Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
నిర్గమకాండము 4-6

మోషేకు రుజువు

అప్పుడు మోషే, “నీవు నన్ను పంపించావు అని చెబితే ఇశ్రాయేలు ప్రజలు నమ్మరు గదా! ‘యెహోవా నీకు కనబడనే లేదు అంటారు వాళ్లు’” అన్నాడు దేవునితో.

అయితే దేవుడు, “నీ చేతిలోనిది ఏమిటి” అని మోషేను అడిగాడు.

“ఇది నా చేతికర్ర” అని మోషే జవాబిచ్చాడు.

అప్పుడు దేవుడు, “నీ కర్ర కింద పడవెయ్యి” అన్నాడు. మోషే తన కర్రను నేల మీద పడేసాడు. ఆ కర్ర ఒక పాముగా మారిపోయింది. మోషే భయపడి దాని దగ్గర్నుండి పారిపోయాడు. అయితే యెహోవా మోషేతో, “ముందుకు వెళ్లి ఆ పాము తోక అందుకో” అన్నాడు.

మోషే ముందుకు వెళ్లి పాముతోక అందుకొన్నాడు. మోషే అలా చేయగానే ఆ పాము మళ్లీ కర్ర అయిపోయింది. “ఈ కర్రను ఇలా ప్రయోగించు, అప్పుడు మీ పూర్వీకుల దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యెహోవా నీకు ప్రత్యక్షమయ్యాడని నీ ప్రజలు నమ్ముతారు” అన్నాడు దేవుడు.

ఆ తర్వాత యెహోవా, “నీకు ఇంకో రుజువు ఇస్తాను. నీ చెయ్యి నీ చొక్కాలోపల పెట్టు” అన్నాడు మోషేతో.

కనుక మోషే తన చొక్కా తెరిచి తన చేతిని లోపల పెట్టాడు. మళ్లీ మోషే తన చొక్కాలోనుంచి తన చేతిని బయటికి తీయగానే అది మారిపోయింది. అతని చేతినిండా మంచులాంటి తెల్లని కుష్ఠు మచ్చలు కప్పేసాయి.

“నీ చేతిని మళ్లీ నీ చొక్కాలో పెట్టు” అన్నాడు దేవుడు. మోషే తన చేతిని మళ్లీ తన చొక్కాలోపల పెట్టాడు. మోషే అలా పెట్టి మళ్లీ తన చేతిని బయటికి తీయగానే అతని చెయ్యి మారిపోయింది. ఇప్పుడు అతని చెయ్యి బాగైపోయి మళ్లీ మునుపటిలానే ఉంది.

“నీకర్రను ఉపయోగించినప్పుడు ప్రజలు నిన్ను నమ్మకపోతే, నీవు ఈ సూచన చూపెట్టినప్పుడు వాళ్లు నిన్ను నమ్ముతారు. నీవు వాళ్లకు ఈ రెండు సూచనలు చూపించాక కూడ వాళ్లు నమ్మటానికి నిరాకరిస్తే, అప్పుడు నైలు నదిలోనుంచి కొన్ని నీళ్లు తీసుకో, ఆ నీళ్లను నేలమీద పొయ్యి. అవి నేలను తాకగానే రక్తం అవుతాయి” అన్నాడు దేవుడు.

10 అయితే మోషే దేవునితో, “కానీ ప్రభూ నేను నిజం చెప్పేస్తున్నాను. నేనేమీ నైపుణ్యంగల మాటకారిని కాను. నాకు మనుష్యులతో చక్కగా మాట్లాడ్డం ఎప్పుడూ చేతకాలేదు. కనీసం ఇప్పుడు నీతో మాట్లాడిన తర్వాత కూడ నేను మంచి మాటకారిని కాలేదు. నా మాట నిదానం అనీ, నాకు మంచి పద ప్రయోగం రాదనీ[a] నీకు తెలుసు” అన్నాడు.

