Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 కొరింథీయులకు 10-13

పౌలు తనను సమర్థించుకోవటం

10 క్రీస్తులో ఉన్న సాత్వికం పేరిట, దయ పేరిట మిమ్మల్ని వేడుకొంటున్నాను. కొందరు నేను మీ సమక్షంలో ఉన్నప్పుడు నాలో ధైర్యం ఉండదని, మీకు దూరంగా ఉన్నప్పుడు నాలో ధైర్యముంటుందని అంటున్నారు. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు ధైర్యంగా మాట్లాడవలసిన అవసరం లేదు. మేము లౌకికంగా జీవిస్తున్నామని అనుకొనేవాళ్ళతో కూడా ధైర్యంగా మాట్లాడనవసరం లేదు. మేము ఈ ప్రపంచంలో జీవిస్తున్నా, ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళు యుద్ధం చేసినట్లు మేము చెయ్యము. మేము ఉపయోగించే ఆయుధాలు ఈ ప్రపంచంలోనివాళ్ళు ఉపయోగించేవి కావు. కాని శత్రువుల కోటలను పడగొట్టగల దైవికమైన శక్తి మా ఆయుధాల్లో ఉంది. మేము దేవుని జ్ఞానాన్ని ఎదిరించే తర్కాలను, డాంబిక వాదాలను ఓడించి పడగొడతాము. ప్రతి భావాన్ని బంధించి అందరినీ క్రీస్తుకు విధేయులు అయ్యేటట్లు చేస్తాము. మిమ్మల్నందర్నీ విధేయులుగా చేసాక అవిధేయతతో ఉన్న ప్రతి సంఘటనను శిక్షించటానికి సిద్ధంగా ఉంటాము.

మీరు పైకి కనిపించే వాటిని మాత్రమే చూస్తున్నారు. తాను క్రీస్తుకు చెందినవాణ్ణని విశ్వసించినవాడు, తాను ఏ విధంగా క్రీస్తుకు చెందాడో మేము అతనిలాగే క్రీస్తుకు చెందినవాళ్ళమని గమనించాలి. మిమ్మల్ని నాశనం చెయ్యటానికి కాకుండా అభివృద్ధి పరచటానికి ప్రభువు మాకు అధికారమిచ్చాడు. దాన్ని గురించి నేను గొప్పలు చెప్పుకోవటానికి సిగ్గుపడను. నా లేఖల ద్వారా మిమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నించటం లేదు. మీరు అలా అనుకోకండి. 10 ఎందుకంటే కొందరు, “అతని లేఖలు బలంగా, ముఖ్యమైనవిగా కనిపిస్తాయి. కాని మనిషిని ఎదురుగా ఉన్నప్పుడు చూస్తే బలహీనంగా ఉంటాడు. మాటలు నిస్సారంగా ఉంటాయి” అని అంటారు. 11 వాళ్ళు మేము దూరంగా వుండి లేఖల్లో వ్రాసిన విధంగా సమక్షంలో ఉన్నప్పుడు కూడా నడుచుకొంటామని గమనించాలి.

12 ఆ ప్రగల్భాలు పలికే గుంపుతో పోల్చుకొనే ధైర్యం కూడా మాకు లేదు. మేము వాళ్ళతో పోల్చుకోము. తెలివిలేనివాళ్ళు తమ గొప్పతనాన్ని తామే కొల్చుకుంటూ, తమతో తమను పోల్చుకొంటారు.

13 మేము యితర విషయాల్లో గొప్పలు చెప్పుకోము. కాని, దేవుడు మాకప్పగించిన విషయంలో గొప్పలు చెప్పుకోవటం మానము. ఆ విషయాలు మీకు కూడా చెప్పాము. 14 మేము మా హద్దులు మీరి పోవటం లేదు. మీరు ఆ హద్దుల్లో ఉన్నారు కనుక మేము క్రీస్తు సువార్త తీసుకొని మీ దగ్గరకు వచ్చాము. మేము మా హద్దులు మీరలేదు. 15 లేక మేము యితరులు చేసిన కార్యాల్ని గొప్పగా చెప్పి మా హద్దులు దాటిపోలేదు. మీ విశ్వాసం అభివృద్ధి చెందుతుందని మాకు నమ్మకం ఉంది. మేము చేస్తున్న సేవాకార్యం మీ ద్వారా నలువైపులా వ్యాపించాలి. 16 దైవసందేశాన్ని మీ ప్రాంతంలోనే కాక, మీకు ముందున్న ప్రాంతాల్లో కూడా ప్రకటించాలని మా ఉద్దేశం. ఇతరులు తమ ప్రాంతాల్లో యిదివరకే చేసిన కార్యాల్ని గురించి మేము గొప్పలు చెప్పుకోవాలని మాకు లేదు. 17 కాని, “గర్వించాలనుకొన్నవాడు ప్రభువు విషయంలో గర్వించాలి”(A) అని వ్రాయబడింది. 18 ప్రభువు ఎవరిని యోగ్యుడని సమ్మతిస్తాడో వాడే యోగ్యుడౌతాడు. కాని తనకు తాను యోగ్యుడని చెప్పుకొనేవాడు యోగ్యుడు కాడు.

