Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యోబు 29-31

యోబు తన మాటలు కొనసాగించటం

29 యోబు మాట్లాడటం కొనసాగించాడు. యోబు ఇలా అన్నాడు:

“దేవుడు నన్ను కాపాడి, నా విషయం జాగ్రత్త తీసుకొన్న ఇటీవలి మాసాల్లో ఉన్నట్టుగానే
    నా జీవితం ఉంటే బాగుండునని నేను ఆశిస్తున్నాను.
నేను చీకటిలో నడచినప్పుడు నాకు వెలుగు ఇచ్చుటకు నా తలమీద దేవుని వెలుగు ప్రకాశించే సమయం వస్తే బాగుండునని నేను ఆశిస్తున్నాను.
    (నేను జీవించవలసిన సరియైన మార్గాన్ని దేవుడు నాకు చూపించాడు).
నా జీవితం ఎంతో విజయవంతంగా ఉండి దేవుడు నాకు సన్నిహితమైన స్నేహితునిగా ఉండే రోజుల కోసం నేను ఆశిస్తున్నాను.
    అవి దేవుడు నా ఇంటిని ఆశీర్వదించిన రోజులు.
సర్వశక్తిమంతుడైన దేవుడు ఇంకా నాతో ఉండగా
    నా పిల్లలు నా దగ్గర ఉన్న సమయం కోసం నేను ఆశిస్తున్నాను.
అది నా జీవితం ఎంతో బాగున్నప్పటి మాట.
    నా మార్గం అంతా మీగడతో నిండిపోయినట్టు, నా కోసం ఒలీవ నూనెను నదులుగా ప్రవహించి నట్టు అది కనబడింది.

“నేను పట్టణ ద్వారం దగ్గరకు వెళ్లి పట్టణ పెద్దలతో కలిసి
    ఆరుబయట కూర్చున్న రోజులు అవి.
అక్కడ ప్రజలంతా నన్ను గౌరవించేవారు. యువకులు నన్ను చూచినప్పుడు పక్కకు తప్పుకొనేవారు.
    పెద్దలు నా యెడల గౌరవ సూచకంగా లేచి నిలబడేవారు.
ప్రజానాయకులు నన్ను చూడగానే మాట్లాడటం నిలిపివేసి
    నోటిమీద చేయి వేసుకొనేవారు (ఇతరులను నిశ్శబ్దంగా ఉంచటానికి).
10 చాలా ప్రముఖ నాయకులు కూడా, నేను వారిని సమీపించినప్పుడు వారి స్వరాలు తగ్గించేవారు.
    అవును వారి నాలుకలు వారి అంగిట అంటుకొని పోయినట్లు కనిపించేది.
11 నేను మాట్లాడటం విన్నవారు ఎవరైనా సరే, నన్ను గూర్చి మంచి మాటలు చెప్పేవారు.
    నన్ను చూచిన వారు నన్ను పొగిడారు.
12 ఎందుకంటే, పేదవాడు ఒకడు సహాయం కోసం వేడుకొంటే, నేను సహాయం చేశాను.
    తల్లి దండ్రులు లేని బిడ్డ విషయం శ్రద్ధ తీసుకొనేవారు ఎవరూ లేనప్పుడు నేను సహాయం చేశాను.
13 మరణించే మనిషీ నన్ను ఆశీర్వదించాడు.
    అవసరంలో ఉన్న విధవలకు నేను సహాయం చేసాను.
14 సక్రమంగా జీవించటం నాకు వస్త్రం.
    న్యాయం నాకు అంగీలా, తలపాగాలా ఉండేది.
15 గుడ్డివారికి నా కళ్లతో నేను సహాయం చేశాను.
    కుంటివారికి నా పాదాలతో నేను సహాయం చేశాను.
16 పేద ప్రజలకు నేను ఒక తండ్రిలా ఉన్నాను.
    కష్టాలలో ఉన్న పరాయివారి పక్షం నేను వహించాను.
17 దుర్మార్గుల శక్తిని నేను నాశనం చేశాను.
    దుర్మార్గుల బారి నుండి నిర్దోషులను నేను రక్షించాను.

18 “నేను ఎల్లప్పుడూ ఇలా తలచేవాణ్ణి. నేను చాలాకాలం బ్రతుకుతాను.
    తర్వాత నా స్వంత ఇంటిలో మరణిస్తాను.
19 వేర్లు ఎల్లప్పుడూ నీటిని తాకుతూ ఆకులు ఎల్లప్పుడు
    మంచుతో తడిగా ఉండే చెట్టులా నేను ఉన్నాను.
20 నాలో నా మహిమ ఎల్లప్పుడూ కొత్తదిగా ఉంటుంది.
    నాచేతిలో ఒక కొత్త విల్లు ఉన్నట్టుగా నేను ఎల్లప్పుడూ బలంగా ఉంటాను.