11 “మనిషి నోటిని చేసిందెవరు? ఒకన్ని చెవిటివాడిగా లేక మూగవాడిగా చేయగలిగింది ఎవరు? ఒకన్ని గుడ్డివానిగా చేయగలిగింది, చూడగలిగేటట్టు చేయగలిగింది ఎవరు? వీటన్నింటిని చేయగలిగింది నేనే, నేను యెహోవాను, 12 అందుచేత వెళ్లు. నీవు మాట్లాడేటప్పుడు నేను నీతో ఉంటాను. చెప్పాల్సిన మాటలు నేనే నీకు చెబుతాను” అని అతనితో యెహోవా అన్నాడు.

13 కానీ మోషే, “నా ప్రభువా, నన్ను విడిచిపెట్టి మరెవర్నయినా పంపించుమని బతిమాలు కొంటున్నాను” అన్నాడు.

14 యెహోవాకు మోషేమీద కోపం వచ్చింది, “లేవీ వంశానికి చెందిన నీ సోదరుడు అహరోనును నేను వాడుకొంటాను. అతనికి మాట్లాడుటలో నైపుణ్యం ఉంది. అహరోను నీ దగ్గరకు వస్తాడు. నిన్ను చూచి సంతోషిస్తాడు, 15 అతడు నీతోకూడ ఫరో దగ్గరకు వస్తాడు. నీవు చెప్పాల్సిందేమిటో నేను నీకు చెబుతాను, అది నీవు అహరోనుకు చెప్పాలి. ఫరోతో చెప్పటానికి అహరోను సరైన మాటల్ని సిద్ధం చేసుకొంటాడు. 16 ప్రజలతో కూడ అహరోనే నీ పక్షంగా మాట్లాడుతాడు. అతనికి నీవు ఒక మహారాజులా ఉంటావు. అతనే అధికారంతో నీ తరపున మాట్లాడతాడు.[b] 17 కనుక వెళ్లు. నీతోకూడ నీ కర్ర తీసుకొని వెళ్లు. నీకు నేను తోడుగా ఉన్నానని ప్రజలకు తెలియడానికి నీ కర్రను, మిగతా అద్భుతాలను ప్రయోగించు” అన్నాడు దేవుడు.

మోషే మిద్యాన్నివదలుట

18 అప్పుడు మోషే తన మామ యిత్రో ఇంటికి తిరిగి వెళ్లాడు. “ఈజిప్టులో నా ప్రజల దగ్గరకు నేను మళ్లీ వెళతాను, నన్ను పోనివ్వండి. వాళ్లు ఇంకా బతికే ఉన్నారేమో నేను వెళ్లి చూడాలి” అని యిత్రోతో చెప్పాడు మోషే.

“నీవు సమాధానంగా వెళ్లొచ్చు” అన్నాడు యిత్రో మోషేతో.

19 తర్వాత మోషే ఇంకా మిద్యానులో ఉండగానే దేవుడు మోషేతో, “ఇప్పుడు నీవు మళ్లీ ఈజిప్టు వెళ్లడం నీకు క్షేమం. నిన్ను చంపాలని చూస్తున్న వాళ్లు ఇప్పుడు చనిపోయారు” అని చెప్పాడు.

20 కనుక మోషే తన భార్యను, తన కొడుకును బయల్దేరదీసి గాడిదల మీద ఎక్కించాడు. తిరిగి ఈజిప్టు దేశానికి ప్రయాణం కట్టాడు. దేవుని శక్తిగల తన కర్రను మోషే తనతో తీసుకొని వెళ్లాడు.