పౌలు మరియు అబద్ధపు అపొస్తలులు

11 నా తెలివితక్కువతనాన్ని మీరు కొద్దిగా సహిస్తారని ఆశిస్తున్నాను. మీరు సహిస్తున్నారని నాకు తెలుసు. మీ విషయంలో నాకు అసూయగా ఉంది. ఆ అసూయ దేవుని కోసం. మిమ్మల్ని ఒకే భర్తకు అంటే క్రీస్తుకు అప్పగిస్తానని వాగ్దానం చేసాను. మిమ్మల్ని పవిత్ర కన్యగా ఆయనకు బహూకరించాలని అనుకున్నాను. సర్పం కుయుక్తిగా చెప్పిన అబద్ధాలవల్ల “హవ్వ” మోసపోయినట్లే మీరునూ మోసపోతారని, మీ మనస్సులు మలినం అవుతాయని నా భయం. మీకు క్రీస్తుపట్ల ఉన్న భక్తి పవిత్రమైంది. సంపూర్ణమైనది. అది విడిచివేస్తారని నా భయం. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మేము యేసును గురించి బోధించినట్లుగాక, వేరే విధంగా బోధిస్తే మీరు దాన్ని ఆనందంగా అంగీకరిస్తారు. మా నుండి పొందిన దైవసందేశానికి, ఆత్మకు వ్యతిరేకంగా దైవసందేశాన్ని, ఆత్మను ఎవరైనా యిస్తే మీరు వాటిని అంగీకరిస్తారు.[a]

ఆ “గొప్ప అపొస్తలుల కన్నా” నేను కొంచెం కూడా తక్కువ కానని అంటున్నాను. మాట్లాడటంలో నాకు అనుభవం లేకపోయినా జ్ఞానం ఉంది. దీన్ని గురించి మేము అన్ని విధాలా మీకు స్పష్టంగా తెలియజేసాము.

దైవసందేశాన్ని మీకు ఉచితంగా ప్రకటించాను. మీకు ప్రాముఖ్యత యిచ్చి నేను తగ్గించుకొన్నాను. అలా చెయ్యటం పాపమా? ఇతర సంఘాలు నన్ను పోషించాయి. అందువలన మీకు సేవ చేయటానికి వాటిని దోచినట్లయింది. నేను మీతో ఉన్నప్పుడు ఎవ్వరికీ భారంగా ఉండలేదు. మాసిదోనియ నుండి వచ్చిన సోదరులు నాకు కావలసినవన్నీ తెచ్చారు. నేను మీపై ఏ విధమైన భారం మోపలేదు. ఇకముందు కూడా మోపను. 10 దీన్ని గురించి నేను గర్వపడకుండా అకయ ప్రాంతంలో ఉన్నవాడెవ్వడూ నన్ను ఆపలేడు. ఇది నేను క్రీస్తు సత్యంగా చెపుతున్నాను. 11 ఎందుకు, మీ పట్ల నాకు ప్రేమ లేదనా? నేను ప్రేమిస్తున్నానని దేవునికి తెలుసు.

12 వాళ్ళు తమను గురించి గర్వంగా చెప్పుకోవాలని చూస్తారు. తాము మాతో సమానంగా ఉన్నట్లు మీరు గమనించాలని వాళ్ళ ఉద్దేశ్యం. ఆ అవకాశం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు గర్వించటానికి కారణం లేకుండా చెయ్యటానికి నేను చేస్తున్నది చేస్తూపోతాను. 13 అలాంటివాళ్ళు దొంగ అపొస్తలులు. మోసాలు చేస్తారు. క్రీస్తు అపొస్తలుల వలే నటిస్తారు. 14 దీనిలో ఆశ్చర్యమేలేదు! సాతాను కూడా తాను వెలుగుదూత అయినట్లు నటిస్తాడు. 15 మరి సాతాను సేవకులు నీతిమంతులవలె నటించటంలో ఆశ్చర్యమేలేదు! చివరన వాళ్ళు చేసిన పనుల్ని బట్టి ఫలితం పొందుతారు.

