Chronological
అపొస్తులుని హక్కులు
9 నాకు స్వేచ్ఛ లేదా? నేను అపొస్తలుడను కానా? నేను మన యేసు క్రీస్తు ప్రభువును చూడలేదా? “మీరే” ప్రభువు కోసం నేను చేసిన సేవా ఫలితంకదా? 2 నేను ఇతరులకు క్రీస్తు అపొస్తులుడను కాకపోవచ్చు. కాని నేను మీకు క్రీస్తు అపొస్తులుడను. నేను క్రీస్తు అపొస్తులుడనన్న దానికి మీరే నా రుజువు.
3 నాపై తీర్పు చెప్పాలనుకొన్నవాళ్ళకు నా సమాధానం యిది: 4 అన్న పానాలకు మాకు అధికారం లేదా? 5 ఇతర అపొస్తులవలె, ప్రభువు సోదరులవలె, కేఫావలె విశ్వాసురాలైన భార్యను వెంట తీసుకెళ్ళటానికి మాకు అధికారం లేదా? 6 నేనూ, బర్నబా మాత్రమే జీవించటానికి పనిచేయాలా? 7 తన స్వంత డబ్బుతో సైనికునిగా ఎవరు పని చేస్తారు? ద్రాక్షా మొక్కల్ని నాటి, వాటి ఫలాన్ని తినకుండా ఎవరుంటారు? పశువుల మందలను కాస్తూ, వాటి పాలు త్రాగకుండా ఎవరుంటారు?
8 నేను దీన్ని మానవ దృష్టిలో చెపుతున్నానా? ధర్మశాస్త్రం కూడా ఈ మాటే చెబుతుంది. 9 మోషే ధర్మశాస్త్రంలో, “ధాన్యం త్రొక్కే ఎద్దు నోటికి చిక్కం వేయరాదు”(A) అని వ్రాయబడి ఉంది. ఎద్దులకోసం మాత్రమే దేవుడు ఈ మాట అన్నాడా? 10 ఈ మాట మనకోసమే వ్రాయబడిందని నేను గట్టిగా చెప్పగలను. పొలం దున్నేవాడూ, పంట నూర్చేవాడూ, పంట ఫలంలో భాగం లభిస్తుందన్న ఆశతో ఆ పనులు చేస్తారు. 11 మేము మీలో ఆత్మీయ విత్తనాలు చల్లాము. మీనుండి మా అవసరాలు తీర్చుకోవటం తప్పా? 12 మిగతావాళ్ళకు మీనుండి ఈ సహాయం పొందే హక్కు ఉన్నప్పుడు మాకు వాళ్ళకంటే ఎక్కువ హక్కు ఉందికదా? కాని, మేమా హక్కును ఉపయోగించుకోలేదు. క్రీస్తు సువార్త ప్రచారంలో ఏ ఆటంకం కలుగకుండా ఉండాలని మేము ఎన్నో కష్టాలు అనుభవించాము. 13 మందిరంలో పనిచేసేవాళ్ళకు మందిరం నుండి ఆహారం లభిస్తుంది. బలిపీఠం దగ్గర పనిచేసేవాళ్ళకు బలి ఇవ్వబడిన వాటిలో భాగం లభిస్తుందని తెలియదా? 14 అదే విధంగా సువార్త బోధించే వాళ్ళకు సువార్త ద్వారా జీవితావసరాలు తీరాలని ప్రభువు ఆజ్ఞాపించాడు.