21 “నేను మాట్లాడటం చాలించిన తరువాత నా మాటలు వింటున్న ప్రజలు చెప్పాల్సింది ఇంకేమీ ఉండేది కాదు.
    నా మాటలు వారి చెవులకు సౌమ్యంగా వినిపించేవి.
22 ప్రజలు వర్షంకోసం వేచి ఉన్నట్టు,
    నేను మాట్లాడాలని వారు వేచి ఉండేవారు.
23 నా మాట వసంతకాలపు వర్షంలా ఉండేది. నా మాటల్ని వారు పానం చేసేవారు.
    అధైర్యపడినవారిని చూచి నేను చిరునవ్వు నవ్వేవాడిని.
24 నా ప్రసన్న ముఖం క్రుంగిన ప్రజలకు మంచి అనుభూతిని కలిగించేది.
25 ప్రజల పట్ల బాధ్యత వహించి నేను నిర్ణయాలు చేసాను. నేను నాయకుణ్ణి అయ్యాను.
    తన సైన్య దళాలలో ఒక రాజులా నేను జీవించాను. చాలా విచారంలో ఉన్న ప్రజలకు ఆదరణ ఇచ్చే మనిషిలా నేను ఉన్నాను.
30 కాని యిప్పుడు నన్ను హేళన చేసే వారు నాకంటే చిన్నవారు.
    ఆ యువకులకు పనికిమాలిన తండ్రులు ఉన్నారు. వారి తండ్రులను నా గొర్రెలను కాపలా కాసే కుక్కలతో కూడా నేను ఉండనివ్వను.
నాకు సహాయం చేసేందుకు వాళ్లకు బలం లేదు.
    వారు అలసిపోయిన వృద్ధులు.
ఆ మనుష్యులు చచ్చిన వాళ్లతో సమానం.
    ఎందుకంటే వారికి ఏమీ లేక ఆకలితో ఉన్నారు. ఎండి పోయిన ఖాళీ నేలను కూడా వారు తినటానికి ప్రయత్నిస్తున్నారు.
ఆ మనుష్యులు వారి ఎడారిలోని తుత్తి చెట్లను పెరికి వేస్తారు.
    తంగేడు చెట్టు వేర్లను వారు తింటారు.
ఆ మనుష్యులు ఇతర మనుష్యుల దగ్గర నుండి బలవంతంగా వెళ్లగొట్టబడతారు.
    మనుష్యులు దొంగల మీద అరచినట్టుగా వారి మీద అరుస్తారు.
ఎండిపోయిన నదులలోను, బండలలోను,
    కొండగుహలలోను, నేలలోని గుంటలలోను నివసించేందుకు వారి వృద్ధులు బలాత్కారం చేయబడతారు.
వారు పొదలలో అరుస్తారు.
    ముళ్ల కంపల్లో వారంతా ఒక్కచోట చేరుతారు.
వాళ్లు పనికిమాలిన అనామకుల గుంపు.
    వాళ్లు వారి దేశం నుండి బలవంతంగా వెళ్లగొట్టబడిన వాళ్లు.

“ఇప్పుడు ఆ మనుష్యుల కొడుకులు నన్ను హేళన చేసేందుకు నన్ను గూర్చి పాటలు పాడుతారు.
    వాళ్లకు నా పేరు చెడ్డ మాట అయింది.
10 ఆ యువకులు నన్ను ద్వేషిస్తారు, వారు నాకు దూరంగా నిలుస్తారు, వారు నాకంటే మంచివాళ్లము అనుకొంటారు.
    చివరికి వాళ్లు నా ముఖం మీద ఉమ్మి కూడా వేస్తారు.
11 నా వింటి నారిని దేవుడు తీసుకొని నన్ను బలహీనుణ్ణి చేశాడు.
    ఆ యువకులు తమని తాము వారించుకొనక నిండు కోపంతో నాకు విరోధంగా తిరుగుతారు.
12 నా కుడి ప్రక్క ఆ యువకులు నామీద పడుతున్నారు.
    నేను పడిపోయేలా వాళ్లు చేస్తున్నారు.
    వారు నామీద దాడి చేసి, నన్ను నాశనం చేసేందుకు నా చుట్టూరా పట్టణానికి ముట్టడి దిబ్బ వేసినట్లు వేస్తున్నారు.
13 నేను పారిపోయే మార్గాన్ని ఆ యువకులు కాపలా కాస్తున్నారు.
    నన్ను నాశనం చేయటంలో వారు విజయం పొందుతున్నారు. వారు నన్ను నాశనం చేయటానికి వారికి ఎవరి సహాయం అవసరం లేదు.
14 గోడలోని కన్నంగుండా వెళ్లిపోయినట్టు వారు నామీద దాడి చేస్తున్నారు.
    వారు దూకేసి నా మీదకు విరగబడుతున్నారు.
15 భయాలు నన్ను ఆవరించేస్తున్నాయి.
    వస్తువులను గాలి చెదరగొట్టినట్లు ఆ యువకులు నా గౌరవాన్ని అవమానపరుస్తున్నారు.
    నా భద్రత మబ్బులా మాయమవుతోంది.

