Old/New Testament
యెహోయాహాజు తన పరిపాలన ప్రారంభించుట
13 యెహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోనులోని ఇశ్రాయేలుకు రాజయ్యాడు. అహజ్యా కుమారుడైన యోవాషు యూదా రాజుగా ఉన్న 23వ సంవత్సరమున ఇది జరిగింది. యెహోయాహాజు 17 ఏళ్లపాటు పరిపాలించాడు.
2 యెహోయాహాజు యెహోవా తప్పు అని చెప్పిన పనులను చేశాడు. ఇశ్రాయేలును పాపానికి గురిచేసిన నెబాతు కుమారుడు యరొబాము పాపాలను యెహోయాహాజు అనుసరించాడు. యెహోయాహాజు వీటిని చేయడం మానలేదు. 3 అప్పుడు యెహోవా ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా కోపగించెను. సిరియా రాజయిన హజాయేలు, హజాయేలు కుమారుడైన బెన్హదదులకు యెహోవా ఇశ్రాయేలు దేశపు అధికారాన్ని ఇచ్చెను.
ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవా దయ
4 తర్వాత యెహోయాహాజు తనకు సహాయం చేయమని యెహోవాను ప్రార్ధించాడు. యెహోవా అతని మొర ఆలకించాడు. ఇశ్రాయేలు కష్టాలను యెహోవా చూశాడు. సిరియా రాజు ఇశ్రాయేలు వారిని ఎలా కష్టపెట్టెనో కూడా చూశాడు.
5 అందువల్ల ఇశ్రాయేలుని కాపాడేందుకు ఒక వ్యక్తిని యెహోవా పంపాడు. ఇశ్రాయేలువారు సిరియావారి నుండి విడిపింపబడ్డారు. అందువల్ల ఇశ్రాయేలువారు పూర్వం చేసినట్లుగా, తమ ఇళ్లకు పోయారు.
6 కాని ఇశ్రాయేలువారు ఇశ్రాయేలును పాపానికి గురి చేసిన యరొబాము కుటింబీకుల పాపాలను ఆపలేదు. యరొబాము చేసిన పాపాలను వారు కొనసాగించారు. వారు షోమ్రోనులో అషెరా స్తంభాలు ఉంచారు.
7 సిరియా రాజు యెహోయాహాజు యొక్క సైన్యాన్ని ఓడించి సైన్యంలోని చాలామందిని సిరియా రాజు నాశనం చేశాడు. అతను ఏబై మంది గుర్రాల సైనికులను, పదిరథాలను, పదివేలమంది సైనికులను మాత్రమే విడిచిపెట్టాడు. యెహోయాహాజు యొక్క సైనికులు నూర్పిడి సమయాన గాలికి చెదరకొట్టబడే పొట్టువంటి వారైనారు.
8 యెహోయాహాజు చేసిన ఘనకార్యాలన్నీ “ఇశ్రాయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడ్డాయి. 9 యెహోయాహాజు మరణించగా, అతని పూర్వికులతో పాటు అతను సమాధి చేయబడ్డాడు. షోమ్రోనులో ప్రజలతనిని సమాధి చేశారు. యెహోయాహాజు కుమారుడు యెహోయాషు అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.
యెహోయాషు ఇశ్రాయేలుని పాలించుట
10 యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు షోమ్రోనులోని ఇశ్రాయేలుకు రాజయ్యాడు. యూదా రాజుగా యెహోయాషు పరిపాలించిన 37వ సంవత్సరంలో ఇది జరిగింది. యెహోయాషు ఇశ్రాయేలీయులను 16 సంవత్సరాలు పరిపాలించాడు. 11 యెహోవా తప్పు అని చెప్పిన కార్యాలను యెహోయాషు జరిగించాడు. నెబాతు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలు పాపకార్యాలకు గురిచేసిన ఆ చెడు కార్యాలను అతను నివారించలేక పోయాడు. యెహోయాషు ఆ పాపాలు కొనసాగించాడు. 12 యెహోయాషు చేసిన ఆ ఘనకార్యాలు అతను యూదా రాజయిన అమాజ్యాకు ప్రతికూలంగా చేసిన యుద్ధాలు “ఇశ్రాయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడ్డాయి. 13 యెహోయాషు మరిణించగా, అతని పూర్వికులతో పాటుగా అతడు సమాధి చేయబడ్డాడు. యరొబాము క్రొత్తగా రాజయ్యాడు. యెహోయాషు సింహాసనం మీద యెరొబాము ఆసీనుడయ్యాడు. యెహోయాషు ఇశ్రాయేలు రాజులతో పాటు షోమ్రోనులో సమాధి చేయబడ్డాడు.