21 మోషే ఈజిప్టుకు ప్రయాణం చేస్తూండగా దేవుడు అతనితో మాట్లాడాడు: “నీవు ఫరోతో మాట్లాడేటప్పుడు నీవు ఏమేమి అద్భుతాలు చేసేందుకు నీకు శక్తి ఇచ్చానో వాటన్నింటినీ చేయాలని జ్ఞాపకం ఉంచుకో! అయితే నేను మాత్రం ఫరో ఇంకా మొండికెత్తేటట్లు చేస్తాను. అతడు ప్రజల్ని వెళ్లనియ్యడు. 22 అప్పుడు నీవు ఫరోతో 23 ‘ఇశ్రాయేలు నా ప్రథమ సంతానంగా పుట్టిన కుమారుడు. నా కుమారుడు వెళ్లి నన్ను ఆరాధించనివ్వు అని నేను నీతో చెబుతున్నాను. నీవే గనుక ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వకపోతే, నీ పెద్ద కుమారుణ్ణి నేను చంపేస్తాను.’” అని యెహోవా అనుచున్నాడని అతనితో చెప్పెను.

మోషే కొడుక్కి సున్నతి

24 మోషే ఈజిప్టుకు తన ప్రయాణం కొనసాగించాడు. నిద్రపోవాలని అతడు ఒక సత్రములో ఆగాడు. అక్కడ దేవుడు మోషేను కలుసుకొని అతణ్ణి చంపదలచాడు.[c] 25 కాని సిప్పోర పదునైన ఒక కత్తి[d] తీసుకొని తన కుమారునికి సున్నతి[e] చేసింది. ఆ చర్మం పట్టుకొని ఆమె అతని పాదాలను తాకింది. అప్పుడు ఆమె (మోషేతో) “నీవు రక్త సంబంధమైన[f] భర్తవు అని అంది” 26 సిప్పోర తన కుమారునికి సున్నతి చేసినందువల్ల ఇలా చెప్పింది. అందుచేత దేవుడు మోషేను క్షమించాడు (అతణ్ణి చంపలేదు).

మోషే ఈజిప్టుకు వచ్చుట

27 యెహోవా అహరోనుతో, “అరణ్యంలోకి వెళ్లి మోషేను కలుసుకో” అని చెప్పాడు. కనుక అహరోను వెళ్లి దేవుని పర్వతం[g] దగ్గర మోషేను కలుసుకొన్నాడు. అహరోను మోషేను చూడగానే అతణ్ణి ముద్దు పెట్టుకొన్నాడు. 28 దేవుడు తనతో చెప్పినదంతా మోషే అహరోనుతో చెప్పాడు. దేవుడు తనను ఎందుకు పంపిందీ, అహరోనుతో చెప్పాడు మోషే. అలాగే అతను చేయాల్సిన అద్భుతాలు, చూపాల్సిన రుజువులు అన్నింటిని మోషే అహరోనుకు వివరించాడు.

29 అందుచేత మోషే, అహరోనూ వెళ్లి ఇశ్రాయేలు పెద్దలందర్నీ సమావేశం చేసారు. 30 అప్పుడు ఆ ప్రజలతో వారు మాట్లాడారు. యెహోవా మోషేతో చెప్పిన విషయాలన్నీ అతడు వాళ్లతో చెప్పాడు. అప్పుడు వాళ్లందరూ చూచేటట్టు మోషే అద్భుతాలు చేసి రుజువు చేసాడు. 31 దేవుడు మోషేను పంపించాడని ఆ ప్రజలు నమ్మారు. ఇశ్రాయేలీయులకు సహాయం చేసేందుకు దేవుడు వచ్చాడని తెలిసి ఆ ప్రజలు దేవుని ముందర తలలు వంచుకొని ఆరాధించారు. వారి కష్టాలను దేవుడు చూసాడని తెలిసి వాళ్లు దేవుడ్ని ఆరాధించారు.

ఫరో ముందు మోషే, అహరోనులు

మోషే, అహరోను ప్రజలతో మాట్లాడిన తరువాత ఫరో దగ్గరికి వెళ్లారు, “‘నా కోసం పండుగ జరుపుకొనేందుకు నా ప్రజల్ని అరణ్యంలోకి వెళ్లనివ్వు’ అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెబుతున్నాడు,” అని చెప్పారు.