16 “ఇప్పుడు నా జీవితం దాదాపు అయిపోయింది.
    నేను త్వరలోనే మరణిస్తాను. శ్రమదినాలు నన్ను పట్టివేశాయి.
17 రాత్రివేళ నా ఎముకలు అన్నీ నొప్పెడతాయి.
    బాధ నన్ను నమిలివేయటం ఎన్నడూ ఆగిపోలేదు.
18 దేవుడు మహాబలంగా నా చొక్కా పట్టి లాగుతున్నాడు.
    ఆయన నా బట్టలను నలిపి వేస్తున్నాడు.
19 దేవుడు నన్ను బురదలో పడదోస్తున్నాడు.
    నేను మట్టిలా, బూడిదలా అయిపోతున్నాను.

20 “దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెడుతున్నాను.
    కానీ నీవు జవాబు ఇవ్వవు.
నేను నిలబడి ప్రార్థన చెస్తాను.
    కానీ నీవు నాకు జవాబు ఇవ్వవు.
21 దేవా, నీవు నా ఎడల అసహ్యంగా ప్రవర్తిస్తున్నావు.
    నన్ను బాధపెట్టేందుకు నీవు నీ శక్తిని ప్రయోగిస్తున్నావు.
22 దేవా, బలమైన గాలి నన్ను కొట్టుకొని పోయేటట్టు నీవు చేస్తున్నావు.
    నీవు నన్ను తుఫానులో పడదోస్తున్నావు.
23 నీవు నన్ను నా మరణానికి తీసుకొని పోతున్నావని నాకు తెలుసు.
    మరణం ప్రతి మనిషికి ఏర్పాటు చేయబడిందే.

24 “కానీ అప్పటికే నాశనమయి, సహాయంకోసం అలమటించేవాణ్ణి
    నిశ్చయంగా ఎవ్వరూ బాధించరు.
25 దేవా, కష్టాల్లో ఉన్న ప్రజల పక్షంగా నేను మొర్ర పెట్టానని నీకు తెలుసు.
    పేద ప్రజల కోసం నా హృదయం ఎంతో విచారించిందని నీకు తెలుసు.
26 కానీ నేను మంచివాటి కోసం ఎదురు చూస్తే వాటికి బదులు చెడ్డవి జరిగాయి.
    వెలుగుకోసం నేను చూస్తే చీకటి వచ్చింది.
27 అంతరంగంలో నేను చీల్చివేయబడ్డాను.
    శ్రమలు ఎన్నటికీ ఆగిపోవు. శ్రమకాలాలు నా యెదుట ఉన్నాయి.
28 నేను ఎల్లప్పుడూ ఎంతో విచారంగా ఉంటానుగాని,
    నాకు ఆదరణ లభ్యం కాదు. నేను సమాజంలో నిలబడి సహాయం కోసం కేకలు వేస్తాను.
29     నేను అడవి కుక్కలకు సోదరుడినయ్యాను. నిప్పుకోళ్లు నాకు జతగాళ్లు.
30 నా చర్మం చాలా నల్లబడిపోయింది.
    నా శరీరం జ్వరంతో వేడిగా ఉంది.
31 దుఃఖమయ గీతాలు వాయించేందుకు నా స్వర మండలమును శృతి చేయబడింది.
    విచారంగా ఏడుస్తున్న శబ్దాలు నా పిల్లనగ్రోవి చేస్తుంది.
31 “ఒక యువతిని కామవాంఛతో చూడకూడదని
    నా కళ్లతో నేను ఒప్పందం చేసుకొన్నాను.
సర్వశక్తిమంతుడైన దేవుడు తన ప్రజలకు ఏమి చేస్తున్నాడు?
    దేవుడు ఉన్నతమైన తన పరలోక గృహంలో ఉండి ప్రజలకు తిరిగి ఎలా ప్రతిఫలం ఇస్తున్నాడు?
దుర్మార్గులకు దేవుడు కష్టాన్ని, నాశనాన్ని పంపిస్తాడు.
    తప్పు చేసేవారికి సర్వనాశనం కలిగిస్తాడు.
నేను చేసేది ప్రతిదీ దేవునికి తెలుసు.
    నేను వేసే ప్రతి అడుగూ ఆయన చూస్తున్నాడు.

