Chronological
అబ్రాహాము వేరే భార్యల కుటుంబాలు
25 అబ్రాహాము మళ్లీ పెళ్లి చేసుకొన్నాడు. ఆయన క్రొత్త భార్య పేరు కెతూరా. 2 కెతూరాకు జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు పుట్టారు. 3 యొక్షాను షేబకు, దెదానుకు తండ్రి. అష్షూరు, లెయుమీ మరియు లెతూషీ ప్రజలు దెదాను సంతానము. 4 మిద్యాను కుమారులు ఏఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా. అబ్రాహాము, కెతూరా వివాహం మూలంగా ఈ కుమారులంతా పుట్టారు. 5-6 అబ్రాహాము చనిపోక ముందు తన దాసీల కుమారులందరికి అతడు కొన్ని కానుకలు ఇచ్చాడు. ఆ కుమారులను అబ్రాహాము తూర్పునకు పంపాడు. అతడు వారిని ఇస్సాకుకు దూరంగా పంపించి వేశాడు. అప్పుడు అబ్రాహాము తన ఆస్తి సర్వస్వం ఇస్సాకుకు ఇచ్చాడు.
7 అబ్రాహాము 175 సంవత్సరాల వయస్సు వరకు జీవించాడు. 8 అప్పుడు అబ్రాహాము బలము తగ్గిపోయి చనిపోయాడు. సుదీర్ఘ సంతృప్తికర జీవితం అతడు జీవించాడు. అతడు మరణించి తనవారి దగ్గరకు చేర్చబడ్డాడు. 9 అతని కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలు కలసి మక్పేలా గుహలో అతణ్ణి పాతిపెట్టారు. సోహరు కుమారుడు ఎఫ్రోను పొలంలో ఈ గుహ ఉంది. అది మమ్రేకు తూర్పున ఉంది. 10 హిత్తీ ప్రజల దగ్గర్నుండి అబ్రాహాము కొన్న గుహ ఇదే. అబ్రాహాము తన భార్య శారాతో అక్కడ పాతిపెట్టబడ్డాడు. 11 అబ్రాహాము చనిపోయిన తరువాత, ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. మరియు ఇస్సాకు బేయేర్ లహాయిరోయిలోనే నివాసం కొనసాగించాడు.
12 ఇష్మాయేలు వంశంవారి జాబితా ఇది. అబ్రాహాము హాగరుల కుమారుడు ఇష్మాయేలు. (శారాకు ఈజిప్టు దాసి హాగరు.) 13 ఇష్మాయేలు కుమారుల పేర్లు ఇవి: మొదటి కుమారుని పేరు సేబాయోతు, తర్వాత కేదారు పుట్టాడు, తర్వాత అద్బయేలు, మిబ్శాము, 14 మిష్మా, దూమారమశ్శా, 15 హదరు, తేమా, యెతూరు, నాఫీషు, కెదెమా పుట్టారు. 16 అవి ఇష్మాయేలు కుమారుల పేర్లు. ఒక్కో కుమారునికి ఒక్కో స్వంత శిబిరం ఉండేది, అదే ఒక చిన్న పట్టణం అయింది. పన్నెండు మంది కుమారులు, వారి స్వంత ప్రజలతో, పన్నెండు మంది యువరాజుల్లా ఉన్నారు. 17 ఇష్మాయేలు 137 సంవత్సరాలు బ్రతికాడు. తరువాత అతను చనిపోయి, అతని పూర్వీకులతో చేర్చబడ్డాడు. 18 ఇష్మాయేలు సంతానం వారు ఎడారి ప్రాంతమంతా బసచేశారు. ఈ ప్రాంతం ఈజిప్టు దగ్గర హవీలా, షూరు నుండి ఉత్తరపు చివరన అష్షూరు వరకు విస్తరించి ఉంది. ఇష్మాయేలు సంతానము తరచూ అతని సోదరుని ప్రజలను ఎదుర్కొన్నారు.