అయితే ఫరో, “ఆ యెహోవా ఎవరు? అతనికి నేనెందుకు లోబడాలి? ఇశ్రాయేలీయులను నేనెందుకు వెళ్లనివ్వాలి? యెహోవా అని మీరు చెబుతున్నవాడు నాకు తెలియదు. అందుచేత ఇశ్రాయేలీయులను నేను వెళ్లనీయను” అన్నాడు.

దానికి మోషే, అహరోనులు, “హీబ్రూ ప్రజల దేవుడు మాతో మాట్లాడాడు. కనుక మూడు రోజుల ప్రయాణమంత దూరం మమ్మల్ని అరణ్యంలోనికి వెళ్లనివ్వాల్సిందిగా మనవి చేస్తున్నాము. అక్కడ మా యెహోవా దేవునికి ఒక బలి అర్పిస్తాము. ఇది మేము చేయకపోతే ఆయనకు కోపం వచ్చి మమ్మల్ని నాశనం చేస్తాడేమో. ఒక రోగం ద్వారానో, కత్తి చేతనో మమ్మల్ని చంపేస్తాడేమో” అని అన్నారు.

కానీ ఫరో, “మోషే, అహరోనూ, ప్రజలను పని చేయనీయకుండా మీరు చేస్తున్నారు. మళ్లీ పోయి పనిచేసుకోమని ఆ బానిసలకు చెప్పండి. పనివాళ్లు చాలా విస్తారంగా ఉన్నారు, మీరేమో వాళ్లను పని చెయ్యనివ్వడం లేదు” అని వాళ్లతో చెప్పాడు.

ప్రజలను ఫరో శిక్షించడం

అదేరోజు ఇశ్రాయేలీయుల పని మరింత కష్టతరం చేయమని ఫరో ఆజ్ఞాపించాడు. బానిసలపైనున్న యజమానులతో “ఈ ప్రజలు ఇటుకలు చేసేందుకు గడ్డి ఎప్పుడూ మీరే ఇచ్చారు. కాని ఇప్పుడు ఇటుకలు చేసేందుకు అవసరమైన గడ్డిని వాళ్లే పోయి తెచ్చుకోవాలని వారికి చెప్పండి. అయితే వాళ్లు మాత్రం ఇంతకు ముందు ఎన్ని ఇటుకలు చేసేవాళ్లో ఇప్పుడు కూడా అన్ని చేయాల్సిందే. వాళ్లు బద్ధకస్తులయి పోయారు. అందుకే వాళ్లను పోనివ్వుమని నన్ను అడుగుతున్నారు. వాళ్లు చేసేందుకు సరిపడినంత పనిలేదు. అందుకే తమ దేవునికి బలి ఇవ్వడానికి వెళ్లనిమ్మని నన్ను అడుగుతున్నారు. కనుక వీళ్ల పని మరింత కష్టం అయేటట్టు చేయండి. వాళ్లకు బాగా పని చెప్పండి. అప్పుడు మోషే చెప్పే అబద్ధాలు వినేందుకు వాళ్లకు సమయం ఉండదు” అని చెప్పాడు ఫరో.

10 అందుచేత బానిసల పైనున్న ఈజిప్టు యజమానులు, హీబ్రూ ప్రజల నాయకుల దగ్గరకు వెళ్లి, “మీ ఇటుకల కోసం గడ్డి ఇవ్వకూడదని ఫరో నిర్ణయించాడు. 11 మీకు మీరే పోయి గడ్డి తెచ్చుకోవాలి. కనుక వెళ్లి గడ్డి వెదుక్కోండి. అయితే మీరు మాత్రం ఇంతకు ముందు ఎన్ని ఇటుకలు చేసేవారో ఇప్పుడు కూడా అన్ని చేయాల్సిందే” అని వాళ్లతో చెప్పారు.