పౌలు తన కష్టాలలో అతిశయించుట

16 నన్నొక తెలివతక్కువవానిగా పరిగణించవద్దని మళ్ళీ చెపుతున్నాను. మీరు నేను తెలివతక్కువవాణ్ణని అనుకొంటే, తెలివిలేనివాణ్ణి అంగీకరించినట్లు నన్ను అంగీకరించండి. అప్పుడు దానికి నేను కొద్దిగా గర్వపడవచ్చు. 17 నాలో ఉన్న ఆత్మవిశ్వాసం వల్ల గర్వంగా మాట్లాడుతున్నాను. ప్రభువు మాట్లాడమన్నట్లు కాకుండా తెలివిలేనివాడు మాట్లాడినట్లు మాట్లాడుతున్నాను. 18 అందరూ లౌకికులవలె తమను గురించి గర్వంగా మాట్లాడుకుంటున్నారు. కనుక నేను కూడా గర్వంగా మాట్లాడుతున్నాను. 19 మీరు బుద్ధిమంతులైయుండి తెలివిలేనివాళ్ళ పట్ల మీరు ఆనందంగా సహనం చూపిస్తున్నారు. 20 మిమ్మల్ని బానిసలుగా చేసుకొన్నవాళ్ళపట్ల, దోచుకొనేవాళ్ళపట్ల, మీ వల్ల లాభం పొందేవాళ్ళపట్ల, మిమ్మల్ని అణచి పెట్టేవాళ్ళపట్ల, మీ చెంపమీద కొట్టినవాళ్ళపట్ల, మీరు సహనం చూపుతారు. 21 వాళ్ళలా ప్రవర్తించే ధైర్యం మాకు లేదు. ఇది చెప్పుకోవటానికి నాకు సిగ్గు వేస్తోంది.

ఎవరికైనా గర్వంగా మాట్లాడే ధైర్యం ఉంటే, నేనూ ఒక అవివేకిగా మాట్లాడుతున్నాను, నాకు కూడా గర్వంగా మాట్లాడే ధైర్యం ఉంది. 22 వాళ్ళు హెబ్రీయులా? నేను కూడా హెబ్రీయుణ్ణి, వాళ్ళు ఇశ్రాయేలీయులా? నేను కూడా ఇశ్రాయేలీయుడను. వాళ్ళు అబ్రాహాము వంశీయులా? నేను కూడా అబ్రాహాము వంశీయుణ్ణి. 23 వాళ్ళు క్రీస్తు సేవకులా? ఈ విధంగా మాట్లాడాలంటే నాకు మతిపోతుంది. నేను వాళ్ళకన్నా ఎక్కువ సేవ చేస్తున్నాను. నేను వాళ్ళకన్నా ఎక్కువ కష్టించి పని చేసాను. వాళ్ళకన్నా ఎక్కువ సార్లు కారాగారానికి వెళ్ళాను. వాళ్ళకన్నా తీవ్రమైన కొరడాదెబ్బలు తిన్నాను. ఎన్నోసార్లు చావుకు గురి అయ్యాను.

24 యూదులు నన్ను ఐదు సార్లు ముప్పైతొమ్మిది కొరడాదెబ్బలు కొట్టారు. 25 మూడు సార్లు ఇనుప కడ్డీలతో కొట్టారు; ఒకసారి రాళ్ళతో కొట్టారు. మూడు సార్లు పడవ పగిలి ఒక రాత్రి, ఒక పగలు సముద్రం మీద గడిపాను. 26 విరామం లేకుండా ప్రయాణం చేసాను. ఆ ప్రయాణాల్లో నదులవల్ల ప్రమాదం కలిగింది. బందిపోటు దొంగలవల్ల ప్రమాదం కలిగింది. నా జాతీయులవల్ల ప్రమాదం కలిగింది. యూదులుకానివాళ్ళవల్ల ప్రమాదం కలిగింది. పట్టణాల్లో ప్రమాదం కలిగింది. నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రమాదం కలిగింది. సముద్రం మీద ప్రమాదం కలిగింది. దొంగ సోదరులవల్ల ప్రమాదం కలిగింది.