“నేను అబద్ధాల జీవితం జీవించి ఉంటే,
    లేక ప్రజలకు అబద్దాలు చెప్పి, మోసం చేసేందుకు నేను పరుగులెత్తి ఉంటే.
అప్పుడు నన్ను తూచేందుకు దేవుడు న్యాయపు త్రాసు వాడవచ్చును.
    అప్పుడు నేను నిర్దోషినని దేవునికే తెలుస్తుంది.
నేను సరియైన మార్గం నుండి తొలగిపోతే
    నా కళ్లు నా హృదయాన్ని దుష్టత్వానికి నడిపించి ఉంటే
    లేదా నా చేతులు పాపంతో మైలగా ఉంటే,
అప్పుడు నేను నాటిన పంటలను ఇతరులు తిని వేయుదురు గాక,
    నా పంటలు పెరికి వేయబడును గాక.

“నేను స్త్రీల పట్ల కామవాంఛ కలిగి ఉంటే, లేదా
    నేను నా పొరుగువాని భార్యతో వ్యభిచార పాపం చేయటానికి అతని ద్వారం దగ్గర వేచి ఉంటే,
10 అప్పుడు నా భార్య మరొకనికి వంట చేయునుగాక.
    ఇతర వురుషులు ఆమెతో పండుకొందురు గాక.
11 ఎందుకంటే లైంగిక పాపం అవమానకరం.
    అది శిక్షించబడాల్సిన పాపం.
12 లైంగికపాపం కాల్చివేసి, నాశనంచేసే అగ్నిలాంటిది.
    లైంగిక పాపం నాకు గల సర్వాన్నీ నాశనం చేస్తుంది.

13 “నా మగ సేవకులు, ఆడ సేవకులు నాకు విరోధంగా ఆరోపణ చేసినప్పుడు,
    ఒక వేళ నేను వారికి న్యాయం చేకూర్చేందుకు నిరాకరిస్తే,
14 నేను దేవుణ్ణి ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు నేను ఏమి చేస్తాను?
    నేను చేసినదాని గూర్చి వివరించుమని దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను ఏమి జవాబిస్తాను?
15 దేవుడు నన్ను నా తల్లి గర్భంలోనే చేశాడు. నా సేవకులను కూడా దేవుడే చేసాడు.
    మమ్మల్ని ఇద్దరినీ మా తల్లి గర్భంలో దేవుడే రూపొందించాడు.

16 “పేద ప్రజలకు సహాయం చేసేందుకు నేను ఎన్నడూ నిరాకరించలేదు.
    విధవలను దిక్కుమాలిన వారిగా నేను ఎన్నడూ ఉండనియ్యలేదు.
17 నా భోజనం విషయంలో నేను ఎన్నడూ స్వార్థంతో ఉండలేదు.
    అనాధ పిల్లలను నేను ఎన్నడూ ఆకలితో ఉండనీయలేదు.
18 నా జీవిత కాలం అంతా తండ్రిలేని పిల్లలకు నేను ఒక తండ్రిలా ఉన్నాను.
    నా జీవిత కాలం అంతా విధవల పట్ల నేను శ్రద్ధ చూపాను.
19 ఎవరో ఒకరు బట్టలు లేక శ్రమపడటం నేను చూచినప్పుడు,
    లేక పేదవాడు చొక్కా లేకుండా ఉన్నప్పుడు,
20     నేను ఎల్లప్పుడూ వారికి బట్టలు ఇచ్చాను.
వారికి వెచ్చదనం కోసం నా గొర్రెల స్వంతబొచ్చు నేను ఉపయోగించాను.
    అప్పుడు వారు హృదయపూర్వకంగా నన్ను ఆశీర్వదించారు.
21 న్యాయస్థానంలో నేను గెలుస్తానని తెలిసికూడ
    ఒక అనాధ బిడ్డను నేను మోసం చేస్తే,
22 నేను ఒకవేళ అలాచేస్తే నా భుజం నుండి నా చేయి ఊడి పడిపోవును గాక.
    నా చేయి దాని కీలు నుండి పడిపోవును గాక.
23 కాని ఆ చెడ్డ పనులు ఏవీ నేను చేయలేదు.
    ఎందుకంటే, దేవుని శిక్షకు నేను భయపడ్డాను.
    ఆయన మహాత్మ్యము నన్ను బెదరగొట్టెను.