15 కాని నేను ఈ హక్కుల్ని ఉపయోగించుకోలేదు. మీరు నాకు సహాయం చెయ్యాలనే ఉద్దేశ్యంతో నేను ఇది వ్రాయటం లేదు. అభిమానం దెబ్బతినటం కన్నా నాకు చావటం మేలనిపిస్తుంది. 16 కాని నేను సువార్త ప్రకటిస్తున్నందుకు గొప్పలు చెప్పుకోలేను. సువార్త బోధించటం నా కర్తవ్యం. నేను సువార్త బోధించటం ఆపేస్తే నాకు శాపం కలుగుగాక! 17 స్వయంగా ఈ పని చేస్తే నాకు బహుమానం ఉంది. ఈ పని చెయ్యాలని నేను స్వయంగా కోరలేదు. ఆ బాధ్యతను నాకు దేవుడే అప్పగించాడు. 18 మరి నా ప్రతిఫలం ఏమిటి? ప్రతిఫలం పుచ్చుకోకుండా, నా హక్కులు అడగకుండా సువార్తను ప్రకటించటమే నా ప్రతిఫలం.
19 నేను స్వేచ్ఛాజీవిని, ఎవ్వరికీ బానిసను కాను. కాని చేతనైనంతమందిని గెలవాలని నేను ప్రతి ఒక్కనికీ బానిసనౌతాను. 20 నేను యూదులతో ఉన్నప్పుడు వాళ్ళని గెలవాలని యూదునిలా జీవించాను. ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ హృదయాలు గెలవాలని, నేను ధర్మశాస్త్రం అనుసరించవలసిన అవసరం లేకపోయినా ధర్మశాస్త్రం అనుసరించేవాళ్ళకోసం దాన్ని అనుసరిస్తూ ఉన్నట్లు జీవించాను. 21 ధర్మశాస్త్రం లేనివాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళని గెలవాలని, ధర్మశాస్త్రం లేనివానిగా ప్రవర్తించాను. అంటే నేను దేవుని న్యాయానికి అతీతుడను కాను. నిజానికి నేను క్రీస్తు న్యాయాన్ని అనుసరిస్తున్నాను. 22 బలహీనుల్ని గెలవాలని బలహీనుల కోసం బలహీనుడనయ్యాను. ఏదో ఒక విధంగా కొందరినైనా రక్షించగలుగుతానేమో అని నేను అందరికోసం అన్ని విధాలుగా మారిపొయ్యాను. 23 నేను ఇవన్నీ సువార్త కోసం చేసాను. అది అందించే దీవెనలు పొందాలని నా అభిలాష.
24 పరుగు పందెంలో అందరూ పాల్గొన్నా ఒక్కనికే బహుమతి లభిస్తుందని మీకు తెలియదా? కనుక ఆ బహుమతి పొందాలనే ఉద్దేశ్యంతో పరుగెత్తండి. 25 పరుగు పందెంలో పాల్గొనదలచిన వాళ్ళందరూ మంచి క్రమశిక్షణ పొందుతారు. విజయకిరీటం పొందాలనే వాళ్ళ ఉద్దేశ్యం. కాని, వాళ్ళు పొందే కిరీటం చిరకాలం ఉండదు. మనం చిరకాలం ఉండే కిరీటం కోసం పోరాడుతున్నాం. 26 నేను గమ్యం లేకుండా పరుగెత్తను. గాలితో పోరాడుతున్న వానిలా పోరాడను. 27 నేను నా దేహానికి సరియైన శిక్షణనిచ్చి, అదుపులో ఉంచుకొంటాను. బోధించిన తర్వాత కూడా ఆ బహుమతి పొందే అర్హత పోగొట్టుకోరాదని ప్రయాస పడుచున్నాను.
ఇశ్రాయేలు చరిత్ర నుండి హెచ్చరికలు
10 సోదరులారా! ఈ సత్యమును గ్రహించకుండా యుండుట నాకిష్టం లేదు. మన పూర్వికులు మేఘం క్రింద యుండిరి. సముద్రాన్ని చీల్చి ఏర్పరచబడిన దారి మీద వాళ్ళు నడిచి వెళ్ళారు. 2 వాళ్ళు మేఘంలో, సముద్రంలో బాప్తిస్మము పొందాక, మోషేలోనికి ఐక్యత పొందారు. 3 అందరూ ఒకే ఆత్మీయ ఆహారం తిన్నారు. 4 అందరూ ఒకే విధమైన ఆత్మీయ నీటిని త్రాగారు. ఈ నీటిని వాళ్ళ వెంటనున్న ఆత్మీయమైన బండ యిచ్చింది. ఆ బండ క్రీస్తే. 5 అయినా వాళ్ళలో కొందరు మాత్రమే దేవునికి నచ్చిన విధంగా జీవించారు. మిగతావాళ్ళు ఎడారిలో చనిపొయ్యారు.