యెహోయాషు ఎలీషాని సందర్శించుట
14 ఎలీషా జబ్బు పడ్డాడు. తర్వాత ఎలీషా ఆ జబ్బుతో మరణించాడు. ఇశ్రాయేలు రాజయిన యెహోయాషు ఎలీషాని సందర్శించడానికి వెళ్లి, ఎలీషా కోసం విలపించాడు. “నా తండ్రీ, నా తండ్రీ! ఇశ్రాయేలువారి రథాలకు, గుర్రాలకు ఇది సమయమేనా?”[a] అని అడిగాడు.
15 యెహోయాషుతో, “విల్లు, కొన్ని బాణాలు తీసుకొనుము” అని ఎలీషా చెప్పాడు.
యెహోయాషు ఒక విల్లు, కొన్ని బాణాలు తీసుకున్నాడు. 16 అప్పుడు ఎలీషా ఇశ్రాయేలు రాజుతో ఇలా చెప్పాడు: “వింటిమీద నీ చేయి వేయుము.” యెహోయాషు వింటిమీద తన చేయి వేశాడు. తర్వాత ఎలీషా రాజు చేతులమీద తన చేతులు ఉంచాడు. 17 “తూర్పు కిటికి తెరువుము” అని ఎలీషా చెప్పాడు. యెహోయాషు కిటికి తెరిచాడు. తర్వాత, “గురిచూసి బాణం వదులుము” అని ఎలీషా చెప్పాడు.
యెహోయాషు బాణం వదిలాడు. అప్పుడు ఎలీషా, “అది యెహోవా యొక్క విజయాస్త్రం! సిరియా మీద విజయాస్త్రం. నీవు సిరియన్లను అఫెకు అనే చోట ఓడిస్తావు. మరియు వారిని నాశనం చేస్తావు” అని చెప్పాడు.
18 “బాణాలు తీసుకో” అని ఎలీషా చెప్పాడు. యెహోయాషు బాణాలు తీసుకున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు రాజుతో, “నేల మీద కొట్టుము” అని ఎలీషా చెప్పాడు.
మూడుసార్లు యెహోయాషు నేలను కొట్టాడు. తర్వాత ఆపివేశాడు. 19 దైవజనుడు అయిన ఎలీషా యెహోయాషుపై కోపగించాడు. “నీవు ఐదు లేక ఆరుసార్లు కొట్టి వుండవలసింది. అప్పుడు నీవు సిరియాను నాశనమయ్యేంత వరకు ఓడించేవాడివి. కాని ఇప్పుడు నీవు సిరియాని మూడు సార్లు మాత్రమే ఓడించగలవు” అని ఎలీషా చెప్పాడు.
ఎలీషా సమాధిలో ఆశ్చర్యకరమైన విషయం
20 ఎలీషా మరణించగా, ప్రజలతనిని సమాధి చేశారు.
వసంత ఋతువులో ఒకసారి, మోయాబు సైనిక బృందం ఇశ్రాయేలుకు వచ్చింది. యుద్ధంలోని వస్తువులను తీసుకోడానికి వారు వచ్చారు. 21 కొందరు ఇశ్రాయేలువారు చనిపోయిన ఒక వ్యక్తిని సమాధి చేస్తూ ఉన్నారు. వారు సైనిక బృందాన్ని చూశారు. ఇశ్రాయేలు వారు ఆ చనిపోయిన వ్యక్తిని ఎలీషా సమాధిలోకి విసరివేసి పారిపోయారు. ఎలీషా ఎముకలను ఆ చనిపోయిన వ్యక్తి తాకగానే, సజీవుడయ్యాడు; తన కాళ్ల మీద నిలబడగలిగాడు!