24 “నా ఐశ్వర్యాలను నేను ఎన్నడూ నమ్ముకొనలేదు.
    ‘నీవే నా ఆశ అని’ స్వచ్ఛమైన బంగారంతో నేను ఎన్నడూ చెప్పలేదు.
25 నేను ధనికుడను అని ఎన్నడు గర్వంతో నిండిపోలేదు.
    లేక నేను సంపాదించిన ఐశ్వర్యాలతో మురిసిపోలేదు.
26 నేను ఎన్నడూ ప్రకాశమైన సూర్యుణ్ణి
    లేక అందమైన చంద్రుణ్ణి ఆరాధించలేదు.
27 సూర్య చంద్రులకు భక్తితో పూజ చేసేందుకు
    నేను ఎన్నడూ మోసగించబడలేదు.
28 అలాంటివి ఏవైనా, ఎన్నడైనా నేను చేసి ఉంటే అవి నేను శిక్షించబడాల్సిన పాపాలే.
    ఎందుచేతనంటే ఆ చెడు కార్యాలు చేయటం మూలంగా సర్వశక్తిమంతుడైన దేవునికి నేను అపనమ్మకమైనవాడి నవుతాను.

29 “నా శత్రువులు నాశనం చేయబడినప్పుడు
    నేను ఎన్నడూ సంతోషించలేదు.
నా శత్రువులకు కష్టాలు కలిగినప్పుడు
    నేను ఎన్నడూ నవ్వలేదు.
30 నా శత్రువులను శపించటం ద్వారానూ, వారు చావాలని కోరుకోవటం ద్వారానూ,
    నేను ఎన్నడూ నా నోటితో పాపం చేయలేదు.
31 పరాయి వాళ్లకు నేను ఎల్లప్పుడూ భోజనం పెట్టినట్లు
    నా ఇంట్లోని వాళ్లందరకూ తెలుసు.
32 పరాయి వాళ్లు రాత్రి పూట వీధుల్లో నిద్రపోవాల్సిన అవసరం లేకుండా
    నేను అలాంటి వారిని ఎల్లప్పుడూ నా ఇంటికి ఆహ్వానించేవాడను.
33 ఇతరులు తమ పాపాలు దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తారు.
    కాని నేను నా దోషాన్ని దాచిపెట్టలేదు.
34 ఎందుకంటే, ప్రజలు ఏమనుకుంటారో అని నేను ఎన్నడూ భయపడలేదు.
    నేను ఎన్నడూ మౌనంగా ఉండలేదు.
    బయటకు వెళ్లకుండా ఉండలేదు. ఎందుకంటే, ప్రజలు నన్ను ద్వేషిస్తారనే భయం నాకు లేదు గనుక.

35 “ఆహా, ఎవరైనా నా మాటలు వినేవారు ఉంటే బాగుండును.
    ఇప్పుడు నేను నా వాదం చెబుతాను.
సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు జవాబిచ్చును గాక.
    నన్ను నిందించే ఆయన, నేను చేశానని నిందించబడుతున్న సంగతులను వ్రాసి పెట్టును గాక.
36 నిశ్చయంగా ఆ వ్రాతను నేను నా భుజం మీద ధరిస్తాను.
    నేను దానిని కిరీటంలా ధరిస్తాను.
37 నేను చేసినది సమస్తం దేవునికి నేను వివరిస్తాను.
    నేను ఒక అధికారిలా నా తలపైకి ఎత్తుకొని దేవుని దగ్గరకు వస్తాను.

38 “నేను సాగుచేస్తున్న భూమిని దాని స్వంతదారుని దగ్గర దొంగిలించి తీసుకొని ఉంటే,
    ఆ భూమి దాని స్వంత కన్నీళ్లతో తడిసి ఉంటే,
39 ఆ భూమి పండించిన వాటిని రైతులకు విలువ చెల్లించకుండానే
    నేను దొంగిలించి ఉంటే,
40 అవును, ఈ చెడుకార్యాలు నేను కనుక చేసి ఉంటే
    పొలాల్లో గోధుమకు బదులు ముండ్లు, యవలకు బదులుగా కలుపు మొక్కలు మొలుచును గాక!”

యోబు మాటలు సమాప్తం.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International