ఇస్సాకు కుటుంబం
19 ఇస్సాకు కుటుంబం చరిత్ర ఇది. అబ్రాహాముకు ఇస్సాకు అనే కుమారుడు ఉన్నాడు. 20 ఇస్సాకు వయస్సు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు రిబ్కాను అతడు వివాహం చేసుకొన్నాడు. రిబ్కా పద్దనరాముకు చెందినది. ఆమె బెతూయేలు కుమార్తె, అరామీయుడగు లాబానుకు సోదరి. 21 ఇస్సాకు భార్యకు పిల్లలు పుట్టలేదు. కనుక ఇస్సాకు తన భార్య కోసం ప్రార్థించాడు. ఇస్సాకు ప్రార్థన యెహోవా విన్నాడు. రిబ్కాను గర్భవతిని కానిచ్చాడు.
22 రిబ్కా గర్భవతిగా ఉన్నప్పుడు, ఆమె గర్భంలో కవల పిల్లలు పెనుగులాడారు. రిబ్కా యెహోవాను ప్రార్థించి, “ఎందుకు నాకు ఇలా జరిగింది?” అని అడిగింది. 23 ఆమెతో యెహోవా చెప్పాడు:
“నీ గర్భంలో రెండు
జనాంగాలు ఉన్నాయి.
రెండు వంశాల పాలకులు నీలోనుండి పుడతారు.
కాని వారు విభజించబడతారు.
ఒక కుమారుడు మరో కుమారుని కంటే బలవంతుడుగా ఉంటాడు.
పెద్ద కుమారుడు చిన్న కుమారుని సేవిస్తాడు.”
24 తగిన సమయం రాగానే రిబ్కా కవల పిల్లల్ని కన్నది. 25 మొదటి శిశువు ఎరుపు. వాని చర్మం బొచ్చు అంగీలా ఉంది. కనుక వానికి ఏశావు[a] అని పేరు పెట్టబడింది. 26 రెండవ శిశువు పుట్టినప్పుడు వాడు ఏశావు మడిమను గట్టిగా పట్టుకొని ఉన్నాడు. కనుక ఆ శిశువుకు యాకోబు[b] అని పేరు పెట్టబడింది. యాకోబు, ఏశావు పుట్టినప్పుడు ఇస్సాకు వయస్సు 60 సంవత్సరాలు.
27 అబ్బాయిలు పెద్దవాళ్లయ్యారు. ఏశావు నిపుణతగల వేటగాడయ్యాడు. బయట పొలాల్లో ఉండటం అంటే అతనికి చాలా ఇష్టం. అయితే యాకోబు నెమ్మదిపరుడు. అతను తన గుడారంలోనే ఉన్నాడు. 28 ఇస్సాకు ఏశావును చాలా ప్రేమించాడు. ఏశావు వేటాడిన జంతువులను తినటం అతనికి ఇష్టం. కాని రిబ్కాకు యాకోబు మీద ప్రేమ.
29 ఒకసారి ఏశావు వేటనుండి తిరిగి వచ్చాడు. అతను అలసిపోయి, ఆకలితో బలహీనంగా ఉన్నాడు. యాకోబు వంట పాత్రలో చిక్కుడుకాయలు వండుతున్నాడు. 30 కనుక ఏశావు, “నేను ఆకలితో నీరసం అయిపోయాను. ఆ ఎర్రటి చిక్కుడు కాయలు నాకు కొంచెం పెట్టు” అని యాకోబును అడిగాడు. (అందుకే ప్రజలు అతణ్ణి ఎదోం[c] అని పిలిచేవాళ్లు.)
31 అయితే యాకోబు, “నీ జ్యేష్ఠత్వపు జన్మ హక్కుల్ని ఈ వేళ నాకు అమ్మివేయాలి” అన్నాడు.
32 ఏశావు “నేను ఆకలితో దాదాపు చచ్చాను. నేను చనిపోతే, నా తండ్రి ఐశ్వర్యాలన్నీ నాకు సహాయపడవు. కనుక నా వాటా నీకు ఇచ్చేస్తాను” అన్నాడు.