యెహోయాషు ఇశ్రాయేలు నగరాలను జయించుట
22 యెహోయాషు పరిపాలించిన ఆ రోజులలో, సిరియా రాజయిన హజాయేలు ఇశ్రాయేలుకు ఇబ్బంది కలిగించాడు. 23 కాని యెహోవా ఇశ్రాయేలు వారిపట్ల దయ వహించాడు. యెహోవా దయాళుడు. ఇశ్రాయేలు వారివైపు తిరిగినాడు మరియు వారిని నాశనం చేయలేదు. ఎందుకంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన ఒడంబడిక వల్ల, యెహోవా ఇశ్రాయేలు వారిని నాశనం చేయడు; ఇకను వారిని విసర్జించడు.
24 సిరియా రాజయిన హజాయేలు మరణించాడు. అతని తర్వాత అతని కుమారుడు బెన్హదదు క్రొత్త రాజయ్యాడు. 25 అతను మరణించడానికి పూర్వం, యుద్ధంలో హజాయేలు కొన్ని నగరాలను యెహోయాషు తండ్రి అయిన యెహోయాహాజు నుండి తీసుకొనెను. కాని ఇప్పుడు యెహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు నుండి యీ నగరాలు మరల పొందెను. యెహోయాషు, బెన్హదదును మూడుసార్లు ఓడించి, ఇశ్రాయేలు నగరాలను మరల తీసుకున్నాడు.
అమాజ్యా యూదాలో తన పరిపాలన ప్రారంభించుట
14 యూదా రాజయిన యోవాషు కుమారుడైన అమాజ్యా యెహోయాహాజు కొడుకైన యోవాషు ఇశ్రాయేలు రాజుగా వున్న రెండవ సంవత్సరమున యూదాకు రాజయ్యాడు. 2 అమాజ్యా పరిపాలన ప్రారంభించేనాటికి 25 యేళ్లవాడు. యెరూషలేములో అమాజ్యా 29 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెహోయద్దాను. 3 యెహోవా మెచ్చుకున్న పనులు అమాజ్యా జరిగించాడు. తన పూర్వికుడైన దావీదువలె అతను పూర్తిగా దేవుని అనుసరించలేదు. తన తండ్రి అయిన యోవాషు చేసిన పనులన్నీ అతను చేశాడు. 4 అతను ఉన్నత స్థానాలను నాశనం చేయలేదు. ఆ ఆరాధనా స్థలాలలో ఆ నాటికీ ప్రజలు బలులు అర్పించుచూ, ధూపం వేస్తూ ఉన్నారు.
5 అమాజ్యాకు తన రాజ్యం మీద మంచి అదుపు వున్న ఆ సమయమున, తన తండ్రిని చంపిన అధికారులను అతను చంపాడు. 6 కాని హంతకుల పిల్లలను అతను చంపలేదు. యెహోవా మోషే ధర్మశాస్త్రంలో ఈ ఆజ్ఞను ఇచ్చాడు; “తమ పిల్లలు చేసినదానికి వారి తల్లిదండ్రులను చంపకూడదు. తమ తల్లిదండ్రులు చేసిన దానికి వారి పిల్లలను చంపకూడదు. అతనే స్వయంగా చేసిన చెడు పనికి అతనినే చంపవలెను.”(A)
7 అమాజ్యా ఉప్పు లోయలో పదివేల మంది ఎదోము వాళ్లను చంపాడు. యుద్ధంలో అమాజ్యా సెలా అనే స్థలాన్ని “యొక్తయేలు” అని వ్యవహరించాడు. ఆ స్థలం నేటికీ “యొక్తయేలు” అని పిలువ బడుచున్నది.
అమాజ్యా యెహోయాషుకి ప్రతికూలంగా యుద్ధం కోరుకొనుట
8 అమాజ్యా యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు వద్దకు దూతల్ని పంపాడు. యెహోయాహాజు ఇశ్రాయేలు రాజయిన యెహూ కుమారుడు. “మనము ముఖాముఖిగా కలుసుకుని యుద్ధం చేద్దాము” అని అమాజ్యా సందేశం పంపించాడు.
