నియమించాడు. ఎనబైవేల మందిని కొండల్లో రాళ్లు కొట్టడానికి అతడు నియమించాడు. పనివాళ్ల మీద నిఘావుంచడానికి మూడువేల ఆరువందల మందిని నియమించాడు.
3 తరువాత సొలొమోను హీరాముకు ఒక వర్తమానం పంపాడు. హీరాము తూరు నగరపు రాజు. సొలొమోను హీరాముకు యిలా చెప్పి పంపాడు:
“నీవు నా తండ్రి దావీదుకు సహాయపడినట్లు నాకు కూడ సహాయం చెయ్యి. తను నివసించే భవన నిర్మాణానికి నీవాయనకు సరళ వృక్షాల కలపను పంపావు. 4 నా దేవుడైన యెహోవా గౌరవార్థం నేనొక ఆలయం నిర్మింపదలిచాను. నా ప్రజలు ఆరాధించుకొనటానికి వీలుగా దానిని నా దేవునికి అంకితం చేస్తాను. యెహోవా ముందు ధూపం వేసి, ఆయన సన్నిధిని ప్రతినిత్యం పవిత్రమైన రొట్టెను నైవేద్యంగా వుంచి, బలిపీఠంపై ఉదయం, సాయంత్రం దహనబలులు అర్పిస్తూ, మేము మా దేవుని ఆరాధిస్తాము. సబ్బాతు దినాలలోను, అమావాస్య రోజులందును, మరి ఇతర ప్రత్యేక ఉత్సవ దినాలలోను, తనను ఆరాధించుమని మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞ యిచ్చాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలు శాశ్వతంగా పాటించే ఒక నియమం.
5 “మా దేవుడు మిగిలిన దైవాలకంటె మహోన్నతుడు గనుక, ఆయనకు నేను నిర్మించే ఆలయం కూడా ఉన్నతంగా ఉంటుంది. 6 నిజానికి మానవ మాత్రుడెవ్వడూ మా దేవునికి ఆలయం నిర్మించలేడు. పరలోక భూలోకాలే మా దేవునికి నిలయాలు కాలేనప్పుడు, నేను ఆయనకు ఆలయం నిర్మాణం చేయలేను. నేను కేవలం ఆయన సన్నిధిని ధూపం వేయటానికి ఒక పీఠం మాత్రమే నిర్మించగలను.
7 “కావున వెండి బంగారు పనులలోను; కంచు, ఇనుము పనులలోను నేర్పరియైన ఒక పనివానిని ఇప్పుడు నా వద్దకు పంపించు. అతడు ఊదా, నీలిరంగు తెరల పనిలో కూడా నేర్పరియై ఉండాలి. నావద్ద వున్న యూదా, యెరూషలేము శిల్పులతో కలిసి అతడు చెక్కడపు పనులు చేయగలిగి ఉండాలి. నా తండ్రియగు దావీదు ఇక్కడ ఈ మనుష్యులను ఎంపిక చేశాడు. 8 సరళ వృక్షాల, దేవదారు వృక్షాల, చందనపు చెట్ల కలపను లెబానోను అడవుల నుండి పంపించు. లెబానోనులో చెట్లను కొట్టడంలో నీ మనుష్యులు అనుభవం కలవారని నాకు తెలుసు. నా సేవకులు నీ మనుష్యులకు సహాయపడతారు. 9 సాధ్యమైనంత ఎక్కువ కలపను నాకు పంపించు. నేను నిర్మించబోయే ఆలయం చాల గొప్పదై, అద్భుతమైనదిగా వుంటుంది. 10 కలప నరికే పనివారికి ఆహారం నిమిత్తం నేను నాలుగు వందల గరిసెల[b] గోధుములు, నాలుగు వందల గరిసెల యవలు, ఒక లక్షా పదిహేను వేల గేలనుల (మూడు వేల ఎనిమిది వందల పడులు లేక ఇరువది వేల బాదులు) ద్రాక్షారసమును, అదే పరిమాణములో నూనెను కేటాయిస్తున్నాను.”