33 కానీ యాకోబు, “దాన్ని నాకు ఇస్తానని ముందు ప్రమాణం చేయాలి” అన్నాడు. కనుక ఏశావు యాకోబుకు ప్రమాణం చేశాడు. తన తండ్రి ఐశ్వర్యంలో తన వాటాను ఏశావు యాకోబుకు అమ్మివేశాడు. 34 అప్పుడు యాకోబు రొట్టె, భోజనం ఏశావుకు ఇచ్చాడు. ఏశావు తిని, త్రాగి వెళ్లిపోయాడు. కనుక ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కులను లక్ష్యపెట్ట లేదని వ్యక్తం చేశాడు.
అబీమెలెకుతో ఇస్సాకు అబద్ధం చెప్పుట
26 ఒకసారి కరువుకాలం వచ్చింది. అబ్రాహాము జీవిత కాలంలో వచ్చిన కరువులాంటిదే ఇది. కనుక గెరారు పట్టణంలో ఉన్న ఫిలిష్తీ ప్రజల రాజు అబీమెలెకు దగ్గరకు ఇస్సాకు వెళ్లాడు. 2 ఇస్సాకుతో యెహోవా మాట్లాడాడు. యెహోవా చెప్పాడు: “ఈజిప్టు వెళ్లవద్దు. నీవు ఉండాలని నేను నీకు ఆజ్ఞాపించిన దేశంలోనే నీవు నివసించాలి. 3 ఆ దేశంలోనే నీవు నివాసం ఉండు, నేను నీతో ఉంటాను. నిన్ను నేను ఆశీర్వదిస్తాను. నీకు నీ వంశానికి ఈ భూభాగాలన్నీ ఇస్తాను. నీ తండ్రి అబ్రాహాముకు నేను వాగ్దానం చేసినదంతా నీకు నేను ఇస్తాను. 4 ఆకాశ నక్షత్రాలు ఎన్నో, నీ సంతానం అంతటిదిగా నేను చేస్తాను. ఈ దేశాలన్నీ నీ కుటుంబానికి నేను ఇస్తాను. నీ సంతానం మూలంగా భూమిమీద జనాంగాలన్నీ ఆశీర్వదించబడతాయి. 5 నీ తండ్రియైన అబ్రాహాము నా మాటలకు లోబడి, నేను చెప్పిన వాటిని చేశాడు గనుక నేను ఇది చేస్తాను. అబ్రాహాము నా ఆజ్ఞలకు, చట్టాలకు, నియమాలకు విధేయుడయ్యాడు.”
6 కనుక ఇస్సాకు గెరారులో ఉండిపోయి అక్కడ నివసించాడు. 7 ఇస్సాకు భార్య రిబ్కా చాలా అందగత్తె. రిబ్కాను గూర్చి అక్కడి మనుష్యులు ఇస్సాకును అడిగారు. “ఆమె నా సోదరి” అని చెప్పాడు ఇస్సాకు. రిబ్కా తన భార్య అని వారితో చెప్పడానికి ఇస్సాకు భయపడ్డాడు. ఆమెను పొందటం కోసం ఆ మనుష్యులు తనను చంపివేస్తారని ఇస్సాకు భయపడ్డాడు.
8 ఇస్సాకు అక్కడ చాలా కాలం ఉన్న తర్వాత, ఇస్సాకు అతని భార్యతో సరసాలు ఆడుకోవటం అబీమెలెకు తన కిటికీ గుండా చూశాడు. 9 అబీమెలెకు ఇస్సాకును పిలిచి “ఈ స్త్రీ నీ భార్య. ఈమె నీ సోదరి అని మాతో ఎందుకు చెప్పావు?” అని అడిగాడు.
“నీవు ఈమెను పొందటం కోసం నన్ను చంపేస్తావని నేను భయపడ్డాను” అని ఇస్సాకు అతనితో చెప్పాడు.