9 ఇశ్రాయేలు రాజయిన యెహోయాషు యూదా రాజయిన అమాజ్యకు తిరిగి వ్రాశాడు. యెహోయాషు ఇలా చెప్పాడు. “లెబానోను దేవదారు చెట్టుకి లెబానోనులోని ముళ్లపొద ఒక సందేశం పంపింది. అది ఏమనగా, నీవు నీ కుమార్తెను నా కుమారుడికి పెళ్లి చేసుకునేందుకు యిమ్ము. కాని లెబానోనులోని ఒక దుష్ట మృగం ఆ త్రోవను వెళుతూ ముళ్లపొద మీద నడిచింది. నీవు ఎదోముని ఓడించిన మాట నిజమే. 10 కాని నీవు ఎదోము మీద పొందిన విజయానికి నీవు గర్వపడుతున్నావు. నీవు ఎదోములో వుండి మిడిసిపడుతున్నావు. ఇంతకు నీవు ఎందుకు ఆపద తెచ్చుకుంటావు. నీవు ఇలా చేస్తే, నీవు పతనంకాగలవు. మరియు యూదా నీతో పాటు నాశనం కాగలదు.”
11 కాని అమాజ్యా యెహోయాషు ఇచ్చిన హెచ్చరికను లెక్కచేయలేదు. అందువల్ల ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమాజ్యాకు ప్రతి కూలంగా బేత్షెమెషు అనే చోట యుద్ధం చేయడానికి వెళ్లాడు. 12 ఇశ్రాయేలు యూదాను ఓడించాడు. యూదాకు చెందిన ప్రతి వ్యక్తి పారిపోయాడు. 13 బేత్షెమెషు వద్ద ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమాజ్యాను బంధించాడు. అమాజ్యా యెవాషు కుమారుడు. అతను అహజ్యా కుమారుడు. యెహోయాషు అమాజ్యాను యెరూషలేముకు తీసుకువెళ్లాడు. యెహోయాషు ఎఫ్రాయీము ద్వారం నుంచి కోట ద్వారం, 600 అడుగుల యెరూషలేము ప్రాకారమును పగలగొట్టాడు. 14 తర్వాత యెహోయాషు యెహోవా ఆలయం లోని బంగారం, వెండి, వస్తువులను రాజభవనంలోని నిధులను తీసుకుపోయాడు. యెహోయాషు ప్రజలను కూడా తన బందీలుగా తీసుకుపోయాడు. తర్వాత అతను షోమ్రోనుకు తిరిగి వెళ్లాడు.
15 యెహోయాషు చేసిన ఘనకార్యములు యూదా రాజయిన అమాజ్యాతో అతను పోరాడిన విధంతో సహా “ఇశ్రాయేలు రాజ్య చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడి వున్నవి. 16 యెహోయాషు మరణించగా, అతనిని అతని పూర్వికులతో పాటు సమాధి చేశారు. ఇశ్రాయేలు రాజులతో పాటుగా షోమ్రోనులో యెహోయాషు సమాధి చేయబడ్డాడు. యెహోయాషు కుమారుడు యరొబాము, అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.
అమాజ్యా మరణం
17 ఇశ్రాయేలు రాజైన యెహోయాహాజు కుమారుడు యెహోయాషు మరణించిన 15 సంవత్సరాల వరకు యూదా రాజయిన యెవాషు కుమారుడు అమాజ్యా బ్రదికాడు. 18 అమాజ్యా జరిగించిన ఘనకార్యాలన్నీ “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడివున్నాయి. 19 యెరూషలేములో ప్రజలు అమాజ్యాకు ప్రతి కూలంగా ఒక పధకం వేశారు. అమాజ్యా లాకీషుకు పారిపోయాడు. కాని ప్రజలు లాకీషుకు అమాజ్యా వెనుకాల కొందరు వ్యక్తులను పంపారు. ఆ వ్యక్తులు లాకీషులో అమాజ్యాను చంపివేశారు. 20 ప్రజలు అమాజ్యా దేహాన్ని గుర్రాల మీద వెనక్కి తీసుకువచ్చి, దావీదు నగరంలో అతని పూర్వికులతో పాటు అమాజ్యాను సమాధి చేశారు.
అజర్యా యూదా మీద తన పరిపాలన ప్రారంభించుట
21 తర్వాత యూదాలోని మనుష్యులందురు అమాజ్యా కుమారుడైన అజర్యాను క్రొత్త రాజుగా చేశారు. అజర్యా 16 యేండ్లవాడు. 22 అమాజ్యా రాజు మరణించగా, అతని పూర్వికులతో పాటు అతనిని సమాధి చేశారు. తర్వాత అజర్యా ఏలతు పట్టణం మరల నిర్మించి, దానిని యూదాకు స్వాధీన పరిచాడు.