11 సొలొమోనుకు సమాధానమిస్తూ, హీరాము ఒక వర్తమానాన్ని పంపాడు. ఆ వర్తమానం ఇలా వుంది:
“సొలొమోనూ, యెహోవా తన ప్రజలను ప్రేమిస్తున్నాడు. అందువల్లనే ఆయన నిన్ను వారికి రాజుగా నియమించాడు.” 12 హీరాము తన సందేశంలో ఇంకా యిలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడగు యెహోవాకు స్తోత్రం చేయండి! ఆయన ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు. ఆయన రాజైన దావీదుకు ఒక తెలివైన కుమారుని ప్రసాదించాడు. సొలొమోనూ, నీకు తెలివి, అవగాహన వున్నాయి. నీవు యెహోవా కోసం ఒక ఆలయాన్ని నిర్మిస్తున్నావు. నీకొరకు నీవొక రాజభవనాన్ని కూడా నిర్మింప తలపెట్టావు. 13 నేను నీ వద్దకు ఒక నైపుణ్యంగల పనివానిని పంపుతాను. అతడు రకరకాల కళలలో అభిరుచి, అనుభవం వున్నవాడు. అతని పేరు హూరాము అబీ. 14 అతని తల్లి దాను వంశస్థురాలు. అతని తండ్రి తూరు నగరవాసి. హూరాము – అబీ బంగారం, వెండి, కంచు, ఇనుము, రాతి, కలప పనులలో బహు నేర్పరి. హూరాము – అబీ ఊదా, నీలి, ఎర్రపు రంగుల వస్తువుల, ఖరీదైన వస్త్రాల పనులలో కూడ మంచి నేర్పరి. పైగా హూరాము – అబీ చెక్కడపు పనులలో కూడా నిపుణుడు. నీవు చూపిన ఏ నమూనానైనా అతడు అర్థం చేసికొని దాని ప్రకారం పనిచేయగల నేర్పరి. అతడు నీ వద్ద వున్న శిల్పులకు, కళాకారులకు సహాయకారిగా వుంటాడు. దావీదు ఏర్పరచిన కళాకారులకు కూడ సహాయపడతాడు. నీ తండ్రియగు దావీదు మాటను నేను అనుసరిస్తాను.
15 “నీవు గోధుమలు, యవలు, నూనె, ద్రాక్షారసం నాకు పంపుతానని వ్రాశావు. వాటిని నా పనివాళ్ల నిమిత్తం పంపించు. 16 లెబానోను దేశంలో మేము కలప నరుకుతాము. నీకు ఎంత కలప కావాలో అంత కలప నరుకుతాము. ఆ కలపనంతా తెప్పలుగా కట్టి యొప్పె పట్టణం మీదుగా సముద్రం మీద పంపుతాము. తరువాత ఆ కలపను నీవు యెరూషలేముకు బండ్లమీద మోయించవచ్చు.”
17 అప్పుడు సొలొమోను ఇశ్రాయేలులో నివసిస్తున్న విదేశీయులందరినీ లెక్కించాడు. ఇది దావీదు జనాభా లెక్కలు తీయించిన తరువాత జరిగింది. దావీదు సొలొమోను తండ్రి. దేశంలో ఒక లక్షా ఏబై మూడువేల ఆరువందల మంది పరదేశీయులున్నట్లు వారు కనుగొన్నారు. 18 బరువులు మోయటానికి డెబ్బై వేలమంది విదేశీయులను సొలొమోను నియమించాడు. కొండల్లో రాళ్లు చెక్కటానికి ఎనబై వేల మంది విదేశీయులను దావీదు నియమించాడు. పనివారిపై విచారణ చేయడానికి మరి మూడువేల ఆరువందల విదేశీయులను సొలొమోను ఎంపిక చేశాడు.