6 వాళ్ళలా మనం చెడు చేయరాదని వారించటానికి ఇవి దృష్టాంతాలు. 7 కొందరు పూజించినట్లు మీరు విగ్రహాలను పూజించకండి. ధర్మశాస్త్రంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ప్రజలు తిని, త్రాగటానికి కూర్చొన్నారు. లేచి నృత్యం చేసారు.”(B) 8 మనం వాళ్ళు చేసినట్లు వ్యభిచారం చేయరాదు. వ్యభిచారం చెయ్యటం వల్ల ఒక్క రోజులో వాళ్ళలో ఇరవై మూడు వేలమంది మరణించారు. 9 వాళ్ళు ప్రభువును శోధించిన విధంగా మనం శోధించరాదు. పరీక్షించిన వాళ్ళను పాములు చంపివేసాయి. 10 వాళ్ళవలె సణగకండి. సణగిన వాళ్ళను మరణదూత చంపివేశాడు.
11 మనకు దృష్టాంతముగా ఉండాలని వాళ్ళకు ఇవి సంభవించాయి. మనల్ని హెచ్చరించాలని అవి ధర్మశాస్త్రంలో వ్రాయబడ్డాయి. ఈ యుగాంతములో బ్రతుకుతున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి వ్రాయబడ్డాయి. 12 కనుక గట్టిగా నిలుచున్నానని భావిస్తున్నవాడు క్రింద పడకుండా జాగ్రత్త పడాలి. 13 మానవులకు సహజంగా సంభవించే పరీక్షలు తప్ప మీకు వేరే పరీక్షలు కలుగలేదు. దేవుడు నమ్మకస్థుడు. భరించగల పరీక్షలకన్నా, పెద్ద పరీక్షలు మీకు ఆయన కలుగనీయడు. అంతేకాక, పరీక్షా సమయం వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని జయం పొందే మార్గం కూడా దేవుడు చూపుతాడు.
14 కనుక నా ప్రియ మిత్రులారా! మీరు విగ్రహారాధనకు దూరంగా ఉండండి. 15 మీరు తెలివిగలవాళ్ళు కనుక ఇలా మాట్లాడుతున్నాను. నేను చెపుతున్న వాటిని గురించి మీరే నిర్ణయించండి 16 మనము కృతజ్ఞతతో దీవెన పాత్రనుండి త్రాగటం క్రీస్తు రక్తాన్ని పంచుకోవటము కదా? మనము విరిచిన రొట్టెను పంచుకోవటము క్రీస్తు శరీరాన్ని పంచుకోవటము కదా? 17 రొట్టె ఒకటే గనుక ఆ ఒకే రొట్టెలో పాలుపొందే మనం అనేకులమైనప్పటికిని ఒకే శరీరమైయున్నాము.