రెండవ యరొబాము ఇశ్రాయేలు మీద తన పరిపాలన ప్రారంభించుట
23 యూదా రాజుగా యోవాషు కుమారుడైన అమాజ్యా పరిపాలనలో 15వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడు యరొబాము సమరియాలో పరిపాలన ప్రారంభించెను. యరొబాము 41 సంవత్సరాలు పరిపాలించాడు. 24 యెహోవా తప్పు అని చెప్పిన కార్యములు ఈ యరొబాము చేశాడు. నెబాతు కుమారుడు యరొబాము ఇశ్రాయేలు పాపాలకు కారణమైన ఆ పాపకార్యములను యరొబాము ఆపలేదు. 25 హమాతు నుండి అరబా సముద్రం దాకా వ్యాపించిన ఇశ్రాయేలు దేశమును యరొబాము మరల తీసుకున్నాడు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా తన భక్తుడైన అమిత్తయి కుమారుడు యోనాకు చెప్పినట్లు ఇది జరిగింది. అమిత్తయి గత్హేపెరు నుండి వచ్చిన ఒక ప్రవక్త. 26 ఇశ్రాయేలు వారందరికీ చాలా ఇబ్బందులున్నాయని యెహోవా చూశాడు. బానిసలు, స్వతంత్రులూ వున్నారని చూశాడు. ఇశ్రాయేలుకు సహాయం చేయదగిన వ్యక్తి ఎవరూ లేరు. 27 ప్రపంచంలో ఇశ్రాయేలు అన్న పేరుని తీసివేస్తానని యెహోవా చెప్పలేదు. అందువల్ల యెహోవా యెహోయాషు కుమారుడైన యరొబాముని ఇశ్రాయేలు ప్రజలను రక్షించేందుకు ఏర్పాటు చేసాడు.
28 యరొబాము చేసిన ఘనకార్యాలన్ని “ఇశ్రాయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడినవి. ఇశ్రాయేలుకు గాను దమస్కు మరియు హమాతులను యరొబాము తిరిగి పొందిన కథకూడా ఇందులో పొందుపరచబడింది. (ఈ నగరాలు యూదాకి చెందినవి). 29 యరొబాము మరణించగా, ఇశ్రాయేలీయుల రాజులైన అతని పూర్వికులతో పాటుగా అతను సమాధి చేయబడ్డాడు. యరొబాము కుమారుడైన జెకర్యా, అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.
కానా పట్టణంలో వివాహం
2 మూడవరోజు గలిలయ దేశంలోని “కానా” పట్టణంలో ఒక పెళ్ళి జరిగింది. యేసు తల్లి అక్కడ ఉన్నది. 2 యేసు, ఆయన అనుచరులు కూడా ఆ పెళ్ళికి ఆహ్వానించబడ్డారు. 3 ద్రాక్షారసం అయిపోయాక యేసు తల్లి ఆయనతో, “వాళ్ళ దగ్గర ద్రాక్షారసం అయిపోయింది!” అని చెప్పింది.
4 యేసు, “నాకెందుకు చెబుతున్నావమ్మా! నా సమయమింకా రాలేదు!” అని సమాధానం చెప్పాడు.
5 ఆయన తల్లి పనివాళ్ళతో, “ఆయన చెప్పినట్లు చెయ్యండి!” అని అనింది.
6 ప్రక్కనే రాతితో చేయబడిన ఆరు బానలు ఉన్నాయి. అలాంటి బానల్ని యూదులు ఆచారపు స్నానం చేసి పరిశుద్ధం కావటానికి ఉపయోగించే వాళ్ళు. ఒక్కొక్క బానలో ఎనభై నుండి నూరు లీటర్ల దాకా నీళ్ళు పట్టేవి.
7 యేసు పనివాళ్ళతో, “ఆ బానల్ని నీళ్ళతో నింపండి!” అని అన్నాడు. వాళ్ళు బానల నిండా నీళ్ళు నింపారు.
8 ఆ తర్వాత యేసు వాళ్ళతో, “ఇప్పుడు ఒక బానలో నుంచి కొద్దిగా తీసి పెళ్ళి పెద్ద దగ్గరకు తీసుకెళ్ళండి” అని అన్నాడు.