సొలొమోను ఆలయాన్ని నిర్మించటం
3 యెరూషలేములో మోరీయా పర్వతం మీద సొలొమోను ఆలయ నిర్మాణం మొదలు పెట్టాడు. ఈ మోరీయా పర్వతం మీదే సొలొమోను తండ్రియైన దావీదుకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. దావీదు సిద్ధపర్చిన స్థలంలోనే సొలొమోను ఆలయాన్ని నిర్మించాడు. ఈ స్థలం ఒర్నానుకు చెందిన నూర్పిడి కళ్లంవద్ద వుంది. ఒర్నాను యెబూసీయుడు. 2 తన పాలన ఇశ్రాయేలులో నాల్గవ సంవత్సరం రెండవ నెల జరుగుతూ వుండగా సొలొమోను ఆలయ నిర్మాణం చేపట్టాడు.
3 ఆలయ నిర్మాణ విషయంలో సొలొమోనుకు కొలతలు యివ్వబడ్డాయి: దాని పునాది తొంబై అడుగుల (అరవై మూరలు) పొడవు: ముప్పై అడుగుల (ఇరవై మూరలు) వెడల్పు. ఆలయ కొలతలు తీసుకొన్నుప్పుడు. సొలొమోను పాత మూర కొలతనే అనుసరించాడు. 4 ఆలయ మండపం పొడవు ముప్పై అడుగులు; ఎత్తు ముప్పై అడుగులు. అతడు మండపము యొక్క లోపలి భాగమంతా మేలిమి బంగారంతో పొదిగించాడు. 5 పెద్దగది గోడల మీద తమాల వృక్షముల (ఖర్జూరపు చెట్లు) చెక్కలు అమర్చాడు. ఆ తమాల వృక్షపు చెక్కలమీద మేలిమి బంగారపు రేకులు తాపించాడు. ఈ బంగారపు రేకుల మీద ఖర్జూరపు చెట్ల బొమ్మలు చెక్కించి గొలుసుల నగిషీ పని చేయించాడు. 6 ఆలయంలో అందం ఇనుమడించే విధంగా విలువైన రత్నాలు పొదిగించాడు. పర్వయీము నుండి తెచ్చిన బంగారాన్ని ఈ పనికి వినియోగించాడు. (అక్కడ బంగారం విస్తారంగా లభించేది. బహుశః ఆ ప్రదేశం ఓఫీరు దేశంలో ఉండి వుండవచ్చు). 7 ఆలయపు లోపలి భాగాన్నంతా బంగారు రేకులతో కప్పించాడు. పై కప్పు దూలాలకు దర్వాజాలకు, గోడలకు, తలుపులకు సొలొమోను బంగారు పూత వేయించాడు. గోడల మీద దేవదూతల (కెరూబులు) చిత్రాలు చెక్కించాడు.
8 తరువాత సొలొమోను అతి పవిత్ర స్థలం[c] ఏర్పాటు చేశాడు. అతి పవిత్ర స్థలం పొడవు ముప్పై అడుగులు; వెడల్పు ముప్పై అడుగులు. ఆలయం వెడల్పంత వెడల్పు దీనికి కూడ వుంది. అతి పవిత్ర స్థలం గోడల నిండా మేలిమి బంగారు రేకులు వేయించాడు. ఈ బంగారపు బరువు ఇరవై మూడు టన్నులు (ఆరువందల తలాంతులు). 9 బంగారపు మేకుల తూకము ఏబై తులాలు. (ఇంచుమించు ఒకటింపావు పౌనులు). పై గదులకు బంగారు పూత వేయించాడు. 10 రెండు కెరూబుల బొమ్మలు అతి పరిశుద్ధ స్థలంలో పెట్టించటానికి చేయించాడు. పనివారు ఆ కెరూబుల బొమ్మలకు బంగారు తొడుగు వేశారు. 11 ఆ కెరూబుల ప్రతిదాని రెక్క పొడవు ఏడున్నర అడుగులు ఉంది. ఆ రెండు కెరూబుల నాలుగు రెక్కల పొడవు ముప్పై అడుగులు. మొదటి కెరూబు ఒక రెక్క ఒక పక్క గోడకు ఆనుకొని వుంటుంది. రెండవ రెక్క రెండవ కెరూబు రెక్కకు తగులుతూ వుంటుంది. 12 రెండవ కెరూబు ఒక రెక్క గది గోడకు రెండవ వైపున ఆనుతుంది. 13 రెండు కెరూబుల రెక్కలు మొత్తం ముప్పై అడగుల దూరం వ్యాపించి వుంటాయి. దేవదూతల బొమ్మలు అతి పరిశుద్ధ స్థలంలోకి చూస్తున్నట్లు నిలబడి వుంటాయి.