12 కనుక గడ్డికోసం వెదుక్కొంటూ ఆ ప్రజలు ఈజిప్టు దేశ వ్యాప్తంగా వెళ్లిపోయారు. 13 ఆ ప్రజలు మరింత కష్టపడి పనిచేసేటట్టు బానిస యజమానులు వాళ్లని బలవంతం చేస్తూనే ఉన్నారు. ఆ ప్రజలు అంతకు ముందు ఎన్ని ఇటుకలు చేసేవాళ్లో అన్ని చేసేటట్టు వారు వాళ్లను బలవంతపెట్టారు. 14 బానిసలపై ఉండే ఈజిప్టు యజమానులు హీబ్రూ నాయకులను ఏర్పరచుకొని ప్రజలు చేసే పనికి వీళ్లను బాధ్యులుగా చేసారు, “మీరు ఇంతకు ముందు ఎన్ని ఇటుకలు చేసారో ఇప్పుడు కూడ అన్ని ఎందుకు చెయ్యడం లేదు? ఇది వరకు చేయగలిగారు అంటే, ఇప్పుడూ చేయగల్గుతారు!” అంటూ బానిసలపై ఉండే ఈజిప్టు యజమానులు హీబ్రూ నాయకులను కొట్టారు.

15 అప్పుడు హీబ్రూ నాయకులు ఫరో దగ్గరకు వెళ్లారు, “మేము నీ సేవకులము నీవు మమ్మల్ని ఎందుకు ఇలా చూస్తున్నావు? 16 నీవేమో మాకు గడ్డి ఇవ్వవు. కాని మేము మాత్రం ఇదివరకు ఎన్ని ఇటుకలు చేసామో అన్ని చేస్తూనే ఉండాలని ఆజ్ఞాపించావు. పైగా ఇప్పుడు ఈ యజమానులు మమ్మల్ని కొడుతున్నారు. ఇలా చేయడం నీ మనుష్యులదే తప్పు” అంటూ వారు ఫిర్యాదు చేసి చెప్పారు.

17 ఫరో జవాబిస్తూ, “మీరు సోమరులు, మీకు పని చేయడం ఇష్టంలేదు. అందుకే మిమ్మల్ని పోనివ్వమని నన్ను అడుగుతున్నారు. అందుకే మీరు ఇక్కడ్నుండి వెళ్లిపోయి యెహోవాకు బలులు అర్పించాలని అంటున్నారు. 18 ఇక వెళ్లి పనిచెయ్యండి. మేము మీకు గడ్డి ఇవ్వము కాని మీరు మాత్రం ఇది వరకు ఎన్ని ఇటుకలు చేసేవాళ్లో ఇప్పుడు కూడ అన్ని చేయాలి” అన్నాడు.

19 చిక్కుల్లో పడ్డట్టు ఇశ్రాయేలు పెద్దలకు అర్థమయింది. వారు ఇంతకు ముందు చేసినన్ని ఇటుకలు ఇప్పుడు చేయలేరని ఆ నాయకులకు తెలుసు.

20 వారు ఫరో సమావేశం నుండి వెళ్తూ మోషే, అహరోను ఉన్నచోట ఆగారు. వారికోసం మోషే అహరోనూ వేచియున్నారు. 21 వారు మోషే అహరోనులతో, “మమ్మల్ని వెళ్లనిమ్మని మీరు ఫరోతో చెప్పడం చాల తప్పు. ఫరో, అతని అధికారులు మమ్మల్ని ద్వేషించేటట్టు మీరు చేసారు కనుక యెహోవా మిమ్మల్ని శిక్షించాలి. మమ్మల్ని చంపే అవకాశం మీరే వారికి ఇచ్చారు” అని చెప్పారు.