10 “నీవు మాకు కీడు చేశావు. మా మనుష్యుల్లో ఎవడైనా ఒకడు నీ భార్యతో శయనించి ఉండేవాడు. అప్పుడు అతడు మహా పాపము చేసిన నేరస్థుడయ్యేవాడు” అన్నాడు అబీమెలెకు.
11 అందుచేత అబీమెలెకు ప్రజలందరికి హెచ్చరిక ఇచ్చాడు. “ఈ పురుషునిగాని, ఇతని భార్యనుగాని ఎవరూ బాధించగూడదు. వారిని బాధించినవాడు ఎవరైనా సరే చంపివేయబడతాడు” అని అతడు చెప్పాడు.
ఇస్సాకు ధనికుడగుట
12 ఆ దేశంలో ఇస్సాకు పొలాల్లో విత్తనాలు విత్తాడు. ఆ సంవత్సరం అతడు విస్తారంగా పంట కూర్చుకున్నాడు. యెహోవా అతన్ని ఎంతో అశీర్వదించాడు. 13 ఇస్సాకు ధనికుడయ్యాడు. అతడు మహా ఐశ్వర్యవంతుడు అయ్యేవరకు మరింత విస్తారంగా ఐశ్వర్యం కూర్చుకొన్నాడు. 14 గొర్రెల మందలు, పశువుల మందలు అతనికి విస్తారంగా ఉన్నాయి. అతనికి చాలా మంది సేవకులు కూడా ఉన్నారు. ఫిలిష్తీ ప్రజలంతా అతని మీద అసూయ పడ్డారు. 15 కనుక ఇస్సాకు తండ్రియైన అబ్రాహాము, అతని సేవకులు తవ్విన చాలా బావుల్ని ఫిలిష్తీ ప్రజలు పాడుచేశారు. ఆ బావుల్ని ఫిలిష్తీ ప్రజలు మట్టితో నింపారు. 16 అబీమెలెకు ఇస్సాకుతో, “మా దేశం వదలి పెట్టు. నీవు మాకంటే చాలా అత్యధికంగా శక్తిమంతుడవయ్యావు” అన్నాడు.
17 కనుక ఇస్సాకు ఆ స్థలం విడిచిపెట్టి, గెరారులోని చిన్న నదికి సమీపంలో మజిలీ చేశాడు. ఇస్సాకు అక్కడ నివాసమున్నాడు. 18 దీనికి ఎంతో ముందు అబ్రాహాము చాలా బావులు తవ్వాడు. అబ్రాహాము చనిపోయిన తర్వాత ఫిలిష్తీ ప్రజలు ఆ బావులను చెత్తతో నింపేసారు. కనుక ఇస్సాకు తిరిగి వెళ్లి, ఆ బావులను మళ్లీ తవ్వాడు. వాటికి తన తండ్రి పెట్టిన పేర్లే ఇస్సాకు పెట్టాడు. 19 చిన్న నది దగ్గర ఇస్సాకు సేవకులు ఒక బావి తవ్వారు. ఆ బావిలో నీటి ఊట ఒకటి ఉబికింది. 20 అయితే గెరారు లోయలో గొర్రెల మందలను కాసేవాళ్లు ఇస్సాకు పనివాళ్లతో జగడమాడారు. “ఈ నీళ్లు మావి అన్నారు వాళ్లు.” కనుక ఆ బావికి “ఏశెకు”[d] అని ఇస్సాకు పేరు పెట్టాడు. అక్కడ ఆ మనుష్యులు అతనితో జగడమాడారు గనుక దానికి ఆ పేరు పెట్టాడు.