27 నేను కష్టాలు ఎదుర్కొని, కష్టించి పని చేసాను. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. ఆకలి దప్పులు అంటే ఏమిటో తెలుసుకొన్నాను. ఎన్నోసార్లు ఆహారం లేక గడిపాను. చలిలో వస్త్రాలు లేకుండా గడిపాను. 28 ఇవే కాక, సంఘాల కొరకు నేను ప్రతిరోజూ దిగులు పడుతుంటాను. 29 మీలో ఒకడు బలహీనుడైనప్పుడు, నేనూ బలహీనుడు కాకుండా ఉండగలనా? ఒకడు పాపంలో పడితే, నేను నా అంతరంగంలో మండిపోకుండా ఉండగలనా? పాపం చెయ్యటానికి మీలో ఎవరైనా కారకుడు అయితే అతని పట్ల నాకు కోపం కలగదా?

30 నేను గర్వంగా చెప్పుకోవాలి అంటే బలహీనతను చూపే వాటిని గురించి గర్వంగా చెప్పుకొంటాను. 31 యేసు ప్రభువుకు తండ్రి అయిన దేవునికి, సర్వదా స్తుతింపతగిన దేవునికి, నేను అసత్యం ఆడటం లేదని తెలుసు. 32 నేను డెమాస్కసులో ఉన్నప్పుడు అరెత అను రాజు పరిపాలనలో ఉన్న రాజ్యాధికారి, నన్ను బంధించాలని ఊరి చుట్టూ కాపలా ఉంచాడు. 33 కాని కొందరు నన్ను గంపలో ఉంచి గోడ మీదనుండి క్రిందికి దింపారు. నేను చిక్కకుండా తప్పించుకొని పారిపోయాను.

పౌలుకు దర్శనం, ముల్లు

12 లాభం లేకపోయినా నేను గర్వంగా చెప్పుకొంటూ పోవాలి. ప్రభువు వలన కలిగిన దర్శనాలు, ప్రత్యక్షతలు గురించి చెప్పనివ్వండి. క్రీస్తును విశ్వసించే ఒక వ్యక్తి నాకు తెలుసు. పద్నాలుగు సంవత్సరాల క్రితం దేవుడు అతణ్ణి మూడవ ఆకాశమునకు తీసుకు వెళ్ళాడు. అతణ్ణి శరీరంతో తీసుకొని వెళ్ళాడో లేక అతని ఆత్మను తీసుకొని వెళ్ళాడో, నాకు తెలియదు. అది దేవునికే తెలుసు. నాకు తెలిసిన ఈ వ్యక్తి శరీరంతో వెళ్ళాడో లేక అతని ఆత్మ మాత్రమే వెళ్ళిందో నాకు తెలియదు. దేవునికే తెలుసు. దేవుడు యితణ్ణి పరదైసునకు తీసుకు వెళ్ళాడు. అక్కడ అతడు పవిత్రమయిన విషయాలు విన్నాడు. ఇవి చెప్పటానికి అనుమతి లేదు. నేను అతణ్ణి గురించి గర్వంగా చెపుతున్నాను. కాని నా గురించి నేను గర్వంగా చెప్పుకోను. నా బలహీనతను గురించి మాత్రమే గర్వంగా చెప్పుకొంటాను.

ఒకవేళ నేను గర్వంగా మాట్లాడినా, నేను ఎప్పుడూ నిజం చెబుతాను కనుక తెలివిలేనివాణ్ణని అనిపించుకోను. నేను చెప్పినవాటి కన్నా, చేసినవాటి కన్నా నన్ను గురించి మీరు గొప్పగా అనుకోరాదని నా అభిలాష. కనుక నేను నన్ను గురించి గర్వంగా చెప్పుకోకుండా నిగ్రహించుకొంటాను.