మోషే దేవునితో చెప్పటం

22 అప్పుడు మోషే యెహోవాను ప్రార్థించి, “ప్రభువా, ఎందుకు ఇలా నీ ప్రజలకు నీవు కీడు చేసావు? నీవు ఇక్కడికి నన్నెందుకు పంపించావు? 23 నన్ను చెప్పమని నీవు చెప్పిన సంగుతులన్నీ నేను ఫరో దగ్గరకు వెళ్లి చెప్పాను. కాని అప్పట్నుంచి నీ ప్రజల విషయంలో అతడు చాల నీచంగా ప్రవర్తిస్తున్నాడు. నీవు వాళ్లు సహాయం కోసం ఏమీ చేయలేదు!” అని చెప్పాడు.

అందుకు యెహోవా, “ఫరోకు నేను ఏమి చేస్తానో నీవు ఇప్పుడు చూస్తావు. అతని మీద నేను నా మహాశక్తిని ప్రయోగిస్తాను. దానితో అతడు నా ప్రజలను వెళ్లనిస్తాడు. వారు వెళ్లిపోవడానికి అతడు ఎంత ఇష్టపడతాడంటే, అతడే వారిని వెళ్లిపొమ్మని బలవంతం చేస్తాడు” అని మోషేతో చెప్పాడు.

మోషేతో దేవుడు ఇలా చెప్పాడు, “యెహోవాను నేనే. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రత్యక్షమయ్యాను. వాళ్లు, (ఎల్‌షడ్డయి) సర్వశక్తిగల దేవుడు అని నన్ను పిలిచారు. నా పేరు యెహోవా అని వారికి తెలియలేదు. వారితో నేను ఒక ఒడంబడిక చేసాను. కనాను దేశం వారికి ఇస్తానని వాగ్దానం చేసాను. వారు ఆ దేశంలో నివసించారు గాని అది వారి స్వంత దేశం కాదు. ఇప్పుడు ఇశ్రాయేలు వాళ్లకు ఉన్న కష్టాలు నాకు తెలుసు. వారు ఈజిప్టులో బానిసలుగా ఉన్నారని నాకు తెలుసు. నా ఒడంబడిక కూడా నాకు జ్ఞాపకం ఉంది. కనుక నేను వాళ్లతో నీవు ఇలా చెప్పమన్నట్టు ప్రజలతో చెప్పు. ‘నేనే యెహోవాను, నేనే మిమ్మల్ని రక్షిస్తాను. నేను మిమ్మల్ని స్వతంత్రుల్నిగా చేస్తాను. ఈజిప్టు వాళ్లకు మీరు బానిసలుగా ఉండరు. నేను నా మహాశక్తిని ప్రయోగించి మహా భయంకర శిక్షను ఈజిప్టు వారి మీదికి రప్పిస్తాను. అప్పుడు మిమ్మల్ని నేను రక్షిస్తాను. మీరు నా ప్రజలుగా ఉంటారు. నేనే మీ దేవుడిగా ఉంటాను. నేనే యెహోవాను, మీ దేవుడనని, ఈజిప్టునుండి నేనే మిమ్మల్ని విడిపించానని మీరు తెలుసుకొంటారు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ఒక గొప్ప వాగ్దానం చేసాను. అందుచేత నేనే మిమ్మల్ని ఆ దేశానికి నడిపిస్తాను. ఆ దేశాన్ని నేను మీకు ఇస్తాను. అది మీదే అవుతుంది. నేను యెహోవాను.’”

అందుచేత మోషే ఇదంతా ఇశ్రాయేలు వాళ్లతో చెప్పాడు. అయితే, ప్రజలు పనిలో చాలా కష్టపడుచున్నందుచేత మోషేను వారు సహించలేదు. అతని మాట వారు వినలేదు.

10 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 11 “ఇశ్రాయేలు ప్రజల్ని తన దేశంనుండి తప్పక వెళ్లిపోనివ్వాలని ఫరో దగ్గరకు వెళ్లి చెప్పు.”

12 అయితే మోషే, “ఇశ్రాయేలు ప్రజలే నా మాట వినరు. అలాంటప్పుడు ఫరో అంతకంటె వినడు. అసలే నాకు మాట్లాడటం చేతకాదు” అని అన్నాడు.