21 అప్పుడు ఇస్సాకు సేవకులు మరో బావి తవ్వారు. ఆ బావి మూలంగా అక్కడి ప్రజలు కూడా జగడమాడారు. కనుక ఆ బావికి “శిత్నా”[e] అని ఇస్సాకు పేరు పెట్టాడు. 22 ఇస్సాకు అక్కడనుండి వెళ్లిపోయి మరో బావి తవ్వాడు. ఆ బావి విషయం వాదించటానికి ఎవరూ రాలేదు. కనుక ఆ బావికి “రహెబోతు”[f] అని ఇస్సాకు పేరు పెట్టాడు. “ఇప్పుడు మనకోసం యెహోవా ఒక స్థలం ఇచ్చాడు. ఈ దేశంలో మనం అభివృద్ధిపొంది సఫలము కావాలి.” అన్నాడు ఇస్సాకు.
23 ఆ చోటు నుండి ఇస్సాకు బెయేర్షెబాకు వెళ్లాడు. 24 ఆ రాత్రి ఇస్సాకుతో యెహోవా మాట్లాడాడు. “నీ తండ్రి అబ్రాహాము దేవుణ్ణి నేను. భయపడకు. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ వంశస్థులను అభివృద్ధి చేస్తాను. నా సేవకుడు అబ్రాహాము కారణంగా నేను ఇది చేస్తాను” అని యెహోవా చెప్పాడు. 25 కనుక ఆ స్థలంలో దేవుణ్ణి ఆరాధించేందుకు ఒక బలిపీఠాన్ని ఇస్సాకు కట్టించాడు. ఇస్సాకు అక్కడ నివాసం చేయగా, అతని సేవకులు ఒక బావి తవ్వారు.
26 ఇస్సాకును చూసేందుకు గెరారు నుండి అబీమెలెకు వచ్చాడు. అతడు సలహాదారుడు అహుజతును, సైన్యాధిపతియైన ఫీకోలును వెంటబెట్టుకొని వచ్చాడు.
27 ఇస్సాకు వారితో, “ఇంతకుముందు నీవు నాతో స్నేహంగా లేవు గదా. నీ దేశం వదిలిపెట్టేట్లు నీవు నన్ను బలవంతం గూడా చేశావు గదా. ఇప్పుడు నన్ను చూడటానికి ఎందుకు వచ్చావు?” అన్నాడు.
28 వారు ఇలా జవాబు చెప్పారు: “యెహోవా నీకు తోడుగా ఉన్నాడని ఇప్పుడు మాకు తెలిసింది. మనం ఒక ఒడంబడిక చేసుకోవాలని మా అభిప్రాయం. మాకు నీవు ఒక ప్రమాణం చేయాలి. 29 మేము నిన్ను బాధించలేదు. ఇప్పుడు నీవు కూడా మమ్మల్ని బాధించనని ప్రమాణం చేయాలి. నిన్ను మేము పంపించివేసినా, సమాధానంగా పంపించాం. యెహోవా నిన్ను ఆశీర్వదించాడని యిప్పుడు తేటగా తెలుస్తుంది.”
30 ఇస్సాకు వారికి విందు చేశాడు. వారు తిని త్రాగారు. 31 మర్నాడు ఉదయం ఒక్కొక్కరు ఒక్కో ప్రమాణం చేశారు. తర్వాత ఆ మనుష్యులు సమాధానంగా వెళ్లిపోయారు.
32 ఆ రోజున ఇస్సాకు సేవకులు వచ్చి, వారు తవ్విన బావిని గూర్చి చెప్పారు. “ఆ బావిలో నీళ్లు చూశాం” అని సేవకులు చెప్పారు. 33 కనుక ఆ బావికి “షేబ”[g] అని పేరు పెట్టాడు ఇస్సాకు. ఆ పట్టణం ఇప్పటికీ బెయేర్షెబా అని పిలువబడుతుంది.
ఏశావు భార్యలు
34 ఏశావు 40 సంవత్సరాల వయస్సులో హిత్తీ స్త్రీలను ఇద్దరిని వివాహం చేసుకొన్నాడు. ఒక స్త్రీ బేయేరి కుమార్తె యహూదీతు. ఇంకొక ఆమె ఏలోను కుమార్తె బాశెమతు. 35 ఈ వివాహాలు ఇస్సాకు, రిబ్కాలను చాలా బాధపెట్టాయి.
© 1997 Bible League International