18 ఇశ్రాయేలు ప్రజల్ని చూడండి. బలి ఇచ్చినదాన్ని తినేవాళ్ళు బలిపీఠానికి భాగస్వాములు కారా? 19 మరి నేను చెపుతున్నదానికి అర్థం ఏమిటి? విగ్రహాల్లో కాని, ఆరగింపు చేసిన ప్రసాదంలో కాని, ఏదో ప్రత్యేకత ఉందని చెపుతున్నానా? 20 లేదు. నేను చెపుతున్నది ఏమిటంటే యూదులుకానివాళ్ళు బలిపీఠాలపై బలి ఇచ్చినవి దయ్యాల కోసం బలి ఇవ్వబడ్డాయి. అవి దేవునికి అర్పితం కావు. మీరు దయ్యాలతో భాగస్వాములు కారాదని నా విన్నపం. 21 మీరు ప్రభువు పాత్రనుండి త్రాగుతూ దయ్యాల పాత్రనుండి కూడా త్రాగాలని ప్రయత్నించరాదు. మీరు ప్రభువు పంక్తిలో కూర్చొని భోజనం చేస్తూ దయ్యాల పంక్తిలో కూడా కూర్చోవటానికి ప్రయత్నం చేయరాదు. 22 మనం దేవుని కోపాన్ని రేపటానికి ప్రయత్నిద్దామా? మనం ఆయన కంటే శక్తిగలవాళ్ళమా? ఎన్నటికీ కాదు.
మరికొన్ని కర్తవ్యాలు
23 “మనకు ఏది చెయ్యటానికైనా స్వేచ్ఛ ఉంది” కాని అన్నీ లాభదాయకం కావు. “మనకు అన్నీ చెయ్యటానికి స్వేచ్ఛ ఉంది” కాని అన్నిటి వల్ల వృద్ధి కలుగదు. 24 ఎవరూ తమ మంచి కొరకే చూసుకోరాదు. ఇతరుల మంచి కోసం కూడా చూడాలి.
25 మీ మనస్సులు పాడు చేసుకోకుండా కటికవాని అంగడిలో అమ్మే ఏ మాంసాన్నైనా తినండి. 26 “ఎందుకంటే ఈ భూమి, దానిలో ఉన్నవన్నీ ప్రభునివే.”(C)
27 క్రీస్తును విశ్వసించనివాడు మిమ్మల్ని భోజనానికి పిలిస్తే మీకు ఇష్టముంటే వెళ్ళండి. మనస్సుకు సంబంధించిన ప్రశ్నలు వేయకుండా మీ ముందు ఏది ఉంచితే అది తినండి. 28 కాని ఎవరైనా మీతో, “ఇది విగ్రహాలకు ఆరగింపు పెట్టిన ప్రసాదం” అని అంటే, ఈ విషయం మీతో చెప్పినవాని కోసం, వాని మనస్సుకోసం దాన్ని తినకండి. 29 అంటే, మీ మనస్సు కోసం అని కాదు, ఆ చెప్పినవాని మనస్సు కోసం దాన్ని తినకండి. నా స్వాతంత్ర్యం విషయంలో అవతలివాని మనస్సు ఎందుకు తీర్పు చెప్పాలి? 30 నేను కృతజ్ఞతలు అర్పించి భోజనం చెయ్యటం మొదలుపెడ్తాను. నేను కృతజ్ఞతలు అర్పించి తినే భోజనాన్ని గురించి ఇతరులు నన్నెందుకు విమర్శించాలి?
31 కానీ మీరు తిన్నా, త్రాగినా, ఏది చేసినా అన్నీ దేవుని ఘనత కోసం చేయండి. 32 యూదులకు గాని, యూదులుకానివాళ్ళకు గాని, దేవుని సంఘానికి గాని, కష్టం కలిగించకుండా జీవించండి. 33 నేను చేస్తున్నట్లు మీరు చెయ్యండి. నేను అన్ని పనులూ ఇతరులను సంతోషపెట్టాలని చేస్తాను. నా మంచి నేను చూసుకోను. వాళ్ళ మంచి కోసం చేస్తాను. వాళ్ళు రక్షింపబడాలని నా ఉద్దేశ్యం.
11 నేను క్రీస్తును అనుసరించిన విధంగా, మీరు నన్ను అనుసరించండి.