దేవుడు కనుపరచిన ఈ గొప్పవిషయాల వల్ల నాకు గర్వం కలుగరాదని నా శరీరంలో ఒక ముల్లు ఉంచబడింది. అది సాతాను దూత. అది నన్ను బాధపెడుతూ ఉంటుంది. ఆ ముల్లు తీసివేయమని ప్రభువుతో మూడు సార్లు మొరపెట్టుకొన్నాను. కాని ప్రభువు నాతో, “నీకు నా అనుగ్రహం చాలు. నా శక్తి నీ బలహీనత ద్వారా పరిపూర్ణత పొందుతుంది” అని అన్నాడు. అందువల్ల క్రీస్తు శక్తి నాలో ఉండాలని నా బలహీనతను గురించి ఇంకా ఎక్కువ ఆనందంతో, గర్వంగా చెప్పుకొంటాను. 10 అందువల్లే క్రీస్తు కోసం నేను బలహీనతల్లో, అవమానాల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో, కష్టాల్లో ఆనందం పొందుతూ ఉంటాను. నేను బలహీనంగా ఉన్నప్పుడు బలంగా ఉంటాను.

కొరింథు ప్రజల విషయంలో చింత

11 నేను తెలివిలేని వానిలా ప్రవర్తిస్తున్నాను. కాని దీనికి మీరే కారకులు. నేను ఏమీకాకపోయినా ఆ “గొప్ప అపొస్తలుల” కన్నా తీసిపోను. కనుక మీరు నన్ను మెచ్చుకోవలసింది. 12 అపొస్తలుడని అనిపించుకొనుటకు తగిన రుజువులు, అద్భుతాలు, మహత్కార్యాలు మీ మధ్య నేను పట్టుదలతో చేసాను. అని నేను మీ కోసం పట్టుదలతో చేసాను. 13 నేను మీకు ఎన్నడూ భారంగా ఉండలేదు అన్న విషయంలో తప్ప ఇతర సంఘాలకన్నా మీరు ఏ విషయంలో తీసిపోయారు? దీనికి నన్ను క్షమించండి.

14 ఇక యిప్పుడు మూడవసారి మీ దగ్గరకు రావటానికి సిద్ధంగా ఉన్నాను. ఈసారి కూడా నేను మీకు భారంగా ఉండను. నాకు కావలసింది మీ దగ్గరున్న వస్తువులు కాదు. మీరు నాకు కావాలి. పిల్లలు తల్లిదండ్రుల కోసం ఆస్తిని కూడపెట్టరు. కాని తల్లిదండ్రులే తమ పిల్లల కోసం ఆస్తి కూడబెడ్తారు. 15 అందువల్ల నా దగ్గరున్నదంతా ఆనందంతో మీకోసం వ్యయంచేస్తాను. “నన్ను” మీకోసం ఉపయోగించుకోండి. నేను మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తే నన్ను మీరు తక్కువగా ప్రేమిస్తారా?

16 అది అలా ఉండనివ్వండి, నేను మీకు భారంగా ఉండలేదని తెలుసు కాని, “నేను పన్నాగాలు పన్ని మిమ్మల్ని వలలో వేసుకొన్నానని” కొందరు అనవచ్చు. 17 నేను పంపిన మనుష్యుల్లో ఎవర్నైనా మిమ్మల్ని మోసగించటానికి ఉపయోగించుకొన్నానా? లేదని నాకు తెలుసు. నేను వాళ్ళ ద్వారా మిమ్మల్ని ఉపయోగించుకొన్నానా? 18 నేను తీతును మీ దగ్గరకు వెళ్ళమని వేడుకొన్నాను. మా సోదరుణ్ణి అతని వెంట పంపాను. తీతు మిమ్మల్ని వంచించలేదు కదా? వంచించాడా? లేదు. మేమంతా ఒకే ఆత్మతో, ఒకే మార్గాన్ని అనుసరించామని మీకు తెలుసు.

19 మమ్మల్ని మేము మీ ముందు సమర్థించుకోవాలని మా పక్షాన మేము వాదిస్తున్నామని అనుకొంటున్నారా? లేదు. మేము దేవుని ముందు క్రీస్తులో మాట్లాడుతున్నాము. సోదరులారా! మీ విశ్వాసాన్ని ధృఢపరచాలని మేము యివి చేస్తున్నాము. 20 ఎందుకంటే, మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను అనుకొన్నట్లు మీరు, మీరనుకొన్నట్లు నేను ఉండమేమోనని నాకు భయం వేస్తోంది. కలహాలు, అసూయలు, కోపాలు, కక్షలు, వదంతులు, గుస గుసలు, అహంభావాలు, అల్లర్లు ఉంటాయేమోనని భయపడుతున్నాము. 21 నేను మీ దగ్గరకు మళ్ళీ వచ్చినప్పుడు నా దేవుని ముందు నాకు తలవంపులు కలుగుతాయేమోనని భయం వేస్తోంది. గతంలో కామక్రీడలు, వ్యభిచారం లాంటి అపవిత్రమైన పనులు చేసి ఆ పాపాలకు పశ్చాత్తాపం పొందనివాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటివాళ్ళవల్ల నాకు దుఃఖం కలుగుతుందనే భయం వేస్తోంది.