13 కాని మోషే, అహరోనులతో యెహోవా మాట్లాడాడు. వారు వెళ్లి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాలని యెహోవా వారికి ఆజ్ఞాపించాడు. ఫరో దగ్గరికి వెళ్లి అతనితో కూడ మాట్లాడాలని ఆయన వారికి ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఈజిప్టు నుండి బయటకు నడిపించుమని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు.

ఇశ్రాయేలీయుల కుటుంబాల్లో కొన్ని

14 ఇశ్రాయేలు కుటుంబాల నాయకుల పేర్లు ఇవి:

ఇశ్రాయేలు జ్యేష్ఠపుత్రుడు రూబేనుకు హనోకు, పల్లు, హెస్రోను, కర్మి అనే నలుగురు కుమారులు గలరు.

15 యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, షావూలు అనువారు షిమ్యోను కుమారులు. (షావూలు కనానీ స్త్రీ ద్వారా పుట్టిన కుమారుడు).

16 లేవీ 137 సంవత్సరాలు బ్రతికాడు. గెర్షోను, కహాతు, మెరారీ అనువారు లేవీ కుమారులు.

17 గెర్షోను కుమారులు లిబ్నీ, షిమీ.

18 కహాతు 133 సంవత్సరాలు బ్రతికాడు. అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు అనువారు కహాతు కుమారులు.

19 మహలి, ముషి అను వారు మెరారీ కుమారులు.

ఈ కుటుంబాలన్ని ఇశ్రాయేలు కుమారుడు లేవీ సంతానం.

20 అమ్రాము 137 సంవత్సరాలు బ్రతికాడు. అమ్రాము తన తండ్రి సోదరి యోకెబెదును వివాహం చేసుకొన్నాడు. ఈ అమ్రాము కుమారులే మోషే, అహరోనులు.

21 కోరహు, నెపెగు, జిఖ్రీ అనువారు ఇస్హారు కుమారులు.

22 మిషాయేలు, ఎల్జఫను, సిత్రీ అనువారు ఉజ్జీయేలు కుమారులు.

23 అహరోను ఎలీషెబను వివాహం చేసుకొన్నాడు. (ఎలీషెబ అమ్మినాదాబు కుమార్తె. నయసోను సోదరి) అహరోను ఎలీషెబలకు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారులు పుట్టారు.

24 కోరహు కుమారులు అంటే, అస్సీరు, ఎల్కానా, అబియాసాపు.

25 అహరోను కుమారుడైన ఎలియాజరు పుతీయేలు కుమార్తెను పెండ్లాడాడు, వాళ్లు ఫీనెహాసుకు జన్మనిచ్చారు.

ఈ మనుష్యులంతా ఇశ్రాయేలు కుమారుడైన లేవీ సంతానం.

26 అహరోను, మోషే ఈ వంశానికి చెందిన వాళ్లు, “ఇశ్రాయేలు ప్రజల వంశాలను నడిపించండి” అని యెహోవా చెప్పింది వీళ్లకే. 27 ఈజిప్టు రాజైన ఫరోతో మాట్లాడిన వాళ్లు అహరోను, మోషే, ఇశ్రాయేలు ప్రజల్ని ఈజిప్టు విడిచి పెట్టి వెళ్లనివ్వాల్సిందిగా ఫరోతో చెప్పింది వీళ్లే.

దేవుడు మళ్లీ మోషేను పిల్చాడు

28 ఈజిప్టు దేశంలో దేవుడు మోషేతో మాట్లాడాడు. 29 “నేను యెహోవాను. నేను నీతో చెప్పిందంతా ఈజిప్టు రాజుతో చెప్పు” అన్నాడు.

30 “కానీ, నేను చక్కగా మాట్లాడలేను గదా! రాజు నా మాట వినడు” అని జవాబిచ్చాడు మోషే.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International