ఆరాధనా, పవిత్రత—తలపై ముసుగు
2 నన్ను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకొంటూ, నేను చెప్పిన బోధల్ని పాటిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. 3 క్రీస్తుకు ప్రతీ మనిషిపై అధికారం ఉంది. ప్రతీ పురుషునికి తన భార్యపై అధికారం ఉంది. దేవునికి క్రీస్తుపై అధికారం ఉంది. ఇది మీరు అర్థం చేసుకోవాలని నా కోరిక.
4 కనుక తన తల కప్పుకొని బహిరంగంగా దేవుణ్ణి ప్రార్థించేవాడు లేక దైవసందేశాన్ని ప్రకటించేవాడు తన తలను అవమానపరచినవానితో సమానము. 5 తల మీద ముసుగు వేసుకోకుండా బహిరంగంగా దేవుణ్ణి ప్రార్థించే స్త్రీ, లేక దైవసందేశాన్ని బోధించే స్త్రీ తన తలను అవమానపరచినట్లు అవుతుంది. ఆమె తలగొరిగించుకొన్నదానితో సమానము. 6 స్త్రీ తన తల మీద ముసుగు వేసుకోకపోతే ఆమె తన తలవెంట్రుకలు కత్తిరించుకోవటం మంచిది. తలవెంట్రుకలు కత్తిరించుకోవటంకాని, లేక తల గొరిగించుకోవటం కాని అవమానంగా అనిపిస్తే ఆమె తన తలపై ముసుగు వేసుకోవాలి.
7 పురుషుడు దేవుని ప్రతిరూపం. దేవునికి కీర్తి కలిగించేవాడు పురుషుడు. కనుక అతడు తన తల కప్పుకొనకూడదు. కాని స్త్రీ వల్ల పురుషునికి కీర్తి కలుగుతుంది. 8 ఎందుకంటే పురుషుడు స్త్రీ నుండి సృష్టింపబడలేదు. స్త్రీ పురుషుని నుండి సృష్టింపబడింది. 9 అంతేకాక పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. స్త్రీ పురుషుని కొరకు సృష్టింపబడింది. 10 ఈ కారణంగా మరియు దేవదూతల కారణంగా స్త్రీ తనపై ఒకరికి అధికారముందని చూపటానికి తన తలపై ముసుగు వేసుకోవాలి.
11 కాని ప్రభువు దృష్టిలో పురుషుడు లేకుండా స్త్రీ, స్త్రీ లేకుండా పురుషుడు జీవించలేరు. 12 ఎందుకంటే, స్త్రీ పురుషుని నుండి సృష్టింపబడినట్లే, పురుషుడు కూడా స్త్రీ నుండి సృష్టింపబడ్డాడు. కాని అన్నిటినీ దేవుడే సృష్టించాడు.
13 తలపై ముసుగు వేసుకోకుండా స్త్రీ దేవుణ్ణి ప్రార్థించటం సరియేనా? మీరే నిర్ణయించండి. 14 పురుషునికి పొడుగాటి వెంట్రుకలు ఉండటం వలన అతనికి అవమానమని ప్రకృతే మీకు తెలియచెయ్యటం లేదా? 15 స్త్రీకి తన తలవెంట్రుకలు ముసుగుగా ఉండటానికి పొడుగాటి వెంట్రుకలు ఇవ్వబడ్డాయి. దాని వల్ల ఆమెకు గౌరవం లభిస్తుంది. 16 దీన్ని గురించి ఎవరైనా వాదించాలనుకొంటే మా సమాధానం యిదే తప్ప వేరొకటి లేదు. దేవుని సంఘం కూడా దీన్నే అనుసరిస్తుంది.
ప్రభువు భోజనం
17 మీ సంఘ సమావేశాలు మంచికన్నా చెడును ఎక్కువగా చేస్తున్నాయి. కనుక ఈ క్రింది ఆజ్ఞలు మిమ్మల్ని పొగుడుతూ వ్రాయటం లేదు. 18 మీరు సమావేశమైనప్పుడు మీలో విభాగాలు కలుగుతున్నట్లు నేను విన్నాను. ఇందులో నిజముండవచ్చు. 19 సక్రమ మార్గాల్లో నడుచుకొనేవాళ్ళు రుజువు కావాలంటే మీలో విభేదాలు ఉండటం అవసరం.