14 నీలం, ఊదా, ఎరుపు బట్టలతోను, ఖరీదైన పట్టుతోను సొలొమోను తెరలు[d] చేయించాడు. ఈ తెరల మీద కూడ కెరూబుల చిత్రాలు చిత్రించాడు.
15 ఆలయం ముందు రెండు స్తంభాలను ఏర్పాటు చేయించాడు. ఒక్కొక్క స్తంభం ఏబై రెండున్నర అడుగుల (ముప్పైయైదు మూరలు) ఎత్తు వుంటుంది. ఒక్కొక్క స్తంభం యొక్క శిఖరంమీది పీట యెత్తు ఏడున్నర అడుగులు. 16 కంఠాహారం లాంటి గొలుసులను సొలొమోను చేయించాడు. ఆ గొలుసులను స్తంభాల మీద పీటలకు అలంకరించాడు. వంద దానిమ్మ కాయల బొమ్మలు చేయించి గొలుసులకు తగిలించాడు. 17 ఇలా అలంకరించిన స్తంభాలను సొలొమోను ఆలయం ముందు నిలిపాడు. ఒక స్తంభం కుడి ప్రక్క, రెండవ స్తంభం ఎడమ ప్రక్కన నిలిపారు. సొలొమోను కుడి ప్రక్క స్తంభానికి “యాకీను”[e] అని పేరు పెట్టాడు. ఎడమ ప్రక్క స్తంభానికి “బోయజు”[f] అని పేరు పెట్టాడు.
గొఱ్ఱెలకాపరి, తన గొఱ్ఱెలు
10 యేసు, “ఇది నిజం. గొఱ్ఱెల దొడ్డిలోకి తలుపు ద్వారా వెళ్ళకుండా గోడనెక్కి వెళ్ళేవాడు దొంగ, దోపిడిగాడు. 2 తలుపు ద్వారా ప్రవేశించేవాడు ఆ గొఱ్ఱెలకు కాపరి. 3 ద్వారపాలకుడు అతని కోసం తలుపు తెరుస్తాడు. గొఱ్ఱెలు అతని స్వరము గుర్తిస్తాయి. ఆ గొఱ్ఱెలు అతనివి. అతడు ఆ గొఱ్ఱెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి తీసుకొని వెళ్తాడు. 4 తన గఱ్ఱెల్ని వెలుపలికి పిలుచుకొని వచ్చాక అతడు ముందు నడుస్తాడు. వాటికి అతని స్వరం తెలుసు కనుక అవి అతణ్ణి అనుసరిస్తాయి. 5 అవి క్రొత్త వాని వెంట వెళ్ళవు. క్రొత్త వాని స్వరం గుర్తుపట్టలేవు. కనుక పారిపోతాయి.” అని అన్నాడు.
6 యేసు ఈ ఉపమానం ఉపయోగించి బోధించాడు. కాని వాళ్ళకు ఆయనేమి చెబుతున్నాడో అర్థం కాలేదు.