వాళ్ళు అలాగే చేసారు. ఆ పెళ్ళి పెద్ద, ద్రాక్షారసంగా మారిన ఆ నీళ్ళు రుచి చూసాడు. 9 ఆ పనివాళ్ళకు అది ఎక్కడనుండి వచ్చిందో తెలుసు. కానీ ఆ పెళ్ళి పెద్దకు అది ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాలేదు. కనుక అతుడు పెళ్ళి కుమారుణ్ణి ప్రక్కకు పిలిచి అతనితో, 10 “అందరూ మంచి ద్రాక్షారసమును మొదట పోస్తారు. అతిథులంతా త్రాగి మత్తులయ్యాక మాములు ద్రాక్షారసమును పోస్తారు. కాని నీవు మంచి ద్రాక్షారసమును యింతవరకు ఎందుకు దాచావు?” అని అన్నాడు.
11 యేసు చేసిన అద్భుతాలలో యిది మొదటిది. ఇది గలిలయలోని కానాలో జరిగింది. ఈ విధంగా ఆయన తన మహిమను చాటాక ఆయన శిష్యులకు ఆయన పట్ల విశ్వాసం కలిగింది.
12 ఇది జరిగాక యేసు తన తల్లితో, సోదరులతో, శిష్యులతో కలిసి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు కొద్దిరోజులు బస చేసారు.
యెసు మందిరాన్ని పరిశుభ్రం చేయటం
(మత్తయి 21:12-13; మార్కు 11:15-17; లూకా 19:45-46)
13 యూదుల పస్కా పండుగ దగ్గర పడగానే యేసు యెరూషలేము వెళ్ళాడు. 14 ప్రజలు మందిర ఆవరణంలో ఎద్దుల్ని, గొఱ్ఱెల్ని, పావురాల్ని, అమ్మటం చూసాడు. కొందరు బల్లల ముందు కూర్చొని డబ్బు మార్చటం చూసాడు. 15 త్రాళ్ళతో ఒక కొరడా చేసి అందర్ని ఆ మందిరావరణం నుండి తరిమి వేసాడు. ఎద్దుల్ని, గొఱ్ఱెల్ని తరిమేసి, డబ్బులు మారుస్తున్న వాళ్ళ డబ్బును క్రింద చల్లి వాళ్ళ బల్లల్ని తల క్రిందులుగా చేసివేసాడు. 16 పావురాలు అమ్ముతున్న వాళ్ళతో, “అవన్నీ అక్కడనుండి తీసివేయండి! నా తండ్రి ఆలయాన్ని సంత దుకాణంగా మార్చటానికి మీకెన్ని గుండెలు?” అని అన్నాడు.
17 ఆయన శిష్యులు లేఖనాల్లో వ్రాయబడిన ఈ విషయ జ్ఞాపకం చేసుకొన్నారు:
“నీ యింటిపై నాకున్న ఆశ నన్ను దహించి వేస్తుంది.”(A)
18 యూదులు యేసుతో, “ఒక అద్భుతాన్ని చేసి చూపించు. దానితో నీకు యివి చేయటానికి అధికారమున్నదని నమ్ముతాము” అని అన్నారు.
19 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఈ మందిరాన్ని పడగొట్టండి. నేను దాన్ని మూడు రోజుల్లో మళ్ళీ కడతాను.”
20 యూదులు, “ఈ మందిరం కట్టటానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది. నీవు దాన్ని మూడు రోజుల్లో నిర్మిస్తావా?” అని అన్నారు.
21 కాని యేసు మాట్లాడింది ఆలయమనే తన దేహాన్ని గురించి. 22 ఆయన బ్రతికింపబడ్డాక, ఆయన శిష్యులకు ఆయన చెప్పింది జ్ఞాపకం వచ్చింది. అప్పుడు వాళ్ళు గ్రంథాల్లో వ్రాయబడిన వాటిని, యేసు చెప్పిన వాటిని విశ్వసించారు.
23 పస్కా పండుగ రోజుల్లో ఆయన యెరూషలేములో ఉండి చేసిన అద్భుతాల్ని ప్రజలు చూసారు. వాళ్ళకు ఆయన పట్ల విశ్వాసము కలిగింది. 24 కాని ఆయనకు మానవ స్వభావము తెలుసు. కనుక తనను తాను వాళ్ళకు అప్పగించుకోలేదు. 25 మానవ స్వభావం ఆయనకు తెలుసు కనుక మానవుల్ని గురించి ఆయనకు ఎవడును సాక్ష్యం చెప్పనవసరం లేదు.
© 1997 Bible League International