20 మీరు సమావేశమైనప్పుడు నిజమైన “ప్రభు రాత్రి భోజనం” చెయ్యటం లేదు. 21 ఎందుకంటే మీరు తినేటప్పుడు ఎవరికోసం కాచుకోకుండా తింటారు. బాగా త్రాగుతారు. కాని కొందరు ఆకలితో ఉండిపోతారు. 22 తినటానికి, త్రాగటానికి మీకు ఇళ్ళు లేవా? మీరు పేదవాళ్ళను అవమానిస్తున్నారు. అంటే, మీరు దేవుని సంఘాన్ని లెక్క చెయ్యనట్లే కదా! మీరు ఇలా చేస్తున్నందుకు మిమ్మల్ని పొగడాలా? ఈ విషయంలో మిమ్మల్ని పొగడను.
23 నేను ప్రభువు నుండి పొందిన సందేశాన్ని మీకు చెప్పాను. యేసు ప్రభువు అప్పగింపబడిన రాత్రి రొట్టె చేత పట్టుకొని 24 దేవునికి కృతజ్ఞతలు చెప్పి దాన్ని విరిచి, “ఇది మీ కొరకైన నా శరీరం. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకే దీనిని చేయుడి” అని అన్నాడు. 25 అదే విధముగా వారు భోజనమయిన తర్వాత ద్రాక్షారసం ఉన్న పాత్రను తీసుకొని, “ఈ పాత్ర నా రక్తంవలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనండి” అని అన్నాడు. 26 కనుక మీరు ఈ రొట్టెను తిని, ద్రాక్షారసమును త్రాగినప్పుడెల్ల ఆయన మరణాన్ని ఆయన వచ్చేదాకా ప్రకటిస్తారు.
27 కనుక ప్రభువు పట్ల అయోగ్యముగా ఎవరు ఆయన రొట్టె తింటారో, ఎవరు ఆయన పాత్ర నుండి త్రాగుతారో అతడు ప్రభువు శరీరం పట్ల, ఆయన రక్తం పట్ల పాపం చేసినవాడగును. 28 ప్రతీ వ్యక్తి రొట్టెను తినే ముందు, ఆ పాత్రనుండి త్రాగే ముందు తన ఆత్మను స్వయంగా పరిశోధించుకోవాలి. 29 ప్రభువు శరీరమని గ్రహించక రొట్టెను తినువాడు, మరియు ద్రాక్షారసం త్రాగువాడు శిక్షావిధికి గురి అవుతాడు. 30 అందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగగ్రస్తులు అయినారు, కొందరు మరణించారు. 31 కనుక మొదటే మనల్ని మనం పరీక్షించుకొంటే మనం శిక్ష పొందం. దేవుడు మనల్ని శిక్షించడు. 32 కాని, మనకు సరియైన శిక్షణ యివ్వాలని ప్రభువు మనల్ని శిక్షిస్తాడు. ప్రపంచంతో పాటు మనకు శిక్ష లభించరాదని ఆయన ఉద్దేశ్యం.
33 అందువల్ల నా సోదరులారా! మీరు భోజనానికి సమావేశమైనప్పుడు ఒకరి కోసం ఒకరు కాచుకోండి. 34 మీరు సమావేశమైనప్పుడు ఒకవేళ మీలో ఎవరికైనా ఆకలి వేస్తే, అలాంటివాడు యింట్లోనే తిని రావాలి. అలా చేస్తే మీరు సమావేశమైనప్పుడు తీర్పుకు గురికారు. నేను వచ్చినప్పుడు మీకు మిగతా ఆజ్ఞలు యిస్తాను.
© 1997 Bible League International