చివరి హెచ్చరికలు

13 మూడవసారి మీ దగ్గరకు వస్తున్నాను. “ప్రతి విషయం యిద్దరు లేక ముగ్గురు సాక్ష్యాలతో రుజువు పరచాలి.”(B) నేను రెండవ సారి వచ్చి మీతో ఉన్నప్పుడు ఈ విషయంలో మిమ్మల్ని యిదివరకే హెచ్చరించాను. నేను యిప్పుడు మీ సమక్షంలో లేను కనుక మళ్ళీ చెపుతున్నాను. కనుక నేను ఈ సారి వచ్చినప్పుడు ఇదివరలో పాపంచేసినవాళ్ళను ఇప్పుడు పాపంచేసినవాళ్ళను శిక్షిస్తాను. క్రీస్తు నా ద్వారా మాట్లాడుతున్నాడన్న దానికి మీరు రుజువు అడుగుతున్నారు. మీ పట్ల క్రీస్తు బలహీనంగా ఉండడు. ఆయన మీ మధ్య శక్తివంతంగా ఉన్నాడు. బలహీనతల్లో ఆయన సిలువ వేయబడ్డాడు. అయినా, దైవశక్తివల్ల జీవిస్తున్నాడు. అదే విధంగా మేము ఆయనలో బలహీనంగా ఉన్నా, దైవశక్తి వల్ల ఆయనతో సహా జీవించి మీ సేవ చేస్తున్నాము.

మీరు నిజమైన “విశ్వాసులా, కాదా” అని తెలుసుకోవాలనుకొంటే మిమ్మల్ని మీరు పరిశోధించుకోవాలి. మీలో యేసు క్రీస్తు ఉన్నట్లు అనిపించటం లేదా? మీరు ఈ పరీక్షల్లో ఓడిపోతే క్రీస్తు మీలో ఉండడు. మేము ఈ పరీక్షల్లో విజయం సాధించిన విషయం మీరు గ్రహిస్తారని నమ్ముతున్నాను. మీరు ఏ తప్పూ చేయకుండా ఉండాలని మేమే దేవుణ్ణి ప్రార్థిస్తాము. మేము పరీక్షల్లో నెగ్గినట్లు ప్రజలు గమనించాలని కాదు కాని, మేము పరీక్షల్లో నెగ్గినట్లు కనపడకపోయినా మీరు మంచి చెయ్యాలని దేవుణ్ణి ప్రార్థిస్తాము. మేము సత్యానికి విరుద్ధంగా ఏదీ చెయ్యలేము. అన్నీ సత్యంకొరకే చేస్తాము. మీరు బలంగా ఉంటే, మేము బలహీనంగా ఉండటానికి సంతోషిస్తాం. మీలో పరిపూర్ణమైన శక్తి కలగాలని మేము ప్రార్థిస్తున్నాము. 10 అందువల్లే నేను మీ సమక్షంలో లేనప్పుడు యివి వ్రాస్తున్నాను. అలా చేస్తే నేను వచ్చినప్పుడు నా అధికారం ఉపయోగించటంలో కాఠిన్యత చూపనవసరం ఉండదు. ఈ అధికారం ప్రభువు మీ విశ్వాసాన్ని వృద్ధిపరచటానికి యిచ్చాడు, కాని నాశనం చేయటానికి కాదు.

11 తుదకు, సోదరులారా! పరిపూర్ణులుగా ఉండటానికి ప్రయత్నించండి. నేను చెప్పేవాటిని చెయ్యండి. ఒకరితో ఒకరు సహకరిస్తూ జీవించండి. ప్రేమను, శాంతినిచ్చే దేవుడు మీతో ఉంటాడు.

12 పవిత్రమైన ముద్దుతో పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇక్కడున్న విశ్వాసులందరు తమ శుభాకాంక్షలు తెలుపమన్నారు.

13 యేసు క్రీస్తు ప్రభువు యొక్క అనుగ్రహం, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మీ అందరితో ఉండుగాక!

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International