యేసు మంచి కాపారి
7 అందువల్ల యేసు మళ్ళీ ఈవిధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “నిజంగా నేను గొఱ్ఱెలకు ద్వారాన్ని. 8 నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు దొంగలు, దోపిడిగాళ్ళు. కనుక గొఱ్ఱెలు వాళ్ళ మాటలు వినలేదు. 9 నేను ద్వారాన్ని. నా ద్వారా ప్రవేశించిన వాళ్ళు రక్షింపబడతారు. వాళ్ళు స్వేచ్ఛతో లోపలికి వస్తూ పోతూ ఉంటారు. ఆ గొఱ్ఱెలకు పచ్చిక బయళ్ళు కనిపిస్తాయి. 10 దొంగ దొంగతనం చేయటానికి, చంపటానికి, నాశనం చేయటానికి వస్తాడు. నేను వాళ్ళకు క్రొత్త జీవితం ఇవ్వాలని వచ్చాను. ఆ క్రొత్త జీవితం సంపూర్ణమైనది.
11 “మంచి కాపరి గొఱ్ఱెల కోసం చావటానికి కూడా సిద్ధమౌతాడు. నేను ఆ మంచి కాపరిని. 12 కూలి కోసం పనిచేసే వాడు కాపరికాడు. గొఱ్ఱెలు అతనివి కావు. కనుక అతడు తోడేళ్ళు రావటం చూస్తే గొఱ్ఱెల్ని వదిలి పారిపోతాడు. అప్పుడు తోడేళ్ళు వచ్చి మంద మీద పడి వాటిని చెదరగొడతాయి. 13 అతడు కూలి కొరకు పని చేసేవాడు కాబట్టి గొఱ్ఱెల క్షేమం చూడడు.
14-15 “నేను మంచి కాపరిని. నా తండ్రికి నన్ను గురించి, నాకు నా తండ్రిని గురించి తెలుసు. అదే విధంగా నాకు నా గొఱ్ఱెల్ని గురించి, నా గొఱ్ఱెలకు నా గురించి తెలుసు. నా గొఱ్ఱెల కోసం నేను ప్రాణం ఇస్తాను. 16 ఈ మందకు చెందని గొఱ్ఱెలు కొన్ని ఉన్నాయి. అవికూడా నావే. వాటిని కూడా నేను తీసుకొని రావాలి. అవి నా మాట వింటాయి. అప్పుడు అన్నీ ఒకే మందగా ఉంటాయి. ఒకే ఒక కాపరి ఉంటాడు. 17 నేను నా ప్రాణం యివ్వటానికి సిద్ధంగా ఉన్నాను. దాన్ని తిరిగి పొందడానికి శక్తిమంతుడను. కనుకనే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. 18 నా ప్రాణాన్ని నానుండి ఎవ్వరూ తీసుకోలేరు. నేను స్వయంగా నా ప్రాణం యిస్తాను. నా ప్రాణం యివ్వటానికి, తిరిగి తీసుకోవటానికి నాకు అధికారం ఉంది. అది నా తండ్రి ఆజ్ఞ.”
19 ఈ మాటల వల్ల యూదుల్లో తిరిగి చీలికలు వచ్చాయి. 20 చాలా మంది, “దయ్యం పట్టి అతనికి బాగా పిచ్చెక్కింది. అతని మాటలెందుకు వినటం?” అని అన్నారు.
21 కాని మరికొందరు, “అవి దయ్యం పట్టినవాని మాటలు కావు. దయ్యం గ్రుడ్డి వాళ్ళకు ఎట్లా దృష్టిని కలిగించగలదు?” అని అన్నారు.
యూదులు విశ్వసించకపోవటం
22 ఆలయ ప్రతిష్టిత అనే పండుగ యెరూషలేములో జరుగుతూంది. 23 అది చలికాలం. యేసు మందిరావరణంలో సొలొమోను మంటపం దగ్గర నడుస్తూవున్నాడు. యూదులు ఆయన చుట్టూ గుమికూడారు.
© 1997 Bible League International